Tuesday, 18 October 2016

|| ప్రగతిశీల ప్రజా రచయిత దేవపుత్ర ||



పంచమం’ నవలా రచయిత చిలుకూరి దేవపుత్ర 2016 అక్టోబర్‌ 18న ఉదయం 9 గంటలకు హఠాత్తుగా కన్నుమూసి సాహితీలోకాన్ని దిగ్భ్రమకు గురిచేశారు. 1951 ఏప్రిల్‌ 15న అనంతపురం జిల్లా, బెళుగుప్ప మండలం కాలువపల్లిలో సరోజమ్మ, ఆశీర్వాదం దంపతులకు జన్మించిన దేవపుత్ర తన అరవై ఐదున్నర ఏట ఎవరూ ఊహించని రీతిలో గుండెపోటుతో చనిపోయారు. దళిత కుటుంబంలో పుట్టిన దేవపుత్ర చదువుకున్నది ఎస్‌ఎ్‌సఎల్‌సీ దాకనే అయినా, జీవిత పాఠశాలలో అపారమైన జ్ఞానం సంపాదించారు.
రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేసిన దేవపుత్ర ప్రభుత్వరంగ సంస్థల స్వరూప స్వభావాలను బాగా అర్థం చేసుకున్నారు. లంచం జోలికి వెళ్ళకుండా ధర్మబద్ధంగా ఉద్యోగం చేశారు. తమ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తూ తెలుగు భాషోద్యమాలు నడిపే మహానుభావులకు భిన్నంగా తమ ఇద్దరు పిల్లల్ని తెలుగు మాధ్యమంలో చదివించిన తెలుగు భాషాభిమాని దేవపుత్ర. మాటకి చేతకి వైరుధ్యం లేని జీవితాన్ని గడిపిన దేవపుత్ర మంచి మనసున్న మనిషి, స్నేహశీలి, సౌమ్యుడు. ఆంధ్రప్రదేశ అభ్యుదయ రచయితల సంఘంలోనూ, అనంతపురం జిల్లా రచయితల సంఘంలోనూ కీలకపాత్ర పోషించిన దేవపుత్ర నవలా రచయిత, కథా రచయిత.
భారతదేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా అయిన అనంతపురం జిల్లాలో దళిత కుటుంబంలో పుట్టిన దేవపుత్ర రచయితగా ఎదగడం పెద్ద విశేషమే. రాయలసీమ నుంచి కల్పనా సాహిత్య రచయితలలో దేవపుత్ర మూడవ తరం రచయిత. ఆయన 1977 నుంచి నేటి దాకా 100కి పైగా కథానికలు, నాలుగు నవలలు రచించారు. అన్నీ సమకాలీన సామాజిక వాస్తవికతను మార్క్సీయ, దళిత బహుజన దృక్పథం నుంచి రాసినవే. 1977 అక్టోబరులో ‘మానవత్వం’ కథతో మొదలైన దేవపుత్ర సాహిత్య జీవితం నింపాదిగా, నిలకడగా నాలుగు దశాబ్దాలు కొనసాగింది.
‘అద్దంలో చందమామ’ నవల బూర్జువా పాలకుల భూసంస్కరణలు దళితుల జీవితాలతో చెలగాటమాడిన తీరును ఆవిష్కరించింది. అధికారం పోయినా ఆధిపత్యం పోని రెడ్డి, కరణాల దళారీ వ్యవస్థను ఆవిష్కరించింది. ‘పంచమం’ తెలుగు దళిత నవలా సాహిత్యానికి రాయలసీమ అందించిన గొప్ప కానుక. ‘ప్రజల మనిషి’ నవలలోని కంఠీరవం వంటి పాత్ర పంచమంలోని శివయ్య. సమాజం అవకాశం కల్పిస్తే దళితులు కూడా తమ ప్రతిభను చాటుకోగలరని, దళితులు ప్రేమ హృదయులని ఆ నవలలో చాటి చెప్పారు దేవపుత్ర. ‘కక్షశిల’ రాయలసీమలోని ముఠాకక్షలు ఆధిపత్య స్థాయి దాటి అధికార స్థాయికి చేరుకొని బలహీనవర్గాల ప్రజలను బలిగొంటున్న వాస్తవాన్ని విశ్వసనీయంగా ఆవిష్కరించిన నవల. ‘చీకటి పూలు’ బాల నేరస్థులను సంస్కరించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దవలసిన జువెనైల్‌ పాఠశాలలు అక్కడ ఉద్యోగుల అవినీతి వల్ల అసలు లక్ష్యం నీరుగారిపోతున్న వైనాన్ని చాటుతుంది.

ఇలాంటి వస్తువు మీద ఇదొక్కటే నవల వచ్చిందేమో! దేవపుత్ర ఆ శాఖలో పనిచేసిన అనుభవంతో రాసిన నవల ‘చీకటి పూలు’. స్వాతంత్య్రం వచ్చినా నశించని భూస్వామ్య పెత్తందారీతనం, స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని త్యాగం చేసిన ఉద్యమకారులు ఆశించిన దానికి భిన్నంగా శాసన, కార్యనిర్వహణ వ్యవస్థల అవినీతి - ఈ రెండు పార్శ్వాలను దేవపుత్ర అద్భుతంగా చిత్రించారు. దేవపుత్ర కథలలో దళితుల జీవన వేదన, కరువు, ఫ్యాక్షనిజం, సమాజంలో ఇంకా మిగిలి ఉన్న మంచి, లంచగొండితనం వంటి వర్తమాన భారతీయ సమాజంలోని అనేక వాస్తవికతలు వస్తువులయ్యాయి. మంచి చెడు రెండూ కలగలసి ఉండడమే సాహిత్యంలో వాస్తవిక పద్ధతి అన్న కట్టమంచి రామలింగారెడ్డి సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటాయి దేవపుత్ర కథలు. ఆయన కథలలో అమూర్త లక్షణాలు కనిపించవు. ఆయన కథలలో తెచ్చిపెట్టుకున్న కసి, కోపం కనిపించవు.
‘సమిధలు’, ‘ఆయుధం’, ‘ఊడలమర్రి’, ‘విలోమం’ వంటివి దేవపుత్ర రచించిన గొప్ప దళిత కథలు. అగ్రకుల సంపన్నుల రాజకీయ సరదాలలో దళితులు పావులుగా మారడాన్ని ‘సమిధలు’ ప్రతిబింబించగా, ఫ్యాక్షనిస్టుల మాయలోపడి అవసరానికి మించి ప్రభు భక్తిని ప్రకటించి ప్రాణాలు కోల్పోయే దళితుల అజ్ఞానాన్ని ‘ఆయుధం’ ఆవిష్కరించింది. దళితులకు పంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన అమలయిన తొలి రోజుల్లో కొత్తగా సర్పంచులయిన భూస్వాముల దగ్గర దళిత కూలీల పాట్లను ‘ఊడలమర్రి’ ఆవిష్కరించగా, దళిత విద్యావం తులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను చూసి, దళితులను ద్వేషిస్తూనే, అగ్రకులాల వాళ్ళు పెళ్ళి సంబంధాలకు ఎలా సిద్ధమౌతారో ప్రదర్శించింది ‘విలోమం’.
కార్యనిర్వహణ విభాగంలోని పోలీసు శాఖలోని లొసుగులను దేవపుత్ర ‘ఆర్డర్లీ’, ‘ఆరుగ్లాసులు’, ‘ఐడెంటిఫికేషన’, ‘మీసాలు’, ‘విడుదల’ మొదలైన కథలలో వైవిధ్యభరితంగా చిత్రించారు. సామాన్యులకు అండగా నిలవాల్సిన వాళ్ళు, వివక్ష చూపేవాళ్ళను శిక్షించవలసిన వాళ్ళే సామాన్యులకు శత్రువులుగా, వివక్షాకర్తలుగా మారిపోయిన తలకిందులు వ్యవస్థను దేవపుత్ర ఆలోచనాత్మకంగా ప్రదర్శించారు. వీరయ్య అనే చిన్న పోలీసు పెంచిన మీసాలను చూసి ఒక ఎస్‌పీ బహుమానమిస్తే, మరో ఎస్పీ వాటిని తీసేయమని దబాయిస్తాడు ‘మీసాలు’ కథలో. జైలు సూపరింటెండెంట్‌ క్రింది స్థాయి పోలీసులను తన బానిసలుగా ఉపయోగించుకునే దుర్మార్గాన్ని ‘ఆర్డర్లీ’ కథ ప్రదర్శించింది.
ఉద్యోగులలో అవినీతిపరులున్నట్లే, మంచివాళ్ళు కూడా ఉన్నారన్న నిజాన్ని దేవపుత్ర ‘జ్ఞాపికలు’, ‘దొంగాడొచ్చాడు’ లాంటి కథలు చెబుతాయి. ఈ కథలలో రామనాథం, ఒక తండ్రి మంచి ఉద్యోగులు. ‘జుల్మానా’లో రామారావు పొట్టకూటి కోసం పడుపుకత్తెలైన సీ్త్రలను కూడా దోచుకొనే దుర్మార్గానికి ప్రతినిధి. రిజర్వేషనలో ఉద్యోగం పొందిన దళిత అమ్మాయిని పెళ్ళాడడానికి అగ్రకుల అబ్బాయిని చిత్రించిన దేవపుత్ర (విలోమం) ‘తోక తెగిన ఎలుక’ కథలో నారాయణరావు అనే బ్రాహ్మణుడు దళిత అమ్మాయిని పెళ్ళాడి ఆమె అలవాట్లను ఏమాత్రం అభ్యంతర పెట్టని తీరును కూడా చిత్రించారు. సమాజాన్ని సాపేక్షంగా పరిశీలించడంలో విశ్లేషించడంలో చేయితిరిగిన రచయిత దేవపుత్ర. 
‘మన్నుదిన్న మనిషి’లో మట్టికి రైతుకు ఉండే పేగుబంధాన్ని ఆర్ద్రంగా చిత్రించిన దేవపుత్ర, ‘ముంపు’ కథలో లేని నష్టాన్ని చూపించి ప్రజాధనాన్ని కొల్లగొట్టే గ్రామీణుల్ని కూడా చిత్రించారు. మన సమాజ నాణెంలోని బొమ్మాబొరుసూ రెండూ తెలిసిన రచయిత దేవపుత్ర.
ఈ దేశంలో పుట్టిన ప్రతి అడ్డగాడిదకూ ఒక కులం ఉంటుంది అంటారు ఎన.టి. రామారావు ‘కోడలు దిద్దిన కాపురం’లో. దేవపుత్ర స్వచ్ఛమైన లౌకిక - సెక్యులర్‌ - వాది. లౌక్యవాది కాడు. ఆయన ఆదర్శం సెక్యులర్‌ సమాజం. ‘కుల మతాలు గీచుకున్న గీతలు జొచ్చి పంజరాన కట్టువడను నేను’ అన్న జాషువా మాటను జీవితంలో ఆచరించిన రచయిత దేవపుత్ర. ‘బందీ’ కథలో మతం మనిషికి ఎలా గుదిబండగా మారిపోయిందో క్రైస్తవ మతం ద్వారా ప్రదర్శించారు దేవ పుత్ర. అది ఆయన నిజాయితీ.
దేవపుత్ర తొలి కథ ‘మానవత్వం’ చదివితే పాఠకులు చలించిపోతారు. దిక్కులేని గర్భవతి ప్రసవిస్తుంటే ఏ సీ్త్ర కూడా దగ్గరకు రాకుంటే, ఒక ముసలాయన కొడవలి తీసుకుని ప్రసవం చేయడానికి వెళ్ళే ఈ కథ మానవత్వానికి గొప్ప నిర్వచనం. గోర్కీ రాసిన ‘మానవత్వం’ కథ చదవకుండానే ఈ కథ రాశారు దేవపుత్ర. 1947 ఆగస్టులో దేశవిభజన నాటి మానవ సంబంధాలను దేవపుత్ర ‘అవిభాజ్యం’ కథలో ఇటీవల రాయటం విశేషం.
దేవపుత్ర హాస్య కథలు రాయటంలో కొంత సాధన చేసి ‘వంకర టింకర ఓ’, ‘పరిశోధన’, ‘మంత్రి పదవి’ మొదలైన కథలు రాశారు. ఈయన కథలు ‘ఆరుగ్లాసులు’, ‘ఏకాకి నౌక చప్పుడు’, ‘వంకర టింకర ఓ’, ‘బందీ’, ‘చివరి మనుషులు’ సంపుటాలుగా వచ్చాయి. అన్నీ కలిసి రెండు సంపుటాలుగా ఇటీవలే ప్రచురించారు వత్సల గారు. ఆయన నవలలూ, కథలూ విశ్వవిద్యాలయాలలో పరిశోధనాంశాలూ, పాఠ్యాంశాలు అయ్యాయి. ఆయనకు పురస్కారాలు వచ్చాయి. ‘పంచమం’ దేవపుత్ర మాస్టర్‌ పీస్‌.
దేవపుత్ర రచన ప్రారంభించే నాటికి మార్క్సిజం ఆయనకు తాత్విక సిద్ధాంతమైంది. ఆ తర్వాత అంబేడ్కరిజం పరిచయమై ఆయన రెండింటిని సమన్వయం చేసుకున్నారు. 
మన సమాజాన్ని మానవీయమూ, మాననీయమూ చేయడమే దేవపుత్ర రచనా లక్ష్యం. తనను తానే కాపీకొట్టుకొనే దౌర్భాగ్యానికి పాల్పడని కొద్దిమంది రచయితలలో దేవపుత్ర ఒకరు.   - రాచపాళెం చంద్రశేఖర రెడ్డి (ఆంధ్ర జ్యోతి)

No comments:

Post a Comment