Monday, 31 October 2016

|| కాంట్రాక్టు ఉద్యోగులు - సుప్రీం తీర్పు ||


కాంట్రాక్టు ఉద్యోగులకూ శాశ్వత ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతించవలసింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏవేవో పేర్లతో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకూ, కార్మికులకూ ఎంతో ఊరటనిచ్చే తీర్పు ఇది. ‘సమాన పనికి సమాన వేతనం’ అన్న రాజ్యాంగ ఆదేశాన్ని ఈ తీర్పు ఎత్తిపడుతున్నది.

Saturday, 29 October 2016

|| కాలుష్యంపై యుద్ధం ||


ఇతర పండుగలతో పోలిస్తే దీపావళికి ఓ ప్రత్యేకత ఉంటుంది. చీకటి ఆకాశానికి రంగుల వెలుగులు అద్ది అందరూ మురిసే పండుగది. పర్యావరణ చైతన్యం పెర గడం వల్ల కావొచ్చు... శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం వగైరాలు కలిగిస్తున్న చేటు గురించి మరింత స్పష్టత రావడంవల్ల్ల కావొచ్చు–ఈ పండుగ సమయంలోనే కాలుష్యానికి దోహదపడవద్దన్న వినతులు ఎక్కువగా వినిపిస్తాయి. ఈమధ్యే అంత రిక్షం నుంచి భూగోళాన్ని చూసిన వ్యోమగామి స్కాట్‌ కెలీ భారత్, చైనాల్లో వాయు కాలుష్యం అధికంగా ఉన్నట్టు సాధారణ కంటికి కూడా స్పష్టంగా కనబడిందని చెప్పాడు. అతడు ఏడాదిపాటు అంతరిక్ష నౌకలో గడిపి వచ్చాడు.

నెలక్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం వాయు కాలుష్యం గురించి దిగ్భ్రాంతికరమైన అంశా లను వెల్లడించింది. నిర్ధారించిన ప్రమాణాల పరిమితికి మించిన వాయు కాలు ష్యంలో ప్రతి పదిమందిలోనూ తొమ్మిదిమంది మగ్గుతున్నారని తేల్చిచెప్పింది. ప్రపంచ జనాభాలో అధిక శాతం కాలుష్య కాసారాలుగా మారిన నగరాల్లో నివ సిస్తున్నారని మనం నిత్యం పీల్చే గాలి సల్ఫేట్‌లనూ, నైట్రేట్‌లనూ, కర్బనాలనూ, కాడ్మియం, పాదరసం వంటి అత్యంత ప్రమాదకర పరణువులను మోసుకొస్తున్న దని, ఊపిరితిత్తులను నాశనం చేస్తున్నదని వివరించింది.

వాయు కాలుష్యం వల్ల కలుగుతున్న ముప్పు అంతా ఇంతా కాదు. గుండె పోటు, ఊపిరితిత్తుల కేన్సర్, నవజాత మరణాలు తదితర సమస్యలు వస్తున్నాయి. గత ఆదివారం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన నివేదిక చూస్తే గుండె చెరువ వుతుంది. వాయు నాణ్యత సూచీలో ఢిల్లీ 318 పాయింట్ల వద్ద ఉన్నదని ఆ నివేదిక వెల్లడించింది. ఆ సూచీ ప్రకారం ఏ ప్రాంతమైనా 300 పాయింట్ల స్థాయిని దాటితే దాన్ని ‘రెడ్‌ జోన్‌’గా పరిగణిస్తారు. అంటే కాలుష్యపరంగా అది అత్యంత అధమ స్థాయిలో ఉన్నట్టు లెక్క.

ఢిల్లీ నగరంలో మనిషి ఆయుః ప్రమాణం 6.4 ఏళ్లు తగ్గిం దని శాస్త్రవేత్తల అంచనా. వాహనాల నుంచి వెలువడే పొగలో ఉండే పరమా ణువులు శ్వాసకోశ వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. కాలుష్యం వల్ల కలిగే అనర్ధాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి, దాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకొని నిరుడు ఢిల్లీ, హైదరాబాద్‌లతోపాటు దేశంలోని 10 నగ రాల్లో వాయు కాలుష్యాన్ని తెలిపే జాతీయ వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ)లను ఏర్పాటు చేసింది. వీటిని నెలకొల్పడంలో వెనకున్న ఉద్దేశం మంచిదే. పీల్చే గాలి ఎంత ప్రమాదకరంగా ఉన్నదో తెలిస్తే వాహనాల కాలుష్యంపైనా, కాలుష్య కారక పరిశ్రమలపైనా అందరి దృష్టీ పడుతుందని... రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిళ్లు పెరిగి కాలుష్య నియంత్రణకు సంబంధించిన కార్యాచరణ మొదలవుతుందని అందరూ అనుకున్నారు. కానీ దానివల్ల పెద్దగా ఫలితం ఉన్న దాఖలా కనబడదు. 

మన నేతలకు నగరాలంటే మహా మోజు. అభివృద్ధి పేరిట సాగించే కార్యకలా పాలన్నిటినీ అక్కడే కేంద్రీకరిస్తున్న కారణంగా ముప్పు ముంచుకొస్తోంది. పొగ, దుమ్ము వగైరాల్లో కేన్సర్‌ కారక కార్సినోజిన్‌లు విశేషంగా ఉంటున్నాయని అంత ర్జాతీయ కేన్సర్‌ పరిశోధనా సంస్థ ఆమధ్య ప్రకటించింది. వాహనాల రద్దీ పెరిగి, పరిశ్రమల కాలుష్యం విస్తరించి నగరాలు నరకాలవుతున్నాయి. పల్లెసీమల్లో ఉపాధి అవకాశాలు క్షీణించి, పొట్ట నింపుకోవడానికి నగరాల బాట పడుతున్న లక్షలాది మందిని ఈ కాలుష్య భూతం కాటేస్తోంది. మన దేశంలో వివిధ నగరాల్లో వాయు నాణ్యత గురించి ఆరా తీస్తే పట్నా, లుధియానా, బెంగళూరు, కాన్పూర్, లక్నో, అలహాబాద్‌ వంటిచోట్ల పౌరులు మృత్యువును ఆఘ్రాణిస్తున్నారని తేలింది.

ఇటీవలికాలంలో మన దేశంలో పెను వేగంతో అభివృద్ధి చెందిన నగరం బెంగళూరు. అభివృద్ధి కార్యకలాపాలన్నీ ఆ నగరంలోనే కేంద్రీకరించడం వల్ల పచ్చదనం హరించుకుపోవడమే కాదు...పరిశ్రమలు విడిచే కర్బన ఉద్గారాలవల్ల పర్యావరణం నాశనమైంది. జనాభా అనూహ్యంగా పెరగడం వల్ల వాహనాల రద్దీ ఎక్కువై అది మరింత క్షీణించింది. నిరుడు ఆ నగరంలో నిర్వహించిన సర్వేలో అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవన సముదాయాలు, మురికివాడల కోసం 98 శాతం సరస్సులు ఆక్ర మణలకు గురయ్యాయని తేలింది. మన హైదరాబాద్‌తోసహా ఏ నగరం చరిత్ర చూసినా ఇలాగే ఉంటుంది. ఇన్ని అనర్థాలు జరిగాయని తేలాక కూడా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నగర నిర్మాణం కోసం మూడు పంటలు పండే సుక్షేత్రాలను నాశనం చేసే పనికి పూనుకున్నారు. 

కార్పొరేట్‌ సంస్థల, వాహన తయారీ పరిశ్రమల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే విధాన రూపకర్తల వల్లే సమస్యంతా ఉత్పన్నమవుతోంది. నగరాల్లో వాయు నాణ్యత సూచీలు పెట్టడం వరకూ బాగున్నా... ఆ కాలుష్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎఫ్‌ఎం చానెళ్ల ద్వారా మెట్రో రైళ్లు, సిటీ బస్సులు, కార్లు వగైరాల్లో ప్రయాణిస్తున్నవారందరికీ తెలిసే ఏర్పాటు చేయాలి. ఆ సూచీ వెల్లడిస్తున్న అంశం ఏ స్థాయిలో ఆరోగ్యానికి ముప్పు కలిగించగలదో వివరించాలి. వాయు కాలుష్యం వల్ల కలిగే అనర్ధాలను గ్రహిస్తే పౌరుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రజా రవాణా వ్యవ స్థను మెరుగుపరచడం వల్ల ప్రైవేటు వాహనాల వినియోగం అదుపులోనికి వస్తుంది. పర్యవసానంగా ట్రాఫిక్‌ రద్దీ తగ్గడమే కాదు... వాయు కాలుష్యం అదుపులోకి వస్తుంది. ఈసారి శీతాకాలంలో చలిగాలుల తీవ్రత హెచ్చుగా ఉండొచ్చునని అంచనాలున్న నేప థ్యంలో కాలుష్య నియంత్రణపై పాలకులు దృష్టి సారించాలి.  (సాక్షి)

Sunday, 23 October 2016

|| అమానవీయ పాలన - ఆకలి కేకలు ||


ప్రపంచం ఒకపక్క సంపన్నమవుతోంది. మరోపక్క ఆకలి కేకలు వినపడుతున్నాయి. ఒకపక్క నల్లకుబేరులు పెరుగుతున్నారు. దేశ దేశాలకు పన్నులు ఎగ్గొట్టినవాళ్ళు నల్లకుబేరులుగా అవతారం ఎత్తుతున్నారు. మరోపక్క మురుగువాడలు పెరుగుతున్నాయి. ఆకలికి అలమటించే వారిసంఖ్య ప్రపంచం మొత్తం మీదగా 79.50 కోట్లమందిగా తేల్చారు.

|| తలాఖ్ - వ్యక్తిగత చట్టాలు ||


ముస్లిం పురుషులు ఇష్టం లేదనుకుంటే భార్యకు ఏకపక్షంగా విడాకులిచ్చి వీధులపాలు చేసే తలాఖ్‌ దురాచారాన్ని తక్షణం నిలుపు చేయడం చాలా అవసరం. ఈ దిశలో జరిగే ప్రయత్నాలు ఆహ్వానించదగినవి. ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. భర్త తన ఇష్టానుసారం మూడు సార్లు తలాఖ్‌ తలాఖ్‌ తలాఖ్‌ అంటే భార్యకు విడాకులిచ్చినట్టేనంటున్న ప్రస్తుత ముస్లిం పర్సనల్‌ లా( వ్యక్తిగత చట్టం)ను తప్పక సవరించాల్సిందే. అఖిలభారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఎఐఎంపిఎల్‌బి) మత చాందసత్వంతో ఈ మూడు తలాఖ్‌ల పద్ధతి కొనసాగించాలంటూ అఫిడవిట్‌ దాఖలుచేయడం దారుణ మైన విషయం.

|| సర్కారు వైద్యం - అమానుష దృశ్యం ||


  
ప్రభుత్వాసుపత్రిలో క్షయబారినపడి తనువు చాలించిన భార్య అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించాలని ఆ ఆదివాసి తలంచాడు. 60 కిలో మీటర్లు దూరంలో ఉన్న గ్రామానికి ఆ మృత దేహన్ని తరలించేందుకు ఆయన వద్ద డబ్బులేదు. ఆస్పత్రి వర్గాలను ఎంత బ్రతిమిలాడిన శవాన్ని తిరిగి స్వగ్రామం తీసుకెళ్లేందుకు పాడెగానీ, అంబులెన్స్‌గానీ ఏర్పాటు చేయలేదు. గత్యంతరం లేక దుప్పటి చుట్టి శవాన్ని భుజాన వేసుకుని భార్య అంతిమయాత్ర ప్రారంభించాడా భర్త. తల్లి మరణం తో ఉబికి వస్తున్న దుఃఖాన్ని, కన్నీళ్లను ఆపుకోలేక అలాగని రోడ్డుమీద మనసారా ఏడవటానికి కూడా నోచుకోని అతని పన్నెండేళ్ల కుమార్తెతో కలిసి 60కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామం బయల్దేరాడు ఆ గిరిజనుడు.

|| అగ్రరాజ్యం - వక్రప్రచారం ||




అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి దశకొచ్చింది. అభ్యర్ధుల మధ్య కీలకమైన ముఖాముఖి చర్చల ఘట్టం ముగిసింది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజల సాధకబాధ కాలను, ప్రపంచ సమస్యలను మథించి పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన అగ్రరాజ్య ఎన్నికల ప్రచారం వ్యక్తిగత దూషణలకు, బరితెగింపు ఆరోపణలకే పరిమితమైపోవడం విస్మయకరం. డోనాల్డ్‌ ట్రంప్‌ నోటి దురుసుతనం వెగటు పుట్టించడం, హిల్లరీ క్లింటన్‌ వ్యంగ్యాస్త్రాలు విసుగు తెప్పించడం అమెరికా ప్రజానీకాన్ని ముక్కున వేలేసేకునేలా చేస్తున్నాయి.

Tuesday, 18 October 2016

|| ప్రగతిశీల ప్రజా రచయిత దేవపుత్ర ||



పంచమం’ నవలా రచయిత చిలుకూరి దేవపుత్ర 2016 అక్టోబర్‌ 18న ఉదయం 9 గంటలకు హఠాత్తుగా కన్నుమూసి సాహితీలోకాన్ని దిగ్భ్రమకు గురిచేశారు. 1951 ఏప్రిల్‌ 15న అనంతపురం జిల్లా, బెళుగుప్ప మండలం కాలువపల్లిలో సరోజమ్మ, ఆశీర్వాదం దంపతులకు జన్మించిన దేవపుత్ర తన అరవై ఐదున్నర ఏట ఎవరూ ఊహించని రీతిలో గుండెపోటుతో చనిపోయారు. దళిత కుటుంబంలో పుట్టిన దేవపుత్ర చదువుకున్నది ఎస్‌ఎ్‌సఎల్‌సీ దాకనే అయినా, జీవిత పాఠశాలలో అపారమైన జ్ఞానం సంపాదించారు.

Monday, 17 October 2016

|| కష్టజీవికి అటూ ఇటూ ఉన్నవాడు ||


‘అప్పటిదాకా శూన్యంలో విహరిస్తున్న నా కళ్ల పొరలు తొలగాయి. రచయిత నడవవలసింది శూన్యంలో కాదు, సరైన రాస్తా వెంట నడవాలి. జీవితంలోకి తొంగిచూడాలి. జీవితం వైపుగా సాగిపోవాలి. రాజకీయాలకు దూరదూరంగా ఉండే రచయిత ఒక పెద్ద మోసగాడు మాత్రమే. అలాంటి మోసాన్ని సృష్టించి, వ్యాప్తి చేస్తున్నది పెట్టబడిదారీ విధానం. మహాకవి డాంటే కాలంలో అలాంటి రచయితలు లేరు. కళ కళకోసమేనన్న సిద్ధాంతం బడా వ్యాపారుల ప్రబోధగీతం’ - పాబ్లో నెరూడా (చిలీ దేశపు మహాకవి)

యూదు జాతీయులలో ఒక దళితకవి.. అమెరికాలోని వర్తక వ్యాపారాల ద్వారా నిరంతరం లాభాపేక్షతో జీవిస్తున్న సంపన్న యూదుల మధ్య సొంత గొంతుతో స్వతంత్ర శక్తితో ప్రతిభా సంపన్నుడైన ఒక దళితకవి పుట్టి పెరగడమే నమ్మలేని నిజం. ఆయన తొలి జానపద కళాకారునిగా, ఆట పాటల మేల్కలయికగా, నర్తకునిగా ఈ యేటి నోబెల్ పురస్కారానికి ఎంపిక కావడం ఇంకా విశేషం. యూదులలో అణగారిన వర్గానికి చెందిన బాబ్ డిలాన్ కిశోరప్రాయం నుంచి జానపద కళాకారునిగా దూసుకురావడానికి ప్రధాన కారణం- అదిగో, నెరూడా మహాకవి ఆశించిన తోటి కష్టజీవుల కన్నీటిగాథలకూ, జానపదుల జీవన సమరానికీ రాగం, తానం, పల్లవి కట్టి ముందుకు సాగడమే. అంతకు ముందు నోబెల్ సాహిత్య పురస్కారాలు అందుకున్న యూదులు లేకపోలేదు. మిన్నిసోటా (అమెరికా)లో ఉదయిం చిన యూదు దళిత బిడ్డ మిన్ను తాకగల శక్తిని పొందడానికి సుమారు అరవై సంవత్సరాల వ్యవధి ఎందుకు పట్టింది?

|| బడుగుల బాధలకు గొంతు ఇచ్చి ||

ఈ ఏడాది నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎంపికైన బాబ్ డిలాన్ అమె రికాలోని అట్టడుగు ప్రజల బాధలతో గొంతు కలిపినవాడు. అమెరికన్ ప్రజాస్వామిక, నీగ్రో అభ్యుదయకర శక్తులతో చేతులు కలిపి ఇన్నేళ్లుగా ముందుకు నడుస్తూ ఒక యువ కెరటంలా దూసుకువచ్చిన డెబ్బయ్ ఏళ్ల వృద్ధుడు. వీధి గాయకునిగా అమెరికా సామాన్య ప్రజలను అలరించిన బాబ్, ఒకనాటి పాల్ రాబ్సన్ వంటి కొద్దిమంది కవి, కళాకారులకు వారసుడు. సీగర్ వంటి సుప్రసిద్ధ వాద్యకారుడు గిటార్‌ను తన ఆయుధంగా ప్రకటించు కున్నాడు. బాబ్ కూడా తన చేతి గిటార్‌ను ప్రగతిశీల అభ్యుదయ ఉద్యమా లకు మద్దతుగా నిలిచే శక్తిగా ప్రకటించుకున్నాడు. బాబ్‌కు స్థానిక మహా కవులలో సుప్రసిద్ధుడు డిలాన్ థామస్ ప్రోత్సాహక శక్తి. అందుకే తన అసలు పేరు రాబర్ట్ అలెన్ జిమ్మర్‌మాన్‌ను బాబ్ డిలాన్‌గా మార్చుకున్నాడు.

ఆఫ్రికన్ నల్లజాతి కవి వోలే సోయెంకా నోబెల్ అందుకున్నప్పుడు పెదవులు విరిచిన బాపతు (వీఎస్ నైపాల్ వంటివారు) కొందరు లేకపోలేదు. ఇప్పుడు బాబ్ విషయంలో కూడా కళ్లు కుట్టిన బాపతు లేకపోలేదు. కానీ అదే సమ యంలో వాగ్గేయకారుడైన డిలాన్ వాడవాడలా గిటార్ వాద్యం మాధ్య మంగా జానపద సాహిత్యంతో ప్రేక్షకులను మత్తిల్ల చేస్తూ ఉద్యమ సందే శాలతో, సంగీత బాణీలతో అలరించిన ఘడియలని శ్రోతలు మరవలేరు. అయితే అనంతర కాలాలలో బాబ్ జానపదాలను పక్కన పెట్టి బీట్, రాక్ మ్యూజిక్ వైపు ఆకర్షితుడు కావడాన్ని శ్రోతలు జీర్ణించుకోలేకపోయారు.  కానీ, బీట్ తరానికి ముందున్న జానపద కళారూపాలను, పాటలను కవి తాత్మకంగా ప్రదర్శించిన డిలాన్ గురించి సురేశ్ మీనన్ వంటి విశ్లేషకులు చేసిన వ్యాఖ్య గమనించదగినది. ‘బాబ్ డిలాన్ ఆదర్శంగా మా తరమంతా ఎదుగుతూ వచ్చింది. షేక్‌స్పియర్ నుంచి లేదా బైబిల్ హీరోల నుంచి వాక్యాలను ఉదహరించడం కన్నా బహు సునాయాసంగా డిలాన్ పాటలనే ఉటంకించగలం!’ అన్నారాయన.

|| ఆయనలోని మనిషి ||

నాటి థామస్ డిలాన్ అభ్యుదయ కవితలలో కొన్ని (వీటిలో కొన్ని శ్రీశ్రీ అనువదించారు) వింటే, నేటి బాబ్ డిలాన్ మార్గం మనకు అవగతమవు తుంది. ‘గ్రంథాల మీద పడి వాళ్లేడ్చే / కాలం ఒకటుండేది/ కాలం అయితే వాళ్ల మీదకి / కాష్టాన్నే ఉసికొల్పింది.... ఆకాశపు సౌజ్ఞల కింద/ హస్తాలు లేని వాళ్లవే/ అతి శుభ్రమైన చేతులు/ గుండెల్లేని శవానికి/ గాయాల బాధ లేనట్టు/ గుడ్డివాడు మాత్రమే జాస్తీగా చూస్తాడు’. దాదాపు ఇలాంటి చమత్కార పదాలతోనే తన గుండెలో ఉన్న సామాన్యుల ఆవేదనకు అక్షర రూపం ఇచ్చినవాడు బాబ్. 1960 నుంచి 2001 దాకా  వాగ్గేయకారునిగా బాబ్ అల్లిన కవితలను సిమన్ షూస్టర్ ప్రచురణ సంస్థ సంకలనపరిచింది. 27 అధ్యాయాలలో ఒక్కో అధ్యాయానికి 15 పాటల చొప్పున లయబద్ధంగా, అంత్యప్రాసలతో 405 కవితలను 600 పేజీలలో సంపుటీకరించారు.  అసమ సమాజ పరిస్థితులపై కవి హృదయంలో మరుగుతున్న రుధిరజ్వలనం గీతంగా, జానపద సంగీతంగా ఈ కవితలలో జాలువారిందని వ్యాఖ్యాతలు భావిస్తారు.

ఫ్రెంచి కవి పాల్ ఎలార్డ్ ‘ద్వేషగీతం’ ప్రభావం కూడా బాబ్‌పై లేకపోలేదు. పాటలూ, గీతాలూ వేరు. శుద్ధ కవితలు వేరు. ‘ప్రధానంగా నీవు పాటగాడివా లేక కేవల కవి కుమారుడివా’ అన్న కొందరు సమకాలికుల ప్రశ్నకు బాబ్ ‘నేను ప్రధానంగా ప్రజా వాగ్గేయకారుడ్ని, నాట్యకారుణ్ణి’ అని చెప్పాడు. ఇక్కడ ‘నాది ప్రజా ఉద్యమం. ఎవరినో సంతోష పెట్టడం కోసం దాన్ని వదలుకోలేనన్న’ గురజాడ తెగింపు గుర్తుకు వస్తుంది. బహుశా ఈ దృష్ట్యానే బాబ్ డిలాన్‌ను జానపద వాగ్గేయకారునిగా గుర్తించిన స్వీడిష్ నోబెల్ అకాడమీ ‘అమెరికన్ జానపద గేయ సాహిత్య సంప్రదాయంలో వినూత్నమైన కవితాత్మకమైన భావనా సృష్టికర్త’ అని కీర్తించింది. ‘సేవింగ్ గ్రేస్’ అన్న గీతంలో బాబ్ ‘కుచ్చితపు మనిషికి జీవితంలో శాంతి ఉండదు/ఆ కుచ్చి తనపు మనస్సును వంచించడం కష్టం’ అంటాడు. అంతేగాదు, ‘శత్రువువల్ల ఏదైనా విధ్వంసకాండ మీదకొచ్చినప్పుడు/ఎదుటనున్నవారికి వీడ్కోలు చెప్పిరాలేను/నా సహోదరుల రక్షణ కోసం నేను నా ప్రాణాలు కోల్పోవడా నికైనా సిద్ధమవుతాను - అందుకు నేను సదా సిద్ధం, మీరూ అందుకు సిద్ధమేనా’ అని ప్రశ్నిస్తాడు బాబ్.

‘ఒక్క స్త్రీమూర్తి మాత్రమే నాలోని మానవుడ్ని, మానవతను అంచనా వేయగలదని’ చాటి చెప్పాడు. ఇంతకూ ‘నీ హృదయం రాతిగుండా లేక ప్రాణం లేని గండశిలా’ అని మరో కవితలో ప్రశ్నిస్తాడు. ‘నాలోని మనిషి’ (‘ది మాన్ ఇన్ మి’) అన్న కవితలో ‘నాలోని మనిషి ఏ కర్తవ్యాన్నయినా నెరవేర్చగలడు/కాని అందుకు పరిహారం కోరడు’ అని మానవీయ దృక్పథం ఎలా ఉండాలో చెప్పాడు. అందుకే శ్రీశ్రీ అంటాడు : ‘మాట చేతగా మారి/మనిషి మనిషితో చేరి/స్వప్నం సత్యం ఐతేనే స్వర్గం’ అని. ‘ఒక శబ్దం శక్తివల్ల/నా బతుక్కి పునర్జన్మ’ అని బాబ్‌కు  మరో ఇష్టుడైన కవి పాల్ ఎలార్  ప్రకటిస్తే; డిలాన్ తన జన్మ సార్థకత కోసం తన ‘గిటార్’ వాద్య పరికరం ద్వారా జనతకు చైతన్యపు మేలుకొలుపులు పాడాడు. ఆశ యాలు సంఘర్షిస్తున్నవేళ తన గిటార్ కూడా తటస్థంగా ఉండలేక ఆయు ధంగా మారింది.

|| శుభ సూచకం ||

ఈ ప్రజా చైతన్యయాత్రలో భాగస్వామి కాదలచిన బాబ్‌తో పాటు తెలుగు నాట కూడా సుప్రసిద్ధ జానపద వాగ్గేయకారులను ఆటపాటల, నృత్య సంకేత కళల్లో ఆయనకు సమఉజ్జీలు లేకపోలేదు. భారతదేశ స్థాయిలో డిలాన్‌ను ప్రేమించే రహ్మాన్ లాంటివారుండగా, మన ఉమ్మడి తెలుగుసీమలోని అన్ని ప్రాంతాలలోనూ లెక్కకు మిక్కుటంగానే ఉన్నారని చెబితే అతిశయోక్తి కాబోదు : సుద్దాల హనుమంతు, నాజర్, గద్దర్, వంగపండు ప్రసాద్, పాణి గ్రాహి, సత్యమూర్తి, గోరటి వెంకన్న, అంద్శై అశోక్ తేజలు.. పదిమంది బాబ్‌డిలాన్‌లకు సరిజోడులు. ‘ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ’ లాంటి మోసపూరిత సుద్దులతో నెత్తురోడుతున్న పల్లెల, పట్టణ, నగర జీవి తపు ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్న సగటు సామాన్యుల వ్యథాభరిత గాథలను జానపద బాణీల ద్వారా, ‘సంచార’ కవితల ద్వారా తన గుండె గొంతుకలో వినిపిస్తున్న గోరటి వెంకన్న లాంటి చేతనా స్వరాలకు ఖరీదు కట్టే షరాబులు లేరు.

మన జానపద సాహిత్యంలోని తెలుగుదనాన్ని తరతరాలుగా నాలుకల మీద నర్తింపచేస్తున్నవి ఎన్నో! కోతపాటలు, కాపు పాటలు, నాటు పాటలు, మోట పాటలు, కాపరి పాటలు, ఇసుర్రాయి పాటలు, పెళ్లి పాటలు, దిష్టి పాటలు, పండుగ పబ్బాల పాటలు, రోడ్డు కూలీల పాటలు, వృత్తి పాటలు కోటి బాణీలతో జన సామాన్యంలో నేటికీ ప్రచరితమవుతూనే ఉన్నాయని మరచిపోరాదు. సామ్రాజ్య పెట్టుబడిదారీ సంస్కృతిలో పుట్టి పెరిగిన నోబెల్ అకాడమీ పెద్దలు నోబెల్ పురస్కార ప్రదానాలలో చూపే వివక్ష రాజ కక్షలకు, కార్పణ్యాలకూ అతీతం కాదని సోషలిస్టు దేశాలలో పుట్టి పెరిగి, ‘తల్లి రొమ్మునే గుద్ది’ దేశద్రోహులుగా మారిన పాస్టర్‌నాక్ లాంటి రచయితలకు నోబెల్ పురస్కారాలు లభించిన ఉదంతాలు కూడా మరవలేం. కొన్నేళ్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్న పూర్వ రంగంలో స్వీడిష్ అకాడమీలో చలనం కలుగడం, బాబ్ లాంటి వారిని ఎంపిక చేయవలసి రావటం శుభ సూచకమే. డిలాన్ మాదిరిగానే సామాన్య ప్రజాబాహుళ్యం బాధలకు ఆర్ద్రతతో

బాణీలు కట్టిన ‘అలచంద్రవంక’ గోరటి వెంకన్న మాటల్లో - ‘రాములయ్య’ ‘ఇల్లు చూస్తే మూరెడంత/బాడిగేమో బాండంత/కార్పొరేటు ఊడలాయె/ గాడి కింద నీడవాయె’ లాంటి పరిస్థితులు తాండవిస్తున్నకొద్దీ... ‘అప్పులోళ్ల తిట్లకదిరి/అయ్యప్పమాలలేసు’కునే స్థితి దాపురించినంత కాలం.. విదేశీ సామ్రాజ్యవాద గుత్త పెట్టుబడులకి అంగలార్చి దేబరిస్తూ కాలక్షేపం చేసినంత కాలం.. ఆ ‘సంస్కృతి’కి పాలకులు బానిసలయినంత కాలం - రచయితలను లొంగదీసుకునే ‘పురస్కారాల’ కోసం కవి, గాయక నట, జాన పద కళాకారులు, చైతన్యంగల సంస్కృతీపరులు పురస్కారాల కోసం ఎదురు చూడకూడదు.  -ఏబీకే ప్రసాద్  (సాక్షి)

Sunday, 16 October 2016

|| బుద్ధుణ్ణి, మార్క్స్ ను సమన్వయించిన అంబేద్కర్‌ ||




             డాక్టర్‌ బిఆర్‌ అంబే ద్కర్‌ 1956 అక్టోబరు 14న నాగపూర్‌లో ఐదు లక్షలమందికి ఇచ్చిన బౌద్ధ ధర్మ దీక్ష ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యా యాన్ని ప్రారంభించింది. హిందూ మతం నుంచి బయటపడకుండా భారతదేశంలో కులం, అస్పృశ్యత పోదని అంబేద్కర్‌ తన జీవిత అనుభవం నుంచి, అధ్యయనం నుంచి తెలుసు కున్నాడు. అందుకే భారతదేశాన్ని బౌద్ధ భార తంగా తీర్చిదిద్దాలని ఆయన కంకణబద్ధు డయ్యాడు. భారతదేశంలో ఉన్న తత్వశాస్త్రా లన్నింటినీ, మతాలనూ అధ్యయనం చేశా డు. భారతదేశ మూలాల నుంచి పుట్టింది బౌద్ధం. ఇతర మతాలన్నీ ఇతర ఖండాల నుంచి ఇక్కడ ఆవిర్భవించినవని తెలుసుకున్నాడు. అవన్నీ ఆయుధా లతో పాటు వచ్చిన మతాలని అవగాహన చేసుకున్నాడు. ఆర్యులు వేదాలతో పాటు భారతదేశానికి హిందూమతాన్ని, అరబ్బులు, తురుష్కులు ముస్లిం మతాన్ని, ఫ్రెంచివాళ్ళు, ఇంగ్లీషువాళ్ళు క్రైస్తవ మతాన్ని తెచ్చారని ఆయన పరిశీలనలో తేలింది. బౌద్ధ మతం ఒక్కటే భారత ఉపఖండం నుంచి జనించింది. ఆయుధాన్ని నిషేధించింది. ప్రేమను, కరుణను, ప్రజ్ఞను పెంచింది. త్యాగాన్ని విశ్వవ్యాప్తం చేసింది. వ్యక్తిత్వ నిర్మాణాన్ని బోధించింది. కులం గీతలను చెరిపేసింది. అస్పృశ్యతా మాలిన్యాన్ని కడిగేసింది. ఆత్మీయతా సముద్రా లను పొంగించింది. మనిషిని మహోన్నతుడిగా మలిచింది. మనిషి తోటి మనిషిని ప్రేమించే సౌజన్యతను తెచ్చింది. మానవత్వాన్ని ఆకాశ దీపంగా వెలిగించింది. ఈ బౌద్ధ ధర్మా న్ని భారతీయులు మరీముఖ్యంగా దళితులు, బహుజనులు స్వీకరిస్తే హిందూ మతం వేసిన ఉక్కు సంకెళ్ళను తెంచుకోవచ్చని అంబేద్కర్‌ ఈ మహోన్నతమైన దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రపంచ చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టానికి ఆయువు పోశాడు. అంబేద్కర్‌ తన 'బుద్ధుడు, ఆయన ధమ్మం' అనే గ్రంథంలో ధమ్మకు, మతానికి ఉన్న తేడాను చర్చించాడు. మతం విశ్వాసానికి సంబంధించింది. ధమ్మం ఆచరణకు సంబంధించింది. ధమ్మంలో నీతి ఉంది. సామాజికత ఉంది. ధమ్మ ఏకలక్ష్య సౌభ్రాతృత్వాన్ని అలవర్చుకోవడానికి ఇది మార్గమని అంబేద్కర్‌ పేర్కొన్నాడు. 'ఇది విశ్వజన సోదరత్వానికి మరో పేరని, దాని ఇంకో పేరే నీతియని, నీతియే ధమ్మం' అని అంబేద్కర్‌ నొక్కివక్కాణిం చాడు. అంబేద్కర్‌ ఈ ధమ్మను మరింత వివరంగా విశ్లేషించాడు. 'స్వచ్ఛత మూడు రకాలని ఆయన చెప్పాడు. శారీరక స్వచ్ఛత అనగా హత్య చేయకుండా, దొంగతనం చేయకుండా, పాపపంకిలమైన జీవితం గడవకుండా' ఉండాలని, వాక్కులో స్వచ్ఛత అనగా 'అసత్యమాడకుండా ఉండాలని, మానసిక స్వచ్ఛత అనగా సోమరితనం, జడత్వం, ఉద్రిక్తత, దుందుడుకుతనం లేకుండా' పరిశుభ్రంగా జీవించా లని అంబేద్కర్‌ పేర్కొన్నాడు. జీవితంలో పరిపూర్ణత్వాన్ని పొందడమే 'ధమ్మం' అని, శారీరక, మౌఖిక, మానసిక పరిపక్వతలు 'ధమ్మం' వల్లే సాధ్యమని విశ్లేషించాడు. 'వ్యామోహం ధమ్మానికి వ్యతిరేకమని', 'ఈ వ్యామోహమే ధనాశకు ఆస్కారం కలుగజేస్తుందని', 'ధనాశ మానవ పతనానికి దారితీస్తుందని', 'ధనాన్ని పోగుచేయాలనే తాపత్రయమే దురాశకు కూడా హేతువని', 'ఈ దురాశ ఎదుటివాడిని పీడించడానికి మనసును ప్రేరేపిస్తుందని', అందుకే మోహానికి మూలమైన మానసిక దుర్బలత్వాన్ని విడనాడాలని అంబేద్కర్‌ విశ్లేషించాడు. అంబేద్కర్‌ దళితు లను, బహుజనులను హిందూమతం నుంచి బయటపడ వేయడానికి లోతైన అధ్యయనం చేశాడు. ఏ మతమైనా మనిషికి మేలు చేయాలి. కీడు చేసే మతంలో మనం కొనసాగడం వల్ల తరతరాలు మనం మానవ హక్కులను కోల్పోతాం. మన సంకెళ్ళను మనమే బిగించుకొన్నవారం అవుతాం. అందుకు నా జీవితం, మా తాతముత్తాతల జీవితమే చారిత్రక సాక్ష్యాధారాలుగా నిలుస్తాయని ఇలా చెప్పాడు. నా తండ్రి, తాతలు నిబద్ధత గల హిందువులు. కానీ హిందూ మతం విధించిన ఆంక్షల కారణంగా వారు విద్యనభ్య సించలేకపోయారు. ఆ మతం వారిని ఆయుధాలను ధరించనివ్వలేదు. సంపదను కూడబెట్టడం కూడా హిందూ మతంలో సాధ్యం కాదు. ఈ మతానికి కట్టుబడి ఉండటం వల్ల నా తండ్రి ఈ మూడింటినీ సంపాదించలేకపోయాడు. నాకు సంస్కృతం నేర్చుకోవాలని ఉండేది. కానీ హిందూ మతం విధించిన ఆంక్షల కారణంగా నేను సంస్కృతం నేర్చుకోవడం సాధ్యం కాదు. కానీ ఇప్పుడు విద్యార్జన, సంపద, ఆయుధాలను కలిగి ఉండడం కూడా సాధ్యమైంది. మీ తాతముత్తాతలను హీనమైన జీవితాలను గడిపేందుకు ఒత్తిడి చేసే, అన్ని రకాల అగౌరవాలను వారిపై మోపి, నిరుపేదలుగా, అజ్ఞానులుగా ఉంచే హిందూమతమనే క్రూరమైన తెగలో మీరు ఎందుకు కొనసాగాలి? మీ తాతముత్తాతలలానే హీనమైన, తక్కువ స్థాయిని, అవమా నాన్ని అంగీకరించడాన్ని కొనసాగిస్తే మిమ్మల్ని ద్వేషిస్తూనే ఉంటారు. ఎవరూ మిమ్మల్ని గౌరవించరు, ఎవరూ మీకు సాయపడరు. ఈ కారణాల వల్లనే మతమార్పిడి అనే అంశం మనకు ముఖ్యంగా మారింది. మీరు హిందూ మతంలోనే కొనసాగితే బానిసకన్నా ఉన్నతమైన హోదాను పొందలేరు. వ్యక్తిగతంగా నాకు ఎటువంటి అడ్డంకులూ లేవు. నేను అస్పృశ్యునిగా కొనసాగినా, ఒక హిందువు సాధించిన స్థాయిని, హోదాను నేను సాధించగలను. నేను హిందువుగా కొనసాగుతానా, లేదా అన్నది పెద్దగా సమస్య కాదు. ఎందుకంటే, నేను హైకోర్టు జడ్జిని కాగలను, శాసనసభలో సభ్యుణ్ణి, మంత్రిని కూడా కాగలను. కానీ మీ సాధికారత, పురోగతి కోసం మతమార్పిడి చాలా అవసరమని నాకనిపిస్తోంది. ఈ హీనమైన, అగౌరవనీయమైన ఉనికిని బరగారంగా మార్చుకోవాలంటే మార్పిడి అత్యవసరం. మీ పరిస్థితి మెరుగుపరచుకోవడానికి మీ స్నేహితులు, బాగుకోరేవారి సహకారం, సహాయం తప్పనిసరిగా అందుతా యని ఆశిస్తున్నాను. మీ పరిస్థితిని మెరుగుపరిచేందుకు నేను మతమార్పిడులను ప్రారంభించాలి. నేను నా వ్యక్తిగత ప్రయోజనం లేక పురోగతి గురించి ఆందోళన చెందడం లేదు. ఈ రోజు నేనేదైతే చేస్తున్నానో అది మీ బాగు కోసం, మీ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే. మీరు నన్ను దేవుడిని చూసినట్టు చూస్తున్నారు. కానీ నేను దేవుడిని కాదు. నేనూ మీ అందరిలాగే మనిషిని. మీరు నా నుంచి ఏ రకమైన సహాయాన్ని ఆశించినా అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుత మీ ఈ హీనమైన, నిరాశాజనకమైన పరిస్థితి నుంచి మిమ్మల్ని విముక్తి చేయాలని నిర్ణయించుకున్నాను. నా వ్యక్తిగత లబ్ధి కోసం నేను ఏమీ చేయడం లేదు. మీ ఉన్నతి కోసం, మీ జీవితం మరింత అర్థవంతం, ఉపయోగకరం కావడం కోసం నా పోరాటాన్ని కొనసాగిస్తాను. మీ బాధ్యతను మీరు గుర్తించి నేను చూపుతున్న మార్గాన్ని మీరు అనుసరించాలి. మీరు నిజాయితీగా దానిని అనుసరిస్తే లక్ష్యాన్ని సాధించడం పెద్ద కష్టం కాబోదని ఆయన స్వయంగా పేర్కొన్నారు. హిందూ మతాన్ని, దాని చర్యలను, దాని నిత్యకృత్యాలను అంబేద్కర్‌ నిశితంగానే కాక చారిత్రకంగా కూడా పరిశీలించారు. హిందూమతం భారతదేశ ప్రజల్లో నైతిక శక్తిని దెబ్బతీసింది. బహుభార్యత్వానికి కృష్ణుణ్ణి, భార్యను అనుమానంతో దగ్ధం చేయడాన్ని రాముడి పేరుతో పెద్దఎత్తున ప్రచారంలో పెట్టింది. ధర్మరాజు ద్వారా జూదాన్ని ప్రచారం చేసింది. దానికి ప్రత్యామ్నాయంగా అంబేద్కర్‌ బౌద్ధధర్మాన్ని ఆచరించడమంటే స్వేచ్ఛగా జీవితాన్ని గడపటమేనని, స్వేచ్ఛ మనస్సులో, వాక్కులో, శరీరంలో ఉండాలంటాడు. సోమరితనానికి, జడత్వానికి, ఉద్రిక్తతకు, దుందుడుకుతనానికి దూరంగా ఉండగలగడమే మానసిక స్వచ్ఛత అని బుద్ధుని ధర్మాన్ని అంబేద్కర్‌ నివేదిస్తాడు. హింసను బలంగా వ్యతిరేకించాడు. బుద్ధుడు కాముకత్వాన్ని, అసత్యమాడడాన్ని, మత్తు పదార్థాలను సేవించి మంద మతిగా జీవించడాన్ని వ్యతిరేకించాడని, బౌద్ధ ధర్మదీక్ష పొందడం వల్ల నీవు పరిపూర్ణ మానవుడవుతావని అంబేద్కర్‌ తన బుద్ధుడు, ఆయన ధమ్మంలో పేర్కొన్నాడు. దురాశ, క్రోధం, భ్రమలను అధిగమించినట్లైతే మానవుడిలో బాధ, వేదనలను జయించవచ్చని, వాంఛలకు బలికాకుండా మాన వుడు జాగ్రదావస్థలో ఉండాలన్నాడు బుద్ధుడు. మానవుడు నిర్వాణమార్గం చేరుకునేందుకు కోరికలు అవరోధమని బుద్ధుడు హెచ్చరించాడు. బుద్ధుని బోధనలను అంబేద్కర్‌ క్రమబద్ధీకరించడమేకాక దానిలోని అంతస్సారాన్ని సులభసా ధ్యంగా నివేదించాడు. నైతికంగాను, మానసికంగాను, దృష్టిపరంగాను విజయం సాధించగలిగినవాడు ధర్మాన్ని నెరవేర్చినట్టేనని బుద్ధుడు చెప్పిన సారాన్ని అంబేద్కర్‌ వివరించాడు. 'పరిపక్వత కూడా మౌఖిక, మానసిక, శారీరకాంశాల నుంచే వస్తుంది. బోధిసత్వుడైనవాడు ఒక ధర్మాన్నే పరిశీలన చేయడు. సకల ధర్మాల మౌఖిక సూత్రాలను, వాటి పూర్వాపరాలను పూర్తిగా పరిశీలించి నిగ్గుతేలుస్తాడు. ఇతరులు సహితం అలా తారతమ్య పరిశీలన చేసేందుకు తోడ్పడతాడు' అని అంబేద్కర్‌ వివరించాడు. అంబేద్కర్‌ మరొక మహోన్నత విషయాన్ని కూడా సాధించాడు. బుద్ధుని సిద్ధాంతాల్లోనూ, మార్క్స్‌ సిద్ధాంతాల్లోనూ వైరుధ్యాలను, సమన్వయాలను ముందుకు తెచ్చాడు. బుద్ధుడు క్రీస్తుపూర్వం 563లో జన్మించాడు. కారల్‌మార్క్స్‌ 1818లో పుట్టాడు. వీరిరువురికీ మధ్య 2381 సంవత్సరాల తేడా ఉంది. పీడితుల తరపున నిలబడి, ఆచరణాత్మక సిద్ధాంతాలు నిర్మించి పోరాడిన వీరిరువురి గురించి పీడితుల విముక్తికై సిద్ధాంతవేత్తగా, ఆచరణవాదిగా ముందుకు వచ్చిన అంబేద్కర్‌ ప్రపంచానికి ఒక నూత్న సందేశాన్ని అందించడానికి వీరిరువురిలోని ప్రగతిశీల అంశాలను ముందుకు తెచ్చాడు. బుద్ధుణ్ణి గురించి అంబేద్కర్‌ వివరిస్తూ బుద్ధుడు కేవలం అహింసావాది మాత్రమే కాదు. ఆయన మానవ జీవితాన్ని ప్రభావితం చేసి ముందుకు తీసుకుపోదగిన సజీవ సిద్ధాంతాలను రూపొందించారని వివరించాడు. బుద్ధుని సూత్రాలు, ధర్మాలు మానవ పరిణా మానికి ఉపయుక్తంగా ఉండడమే కాక మానవత్వాన్ని మూల కేంద్రంగా కలిగి ఉన్నాయి. బుద్ధుడు దుఃఖాన్ని నివారిం చాలన్నాడు, మార్క్సు దోపిడీని నిర్మూలించాలన్నాడు. దుఃఖం ఎక్కడుంది? దోపిడీలోనే ఉంది! అందుకే ఇద్దరూ చెప్పింది ఒక్కటే. సాధించే మార్గాలు వేరు అన్నాడు అంబేద్కర్‌. మార్క్స్‌ ప్రపంచాన్ని మార్చే సూత్రాలు ప్రవచించాడు. తత్వశాస్త్రం సమాజాన్ని మార్చగలిగి ఉండాలన్నాడు. దేవుడు లేడని నమ్మినప్పుడే తత్వశాస్త్రం మెదడుకు ఎక్కుతుందని మార్క్సు బోధించాడు. అంబేద్కర్‌ కూడా బౌద్ధాన్ని తత్వంగానే స్వీకరించాడు కాని మతంగా కాదు. ఈనాడు బుద్ధుణ్ణి, మార్క్స్‌ను అన్వయించుకోవడం ఒక చారిత్రక సందర్భం. మార్క్సిస్టులు , అంబేద్కరిస్టులు ఈ చారిత్రక సందర్భంలో ఈ కర్తవ్యాన్ని సమన్వయంతో నిర్వహించాలి. అప్పుడే అస్పృశ్యత లేని, కులం లేని సమసమాజ భారతం ఏర్పడుతుంది.  - డాక్టర్‌ కత్తి పద్మారావు

|| జానపద ప్రజా వాగ్గేయకారుడు బాబ్ డిలాన్ ||



బాబ్ డిలాన్ కవితలు  నన్ను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. అప్పట్నించీ డిలాన్ కవితల పుస్తకం కోసం కలవరిస్తున్నా. 89లో ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి వెళ్లినపుడు, చివరిరోజు పుస్తకాల షాపుకి వెళ్లినపుడు కనిపించింది ‘బాబ్ డిలాన్ లిరిక్స్ 1962-1985’. వెంటనే కొనుక్కున్నా. హైదరాబాద్ రెలైక్కి దిగేవరకూ చదువుతూనే ఉన్నా. నవ్వుతూ. ఏడుస్తూ. కోపంతో రగులుతూ.

Wednesday, 12 October 2016

|| ‘భూతల స్వర్గం’ రక్త చరిత్ర ||




భారత్‌–పాకిస్థాన్‌ ఉద్రిక్తతలకు మూల కారణం కశ్మీరే. రెండు దేశాలూ ఆ సమస్యను  ఆధిపత్యం, యుద్ధబలం లాంటి విషయాలకు పరిమితం చేస్తున్నాయి. కశ్మీర్‌ను భూభాగంగా చూస్తున్నాయి. కశ్మీర్‌ అంటే భూభాగమే కాదు. ప్రజలు, వారి విశ్వాసాలు, అభిప్రాయాలు, ఆచారాలు, వారి జీవితాలు. కశ్మీర్‌ను భారత్‌లో భాగంగా నిలుపుకోవా లంటే మన ప్రభుత్వాలు, పార్టీలు రాజకీయాలకు అతీతంగా, కశ్మీరీల మనోభావాలను గెలవ యత్నించాలి. దొంగదారులు వెతకడం మాని, దూరదృష్టితో ఆలోచించాలి.

|| నిరుద్యోగుల ఉత్పత్తి యంత్రం ... రోబో ||




                   మరో యాభయ్యేళ్లలో ఈ ప్రపంచం ఎంతగానో మారనుంది. ఇళ్లు వాకిళ్లు, కార్యాలయాలు కార్ఖానాలు, హోటళ్లు హాస్పిటళ్లు, విద్యాలయాలు వినోదశాలలు అన్న బేధం లేకుండా ఎక్కడ చూసినా రోబోలదే హవా. ఒక్క మాటలో చెప్పాలంటే సగానికి సగం ఉద్యోగాలను రో బోలు, యంత్రాలే కానిచ్చేస్తాయన్నది నిపుణుల మాట. ఇంతకీ యంత్రుల ప్రభావం ఏ దేశంపై ఎంత వుంటుంది? ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు ఊడతాయి? అంతమంది ఉద్యోగాలకు ఎసరొస్తే దిక్కేమిటి?

|| నయ వంచన ||

             విధి నిర్వహణలో గాయపడి, వికలాంగులయ్యే సైనికులకు ఇచ్చే పింఛన్లలో కోత పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దారుణం. పైగా ఈ నిర్ణయాన్ని గుట్టు చప్పుడు కాకుండా వెలువరించిన తీరు, దానికి ఎంచుకున్న సమయం మోడీ సర్కారు నయ వంచనకు నిదర్శనం. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో సైన్యం ఇటీవల నిర్వహించిన సర్జికల్‌ దాడుల తరువాత నె లకొన్న ఒక రకమైన ఉద్విగ వాతావరణాన్ని స్వప్రయోజనాల కోసం మోడీ సర్కారు వాడుకుంది. సైనికుల వీరత్వాన్ని, వారి త్యాగాన్ని కూడా తమ గొప్పగా చెప్పుకుంటూ ఎన్నికల ప్రచారానికి ముడి సరుకుగా మార్చుకునే వికృత వ్యూహానికి తెర తీసింది.

Monday, 10 October 2016

# మనోభావాలతో మీడియా ఆట #




            సిఎన్‌బిసి, ఎన్‌డిటివి, 24×7, జీ న్యూస్‌ వంటి జాతీయ చానళ్ళు, ఇంకెన్నో స్థానిక చానళ్ళను చూస్తే ప్రభుత్వం ప్రకటించకుండానే భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధం మొదలై పోయిందేమో అనిపిస్తుంది. తలా తోకా లేని చర్చలు, నమ్మశక్యం గాని విశ్లేషణలతో దేశభక్తి పేరుతో ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఈ తరు ణంలో నిష్పక్షపాతంగా కొన్ని నిజాలను చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీడియా ప్రచా రం చేస్తున్నట్లు యుద్ధమంటే గెలుపు, యుద్ధమంటే పరువు ప్రతిష్టలు మాత్రమే కాదు. యుద్ధమంటే రక్తం, యుద్ధమంటే కోట్లాది ప్రాణాలతో చెలగాటం.

|| చార్వాకుల నుండి రోహిత్‌ వరకు భావజాల యుద్ధం ||




           వేముల రోహిత్‌ దళితుడు కాదని మానవ వనరుల అభివృద్ధి శాఖ నియమించిన అలహాబాద్‌ హైకోర్టు విశాంత్ర న్యాయమూర్తి రూపన్‌వాల్‌ కమిటీ ఇచ్చిన నివేదిక సత్యదూరమైందని భారతదేశంలో ఉన్న దళితులు, ప్రజాస్వామ్యవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఆత్మహత్యకు గురైన రోహిత్‌ అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (ఎఎస్‌ఎ) సభ్యుడు. ఈ సంస్థను 1994 ఏప్రిల్‌ 14న సెంట్రల్‌ యూనివర్సిటీలో దళిత విద్యార్థులు ఆవిష్కరించారు. మొదటి ప్రారంభోత్సవ సభలో ముఖ్య అతిథిగా నేనే ప్రసంగించాను. 1991 చుండూరులో జరిగిన మారణ హోమానికి నిరసగా సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి డాక్టర్‌ పట్టేటి రాజశేఖర్‌ నాయకత్వంలో ఒక బస్సులో దళిత విద్యార్థులు చుండూరు వచ్చారు. అప్పుడే మేము సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎఎస్‌ఎను రూపొందించాలని నిర్ణయించాం. డాక్టర్‌ అంబద్కర్‌ పేరుతో భారతదేశంలో విశ్వవిద్యాలయాల్లో మొదట పెట్టిన ఆర్గనైజేషన్‌ ఇది. బ్రాహ్మణవాద ఆధిపత్యాన్ని ఎదుర్కొనడం కోసం పెద్దఎత్తున ఎఎస్‌ఎ పోరాటం చేసింది. దీనికి అనుబంధ సంస్థగా 'దళిత సాహిత్య వేదిక' కూడా ఉండేది. దళిత సాహిత్య వేదిక తరపున 1995లో గుండెడప్పు సంకలనాన్ని డాక్టర్‌ పట్టేటి రాజశేఖర్‌, నాగప్పరాజు సుందరరాజు సంపాదకులుగా తీసుకువచ్చారు. ఇందులో కవులు 'అమ్మ కడుపులోనే నేను ఎవరో తేల్చేశారు.నా పేరు కన్నా ముందే నా కులం, మతం నిర్ణయించేశారని' ఉక్కు గొంతుతో పలికారు. ఈ గ్రంథాన్ని అనేకసార్లు నేను ఆవిష్కరించాను. 1995లో సునీత అనే దళిత విద్యార్థినిని యోగేశ్వరరెడ్డి అనే సవర్ణుడు మోసం చేసినప్పుడు పెద్దఎత్తున ఎఎస్‌ఎ పోరాటం చేసింది. యోగేశ్వరరెడ్డిని చెప్పులతో కొట్టి విశ్వవిద్యాలయంలో ఊరేగించింది. బిజెపి, విశ్వహిందూ పరిషత్‌, ఆర్‌ఆర్‌ఎస్‌ భావజాలాలను ప్రచారం చేసే ఎబివిపిని మొదటి నుంచి ఎఎస్‌ఎ సమర్థవంతంగా ఎదుర్కొంది. ఆ తర్వాత దళిత ఉపాధ్యాయులుగా వచ్చిన కెవై రత్నం, శ్రీపతిరాముడు, అంతకుముందు నుంచి పనిచేస్తున్న ప్రొఫెసర్‌ గుమ్మడి నాంచారయ్య, ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌, ప్రొఫెసర్‌ టి కృష్ణ, ప్రొఫెసర్‌ సునీతారాణి ఎందరో ఈ ఉద్యమాన్ని ప్రోత్సహించారు. మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ ఈ సంఘానికి అండగా నిలబడింది. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ పేరును ఈ అసోసియేషన్‌కు పెట్టడానికి కారణం అంబేద్కర్‌ ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని అత్యున్నతమైన విద్యను ఆర్జించారు. కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎ పట్టా, ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్‌ పొందడం సామాన్యమైన విషయం కాదు. అందుకోసం ఆయన లండన్‌ మ్యూజియం లైబ్రరిలో గంటల కొద్దీ చదివారు. అందుకే ఆయన ఆ డిగ్రీలు చేయగలిగాడు. కాని ఇప్పుడు భారతదేశంలో రోహిత్‌వంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ముఖ్యంగా కులవివక్ష విశ్వవిద్యాలయాల్లో బలంగా ఉండటమే. దళితులు మూలవాసులు కావడం, శ్రమ నుంచి రావడం వలన వీళ్ళకు చాలా జ్ఞానం ఉంటుంది. అందువల్ల యూనివర్సిటీల్లో ఉండే హెచ్‌ఒడిలు వీళ్ళ సామర్థ్యానికి, అవగాహనకు ఆశ్చర్యపోతారు, ద్వేషపడతారు. త్వరగా డిగ్రీలు ఇవ్వరు. వీరి మనస్సులు గాయపరుస్తారు. వీరికి బతుకు మీద విరక్తి కలిగించే ప్రయత్నం చేస్తారు. అయితే వీరికి ఉన్న అంబేద్కర్‌ భావజాలం వల్ల, అంబేద్కర్‌ జీవిత అధ్యయనం వలన బ్రాహ్మణవాదులను ఎదిరించి నిలబడగలుగుతారు. అయితే ఈ సంఘం కులం ప్రశ్నను విశ్వవిద్యాలయాల్లో ముందుకు తీసుకువచ్చింది. భారతదేశ వ్యాప్తంగా ఈ రోజున విశ్వవిద్యాలయాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. విద్యావంతమైన విశ్వవిద్యాలయాల్లో కులం ఇంత బలంగా ఉండటానికి కారణం ఏమిటి? కాని దీనికి మూలమైన విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. అగ్రకులాల మెదడులో ఉన్న కుల భావం పోనిదే, అస్పృశ్యత భావం పోనిదే ఈ సమస్యకు పరిష్కారం లేదు. ఒకపక్క దళిత విద్యార్థులు అంబేద్కర్‌ భావజాలాన్ని విస్తృతంగా విశ్వవిద్యాలయాల్లోకి తీసుకువస్తున్నారు. ఈనాడు కులనిర్మూలన భావం ఒక చారిత్రక అవసరం. మొత్తం మీద దేశవ్యాప్తంగా సెంట్రల్‌ యూనివర్సిటీల్లో కుల వివక్ష నిర్మూలనపై చర్చించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ వైస్‌ ఛాన్సలర్‌ల సమావేశాన్ని ఏర్పాటుచేసి చర్చించింది కూడా. వేముల రోహిత్‌ తాను ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినవి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఎబివిపి) నాయకుడొకరిపై దౌర్జన్యం చేశారన్న ఆరోపణపై కొంతకాలం క్రితం యూనివర్సిటీ బహిష్కరించిన అయిదుగురు విద్యార్థుల్లో రోహిత్‌ ఒకరు. 
ఆదివారం ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన లేఖలో తన మరణానికి ఎవరూ (మిత్రులైనా, శత్రువులైనా) కారకులు కాదని పెద్ద మనసుతో చెప్పినా, ఆ లేఖ ఎంతో కవితాత్మకంగా, తాత్వికతతో రాసిన ఆ లేఖ... రోహిత్‌ సున్నిత మనస్తత్వానికీ, ఆయన ఎదుర్కొన్న సమస్యలకూ, ఆయనలో కలిగించిన మనోవేదనకూ అద్దం పట్టింది. తారస్థాయికి ఎదగాలని ఆకాంక్షించిన ఒక సృజనాత్మక యువ తేజం మధ్యలోనే ఆరిపోయింది. విద్యాలయాల్లోనైనా, విశ్వవిద్యాలయాల్లోనైనా విద్యార్థి సంఘాలుండటం.. వాటి మధ్య నిరంతర భావ సంఘర్షణ కొనసాగుతుండటం అసహజం కాదు. అలాంటివి జరిగినప్పుడు నిబంధనలను అనుసరించి విద్యాసంస్థ వ్యవహరిస్తుంది. కేసులేమైనా ఉంటే న్యాయస్థానాలు విచారించి చర్యలు తీసుకుంటాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఈ ప్రక్రియ దెబ్బతింది. కులాధిపత్యం వేపు రాజ్యం కొమ్ము కాసింది. ప్రభుత్వంలో ఎబివిపిలో పనిచేసిన మంత్రులు ఉండటం వలన ఇది రాజకీయ ఆధిపత్యానికి దారితీసింది. రాజ్యం, విశ్వవిద్యాలయ యాజమాన్యం ఏకమై అంబేడ్కర్‌ భావజాల వారసులపై చర్యకు పూనుకొన్నాయి. ఈ సస్పెన్షన్‌ ఒక నాటకీయ ఫక్కీలో జరిగింది. అయిదుగురు దళిత విద్యార్థులు రోడ్డున పడవలసి వచ్చింది. విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న వరుస ఉదంతాలను ఒక్కసారి గమనిస్తే ఈ విద్యార్థులకు జరిగిన అన్యాయం ఎటువంటిదో అర్థమవుతుంది. అయితే విశ్వవిద్యాలయం నియమించిన బోర్డే ఈ ఆరోపణకు తగిన ఆధారాలు లభించలేదని మధ్యంతర నివేదికలో తెలిపింది. ఇలాంటి ఘటనలు ఇక ముందు చోటు చేసుకోకుండా ఇరు పక్షాలనూ హెచ్చరించి దీన్ని ముగించాలని పేర్కొంది. ఆ నివేదిక ఆగస్టు 12 నాటిది. మరో 19 రోజులకు.. అంటే ఆగస్టు 31న ఆ బోర్డే తుది నివేదిక ఇచ్చింది. అయిదుగురు దళిత విద్యార్థులను సస్పెండ్‌ చేయాలని ఆ తుది నివేదిక సిఫార్సు చేయడం, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం చకచకా పూర్తయ్యాయి. ఈ రెండు నివేదిక మధ్య ఏమైంది? ఇంత పరస్పర విరుద్ధమైన నివేదికల్ని బోర్డు ఎలా ఇవ్వగలిగింది? కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఆగస్టు 17న లేఖ రాసిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలే ఇందుకు కారణమని ఎఎస్‌ఎ నిగ్గుతేల్చింది. లేఖ రాసిన మాట నిజమే అయినా, తనకు తెలిసిన అంశాలను స్మృతి ఇరానీ దృష్టికి తీసుకురావడమే చేశానంటున్నారు దత్తాత్రేయ. ఈ కథనాన్ని బట్టి రోహిత్‌ మరణం వెనుక బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ హస్తం బలంగా ఉందనేది స్పష్టమవుతుంది. మద్రాసు ఐఐటికి సంబంధించిన ఒక విషయంలో కూడా స్మృతి ఇరానీ కలుగచేసుకుని అంబేద్కర్‌ పెరియార్‌ స్టడీ సర్కిల్‌ను రద్దు చేయటం జరిగింది. భారతదేశవ్యాప్తంగా అంబేద్కర్‌ ఆలోచనా విధానం మీద దాడి చేయాలని పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఇకపోతే ప్రొఫెసర్‌ అప్పారావును వైస్‌ఛాన్సలర్‌గా నియమించిన వెంటనే హాస్టళ్ళ నుండి, అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌ నుండి, విద్యార్థి సంఘం ఎన్నికల నుండి ఈ అయిదుగురు దళిత రీసెర్చ్‌ స్కాలర్లను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘటనపై ఎలాంటి విచారణ జరపకుండానే యూనివర్శిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సస్పెన్షన్‌ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయం సామాజిక బహిష్కరణ కిందకు వస్తుంది. బహిష్కృతులైన విద్యార్థులందరూ ఆర్థికంగా కూడా పేదలు. సస్పెన్షన్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ వారు నెలలుగా హాస్టళ్ళ ముందు నిరసన వ్యక్తం చేశారు. అయినా కానీ పాలనా యంత్రాంగం వారి డిమాండ్‌ పట్టించుకోలేదు. ఆ నిర్లక్ష్యమే రోహిత్‌ జీవితాన్ని బలితీసుకుంది. అగ్రవర్ణాల రక్తదాహాన్ని తీర్చడం కోసం వారు ఇంకా దళిత నెత్తురు తాగాలని చూస్తున్నారు. అసలు హంతకుదారులపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలని ఆనాడు విద్యార్థి లోకం డిమాండ్‌ చేసింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు కాని నిందితులను అరెస్ట్‌ చేయలేదు. నిజానికి ఎఎస్‌ఎకు, ఎబివిపికి మధ్య జరుగుతున్నది భావజాల యుద్ధం. ఈ విషయంగా ఎఎస్‌ఎ ఒక స్పష్టమైన సమాధానాన్ని ప్రకటించింది. ఒకప్రక్క రోహిత్‌ వేముల ఆత్మహత్య (హత్య) ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. అటు హార్వార్డ్‌ వర్సిటీ మొదలు ఆస్ట్రేలియా, భారత్‌లోని అనేక వర్సిటీల్లో కేంద్ర ప్రభుత్వం, వర్సిటీ యంత్రాంగానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, ఇతర హిందుత్వ శక్తులు రోహిత్‌ హత్యకు సంబంధించి అసత్యాలు ప్రచారం చేశారు. అస్పృశ్యత గ్రామాల నుండి విశ్వవిద్యాలయాలకు పాకిందని దీనిలో రుజువవుతోంది. విశ్వవిద్యాలయాలు విద్యా సంపన్నమైనవి కదా! విద్య కులాన్ని పోగొట్టవలసింది. కులాధిపత్య, మతాధిపత్య భావాలు ఎందుకు విశ్వవిద్యాలయాల్లో పెరుగుతున్నాయి అనేది ప్రశ్న. అగ్రవర్ణ విద్యార్థులు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ నేచురల్‌ సైన్సులో బలహీనంగా ఉంటారు. కర్మకాండకు సంబంధించిన కులాలు అవి. వారు పైరవీలతో, కాకాలతో, బానిసత్వంతో ఊడిగం చేసి డిగ్రీలు సంపాదిస్తారు. దళిత విద్యార్థులు ఆత్మగౌరవంతో పోరాడతారు. అంబేద్కర్‌ లాగే లైబ్రరీల్లో చదివే దళిత విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువే. కడుపు నిండినవాడి చదువుకి, పేదరికం నుండి, అస్పృశ్యత నుండి, ఆకలి నుండి వచ్చినవాడి చదువుకి చాలా తేడా ఉంది. సెంట్రల్‌ యూనివర్సిటీల్లోనే కాదు, విశ్వవిద్యాలయాలు, కాలేజీలు, పాఠశాల స్థాయిల్లో కూడా ఈ వివక్షత నిరంతరంగా జరుగుతుంది. ఈ హిందూత్వ భావజాలాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వ హిందూ పరిషత్‌ నిరంతరంగా తీసుకెళుతున్నాయి. అయితే వేముల రోహిత్‌ మరణం దేశీయ స్థాయిలో కులం ప్రశ్నను ముందుకుతెచ్చింది. కులాన్ని, అస్పృశ్యతను సమాజంలో రూపుమాపే వరకు విశ్వవిద్యాలయాల్లో కూడా రూపుమాయదు. కులం పునాదిని కూల్చకుండా భారతదేశ సమాజాన్ని మార్చలేమని అంబేద్కర్‌ చెప్పారు. కులం పునాది అంటే హిందూ మతమేనని ఆయన చెప్పాడు. ఏ సిద్ధాంతమైనా ఒక దేశపు సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు సమన్వయించేటప్పుడు ఆ దేశ చారిత్రక, భౌతిక పరిస్థితులను శాస్త్రీయ పద్ధతుల్లో అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ఈ దేశంలో సామాజిక విప్లవాన్ని విజయవంతం చేయడానికి పనిచేస్తున్న మార్క్సిస్టులు, మార్క్సిస్టు లెనినిస్టులు, అంబేద్కరిస్టులు ఈనాటి చారిత్రక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సిద్ధాంతాలను సమన్వయం చేసుకోవలసిన అవసరాన్ని గుర్తించాలి. ఇది భావజాల యుద్ధం. ఇది చార్వాకుల దగ్గర నుండి అంబేద్కర్‌ వరకు, అంబేద్కర్‌ దగ్గర నుండి ఈనాటి వరకు జరుగుతుంది. ఇందులో రోహిత్‌ ఒక మలుపులో నిలబడ్డాడు. ఇది చారిత్రక గుర్తు.  - డాక్టర్‌ కత్తి పద్మారావు.

Friday, 7 October 2016

|| రోహిత్‌ వేములకు మళ్లీ అన్యాయం ||



రోహిత్‌ వేముల మరణానికి కారణాల కంటే అతని కులమే పాలకులకి ప్రధానమైన విష యంగా మారటానికి కారణం, ఆ కేసులో నింది తులను తప్పించటానికేనని దేశంలోని దళితులం దరి అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే రోహిత్‌ దళితుడు కాదని చెప్పిన రూపన్‌వాలా కమిషన్‌ రిపోర్టు దళితుల్లో పలు అనుమానాలను కలిగి స్తోంది. పాలకుల అభీష్టాన్నే ఆ కమిషన్, రిపోర్టు రూపంలో బయటపెట్టిందన్న చర్చ మొదలైంది.

|| ఎట్టకేలకు హెచ్‌ఐవీ బిల్లు ||



దాదాపు రెండు దశాబ్దాలుగా సామాజిక, ఆరోగ్య కార్యకర్తలు ఎదురుచూస్తున్న హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌(నివారణ, నియంత్రణ) ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఆమోదించింది. ఇది చట్టసభల మెట్లెక్కి చట్టంగా మారితే ఆ రోగాల బారిన పడినవారి విషయంలో వివక్ష చూపించేవారిపై కఠిన చర్యలుం టాయి. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ రోగులకు వైద్యం నిరాకరించినా... విద్యాసంస్థల్లో, పనిచేసే స్థలాల్లో వారిని రానీయకపోయినా రెండేళ్ల వరకూ జైలు శిక్ష, గరిష్టంగా లక్ష రూపాయల జరిమానా విధించేందుకు ముసాయిదా బిల్లు వీలు కల్పిస్తోంది. బిల్లు అవసరం గురించి ఎన్నో ఏళ్లనుంచి డిమాండ్‌ ఉంది.

Thursday, 6 October 2016

|| మహా మానవతావాది శంకరన్ ||


# నేడు ఎస్ ఆర్ శంకరన్ వర్ధంతి  #

ఐఏఎస్ అధికారి అంటేనే అధికారానికీ, ఆర్భాటానికీ, అజమాయిషీకీ పర్యాయపదంలా అనిపిస్తుంటారు. ఆ పదవిని, దాని హోదాను సమాజ హితం కోసం కాక, తమ గౌరవ ప్రతిష్టల కోసమే ప్రధానంగా వాడుకునే పరిస్థితి మనది. ఒకరకంగా చెప్పాలంటే ఐఏఎస్‌ను పరి పాలనా విభాగంపై ఆధిపత్యానికి ఒక వాహకంగా భావి స్తుంటారు. అంతే తప్ప ఆ పదవి  ప్రాధాన్యతను అర్థం చేసుకొని దానికి గౌరవం దక్కేలా వ్యవహరించేవారు అతి స్వల్పమనే చెప్పాలి.

# నిజం ఖూనీ #



                                     రోహిత్‌ వేముల తల్లి రాధిక అక్రమంగా రిజర్వేషన్‌ సదుపాయాలు పొందేందుకే తనను తాను దళితురాలిగా 'చిత్రించుకున్నారు'... రోహిత్‌ను హాస్టల్‌ నుంచి బహిష్కరించాలని వర్సిటీ అధికారులు తీసుకున్న నిర్ణయం 'అత్యంత సహేతుకమైంది'... రోహిత్‌ ఆత్మహత్యకు అతని వ్యక్తిగత సమస్యలే కారణం తప్ప 'వివక్ష కాదు'.... కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలు 'తమ బాధ్యతల్ని నిర్వర్తించారే' తప్ప హెచ్‌సీయూ అధికారులపై ఎలాంటి ఒత్తిడీ చేయలేదు....

# చరిత్రకు అడ్డుకట్ట #


ప్రముఖ చరిత్ర కారుడు బిపన్‌చంద్ర నేడు జీవించి ఉండకపోవచ్చు, కానీ మతతత్వం, స్వాతంత్య్ర పోరా టంపై ఆయన ముక్కుసూటి గా వెల్లడించిన భావాల వల్ల అసౌకర్యంగా ఉన్న వారిని ఆయన ప్రాణం వెంటాడుతూనే ఉంటుంది. తాజా సమస్య ఏమంటే బిపన్‌చంద్ర రచించిన ''మతతత్వం- ప్రాథమిక వాస్తవాలు'' అనే పుస్తకం హిందీ అనువాద ప్రచురణను నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ అధికారికంగా రద్దుచేసింది.

Tuesday, 4 October 2016

|| గల్ఫ్ లో దగాపడిన తెలుగోళ్ళ బాధల గాధలు ||

|| 
కుటుంబ బాధ్యతలతో చిన్న వయసులో ఎడారులకు వచ్చి చివరకు తమ జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకున్న తెలుగు ప్రవాసులు చాలా మంది వున్నారు. ధనమే అన్నిటికీ మూలమైనందున, ఆత్మీయతలు, అనుబంధాలు కోల్పోయిన వారి మనోవేదన వర్ణనాతీతం.

|| యుద్ధం వద్దు ||


కశ్మీర్‌ విషయంలో పాకిస్థాన్ చేస్తున్న తప్పు మనం బలూచిస్తాన్‌ విషయంలో చేయరాదు. పాలకులు, ప్రభుత్వేతర నాయకులు, మాధ్యమాలు ప్రజలను రెచ్చగొట్టరాదు. ఆవేశాలకూ, భావోద్రేకాలకూ గురిచేసి యుద్ధోన్మాదాన్ని ప్రేరేపించరాదు. ప్రతీకార వాంఛలను ప్రోత్సహించరాదు. యుద్ధం వైపు అడుగులెయ్యరాదు.

Monday, 3 October 2016

|| కేరళ ముందడుగు ||



              ఒక బూర్జువా-భూస్వామ్య సమాఖ్య రాజ్యంలో ఒక ప్రాంతీయ ప్రత్యామ్నాయ అభివృద్ధి వ్యూహాన్ని అమలు చేయటం సాధ్యమా? భారత దేశంలోని వామపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి ప్రయత్నాలలో కేరళది విజయ గాథ. సాధారణ పౌరులకు కనీస అవసరాలైన విద్య, ఆరోగ్య సంరక్షణ, గృహ వసతి, వృద్ధాప్యంలో సామాజిక భద్రత వంటి సౌకర్యాలను కేరళలోని వామపక్ష ప్రభుత్వం అందించగలుగు తున్నది. వీటన్నింటి ప్రభావంతో కేరళ ప్రజల జీవన ప్రమాణాలు బాగా పెరిగాయి.

|| ప్రజాఉద్యమాలపై పోలీసు ఉక్కుపాదం ||



నవ్యాంధ్రల తెలుగుదేశం ప్రభుత్వం నిరంకుశ పాలనను పాదుకొల్పుతున్నదనడానికి ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలే రుజువు. చంద్రబాబు సర్కారు వచ్చీ రావడంతోనే నాగార్జున విశ్వవిద్యాలయంలో అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని గొంతెత్తిన విద్యార్థులపై ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ యాక్టు బనాయిస్తామని స్వయంగా ముఖ్యమంత్రే బెదిరించారు. టీచర్ల మీటింగ్‌లో మరో అడుగు ముందుకేసి తమ సంఘం అడిగితేనే జీతాలు పెంచుతామన్నారు.

|| గల్ఫ్‌ సుడిగుండం ||


*పర్యాటక వీసాలతో మోసాలు 
*అమానుష సంఘటనలు 
*ఛిద్రమవుతున్న కుటుంబాలు 
*నకిలీ ఏజెంట్లు.. నడుం విరగ్గొడుతున్నారు 
*పేదల్ని సమిధలు చేస్తున్నా వీరికి ఎదురే లేదు 
*ఆట కట్టించే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లో లేనేలేదు 

|| ప్రపంచలోనే అద్భుతాలు కమ్యూనిస్టు చైనా కట్టడాలు ||



ఆకాశం నుంచి వ్యోమగాములు భూమి మీదకు చూస్తే సన్నని గీత మాదిరిగా కనిపిస్తుంది చైనా గోడ. ఎన్నో శతాబ్దాల క్రితమే ఇంత భారీ కట్టడాన్ని నిర్మించిన ఘనత చైనా సొంతం. ఇదే వారసత్వాన్ని ఈ ఆధునిక ప్రపంచంలోనూ ఆ దేశం కొనసాగిస్తోంది. ప్రపంచం అబ్బురపడే కట్టడాలను నిర్మిస్తోంది. రైల్వే లైన్లు, స్టేషన్లు, వంతెనలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, అత్యాధునిక భవనాలు, పరిశోధనా కేంద్రాలు... ఒకటేమిటి, నిర్మాణ రంగంలో తమను తలదన్నే వారే లేరన్నట్లుగా చైనా మున్ముందుకు దూసుకుపోతోంది. ఎక్కడైనా గ్రామాలు, పట్టణాలు సహజంగా ఏర్పడతాయి. కానీ చైనా కొత్తగా వూళ్లకు వూళ్లే నిర్మిస్తోంది. చైనాలో ఇటీవల నిర్మాణం పూర్తయిన, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న దాదాపు 30 కి పైగా ప్రాజెక్టులు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వీటిపై చైనా ప్రభుత్వ సంస్థలు 150 బిలియన్‌ డాలర్ల వరకూ (దాదాపు రూ. 10 లక్షల కోట్లు) వెచ్చిస్తున్నాయి.

# పెరల్‌ రివర్‌ డెల్టాలో మహానగరం #

కొత్త వూళ్లు నిర్మించటంలో చైనా ఘనత తెలియనిదేం కాదు. తాజాగా ఒక భారీ నగరాన్ని ఆవిష్కరించే పనిలో ఆ దేశం నిమగ్నమై ఉంది. చైనా దక్షిణ ప్రాంతంలో పెరల్‌ రివర్‌ డెల్టా ప్రాంతంలో దగ్గర దగ్గరగా తొమ్మిది పట్టణాలు ఉన్నాయి. వీటిని కలిపి ఒకే మెగా సిటీగా ఏర్పాటు చేయాలని తలపెట్టారు. ఇందులో భాగంగా ఆయా పట్టణాల మధ్య భాగంలోని ఖాళీ ప్రదేశాల్లో భారీ నిర్మాణాలు చేపట్టారు. ఈ నగరాల్లో ఇప్పుడున్న జనాభా 4.2 కోట్ల మంది కాగా ఈ మెగాసిటీ ఆవిర్భవించే నాటికి జనాభా సంఖ్య 8 కోట్లకు పెరుగుతుందని అంచనా. దీనిపై 322 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తారు. 2030 నాటికి ఇది పూర్తవుతుంది.

# షాంగై సైకోట్రాన్‌ రేడియేషన్‌ ల్యాబరేటరీ #

శాస్త్రసాంకేతిక ఆవిష్కరణలకు చైనా అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందుకు అవసరమైన ల్యాబరేటరీలు, ఇతర సౌకర్యాల కోసం పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తోంది. ఇటువంటి షాంగై సైకోట్రాన్‌ రేడియేషన్‌ ల్యాబరేటరీ. దాదాపు 176 మిలియన్‌ డాలర్లు వెచ్చించి నిర్మించి ఈ ల్యాబ్‌లో ఎంతో ప్రధానమైన పరిశోధనా ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. చైనాలో ఎంతో ఖరీదైన పరిశోధనా కేంద్రం కూడా ఇదే.

# బాల్టిక్‌ పెరల్‌ ప్రాజెక్టు #

చైనా ఇతర దేశాల్లో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ సమీపంలో నివాస, వాణిజ్య భవన సముదాయాన్ని బాల్టిక్‌ పెరల్‌ ప్రాజెక్టు అనే పేరుతో నిర్మిస్తోంది. ఇది 1.3 బిలియన్‌ డాలర్ల భారీ ప్రాజెక్టు. దీన్నొక ఇంజనీరింగ్‌ అద్భుతంగా భావిస్తున్నారు.

# 128 అంతస్తుల షాంగై టవర్‌ #

ఆకాశహర్మ్యాలకు అమెరికా, ఐరోపా దేశాలు పెట్టింది పేరు. కానీ చైనా వాటిని అధిగమిస్తోంది. ప్రపంచంలోనే రెండో అతి పొడవైన భవనం షాంగైలో రూపుదిద్దుకుంది. ‘షాంగై టవర్‌’ అనే పేరుతో నిర్మించిన ఈ భవనం పొడవు 2,078 అడుగులు. దీన్లో 128 అంతస్తులు ఉన్నాయి. ఈ భవన నిర్మాణానికి చైనా 2.4 బిలియన్‌ డాలర్లు వెచ్చించింది.

# జియాంఝౌ బే బ్రిడ్జి #

దాదాపు 26మైళ్ల పొడవు ఉండే జియాంఝౌ బే బ్రిడ్జి నిర్మాణం శరవేగంగా సాగింది. అన్ని హంగులతో దాదాపు సిద్ధమైంది. దీనికి 16 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టారు. ఇది ఒక మారథాన్‌ పరుగుపందెం నిర్వహించటానికి అనువైన రన్నింగ్‌ ట్రాక్‌ మాదిరిగా ఉంటుందనటంలో ఆశ్చర్యం లేదు.

# సు-టాంగ్‌ యాంగ్‌ట్జీ నదిపై  కేబుళ్ల‌తో..#

సు-టాంగ్‌ యాంగ్‌ట్జీ నదిపై ఎంతో ఆకట్టుకునే రీతిలో తీగల వంతెన (కేబుల్‌ బ్రిడ్జి) నిర్మించారు. దీనికి 7.89 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు. ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద తీగల వంతెన. 3,600 అడుగుల పొడవు ఉన్న ఈ వంతెన నాన్‌టాంగ్‌- ఛంగ్‌షు నగరాలను కలుపుతుంది. హాంగ్‌కాంగ్‌-ఝుహై- మకావ్‌ ప్రాంతాలను కలుపుతూ 10.6 బిలియన్‌ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న మరొక వంతెన 2017 నాటికి పూర్తవుతుంది.

# వుహాన్‌ రైల్వే స్టేషన్‌ #

వుహాన్‌ రైల్వేస్టేషన్‌ నిర్మాణాన్ని చూస్తే ఇక్కడేదో విమానాశ్రయం నిర్మాణంలో ఉందనిపించకమానదు. ఈ మార్గంలో రైళ్లు గంటకు 186 మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి. అందుకే వుహాన్‌ రైల్వే స్టేషన్‌ ను ఎంతో సౌకర్యవంతంగా, ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి. 2.12 బిలియన్‌ డాలర్లు వెచ్చిస్తున్నారు.

# బీజింగ్‌-షాంగై హైస్పీడ్‌ రైల్వే #

ప్రపంచంలోనే అత్యంత పొడవైన, అత్యంత వేగవంతమైన రైలు మార్గం చైనాలో ఉంది. ఇది బీజింగ్‌, షాంగై నగరాలను కలుపుతుంది. ఈ హైస్పీడ్‌ రైలు మార్గాన్ని 35 బిలియన్‌ డాలర్లతో నిర్మించారు. ఒకే దశలో దీన్ని పూర్తి చేయటం ప్రత్యేకత.

# కాష్‌గర్‌-హోటన్‌ రైలు మార్గం #
కొత్తగా నిర్మిస్తున్న కాష్‌గర్‌-హోటన్‌ రైలు మార్గానికి ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. పర్వత ప్రాంతాల మీదుగా ఎంతో కఠినమైన పరిస్థితుల్లో సాగుతున్న నిర్మాణం ఇది. వాయవ్య చైనాలోని తరీమ్‌ బేసిన్‌ నుంచి కొర్లా, తుర్పాన్‌, ఉరుంఘి నగరాల మీదగా సాగుతోంది. ఇది పూర్తయితే చైనాలో ఒక మూలన నివసిస్తున్న ప్రజలకు ప్రధాన చైనాతో సంబంధాలు మెరుగుపడతాయి.

# బీజింగ్‌ కేపిటల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ #

చైనాలో నిర్మాణం పూర్తయిన, నిర్మాణంలో ఉన్న విమానాశ్రయాలను చూస్తే... విమానాశ్రయాలను ఇంత అద్భుతంగా నిర్మించవచ్చా... అని అనిపించక మానదు. బీజింగ్‌ కేపిటల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ చైనాలో అతిపెద్దది. దీని టెర్మినల్‌ భవనం ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద భవంతి కావటం ప్రత్యేకత. ఇక ఛెంగ్డు షాంగ్లియు విమానాశ్రయం నుంచి గత ఏడాదిలో 4.2 కోట్ల మంది ప్రయాణించారు. 2012లో ప్రారంభమైన కున్‌మింగ్‌ ఛాంగ్‌షుయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ చైనాలో రెండవ అతిపెద్ద విమానాశ్రయం. దీని ప్రధాన టెర్మినల్‌ 60 లక్షల చదరపు అడుగులు ఉంటుంది.

# రైలు-రోడ్డు వంతెన #

వుహాన్‌ నగరంలో టియాన్‌గ్జింగ్‌ఝౌ యాంగ్‌ట్జీ నది ప్రధాన ఆకర్షణ. దీనిపై సాధారణ వంతెనతో సరిపెట్టుకోకుండా ఎంతో ఆకర్షణీయమైన రీతిలో ఇంజనీరింగ్‌ అద్భుతాన్ని ఆవిష్కరించారు. దాదాపు 1.7 బిలియన్‌ డాలర్లు వెచ్చించి రైలు- రోడ్డు వంతెన నిర్మించారు. ఇది చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

# క్విన్‌షాన్‌ నూక్లియర్‌ పవర్‌ ప్లాంటు #
క్విన్‌షాన్‌ నూక్లియర్‌ పవర్‌ ప్లాంటు రెండో దశ నిర్మాణాన్ని 2.2 బిలియన్‌ డాలర్లు వెచ్చించి పూర్తిచేశారు. ఒకే ప్రదేశంలో అత్యధిక సంఖ్యలో నూక్లియర్‌ రియాక్టర్లు ఉన్నది ఇక్కడే. దీని మొదటి దశ 2011 లో పూర్తయింది. రెండో దశ నిర్మాణాన్ని ఇటీవల పూర్తిచేశారు.  (ఈనాడు ప్రత్యేక విభాగం)




|| యుద్ధం చచ్చిపోవాలి ||

 'రణస్థలం కానిచోటు భూ/ స్థలమంతా వెదకిన దొరకదు/ గతమంతా తడిసె రక్తమున,/ కాకుంటే కన్నీళ్లతో..' అని మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా.. ధరాతలం యావత్తూ ఉగ్రవాద రక్తపు మరకలు... ఆ మరకల వెనుక అగ్రరాజ్య అడుగుజాడలు... అసహాయుల ఆర్తానాదాలే కనిపిస్తాయి, వినిపిస్తాయి. సామ్రాజ్యవాద విషపుత్రిక ఉగ్రవాదం.. ప్రపంచ మానవాళిపై ఉరుముతున్న మత్యుమేఘమై మారణహోమానికి తెరతీస్తోంది. యుద్ధానికి కాలుదువ్వితే... సంభవించే వినాశనం... మానవ నాశనం. ఇప్పుడు కమ్ముకొన్న రాజకీయ యుద్ధ మేఘాలు ఆ వినాశనాన్ని తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. రెండు అణు దేశాలు తలపడితే... మిగిలేది మారణహోమం. గెలుపు ఓటములతోనే యుద్ధం ముగిసిపోదు. 'భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో/ ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో/ ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో/ మానవ కళ్యాణం కోసం పణమెత్తిన రక్తము ఎంతో/ రణరక్కసి కరాళ నత్యం రాచిన పసి ప్రాణాలెన్నో/ కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో...' అని దాశరథి రంగాచార్య చెప్పినట్టుగా యుద్ధం వల్ల జరిగే విషాదం రక్తపాత రహితంగా మరికొన్ని జీవితకాలాల పాటు కన్నీటిని మాత్రమే చిందింపజేస్తుంది. నిర్దయగా హృదయాలను మెలి పెడుతుంది. కానీ... రాజకీయ యుద్ధోన్మత్తులు అనంతర పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా.. తాత్కాలిక ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది.

ప్రస్తుతం మనమంతా యుద్ధోన్మత్తులమై ఉన్నాం. ఉగ్రవాద పీచమణచాలని ఉవ్విళ్లూరుతున్నాం. గత వారం రోజులుగా దౌత్యపరమైన యుద్ధం చేసిన భారత్‌... ఇప్పుడు నేరుగా ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. దీంతో సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సోషల్‌ మీడియాలో సైతం అక్షరాలను కరవాలాలుగా మార్చి... భారత సైన్యానికి సంఘీభావం తెలుపుతున్నారు. బాలగంగాధర్‌ తిలక్‌ ఓ కవితలో 'యుద్ధానికి కాలు దువ్వితే/ ఊరుకునే చవట ఈ కాలంలో ఎవడు?/ ఉరుకుతాడు సింహంలా ముందుకి నరుడు/ చివ్వకు ప్రతి భారతీయుడూ ఒక కవ్వడి/ గవ్వకు మారడు శత్రువు వాడెవడైనా' అంటూ ఘీంకరిస్తాడు. అదే రకమైన ఉద్రేకం ఇప్పుడు ప్రతి భారతీయుడిలోనూ కానవస్తోంది. 'కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల... కాదేదీ కవితకనర్హం..' అని శ్రీశ్రీ చెప్పినట్టుగా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో మన మిలిటరీ నిర్వహిస్తున్న ఆపరేషన్లు కూడా మోడీని భుజాలపై మోస్తున్న మీడియాకు కలిసొచ్చింది. మన సైన్యం తెగువ... పోరాట పటిమ అద్భుతం... వీరోచితం. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న దాయాదికి గుణపాఠం చెప్పాల్సిందే. కానీ జరుగుతున్న తీరు వేరుగా ఉంది. యుద్ధ రంగంలో మోడీయే పోరాటం చేస్తున్నట్టుగా ప్రచారం. పాక్‌కు ధీటైన జవాబివ్వడం ద్వారా మోడీ ఛాతీ 56 అంగుళాల నుంచి వంద అంగుళాలు పెరిగిందని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వ్యాఖ్యానించడం చూస్తే.. ఈ మేనియా ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సోషల్‌ మీడియా కూడా పూనకం వచ్చినట్లు ఊగిపోతోంది. వాస్తవానికి... పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాదుల గుడారాలను ధ్వంసం చేయడమన్నది ఇదే తొలిసారి కాదు... చివరిసారీ కాదు. పిఒకెలో ఉగ్రవాదుల కదలికలు పెరిగిన ప్రతిసారీ... ఈ తరహా ఆపరేషన్‌ నిర్వహించడం పరిపాటే. దానికి ఏ పేరు పెట్టినా... ఏ విధమైన వ్యూహరచన చేసినా... శత్రువును కట్టడి చేయడమన్నది సైన్యం వ్యూహం. అయితే.. ఈసారి మాత్రం ఏకంగా పాకిస్తాన్‌పై యుద్ధం చేస్తున్నంత హడావుడి జరుగుతోంది. దీనివెనుకున్న కారణమేంటనేది దేశ రాజకీయాలను పరిశీలిస్తున్నవారికి ఇట్టే అవగతమౌతుంది. రెండున్నరేళ్ల మోడీ పాలన తీరు పట్ల పెరుగుతున్న అసంతప్తిని మాయం చేయడానికి ఇదో అందివచ్చిన అవకాశం. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు మరింత ప్రయోజనకరం.

ప్రపంచ జీవన చిత్రంపై చెరగని ముద్ర వేసిందీ యుద్ధమే. ఎన్నో ఎన్నో గాయాలు విషాద గేయాలై చరిత్ర స్మతిపథంపై కదులుతూనే ఉంటాయి. యుద్ధం అంటే ప్రాణ నష్టం.. యుద్ధం అంటే వీరోచితం.. యుద్ధం అంటే ఆర్థిక నష్టం. కానీ రాజకీయ నాయకులకు యుద్ధం కూడా రాజకీయమే. అందుకే.. 'ఇవాళ నువ్వు తాగుతున్న నీళ్ళలో నెత్తురూ/ నువ్వు తినబోతున్న అన్నంలో నిషిద్ధ మానవ మాంసాల తునకలూ విసిరి/ వాళ్ళు ఆడుకుంటున్న ఆటలో/ నువ్వే ఒడిపోతావ్‌ ఎప్పుడూ!/ నేనూ దేశాన్ని ప్రేమిస్తాను గాని/ దాన్ని భక్తిగా తర్జుమా చేసుకోలేను ఎప్పటికీ,/ నువ్వు క్షమించకపోయినా సరే!' అంటాడు కవి అఫ్సర్‌. ఈ భూమ్మీద మనుషులు అంతరించేదాకా యుద్ధాలు జరుగుతుండవలసిందేనా? రుధిర ప్రవాహాలు పారుతుండవలసిందేనా? వేలల్లో... లక్షల్లో... జనాలను చంపుతున్న యుద్ధానికి.. మానవ వనరుల వినాశనానికి కారణమౌతోన్న యుద్ధానికి చావురాదా? యుద్ధానికి చావు వచ్చితీరాలి.

Sunday, 2 October 2016

|| అమానవీయ భారత్ ||



దేశంలో పాకీ పనివారి వాస్తవ పరిస్థితులపైన భాషాసింగ్ అనే జర్నలిస్టు(హిందీ అవుట్‌లుక్ బ్యూరోచీఫ్ పదవి నుంచి 15 రోజుల క్రితమే ఆమె రాజీనామా చేశారు) రాసిన పుస్తకానికి (అన్‌సీన్ ద ట్రూత్ ఎబౌట్ ఇండియాస్ మాన్యువల్ స్కావెంజర్స్) తెలుగు అనువాదం (అశుద్ధ  భారత్) లామకాన్‌లో ఇద్దరు మహిళలు-భాగ్యలక్ష్మి, గంగ ఆవిష్కరించారు.  

 మాన్‌హోల్‌లో పడి మరణించిన ఇద్దరు సఫాయి కార్మికుల భార్యలు వారు. సామాజిక కార్యకర్త సజయ సమర్థంగా అనువదించిన పుస్తకాన్ని వారిచేత విడుదల చేయించడంలో ఔచిత్యం ఉంది. భాగ్యలక్ష్మి భర్త బొగ్గు వీరాస్వామి హైదరాబాద్‌లో  రామ్‌కోటి చౌరాస్తాలో మాన్‌హోల్‌లో పని చేస్తూ ఊపిరాడక అయిదు మాసాల కిందట మే1వ తేదీన మరణించాడు. గంగ భర్త పల్లపు సత్యనారాయణ రెండు మాసాల కిందట మాదాపూర్‌లో మాన్‌హోల్‌లో పనిచేస్తూ చనిపోయాడు. మేగ్‌సేసే పురస్కార గ్రహీతలు బెజవాడ విల్సన్, టిఎస్ కృష్ణ సమక్షంలో ఈ పుస్తకావిష్కరణ జరిగింది.

 ఎత్తుడుదొడ్ల (డ్రెలైట్రిన్)లో, రైలు పట్టాలలో, సెప్టిక్ ట్యాంకులలో ఇత రుల మలాన్ని ఎత్తి బుట్టలో వేసుకొని, బుట్టను నెత్తిమీద పెట్టుకొని తర తరాలుగా పాకీపని చేస్తున్న మనుషులను సమాజం ఎంత చులకనగా, నిర్ల క్ష్యంగా చూస్తున్నదో, పాకీపనివారి జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో వివరించే పుస్తకం ఇది. కశ్మీర్ నుంచి కేరళ దాకా అన్ని రాష్ట్రాలలోని పాకీపని వారితో మాట్లాడి, వారితో సహజీవనం చేసి, వారి మనోభావాలను తెలుసు కొని వాటికి అక్షరరూపం ఇచ్చిన పత్రికా రచయిత భాషాసింగ్. పాకీపని చేస్తున్న స్త్రీలు మనకు కళ్ళ ఎదుటే కనిపిస్తున్నప్పటికీ, వారు చేస్తున్న పని గురించి తెలిసినప్పటికీ వారు లేనట్టే భావించేవారూ, వారి గురించి మాట్లా డటానికే నిరాకరించేవారూ సమాజంలో అత్యధికంగా ఉండటం విషాదం. దీనినే భాషాసింగ్ నిశ్శబ్దకుట్ర (conspiracy of silence)గా అభివర్ణించారు. ఆ నిశ్శ  బ్దాన్ని ఛేదించడమే ఈ పుస్తకం ఉద్దేశం. తెలుగు అనువాదాన్ని హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ ప్రచురించింది.

|| పాకీ స్త్రీల విషాదం ||
కులవ్యవస్థ పదఘట్టనలో అత్యంత పాశవికంగా అణచివేతకు గురైన మనుషులు పాకీ స్త్రీలు. ఈ పనే జీవనాధారంగా వేల సంవత్సరాలుగా ఆత్మన్యూనతను సహిస్తూ బతుకులు వెళ్ళదీస్తున్నవారంతా దళితులే.  అగ్రకులాలవారు మాత్రమే కాదు, పాకీపనికి దూరంగా ఉండే దళితులు కూడా పాకీ పనివారి మనోవేదనను అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోవడం, వారిపట్ల సానుభూతి చూపకపో వడం విచిత్రం.  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాలకృష్ణన్ పనిచేస్తున్న సమయంలో  సఫారీ కర్మచారీ ఆందోళన్ (ఎస్‌కేఏ) పిటిషన్  విచారణకు వచ్చిన ప్పుడు ఎత్తుడుదొడ్లు  దేశంలో ఉన్నట్టు తనకు తెలియదని వ్యాఖ్యానించారు.

 ఆయన దళితుడైనప్పటికీ బాధాకరమైన వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. తన స్వరాష్ట్రమైన కేరళలో మాత్రం ఎత్తుడుదొడ్లు లేవంటూ అడ్డంగా వాదించారు. ప్రధాని నరేంద్రమోదీ ఇతర ప్రధానుల కంటే భిన్నంగా ఈ అవమానకరమైన సమస్యను స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో ప్రస్తావించారు. స్వచ్ఛభారత్ అభియాన్‌ను ప్రకటించి, ఇందుకోసం వేలకోట్ల నిధులు కేటాయి స్తున్నట్టు చెప్పారు.

 2019 నాటికి రెండు కోట్ల మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించారు. పేదలకు ఇళ్ళు కట్టించి ఇవ్వకుండా మరుగుదొడ్లు కట్టించడం వల్ల ప్రయోజనం ఏమిట ంటూ ప్రజల మధ్య పని చేస్తున్న సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.  క్షేత్ర వాస్తవికతను దృష్టిలో పెట్టుకొని నిజాయతీగా కృషి చేస్తే సత్ఫలితాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పిస్తే అసా ధ్యమంటూ ఏదీ ఉండదు. కానీ ఇంతవరకూ ఈ సమస్యపైన చట్టం చేసినా, సుప్రీంకోర్టులో విచారణ జరిగినా తప్పుడు లెక్కలు చెప్పి తప్పించుకుంటున్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే. కులవ్యవస్థ చట్రంలో పడి నరకప్రాయమైన పరిస్థితు లలో బతుకులీడుస్తున్నవారికీ, మాన్‌హోల్‌లో పడి మరణించిన వందలాది సఫాయి కార్మికుల కుటుంబాల సభ్యులకూ  క్షమాపణ చెప్పిన తర్వాత ప్రధాని స్వచ్ఛభారత్ అభియాన్‌ను ప్రకటిస్తే సముచితంగా ఉండేది. మోదీ నైతికత పట్ల ప్రజల గౌరవం పెరిగి ఉండేది.

|| నారాయణమ్మ నాయకత్వం ||

అనంతపురం పట్టణంలో ఎత్తుడుదొడ్లలో పనిచేసిన నారాయణమ్మ సఫాయి కర్మచారీ ఆందోళన్ (ఎస్‌కేఏ) సంస్థ నెలకొల్పడానికీ, ఆ సంస్థ కొనసాగిస్తున్న పోరాటాలకూ స్ఫూర్తిప్రదాత. 1999లో బెజవాడ విల్సన్, మల్లెపల్లి లక్ష్మయ్య అనంతపురం వెళ్ళి నారాయణమ్మతోనూ, ఆమె సహచరులతోనూ మాట్లాడిన తర్వాత రాసిన వార్తావ్యాసం ‘వార్త’ పత్రికలో ప్రముఖంగా ప్రచురించాం. మునిసిపాలిటీనే స్వయంగా ఎత్తడుదొడ్లను నిర్మూలించింది. మాజీ ఐఏఎస్ అధికారి, ప్రముఖ సామాజిక కార్యకర్త హర్ష్‌మందిర్ రాసిన ‘అన్‌హర్డ్ వాయి సెస్: స్టోరీస్ ఆఫ్ ఫర్గాటెన్ లైవ్స్ (పెంగ్విన్, 2001)లో నారాయణమ్మ ప్రస్తావన విస్తారంగా ఉంది.

నారాయణమ్మను విల్సన్ 1998లో కలుసుకున్న సన్నివేశాన్నీ, ఆ తర్వాత ఆమె హక్కుల కార్యకర్తగా ఎదిగిన విషయాన్ని హర్ష్‌మందిర్ వివరిం చారు. శనివారం లామకాన్‌లో జరిగిన సమావేశంలో పాల్గొనేందుకు అనం తపురం నుంచి హైదరాబాద్ వచ్చారు కానీ ట్రాఫిక్‌లో చిక్కుకున్న కారణంగా సకాలంలో సభాస్థలికి చేరుకోలేకపోయారు. అందరం చాలాసేపు ఆమె కోసం ఎదురు చూశాం. ఆమె అనుభవాలు వినాలని ఆశించాం. గొప్ప మానవతావాది, దళితబాంధవుడు, అసాధారణమైన అధికారి ఎస్‌ఆర్ శంకరన్ ప్రేరణతో బెజవాడ విల్సన్, ఇతరులు కలిసి 1995లో ఎస్‌కేఏ నెలకొల్పారు. పాకీపనివారి విమోచనకోసం విల్సన్ మూడు దశాబ్దాలకుపైగా పోరాటం సాగిస్తున్నారు.

 ఎంప్లాయిమెంట్ ఆఫ్ మేన్యువల్ స్కావెంజర్స్ అండ్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ డ్రైలెట్రిన్స్ (ప్రొహిబిషన్)యాక్ట్ 1993లో వచ్చింది. ఎత్తుడు దొడ్లపైన ఈ చట్టం ద్వారా విధించిన నిషేధం అమలుకు నోచుకోలేదు. భారత రాజ్యాంగంలో ప్రజలకు హామీ ఇచ్చిన మానవీయ హక్కుగా శంకరన్ పాకీపనివారికి విమోచన కలిగిం చడాన్ని భావించారు. ఈ హక్కు కేవలం చట్టాలు చేసినంత మాత్రాన, న్యాయ స్థానాలు  తీర్పులు చెప్పినంత మాత్రాన అమలు కాదనీ, సఫాయి కార్మికులే స్వయంగా ప్రశ్నించడం, ఎదిరించడం, ప్రతిఘటించడం, పోరాడి సాధించడం నేర్చుకోవాలనీ, సమాజంలోని ఇతర వర్గాలు కూడా వారికి మద్దతు తెలపాలనీ, అప్పుడే వారికి ఈ నరకకూపం నుంచి విముక్తి లభిస్తుందనీ శంకరన్ ఉద్బోధిం చారు. చట్టాన్ని అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనా యంటూ ఎస్‌కేఏ సుప్రీంకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేసింది.

 ఈ దురాచారాన్ని కొనసాగించడం అంటే రాజ్యాంగం 14వ అధికరణ (చట్టం ముందు అందరూ సమానమే), 17వ అధికరణ (అంటరానితనం నిర్మూలన), 21వ అధి కరణ (ప్రాణరక్షణ,వ్యక్తిగతస్వేచ్ఛ పరిరక్షణ), 23వ అధికరణ (బలవంతంగా చాకిరీ చేయించుకోవడంపైన నిషేధం)లను ఉల్లంఘించడమేనంటూ పిటిషనర్లు వాదించారు. సఫాయి కార్మికుల విమోచనకోసం, పునరావాసం కోసం కాలపరి మితి విధిస్తూ ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వవలసిందిగా ఎస్‌కేఏ కోరింది. సఫాయి కర్మచారుల జాతీయ కమిషన్ సర్వే ప్రకారం దేశంలో 96 లక్షల ఎత్తుడు దొడ్లు ఉన్నాయనీ, వాటన్నిటినీ నిర్మూలించవలసి ఉంటుందనీ పిటిషన్‌లో గుర్తుచేశారు. ప్రైవేటు వ్యక్తులే కాకుండా సైన్యంలోని ఇంజనీరింగ్ విభాగం లోనూ, రైల్వేలలోనూ, ప్రభుత్వ సంస్థలలోనూ పాకీపనివారి చేత పనులు చేయి స్తున్నట్టు పిటిషన్ తెలియజేసింది.

సంబంధిత ప్రభుత్వ శాఖలకూ, సంస్థలకూ సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. చాలా ప్రభుత్వాల నుంచి స్పందనే లేదు. రైల్వే శాఖ మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పుట్లు చేసేవరకూ పాకీపని చేయించక తప్పదంటూ స్పష్టం చేసింది. అత్యున్నత న్యాయస్థానంలో సఫాయి కార్మికులకు న్యాయం లభించలేదు. విల్సన్ మాటల్లో చెప్పాలంటే, ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న అసత్యాలను అసత్యాలుగా నిరూపించవలసిన బాధ్యత కోర్టు మాపైనే పెట్టింది’. దశాబ్దంపాటు విచారణ తంతు జరిగిన అనంతరం ఈ విషయాన్ని అంతకంటే క్షుణ్ణంగా పరిశీలించి తీర్పు ఇచ్చే తీరిక లేదంటూ న్యాయ స్థానం తేల్చివేసింది. సఫాయి కర్మాచారీ ఆందోళన్‌ను అద్వితీయంగా నిర్వహి స్తున్నందుకే బెజవాడ విల్సన్‌కి రామన్ మేగ్‌సెసే అవార్డు ఇచ్చారు.

|| ప్రత్యక్ష పోరాటం ||

ఇక లాభం లేదని సఫాయి కార్మికులు ప్రత్యక్ష పోరాటానికి నడుంబిగించారు. మలం ఎత్తే తట్టలను తగులపెట్టడం, ఎత్తుడుదొడ్లను నిర్మూలించడం ఆరంభిం చారు. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్, హరియాణా, పంజాబ్, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో అమానవీయమైన ఎత్తుడుదొడ్ల పద్ధతి దాదాపుగా అంతమైంది. పాకీపనివారిని నియమించినందుకు 22 మందిని హరియాణా ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇందుకు సంబంధించిన చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులను శిక్షించిన రాష్ట్రం హరియాణా ఒక్కటే. మురుగుకాల్వలను శుభ్రం చేస్తూ వందలాది మంది మరణించడం పల్ల ఆగ్రహించిన ఎస్‌కేఏ కార్యకర్తలు బెజవాడ విల్సన్ నాయకత్వంలో ‘మమ్మల్ని చంపకండి-డోంట్ కిల్ అజ్’ అనే నినాదంతో 125 రోజుల పాటు దేశవ్యాప్తంగా నిరసన యాత్ర నిర్వహించారు. 2010 కల్లా  దేశంలోని అన్ని ప్రాంతాలలో పాకీపనిని నిర్మూలించాలని లక్ష్యంగా సఫాయి కర్మచారీ ఆందోళన్ పెట్టుకున్నది. ఆ గడువు దాటి ఆరేళ్ళయింది. అయినా లక్ష్యం నెరవేరలేదు.

 ఇది కేవలం పాకీపనివారి సమస్య కాదు. దళితుల సమస్య మాత్రమే కాదు. ఇది సకల జనులకు సంబంధించిన అంశం. మాన వత్వం ఉన్నవారంతా పట్టించుకొని పరిష్కరించవలసిన సున్నితమైన సమస్య. మనలో కొందరు అమానవీయమైన పరిస్థితు లలో అలమటిస్తుంటే అటువంటి పరిస్థితులను మార్చాలని సంకల్పించకపో వడం మానవత్వం లేకపోవడమే.

 ఈ దురాచారాన్ని రూపుమాపడానికీ, సమాజంలోని ఒక వర్గానికీ, ఇతర వర్గాలకీ మధ్య నిలిచిన గోడలు పడగొట్టడానికీ జాతి యావత్తూ ఒక్కతాటిపైన నడిస్తే మనది నాగరిక సమాజమని చెప్పుకునే అర్హత సంపాదిస్తాం. అంతవరకూ తలదించుకోవలసిందే.

 ప్రధాని స్వచ్ఛభారత్ అభియాన్‌లో భాగంగానే పాకీపనిని నూటికి నూరుపాళ్ళు నిర్మూలించి, ఈ పనిలో మగ్గుతున్నవారికి విముక్తి కలిగించి, పునరావాసం కల్పించే సమగ్ర కార్యాచరణ పథకం రూపొందించాలి. దాన్ని అమలు చేసే బాధ్యత బెజవాడ విల్సన్, హర్ష్‌మందిర్, భాషాసింగ్ వంటి మానవతావాదులకు అప్పగించాలి. అప్పుడే తరతరాలుగా అసమానతలతో, పీడనతో, అమానవీయ ధోరణులతో అలమటిస్తున్న జాతికి నిష్కృతి. - కె. రామచంద్రమూర్తి (సాక్షి)