Monday, 11 July 2016

|| ఒక కలానికి ఊపిరులూదిన తీర్పు ||

            మూర్ఖత్వం నల్లగా దట్టంగా అలుముకున్నప్పుడు ఏకొంచెం కామన్‌సెన్స్‌ అయినా కొట్టొచ్చినట్టు ప్రకాశిస్తుంది. తమిళ రచయిత పెరుమాళ్‌ మురుగన్‌ కేసులో మద్రాసు హైకోర్టు వెలువరించిన తీర్పు కూడా వర్తమాన పరిస్థితుల మధ్య అలాంటి వెలుగే. ఏడాదిన్నర క్రితం పెరుమాళ్‌ మురుగన్‌ రచయితగా తాను మరణించినట్టు ఫేస్‌బుక్‌లో చేసిన ప్రకటనతో ఒక అణచివేత వెలుగులోకి వచ్చింది. ఆయన నవల ‘మాధోరుబగన్‌’ 1940ల్లో తిరుచెంగోడ్‌ పట్టణంలో పిల్లలు లేని దంపతులు కాళి, పొన్నల కథ చెబుతుంది. ఇద్దరూ ఎన్ని గుళ్లు తిరిగినా, ఎవరికి మొక్కినా ఫలితం దక్కదు. చివరికి ఒకటే దారి కనిపిస్తుంది. తిరుచెంగోడ్‌ అర్ధనారీశ్వరుడికి జరిగే రథోత్సవ వేడుకల్లో 14వ రోజున సాంఘిక కట్టుబాట్లు వదులవుతాయి. ఆరాత్రి ఎవరు ఎవరితోనైనా శృంగారంలో పాల్గొనవచ్చు. ఈ వేడుక కాళి, పొన్నల సంసారంలో ఏ మార్పు తీసుకొచ్చిందన్నది అసలు కథ. ఇలాంటి సంప్రదాయం ఏదీ లేదని, పెరుమాళ్‌ మురుగన్‌ కల్పితకథతో తమ దేవుడ్నీ, సీ్త్రలను అవమానించాడని కొన్ని హిందూసంస్థలు గొడవకు దిగాయి. పెరుమాళ్‌ మురుగన్‌ చేత పోలీసుల సమక్షంలో క్షమాపణ చెప్పించాయి. అయినా గొడవ కోర్టుకెక్కి ఏడాది పాటు విచారణ సాగింది. మొన్న జూలై 5న మద్రాసు హైకోర్టు కేసు కొట్టివేస్తూ చరిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ పుష్పా సత్యనారాయణలతో కూడిన ధర్మాసనం ఇచ్చిన 160 పేజీల తీర్పు నుంచి ఏరికూర్చిన పాఠ్యానికి ఇది అనువాదం. 
- వివిధ 

సమాజం ఒక పుస్తకాన్ని చదివి అదేమి చెబుతున్నదో నొచ్చుకోకుండా ఆకళింపు చేసుకోవటానికి సిద్ధమేనా కాదా అన్నది ఎన్నో ఏళ్లుగా ఉన్న చర్చే. కాలం మారుతున్నది. ఒకప్పుడు ఒప్పుకోలేనిది తర్వాత సమ్మతి పొందుతున్నది. ‘లేడీ ఛాటర్లీస్‌ లవర్‌’ దీనికి ఒక ప్రముఖ ఉదాహరణ. ఒక పుస్తకం చదవాలా వద్దా నిర్ణయించుకునే వెసులుబాటు పాఠకునికి ఎప్పుడూ ఉంది. ఒక పుస్తకం నీకు నచ్చకపోతే, విసిరి పారేయ్‌. బలవంతమేమీ లేదు. సాహిత్యాభిరుచులు మనిషి మనిషికీ మారతాయి- ఒకరికి సరైనది మరొకరికి కాకపోవచ్చు. అయితే రాసే హక్కుకు ఏ ఆటంకమూ లేదు. ఒకవేళ పుస్తకంలోని అంశాలు రాజ్యాంగ విలువలని కాలరాస్తున్నా, వర్గ ఘర్షణల్ని లేవనెత్తుతున్నా, కులాలను కించపరుస్తున్నా, సమర్థనీయంకాని శృంగారాన్ని చిత్రిస్తున్నా, లేదా దేశ అస్తిత్వంపైనే దాడి చేస్తున్నా, రాజ్యం ఖచ్చితంగా కలగజేసుకుంటుంది, అందులో సందేహం లేదు.

ప్రస్తుతం మా ముందున్నది చిత్రమైన కేసు. ప్రొఫెసర్‌ పెరుమాళ్‌ మురుగన్‌ రాసిన ‘మాధోరుబగన్‌’ ఒక తమిళ నవల, ఇది ‘ఒన్‌ పార్ట్‌ వుమన్‌’ పేరుతో ఇంగ్లిషులోకి తర్జుమా అయింది, ఎన్నో పురస్కారాలు కూడా దక్కాయి, అయినాకూడా ఈ పుస్తకం ప్రమాదకరమనీ, వినాశకరమనీ, కథ జరిగిన స్థలానికి చెందిన ప్రజల మనోభావాల్ని రెచ్చగొడుతున్నదనీ ఆరోపణలు వచ్చాయి.

ఈ నవలకు చరిత్ర ఆధారమా, అయితే ఏమిటి? కొన్ని సంఘటనలు జరిగాయనటానికి ఎప్పుడూ నమోదైన చరిత్రే ఋజువుగా ఉండితీరాలా, లేక మనిషి నుంచి మనిషికి అందే జానపద వృత్తాంతాలు కూడా ఒక పుస్తకానికి ఆధారం కావొచ్చునా? ఏదేమైనా, మన మనసు నొచ్చుకునే పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవచ్చు? ‘‘ఒక పుస్తకానికి నొచ్చుకోకుండా ఉండటం చాలా సులువు, దాన్ని మూసేస్తే చాలు?’’ అన్న సాల్మన్‌రష్దీ మాట మనకేమైనా పనికొస్తుందా?

చిత్రకారుడు ఆలోచనల్ని గీస్తాడు; శిల్పి చెక్కుతాడు; అలాగే రచయిత రాస్తాడు. మొదటి రెండు సందర్భాల్లోనూ ఆలోచనలు సరళమైన నిర్మాణంతో వ్యక్తమవుతాయి. పుస్తకం ఆలోచనల్ని చెప్పటానికి మరింత వివరమైన విశదమైన పద్ధతి. అది సరళ నిర్మాణం కాదు. ఒక ఇతివృత్తాన్ని నింపాదిగా అల్లుతుంది. అందుకే, ఒక పుస్తకాన్ని అశ్లీలతే కాదు, మరింకే ప్రమాణాల ద్వారానైనా నిగ్గుతేల్చాలంటే ముందు దాన్ని ఆసాంతంగా చదివి, ఆకళింపు చేసుకోవాలి. పుస్తకాన్ని ఏదో చట్టశాసనం చదివినట్టు చదివి ఒక నిర్ధారణకు రాలేము. అక్కడో వాక్యమూ ఇక్కడో వాక్యమూ ఎత్తిచూపి అంచనా వేయలేము. పుస్తకాల్లో వాడే భాష కూడా సందర్భాన్ని బట్టి ఒక్కోసారి మర్యాదగా మెరుగుపెట్టిన భాషలాగానూ, మరోసారి స్థానిక యాసలతో మోటుగానూ ఉండవచ్చు. దూషణపూరితమైన భాష విషయంలో ఎలాగూ కొన్ని హద్దులున్నాయి. కానీ మరోలా చూస్తే, వాస్తవాలెప్పుడూ పూలపాన్పు కాదు, అవి కటువుగానే ఉంటాయి. అందుకే, సీ్త్రల సమస్యలు, లేదా సామాజికంగానూ ఆర్థికంగానూ వెనుకబడిన వర్గాలవారి యాతనలూ ఇలాంటి సామాజికాంశాల గురించి రాసిన పుస్తకాలు పైకి కటువుగా కనిపించవచ్చు. ఒక్కోసారి సందేశాన్ని పాఠకులకు చేర్చేందుకు వారు బిత్తరపోయేట్టుగానే వాస్తవాల్ని చూపించాల్సి వస్తుంది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి, సంఘ వివక్షను ఎదుర్కొంటున్న పిల్లలు లేని దంపతుల కష్టాలని కూడా ‘‘సున్నితమైన’’ పద్ధతిలో చెప్పితీరాలా?

అశ్లీలపు హద్దుల్ని తాకకుండా ఏమేరకు శృంగార రీతుల్ని పుస్తకాల్లో చిత్రించవచ్చన్నది ఈ వివాదంలో మరో అంశం. ఇది ఆయా సమాజాల సంస్కృతీ సంప్రదాయాలపైనా, వర్తమానం లోని కట్టుబాట్ల పైనా ఆధారపడి ఉంటుంది. అయితే వర్తమానపు కట్టుబాట్లు ఎప్పుడూ కొంత గతం తాలూకు బరువు కూడా మోస్తూంటాయి.

స్వాతంత్య్రం తరువాత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలోని భాగం-3లో ప్రాథమిక హక్కులకు ఎంతో గొప్ప స్థానమిచ్చారు. వాక్‌ స్వాతంత్య్రమూ, వ్యక్తీకరణ స్వాతంత్య్రమూ రాజ్యాంగానికి ఆయువుపట్టు, దీన్ని న్యాయస్థానాలు బలంగా సమర్థిస్తూ వచ్చాయి. అయితే ఏ స్వేచ్ఛా హద్దుల్లేనిది కాదు, అందుకే వ్యక్తీకరణ స్వాతంత్ర్యానికి కూడా ఆర్టికల్‌ 19(2) ద్వారా పరిమితి విధించారు. ఆశ్చర్యకరంగా, సీ్త్ర పురుష సంబంధాలు, శృంగారమూ, మతపరమైన ఆచారాల విషయాల్లో ప్రాచీన ధార్మిక గ్రంథాలే వర్తమానంతో పోలిస్తే ఎంతో ఉదారంగా ఉన్నాయి. అందం చూసేవాడి కళ్లల్లో ఉంటుందంటారు, ఏది అశ్లీలత అనేది తేల్చటానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.

ప్రాచీన సాహిత్యంలో శృంగార రీతుల్ని స్వేచ్ఛగా చిత్రించిన సందర్భాల్ని రచయిత తరఫు న్యాయవాదులు మా ముందుంచారు. ఇంతకుముందు లేనిదేదీ రచయిత రాయలేదనీ, కానీ ప్రాచీన భారత సాహిత్యం పట్ల ఏ గౌరవమూ లేని కొన్ని గుంపులు సంకుచిత దృక్పథంతో ఈ నవలకు వ్యతిరేకంగా కత్తిగట్టాయనీ నిరూపించే ప్రయత్నం చేశారు. వేద కాలం నుంచీ శృంగారమూ, కామరసభరితమైన సాహిత్యమూ, ప్రాచీన మధ్యయుగాల్లోని శృంగారపరమైన ఆచారాలూ ఎలా ఉన్నాయో ఈ తీర్పు ముందరి భాగాల్లో విస్తృతంగా ఉటంకించాము గనుక వాటిని మరలా పేర్కొనటం లేదు. మన స్వేచ్ఛా విలువల్ని నిజంగా ప్రతిబింబించేది ఆ సాహిత్యమేనని మరోమారు చెప్తున్నాము. మనదేశంపై బ్రిటిష్‌ దురాక్రమణ అనంతరం చెలామణీలోకి వచ్చిన విక్టోరియన్‌ ఇంగ్లిష్‌ భావజాలం చేత కలుషితం కాని విలువలు అవి. ఒక సమాజంగా మనం మన సాహిత్యం నుంచీ, ధార్మిక గ్రంథాల నుంచీ ప్రేరణ పొందటం మానేసి విక్టోరియన్‌ భావజాలంలో కూరుకుపోతున్నాం. శృంగారం దానికదే అవాంఛనీయంగా ఎన్నడూలేదు, నాగరికత ఆదిగా అది ఒక అంతర్భాగంగా ఉంటూనే వచ్చింది. మహాభారతంతో సహా భారతీయ ధార్మిక గ్రంథాల నిండా వివాహేతర శృంగారం గురించిన ఉదంతాలెన్నో ఉన్నాయి, అది కూడా చాలాసార్లు వంశాలను కొనసాగించటానికే. భవిష్యత్తులో ఒక పరిపూర్ణుడైన రాజుని పొందటం కోసం ఇలాంటి ఆచారాల్ని ఆనాటి సమాజంలో ఉన్నత నిమ్న సామాజిక ఆర్థిక వర్గాలు రెండూ పాటించాయి. ఇప్పుడు మహాభారతమూ, అలాంటి అనేక ఇతర గ్రంథాల్ని మన చరిత్రలో భాగమని చెప్తూనే, అవి మితిమీరిన కామాతురతని వ్యక్తం చేస్తున్నాయన్న కారణంతో వాటిని నిషేధించాలని చెప్పగలమా? మేము చెప్పగలిగినదల్లా ఇదే -

భవత్య అధర్మో ధర్మొ హి ధర్మాధర్మావుభావపి
కారణాత దేశకాలస్య దేశకాలః స తాదృశః 
స్థలకాల పరిస్థితుల్ని బట్టి ఏది ధర్మమో అది అధర్మం కావొచ్చు, అలాగే ఏది అధర్మమో అది ధర్మంగా మారవచ్చు. - శాంతిపర్వము, 79. 31

ఇతర మాధ్యమాలకు ఎంత ప్రజాదరణా లాభదాయకతా వున్నా, పుస్తకాలు ఇప్పటికీ ఒక శక్తివంతమైన సాధనమే. అవి చరిత్రను తీర్చిదిద్దటంలో అసమానమైన పాత్రపోషిస్తాయి. మంచి పుస్తకాలెప్పుడూ సాధికార స్వరంతో, సహేతుకంగా, స్పష్టంగా మాట్లాడతాయి. రచయిత, పాఠకులిద్దరి ఆలోచనకూ చోటిస్తాయి. ఈ ఆన్‌లైన్‌ వాదోపవాదాల, బెదిరింపుల కాలంలో ప్రచురణకర్తలపై మరింత పెరిగిన బాధ్యత ఏమిటంటే- పాఠకుల చెంతకు నిజాన్ని చేర్చటమే.

రచయిత పెరుమాళ్‌ మురుగన్‌ భయపడాల్సిన పనిలేదు. అతను రాయాలి, తన రచనల పరిధిని పెంచుకుంటూ పోవాలి. అతని రచనల ఇతివృత్తాలతోనూ శైలితోనూ విబేధించే వారు ఎందరున్నా, అతని రచనలు సాహిత్యానికి ఎంతో సమకూరుస్తాయి. మా తీర్పుతో ఈ గొడవ సమసిపోతుందనీ, అన్ని పక్షాలూ ఆత్మపరిశీలన చేసుకుంటాయనీ ఆశిస్తున్నాం. చివరిగా ఈ పరిశీలనతో ఈ తీర్పును ముగిస్తున్నాం - 
“Let the author be resurrected to what he is best at. Write.”

No comments:

Post a Comment