Saturday, 18 February 2017

|| మాతృభాషా మాధ్యమంలోనే ప్రాథమిక విద్య ||




               మున్సిపల్‌ యాజమాన్యంలో ఉన్న అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలలో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలని నిర్ధేశిస్తూ మున్సిపల్‌ పరిపాలన, అభివృద్ధి మంత్రిత్వశాఖ జనవరి 2న 14 జీవో ను విడుదలచేసింది. దీని ప్రకారం మున్సిపల్‌ పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఆంగ్లం నేర్చుకోవడం ముఖ్యమైతే ఆంగ్లం నేర్పాలి, ఆంగ్ల మాధ్యమాన్ని ఎందుకు ప్రవేశపెట్టడం? పాఠశాల సరిగా లేకపోతే ఆంగ్ల మాధ్యమం లో చదువుకున్నా ఆంగ్లం రాదని మాత్రం ఘంటాపథంగా చెప్పొచ్చు. 2011లో ఆంగ్లాన్ని ఒక బోధనా విషయంగా, ద్వితీయ భాషగా ఒకటవ తరగతి నుంచే ప్రవేశపెట్టారు. అయితే అందుకు శిక్షణపొందిన ఉపాధ్యాయుణ్ణి మాత్రం నియమించలేదు. అలాంటి వారు ఇప్పుడు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం విచిత్రంగా ఉంది. తెలియని భాషలో తెలియని విషయాలను బోధించే పద్ధతి అశాస్త్రీయమైనదే కాదు, ఇది విద్యార్థిపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. విద్యార్థిలో సహజంగా ఉండే ఉత్సుకతను, సృజనాత్మకతను తుంచివేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు ఏ విజ్ఞాన శాస్త్రం నేర్చుకోవడానికైనా, పరాయిభాష నేర్చుకోవడానికైనా మాతృభాషా మాధ్యమమే సరైనదని చెబుతున్నారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషా మాధ్యమం అనివార్యమైన అవసరమని భారత రాజ్యాంగం (అధికరణం 350 ఎ), కొఠారీ కమిషన్‌ చెప్పింది. యునెస్కోనే కాదు అభివృద్ధిచెందిన దేశాల చరిత్ర, వర్తమానం అదే చెబుతున్నాయి. వస్తూత్పత్తిలో అత్యధికాభివృద్ధిని సాధించిన జపాన్‌ అత్యున్నత స్థాయి వరకు మాతృభాషా మాధ్యమాన్నే అమలుచేస్తోంది. 2010లో భారత ప్రభుత్వం తెచ్చిన విద్యాహక్కు చట్టం విభాగం 29(2)లో ఎలిమెంటరీ స్థాయిలో వీలైనంతవరకు మాతృభాషా మాధ్యమాన్నే అమలు చేయాలని నిర్ధేశించింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం తాను పట్టిన కుందేటికి మూడేకాళ్ళు అన్నట్లు ప్రవర్తిస్తోంది. పరాయిభాషలో విద్య గరపడం జాతికి విద్యావంతులను దూరంచేయడమే. విద్యార్థి కూడా పరాయీకరణకు గురై మానసికంగా బలహీనుడవుతాడు. నేటి విద్యావంతులలో ఉన్న గొర్రెదాటు లక్షణానికి అదే కారణం. పాలకవర్గాలు కోరుకుంటున్నదిదే.
నిజానికి విద్యార్థులకు ఆంగ్లం అంతగా రావాలని మన పాలకులు కూడా కోరుకోవడంలేదు. మన పాలకులు కోరుతున్నదేమంటే విద్యార్థులు ఆంగ్లంలో సంభాషించడం నేర్చుకోవాలని మాత్రమే. అంటే విద్యార్థులు మంచి సేల్స్‌ మాన్లుగా తయారుకావాలని ప్రభుత్వం కోరుకుంటోంది. అయితే అందుకవసరమైన ఆంగ్లం ఆరు మాసాలలోనే వస్తుంది. ఉన్నత విద్యకు వెళ్ళడానికి ఆంగ్లం అవసరం కదా అంటున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒకప్పుడు వైద్య విద్యను కూడా ఉర్దూ మాధ్యమంలో అందించింది. అటువంటప్పుడు తెలుగు మాధ్యమంలో, ఇతర భాషా మాధ్యమాలలో ఉన్నత విద్యాబోధన ఎందుకు సాధ్యంకాదు? పదవతరగతి వరకు పాఠశాల విద్యలో మాతృభాషా మాధ్య మం, ఆంగ్ల భాషా బోధన సరైన విధానంగా ఉంటుంది. అయితే ఐఐటి కొరకు ఆంగ్లమాధ్యమం అంటున్నారు. పదవ తరగతి వరకు మాతృభాషా మాధ్యమంలో చదివిన విద్యార్థికి ఆంగ్లం కూడా సరైన పద్ధతిలో బోధిస్తే, ఇంటర్లో ఆ భాషకు తగిన తర్ఫీదునిస్తే ఐఐటి ప్రవేశపరీక్ష సులభంగానే రాయ గలరు. మాతృభాషా మాధ్యమంలో నేర్చుకున్నవారే గణితం, విజ్ఞానశాస్త్రాలు సృజనాత్మకంగా అర్థం చేసు కోగలరు. వారే ఆంగ్లాన్ని కూడా బాగా నేర్చు కోగలరు. ఇందు కు బలమైన రుజువులే ఉన్నాయి. ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులలో తెలుగు మాధ్యమం వారికంటే ఆంగ్ల మాధ్యమ విద్యార్థులే అధికంగా బడి మానేస్తున్నారని తెలుస్తోంది. 6 నుంచి 10 తరగతుల మధ్య విద్యార్థులలో తెలుగు మాధ్యమంలో బడి మానేసేవారు 14 శాతం అయితే, ఆంగ్లమాధ్యమంలోని వారు 31 శాతం మంది ఉన్నారు.
ఆంగ్లం వస్తే ఉద్యోగాలు వస్తాయని గట్టిగా వాదిస్తున్నారే గాని, ఆంగ్లోపాధ్యాయ ఉద్యోగం తప్ప ఏ ప్రభుత్వ ఉద్యోగం చేయడానికీ ఆంగ్లం అవసరంలేదు. రాష్ట్ర సర్వీసు కమిషన్‌ వారే అనవసరంగా ఆంగ్లానికి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉద్యోగం చేయవలసింది తెలుగు లేదా ఉర్దూ ప్రజల మధ్య అయినప్పుడు ఆంగ్లం అవసరం ఏమొచ్చింది? ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రభుత్వ కార్యకలాపాలు, చట్ట సభలు, న్యాయస్థానాల వ్యవహారాలు ప్రజల భాషలలోనే ఉండాలి. అయితే అలా జరగడం లేదు. వైపరీత్యమేమంటే ప్రజల భాషలో వ్యవహారాలు జరపడానికి బదులు ప్రజలం దరికీ ఆంగ్లం నేర్పుతామంటున్నారు. ఏ ప్రభుత్వ లేదా ప్రయివేట్‌ పరిశ్రమలో పనిచేయడానికైనా ఆ పరిశ్రమకు ప్రత్యేకమైన నైపుణ్యం అవసరం అవుతుంది గాని ఆంగ్లం కాదు. అలాగే అమెరికా వెళ్ళడానికి కావాల్సిన ఆంగ్లాన్ని ఆరు మాసాల్లో నేర్పించవచ్చు. అంతేగాని మొత్తం విద్యను ఆంగ్ల మాధ్యమంగా మార్చాల్సిన అవసరం లేదు. 2008 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమాన్ని అమలు చేస్తూ, ఆంగ్లాన్ని ఒక పాఠ్య విషయం గానే బోధిస్తున్నారు. ప్రయివేట్‌ను నియంత్రించడానికి బదులు ప్రభుత్వమే ప్రయివేట్‌ను అనుసరిస్తున్నది. ప్రభు త్వం తన దృక్పథాన్ని మార్చుకోవాలి. అయితే పాలకులు మాత్రం ప్రజల భాషను నానాటికీ అధోగతి పట్టిస్తున్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తితో, విద్యాహక్కు చట్టం 5వ విభాగం 29(2)లో పొందుపరచిన లక్ష్యాలను (ముఖ్యంగా మాతృ భాషామాధ్యమం గురించి) నెరవేర్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండగా, వాటిని నెరవేర్చకపోగా, పిల్లల వికాసానికి గొడ్డలిపెట్టుగా పరిణమించే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రాథమిక స్థాయి నుంచే ప్రవేశ పెట్టాలనుకోవడం గర్హనీ యం. 1980 నుంచి విజృంభిస్తున్న ప్రయివేటు ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు దురదృష్టకరమైన ఆంగ్ల వ్యామో హాన్ని సృష్టించాయి. ప్రజా ఉద్యమాలు వ్యాపార రంగంలో విద్యను, ఆంగ్ల మాధ్యమాన్ని నిరసించినా, నిలువరించ లేకపోవడం వల్ల అశాస్త్రీయమైన, అనర్ధదాయ కమైన ఆంగ్ల మాధ్యమం ఒక మహమ్మారిగా తెలుగు సమాజాన్ని ఆవహించింది. 2006లో వచ్చిన 76 జీవో ద్వారా ప్రభుత్వరంగ ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని సమాంతరంగా ప్రవేశ పెట్టారు. 2014లో విడుదలైన జీవో 53 ద్వారా అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తి వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఉద్యమాల ఒత్తిడి వల్ల ఆ ప్రయత్నం తాత్కాలికంగా ఆగింది. అయితే, ఈ సమస్యను మూలం నుంచే పెకలించాల్సి ఉంది. ఇందుకోసం తెలుగు భాషోద్యమ సమాఖ్య, విద్యా వికాస వేదిక, ఆంధ్రప్రదేశ్‌ విద్యా పరిరక్షణ కమిటీ ప్రతినిధులు, ఇంకా మరికొందరు విద్యా రంగ నిపుణులతో కలిసి 'మాతృభాషా మాధ్యమ వేదిక' ఏర్ప డింది. విద్యా బోధనలో మాతృభాషా మాధ్యమాన్ని కాపా డడం కోసం నిరంతర కార్యక్రమాలను ఈ వేదిక చేపడు తోంది. ఇప్పటికే జీవో 14కు తమ వ్యతిరేకతను ప్రభుత్వానికి మాతృభాషా మాధ్యమ వేదిక తెలియజేసింది. అంతేకాక ఫిబ్ర వరి 19 ఆదివారం విజయ వాడలో- అలంకార్‌ టాకీస్‌ దగ్గర ధర్నాచౌక్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సత్యాగ్రహ కార్యక్రమం జరుగుతుంది. ఈ వేదిక ఆశయంతో ఏకీభవించే సంస్థల ప్రతినిధులు, వ్యక్తులు ఈ సత్యాగ్రహంలో పాల్గొ నాలని, మద్దతు తెలుపాలని కోరుతున్నాం.   (మాతృభాషా మాధ్యమ వేదిక)

Friday, 17 February 2017

|| నాయకులు - ప్రజలు ||



తాజాగా తమిళనాడులో జరుగుతున్న పరిణామాలు యువతరంలో అనేక ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి వారా మన దేశాన్ని, రాష్ట్రాలను పాలించేంది అని ప్రశ్నిస్తున్నారు. గత 25 సంవత్స రాలుగా అమలవుతున్న నూతన ఆర్థిక విధానాలు రాజకీయ రంగంలోనూ పెను మార్పులు తీసుకొచ్చాయి. రాజకీయాన్ని వ్యాపారంగానూ, ఓట్లను సరుకుగానూ మార్చేశాయి. ఇప్పుడు రాజకీయ రంగంలో కనిపించే అనేక దుర్లక్షణాలు దాన్నుండి పుట్టినవే. అవినీతి, అక్రమ సంపాదన రాజకీయానికి పర్యాయ పదాలుగా మారిపోతున్నాయి. పాలక పార్టీల్లో మనకు ప్రధానంగా రెండు రకాల నాయకులు కనిపిస్తున్నారు. ఒకటి కార్పొరేట్‌ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, రెండు రాజకీయ కుటుంబాల నుంచి వారసత్వంగా వస్తున్న యువ నాయకత్వం. పాతికేళ్లకు ముందు కూడా డబ్బున్న వాళ్లు రాజకీయాల్లోకి వచ్చేవారు. ఆనాడు బయట సంపాదించుకొని, ఆ డబ్బును ఖర్చు పెట్టి రాజకీయాల్లో నిలబడేవారు. ప్రజాభిమానం చూరగొనటానికి ముందుగా ఎంతో కొంత పని కూడా చేసేవారు. సంపాదించుకున్న దాన్ని రాజకీయాల్లో కరగదీసి అప్పులపాలై దివాలెత్తిన వారు కూడా ఉన్నారు. తిరిగి రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి అవినీతికి పాల్పడేవారు. కానీ ఈరోజు జరుగుతున్నది తద్విరుద్ధం. ఇప్పుడు సంపాదించుకోవడానికే రాజకీయాల్లోకి వస్తున్నారు. ప్రజలకు సేవ చేయడానికి పెట్టే ఖర్చును కూడా పెట్టుబడిగా చూస్తున్నారు. ఇలాంటి మార్పునే అమెరికాలో నిర్మొహమాటంగా ''రాజకీయ వ్యాపారం''(పొలిటికల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌) అంటున్నారు. పరిశ్రమలో పెట్టినట్టుగానే రాజకీయాల్లో కూడా పెట్టుబడి పెడుతున్నారు. గత పాతికేళ్లలో ఇలాంటి వాళ్లు అనేక మంది రాజకీయాల్లోకి దిగుమతయ్యారు. ఎక్కడెక్కడ నుంచో సూట్‌కేసులతో హఠాత్తుగా దిగుతున్నారు. రాత్రకి రాత్రి నాయకులైపోతున్నారు. అత్యంత ఆధునిక పద్ధతులు, మార్కెటింగ్‌ ఏజెన్సీల ద్వారా సర్వే చేయించుకొని ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ తరపున పోటీ చేస్తే గెలుస్తామో నిర్ణయించుకుంటారు. అక్కడున్న రాజకీయ సామాజిక పొందికలను బట్టి ఒకేసారి రెండు మూడు పార్టీల నుంచి టిక్కెట్‌ కోసం ప్రయత్నం చేస్తారు. ఆయా గ్రామాల్లో, వార్డుల్లో ఉండే స్థానిక నాయకులనూ, కుల పెద్దలనూ గుర్తించి వారి ద్వారా ముఠాలను కూడగట్టుకోవడానికి, ప్రచారం చేయడానికి ముందుగానే డబ్బు ముట్టజెబుతారు. తమ పేరుతో బోర్లు, రోడ్లు వేయించటం, కాల్వలు తవ్వించటం, కమ్యూనిటీ హాల్‌ కట్టించటం చేస్తారు. దీనంతటినీ వారు ''ఉచిత సేవ''గా భావించరు. రాజకీయాలపై పెట్టే పెట్టుబడిగా చూస్తారు. గెలిచిన తరువాత దీనికి ఎన్ని రెట్లు సంపాదించుకోగలమని ముందుగానే అంచనాలు వేసుకుంటారు. దీనికి ఏ విలువా, నీతి నియమాలూ ఉండవు. గెలిచిన తరువాత హామీలను తుంగలో తొక్కి పై నుంచి కింద వరకు పర్సంటేజీలకే ప్రాధాన్యతనిస్తారు. ఇదే నీతిని క్రింది వారికి కూడా నేర్పించి తింటే తిన్నారు. మనకు పని చేస్తే చాలు అనే స్థితికి తీసుకొస్తారు. తద్వారా అవినీతికి సామాజిక ఆమోదాన్ని పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలు ఆదర్శంగా ఉండాలనుకునే యువతరం ఈ స్థితిని చూసి నిరాశకు లోనవుతున్నది. ఈ నిరాశా నిస్పృహలనే గత ఎన్నికల్లో మోడీ తనకనుకూలంగా చక్కగా వాడుకున్నారు.
ఇక రెండో రకం నాయకులు నేరుగా పై నుంచి ఊడిపడుతున్నారు. అప్పటికే రాజకీయాల్లో నిలదొక్కుకున్న తమ తండ్రులు, తాతల వారసత్వాన్ని ఉపయోగించుకొని యువ నాయకులుగా రంగంలోకి వస్తున్నారు. ఆయా పార్టీల్లో ఎంతో మంది సమర్థులైన యువ నాయకులున్నప్పటికీ, అలాంటి వారిని పక్కన పడేసి, తొక్కేసి తమ పుత్రరత్నాలకు పట్టం కడుతున్నారు. తమ కిందనున్న నాయకుల పిల్లల్ని వీరి టీమ్‌కు జోడిస్తున్నారు. వీరికి ఎలాంటి రాజకీయ చరిత్రా ఉండదు. ప్రజలకు సేవ చేయాలనుకునే యోచన ఉండదు. తల్లిదండ్రుల పేరు, పెత్తనం, డబ్బును ఉపయోగించుకొని దందాలు చేస్తుంటారు. చదువుల్లో రాణించకపోయినా అల్లరి చిల్లరి బ్యాచ్‌ను వెంటేసుకొని కబ్బులు, పబ్బులు, రేసులంటూ తిరుగుతూ విష సంస్కృతిని వెదజల్లుతుంటారు. ఇలాంటి పిల్లలు అనేక మంది ఇటీవల యాక్సిడెంట్లు, రేప్‌లు, మర్డర్లు వంటి కేసుల్లో ఇరుక్కొని పలుకుబడితో బయటపడుతున్న వైనం చూస్తున్నాం. వీధి నుంచి రాజధాని వరకు మన కళ్ల ఎదురుగా ఇలాంటి పుత్రరత్నాలు కనిపిస్తూనే ఉన్నారు. ఏ పట్టణంలో చూసినా ఇలాంటి వారి ఫ్లెక్సీలే మనకు దర్శనమిస్తుంటాయి. సెలబ్రిటీలుగా టీవీ ఇంటర్వ్యూల్లో కనిపిస్తుంటారు.
ఇప్పుడు అందరి ఆలోచనా దేశానికి మంచి నాయకత్వం రాదా అనే వైపు సాగుతున్నది. ఆర్థిక రంగంలో సంక్షోభం పెరగడం, నిరుద్యోగం, అసమానతలు పెరిగిపోవటం, అవినీతి, నల్లధనం ఊపందుకోవడంతో నీతి గల నాయకత్వం కోసం ఎదురు చూపులు సాగుతున్నాయి. దేశానికి కావాల్సిన మంచి నాయకత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? స్వాతంత్య్రోద్యమంలో బ్రిటిష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా నాయకత్వం పుట్టుకొచ్చింది. నాటి భూస్వాములు, బడా వ్యాపారస్తులకు ప్రతినిధిగా కాంగ్రెస్‌ ఉన్నా దాని నాయకత్వం గాంధీ అయినా, నెహ్రూ అయినా, పటేలైనా రాజకీయాదర్శాలను పాటించేవారు. ప్రాణాలను త్యాగం చేయడానికి సైతం సిద్ధపడి భగత్‌ సింగ్‌, అల్లూరి సీతారామరాజు, సుభాష్‌ చంద్రబోస్‌ వంటి వీరులు పుట్టుకొచ్చారు. అంబేద్కర్‌ వంటి మహనీయులు జన్మించారు. నాడు, నేడు కూడా ఇలాంటి వారి నుంచి యువతరం స్ఫూర్తిని పొందుతున్నది. ప్రత్యామ్నాయ రాజకీయాలకు ప్రతినిధిగా నాటి స్వాతంత్య్ర పోరాటాల నుంచే కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది. సుందరయ్య, నంబూద్రిపాద్‌, ఎకె గోపాలన్‌, జ్యోతిబసు, చండ్ర రాజేశ్వరావు వంటి ఆణిముత్యాలు నేటికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. స్వాతంత్య్రానంతరం క్రమంగా కాంగ్రెస్‌ పార్టీలో విలువలు దిగజారిపోతుండగా ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకలుగా కమ్యూనిస్టు నాయకులు ప్రజల ముందు నిలబడ్డారు. 1980ల వరకు దేశంలో అనేక ప్రజా ఉద్యమాలు నడిచాయి. కార్మిక సంఘాల్లో, వ్యవసాయ కూలీ పోరాటాల్లో, రైతాంగ ఉద్యమాల్లో ఆరితేరిన వారు నాయకులయ్యారు. అడుగడుగునా నిర్బంధాలు, త్యాగాలు వారికి పరీక్ష పెట్టాయి. ఈ పరీక్షలో నెగ్గి ప్రజాభిమానం చూరగొన్న వారు నాయకులయ్యారు. ముఖ్యంగా ఉన్నత విద్యా సంస్థలు ప్రజాస్వామిక నాయకత్వం తయారు కావటానికి నిలయాలుగా ఉండేవి. విద్యార్థి దశలో మంచి ఇంజనీరో, డాక్టరో, లాయరో, శాస్త్రవేత్తో కావాలని కోరుకున్నట్లుగా, మంచి ఉద్యమకారులు కావాలని కోరుకునే వారు కూడా ఉండేవారు. ఇలాంటి వారు విద్యార్థి సంఘాల్లో చేరి సమస్యలపై ఉద్యమాలు నిర్మించేవారు. చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు 70, 80లలో మార్మోగిన ఒక నినాదం. మంచి అలవాట్లు, నిరాడంబర జీవితం, నీతి నిజాయితీ, ఆడవారి పట్ల గౌరవం, ప్రజలంటే నమ్రత, పేదవారి పట్ల దయ, సమాజంలోని అసమానత, అన్యాయాలపై ఆక్రోశం, ఆగ్రహం వారికి ఆభరణాలుగా ఉండేవి. విద్యా సంస్థల్లో ప్రజాస్వామికంగా ఎన్నికలు పెట్టి విద్యార్థి నాయకులను ఎన్నుకునే వారు. ఆయా సంఘాలు, నాయకులు చేసిన కృషిని బట్టి ఎన్నికయ్యే వారు. విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంచడంలో ఈ ఎన్నికలు తోడ్పడేవి. దేశానికి కావాల్సిన భావినాయకత్వం ఇక్కడ రూపుదిద్దుకునేది. ఇప్పుడు వివిధ పార్టీల్లో సీనియర్‌ నాయకులుగా ఉన్న అనేక మంది ఆనాడు విద్యార్థి సంఘాల ద్వారా రంగ ప్రవేశం చేసినవారే. ఇప్పుడు ఎన్నికలు లేవు, విద్యా సంస్థల్లో ప్రజాస్వా మిక వాతావరణం కూడా తగ్గిపోయింది. సిద్ధాంతాలు, రాజకీయాల పట్ల వ్యతిరేక భావం అలముకుంది. శైశవ దశలో స్కూల్‌లో అడుగుపెట్టే ముందు నుంచే పిల్లల సంపాదనకు ఒక ట్యాగ్‌ కట్టి పంపిస్తున్నారు. ఏ కోర్సు చేస్తే ఎంత సంపాదించు కోవచ్చు, దానికున్న అవకాశాలేంటి అన్న దాని చుట్టూనే వారి ఆలోచ నలు తిరుగు తాయి. ఈ దశలో రాజకీయాల్లోకి రావాలని ఎవరూ కోరుకోవడం లేదు. అందు వల్లనే ఈరోజు రాజకీయ వ్యవస్థలో మంచి నాయకత్వానికి శూన్యత ఏర్పడింది. ఈరోజు దేశంలో సమర్థులైన ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, శాస్త్రవేత్తలు, నటీనటు లు, మేనేజర్లు, ఫైనాన్షియర్లు, చివరకు చురుకైన బ్రోకర్లు కూడా ఉన్నారు. కానీ మంచి రాజకీయ నాయకులే లేరు. ఈ శూన్యాన్ని పూడ్చేందుకు నవతరం రాజకీయా ల్లోకి రావాలి. పైన పేర్కొన్న అనేక రంగాల్లో మంచి ప్రతిభ ఉన్న వారి భవితవ్యాన్ని తేల్చేది రాజకీయమే. అలాంటి రాజకీయ రంగానికి మంచి నాయకుల అవసరం ఎంతైనా ఉంది. మంచివారు రాజకీయాలకు దూరంగా ఉంటున్నందువల్లే స్వార్థపరులు దీన్ని ఆక్రమించారు. 
గత పాతికేళ్లలో పాలకులు ఉద్దేశపూర్వకంగానే విద్యార్థులను రాజకీయాలకు దూరంగా ఉంచుతూ వచ్చారు. విద్యా సంస్థల్లో ఎన్నికలు నిషేధించారు. విద్యార్థి ఉద్యమాలపై ఉక్కు పాదం మోపారు. సంపన్నులు, మధ్యతరగతిలో చదువులో ఉన్నతంగా ఉండేవారంతా కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో చేరుతున్నారు. సామాజికంగా వెనుకబడిన తరగతుల్లోని విద్యావంతుల కుటుంబాలవారు కూడా అక్కడే చేర్చు తున్నారు. అక్కడ బట్టీలు పెట్టి ర్యాంకులు సంపాదించడం తప్ప మరో పొడ గిట్టదు. ఆటలు, పాటలు ఉండవు. సాహిత్య సమాలోచనలు జరగవు. రాజకీయ చర్చలను అనుమతించరు. పత్రికలను చదవనివ్వరు, టీవీలను చూడనివ్వరు. ఒక్కమాటలో చెప్పాలంటే వారికి బయట ప్రపంచంతో సంబంధమే ఉండదు. వీరికన్నా జైల్లో ఖైదీల పరిస్థితే మెరుగ్గా ఉంటుంది. ఇలాంటి వారు ఒక్కసారి స్వేచ్ఛా ప్రపంచంలోకి రాగానే దారి తప్పి పోతున్నారు. కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ప్రజాస్వామిక వాతావరణం ప్రవేశిస్తేనే దేశానికి మంచి నాయకత్వం లభిస్తుంది. కొంత మంది సామాజిక వివేచన ప్రదర్శించినా, సంపాదన కోసమో, కెరీర్‌లో నైపుణ్యం కోసమో విదేశాలకు వెళ్లిపోతున్నారు. అక్కడ బహుళజాతి కంపెనీల్లో ఉన్నత స్థానాలకు కూడా ఎగబాకుతున్నారు. ఆ రకంగా కార్పొరేట్‌ విద్యా సంస్థల నుంచి సమర్థవంత మైన కార్పొరేట్‌ వ్యాపార నాయకత్వం తయారవుతోంది. ఇప్పుడు నాయకత్వమంటే కార్పొరేట్‌ నాయకత్వంగా అర్థం మారిపోయింది. రాజకీయ నాయకులు సైతం తమ పిల్లలను హార్వర్డు, ఆక్స్‌ఫర్డ్‌ వంటి విద్యా సంస్థల్లో చేర్పించి, అక్కడ వ్యాపార సూత్రాలు, రహస్యాలు తెలుసుకున్నాక ఇక్కడ రాజకీయాల్లోకి దించుతున్నారు. తద్వారా రాజకీయాలను మంచి వ్యాపారంగా మార్చటంలో వారు నిష్ణాతులవు తున్నారు. రాజకీయ రంగంలోనే కాదు, ఇతర రంగాల్లో కూడా మంచి నాయకత్వం లోపించింది. డాక్టరై ప్రజలకు సేవ చేయటం, ఇంజనీరై దేశానికి సేవ చేయటం అనే ఆలోచనలే దరిదాపుల్లో లేవు. అలాంటి ఆలోనలున్నవారిని కూడా అనుమతించటం లేదు. ప్రజలను పీల్చి పిప్పిచేసే లాభాలు దండుకోవడమే పరమావధిగా ఈ రోజు ఏ వృత్తికైనా ఉంటుంది. తద్వారా విద్య, వైద్య రంగాలు ప్రజలకు మరింత దూరమయి పోయాయి. ఆ రంగాలకు ఉండాల్సిన సామాజిక స్పృహ లోపించింది. ఈ వ్యాపార ధోరణినే ప్రభుత్వ విధానాలు మరింత ప్రోత్సహిస్తున్నాయి. ఒక రకంగా ఈ రోజు దేశంలో అన్ని రంగాలకూ మంచి నాయకత్వం కావాలి. వృత్తి నైపుణ్యంతో పాటు సామాజిక స్పృహ, ప్రజాస్వామిక చైతన్యం కలిగినవారు కావాలి. అలాంటి నాయ కత్వాన్ని తయారు చేసే నిలయాలుగా విద్యా సంస్థలుండాలి. అలాంటి సరికొత్త విద్యా వ్యవస్థ కోసం యువతరం పోరాడాలి. ఈ పోరాటాల నుంచే దేశానికి అంకితభావం,అభ్యుదయ భావాలు కలిగిన మంచి నాయకత్వం లభిస్తుంది. తాజా ప్రపంచ అనుభవం కూడా దీన్నే చాటిచెబుతోంది.  - వి శ్రీనివాసరావు

|| అమ్మభాషే అమృతం ||



          ఆంధ్రుల ఆత్మాభిమానంతో పురుడుపోసుకున్న పార్టీగా పేరులోనే 'తెలుగు' తగిలించుకున్న తెలుగుదేశం పార్టీ స్వీయ ఏలుబడిలో అమ్మభాష తెలుగును కాదని, ఆంగ్లభాషను రుద్దేందుకు తెగించడం సిగ్గుచేటు. రాష్ట్రంలో తన యాజమాన్యంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో తెలుగు మాధ్యమం రద్దు చేసి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్దేశిస్తూ పురపాలక మంత్రిత్వశాఖ జనవరి 2న జారీ చేసిన ఉత్తర్వులు మాతృభాషలో విద్యాబోధన చేయాలన్న మన సంస్కర్తల ఆశయాలకు గండికొట్టింది.

Sunday, 12 February 2017

|| మహిళా పార్లమెంట్ సదస్సు పసుపు పార్టీ కార్యక్రమం ||





* మహిళా పార్లమెంటుపై విమర్శల వెల్లువ
* సాధికారత చర్చలు నామమాత్రమే
* డిక్లరేషన్‌ వాయిదా 
* నాయకుల కుటుంబ సభ్యులకే ప్రాధాన్యత

            అమరావతి వేదికగా కొత్త చరిత్రను సృషిస్తామంటూ నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంటు లక్ష్యసాధనలో విఫలమైంది. కీలకమైన మహిళా సాధికారిత అంశంపై కూడా చర్చలు నామమాత్రంగానే సాగాయి. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి స్పష్టమైన కారక్రమాన్ని రూపొందించుకోవడం లోనూ విఫలమైంది. రిజర్వేషన్లను అడ్డుకుంటున్న వారి పేర్లను ప్రకటించాలన్న ప్రతినిధుల డిమాండ్లనూ పట్టించుకోలేదు. దానికి భిన్నంగా రాబోయే ఎన్నికల్లో మాకు సంపూర్ణ మెజార్టీ ఇవ్వండి రిజర్వేషన్లు ఇస్తామంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన విజ్ఞప్తి వివాదాస్పదంగా మారింది.

|| అమెరికా భ్రష్టరూపం - అనాగరిక ట్రంపోన్మాదం ||




                     పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానంలో ఏదేదో చెప్పాడన్నట్టే అమెరికాలోనూ నోస్టర్డాం భవిష్యత్తును చెప్పాడంటుంటారు. 228 ఏళ్ల అమెరికా రాజ్యాంగ అనుభవం తర్వాత డోనాల్డ్‌ ట్రంప్‌ అనే వ్యక్తి అధ్యక్ష భవనంలోకి వస్తాడనీ, దేశాన్ని, ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంత పరిచే దిక్కుమాలిన పనులు చేస్తాడని ఆయన ఊహించాడేమో తెలియదు. దేశాలు, మతాలు, జాతులు, మానవ విలువలు, స్త్రీపురుష సంబంధాలు, విద్య, ఉద్యోగాలు, ఆర్థిక, సామాజిక, రాజకీయాంశాలు ప్రతి విషయంలోనూ ప్రజాస్వామ్య విరుద్ధమైన ప్రగతినిరోధకాన్ని, ప్రపంచాధిపత్య తత్వాన్ని రుద్దేందుకై రోజురోజుకు ట్రంప్‌ చెలిరేగిపోతున్నారు. దేశాలతో, జాతి, మతాలతో నిమిత్తం లేకుండా ప్రతి మనిషీ ఈ అంతర్జాతీయ అఘాయిత్యాన్ని అర్థం చేసుకోవడం అవసరం.
మొదటి సంగతేమంటే ట్రంప్‌ పైకి రావడం యాదృచ్ఛిక లేదా ఆకస్మిక పరిణామం కాదు. అగ్రరాజ్యం ముద్రతో ఆధిపత్యం చెలాయిస్తూ అన్ని విధాలా క్షీణిస్తున్న అమెరికా మేడిపండు అంతఃస్వరూపం ఆయన. దీనివెనక చాలా చరిత్ర ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా బలపడి యూరప్‌ చితికిపోయింది. సోవియట్‌, చైనా, తదితర దేశాలతో బలీయమైన సోషలిస్టు శిబిరం ఆవిర్భవించింది. వర్థమాన దేశాలకు అండగా నిలిచి అలీనోద్యమానికి శాంతిస్వాతంత్య్రాలకు ఊపిరులూదింది. అమెరికా, సోవియట్‌లు రెండు అగ్రరాజ్యాలుగా, భిన్న ధృవాలుగా పెంపొందాయి. ఆ దశలో సోవియట్‌కు వ్యతిరేకంగా ప్రచ్ఛన్న యుద్ధమే గాక ప్రత్యక్షంగా నాటోకూటమి వంటి వాటిని అమెరికా పెంచి పోషించింది. రొనాల్డ్‌ రీగన్‌ ఈ క్రమాన్ని పరాకాష్టకు తీసుకెళ్లారు. ఆ దశలోనే సోవియట్‌లో మిహయిల్‌ గోర్బచెవ్‌ నాయకత్వం మొదలైంది. ఆయన మొదలు పెట్టిన సంస్కరణల ప్రహసనం చివరకు ఆ వ్యవస్థనే విచ్ఛిన్నం చేసింది. మరోవైపున యూరప్‌లో జర్మనీ, ఆసియాలో జపాన్‌, సోషలిస్టు చైనాలు ఆర్థిక శక్తి పెంచుకున్నాయి. అంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా రగిలించిన టెర్రరిజం సవాలుగా మారింది. సీనియర్‌ బుష్‌ కాలంలో మొదలైన గల్ఫ్‌ యుద్ధం బిల్‌క్లింటన్‌ హయాంలోనూ కొనసాగి చిన్న బుష్‌ కాలంలో సెప్టెంబర్‌ 11 దాడికి, ఇరాక్‌ ఆక్రమణకు దారితీసింది.

|| ఒబామా పై పూతలు, పాత రీతులు ||

బుష్‌ హయాంలోనే ఆమెరికా ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది గాని ఆయన నాటో వంటి కూటములపై గాని, యూరోపియన్‌ దేశాలకు వ్యతిరేకంగా గాని ఏమీ మాట్లాడలేదు. బుష్‌ పాలన చివరి దశలో అంటే 2008లో అమెరికా ఆర్థిక సంక్షోభం బాహాటంగా బద్దలైంది. చివరకు ఎలా గో బెయిలవుట్లు ఇచ్చి బయిటపడ్డారు. ఆయనపై అసంతృప్తి ప్రబలిన దశ లో మార్పు తెచ్చే ప్రతినిధిగా బరాక్‌ ఒబామాను ఎన్నుకున్నారు. తొలి నల్ల జాతి అధ్యక్షుడుగానూ, ఆకర్షణీయమైన మాటలతోనూ ఒబామా కొంత ప్రభావం చూపినా విధానాల పరంగా పెద్ద మార్పు లేదు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఒబామా కేర్‌ ఆర్బాటంగా తెచ్చినా అది వాస్తవంలో కార్పొరే ట్లకు మేలు చేసేదిగానూ, లక్షలాది ఉద్యోగుల జీతాలలో అవసరాన్ని మిం చిన కోతగానూ మారింది. ఇక లిబియా ఆక్రమణ, సిరియాలో అంతర్యు ద్ధం వంటివన్నీ కల్లోలం సృష్టించాయి. ఇరాన్‌తో అంతకు ముందే అమెరి కాకు ఘర్షణ నడుస్తున్నది. యూరప్‌ దేశాలకు ఇంధనం ప్రధానంగా ఇరా న్‌, లిబియా, రష్యాల నుంచే వచ్చేది. అక్కడే చిచ్చు పెట్టడం వాటికి చిక్కు లు కలిగించి ఆగ్రహం తెప్పించింది. ఒబామా ఇరాన్‌తో ఏదో ఒప్పం దం తతంగం నడిపి కొంత చల్లబర్చే ప్రయత్నం చేశారు. అయితే చైనాతో దక్షిణ చైనా సముద్ర సమస్యపైనా, రష్యాతో క్రిమియా విషయంలో వైరుధ్యాన్ని రగిలించారు. ఆసియా కీలకం(పివోట్‌ ఆసియా) పల్లవి ఎత్తుకున్నారు.

|| మారిన దృశ్యం-విభిన్న విశ్వం ||

ఈ లోగా సోవియట్‌ విచ్ఛిన్నానంతర దెబ్బలను తట్టుకుని అధిక ధరలతో ఆర్థిక శక్తి పెంచుకుని రష్యా ఒక ఆయుధ దేశంగా ముందు కొచ్చింది. లాటిన్‌ అమెరికా దేశాలూ అమెరికా గుప్పిట నుంచి జారిపోయి ప్రత్యామ్నాయ మార్గం తొక్కాయి. భారత్‌, బ్రెజిల్‌, తదితర దేశాలు బ్రిక్స్‌గా ఏర్పడ్డాయి. ఇలాటి సమాంతర వేదికలు అమెరికాతో సంబంధం లేకుండా ఏర్పడ్డాయి. సంక్షుభిత యూరప్‌లో అలజడి మొద లైంది. సిరియా అంత ర్యుద్ధం ఫలితంగా ముస్లిం శరణార్థుల రాక మరో సంక్షోభానికి దారి తీసింది. ఇలాటి నేపథ్యంలో అంతకు ముందు చెప్పిన ఐరోపా యూనియ న్‌, ప్రపంచీకరణ వంటి విధానాలు చెల్లకుండా పోయాయి. అమెరి కాకు అనుచర పాత్రలో ఉన్న బ్రిటన్‌ బ్రెగ్జిట్‌కు ఓటే సింది. అమెరికా అగ్ర సైనిక శక్తి ఆయుధాల అమ్మకం కొనసాగుతున్నా ఆర్థి క పరిస్థితులు, అభివృద్ధి, ఉపాధి కల్పన పూర్తిగా మందగించాయి. నిరంతరం ప్రచారం చేసిన టెర్రరిస్టు సవాలు, అభద్రత ఆవరించింది. ఇది నాగరికతల యుద్ధం పేరిట మత విద్వేషాల పెంపుదలకు ఇస్లామో ఫోబియాకు కారణమైంది. ఇది సామాజిక కౌటుంబిక వ్యక్తిత్వ సంక్షోభాల రూపం తీసుకుని విద్యాలయా ల్లో సామూహిక కాల్చివేతలు, పోలీసుల ఉన్మాద దాడులు, దురా క్రమణ సైనికులలో వింత మానసిక పోకడలూ పెరిగిపోయాయి. అత్యంత నాగరి క దేశమంటూనే అటవిక లక్షణాలనూ, అమానుషాలనూ చూడ వలసి వచ్చింది. అవినీతి ఆరోపణలూ, ఆర్థిక పతనాలూ సరేసరి. ఎవరూ ఊహించని వాల్‌స్ట్రీట్‌ ఉద్యమం వంటివి జరిగాయి.

|| వికృత ట్రంపోన్మాదం ||

ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన అధ్యక్షుడే డోనాల్ట్‌ ట్రంప్‌. వామపక్ష మేధావి నోమ్‌ చామ్‌స్కీ 2010లోనే ట్రంప్‌ పైకి వచ్చే అవకాశముందని చెప్పడం విశేషం. ఎన్నికల ప్రచారంలోనే ఆయన వికృత ధోరణులన్నీ గుప్పించారు. దేశాలు, జాతులు, మతాలు, మహిళలు అందరినీ, అన్నిటినీ అవమానించే ఘోర పదజాలం ప్రయోగించారు. అయితే మరో వైపున అమెరికా దురవస్థను ఆంగీకరిస్తున్నట్టు మాట్లాడ్డం ద్వారా బాధితుల మనోభావాలు చూరగొనే వ్యూహం అనుసరించాడు. దేశ పరిస్థితి బాగా లేదంటూ అందుకు అమాయకులను, బాధితులను, పొట్టపోసుకోవ డానికి వచ్చినవారిని కారకులుగా చూపించడం చరిత్రలో ఫాసిస్టు తరహా వ్యక్తుల నిరంతర ఎత్తుగడగా ఉంటుంది. అమెరికా ఫస్టు అన్న ట్రంప్‌ చేసింది అదే. ప్రపంచ పోలీసుగా పెత్తనం చేసిన ఆ దేశాధినేత తామేదో ప్రపంచ భారాన్ని మోస్తున్నట్టు నమ్మించారు. విదేశాల నుంచి వచ్చి తమ శ్రమతో, ప్రతిభతో అమెరికాను ఉన్నత శిఖరాలకు చేర్చిన వారిని శత్రువులుగా, కష్టాలకు మూలంగా చూపించారు. ఇది మన దేశంలోనూ చూసిందే. ఇన్ని చేసినా ప్రజల ఓట్లలో పరిమితంగానే ఆధిక్యత పొందినా ఆ వ్యవస్థ విపరీతం వల్ల అధ్యక్షుడు కాగలిగారు. పై లక్షణాలన్నిటికీ కారణమైన వారిలో హిల్లరీ క్లింటన్‌ కూడా ఉన్నారు గనక ఆమె ఆయనను ఓడించలేకపోయారు. ఇక గద్దెక్కిన నాటి నుంచి ట్రంప్‌ తన వినాశకర ఎజెండా అమలులో తల మునకలవుతున్నారు. మెక్సికో సరిహద్దులో గోడ కట్టడమే గాక ఆ ఖర్చు వారే భరించాలని హుకుం చేసి దానికోసం 20 శాతం అదనపు సుంకాలు ప్రకటించారు. ఇది ఆ దేశంలో చాలా ప్రజ్వల నకు దారితీసింది. ఇక ముస్లిములను శత్రువులుగా చెబుతూ ఇరాన్‌, ఇరాక్‌, సిరియా, సూడాన్‌, లిబియా, యెమెన్‌, సోమాలియా అనే ఏడు దేశాల నుంచి వచ్చే వారికి వీసాలు నిలిపేశారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం ఇది ఘోరమైన దురహంకారం. ఈ నిర్ణయాన్ని న్యాయస్థానాలు కొట్టివేస్తే వాటిపైనా దాడి చేస్తున్నారు. ఇక సిరియా నుంచి వచ్చేవారిపై 120 రోజులు నిషేధం విధించారు. అదే సమయంలో క్రైస్తవులు వస్తే అనుమతిస్తామనడం ద్వారా మత విద్వేషాలను అంతర్జా తీయ స్థాయికి తీసుకెళ్లారు. ఈ చర్యలను ఐఎస్‌ఐఎస్‌ ఆహ్వానిం చిందంటే అవెంత ద్వేషపూరితంగా ఉందీ తెలుస్తుంది. సెప్టెంబరు 11 దాడులకు కారణమైన బిన్‌లాడెన్‌ స్వదేశం సౌదీ అరేబియా, ఆయన ఆశ్రయం పొందిన పాకిస్తాన్‌ ఈ జాబితాలో లేవంటే తమ విదేశాంగ నీతిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారో తెలుస్తుంది. అంతర్జాతీయ పెత్తనం మాదేనన్న స్థితి పోయి అంతకు ముందు కుదుర్చుకున్న టిటిపి, టిటిఐపి వంటి ఒప్పందాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఇవన్నీ కూడా బలహీనపడిన అమెరికా దుస్థితికి నిదర్శనాలు. మరోవైపున చైనాను ప్రత్యర్థిగా చేసుకుని వ్యతిరేక ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఒబామా కేర్‌ను సంస్కరించే బదులు పూర్తిగా దాడిచేసి ప్రజల ఆరోగ్య భద్రతకు ముప్పు తెచ్చారు. స్త్రీల గర్భస్రావ హక్కును తిరస్కరించడమే గాక ఆ విధమైన సేవలందించినట్టు ఆరోపణలున్న ఎన్‌జివోలపై వేటువేయడం తో తల్లీపిల్లల ఆరోగ్యానికి రక్షణ లేకుండా పోయి వీధుల్లో పోరాడుతు న్నారు. ఈ క్రమంలోనే హెచ్‌1బి వీసాలను కుదించి వాటికి విషమ షరతులు విధించి ప్రధానంగా భారతదేశం నుంచి అత్యధికంగానూ, ఇతర చోట్ల నుంచి కొద్దిగానూ వచ్చిన సాంకేతిక నిపుణుల, ఉద్యోగుల, శ్రమ జీవుల బతుకుల్లో మంటపెట్టారు. దీనివల్ల దేశంలో ఉపాధి కల్పన కూడా జరగడం లేదు. ఎందుకంటే అవసరాల కోసం నియామకాలు చేసుకునే అవకాశం లేకుండా నిబంధనలు మార్చారు. అంటే ఉన్నవారిని పంపే స్తారు, గోడలు కట్టేస్తారు. బయిట నుంచి రానివ్వరు .దీని ఫలితం? ఇప్పటి కే ఉన్నవారిని మరింత పిండడమేనన్నమాట. కార్పొరేట్లు కోరుకునేది అదే.

|| అన్నిటా అభివృద్ధి నిరోధకత్వం ||

ఇవన్నీ ట్రంప్‌ వ్యక్తిగత ఉన్మాదం అనుకుంటే పొరబాటే. అమెరికా ఇప్పటికీ ప్రబల శక్తిగానే ఉన్నా ఆర్థిక సామర్థ్యం తగ్గుముఖం పట్టింది. మరోవైపున కార్పొరేట్‌ అమెరికా అపారంగా పెరిగిపోయి ప్రపంచ సంపదలో సగానికి పైగా శాసిస్తున్నది. వారి కనుసన్నల్లోనే ట్రంప్‌ ఇవన్నీ చేస్తున్నారు. పేదల కోసం మాటలు చెబుతూనే కార్పొరేట్లకు రాయితీలు, మినహాయింపులు పెంచుతున్నారు. పర్యావరణాన్ని కూడా ఖాతరు చేయకుండా గతంలో నిలిపేసిన కీస్టోన్‌ ఎక్స్‌ఎల్‌, డకోటా యాక్సెస్‌ పైపు లైన్లను అనుమతించారు. అసలు తన సైట్‌లో పర్యావరణం ఎజెండానే లేకుండా తీసేశారు. నల్లజాతి వారిపైన, మహిళలపైన, ముస్లింలపైన ద్వేషం రగుల్కొల్పుతున్నారు. మానవ హక్కులు తెరచిన తలుపులు అంటూ సూక్తులు చెప్పిన అమెరికా అధినేత ఇంత వికృత రూపంలో బయిటకు రావడం ప్రపంచానికే ఒక హెచ్చరిక లాంటిది. వారే చెప్పిన ప్రపంచీకరణ ఇప్పుడు పనికిరానిదై పోయింది. బెర్లిన్‌ గోడలు కూల్చిన వారు మెక్సికో గోడలు కడతామంటున్నారు. ఎండ్‌ ఆఫ్‌ ద హిస్టరీ అన్నది కాస్తా ఎండ్‌ ఆఫ్‌ ద ఎంపైర్‌గా మారింది. (ఇంపీరియలిజంను ఎంపైర్‌ అంటుంటారు) ఈ క్రమంలో నిన్నటి ఆగర్భశత్రువు సోవియట్‌ నేటి రూపమైన రష్యా తమకు శత్రువేమీ కాదని ట్రంప్‌ ప్రకటించడం ఒక చారిత్రిక వైపరీత్యం. అంతకు ముందు సోషలిస్టు దేశాలలో కుట్రలు సాగించేందుకు తమ గూఢచారులను పంపిన అమెరికా ఇప్పుడు తమ అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా జోక్యం చేసుకుందని గగ్గోలు పెట్టడం మరో వింత. హంతకుడైన పుతిన్‌ను మీరు ఇష్టపడతారా అని ఒక ఇంటర్వ్యూలో ట్రంప్‌ను ప్రశ్నిస్తే మన దగ్గర హంతకులు లేరా అని ఎదురు ప్రశ్నించారట. చైనాకు వ్యతిరేకంగా తైవాన్‌ను చేరదీసి వివాదం రగిలించిన ట్రంప్‌ మళ్లీ ఇప్పుడు తాను ఒకే చైనా విధానానికి కట్టుబడివున్నట్టు చెబుతున్నారు.
ఈ ట్రంపోన్మాదంపై అమెరికాలోనే ఎంత వ్యతిరేకత వచ్చిందంటే ఆయన ప్రమాణస్వీకారం చేస్తుంటే నిరసన ప్రదర్శనలు జరిగాయి. యూరోపియన్‌ దేశాలలో వేలాది మంది మహిళలు వీధుల్లోకి వచ్చారు. బ్రిటన్‌ పర్యటన పెట్టుకుంటే పార్లమెంటులో ఆయన మాట్లాడ్డానికి వీల్లేదని ఆ దేశపు స్పీకర్‌ తీవ్రమైన అభ్యంతరం ప్రకటించారు. ఆఖరుకు ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక ఆయనే నియమించిన న్యాయమూర్తి నీల్‌ గోర్ష్‌ కూడా వీసాలపై నిషేధం న్యాయం కాదని తేల్చిచెప్పారు. విచిత్ర మేమంటే ఇన్ని పరిణామాల మధ్యనా బొత్తిగా పెదవి విప్పనిది భారత దేశమే. ఇస్లామిక్‌ తీవ్రవాదంపై ట్రంప్‌ పోరాడుతున్నారు గనక మనకు మిత్రుడన్న వైఖరి తీసుకోవడమే గాక మోడీ అంటే ట్రంప్‌కు చాలా ఇష్టుడన్నట్టు భ్రమపడుతున్నది. ట్రంప్‌ అధికారికంగా మాట్లాడిన దేశాధినేతల్లో ఇజ్రాయిల్‌, కెనడా, బ్రిటన్‌ తర్వాత మోడీ నాల్గవవారు. మొదట దేశ విదేశాలలో ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న విపరీత రాజకీయవేత్త చైనా తర్వాత స్థానంలో ఉన్న మన పట్ల ఎలా సానుకూలంగా ఉంటారన్న ప్రశ్నవేసుకోవడం లేదు. హెచ్‌1బి నిర్ణ యానికి ఎక్కువగా దెబ్బతినేది మన ఐటి నిపుణులేననీ, అక్కడ గణనీ యంగా స్థిరపడిన భారతీయ సంతతి భద్రతకు కూడా ముప్పు ఉందని గుర్తించడం లేదు. పాలకవర్గాలు వంతపాడినా సరే ప్రపంచ ప్రజలు, పెద్ద దేశమైన భారతీయులు ఈ వినాకశర పోకడలపై పోరాడక తప్పదు. -తెలకపల్లి రవి 

Friday, 20 January 2017

|| సోషలిజమే భవిష్యత్తు ||



               తొంబైమూడేళ్ళ క్రితం సరిగ్గా ఈ రోజు 20వ శతాబ్ద రాజకీయ, ఆర్థిక విధానాలు శాసించిన ఒక మహా మేధ ఆలోచించడం మానేసింది. ఆ మహా మేధావి పేరు ప్రపంచంలో అత్యధికులకు సుపరిచితం. ఆయనే లెనిన్‌. సోవియట్‌ విప్లవ యుగకర్త వ్లాదిమిర్‌ ఇల్లీచ్‌ లెనిన్‌. సిద్ధాంతానికి, ఆచరణకు మధ్య వారధి. అక్టోబర్‌ మహా విప్లవ శత వార్షికోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో దానికి సారథ్యం వహించిన లెనిన్‌ను స్మరించుకోవడం ఎంతైనా సముచితం.

Wednesday, 18 January 2017

|| రోహిత్ చట్టం కోసం .. అలుపెరగని పోరాటం చేద్దాం ||



హై‌దరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్‌ వేముల తొలి వర్థంతి సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి. యూనివర్సిటీలో సభ జరగకుండా పోలీసులు ప్రదర్శించిన కర్కశత్వం ఆశ్చర్యం కలిగిస్తున్నది. పోలీసు బలగాలు పలుచోట్ల దారికాసి వస్తున్నవారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం చూసినప్పుడు, రోహిత్‌ మరణించిన ఏడాది తరువాత కూడా ప్రభుత్వాల అణచివేత సిద్ధాంతంలో వీసమెత్తు మార్పు రాలేదని అర్థమవుతున్నది.

Monday, 16 January 2017

|| కోడి నేల ఒరిగింది - చట్టం పత్తాలేకుండా పోయింది ||



సంక్రాంతి వేళ ఆంధ్రప్రదేశ్‌లోని కోడిపందేలు, తమిళనాడులో జల్లికట్టుపై సాక్షాత్తు దేశ సర్వోన్నత న్యాయస్థానం విధించిన నిషేధా జ్ఞలు అభాసుపాలు కావడం ఆందోళనకరం. ఆయా రాష్ట్ర ప్రభుత్వా లు, పోలీస్‌ వ్యవస్థలు కలిసికట్టుగా సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కాయి. కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా రాష్ట్ర వ్యాపితంగా జరి గిన కోడి పందేల్లో పందెం రాయుళ్లు కోట్ల రూపాయలు పందే లు కాశారు.

Friday, 13 January 2017

|| ఒకే దేశం, ఒకే ఎన్నిక|| అప్రజాస్వామికం



              లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటూ బిజెపి జాతీయ కార్యవర్గం ఇచ్చిన 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' నినాదం పూర్తి అప్రజస్వామికం. ఒకేసారి ఎన్నికల నిర్వహణ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన బిజెపి ఈ అంశాన్ని ప్రకటించటంలో ఆశ్చర్యం లేదు . ఎన్నికల సంస్కరణల ప్యాకేజిలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ గత సెప్టెంబరులో ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూడా దీనిని సమర్థించారు.

Monday, 9 January 2017

|| మాతృభాషకు మరణ శాసనం ||




అసలు విషయం–తెలుగు భాషకు ఎట్టకేలకు విశిష్ట భాషా ప్రతిపత్తి దక్కిందని పరమానంద భరితులమవుతున్న సందర్భంలో, మద్రాసు హైకోర్టులో ఒక తమిళుడు మన భాషా ప్రతిపత్తికి అడ్డుతగలడానికి ప్రయత్నించి విఫలమైనందుకు సంతోషిస్తున్న సమయంలో కూడా మనం విశ్రమించలేక పోతున్నాం. ఎందుకంటే, ప్రపంచ బ్యాంకు ప్రజా వ్యతిరేక సంస్కరణల కత్తుల బోనులో ‘ప్రభుత్వం’ అనే శక్తి చిక్కుబడిపోయింది. మాతృభాషను పెంచుకోవాలి, అన్యభాషల్ని గౌరవించాలి.

|| మోడీ, బాబు శాస్త్రజ్ఞాన విధ్వంసం ||




          తిరుపతిలో జరిగిన ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ 104వ సదస్సులో శాస్త్రజ్ఞానం గురించి ప్రధాని మోడీ చేసిన ప్రసంగాలకు, శాస్త్రజ్ఞాన అభివృద్ధికి ఆయన ఇస్తున్న ప్రోత్సాహానికి పూర్తి వైరుధ్యం ఉంది. సైన్సు కాంగ్రెస్‌ ప్రారంభపు రోజున ఆచార్యులు విలియం ఈ మోర్నియర్‌ (అమెరికా), మహమ్మద్‌ యూనస్‌ (బంగ్లాదేశ్‌), ఆచార్య సెర్గేహరోచే (ఫ్రాన్స్‌), అదా ఈ యోనత్‌ (ఇజ్రాయిల్‌), టకాకి కజితా (జపాన్‌), జీన్‌తిరోల్‌ (ఫ్రాన్స్‌) వారిని ఇస్కా అధ్యక్ష పతకాలతో మోడీ సత్కరించారు. అయితే ఈ సత్కరాలలో మన వారెవరూ లేరు.

|| కులం కుట్రలో రోహిత్‌ కేసు ||




*బిసిగా ముద్ర వేసేందుకు స‌న్నా‌హాలు    
                                                   
           రోహిత్‌ వేముల ఆత్మహత్య చేసుకుని ఏడాది సమీపిస్తున్నప్పటికీ ఆయన కేసును తేల్చకపోగా, ఆత్యహత్యకు కారకులైన వారిని రక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. బతికినంత కాలం దళితుడిగా జీవించి, ఆ భావజా లన్నే నమ్మిన రోహిత్‌పై బిసి ముద్ర వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మృత్యువులోనూ వేధింపులను ప్రశ్నించి, వివక్షను నిలదీసిన రోహిత్‌ మరణించిన రోజును దళిత హక్కుల పోరాట దినంగా ప్రకటించాలని వివిధ ప్రజా, దళిత సంఘాలు ఒక వైపు డిమాండ్‌ చేస్తుండగా, మరోవైపు గుంటూరు కలెక్టర్‌ కార్యాలయం వేదికగా గుట్టుచప్పుడు కాకుండా రోహిత్‌ కులాన్ని బిసిగా మార్చివేయడానికి కుట్ర సాగుతోంది.

Friday, 6 January 2017

# అమెరికా చెప్పిందే... మోదీ చేశారా..? #




* నోట్ల రద్దు వెనక పెద్దన్న హస్తం
* ఏడాది కాలంగా తెరవెనుక కసరత్తు
* అంతర్జాతీయ ఆర్థిక రంగంపై పట్టుకోసం భారీ ప్లాన్‌
* యుఎస్‌ఎఐడి సారథ్యంలో భారతపై ప్రయోగం
* వీసా, మాస్టర్‌ కార్డుల కీలకపాత్ర

* సహకరించిన రఘురామ్‌ రాజన్‌, ఆర్థిక మంత్రిత్వ శాఖ

|| మోడీ యుద్ధంతో ప్రజలు క్షతగాత్రులు ||




          పాలకవర్గాలకు ఎప్పుడూ రెండు పార్శ్వాలుంటాయి. చెప్పేదొకటి, చేసేదొకటి. ఇప్పుడు ప్రధాని మోడీ అదే చేస్తున్నారు. కానీ, ఆయన వెనకున్న వ్యవస్థకు ఒకే లక్ష్యం ఉంటుంది. ఆ వర్గం తన లక్ష్యం నెరవేరేవరకూ నిద్రపోదు, తమ చెప్పుచేతల్లో ఉన్న పాలక వర్గాలను నిద్రపోనివ్వదు. అదే జరిగింది. ప్రధాని మోడీ ఇప్పుడు నిద్రలో కూడా తాను తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని మహోన్నతమైనదిగా కలవరిస్తున్నారు. నగదు రహిత విధానమే ఉత్కృష్టమైనదిగా పలువరిస్తున్నారు. ఈ క్రమంలో దేశం ఏమైనా ఆయనకు బాధలేదు. ప్రజలు ఎన్ని అవస్థలకు గురైనా పరవాలేదు. ఆయన ప్రకటించిన యుద్ధంలో అజేయునిగా ప్రధాని భావిస్తున్నారు. శత్రు దేశంపై వీరోచితంగా పోరాడి శత్రు సైన్యాన్ని తుత్తునియలు చేసి విజయ పతాక ఎగురవేసినట్లు ఊగిపోతున్నారు. ఈ ఉద్వేగంలో ఆయన ఎవరిపై యుద్ధం చేశారో విస్మరించారు. వీరావేశంలో తన దేశ ప్రజలపైనే యుద్ధం చేసిన సంగతి తన మదిలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎవరు విజేతలయ్యారో, ఎవరు పరాజితులయ్యారో, ఎవరు క్షతగాత్రులయ్యారో విస్మరించారు. ఆయన పులిపై స్వారీ చేస్తున్నారు. అవును, ఆయన పరాజితులయ్యారు. ప్రజలు క్షతగాత్రులయ్యారు. ఆయన బాణం గురితప్పింది. మోడీ సంధించిన అస్త్రం లక్ష్యం రహిత కక్ష్యలో వీర విహారం చేస్తున్నది. అది తిరిగి సంధించిన దిశలోనే వెనుదిరిగి పయనించవచ్చు. అయితే, ఆయన వెనుక ఉన్న వ్యవస్థ లక్ష్యం నెరవేరింది. ఆ వర్గాల ప్రయోజనాలు నెరవేరతాయి లేదా నెరవేరే క్రమంలో ఉన్నాయి. అయితే అందుకు ప్రజలు చెల్లించాల్సిన మూల్యం మాత్రం తక్కువేం కాదు. ఇంతకీ, మోడీ సాధించాననుకుంట్ను విజయాలేమిటి? అర్ధరాత్రి జనం మెడపై కత్తి ఉంచి నిరంకుశంగా ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు వెనుక ఉన్న కారణాలేమిటి?

|| రద్దు వెనకున్న కారణాలేమిటి? ||

నోట్ల రద్దు ఆయన సొంత నిర్ణయం కాదు. నోట్ల రద్దు, నగదు రహితం, డిజిటల్‌ ఎకానమీ పేరిట ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) సంస్థల ఆదేశాలు ఇక్కడ కీలక పాత్ర వహించాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ) నెపంతో దేశంలో ప్రవేశించిన బహుళజాతి సంస్థల లక్ష్యాలను ఆయన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఆ విషయం మరుగుపరచి దేశ ప్రజల కోసం శిలువను మోస్తున్న క్రీస్తులా ఆయన ప్రకటనలిస్తున్నారు. విజయం సాధించిందెవరంటే బహుళజాతిసంస్థలు, వాటికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌లాంటి కార్పొరేట్‌ దిగ్గజాలు. వారి లక్ష్యాలు నెరవేరుతున్నాయి. మూడు దశాబ్దాలుగా ప్రపంచీకరణ పేరుతో భారత్‌ లాంటి అభివృద్ధి దిశలో ఉన్న దేశాలను ఎలా వశపర్చుకోవాలో ఆ తంత్రాలు సఫలీకృతమౌతున్నాయి. ఇంతకూ ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు తెరవెనుక చేసిన ఆదేశాలేమిటి? భారత్‌లోని నల్లధనం ఎంతుందో బయటకు తీయాలి. అవినీతిని నిర్మూలించాలి. ప్రపంచీకరణ క్రమంలో తమ కార్పొరేట్‌ దాయాదులు భారత్‌లో చేస్తున్న మీడియేటరీ వ్యాపారాలకు లాభాలు చేకూర్చాలి. నల్లధనమంటే నిజంగా నల్లధనం కాదు. కార్పొరేట్‌ కుబేరులపై పాలకులను దాడులు చేయమని చెప్పదు. ప్రజల దగ్గర ఉన్న లెక్కకు రాని ధనం లెక్కలు ఆ సంస్థలకు కావాలి. అంటే, మధ్యతరగతి ప్రజలు నిత్యావసరాలకు, అత్యవసరాలకు దాచుకున్న నగదు లెక్కలు వారికి కావాలి. ఇంకా చెప్పాలంటే, వంట గదుల్లో పోపుల డబ్బాలపై దాడులు జరగాలి. భారత ప్రజల ఆర్థిక పటుత్వం వారి నియంత్రణలోకి రావాలి. ఇక అవినీతిని నిర్మూలించాలి. అవినీతి అంటే, వారు ఎప్పుడూ అవినీతికి వ్యతిరేకులు కారు. సింగిల్‌ విండోలో లంచాలు ఇవ్వడానికి తమ అనుకూల వర్గాలకు 'క్విట్‌ ప్రో కో' రూపంలో లాభాలు చేకూర్చడానికి అంతర్జాతీయ సంస్థలు వ్యతిరేకం కాదు. 2013లో భారత్‌లో విదేశీ రిటైల్‌ కంపెనీలు నేరుగా పెట్టుబడులు పెట్టే చట్టం ఎఫ్‌డిఐకి పార్లమెంటు ఆమోదం పొందేందుకు, కాంగ్రెస్‌ పాలనలో మన్మోహన్‌ సింగ్‌ హయాంలో అమెరికా ప్రతినిధులు పంపిన నిధులు పార్లమెంటు సభ్యులకు పంచినట్లు, ఆ దేశ సెనెట్‌కు లాబీయింగ్‌ ఖర్చుల కింద లెక్కలుచెప్పిన వార్తలు అటు అమెరికాలోను, ఇటు భారత్‌లోనూ వచ్చాయి. కానీ, వాటిపై విచారణ లేదు. చర్యలేమీ లేవు. అంటే అవినీతికి వారు వ్యతిరేకం కాదని తేలిపోయింది. మరింకేమిటీ? ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ఇతరుల అవినీతి ఆపాలి. విదేశీ సంస్థలు, వారి ప్రతినిధులు మినహా అందరూ నిజాయితీగా ఉండాలి. ఇంకా ఆర్థిక మధ్యవర్తిత్వం వహించే విదేశీ సంస్థలకు లాభాలు కల్పించాలి. ఇవన్నీ జరగాలంటే ఒక్కటే ఆయుధం! దేశంలో అత్యధికంగా 86 శాతం చెలామణిలో ఉన్న నోట్లు రద్దు చేస్తే జనం జేబులో ఉన్న లెక్కలు కలుగులోంచి ఎలుకల్లా బయటకు వస్తాయి. పోపుల డబ్బాలు తెరుచుకుంటాయి. ప్రజల ఆర్థిక సత్తా ఏమిటో బహిర్గతమవుతుంది. పరోక్షంగా భారతదేశ ఆర్థిక శక్తి ఏమిటో అంతర్జాతీయ సంస్థలకు తెలిసిపోతుంది. అప్పుడు దేశం వారి గుప్పెట్లో ఉంటుంది. అలాగే, నోట్లు రద్దు చేస్తే, నగదు కొరత ఏర్పడితే, ప్లాస్టిక్‌ మనీ వినియోగం మొదలవుతుంది. అంటే డిజిటల్‌ ఎకానమీ ఆచరణలోకి వస్తుంది. దీంతో, ఆర్థిక మధ్యవర్తుల లాభాలు పెరుగుతాయి. ఇంకా చెప్పాలంటే, విశ్వసనీయమైన, భద్రతతో కూడిన ఆర్థిక లావాదేవీల సేవలను ప్రయివేట్‌ రంగం నుంచి మాత్రమే అందేట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రయివేట్‌ సంస్థల పట్ల విశ్వాసం పెంచాలి. ప్రజలకు గత్యంతరం లేని స్థితి కల్పించి నగదు రహిత లావాదేవీల వైపు వెళ్లేందుకు కృషిచేయాలి. అవసరమైతే ప్రభుత్వ వ్యయంతో వారికి తాత్కాలిక రాయితీలివ్వాలి. మొబైల్‌ లావాదేవీలు, ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫారాలు విస్తృతంగా వేదికగా లావాదేవీలు జరగాలి. ఇందుకే నోట్ల రద్దు, నగదు రహిత లావాదేవీలంటూ వీరోచిత గౌరవ ప్రధాని, పాలక వర్గాలు గగ్గోలు పెట్టేది. ఇవే మోడీ విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలు. వీటి ద్వారా భవిష్యత్‌లో జనం జీవితాలు బాగుపడతాయట. అయితే, ఏ జీవితాలు బాగుపడతాయో, ఎవరి వ్యాపారాలు బాగుపడతాయో ఆయన చెప్పరు.
అయితే పాలక వర్గ పార్టీ ప్రయోజనాలు కూడా కొన్ని నెరవేరతాయి. ఎన్నికల ముందు నల్లధనం బయటకు తెస్తానని చేసిన గర్జనలు ఇదేనని ప్రజలు నమ్మేస్తారు. నగదు రద్దు వల్ల ప్రభుత్వం ప్రకటించిన 50 రోజుల్లో దాదాపు రూ.15 లక్షల కోట్ల నగదు బ్యాంకులకు చేరాయి. అందులో కనీసం సగానికి కూడా ప్రజలు లెక్కలు చెప్పలేరు. లెక్కచెప్పని ధనానికి సగం ఖజానాకు ఇవ్వాలంటోంది. 35 శాతం పన్ను రూపంలో వసూలు చేసినా, కనీసం ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు ఖజానాకు చేరుతుంది. ఇప్పటికే ప్రభుత్వ దుబారా, విలాసాలు, నాయకుల అవినీతి, కార్పొరేట్ల నిరర్ధక రుణాల రద్దు వంటి వాటితో ఆరు లక్షల 50 వేల కోట్లకు పైగా సర్కారు ఖజానాకు ద్రవ్యలోటు ఉంది. ఇదికాక, ఇప్పుడు నోట్ల రద్దు నిర్ణయంపై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేక స్వరాలను చల్లబరచడానికి, నగదు రహిత లావాదేవీలు ప్రచారం చేయడానికి ఇప్పటికే లక్షా 46 వేల కోట్ల రూపాయలు ప్రచార సాధనాలకు ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా ఖజానాకు అదనంగా లోటు. వెరసి ఏడున్నర లక్షల కోట్లు బ్యాంకుల్లో చేరుకున్న ప్రజల ధనంతో సర్కారు ద్రవ్య లోటును భర్తీ చేసుకోబోతున్నది. అంటే, ఒక దెబ్బకు రెండు పిట్టలు. ఒక వైపు తమ వెనుక ఉన్న కార్పొరేట్‌ ప్రయోజనాలు నెరవేరతాయి. మరో వైపు ఖజానా నిండుతుంది. ఈ క్రమంలో ప్రధాని విజయం సాధించాననుకుంటే పొరబాటే. దేశవ్యాప్తంగా ఏడున్నర కోట్ల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక వృద్ధి రానున్న రెండేళ్లలో సగానికి సగం పడిపోతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. నగదు రహిత లావాదేవీలను బలవంతంగా రుద్దడం వల్ల అంతర్గత ఆర్థిక సంక్షుభిత పరిస్థితులు ఏర్పడతాయి. ఈ పరిస్థితికి బిజెపి చేతులెత్తేయడం తప్ప ఏమీ చేయలేదు. అప్పుడు కూడా ''నాకు ఏమీ అవసరం లేదు, సర్వ 'సంఫ్‌ు' పరిత్యాగిని, తట్టా బుట్టా సర్దుకుని వెళ్లిపోతా''నంటారు.
అమెరికా వంటి అగ్ర రాజ్యంలో, అభివృద్ధి చెందిన దేశంలో 40 శాతానికి పైగా కరెన్సీ అందుబాటులో ఉంది. మరి 64 శాతం ప్రజలు బ్యాంకుల ముఖం చూడని దేశంలో, 55 శాతం మంది వ్యవసాయ రంగంలో, 65 శాతానికి పైగా నిరక్షరాస్యులుగా ఉన్న దేశంలో వంద శాతం డిజిటల్‌ ఎకానమీ ఎలా అమలు చేస్తారు? ప్రజలను ఆర్థిక దళారీ సంస్థలు దోచుకోకుండా ఎలా అదుపు చేయగలరు? ఒక అంచనా ప్రకారం సర్కారు చెబుతున్న డిజిటల్‌ మాయలో వంద రూపాయలను 20 మంది మధ్య నగదు మార్పిడి చేస్తే, దాని విలువ సున్నా అవుతుంది. అందుకే, కార్పొరేట్‌ వ్యూహం ఫలించింది. ప్రజలు క్షతగాత్రులయ్యారు. మోడీ పరాజితులయ్యారు. యుద్ధం గురి తప్పింది.
- కొల్లూరు వెంకట్‌ 

|| బిజెపి దుష్ట సేన గుట్టు రట్టు ||



              స్వాతీ చతుర్వేది రాసిన 'అయామ్‌ ఎ ట్రోల్‌' అనే పుస్తకం కొద్ది రోజుల క్రితం మార్కెట్‌లోకి వచ్చింది, అంతర్జాలం (ఇంటర్నెట్‌)లోని తన ప్రత్యర్థులపై ఒక ప్రణాళిక ప్రకారం బిజెపి ఎలా దాడులు చేస్తుందో ఈ పుస్తకం కళ్ళకు కట్టినట్టు వివరించింది. బిజెపి నడుపుతున్న దుష్ట సేన నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది. అంతర్జాలంలో నిత్యం బిజెపి చేస్తున్న దాష్టీకం గురించి మనకు తెలుసు. 

Wednesday, 4 January 2017

# సైన్సు కాంగ్రెస్సా, తీర్థయాత్రా? #



తిరుపతిలో జరుగుతున్న 104వ సైన్సు కాంగ్రెస్‌ను మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతగా భ్రష్టు పట్టించాలో అంతగానూ పట్టిస్తున్నారు.ముఖ్యమైన విషయం, సైన్సు కాంగ్రెస్సుకూ, తీర్థ యాత్రల కార్యక్రమానికీ తేడా లేకుండా మార్చేస్తున్నారు. సైన్సు కాంగ్రెస్‌లో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని మోడీ శాస్త్ర మహాసభను ప్రారంభించిన తరువాత నేరుగా తిరుమల వెళ్లి దేవుని పూజలు చేశారు. ప్రధాని యొక్క భక్తి అనేది ఆయన వ్యక్తిగత విషయం. ఆయన దేవుని పూజలు చేయడాన్ని కూడా ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఆ పనిని వేరే సందర్భంలో చేయవచ్చు లేక ప్రత్యేకంగా పూజాదికాలు నిర్వహించడానికి వేరే సందర్భంలో రావచ్చు. కానీ దేవుని ఉనికినే ప్రశ్నిస్తున్న సైన్సుకు సంబంధించిన మహాసభలు జరుగుతూ ఉంటే దానికి ప్రధాని హోదాలో వచ్చిన వ్యక్తి ముందుగా దైవ పూజలు చేస్తే ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఎలాంటి సందేశం వెళుతుంది. దైవ భావానికీ, సైన్సుకూ ఏమాత్రం వైరుధ్యం లేదని, ఇంకా చెప్పాలంటే సైన్సు దేవుని ముందు మోకరిల్లాలనే సందేశం వెళ్లదా?
దైవ భావానికీ, సైన్సుకూ వైరుధ్యం లేదని ప్రధాని నమ్మవచ్చు. ఆ మహాసభకు వచ్చిన శాస్త్రవేత్తల్లో కూడా చాలా మందికి ఆ నమ్మిక ఉండవచ్చు. కానీ దైవ భావం సైన్సుకు విరుద్ధమనీ, సైన్సు దైవ భావాన్ని అంగీకరించదనీ నమ్మేవారు కూడా చాలా మంది ఉంటారు కదా! మరి వారి మాటేమిటి? వారి నమ్మికకు ప్రధాని విలువనివ్వనక్కరలేదా? ప్రధాని కొంతమందికీ, కొన్ని భావాలు నమ్మేవారికీ మాత్రమే ప్రధానా లేక ప్రజలందరికీ ప్రధానా?
సైన్సు కాంగ్రెస్‌లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి ప్రసంగం మరీ వికృతంగా ఉంది. సైన్సుకు భగవంతుని సహకారం కావాలట. ''ఎక్కువ మంది శాస్త్రవేత్తలు దైవదర్శనం చేసుకోవచ్చనే కుటుంబ సభ్యులతో సహా తరలివచ్చారు. ప్రతి హిందువూ జీవితంలో ఒక్కసారైనా తిరుపతికి రావాలనుకుంటారు. తిరుపతి ఆధ్యాత్మిక, మత నగరం. వేదాలు, యోగా కూడా ముఖ్యమైనవి. వేదాల్లో పుట్టిన యోగాకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది'' అని చంద్రబాబు నాయుడు సైన్సు కాంగ్రెస్‌లో ప్రసంగించి ఆ మహాసభ స్ఫూర్తినే దెబ్బతీశారు. ఆయన ఆదేశాలో ఏమో సైన్సు కాంగ్రెస్‌కు వచ్చిన శాస్త్రవేత్తలందరినీ దైవదర్శనం కోసం తిరుమల తీసుకువెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాసభలు జరుగుతున్న ఎస్‌వి యూనివర్శిలో దీనికోసం ఒక ప్రత్యేక కౌంటరే ఏర్పాటు చేశారు.
ప్రధాని, ముఖ్యమంత్రి ఇద్దరూ రాజ్యాంగ పదవులు నిర్వహిస్తున్న వ్యక్తులే. నిన్ననే మన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు గురించి వారికి తెలియదనుకోడానికి లేదు. ''లౌకిక వాదం మన రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగం. మతమనేది వ్యక్తిగత విషయం. రాజ్య వ్యవహారాలను మతంలో కలపడానికి వీల్లేదు. లౌకిక రాజ్యం ఏ మతంతోనూ గుర్తింపు పొందకూడదు'' అని ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఠాకూర్‌తో సహా ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొన్నది. ప్రధాని, ముఖ్యమంత్రి సైన్సు కాంగ్రెస్‌లో చెప్పిన మాటలుగానీ, వ్యవహరించిన తీరుగానీ మన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయన్న విషయం ఉన్నత న్యాయస్థానం తీర్పును బట్టే అర్థమవుతోంది.
శాస్త్రీయ దృక్పథం ఉన్న వారు ఎవరూ సైన్సుకు దేవుని అవసరం ఉందని చెప్పరు. ఎందుకంటే ''ఇప్పటి వరకూ జరిగిన సైన్సు పరిశోధనల్లో ఎక్కడా దేవుని అవసరం రాలేదు'' అని ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకిన్స్‌ చెప్పారు. దేవుడు-సైన్సు గురించిన విషయమై ఆయన రెండేళ్ల క్రితం స్పెయిన్‌కు చెందిన ఎల్‌ ముండో పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు : ''మనం సైన్సును అర్థం చేసుకోక ముందు ఈ విశ్వాన్ని దేవుడు సృష్టించాడని నమ్మడం సహజం. కానీ ఇప్పుడు విశ్వ సృష్టికి సంబంధించి సైన్సు మరింత సమర్థవంతమైన వివరణ ఇస్తోంది. మతం అతీతశక్తులను నమ్ముతుంది. కానీ సైన్సుతో అవి పొసగవు. నా ఉద్దేశంలో వాస్తవిక ప్రపంచంలో మానవ మేధస్సుకు అందనిదేదీ లేదు...''
వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు సైన్సుకు దేవుని సహకారం అవసరం లేదు. సైన్సు-సాంకేతిక సహకారం లేకుండా ప్రపంచంలో దైవ భావనే నిలవదు. మన టెలివిజన్‌, సినిమాలు, పుస్తకాలు... ఇంకా సైన్సు-టెక్నాలజీ సృష్టించిన అనేక ఆవిష్కరణలను నేడు ప్రజల్లో దైవ భావం ప్రచారం చేయడానికే ఉపయోగించుకుంటున్నారు గానీ ప్రజల్లో శాస్త్రం గురించీ, శాస్త్రీయ ఆలోచనల గురించీ ప్రచారం చేయడానికి ఉపయోగించడం లేదు. మనం పొద్దున్నే లేచి టీవీ ఆన్‌ చేస్తే చాలు డజన్ల కొద్దీ ఛానళ్లలో దైవ ప్రచారం జరిగిపోతూనే ఉంటుంది. కానీ శాస్త్రీయ ప్రచారం చేయడానికి ఒక్క ఛానల్‌ కూడా లేదు. అభివృద్ధి చెందుతున్న ప్రతి టెక్నాలజీనీ మత ప్రచారం కోసం పాలక వర్గాలు ఉపయోగించు కుంటున్నాయి. 
సైన్సుకు మతం సహకారం కావాలని ఈ రోజు చెబుతున్న వాళ్లు, సైన్సు కాంగ్రెస్‌ను మత నమ్మకాలతో భ్రష్టుపట్టిస్తున్న వాళ్లు చరిత్రలో సైన్సుకూ, మతానికీ జరిగిన యుద్ధం గురించి తెలుసుకుంటే మంచిది. చరిత్రలో సైన్సు వేసే ప్రతి ముందడుగూ మత నమ్మకాలతో జరిగిన యుద్ధంలో గెలవడం ద్వారానే జరిగింది. సైన్సు ప్రశ్న నుంచి ఉద్భవించింది. మతం ప్రశ్నను అణచేయడానికి చేయని ప్రయత్నం లేదు. పాల్పడని దుష్కృత్యం లేదు. సైన్సును అణచివేయడానికి శాస్త్రవేత్తల పరిశోధనలపై మతం ఎన్నెన్ని ఆంక్షలు పెట్టింది. ఎన్నెన్ని నిర్భంధాలు విధించింది. ఎన్నెన్ని అకృత్యాలకు పాల్పడింది. బ్రూనోను నిలువునా కాల్చి చంపింది. చార్వాకులను చెండాడింది. గెలీలియో అంతటి మహానుబావుణ్ణి గృహనిర్బధంలో పెట్టి చావుకు కారణమైంది. అయినా శాస్త్రీయ దృక్పథాన్ని ఆధారంగా చేసుకుని సైన్సు అభివృద్ధి చెందింది. మతం చెప్పిన నమ్మకాలను పటాపంచలు చూస్తూ ముందుకు నడిచింది.
సైన్సుకూ, మతానికీ మధ్య పోరాటం నేటికీ నడుస్తూనే ఉంది. దురదృష్టమేమంటే ఈ రోజు సైన్సును పాతరేసి, మతాన్ని ముందుకు తెచ్చే పచ్చి ఛాందస శక్తులు అటు కేంద్రంలోనూ, ఇటు మన రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చాయి. మూఢనమ్మకాలను సైన్సు పేరుతో ప్రచారం చేసే మోసకారులు మేధావులుగా చెలామణి అవుతూ అన్నీ వేదాల్లోనే ఉన్నాయష అని నిత్యం అఘోరిస్తూ ఉంటే శాస్త్రీయ దృక్పథం కలిగిన వారి గొంతుక వినిపించకుండా పోతోంది. మహామహా శాస్త్రవేత్తలమని చెప్పుకుంటున్నవారు కూడా మతం కాళ్ల మీద పడి పొర్లు దండాలు పెడుతుంటే దేశంలోని యువతకు విజ్ఞాన శాస్త్ర స్ఫూర్తి ఎక్కడి నుంచి వస్తుంది. స్వాతంత్య్రానంతరం మన దేశం విజ్ఞాన శాస్త్రంలో ఒక్క నోబెల్‌ బహుమతి కూడా సాధించలేకపోవడానికి కారణం, శాస్త్ర పరిశోధనల్లో మనం వెనుకబడి పోవడానికి కారణం శాస్త్ర విజ్ఞానం పట్ల పెరుగుతున్న ఈ అశాస్త్రీయ దృక్పథమే కాదా!
గతంలో ఢిల్లీలో జరిగిన ఒక సభలో ప్రధాన మంత్రి వినాయకుని గురించి 'కథ' చెప్పారు. 'ఆ కాలంలోనే' మన వాళ్లు మనిషి శరీరానికి ఏనుగు తల తెచ్చి ప్లాస్టిక్‌ సర్జరీ చేశారని పేర్కొన్నారు. ప్రధాని అంతటివాడు ఇటువంటి ఫార్సులను మాట్లాడుతుంటే ఆ సభలో ఏ ఒక్క శాస్త్రవేత్తా ఖండించలేకపోయాడు. పోనీ కనీసం తరువాతనైనా దాన్ని ఖండిస్తూ ఏ శాస్త్రవేత్తా మాట్లాడలేకపోయాడు. ముంబయిలో జరిగిన 102వ సైన్సు కాంగ్రెస్‌లో 'పురాణ సైన్సు' గురించి పత్రం ప్రవేశపెడుతూ పురాణ కాలంలోనే మనవాళ్లు నేటికి మించిన టెక్నాలజీ కలిగిన విమానాలు తయారు చేశారంటే ఒక్క శాస్త్రవేత్త కూడా ఖండించలేకపోయారు. ఇప్పుడు 104వ కాంగ్రెస్‌లో సైన్సు కన్నా మత ప్రచారం ఎక్కువగా చేస్తుంటే అక్కడున్న మన శాస్త్రవేత్తలు ఒక్కరూ మాట్లాడలేకపోయారు. మన శాస్త్రవేత్తలు మనల్ని ఎటు తీసుకుపోతున్నారు? మన సైన్సు ఎటు పోతోంది?
ఇదంతా సైన్సుపై ఛాందసవాదం జరుపుతున్న దాడి. దీన్ని ఖండించాలి! ఎదిరించాలి! ఓడించాలి!
- ఎస్‌ వెంకట్రావు

Tuesday, 3 January 2017

|| పెద్దనోట్లు రద్దు - పర్యవసానాలు ||




                ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2016 నవంబరు 8న పెద్ద కరెన్సీ నోట్లు (రూ.500, రూ.1000) రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ప్రకటించిన తొలి దశలో కొంత సానుకూల వాతావరణం కనిపించింది. ఈ చర్య ప్రధాని చెప్పిన నల్లధనం, అవినీతి, దొంగనోట్ల నిర్మూలనకు తోడ్పడుతుందని సామాన్య ప్రజల్లో అనేకులు భావించారు. అందువల్ల కొంత తాత్కాలిక ఇబ్బంది ఉన్నప్పటికీ అవకాశం ఇచ్చి చూడాలని భావించారు. కానీ, రెండు, మూడు రోజుల్లో నగదు (కొత్త నోట్లు) అందుబాటులోకి తెస్తామని చెప్పిన ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేక పోయింది. అందువల్ల నగదు ఉపసంహరణపై పరిమితులు విధించింది. ఈ పరిమితులకు లోబడి కూడా నగదు సరఫరా సవ్యంగా సాగలేదు. తీవ్రమైన నగదు కొరత చోటుచేసుకుంది. సామాన్య ప్రజలు బ్యాంకుల్లో ఉన్న తమ డబ్బును కనీస అవసరాల కోసం కూడా వినియోగించుకోలేక తీవ్రమైన ఇబ్బందులకు లోనయ్యారు. 86 శాతం నగదును రద్దుచేసిన ప్రభుత్వం తొలి దశలో 10 శాతం మేరకు మాత్రమే కొత్త కరెన్సీని విడుదల చేసింది. రూ.2000 నోటును కొత్తగా ప్రవేశపెట్టింది. కొత్త నోట్ల సైజు మార్చింది. ఇందువల్ల ఎటియంలను సరిచేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కారణాల వల్ల బ్యాంకులు, ఎటియంల వద్ద ప్రజలు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వచ్చింది. ఇప్పటికీ ఈ పరిస్థితి కొనసాగుతోంది. ప్రజలు ఈ సమస్య పట్ల చూపిన సంయమనాన్ని మోడీ నిర్ణయానికి సమర్థనగా బిజెపి ప్రచారం చేసుకుంటోంది. కానీ అది సరికాదు. మన సమాజంలో ప్రశ్నించే తత్వం సన్నగిల్లిందని, మధ్యతరగతి ప్రజల్లో యథాతథవాదం ప్రబలిందని చెప్పడానికి ఇది ఒక తార్కాణం. సంప్రదాయక కర్మవాదం ప్రభావాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయలేము.
డబ్బు మన జీవితాన్ని ఎలా శాసిస్తోందో ఈ అనుభవం మరోసారి తెలియజెప్పింది. తమ శ్రమ ఫలితాన్ని అనుభవించడానికి డబ్బు అనే మారకం అవసరం కావడం మానవులు ఎదుర్కొంటున్న పరాయీకరణలలో ఒకటి అన్న మార్క్స్‌ భావనను ఇక్కడ మనం గుర్తుచేసుకోవాలి. నల్లధనమెవరివద్ద ఉందో ప్రభుత్వానికి సమాచారం తప్పనిసరిగా ఉంటుంది. వారిలో నుంచి స్వచ్ఛంద ప్రకటన అవకాశాన్ని ఉపయోగించుకోని వారిపై దాడుల చేస్తే నల్లధనాన్ని చాలా భాగం వెలికితీయడం సాధ్యమై ఉండేది. 2017 మార్చి 30 వరకు మరలా కొత్త స్వచ్ఛంద ప్రకటన అవకాశాన్ని ఇచ్చిన ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయకుండా అట్టి అవకాశం ఇచ్చి ఉంటే ప్రజలకు ఇన్ని ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థ అస్థిరతకు గురికావడం తప్పి ఉండేవి. కానీ అలా చేయలేదు. జనాభాలో 3 శాతంగా ఉండే నల్లధనికుల గురించి 97 శాతం ప్రజానీకాన్ని వారాల తరబడి క్యూలలో నిలబెట్టింది. పైగా అలా నిలబడడం వారి దేశభక్తికి నిదర్శనం అంటోంది. ఇదంతా ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ ధోరణిని వెల్లడిస్తుంది. ప్రజల సమస్యల పట్ల ఆశ్చర్యకరమైన నిర్లక్ష్యాన్ని, స్పందనారాహిత్యాన్ని ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తోంది. కళ్ళకు కట్టినట్లు వాస్తవం ఎదురుగా ఉంటే, ప్రధానమంత్రి మాత్రం తమది ప్రజా సమస్యలకు స్పందించే ప్రభుత్వమని వితండవాదన చేస్తున్నారు.
ప్రధానమంత్రి ప్రకటించిన లక్ష్యాల వెనుక బహిర్గతం చేయని ఎజెండా ఉంటుంది. అదేమిటనే అంశంపై సహజంగానే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేట్‌, పెట్టుబడిదారీ శక్తులకు ప్రాతినిథ్యం వహిస్తోంది. భారతదేశంలో పెట్టుబడిదారీ విధానాన్ని అప్రతిహతంగా అభివృద్ధి చేయడం దాని ప్రధాన కార్యక్రమం. నయా ఉదారవాద విధానాలను (అంటే ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వ పాత్రను కనీస స్థాయికి పరిమితం చేయాలని, దేశ ఆర్థిక వ్యవస్థకు మార్కెట్‌ మాత్రమే చోదకశక్తిగా ఉండాలని చెప్పే విధానాలు) అది అనుసరిస్తున్నది. ఈ విధానాలను దూకుడుగా అమలుచేయడం కోసం కార్పొరేట్‌ శక్తులు పెద్ద ఎత్తున నిధులు అందించడం ద్వారా, మీడియా ప్రచారం ద్వారా మోడీ గెలుపుకు తోడ్పడ్డాయి. అయితే భారతదేశంలో పెట్టుబడిదారీ విధానానికి కొన్ని అంతర్గత బలహీనతలు ఉన్నాయి. నల్లధనం, అవినీతి, సంపదను భూమి, బంగారాల రూపంలో మదుపుచేయడం, ఇప్పటికీ 68 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాలలో నివసించడం, 55 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవించడం లాంటి అంశాలు పెట్టుబడి సమీకరణకు అవరోధాలుగా తయారయ్యాయి. ఉత్పత్తి సేవల రంగాలలోకి పెద్దఎత్తున దేశీయ పెట్టుబడి రావడానికి ఇవి అడ్డంకి అవుతున్నాయి. మరోపక్క విదేశీ పెట్టుబడి కూడా అనుకున్న స్థాయిలో రావడం లేదు. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమానికి అవసరమైన శ్రామికశక్తి సిద్ధంగా లేదు. శ్రామిక నైపుణ్యాల లోపం మరో సమస్య. పెట్టుబడి సమీకరణకున్న ఈ అడ్డంకుల్ని తొలగించడం పెద్ద నోట్ల రద్దు వెనుక ఉన్న అసలు లక్ష్యమేమో పరిశీలించాలి.
తృతీయ ప్రపంచ దేశాల్లోని పెట్టుబడిదారీ విధానం ఇప్పటికీ ఆదిమ పెట్టుబడి సంచయం ద్వారా పెట్టుబడిని సమీకరించాల్సిన దశలోనే ఉందనే అభిప్రాయం కొన్ని మార్క్సిస్టు శ్రేణులలో ఉంది. పెట్టుబడి సమీకరణకు, దాని స్వేచ్ఛా చలనానికి, పారిశ్రామిక శ్రామికశక్తి రూపొందడానికి ఉన్న అడ్డంకుల్ని బలవంతంగా తొలగించడం ఆదిమ పెట్టుబడి సంచయం లక్ష్యం. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల చిన్న రైతాంగం, చిన్న వ్యాపారస్తులు, చిన్న పరిశ్రమదారుల ఆర్థిక పునాదులు దెబ్బతినే అవకాశం ఉంది. విస్తృతమైన అసంఘటిత రంగం, దానిపై ఆధారపడి జీవించే వీధి అమ్మకందార్లు, కార్మికులు, కూలీలు మరింత అస్థిరతకు లోనవుతారు. వీరిలో అత్యధికుల్ని ఈ రంగాల నుంచి తొలగించి విదేశీ పెట్టుబడికి, మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమానికి, దేశీయ పరిశ్రమలకు అవసరమైన చౌక శ్రామికశక్తిలో భాగం చేసే వ్యూహం కూడా ఈ నిర్ణయం వెనుక ఉండొచ్చు. ఈ క్రమానికి తోడ్పడే అంశంగానే 'తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థ' (నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా కొందరు చెబుతున్నది ఒక అభూతకల్పన మాత్రమే) కోసం చేస్తున్న ప్రచారాన్ని, ప్రయత్నాలను చూడాలి. దీనిని, రాబోయే వస్తుసేవల పన్ను వ్యవస్థతో కలిపి చూస్తే, పన్నుల ఎగవేతను అరికట్టడం తమ లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది. ఇది తప్పనిసరిగా సాధించాల్సిన విషయమే. అయితే దీని వల్ల ఆర్థిక వ్యవస్థ అట్టడుగున ఉన్న చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు, చేతివృత్తులు దెబ్బతినే అవకాశం ఉంది. వీరిపై కొరడా ఝుళిపిస్తామంటున్న ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు ఏటేటా ధారాదత్తం చేస్తున్న వందల, వేల కోట్ల రూపాయల పన్ను రాయితీలను ఆపగలదా అని మనం ప్రశ్నించాలి. పెట్టుబడి లాభాలపై పన్ను విధించడానికి ఎందుకు వెనుకాడుతోంది అని మనం ప్రభుత్వాన్ని అడగాలి. అంటే, పైకి సానుకూల లక్ష్యాలుగా కనిపించేవాటిలో ఉండే అంతరార్థాన్ని విడమర్చి చూడాల్సిన అవసరాన్ని మనం గుర్తించాలి.
ఆధునిక ఆర్థిక వ్యవస్థలో భాగంగా నగదు రహిత చెల్లింపుల వైపు క్రమేపీ అందరూ మారాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం అవగాహన పెంపొందించడానికి ప్రయత్నాలు కూడా అవసరమే. అయితే, భారతదేశ వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా దీన్ని అత్యంత ప్రాధాన్యతగల అంశంగా పరిగణిస్తూ, వెనువెంటనే అమలులోకి తీసుకురావడానికి ప్రభుత్వాలు చూపిస్తున్న అత్యుత్సాహం అనవసరం అనిపిస్తోంది. విచక్షణారహితమైన తొందరపాటును, అసహనాన్ని అవి ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు చెల్లింపు సేవల సంస్థల వ్యాపారం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. ఇదంతా చూస్తే, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి, అంతర్జాతీయ వ్యాపార సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా మన ప్రజల్ని తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వాలు ఆరాటపడుతున్నాయనిపిస్తోంది. పెట్టుబడిదారీ విధాన అభివృద్ధికి ఇది ఒక అత్యవసర చర్యగా అవి భావిస్తున్నాయి.
పెద్ద నోట్ల రద్దు వల్ల బ్యాంకుల్లో నిల్వలు పెరిగాయి. దీనికి తక్కువ నగదు వ్యవస్థను జోడిస్తే బ్యాంకుల్లో భారీ నగదు నిల్వలు దీర్ఘకాలం పాటు స్థిరంగా ఉంటాయనేది ప్రభుత్వ అంచనా కావచ్చు. దీనివల్ల ప్రభుత్వానికి మరో ప్రయోజనం కూడా ఉంది. నిరర్థక ఆస్తుల వల్ల బలహీనపడిన బ్యాంకుల ఆర్థిక పునాదుల్ని ఈ నిల్వలతో బలోపేతం చేయవచ్చు. అయితే ఇక్కడ రెండు అంశాలు గమనించాలి. 1. బ్యాంకుల ప్రస్తుత రుణ విధానాన్ని మార్చకపోతే కొత్త రుణాలలో అధిక భాగం కార్పొరేట్‌, ధనిక వర్గాలకే వెళ్తాయి. చిన్న ఉత్పత్తిదారులకు, రైతాంగానికి ఒనగూడే అదనపు ప్రయోజనం ఉండకపోవచ్చు. 2. నగదు మొత్తం మీద బ్యాంకింగ్‌ వ్యవస్థలోనే కొనసాగడం వలన బ్యాంకులు ఇచ్చే రుణాల సంఖ్య, విలువ గణనీయంగా పెరుగుతాయి. నిరర్థక ఆస్తులు మరింతగా పెరగడాన్ని నిరోధించలేకపోతే బ్యాంకుల ఆర్థికశక్తి దెబ్బతిని క్రమేపీ ఆర్థిక మాంద్యానికి దారి తీయవచ్చు.
పెట్టుబడిదారీ విధాన ప్రస్తుత దశలో ఈ నోట్ల రద్దు పాలక వర్గాలకు, వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోడీ ప్రభుత్వానికి ఇప్పుడు ఎందుకు అవసరం అయిందనేది ఇక్కడ ప్రధానాంశం. పేదల కోసం ఉద్దేశించబడిందిగా ప్రధానమంత్రి పదేపదే చెబుతున్న ఈ నిర్ణయం అమలు తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? దాదాపు మొత్తం నల్లధనం బ్యాంకుల్లోకి వచ్చేస్తుందని అంచనా వేస్తున్నారు. రూ.3 లక్షల కోట్ల నల్లధనం బ్యాకుల్లో రాకుండా ఉండిపోతుందని, ఆ మిగులును ప్రజాపయోగ కార్యక్రమాలకు వినియోగిస్తామని చెప్పిన విషయం నీటిమూటగా మిగిలిపోతుంది. ఈ ప్రతికూల ఫలితాన్ని ఎదుర్కోవడానికే ఆదాయ పన్ను విధానం చేసే దాడుల ద్వారా కొంత ధనాన్ని ఖజానాకు తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లున్నది. తగుమొత్తంలో నగదు సిద్ధం చేసుకోకుండా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని అడిగితే, గోప్యత కోసమని ప్రభుత్వం సమాధానం చెబుతోంది. కానీ ఈ గోప్యత వల్ల సాధించింది అతి స్వల్పమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, బ్యాంకుల్లోకి వచ్చిన నల్లధనం పెట్టుబడి సంచయానికి తోడ్పడవచ్చు. ప్రభుత్వం నల్లధనాన్ని గుర్తించి పన్నులు వసూలు చేయగలిగితే ప్రభుత్వాదాయం పెరుగుతుంది. అలా చేయలేకపోతే నల్లధనాన్ని చట్టపరమైనదిగా చేసుకోవడానికి ప్రభుత్వం సహకరించినట్లవుతుంది. అయితే నల్లధనం మరలా పోగుపడదనే భరోసా మాత్రం ఏమీ ఉండదు. ఇదంతా కూడా నల్లధనంలో నగదు రూపంలో ఉన్న 10 శాతం కంటే తక్కువ మొత్తం గురించే. నల్లధనంలో కనీసం 90 శాతం భూమి, బంగారం, విదేశీ డిపాజిట్ల రూపంలో ఉందనేది నిపుణుల అభిప్రాయం. వీటిపై చర్యలు లేకుండా నగదు రూపంలోని నల్లధనం గురించి మాత్రమే మాట్లాడటం కొండను తవ్వి ఎలుకను పట్టడమే. భూమి, బంగారం విషయాలలో ప్రభుత్వం తీసుకుంటానని చెబుతున్న చర్యలు తీసుకోగలదో, లేదో వేచిచూడాలి. విదేశాలలోని నల్లధనం విషయంలో మాత్రం ఇంకా మౌనమే రాజ్యమేలుతోంది. ఇక నకిలీ కరెన్సీ విషయానికొస్తే (దేశంలో మొత్తం నకిలీ కరెన్సీ రూ.400 కోట్లు మాత్రమే అని అధికారిక అంచనాలు న్నాయి.) రూ.2000లకు ఇప్పటికే నకిలీ నోట్లు వచ్చాయి. కనుక ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైనట్లుగా భావించాలి. ఉగ్రవాదానికి ఈ నోట్లు ఉపయోగపడకుండా చేయడంలో విజయం సాధించడం కూడా ప్రశ్నార్థకమే. అవినీతిని అరికట్టడం కూడా అనుమానాస్పదమే. ఎందుకంటే అవినీతి వ్యవస్థ మూలాలలో ఉంది. పెద్ద నోట్లు ఉండటం వల్ల వచ్చింది కాదు. చిన్న నోట్ల ద్వారా లేదా వస్తు రూపంలో, ఇతర ప్రయోజనాల రూపంలో అది కొనసాగుతుంది. మౌలిక వ్యవస్థాగత సంస్కరణలు, ప్రజా చైతన్యం ద్వారా మాత్రమే అవినీతిని అరికట్టడం సాధ్యమౌతుంది.
ఇవన్నీ అలా ఉంచితే, ఈ చర్య ఒక తీవ్రమైన ఆర్థిక విపరిమాణానికి దారితీస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనానికి గురవుతుందని, స్థూల జాతీయోత్పత్తి(జిడిపి) 2016-17లో సగానికి సగం పడిపోతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఇబ్బందులు తాత్కాలికమేనని, దీర్ఘకాలంలో సానుకూల ఫలితాలు వస్తాయని, ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందని ప్రభుత్వం చెబుతోంది. నమ్మడం, నమ్మకపోవడం ఇక ప్రజల వంతు. ఇవన్నీ పరిశీలించిన పిమ్మట, ఈ చర్య తీసుకోవడంలో ప్రభుత్వ ప్రధాన లక్ష్యం పెట్టుబడి సంచయాన్ని పెంపొందించడం, విదేశీ పెట్టుబడికి మరింత సానుకూల వాతావరణాన్ని ఏర్పర్చడం, చిన్న ఉత్పత్తి రంగం స్థానే బడా పెట్టుబడిని ప్రోత్సహించడం, మిగులు (చౌక) శ్రామికశక్తిని అందుబాటులోకి తీసుకురావడంగా అనిపిస్తున్నది. నల్లధనం, అవినీతి వల్ల మాత్రమే ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుందనే ప్రచారం సాగుతోంది. పెట్టుబడిదారీ విధానపు సారాంశమైన లాభార్జనకు ఆధారభూతమైన శ్రమ దోపిడీని మార్మీకరించే ప్రయత్నం ఇందులో ఇమిడి ఉంది. ఈ మొత్తం అంశాన్ని మార్క్సిస్టు దృష్టి కోణం నుంచి మరింత లోతుగా పరిశీలించడానికి ప్రయత్నం జరగాలి.  - ఎన్‌ అంజయ్య

Monday, 2 January 2017

|| ఈ యుగం సాంస్కృతిక యోధురాలు ||



            భారతదేశంలో సాంస్కృతిక విప్లవాన్ని ప్రజ్వలింపజేసిన మహోన్నత మానవతామూర్తి సావిత్రీబాయి ఫూలే. ఆమె సామాజిక విముక్తి దాత. కొడిగట్టిన నిరక్షర దివ్వెలకు వెలుగులు అందించిన ప్రజ్వలన శీలి. కులాలను, మతాలను నిర్మూలించే క్రమంలో సామాజిక విప్లవ కార్యాచరణను అనుభూతం చేసుకున్న కార్యశీలి. స్త్రీల వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఒక యుగకర్తగా నిలబెట్టిన నాయకురాలు ఆమె. మహాత్మా ఫూలేకు అండగా నిలిచి ఆయన పోరాటాల్లో, కార్యక్రమాల్లో, సంస్కరణల్లో, విప్లవాల్లో ఆయువుగా వారిరువురి జీవితాలు విడదీయరానివిగా సాగాయి. దేశ చరిత్రలోనే భార్యాభర్తలు సామాజిక సేవలో ఇంత మమేకమై చేసినవారు లేరు. కొందరు జాతీయ నాయకుల కుటుంబాల్లో ఎన్నో కలహాలు ఉండేవి. ఒకరి జీవితాలకు ఒకరి పొంతన ఉండేది కాదు. అయితే సావిత్రీబాయి ఫూలే తన భర్త క్రియాశీలకమైన కృషిలో భాగస్వామిగా ఉండేది. వీరిరువురూ కలిసి రాత్రి స్కూలును తమ ఇంట్లోనే నడిపారు. దళిత స్త్రీల విముక్తికి విద్య మూల హేతువని సావిత్రీబాయి అప్పుడే గుర్తించారు. వీరి మార్గంలోనే అంబేద్కర్‌ విద్యను ప్రధాన నినాదంగానూ, ఆయుధంగానూ స్వీకరించారు. నిజానికి బుద్ధుని దగ్గర బోధనను అందుకున్న అంబేద్కర్‌ సావిత్రీబాయి, మహాత్మా ఫూలే దగ్గర విద్య అనే ఆయుధాన్ని స్వీకరించారు. 1830 వరకు శూద్ర స్త్రీలకు, దళితులకు విద్యను ఊహించే పరిస్థితుల్లో భారతదేశం లేదు. ముఖ్యంగా అగ్రవర్ణ ఆధిపత్యానికి, హిందూవాద నియంతృత్వానికి, బ్రాహ్మణవాద సంస్కృతీ జటిలత్వానికి కంచుకోట అయిన మరాఠా రాజ్యం స్త్రీలను అతి దారుణంగా అణచివేసింది. మరాఠా పీష్వాలు శూద్రులను, దళితులను, స్త్రీలను అణచివేశారు. అందుకే జ్యోతిరావు ఫూలే తన భార్యను ఒక బానిసగా కాకుండా ఒక వ్యక్తిత్వమున్న ఉపాధ్యాయురాలిగా, నాయకురాలిగా తీర్చిదిద్దారు. సావిత్రి తన భర్త అనే జ్యోతికి ఒక నూనెలా వ్యవహరించింది. అంటే ఆమె లేకపోతే ఆ జ్యోతికి వెలుగు లేదు అన్నంతగా మమేకమయ్యింది. ఆమె సహచర్యం వల్ల మహాత్మా ఫూలే ఆలోచనలు స్త్రీల వైపు మళ్ళాయి. మహాత్మా ఫూలే అందరి స్త్రీలనూ శూద్రులుగానే భావించారు. ఆయన బ్రాహ్మణ స్త్రీలను వేరుచేయలేదు. బ్రాహ్మణ స్త్రీలు బ్రాహ్మణ పురుషుల చేత ఎలా అణగద్రొక్కబడుతున్నారో చాలా శాస్త్రీయమైన విశ్లేషణ చేశారు. సావిత్రీబాయి ఫూలే కూడా ఇదే అవగాహనతో ముందుకు నడిచారు. వీరు 1842లో అన్ని వర్ణాల బాలికలకు విద్యాలయం ప్రారంభించారు. 1863లో సావిత్రీబాయి ఫూలే వితంతువుల రక్షణ కోసం ఒక ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఇదేకాలంలో వీరొక బ్రాహ్మణ వితంతువు కుమారుని దత్తత తీసుకున్నారు. బ్రాహ్మణ స్త్రీలకు భర్త చనిపోతే శిరోముండనం చేసే ఆచారాన్ని సావిత్రీబాయి వ్యతిరేకించారు. దీనికోసం నాయీబ్రాహ్మణులను సమీకరించి ఈ దురాచారానికి వ్యతిరేకంగా మేము కత్తి పట్టమని శపథం చేయించారు. బ్రాహ్మణ, శూద్ర, అతి శూద్ర స్త్రీలందరినీ విముక్తి చేయాలని సావిత్రీబాయి, జ్యోతిరావు ఫూలే భావించారు. సావిత్రి వంటి గొప్ప వ్యక్తికి స్త్రీలలో భారతరత్న ఇవ్వవచ్చు. ఇన్ని సంస్థలను భర్తతో కలసి ఆమె నిర్వహించారు. నేడు దళిత బహుజనుల్లో కొద్దో గొప్పో సమాజసేవ చేద్దామనుకున్న కార్యకర్తలకు ఇళ్ళలో సహకారం పెద్దగా లేదు. స్త్రీలు ఉద్యోగస్తులుగా ఉన్నవారికి, ఉపాధ్యాయులుగా ఉన్నవారికి దళితవాడల్లో ఇంకా చదువురానివారికి చదువు చెబుదామనే ఆలోచన తక్కువ. ఎక్కువగా ఉద్యోగులైన దళిత స్త్రీలు తమ ఆహార్యానికి, ముఖ్యంగా వస్త్రాలకు, కాస్మోటిక్స్‌కు, వస్తు వ్యామోహానికి గురవుతున్నారు. ఇంటిని ఒక విద్యాలయంగా తీర్చిదిద్దే సంస్కృతిని సావిత్రీబాయి నుంచి దళిత ఉద్యోగ స్త్రీలు నేర్చుకోవాల్సి ఉంది. వారి ఇళ్ళల్లో పిల్లల చదువు సాగకపోగా ఒక ఉద్యమ గృహంగా, ఆశ్రమంగా, ఇతరులకు ఆశ్రయమిచ్చేదిగా మారటం లేదు. అందుకే సావిత్రీబాయి ఫూలే భర్తతో చేసిన కార్యమ్రాన్ని ఇంటింటికీ ప్రచారం చేయవలసి ఉంది.
సావిత్రీబాయి స్త్రీలకు పాఠశాలలను ప్రారంభించటం ఒక సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం. ఈ పాఠశాలలను ప్రారంభించటానికి ఫూలేకు ఉన్న ఆత్మవిశ్వాసం ఎంత బలమైనదో ఇక్కడ అభివ్యక్తమౌతుంది. భారతీయ సమాజంలోని ప్రధాన సమస్యను గుర్తించడంలో ఇక్కడ సావిత్రీబాయి, జ్యోతిబా ఫూలే తీసుకున్న నిర్ణయం స్త్రీని హిందూ సాంస్కృతిక సంకెళ్ళ నుంచి విముక్తి చేయడానికి, స్త్రీ భవిష్యత్తుకు బాటలు వేయడానికి దోహదం చేసింది. అయితే ధర్మశాస్త్రాలన్నీ స్త్రీలకు, శూద్రులకు విద్యను నిషేధిస్తుంటే ఒక శూద్రుడు స్త్రీలకు పాఠశాలను తెరవడమా అని బ్రాహ్మణులు తీవ్రంగా తిరుగుబాటు చేశారు. బ్రాహ్మణుల తిరుగుబాటును మనం తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. అందునా వారి సంప్రదాయపు కుదురు కదిలేటప్పుడు వాళ్ళు విజృంభిస్తారు. అన్నిరంగాల నుంచి అపహాస్యం చేయాలని చూస్తారు. బ్రాహ్మణ్యం ఉక్కుగోళ్ళు పెంచుకొని ఉన్న ''పూణె''లో ఈ సాంస్కృతిక తిరుగుబాటు ఒక కుదుపు కుదిపిందనటంలో అతిశయోక్తి లేదు. అయితే సావిత్రిబాయి, జ్యోతిబా ఫూలే వెనుకాడలేదు. ఆ స్కూలును మరింత అభివృద్ధి చెయ్యడానికి పూనుకొని జ్యోతిబా ఫూలే తన భార్య సావిత్రిని ఉపాధ్యాయినిగా తయారు చేసి పాఠశాలను నిరాటంకంగా సాగించారు. భర్తకు తగిన పట్టుదల, సంస్కారంగల ధీశాలి ఆమె. సావిత్రి, జ్యోతిబా బ్రాహ్మణుల వ్యతిరేక దుమారాన్ని తట్టుకోగల ఆత్మస్థైర్యాన్ని కలిగి ముందుకు నడిచారు. దేశంలోనే వ్యక్తులుగా బాలికల పాఠశాల తెరిచినవారిగా ఫూలే దంపతులు నిలిచారు. ఆంగ్లేయ పాలకులు బాలికల పాఠశాలను 1819లో కలకత్తాలో ప్రారంభించారు. 1824లో అమెరికన్‌ మిషన్‌వారు బాలికల పాఠశాల తెరిచారు. అత్యంత సాహసపూరితంగా తెరిచిన పాఠశాలను మూయించడానికి బ్రాహ్మణవాదులు సావిత్రిబాయి, జ్యోతిబా ఫూలేను పాఠశాల నడపలేని స్థితికినెట్టారు. అయితే పట్టుదల, త్యాగమున్న వ్యక్తుల కృషిని ఎవరు అడ్డగించగలరు? ఆర్థిక పరిస్థితి కొంత చక్కబడిన తరువాత ఆ దంపతులు ఎక్కడా ఇల్లు దొరకకపోయినా పట్టుదలతో పాఠశాల ప్రారంభించారు. ఈ కృషిలో వారు అత్యంత శ్రమతో ముందుకు పోయారు. వారి భావాలతో కలసివచ్చే మిత్రులతో కలసి స్త్రీ విద్యా సంస్థను రూపొందించారు. పూనాలో పలు చోట్ల ఈ సంస్థ పాఠశాలలు తెరిచింది. బాలికలనే కాక నిమ్న జాతులవారికి కూడా ఈ పాఠశాలలు అవకాశం కల్పించాయి. తరతరాలుగా పేరుకుపోయిన అంధకారాన్ని ఛేదించిన ఈ విద్యా భాస్కరులు భారతీయుల గుండెల్లో చిరస్మరణీయులు. ఈ మహనీయుల కృషిని గుర్తించి ప్రభుత్వం 1852 నవంబరు 15న దుశ్శాలువాతో సత్కరించింది. ఆ రోజుల్లో దాని ఖరీదు రూ.193. సన్మానాలకు, సత్కారాలకు మేమే అర్హులమని విర్రవీగే బ్రాహ్మణ్యం ఒక సంస్కర్తకు, ఉద్యమకారుడికి జరిగిన సన్మానానికి ఈర్ష్యాద్వేషాలతో కుతకుతలాడారు.
సావిత్రీబాయి, జ్యోతిబా ఇచ్చిన ఈ స్ఫూర్తితో బొంబాయిలో స్త్రీ విద్యను ప్రోత్సహించే మరో సంస్థ రూపొందింది. ఈ సంస్థ పేరు ''స్టూడెంట్స్‌ లిటరరీ సైంటిఫిక్‌ సొసైటీ''. ఈ సంస్థ 1849 అక్టోబరు 18 నాటికి నాలుగు గుజరాతీ, నాలుగు మరాఠీ పాఠశాలలు ప్రారంభించింది. కలకత్తాలో కూడా సంస్కరణా భిలాషుల ప్రోత్సాహంతో స్త్రీ విద్యా సంస్థల నిర్మాణంలో కొంత కృషి జరిగింది. బ్రాహ్మణ్యాన్ని ఎదుర్కొని సావిత్రీబాయి, జ్యోతిబా ఫూలే స్థాపించిన బాలికా పాఠశాలలు అభివృద్ధి చెందడమేకాక విజయవంతంగా పరీక్షలు నిర్వహించాయి. విద్యా ప్రోత్సాహకులనెందరినో జ్వలింపజేసి ఆ పాఠశాలల పునాదులను గట్టి పరుచుకోగలిగాయి. 1853 నాటికి 275 మంది వరకు విద్యార్థినులు పెరగడమే దీనికి నిదర్శనం. ఫూలే దంపతులకు పూనాలో వస్తున్న ప్రతిష్టకు కన్నుకుట్టిన బ్రాహ్మణులు వారి మీద తీవ్ర వ్యతిరేకతను కనబరిచారు.కృషికి సహకరించిన వారిలో కొద్దిమంది బ్రాహ్మణులు కూడా ఉన్నారు. ఆ దంపతుల మీద హిందూ ఛాందసులు హత్యా ప్రయత్నం చేశారు. ఉద్యమకారులు అనేకసార్లు మృత్యువును ఎదుర్కొనవలసి వస్తుంది. సావిత్రీబాయి, జ్యోతిబాఫూలే పూనాలో నిరాశ్రయులైన వితంతువులను, వారికి పుట్టిన సంతానాన్ని రక్షించడానికి ఒక శరణాలయాన్ని నిర్మించారు. వ్యక్తులుగా బయలుదేరి వ్యవస్థగా రూపొంది సాంఘిక సంస్కరణల్లో ఉజ్వల పథంలో గమించిన సావిత్రీబాయి, జ్యోతిబా ఫూలే ''సత్యశోధక్‌ సమాజ్‌'' అనే సంస్థను స్థాపించి సాంఘిక న్యాయం కోసం, స్త్రీ విముక్తి కోసం అన్ని సంస్థల కంటే ముందుకు నడిపించారు. ఈ విధంగా సావిత్రీబాయి, జ్యోతిరావ్‌ఫూలే స్త్రీ విముక్తి ఉద్యమంలో గావించిన కృషి అపారమైంది. భారతీయ సంస్కృతిలో స్త్రీ విముక్తి ఉద్యమానికి నూతన శకాన్ని రూపొందించిన సావిత్రీబాయి, జ్యోతిరావ్‌ ఫూలేను అధ్యయనం చేయని ఏ సంఘం, ఏ ఉద్యమం సరైన అవగాహనతో ముందుకు పోజాలదు. బ్రహ్మ సమాజానికి, ఆర్య సమాజానికి ఇచ్చిన ప్రచారం సావిత్రీబాయి, మహాత్మా ఫూలే ఉద్యమానికి చరిత్రకారులు ఇవ్వడం లేదు. చరిత్ర రూపొందించే వారిలో కూడా అగ్రవర్ణులే ఎక్కువ కాబట్టి శూద్రులు, అస్పృశ్యుల ఉద్యమాలకు, ఉద్యమకారులకు చరిత్రలో సరైన స్థానం లేదు. ఫూలే దంపతులు భారతభూమిలో స్త్రీ విముక్తి ఉద్యమానికి విముక్తి దాతలు. ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ రెండు దశాబ్దాలుగా సావిత్రీ బాయి ఫూలే జీవితం, సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ ప్రధాన కేంద్ర కార్యాలయమైన ఆంధ్రపద్రేశ్‌ దళిత మహాసభ పొన్నూరు లుంబినీవనంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని, సావిత్రీబాయి ఫూలే విగ్రహాన్ని ఆవిష్కరిం చింది. ప్రభుత్వాన్ని ఎంతో కాలం నుంచి సావిత్రిబాయిఫూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని కోరుతోంది. 2017కు గాని ప్రభుత్వం ఈ కార్యక్రమానికి పూనుకోలేదు. ఇది ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ సాంస్కృతిక విప్లవ విజయం. ప్రతి మహిళా పాఠశాల, కళాశాలలో సావిత్రీబాయి ఫూలే విగ్రహాన్ని రూపొందించాలని, ఆమె పేరు మీద గ్రంథాలయాన్ని రూపొందిం చాలని, ఆమె జీవిత చరిత్రను పాఠ్య గ్రంథంగా రూపొందించాలని ఆంధ్రప్రదేశ్‌లోని లౌకికవాదులందరూ కోరుతున్నా రు. ప్రభుత్వం కంటితుడుపు చర్యగా కాకుండా చిత్తశుద్ధితో సావిత్రీబాయి ఫూలే జన్మదినాన్ని అన్ని విద్యాలయాల్లో జరిపించాల్సిన చారిత్రక సందర్భం ఇది. ఈ చారిత్రక కర్తవ్యాన్ని అన్ని పార్టీలు, అన్ని సంఘాలు నిర్వహించటం ద్వారా సావిత్రీబాయి ఫూలే మహోన్నత జీవిత వ్యక్తిత్వాన్ని వేనోళ్ళ చాటబడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం ముందు కూడా సావిత్రీబాయి ఫూలే విగ్రహాన్ని ఆవిష్క రించటం ద్వారా ఆమెకు ఘన నివాళి జరుగుతుందని ఆశిస్తు న్నాం. సావిత్రీబాయి ఫూలే ఈ యుగం సాంస్కృతిక విప్లవ యోధురాలు అనేది చారిత్రక సత్యం.   - డాక్టర్‌ కత్తి పద్మారావు