Tuesday, 26 July 2016

|| బిజెపి 'ప్రత్యేక' ద్రోహం ||

              ఆంధ్రప్రదేశ్‌కు బిజెపి మరోసారి ద్రోహం తలపెట్టింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్‌కు అయిదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని పార్లమెంటు సాక్షిగా ప్రకటిస్తే, తాము అధికారంలోకి వస్తే దీనిని పదేళ్లకు పొడిగిస్తామని చెప్పిన బిజెపి తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నిటినీ తుంగలో తొక్కి రాష్ట్ర ప్రజలతో క్రూర పరిహాసమాడుతోంది. రాజ్యసభలో ప్రత్యేక హోదా ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ఓటింగ్‌కు రాకుండా అడ్డుకోవడం ద్వారా బిజెపి ఆంధ్ర ప్రజలకు ఎంతటి ద్రోహం చేస్తోందో అర్ధమవుతోంది. మూడు రోజులుగా ఈ అంశంపై రాజ్యసభ అట్టుడుకుతున్నా ప్రధాని మోడీ దీనిపై తన వైఖరిని స్పష్టం చేయక పోవడం బాధ్యతారాహిత్యం. పార్లమెంటులో, ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు పూనుకోవడానికి బదులు, ప్రత్యేక హోదా మంజూరు కోరుతూ కాంగ్రెస్‌ సభ్యుడు తెచ్చిన ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ఓటింగ్‌కు రాకుండా అడ్డుకోవడం బిజెపి భ్రష్టాచార రాజకీయాలకు నిదర్శనం. ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు సభలో ప్రవేశపెట్టగానే అధికార పక్ష బిజెపి సభ్యులు లేచి నానా అల్లరి చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ అధికార పక్ష సభ్యుల తీరును తీవ్రంగా ఆక్షేపించినా వారి వైఖరిలో మార్పులేదు. ఓ ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును అడ్డుకోవడానికి అధికార పక్షం ఇంతగా బరితెగించడం ఆరున్నర దశాబ్దాల రాజ్యసభ చరిత్రలో ఇదే ప్రథమం. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలను వంచించడంలోనే కాదు, ఈ విధంగా కూడా బిజెపి రికార్డుకెక్కింది. ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు తేవడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్నదే ప్రతిపక్షాల ఉద్దేశమని వాదిస్తున్న బిజెపి, తానే ఆ పని చేయొచ్చుకదా. తాను బిల్లు తీసుకురాదు, ఇతరులను తేనివ్వదు. ఇదేమి పద్ధతి? బిజెపికి ఆంధ్రప్రదేశ్‌ను తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే యావలో వీసమెత్తు కూడా రాష్ట్రానికి మేలు చేసే విషయంలో లేదు. గతంలో బిజెపి చీల్చిన ఉత్తరాది రాష్ట్రాలకు చాలా వాటికి ప్రత్యేక హోదా ప్రతిపత్తి కల్పించింది. ఆంధ్ర ప్రదేశ్‌కు వచ్చేసరికి ప్రత్యేక హోదా కుదరదు, ప్రత్యేక ప్యాకేజి అన్నది. ఆ ప్రత్యేక ప్యాకేజీ కూడా మాటల మూటగానే మిగిలిపోయింది. ఇది కచ్చితంగా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలను మోసగించడమే. విభజన సమయంలోను, తదనంతర కేంద్ర సాయం విషయంలోను రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని నిలదీయాల్సిన తెలుగుదేశం ప్రభుత్వం అడుగడుగునా రాజీ పడడం శోచనీయం. చంద్రబాబు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైపోయాయా? రాజ్యసభలో ప్రత్యేక హోదా ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ఓటింగ్‌కు వస్తే తన వైఖరి స్పష్టం చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ పరిస్థితి రాకుండా చూసేందుకు చంద్రబాబు తన టక్కుటమార విద్యలన్నీ ప్రదర్శిస్తున్నారు. ప్రైవేటు బిల్లు తెచ్చిన కాంగ్రెస్‌ చిత్తశుద్ధిని తెలుగుదేశం ప్రశ్నించడాన్ని ఎవరూ తప్పుబట్టరు. కాంగ్రెస్‌ ఆనాడే పునర్వ్యవస్థీకరణ బిల్లులోనే ప్రత్యేక హోదాను చేర్చి వుంటే ఇప్పుడీ సమస్య వచ్చేది కాదు. కాంగ్రెస్‌ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారు. కాంగ్రెస్‌ చేసింది తప్పు అని చెప్పిన బిజెపి, తెలుగు దేశం పార్టీలు ఇప్పుడు తాము చేస్తున్నదేమిటి? కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో వున్న ఈ రెండు ప్రభుత్వాలు తలచుకుంటే ప్రత్యేక హోదా అసాధ్యమేమీ కాదు. కానీ, వాటికి ఆ ఉద్దేశం లేదు. అందుకే దీనిపై రోజుకో నాటకమాడుతున్నాయి. పత్యేక హోదాపై తనదే పేటెంట్‌ అన్నట్లుగా వ్యవహరించిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హోదాకు మోకాలడ్డుతున్న మోడీ ప్రభుత్వాన్ని నిలదీయలేక పోవడం వెనుక దాని అవకాశవాద రాజకీయాలు వెల్లడవుతున్నాయి. వామపక్షాలు మాత్రమే దీనిపై మొదటి నుంచి నికరమైన వైఖరితో వ్యవహరిస్తున్నాయి. కారు చీకట్లో కాంతి రేఖలా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడేందుకు నడుం బిగించాలని సంకల్పించడం ఒక మంచి పరిణామం. (ప్రజాశక్తి)

Monday, 18 July 2016

|| రాష్ట్రాల హక్కులను హరించే జిఎస్‌టి ||

                వస్తువుల, సేవల పన్ను (జిఎస్‌టి) చట్టాన్ని ఆమోదింప జేసుకునేందుకు ఎన్డీయే ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ఆడుతోంది. జిఎస్‌టి అమలైతే దేశ వార్షిక స్థూల జాతీయోత్పత్తి 2 శాతం పెరుగుతుందని వాదించటం అన్నిటికంటే హేయమైన అబద్ధం. జిఎస్‌టికి అలా అద్భుత ప్రభావం చూపగల సత్తాయే ఉంటే ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో నెలకొన్న సంక్షోభం ఎప్పుడో సమసిపోయి ఉండేది. అదే నిజమైతే అమెరికా జిఎస్‌టిని ఎప్పుడో అమలుచేసి తన స్థూల జాతీయోత్పత్తిని, తద్వారా ప్రపంచ జిడిపిని పెంచగలిగి ఉండేది. నేటి ప్రపంచంలో పరిశోధనతో సహా ప్రతిదీ సరుకుగా మారుతున్న పరిస్థితి ఉన్నది. పరిశోధనా ఫలితం ఎవరికి ఎలా కావాలంటే అలా మార్కెట్‌లో ఒక చొక్కా కొనుక్కున్నట్లు తగినంత డబ్బు చెల్లించి కొనే వీలుంది. ఇలాంటి కుహనా పరిశోధనను ఉటంకిస్తూ జిఎస్‌టిని అమలుచేస్తే దేశ జిడిపిలో ఏటా 2 శాతం వృద్ధి ఉంటుందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెబుతున్నారు. ఆ విధంగా తమిళనాడు తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలూ జిఎస్‌టికి మద్దతిస్తున్నాయని ఆర్థిక మంత్రుల సమావేశంలో జైట్లీ చెప్పారు. అయితే జిఎస్‌టి కౌన్సిల్‌ ఏర్పాటుకు తమిళనాడుతో సహా చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని ఆ సమావేశానికి సంబంధించిన నివేదిక తెలియజేస్తున్నది. బహుళజాతి కంపెనీలు, దేశీయ కార్పొరేట్‌ పెట్టుబడిదారులు చేస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా జిఎస్‌టి చట్టాన్ని ఆమోదింపజేయాలనే తొందరలో ప్రభుత్వం ఉన్నది. ఈ చర్యతో రాజకీయ వ్యవస్థ ఫెడరల్‌ స్వభావానికి విఘాతం ఏర్పడుతుందా అనే విషయం గురించి ఎటువంటి ఆలోచనా చేయటం లేదు.
ఈ విషయాన్ని చర్చించే ముందు జిఎస్‌టికి అనుకూలంగా చేసే వాదనలను చూద్దాం. జిడిపి పెరుగుతుందని, రాష్ట్రాల ఆదాయం పెరుగుతుందనే ఊహాజనిత వార్తలను పక్కనబెట్టి జిఎస్‌టికి అనుకూలంగా చేస్తున్న మూడు మౌలిక వాదనలను పరిశీలిద్దాం. మొదటి వాదన ప్రకారం ఒకే రకమైన జిఎస్‌టి రేటువల్ల జాతీయ మార్కెట్‌ ఏకీకృతమవుతుంది. నిజానికి ఈ ఏకరూప రేటు మూడు ఏకరూప రేట్లుగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పరోక్ష పన్నుకు బదులుగా రాష్ట్ర వస్తువులు, సేవల పన్ను, కేంద్ర ప్రభుత్వం విధించే పరోక్ష పన్నుకు బదులుగా కేంద్ర వస్తువుల, సేవల పన్ను, మూడవది అంతర్రాష్ట్ర లావాదేవీలకు సంబంధించిన పన్ను. వివిధ స్థానాల వద్ద వేరువేరుగా పన్నులుండే ప్రస్తుత విత్త విధానాలకు భిన్నంగా ఏకరూప విధానాన్ని ప్రవేశపెట్టటంవల్ల దేశవ్యాప్తంగా సరకుల రవాణాకు అడ్డంకులు తొలగి మార్కెట్‌ ఏకీకృతమవుతుందని చెబుతుంది.
రెండవ వాదన మొదటి వాదనకు అనుబంధంగా ఉన్నప్పటికీ దీని ప్రత్యేకత దీనికున్నది. ఉత్పత్తి, అమ్మకం విలువపై వేసే పరోక్ష పన్ను రేట్లను ఏకరూపంగా చేయటం వల్ల పన్నుల వ్యవస్థలో హేతువు నెలకొంటుంది. ఇది ఏమి సాధించినా, సాధించక పోయినా దీని సుగుణం దీనికున్నది. సాధారణీకరించే, హేతుబద్ధంచేసే సాధనంగా ఏకరూపతకు ఒక సుగుణం ఉన్నది. మొత్తం విలువపై కాకుండా తోడైన విలువపై పన్ను విధించటం వల్ల 'పర్యవసాన ప్రభావం' లేకుండా పోతుంది. గతంలో చెల్లించిన పన్నులపై తిరిగి పన్ను చెల్లించవలసి రావటంతో ఈ ప్రభావం ఏర్పడుతుంది.

# 'పర్యవసాన ప్రభావం' భావన #
'పర్యవసాన ప్రభావం' భావన పట్ల స్పష్టత రావటానికి ఒక ఉదాహరణ ఇస్తే సరిపోతుంది. 'ఎ' అనే ఒక యూనిట్‌ సరుకు 'ఎల్‌' యూనిట్‌ శ్రమతో కలిస్తే యూనిట్‌ 'బి' అనే సరుకు ఉత్పత్తి అవుతుంది. వేతనం రేటు రూ.100 అనుకుంటే పన్ను చెల్లించటానికి ముందు యూనిట్‌ 'ఎ' సరుకు ధర రూ.100. 'బి' అనే సరుకు మీద 20 శాతం లాభం వేసుకుంటే ఎ, బి సరుకుల మీద విడివిడిగా వేసే పరోక్ష పన్ను 10 శాతం చొప్పున ఉంటుంది. ఆ తరువాత ఒక యూనిట్‌ బి అనే సరుకును రూ.277.20కి అమ్ముతారు(ఒక యూనిట్‌ ఏ సరుకు ధర 100 రూపాయలు+10 శాతం దానిపై పన్ను+100 రూపాయల శ్రమ+20 శాతం లాభం+10 శాతం పన్ను). దీనిలో మొత్తం పన్ను రూ.35.20గా ఉంటుంది. ఈ పన్నులో ఎ మీద వేసిన 10, బి మీద వేసిన 25.2, అంతకు ముందు వేసిన పన్ను వల్ల వ్యయం పెరగడంతో 1.2 రూపాయల పన్ను అదనంగా జోడింపబడింది. వేరేవిధంగా చెప్పాలంటే ఇంతకు ముందు చెల్లించిన పన్ను మీద తిరిగి అదనంగా పన్ను చెల్లించవలసిరావటం అహేతుకం. ఎందుకంటే పన్ను వేయవలసింది ఎంత విలువ జోడింపబడిందనే దానిపైన మాత్రమే.
రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ రాష్ట్రాలలోకి పెట్టుబడులను ఆకర్షించటానికి పన్నులను తగ్గించటం ద్వారా పోటీపడకుండా ఏకరూప పన్ను విధానం అడ్డుకుంటుందనేది మూడవ వాదన. మరో విధంగా చెప్పాలంటే ఇది రాష్ట్రాలకున్న 'నియంత్రణల తొలగింపు' స్వేచ్ఛను అడ్డుకుంటుంది. పెట్టుబడులను ఆకర్షించటానికి వివిధ దేశాల ఆర్థిక విధానాలు పోటీపడే స్వభావాన్ని కలిగి ఉంటాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా చేసిన నిదర్శనాలు చాలానే ఉన్నాయి. అయితే మొదటి రెండు వాదనలకు బలం లేదు. ఇంతకు ముందే పేర్కొన్నట్టు జోడించిన విలువపై పన్ను వేసే జిఎస్‌టి వంటి విధానం అమెరికాలో లేదు. మరోవిధంగా చెప్పాలంటే 'పర్యవసాన ప్రభావాల'ను అమెరికా ఆనందంగా అనుమతిస్తుంది. అదే సమయంలో ఆ దేశంలో ఏకరూప పన్ను రేటు లేక కనీసం ఒక స్థాయి కంటే తక్కువ టర్నోవర్‌పై పన్ను మినహాయింపునిచ్చే ఏకరూప విధానం కూడా లేదు. పన్ను, మినహాయింపు పరిమితులు రెండూ ఒక రాష్ట్రానికి, మరో రాష్ట్రానికి పొంతనలేకుండా ఉంటాయి. అంతేకాక అనేక రకాల పన్నులుంటాయి. ఇవి కూడా ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి పొంతనలేకుండా ఉంటాయి. కాబట్టి అమెరికాలో ఏకీకృతమైన జాతీయ మార్కెట్‌ లేదని ఎవరూ అనలేరు. ఒకవేళ అన్నా ప్రపంచంలో అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఏకీకృత జాతీయ మార్కెట్‌ లేనప్పుడు ఏకీకృతం కాకపోవటంవల్ల ఏమవుతుందని ప్రశ్నించవచ్చు. వ్యాట్‌ అమలులో ఉన్న ఐరోపా యూనియన్‌ ఈ విషయంలో మార్గదర్శకంగా ఉండేది. దీనివల్ల అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు తలెత్తి ఐరోపా యూనియన్‌ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వ్యాట్‌ అమలులో ఉండటానికీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవటానికీ సంబంధం లేదనేది నిజం. అయితే వ్యాట్‌ అమలులో ఉన్నదా, లేదా అనేది ఆర్థిక వ్యవస్థ పనిని ప్రభావితం చేయలేదనే విషయాన్ని అది స్పష్టం చేస్తున్నది.
కానీ మరో కారణం చేత దీనికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. అదేమంటే అమెరికాకు ఏకరూప వ్యాట్‌ లేకపోవటానికి కారణం ఆ దేశంలోని ఫెడరల్‌ వ్యవస్థను పదిలంగా ఉంచటంలో ఉన్నది. దేశంలో ఏకరూప పన్ను రేటు ఉండటం వల్ల రాష్ట్రాలకు పన్ను విధించే స్వేచ్ఛ పోతుంది. వేరే మాటల్లో చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను ఇది కబళిస్తుంది. దానితో దేశ రాజకీయ వ్యవస్థకున్న ఫెడరల్‌ స్వభావం దెబ్బతింటుంది. ఈ విషయం గురించి అంతగా చర్చ జరగలేదు. ప్రస్తుతం ఉన్న దానికన్నా రాష్ట్రాల ఆదాయం పెరుగుతుందా లేక తరుగుతుందా అనే దానిపైనే చర్చంతా జరుగుతున్నది. రాష్ట్రాల ఆదాయం తగ్గితే మూడు సంవత్సరాలపాటు పరిహారం చెల్లిస్తానని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.

# ఫెడరల్‌ వ్యవస్థను అతిక్రమించడమే #
అయితే ప్రస్తుత ఆదాయంతో పోల్చినప్పుడు ఆదాయాన్ని కోల్పోవటం అనేది సమస్య కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో తమకు తోచిన రీతిలో ఆదాయాన్ని పెంచుకునే స్వేచ్ఛను కోల్పోవటమనేదే అసలు సమస్య. మన ఫెడరల్‌ వ్యవస్థ ఆమాటకొస్తే ఏ ఫెడరల్‌ వ్యవస్థకైనా ప్రమాణ చిహ్నం ఏమంటే పరస్పరం సంబంధంలేని అనేక రాజకీయ పార్టీలు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేయటం. ఆర్థిక విధానాలను తమ దృక్పథాలకనుగుణంగా రూపొందించుకునే స్వేచ్ఛ వాటికుండటం. కొన్ని ప్రభుత్వాలు 'ఆర్థికాభివృద్ధి' కోసం పెట్టుబడులను ఆకర్షించటానికి పన్ను రాయితీలను ఇవ్వవచ్చు. ఇతరులు పన్నులను పెంచి సంక్షేమ కార్యకలాపాలపై లేక విద్య, ఆరోగ్యం వంటి సామాజిక రంగాలపై వ్యయాన్ని పెంచాలని భావించవచ్చు. వేరే మాటల్లో చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు తమకు నచ్చిన విత్త విధానాలను రూపొందించుకునే అవకాశం ఉండాలి. 'నియంత్రణల తొలగింపు' స్వేచ్ఛను లేకుండా చేయాలనే వాదనను తరువాత చర్చిస్తాను. ప్రతిపాదిత జిఎస్‌టి ఈ స్వేచ్ఛను హరిస్తుంది. పన్ను రేటులో ఏమాత్రం మార్పు తేవాలన్నా జిఎస్‌టి కౌన్సిల్‌ను సంప్రదించాలి. ఈ కౌన్సిల్‌లో కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సభ్యులుగా ఉంటాయి. ఈ కౌన్సిల్‌లో అనేకమంది సభ్యులలో ఒకే ఒక్క సభ్యత్వం కలిగిన రాష్ట్ర ప్రభుత్వం తాను పన్ను రేట్లను సవరించుకోవాలంటే కౌన్సిల్‌ ఆమోదాన్ని తీసుకోవలసి ఉంటుంది.
దీనితో మన ఫెడరల్‌ రాజ్యాంగాన్ని పెద్ద ఎత్తున మార్చినట్టు అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సభ్యులుగా ఉన్న జిఎస్‌టి కౌన్సిల్‌ రాజ్యాంగేతర సంస్థ. రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఈ సంస్థ కబళిస్తుంది. ఇది అధికారాలను కేంద్రీకృతం చేసే చర్య. ఈ చర్యను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ అంగీకరించినప్పటికీ దీనితో రాజ్యాంగ 'మౌలిక నిర్మాణం' దెబ్బతినదా అనే ప్రశ్న తలెత్తుతుంది. అమ్మకపు పన్నుకు బదులుగా వ్యాట్‌ను ప్రవేశపెట్టినప్పుడు పన్నులు విధించే రాష్ట్ర ప్రభుత్వ స్వేచ్ఛ దెబ్బతింటుందనే సమస్య ఎదురవుతుందని విత్త విధానాల నిపుణుడు అమరేష్‌ బాగ్చీ ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీలో రాశారు. అయితే వ్యాట్‌ విషయానికి వచ్చినప్పుడు దానిలో నాలుగు రకాల పన్ను రేట్లు ఉన్నాయి. అదే జిఎస్‌టిలో ఒకే ఒక్క రేటు ఉండటం చాలా తీవ్రమైన విషయం. ఒకవేళ ఒకే ఒక్క కనీస ఎస్‌జిఎస్‌టిని ప్రతిపాదించి ఆపైన రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఇష్టమైన రేట్లను పెట్టుకునే అవకాశం కల్పించి ఉంటే రాష్ట్రాల అధికారాలు అంతగా దురాక్రమణకు గురై ఉండేవికావు. దీనితో ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షించటానికి రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడే సమస్య కూడా పరిష్కరింపబడేది. అయితే దీన్ని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపాదించటం లేదు. ఇంతకుముందున్న మన్మోహన్‌-చిదంబరం కూడా ఈ ప్రతిపాదన చేయలేదు. వాళ్ళు కూడా సిజిఎస్‌టి సరసన ఏకరూప ఎస్‌జిఎస్‌టి రేటును ప్రతిపాదించారు. అలాంటి ఏకరూప ఎస్‌జిఎస్‌టి రేటును జిఎస్‌టి కౌన్సిల్‌ నిర్ణయిస్తుంది. ఇది ఫెడరల్‌ నిర్మాణంపై దారుణమైన ఉల్లంఘనగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను జిఎస్‌టి హస్తగతం చేసుకునే ప్రయత్నానికి వ్యతిరేకంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ గళాన్ని విప్పటం, తద్వారా ఏకరూప పన్ను రేటును వ్యతిరేకించటం ఆనందించదగ్గ విషయం.
- ప్రభాత్‌ పట్నాయక్‌
|| ప్రశ్నతోనే ప్రగతి ||

        వానల్లొ హరివిల్లు ఎందుకని/చుక్కల్లొ మిలమిల లెందుకని/మిణుగురు పురుగుల రెక్కల్లోన/వెలుగుల దీపం ఎందుకని...? పసి హృదయాల్లో, సుతిమెత్తని మనసుల్లో మెదిలే అపురూపమైన ప్రశ్నలకు అందమైన అక్షర రూపమే ఈ పాట. ఈ పాట నిండా ప్రశ్నలే... ఇటువంటివే కొన్ని వందలు, వేలు, లక్షల ప్రశ్నలు... ఈ అవనిపై ఆవిర్భవించినప్పటి నుంచి మానవజాతి ప్రశ్నించుకుంటూనే రాతియుగం నుంచి రాకెట్‌ యుగంలోకి ప్రవేశించింది. ఈ ప్రశ్నోపనిషత్తు ఇక ముందు కూడా కొనసాగుతూనే ఉంటుంది... ప్రశ్నించడం లేనప్పుడు ఎలాంటి పురోగతి ఉండదనేది నగసత్యం. ప్రపంచం అంచెలంచెలుగా పురోగమించడానికి ప్రశ్నే ఆధారం. అది లేనినాడు ప్రగతి నిలిచిపోదూ...!
ప్రశ్న ప్రగతికి రూపం...! ప్రశ్న ఈ జగతికి దీపం...! అది కేవలం సమాధానాలు రాబట్టే సాధనం మాత్రమే కాదు. అలాగైతే తాజ్‌మహల్‌ను ఎవరు నిర్మించారన్నప్పుడు షాజహాన్‌ అన్న సమాధానానికే సంతృప్తిచెందాల్సి వచ్చేది. కానీ తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు అంటూ శోధనకు దిగింది. దాని నిర్మాతలు కష్టజీవులే అనే సత్యాన్ని సాధించింది. అంతటితో ఆగలేదు. మహాకవి శ్రీశ్రీ మాటల్లోనే చెప్పాలంటే... నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది... సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది... చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసమెట్టిది... అంటూ ముందుకు సాగింది. ప్రజలే చరిత్ర నిర్మాతలన్న నిజాన్ని కనిపెట్టింది. శ్రమజీవే జగతికి మూలం, శ్రమ శక్తే విశ్వ సమస్తమని చాటి చెప్పింది. ప్రశ్న లక్ష్యం కేవలం సమాధానం మాత్రమే కాదనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అది సత్యం కూడా...! సత్యాన్ని కనిపెడుతూ పురోగమించడమే ప్రశ్న అసలు లక్ష్యం. కనుకనే పరిణామ క్రమంలో సమాజ అభ్యుదయానికి గల అడ్డంకులను, అవరోధాలను ధ్వంసం చేసి ప్రగతికి దారులు తీసింది. మానవ పురోగమనంలోని ప్రతి మలుపులో వెలుగై విజ్ఞానాన్ని పంచింది.
చెట్టు నుండి రాలే పండు నేలమీదికే ఎందుకు పడుతుంది, ఆకాశానికి ఎందుకు వెళ్లడం లేదు అన్న ప్రశ్నకు సమాధానమే న్యూటన్‌ గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతం... ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతానికి, డార్విన్‌ జీవపరిణామ సిద్ధాంతానికి మూలం ప్రశ్నే. మార్క్స్‌ సామ్యవాద సిద్ధాంతానికి ఆధారం కూడాప్రశ్నే. ప్రశ్నే లేకపోతే ఇవ్వాల్టి మన ఈ ప్రపంచమే లేదంటే అతిశయోక్తి కాదు...! ప్రశ్నేం చేస్తుందనుకోవద్దు... అది ప్రపంచాన్నే మార్చేస్తుంది... అది పోరాటానికి సంకేతం... భవిష్యత్‌కు సందేశం... అందుకే ప్రశ్నంటే కొందరికి భయం. అది అన్యాయాన్ని సహించదు. అవమానాలను భరించదు. అసమానతలను, అణచివేతలను అంగీకరించదు. అందుకే దొరతనాన్ని ధిక్కరించిన ప్రశ్న తెలంగాణ సాయుధ పోరాటమైంది. ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని సహించని ప్రశ్న స్వాతంత్య్ర సమరాంగణమైంది. దోపిడీని ఎదిరించిన ప్రశ్న అక్టోబర్‌ మహా విప్లవమైంది. అందుకే ప్రశ్నంటే ప్రజా కంటకులకు భయం. కానీ ప్రశ్నంటే ప్రగతికాముక శక్తులకు ప్రాణం. కనుక ప్రశ్ననెప్పుడూ స్వాగతించాలి. ఆదరించాలి. బలపరచాలి. ప్రశ్నను అడ్డుకోకూడదు. ప్రశ్నను అడ్డుకోవడమంటే ప్రగతిని అడ్డుకోవడమే...! ప్రశ్నను అడ్డుకోవాలనుకునేవారు అజ్ఞానులు, లేదంటే అభివృద్ధి నిరోధకులే. కానీ ప్రశ్నను అడ్డుకోగలరా? ప్రశ్న నియంతృత్వాన్ని సవాలు చేస్తుంది... నిర్బంధాన్ని బద్దలు కొడుతుంది... ప్రశ్న ఎప్పుడూ స్వేచ్ఛను కోరుకుంటుంది... ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంది... వికాసాన్ని ఆశిస్తుంది... ప్రశ్నించగలిగే స్వేచ్ఛ నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతీక. ప్రశ్నలేకుండా ఆలోచనలేదు. ఆలోచన లేకుండా పరిశీలన లేదు. పరిశీలన లేకుండా ప్రయోగం లేదు. ప్రయోగం లేకుండా సైన్సు లేదు. ఇవేవీ లేకుండా ప్రగతేలేదు. అందుకే ప్రశ్నించాలి... ప్రశ్నించడం ప్రతి ఒక్కరి హక్కు. ఇప్పుడు మనకు సమాధానం కావాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. కొండలు ఎందుకు తొలిచేస్తున్నారు, చెట్లను ఎందుకు నరికేస్తున్నారు, ప్రజలకు అన్నపానీయాలు అవసరముండగా అణు బాంబులు ఎందుకు తయారుచేస్తున్నా? బడిలో గడవాల్సిన బాల్యం బజారులో మాడిపోతోందెందుకు...? కులాల పేరిట, మతాల పేరిట కొట్టుకు చస్తున్నారెందుకు...? ప్రపంచంలో ఇప్పటికే ఉత్పత్తి అయి చలామణిలో ఉన్న సంపద కొన్ని వేల లక్షల కోట్ల డాలర్లుంటుంది. అందులోని సున్నాలను లెక్కించడమే చాలా కష్టం. సులువుగా అందరికీ అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే ప్రపంచ జనాభా మొత్తం కాలు మీద కాలేసుకుని తిన్నా కొన్ని వందల సంవత్సరాలకు ఈ సంపద సరిపోతుంది. ఇప్పటి ఈ సంపదను వాడుకోకుండానే అది ఏటా ఉత్పత్తి చేసే సంపదే ప్రపంచ జనాభాకు కడుపునిండా అన్నం పెడుతుంది. ప్రపంచంలో ఇంత సంపద ఉంది కదా మరి ఆకలెందుకుంది, పస్తులు ఎందుకు, పేదరికం ఎందుకు, అజ్ఞానం, అవిద్య ఎందుకు...? ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రశ్నించడమొక్కటే మార్గం.. ప్రశ్నిద్దాం...! భయం, నదురూబెదురూ లేకుండా గొంతెత్తి సూటిగా ప్రశ్నిద్దాం...!
(ప్రజాశక్తి దినపత్రిక)
|| ఒక రచయిత పునరుత్థానం ||

నాకు తెలుసు
భూమి తిరుగుతుంది
తిరుగుతూనే ఉంటుంది
నేను పెరుమాళ్‌ మురుగన్‌ను
నేను బతికే ఉన్నాను
కానీ నా లోపల రచయిత చనిపోయాడు
నేను ఇంకేమి రాయను
నేను ఇంకేమి మాట్లాడను
హిందీ మూలం : ఉజ్వల్‌ వారణాసి

'ఒక రచయితగా పెరుమాళ్‌ మురుగన్‌ ఇక చనిపోయాడు. నేను దేవుడను కాను పునరుత్థానం చెందడానికి, పైగా పునర్జన్మపై నాకు నమ్మకం కూడా లేదు. ఇకపై కేవలం ఒక ఉపాధ్యాయుడి గానే మిగిలిపోతాను.'' అంటూ ఏడాది క్రితం ఎంతో ఆవేదనతో తనకు తానుగా మరణశాసనం రాసుకొన్న ఈ రచయిత ఇప్పుడు 2016 జులై 5న మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పునరుత్థానం చెందబోతున్నాడు. మద్రాసు హైకోర్టు పెరుమాళ్‌ పక్షాన నిలిచింది. 'మళ్లీ కలం అందుకో పెరుమాళ్‌' అంటూ మద్రాస్‌ హైకోర్టు విస్పష్టమైన పిలుపునిచ్చి, రచయితగా చనిపోయిన మురుగన్‌లో జీవం పురిగొల్పింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న అసహన పరిస్థితులు, రచయితలు, మేధావులు, ప్రశ్నించే యువతపై దాడులు మొత్తంగా భారతదేశంలో హిందుత్వ శక్తులు అన్ని ప్రజాస్వామిక సంస్థల మీద, భావజాలం మీద పెద్దఎత్తున దాడులు చేస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతున్న రచయితలందరికీ ఈ తీర్పు ఒక బలమైన స్ఫూర్తినిచ్చిందనడంలో సందేహం లేదు. ఈ వార్త వినగానే ఒక ఉత్తేజం.... మానసికంగా ఎంతో ఉల్లాసం... వంద ఏనుగుల బలం.. ఇంకేముంది పెరుమాళ్‌ 'పువ్వు' అనే చిన్న కవితతో స్పందించాడు. 'ఒక భారీ విస్పోటనం తర్వాత.. ఇదిగో ఈ చెట్టు మళ్లీ చిగురించింది... వాడిపోయిన ఈ పువ్వు మళ్లీ వికసిస్తుంది. మరింత మెరుస్తూ మరిన్ని పరిమళాలు వెదజల్లుతూ....'' అంటూ చిరు కవితతో రాయటం మొదలుపెట్టాడు. 
ఆనాడు భూమి గుండ్రంగా ఉందని చెప్పిన కొపర్నికస్‌, బ్రూనైలను, సోక్రటీస్‌ లాంటి మేధావులను రాజ్యం దండించడం చరిత్రకు కొత్త కాదు. గత రెండేళ్లుగా మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందుత్వ శక్తుల పైశాచిక దాడులు ఎక్కువయ్యాయి. 2013 ఆగస్టు 20న మహారాష్ట్రకు చెందిన ప్రముఖ హేతువాది, ఉద్యమకారుడు నరేంద్ర దబోల్కర్‌ను చంపారు. ఇదే మహారాష్ట్రకి చెందిన గోవింద పన్సారేను కూడా బలిగొన్నారు. వీరిద్దరూ హేతువాద ఉద్యమ కారులు. ఈ వరుసలో ప్రముఖ కన్నడ సాహితీవేత్త, అకాడమీ అవార్డు గ్రహీత, హంపీ విశ్వవిద్యాలయ రిటైర్డు వైస్‌ చాన్స్‌లర్‌, మూఢనమ్మకాల వ్యతిరేక ప్రచారకుడు, హేతువాది కల్బుర్గిని 2015 ఆగస్టు 30న హిందుత్వవాదులు కాల్చిచంపారు. ఈ మతోన్మాద రాజకీయాలు గాంధీజీ హత్యతో ఆరంభమై నేటికీ కొనసాగుతున్నాయి. గత సంవత్సరం ఈ మతోన్మాద శక్తులు తమిళ రచయిత పెరుమాళ్‌ 'రచయితగా మరణించానని' ఆత్మహత్య ప్రకటన చేసేదాకా వదలిపెట్టలేదు. పెరుమాళ్‌ మురుగన్‌ వివాదాస్పద రచన 'మధోరు భగన్‌' (అర్ధనారీశ్వరుడు) అనగా శివుడు అని అర్థాన్ని రచయిత తన పరిసరాలలోని స్థానికంగా ఉన్న సామాజిక అంశాలను తీసుకొని రాసినది. ఈ నవల రచయిత అక్కడి సాంఘిక జీవనం, సాహిత్యం, జానపదంలోని ఆధారాలను తీసుకొని అక్కడి మతవిధానాలు, ఆచారాలు స్వాతంత్య్రానికి పూర్వం ఎలా ఉన్నాయో రాశారు. ఇది ఊహాజనితంగా రాసింది కాదు. రచయిత రెండేళ్లు పరిశోధన చేసి, స్థానిక సాహిత్యం నుంచి ఆధారాలు తీసుకొని చరిత్రను నవలగా రాశారు. ఈ నవల 2010లోనే తమిళ భాషలో అచ్చయింది. అప్పుడు సమస్యలు రాలేదు. నాలుగేళ్ల తర్వాత 2014లో పెంగ్విన్‌ సంస్థ ఆంగ్లంలోకి అనువాదం చేసి ప్రచురించడంతో వివాదం చెలరేగింది. తిరు చెరిగోడ్‌ అర్ధనారీశ్వరుని దేవాలయాన్ని, తమ స్త్రీలను, దేవుడిని కించపరిచేవిగా ఉందని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు, స్థానిక, హిందూ మత సంస్థలైన 'హిందూమక్కల్‌ కచ్చి', 'హిందుమున్నని' సంస్థలు నవల ప్రతులను తగులబెట్టాయి. రచయితకు బెదిరింపులు, తిట్లు, డెత్‌ వార్నింగ్‌లు ఇస్తూ వీరంగం వేశాయి. రచయిత ఆ జిల్లా ఎస్పీని కలిసి రక్షణ ఇమ్మని అడిగితే రక్షణ కల్పించకుండా ఊరు వదలి వెళ్లాలని, చెన్నైకి పారిపోవాలని సలహా ఇచ్చాడు. రచయిత కుటుంబంతో సహా చెన్నైకి మకాం మార్చుకున్నాడు. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం వివాదాన్ని పరిష్కరిస్తామని ఒక సమావేశం ఏర్పాటు చేసింది. మనస్పూర్తిగా పశ్చాత్తాపం పడుతున్నానని రాసిస్తానని రచయితతో బలవంతంగా క్షమాపణలు చెప్పించింది. నవలలోని పట్టణం పేరు మార్చాలని, అమ్ముడుపోని కాపీలను వెనుకకు తీసుకోవాలని, ఇకపై సున్నిత అంశాలపై రాయనని చెప్పాలనే అంశాలను చేర్చారు. అభ్యంతరం వ్యక్తం చేసిన రచయితపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో విధిలేని స్థితిలో ఇటువంటివి రాయనని ఒప్పుకున్న మురుగన్‌ 'ఒక రచయితగా చనిపోయానని, నేను దేవునని కాను గనుక తిరిగి రాలేనని, నాకు పునర్జన్మ మీద నమ్మకం లేదని ఇకముందు ఒక సామాన్య ఉపాధ్యాయునిగా పెరుమాళ్‌ బతుకుతాడని, నన్ను ఒదిలేయండి' అని ప్రకటించాడు. 
ఈ నేపథ్యంలో కథ మద్రాస్‌ హైకోర్టుకు చేరింది. కోర్టు పెరుమాళ్‌ పక్షాన నిలచి అన్ని కేసులనూ కొట్టివేసి, 150 పేజీల తీర్పులో న్యాయమూర్తులు విలువైన మంచి అభిప్రాయం వెలిబుచ్చారు. 'మీకు పుస్తకం నచ్చకపోతే విసిరిపారేయండి. కొందరికి కొన్ని అంశాలు నచ్చలేదన్న కారణంగా పుస్తకాలు నిషేధిస్తూ పోవటం జరగని పని' అని కోర్టు తేల్చి చెప్పింది. 'మురుగన్‌ వివాదాస్పద రచన 'మధోరు బగన్‌'ను తాము ఎంతగానో ఆస్వాదించామని న్యాయమూర్తులు ఎస్‌కె.కౌల్‌, పి.సత్యనారాయణ ప్రకటించారు. సాహిత్యాభిరుచులలో తేడాలుంటాయి కనుక ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చకపోవచ్చు. అంతేకాని రచనలు చేసే హక్కుకు మాత్రం అవరోధాలు ఉండవు' అని న్యాయమూర్తులు ప్రకటించారు. తన మనోభావాలు దెబ్బతినకూడదని పాఠకుడు అనుకుంటే అది ఎంతో సులభం. పుస్తకం మూసేయటమే అంటూ సల్మార్‌ రష్దీ వ్యాఖ్యను న్యాయమూర్తులు ఉటంకించారు. ఒక రచనను ఎలా చూడకూడదో తెలియజెబుతూ న్యాయమూర్తులు చేసిన విశ్లేషణ మరింత చక్కగా ఉంది. ఒక చిత్రకారుడు తన ఆలోచనలన్నింటినీ కలగలిపి ఒక చిత్రాన్ని వేసినట్లే, ఒక రచయిత విభిన్నమైన సామాజిక స్థితిగతులను, నేపథ్యాలను, వర్ణనలను పూసగుచ్చి ఒక ఇతివృత్తాన్ని సృష్టిస్తాడు. అందువల్ల దానిని చదివి, జీర్ణం చేసుకొని మొత్తంగా స్వీకరించి అర్థం చేసుకోవాలి తప్ప అక్కడెక్కడి ప్రస్తావనలనో, వ్యాఖ్యాలనో ఏరిపట్టి కొని అశ్లీలమనో, అవమానకరమనో ఊగిపోవటం సముచితం కాదని న్యాయమూర్తులు హితవు పలికారు. 'కళ ఎప్పుడూ పవిత్రంగా ఉండదు. పవిత్రంగా ఉండేది కళకాదు' అన్న పికాసో వ్యాఖ్యలను గుర్తుచేస్తూ రచయితలు వ్యక్తం చేసిన భావాలను, అవి అక్కడక్కడ రెచ్చగొట్టే విధంగా ఉన్నప్పటికీ వాటిని సంపూర్ణంగా అర్థం చేసుకొని ప్రశంసించాలన్నది న్యాయమూర్తుల సలహా. ఈ నవలలోని అశ్లీలం, వివాహేతర సంబంధాలపై ఉన్న విమర్శలను కొట్టిపారేస్తూ వారు మహాభారతాన్ని గుర్తుచేశారు. మురుగన్‌ ఈ నవల ద్వారా ఏదోకథ చెప్పలేదని సామాజిక వాస్తవాన్ని చెప్పారన్న కోర్టు వ్యాఖ్య రచయితకు విలువైన ప్రశంస. 
సాహిత్యం, కళలు వంటి వాటిని పోలీసుల పెత్తనానికి వదిలిపెట్టలేమని న్యాయస్థానం సృష్టం చేసింది. రచయిత ఇకపై భయపడాల్సిన అవసరం లేదని, తన సృజనకు మరిన్ని వెలుగులద్ది విస్తృతమైన సాహిత్యాన్ని ఈ సమాజానికి అందించాలని కోరింది. కాబట్టి పెరుమాళ్‌ అందుకో అభినందనలు. చేపట్టు నీకలం. ఎందుకంటే సృజన మరణిస్తే సామాజిక చలనం అంతమౌతుంది. మానస సమూహం స్పందనలు నశించి గడ్డకట్టిపోతుంది. దాడులు, కేసులు, ఎదుర్కొంటున్న రచయితలకు సాహితీ లోకం, ప్రజలు అండగా నిలబడాలి. సృజనను బతికించుకోవాలి. 
- కరిముల్లా 
|| బెడిసికొడుతున్న మోడీ తంత్రాలు ||

             ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి అద్యక్షుడు అమిత్‌షాల జోడీ వ్యూహ చాతుర్యాలను అదేపనిగా ఆకాశానికెత్తేవారు ఇప్పుడు తగులుతున్న వరుసదెబ్బలకు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఢిల్లీ బీహార్‌ ఎన్నికల ఫలితాలతోనే కంగుతిన్నా తర్వాత అస్సాంలో ఎలాగో విజయం సాధించడం ఒకింత ఉపశమనంగా మారింది. అయితే ఆ ఆనందం ఆవిరి చేస్తూ రాజకీయంగానూ పాలనా పరంగానూ విదేశాంగ విధానంలోనూ మోడీ తంత్రం బెడిసికొడుతున్నది. ఆయన మాత్రమే గాక బిజెపిలోనూ ప్రభుత్వంలోనూ ఆయన అండదండలు చూసుకుని చెలరేగిపోయిన నేతలు నెమ్మదిగా వెనక్కు వెళ్లిపోతున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో కేంద్రం చర్యలను తోసిపుచ్చుతూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఈ పరిణామాలకు పరాకాష్ట. 


                  చిన్న ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌లో గత ముప్పై ఏళ్లనుంచి అత్యధికంగా కాంగ్రెస్‌ పాలనే నడుస్తున్నది. అయితే వారిలో వారు కుట్రలూ కూలదోసుకోవడాలూ అస్థిర రాజకీయాలకు పేరు మోసింది. ప్రస్తుత ి. సభలో 60 కి 47 మంది సభ్యులున్న కాంగ్రెస్‌ నుంచి నబాంతుకీకి వ్యతిరేకంగా కలియపోల్‌ వర్గానికి చెందిన 21 మంది ఫిరాయింపును ప్రోత్సహించిం ది. బిజెపికి 11, ఇతరులకు రెండు స్థానాలున్నాయి. ఒక ప్రభుత్వ బలం రాజ్‌భవన్‌లో గాక శాసనసభ వేదికపైనే తేలాలన్నది ఎస్‌ఆర్‌బొమ్మై కేసులో ఇచ్చిన నిర్ణయాత్మక తీర్పు. స్పీకర్‌ ఫిరాయించిన వారిలో 15 మందిని అనర్హులుగా ప్రకటించినా గవర్నర్‌ జెపిరాజ్‌కోవాను ముందుంచి కథ నడిపించింది. రాజ్యాంగ పరిధిని కూడా ఘోరంగా అతిక్రమించేస ఆయన సభా నిర్వహణను చేతుల్లోకి తీసుకోవడానికి అనుమతినిచ్చింది. 2016 జనవరిలో జరగాల్సిన శాసనసభను 2015 డిసెంబర్‌లోనే జరిగేలా ఉత్తర్వులిప్పించి స్పీకర్‌ను తొలగించి అంతా గత్తరబిత్తర చేసింది. హఠాత్తుగా రాష్ట్రపతి పాలన ఎత్తివేసి కాలికోపాల్‌ను ముఖ్యమంత్రిగా ప్రతిష్టించింది. ఈ కేసు నడుస్తుండగానే ఉత్తరాంచల్‌లో రావత్‌ ప్రభుత్వాన్ని కూడా ఇదే ఫార్ములాతో పడగొట్టింది. ఆయనా హైకోర్టులో సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నా అక్కడా హడావుడిగా రాష్ట్రపతి పాలన విధించి తొలిసారి రాజ్యాంగాధినేతకు కూడా అక్షింతలు వేయించారు. అయినా రావత్‌ పున:ప్రతిష్గితులైనారు. . అంతకన్నా తీవ్రంగా అరుణాచల్‌ చెంపదెబ్బ. ఈ కేసులో సుప్రీం కోర్టు స్పీకర్‌ హక్కులు బాధ్యతలు గవర్నర్‌ పరిమితులు సుస్పష్టంగా నిర్వచించడం వల్ల ఇది మరో మైలురాయిగా నిల్చిపోతుంది. నబాంతుకిని పునరుద్ధరించామంటూనే ఈ తీర్పు విచిత్రమైందని బిజెపి వ్యాఖ్యానించడం చూస్తుంటే వారింకా కళ్లుతెరవడానికి గాని, వాస్తవాలు స్వీకరించడానికి గాని సిద్ధంగాలేరని అర్థమవుతుంది. అందుకే రాజ్‌ఖోవా అస్వస్తత కారణంగా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్న గవర్నర్‌ తథాగదరారు కేవలం 48 గంటల వ్యవధిలోనే సభలో బలపరీక్ష ఎదుర్కోవాలని ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేశారు.నిజానికి ఇలాటి సందర్భాల్లో ముఖ్యమంత్రితో సంప్రదించి సహేతుకమైన వ్యవధినివ్వడం సమంజసం. అయినా గవర్నర్‌ ససేమిరా అనడంతో కాంగ్రెస్‌ మరో వ్యూహం అనుసరించింది. నబాం తుకి రాజీనామా చేయడం, ఆయన స్థానంలో ప్రేమ్‌ కండూ సిఎల్‌పి నాయకుడుగా ఎన్నిక కావడమే గాక బయిటకు వెళ్లిన ఎంఎల్‌ఎల ందరూ తిరిగి వచ్చేశారు. ఇక ఇప్పుడు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించడం తప్ప గత్యంతరం లేదు. ఇది రాసేసమయానికి ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు గాని మరోసారి చేతులు కాల్చుకోవడానికి కేంద్రం సిద్ధం కాదనే అనుకోవాలి.
ఇక జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి తీవ్ర కల్లోలం రాజుకోవడం దేశానికే ఆందోళన కరం. సున్నితమైన సంక్లిష్టమైన ఆ సరిహద్దు రాష్ట్రంలో పాగా వేసేందుకు ఆ పార్టీ వేసిన విన్యాసాలు సృష్టించిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. అసలు 370నే ఎత్తివేయాలంటూ స్థానిక ప్రజల్లో భయసందేహాలు తీవ్రం చేసిన నేపథ్యం.కాశ్మీర్‌ సమస్యను ఇజ్జత్‌ కా సవాల్‌ అన్న భావన కలిగించిన బిజెపి కేంద్రంలో పాలించిన రెండు సందర్భాల్లోనూ గడ్డుగా మారడం యాదృచ్చిం కాదు. వాజ్‌పేయి హయాంలో కార్గిల్‌లో పాకిస్తాన్‌ చొరబాటును పసిగట్టడంలో ఘోరంగా విఫలమవడం సంఘర్షణకు దారితీసింది. దాంట్లో విజయం ఆయన పునరాగమనానికి మార్గమై వుండొచ్చు గాని దేశం మూల్యం చెల్లించ వలసివచ్చింది. ఈ నేపథ్యంలో తీవ్రవాదం పట్ల సానుభూతిని వేదికగా చేసుకుని పెరిగిన మొహబూబా మఫ్తి పిడిపి పార్టీ వాస్తవానికి బిజెపి భావజాలానికి పూర్తి విరుద్ధమైంది. అయినా సరే మొన్నటి ఎన్నికల తర్వాత ఈ రెండు పక్షాలూ అధికారం కోసం నిస్సంకోచంగా చేతులు కలిపి సర్కారును నెలకొల్పాయి.అయితే గత ముఖ్యమంత్రి సయిద్‌ మృతి తర్వాత మెహబూబా ప్రభుత్వం ఏర్పడ్డానికి దాదాపు మూడు నెలల వ్యవధితీసుకుని శూన్యత సృష్టించారు. ఈ మూడు దశాబ్దాల్లోనూ ఇలాటి అస్థిర అస్పష్ట సందర్భాల్లోనే ఉగ్రవాదం విజృంభించడం చరిత్ర చెబుతున్న వాస్తవం. ఈలోగా గోమాంసం వివాదం, శ్రీనగర్‌ ఎన్‌ఐటి చిచ్చు, జెఎన్‌యులోనూ కాశ్మీర్‌ సంబంధిత కక్ష సాధింపు, పఠాన్‌కోట చొరబాటుకు వంటి వరస ఘటనలు. అంతర్జాతీ యంగా ఐఎస్‌ ఐఎస్‌ అమానుషాలు పెరుగుతున్న తరుణంలో పక్కనే పాకిస్తాన్‌ కుట్రలు తెలిసి కూడా మోడీ ప్రభుత్వం నిఘా విభాగం ముందస్తుగా పరిస్థితిని అంచనా కట్టలేకపోయాయి. హిజబుల్‌ దళాధిపతి 22 ఏళ్ల బర్హున్‌ వన్నిని ఎన్‌కౌంటర్‌ చేయడం ఒకటైతే దాని ప్రతిస్పందనను కూడా అంచనా కట్టలేకపోయాయి. తమకు అలవాటైన రీతిలో సాయుధ దళాలను పంపి అణచివేయవచ్చని వూహించాయి. నిజానికి వీధుల్లోకి వచ్చి నిరసన తెల్పుతున్న వేలాది మంది యువత ఈ దేశపు బిడ్డలే గాని ఏ ఉగ్రవాద సంతతి కాదు. పర్యాటకం మినహా మరే ప్రధాన ఉపాధి లేక అది కూడా దెబ్బతిని అల్లాడుతున్న అక్కడి ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాల్సిన అవసరం ఢిల్లీ పాలకులు ఎన్నడూ గుర్తించలేదు.పండిట్ల వూచకోత, తరిమివేత బాధాకరమే గాని అదే కాశ్మీర్‌ సమస్యగా చూస్తే ఇవన్నీ బోధపడవు కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమన్న ప్రకటనలే తప్ప కాశ్మీర్‌లో భారత్‌ అ ంతర్బాగం కావాలన్న బాధ్యతాయుత స్పందన రాలేదు. అంతకు ముందు వీరోక్తులు పలికిన మెహబూబా ఆధినేతగా వుండి చొరవచూపించి లేదు. ఫలితమే డజన్నమంది ప్రాణాలు కోల్పోవడం. శాంతియుత ప్రాంతాలు కూడా భగ్గున మండడం. దాదాపు పదిరోజులుగా అక్కడ పరిస్థితి అదుపులోకి రావడం లేదు. .వైరుధ్యాల పుట్టగా మారిన బిజెపి పిడిపి ప్రభుత్వం ఏకీకృత వ్యూహంతో ఈ సంకోభాన్ని పరిష్కరించడం సాధ్యమయ్యేది కాదు. అంతర్జాతీయంగానూ ఎన్‌ఎస్‌జి సభ్యత్వం విషయంలో మోడీ ప్రభుత్వం ఆర్బాటం అపహాస్యం పాలైన తీరు ప్రపంచమంతా చూసింది. ఆ ఆశతో అమెరికాకు ఆసాంతం లొంగిపోయి భంగపాటే మిగిల్చిన కేంద్రం చైనాపైకి విమర్శ మరల్చేందుకు విఫలయత్నం చేసి విరమించుకుంది.ఈ ప్రహసనానికి దక్షిణ చైనా సముద్ర సమస్యను ముడిపెట్టి చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో వున్నాననే సంకేతాలు అందించింది.ఇప్పుడు హేగ్‌ అంతర్జాతీయ న్యాయస్థానం తనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును కూడా చైనా తోసిపుచ్చి అమెరికా కూటమిపై ధిక్కారం ప్రకటించింది. కావాలంటే ఈ సమస్యపై పిలిప్పయిన్స్‌తో చర్చలు జరుపుతానని సంసిద్ధత తెల్పింది. హేగ్‌ తీర్పు వచ్చాక మన దేశం స్పందన కూడా కాస్త సమతుల్యంగా వున్నట్టు కనిపించే ప్రయత్నం చేసింది. భారత్‌ తననే బలపర్చిందని చైనా ప్రకటిస్తే దానిపైనా భిన్నస్వరం వినిపించింది. ఈ తీర్పు అంతర్జాతీయ రంగంలో చైనా స్థానం నిలదొక్కుకోవడానికి కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఐరాస సముద్ర జల సూత్రాల ఒప్పందానికే కట్టుబడని అమెరికాకు హేగ్‌ తీర్పుపైపట్టుపట్టే అర్హత ఎలాగూ వుండదు.1986లో నికరాగ్వాలో సాండినిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు నిలిపేయాలని ఇదే కోర్టు తీర్పు నిస్తే అమెరికా బేఖాతరు చేసింది గనక ఇక్కడ నైతిక అర్హతే లేదు. ఏతావాతా మనం అమెరికాకు ఉపగ్రహంగా మిగిలిపోగా చైనా స్వతంత్రతను చాటు కుంటు న్నదన్నమాట. మోడీ ప్రభుత్వానికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ నివేదికలో వ్యాఖ్యానించడం కూడా ఇక్కడ గుర్తు చేయాలి. పాకిస్తాన్‌ విషయంలోనూ నాటకీయ ఆలింగనాలు ఎలా వున్నా నికరమైన విధానం లేకుండా పోవడం బలహీనతగా మారింది. ఇప్పుడు తాజాగా నేపాల్‌ ప్రధాని శర్మ తన ప్రభుత్వ కూల్చివేతకు భారత దేశం కుట్ర పన్నిందని ఆరోపించారు. మేము కాదు చైనా జోక్యం చేసుకుందంటూ అక్కడ కూడా లేనిపోని వివాదానికి మన విదేశాంగ శాఖ తెరతీసింది. బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్‌ తీవ్రవాదుల దాడుల కారణంగా కొంత సానుభూతి వున్నట్టు కనిపిస్తున్నా మొత్తంపైన ఇరుగుపొరుగుదేశాలతో మన సంబంధాలు ఒడుదుడుకుల పాలవుతున్న స్థితి ఒక పెద్ద వైఫల్యం. హెచ్‌సియు జెఎన్‌యు వివాదాల్లో రెచ్చిపియి మాట్లాడితే వీరనారిగా చిత్రించిన సృతి ఇరానీని శాఖ మార్చేశారు. ఇప్పుడామె క్యాబినెట్‌ కమిటీలలో కూడా లేకుండా పోయారు. పార్లమెంటులో మోడీకి అందగా చెప్పబడిన వెంకయ్యనాయుడుకు ఆ శాఖ కోత కోశారు. కోరి తెచ్చుకున్న సుబ్రహ్మణ్యస్వామి కొరివితో తలగోక్కున్నట్టు రోజుకో రచ్చ తెస్తుంటే మింగలేక కక్కలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.కొత్తగా గెల్చుకున్న హర్యానాలో జాట్ల వివాదం, మహారాష్ట్రలో పొసగని కాపురంలో అరోపణల పొగలు కనిపిస్తున్నాయి. అస్సాంలో కూడా పాలక కూటమిలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఆర్థిక రంగంలో సవాళ్లు, అధిక ధరలు నిరుద్యోగం సరేసరి. వెంకయ్య నాయుడు వంటివారికి మోడీ దేవుడిగా కనిపిస్తున్నారు గాని మోడీ షా జోడీ దుస్తంత్రాల దుష్ఫలితాలే ఇవన్నీ. మరో వంక మరణించానని ప్రకటించిన తమిళ రచయిత పెరుమాల్‌ వరదన్‌ పునరుజ్జీవం కూడా గొప్ప ఉత్తేజం. వీటన్నిటి సారాంశం నేర్చుకుంటారా లేక ఎదురుదెబ్బలే తింటారా అన్నది ప్రధాని బృందమే తేల్చుకోవలసిన విషయం.
- తెలకపల్లి రవి 

Friday, 15 July 2016

|| Kunja Bojji always committed to people's welfare ||

       He is a true Communist who is fully committed to the party ideology and people's welfare. Kunja Bojji is an epitome of simplicity. He was born at Adavi Venkannagudem village in Ramavaram panchayat of Vararamachandrapuram mandal nine decades ago. His parents Jogaiah and Lakshmi had eight children and he is the youngest of them. His father used to run the family by cultivating podu. He did not go to school as he hails from a poor family. He married Lalamma in 1948. The couple have six sons and three daughters.  
Speaking to The Hans India about his entry into politics and his involvement in people's movements, the nonagenarian said ``Legendary Communist leader Puchallapalli Sundarayya is a source of inspiration to me.’’ He worked as a courier in Telangana People’s Armed Struggle. He awakened tribal people against bonded labour and exploitation by extensively touring Bhadrachalam agency area. 
Bojji took the Communist Party membership in 1952. He actively took part in various struggles organised by the Communist Party for people’s cause. He worked with popular Communist leaders TVR Chandram, Bandaru Chandar Rao and BS Ramaiah who spearheaded agitations seeking hike in wages for bamboo workers and tendu leaf collectors. 
He also actively participated in the people's movement seeking effective implementation of 1/70 Act and issue of land pattas for tribal farmers. His entry into politics is not on a winning note. In 1970, he contested for the Ramavaram panchayat sarpanch post and lost the election by a margin of one vote. He entered the election fray again in 1981. He unsuccessfully contested for Vararamachandrapuram Panchayat Samithi president post as a CPM candidate in 1981.
The party fielded Bojji as its candidate for Bhadrachalam Assembly constituency in 1985 though he does not have strong economic background. He was selected as a party candidate in place of Murla Yerraiah Reddy who was elected as Bhadrachalam MLA twice, in recognition of his commitment to people’s cause. Local CPM leaders introduced Bojji to Telugu Desam Party founder NT Rama Rao during his visit to Kothagudem at the instance of Puchallapalli Sundarayya. He was elected as Bhadrachalam MLA in 1985, 1989 and 1994 as a CPM candidate. The Communist Party contested the elections in alliance with the TDP.
Bojji who created a record by getting elected as an MLA of Bhadrachalam thrice, said ``My first salary as an MLA was Rs 2,000 per month. Out of the total, I used to donate Rs 1,000 for the party fund and Rs 200 to the district unit. I maintained the family with the remaining Rs 800.’’ Despite being a three-time MLA, he earned a little. As a true people’s representative, he highlighted their problems in the Assembly of the erstwhile undivided Andhra Pradesh. ``When the state government allotted house sites for the MLAs, I refused to take it honouring the party stand.
The CPM which is committed to the cause of the poor, is against accepting house sites by the party functionaries and people’s representatives,’’ he said. The former MLA accompanied former prime minister Rajiv Gandhi when he visited Rekhapalli village in Vararamachandrapuram mandal in April 1985. He explained the problems of Konda Reddys to him and sought implementation of schemes for their economic uplift.
Bojji escaped from the jaws of death when People’s War Group Naxalites ambushed him at Jeediguppa in Vararamachandrapuram mandal on November 5, 1985. He along with CPM leaders Battula Bhishma Rao and Bandaru Chandar Rao visited the village in a jeep to oversee implementation of development schemes. The PWG Naxalites who gunned down Bhishma Rao and Chandar Rao, left Bojji after assaulting him. The killing of the two top leaders of Bhadrachalam division in the PWG attack, pained him a lot.
Though former Telugu Desam leader Tummala Nageswara Rao brought pressure on Bojji to join the TDP, he did not yield as he was committed to the Communist ideology. The veteran Communist leader is now leading a peaceful life at Adavi Venkannagudem. Speaking on tribal welfare, he said ``The interests of tribals need to be better safeguarded as they are still subjected to exploitation. There is a need to promote socio-economic awareness among tribals to bring them into the mainstream.’’
- PV Satyanarayana

Monday, 11 July 2016

|| ఒక కలానికి ఊపిరులూదిన తీర్పు ||

            మూర్ఖత్వం నల్లగా దట్టంగా అలుముకున్నప్పుడు ఏకొంచెం కామన్‌సెన్స్‌ అయినా కొట్టొచ్చినట్టు ప్రకాశిస్తుంది. తమిళ రచయిత పెరుమాళ్‌ మురుగన్‌ కేసులో మద్రాసు హైకోర్టు వెలువరించిన తీర్పు కూడా వర్తమాన పరిస్థితుల మధ్య అలాంటి వెలుగే. ఏడాదిన్నర క్రితం పెరుమాళ్‌ మురుగన్‌ రచయితగా తాను మరణించినట్టు ఫేస్‌బుక్‌లో చేసిన ప్రకటనతో ఒక అణచివేత వెలుగులోకి వచ్చింది. ఆయన నవల ‘మాధోరుబగన్‌’ 1940ల్లో తిరుచెంగోడ్‌ పట్టణంలో పిల్లలు లేని దంపతులు కాళి, పొన్నల కథ చెబుతుంది. ఇద్దరూ ఎన్ని గుళ్లు తిరిగినా, ఎవరికి మొక్కినా ఫలితం దక్కదు. చివరికి ఒకటే దారి కనిపిస్తుంది. తిరుచెంగోడ్‌ అర్ధనారీశ్వరుడికి జరిగే రథోత్సవ వేడుకల్లో 14వ రోజున సాంఘిక కట్టుబాట్లు వదులవుతాయి. ఆరాత్రి ఎవరు ఎవరితోనైనా శృంగారంలో పాల్గొనవచ్చు. ఈ వేడుక కాళి, పొన్నల సంసారంలో ఏ మార్పు తీసుకొచ్చిందన్నది అసలు కథ. ఇలాంటి సంప్రదాయం ఏదీ లేదని, పెరుమాళ్‌ మురుగన్‌ కల్పితకథతో తమ దేవుడ్నీ, సీ్త్రలను అవమానించాడని కొన్ని హిందూసంస్థలు గొడవకు దిగాయి. పెరుమాళ్‌ మురుగన్‌ చేత పోలీసుల సమక్షంలో క్షమాపణ చెప్పించాయి. అయినా గొడవ కోర్టుకెక్కి ఏడాది పాటు విచారణ సాగింది. మొన్న జూలై 5న మద్రాసు హైకోర్టు కేసు కొట్టివేస్తూ చరిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ పుష్పా సత్యనారాయణలతో కూడిన ధర్మాసనం ఇచ్చిన 160 పేజీల తీర్పు నుంచి ఏరికూర్చిన పాఠ్యానికి ఇది అనువాదం. 
- వివిధ 

సమాజం ఒక పుస్తకాన్ని చదివి అదేమి చెబుతున్నదో నొచ్చుకోకుండా ఆకళింపు చేసుకోవటానికి సిద్ధమేనా కాదా అన్నది ఎన్నో ఏళ్లుగా ఉన్న చర్చే. కాలం మారుతున్నది. ఒకప్పుడు ఒప్పుకోలేనిది తర్వాత సమ్మతి పొందుతున్నది. ‘లేడీ ఛాటర్లీస్‌ లవర్‌’ దీనికి ఒక ప్రముఖ ఉదాహరణ. ఒక పుస్తకం చదవాలా వద్దా నిర్ణయించుకునే వెసులుబాటు పాఠకునికి ఎప్పుడూ ఉంది. ఒక పుస్తకం నీకు నచ్చకపోతే, విసిరి పారేయ్‌. బలవంతమేమీ లేదు. సాహిత్యాభిరుచులు మనిషి మనిషికీ మారతాయి- ఒకరికి సరైనది మరొకరికి కాకపోవచ్చు. అయితే రాసే హక్కుకు ఏ ఆటంకమూ లేదు. ఒకవేళ పుస్తకంలోని అంశాలు రాజ్యాంగ విలువలని కాలరాస్తున్నా, వర్గ ఘర్షణల్ని లేవనెత్తుతున్నా, కులాలను కించపరుస్తున్నా, సమర్థనీయంకాని శృంగారాన్ని చిత్రిస్తున్నా, లేదా దేశ అస్తిత్వంపైనే దాడి చేస్తున్నా, రాజ్యం ఖచ్చితంగా కలగజేసుకుంటుంది, అందులో సందేహం లేదు.

ప్రస్తుతం మా ముందున్నది చిత్రమైన కేసు. ప్రొఫెసర్‌ పెరుమాళ్‌ మురుగన్‌ రాసిన ‘మాధోరుబగన్‌’ ఒక తమిళ నవల, ఇది ‘ఒన్‌ పార్ట్‌ వుమన్‌’ పేరుతో ఇంగ్లిషులోకి తర్జుమా అయింది, ఎన్నో పురస్కారాలు కూడా దక్కాయి, అయినాకూడా ఈ పుస్తకం ప్రమాదకరమనీ, వినాశకరమనీ, కథ జరిగిన స్థలానికి చెందిన ప్రజల మనోభావాల్ని రెచ్చగొడుతున్నదనీ ఆరోపణలు వచ్చాయి.

ఈ నవలకు చరిత్ర ఆధారమా, అయితే ఏమిటి? కొన్ని సంఘటనలు జరిగాయనటానికి ఎప్పుడూ నమోదైన చరిత్రే ఋజువుగా ఉండితీరాలా, లేక మనిషి నుంచి మనిషికి అందే జానపద వృత్తాంతాలు కూడా ఒక పుస్తకానికి ఆధారం కావొచ్చునా? ఏదేమైనా, మన మనసు నొచ్చుకునే పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవచ్చు? ‘‘ఒక పుస్తకానికి నొచ్చుకోకుండా ఉండటం చాలా సులువు, దాన్ని మూసేస్తే చాలు?’’ అన్న సాల్మన్‌రష్దీ మాట మనకేమైనా పనికొస్తుందా?

చిత్రకారుడు ఆలోచనల్ని గీస్తాడు; శిల్పి చెక్కుతాడు; అలాగే రచయిత రాస్తాడు. మొదటి రెండు సందర్భాల్లోనూ ఆలోచనలు సరళమైన నిర్మాణంతో వ్యక్తమవుతాయి. పుస్తకం ఆలోచనల్ని చెప్పటానికి మరింత వివరమైన విశదమైన పద్ధతి. అది సరళ నిర్మాణం కాదు. ఒక ఇతివృత్తాన్ని నింపాదిగా అల్లుతుంది. అందుకే, ఒక పుస్తకాన్ని అశ్లీలతే కాదు, మరింకే ప్రమాణాల ద్వారానైనా నిగ్గుతేల్చాలంటే ముందు దాన్ని ఆసాంతంగా చదివి, ఆకళింపు చేసుకోవాలి. పుస్తకాన్ని ఏదో చట్టశాసనం చదివినట్టు చదివి ఒక నిర్ధారణకు రాలేము. అక్కడో వాక్యమూ ఇక్కడో వాక్యమూ ఎత్తిచూపి అంచనా వేయలేము. పుస్తకాల్లో వాడే భాష కూడా సందర్భాన్ని బట్టి ఒక్కోసారి మర్యాదగా మెరుగుపెట్టిన భాషలాగానూ, మరోసారి స్థానిక యాసలతో మోటుగానూ ఉండవచ్చు. దూషణపూరితమైన భాష విషయంలో ఎలాగూ కొన్ని హద్దులున్నాయి. కానీ మరోలా చూస్తే, వాస్తవాలెప్పుడూ పూలపాన్పు కాదు, అవి కటువుగానే ఉంటాయి. అందుకే, సీ్త్రల సమస్యలు, లేదా సామాజికంగానూ ఆర్థికంగానూ వెనుకబడిన వర్గాలవారి యాతనలూ ఇలాంటి సామాజికాంశాల గురించి రాసిన పుస్తకాలు పైకి కటువుగా కనిపించవచ్చు. ఒక్కోసారి సందేశాన్ని పాఠకులకు చేర్చేందుకు వారు బిత్తరపోయేట్టుగానే వాస్తవాల్ని చూపించాల్సి వస్తుంది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి, సంఘ వివక్షను ఎదుర్కొంటున్న పిల్లలు లేని దంపతుల కష్టాలని కూడా ‘‘సున్నితమైన’’ పద్ధతిలో చెప్పితీరాలా?

అశ్లీలపు హద్దుల్ని తాకకుండా ఏమేరకు శృంగార రీతుల్ని పుస్తకాల్లో చిత్రించవచ్చన్నది ఈ వివాదంలో మరో అంశం. ఇది ఆయా సమాజాల సంస్కృతీ సంప్రదాయాలపైనా, వర్తమానం లోని కట్టుబాట్ల పైనా ఆధారపడి ఉంటుంది. అయితే వర్తమానపు కట్టుబాట్లు ఎప్పుడూ కొంత గతం తాలూకు బరువు కూడా మోస్తూంటాయి.

స్వాతంత్య్రం తరువాత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలోని భాగం-3లో ప్రాథమిక హక్కులకు ఎంతో గొప్ప స్థానమిచ్చారు. వాక్‌ స్వాతంత్య్రమూ, వ్యక్తీకరణ స్వాతంత్య్రమూ రాజ్యాంగానికి ఆయువుపట్టు, దీన్ని న్యాయస్థానాలు బలంగా సమర్థిస్తూ వచ్చాయి. అయితే ఏ స్వేచ్ఛా హద్దుల్లేనిది కాదు, అందుకే వ్యక్తీకరణ స్వాతంత్ర్యానికి కూడా ఆర్టికల్‌ 19(2) ద్వారా పరిమితి విధించారు. ఆశ్చర్యకరంగా, సీ్త్ర పురుష సంబంధాలు, శృంగారమూ, మతపరమైన ఆచారాల విషయాల్లో ప్రాచీన ధార్మిక గ్రంథాలే వర్తమానంతో పోలిస్తే ఎంతో ఉదారంగా ఉన్నాయి. అందం చూసేవాడి కళ్లల్లో ఉంటుందంటారు, ఏది అశ్లీలత అనేది తేల్చటానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.

ప్రాచీన సాహిత్యంలో శృంగార రీతుల్ని స్వేచ్ఛగా చిత్రించిన సందర్భాల్ని రచయిత తరఫు న్యాయవాదులు మా ముందుంచారు. ఇంతకుముందు లేనిదేదీ రచయిత రాయలేదనీ, కానీ ప్రాచీన భారత సాహిత్యం పట్ల ఏ గౌరవమూ లేని కొన్ని గుంపులు సంకుచిత దృక్పథంతో ఈ నవలకు వ్యతిరేకంగా కత్తిగట్టాయనీ నిరూపించే ప్రయత్నం చేశారు. వేద కాలం నుంచీ శృంగారమూ, కామరసభరితమైన సాహిత్యమూ, ప్రాచీన మధ్యయుగాల్లోని శృంగారపరమైన ఆచారాలూ ఎలా ఉన్నాయో ఈ తీర్పు ముందరి భాగాల్లో విస్తృతంగా ఉటంకించాము గనుక వాటిని మరలా పేర్కొనటం లేదు. మన స్వేచ్ఛా విలువల్ని నిజంగా ప్రతిబింబించేది ఆ సాహిత్యమేనని మరోమారు చెప్తున్నాము. మనదేశంపై బ్రిటిష్‌ దురాక్రమణ అనంతరం చెలామణీలోకి వచ్చిన విక్టోరియన్‌ ఇంగ్లిష్‌ భావజాలం చేత కలుషితం కాని విలువలు అవి. ఒక సమాజంగా మనం మన సాహిత్యం నుంచీ, ధార్మిక గ్రంథాల నుంచీ ప్రేరణ పొందటం మానేసి విక్టోరియన్‌ భావజాలంలో కూరుకుపోతున్నాం. శృంగారం దానికదే అవాంఛనీయంగా ఎన్నడూలేదు, నాగరికత ఆదిగా అది ఒక అంతర్భాగంగా ఉంటూనే వచ్చింది. మహాభారతంతో సహా భారతీయ ధార్మిక గ్రంథాల నిండా వివాహేతర శృంగారం గురించిన ఉదంతాలెన్నో ఉన్నాయి, అది కూడా చాలాసార్లు వంశాలను కొనసాగించటానికే. భవిష్యత్తులో ఒక పరిపూర్ణుడైన రాజుని పొందటం కోసం ఇలాంటి ఆచారాల్ని ఆనాటి సమాజంలో ఉన్నత నిమ్న సామాజిక ఆర్థిక వర్గాలు రెండూ పాటించాయి. ఇప్పుడు మహాభారతమూ, అలాంటి అనేక ఇతర గ్రంథాల్ని మన చరిత్రలో భాగమని చెప్తూనే, అవి మితిమీరిన కామాతురతని వ్యక్తం చేస్తున్నాయన్న కారణంతో వాటిని నిషేధించాలని చెప్పగలమా? మేము చెప్పగలిగినదల్లా ఇదే -

భవత్య అధర్మో ధర్మొ హి ధర్మాధర్మావుభావపి
కారణాత దేశకాలస్య దేశకాలః స తాదృశః 
స్థలకాల పరిస్థితుల్ని బట్టి ఏది ధర్మమో అది అధర్మం కావొచ్చు, అలాగే ఏది అధర్మమో అది ధర్మంగా మారవచ్చు. - శాంతిపర్వము, 79. 31

ఇతర మాధ్యమాలకు ఎంత ప్రజాదరణా లాభదాయకతా వున్నా, పుస్తకాలు ఇప్పటికీ ఒక శక్తివంతమైన సాధనమే. అవి చరిత్రను తీర్చిదిద్దటంలో అసమానమైన పాత్రపోషిస్తాయి. మంచి పుస్తకాలెప్పుడూ సాధికార స్వరంతో, సహేతుకంగా, స్పష్టంగా మాట్లాడతాయి. రచయిత, పాఠకులిద్దరి ఆలోచనకూ చోటిస్తాయి. ఈ ఆన్‌లైన్‌ వాదోపవాదాల, బెదిరింపుల కాలంలో ప్రచురణకర్తలపై మరింత పెరిగిన బాధ్యత ఏమిటంటే- పాఠకుల చెంతకు నిజాన్ని చేర్చటమే.

రచయిత పెరుమాళ్‌ మురుగన్‌ భయపడాల్సిన పనిలేదు. అతను రాయాలి, తన రచనల పరిధిని పెంచుకుంటూ పోవాలి. అతని రచనల ఇతివృత్తాలతోనూ శైలితోనూ విబేధించే వారు ఎందరున్నా, అతని రచనలు సాహిత్యానికి ఎంతో సమకూరుస్తాయి. మా తీర్పుతో ఈ గొడవ సమసిపోతుందనీ, అన్ని పక్షాలూ ఆత్మపరిశీలన చేసుకుంటాయనీ ఆశిస్తున్నాం. చివరిగా ఈ పరిశీలనతో ఈ తీర్పును ముగిస్తున్నాం - 
“Let the author be resurrected to what he is best at. Write.”