Friday, 30 September 2016

|| హెచ్‌సియులో ఎగిరిన వామపక్ష, సామాజిక జెండా ||



                 దేశంలోనే ప్రతిష్టాత్మక మైన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సియు)లో గుర్తింపు విద్యార్థి సంఘాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తాజా ఎన్నికల్లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ (యుఎఫ్‌ఎస్‌జె) కూటమి ఘన విజయం సాధించడం సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది. వామపక్ష, సామాజిక శక్తులన్నీ ఒకే తాటిపైకి వచ్చి మతోన్మాదులను మట్టికరిపించడం ఆసక్తికర అంశం. దేశంలో ఇటీవలి కాలంలో జెఎన్‌యు, ఇప్లూ, ఇతర యూనివర్శిటీల్లో మతోన్మాదులు ఓడిపోవడం, అదే క్రమం హెచ్‌సియులో జరిగింది. ప్రస్తుతం ఈ గెలుపు ఇటు విద్యార్థుల్లోనూ, అటు మేధావుల్లోనూ నూతనోత్సాహాన్ని రేకేత్తించింది. యుఎఫ్‌ఎస్‌జె కూటమిలో స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ), దళిత్‌ స్టూడెంట్‌ యూనియన్‌(డిఎస్‌యు), ట్రైబల్‌ స్టూడెంట్‌ ఫోరం(టిఎస్‌ఎఫ్‌), బహుజన స్టూడెంట్‌ ఫ్రంట్‌ (బిఎస్‌ఎఫ్‌), తెలంగాణ విద్యార్థి వేదిక (టివివి) కూటమి ఐక్యంగా ప్రచారం నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన రోహిత్‌ వేముల ఆత్మహత్యకు, క్యాంపస్‌లో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న మతోన్మాదులను ఓడించాలని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఈ కూటమి బరిలోకి దిగి ఘన విజయం సాధించింది.

# పోటీలో ఎవరెవరు? #

యూనివర్సిటీ ఎన్నికల్లో మొత్తం మూడు ప్యానెళ్ళు బరిలో నిలిచాయి. ఎస్‌ఎఫ్‌ఐ, టిఎస్‌ఎఫ్‌, డిఎస్‌యు, టివివి, బిఎస్‌ఎఫ్‌లు యునైటెడ్‌ ఫ్రంట్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ (యుఎఫ్‌ఎస్‌జె) ఒక కూటమిగా ఆవిర్భవించింది. అఖిల భారత విద్యార్థి పరిషత్‌(ఎబివిపి), అదర్‌ బ్యాక్‌వర్డ్‌క్లాస్‌ విద్యార్థి సంఘం(ఒబిసి) ఒక కూటమిగా, అంబేద్కర్‌ స్టూడెంట్‌ అసోసియేషన్‌(ఎఎస్‌ఎ) ఒక అధ్యక్ష పదవికి, నేషనల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌ఎస్‌యుఐ) ఉపాధ్యక్షుడు, సహాయకార్యదర్శికి పోటీ చేసింది. ఎన్నికల నియమావళి ప్రకారం బరిలో మూడు ప్యానెళ్ళు నిలిచినప్పటికీ, పోటీ మాత్రం ప్రధానంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలోని లౌకిక, సామాజిక శక్తులు, ఎబివిపి నేతృత్వంలోని మతోన్మాద కూటమి మధ్యే తీవ్రంగా నెలకొన్నది. ఢిల్లీ యూనివర్సిటీలో మాదిరిగా అవకాశవాద రాజకీయాలు చేసి గెలిచేందుకు ఎబివిపి కూటమి తీవ్రంగా ప్రయత్నించింది. గెలుపు కోసం అడ్డమైన దారులూ తొక్కిన పరిస్థితే ప్రతి చోటా ప్రస్ఫుటించింది. ఎస్‌ఎఫ్‌ఐపై విష ప్రచారం భారీ స్థాయిలోనే చేస్తూ వచ్చింది. క్యాంపస్‌లో ఎబివిపి ప్రచారంతో పాటు మతోన్మాద భావాలు కల్గిన విసితో పాటు ప్రొఫెసర్లు, ఇతర ఫ్యాకల్టీ యుఎఫ్‌ఎస్‌జె కూటమిని ఓడించాలనే లక్ష్యంతో విద్యార్థులను బెదిరించే ప్రయత్నం కూడా చేశారు. కానీ గడిచిన సంవత్సర కాలంగా అనేక సమస్యలపై పనిచేయడమే కాకుండా దేశంలో వస్తున్న మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా ఇక్కడ వామపక్ష సామాజిక సంఘాలు పోరాటాలు చేశాయి. ప్రధానంగా రోహిత్‌ వేముల ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, అలాంటి ఘటనలు జరగకుండా ఉండాలనే పోరాటాల ద్వారా తీవ్రస్థాయిలో ఇక్కడ సంఘాలు కృషి చేశాయి. ఈ కారణాలతో విద్యార్థులు యుఎఫ్‌ఎస్‌జె కూటమిని గెలిపించారు.
అధ్యక్ష పదవితో పాటు కీలకమైన ఎనిమిది పోస్టులను వామపక్ష, సామాజిక కూటమే సొంతం చేసుకున్నది. అధ్యక్షులుగా కులదీప్‌సింగ్‌ నాగి ఎస్‌ఎఫ్‌ఐ-యుఎఫ్‌ఎస్‌జె (1,406) (గోపీకృష్ణ ఎబివిపి-ఒబిసిఎ (1,354) విజమ్‌కుమార్‌ ఎఎస్‌ఎ (984)), ప్రధాన కార్యదర్శిగా సుమన్‌ దామెర డిఎస్‌యు-యుఎఫ్‌ఎస్‌జె (1,842) (ఆనందరావు ఎబివిపి-ఒబిసిఎ (1,503)) ఉపాధ్యక్షులుగా భుక్యా సుందర్‌ టిఎస్‌ఎఫ్‌-యుఎఫ్‌ఎస్‌జె (1,701) (ఆదిత్య ఎబివిపి-ఒబిసిఎ (1,405)), సహాయ కార్యదర్శిగా పిల్లి విజరు కుమార్‌ ఎస్‌ఎఫ్‌ఐ-యుఎఫ్‌ఎస్‌జె (1,557) (అజిత్‌ ఎబివిపి-ఒబిసిఎ (,1351)) స్పోర్ట్స్‌ సెక్రెటరీగా ఉస్వినీస్‌ దాస్‌ ఎస్‌ఎఫ్‌ఐ-యుఎఫ్‌ఎస్‌జె (1,790) (నంద కుమారి ఎబివిపి-ఒబిసిఎ (1,632)), కల్చరల్‌ కార్యదర్శిగా నకిరియా దెబ్రామ బిఎస్‌ఎఫ్‌-యుఎఫ్‌ఎస్‌జె (1823) (శాంతి ఎబివిపి-ఒబిసిఎ (1592)), జిఎస్‌ క్యాష్‌ ఇంటిగ్రేటెడ్‌గా తుషారా ఎస్‌ఎఫ్‌ఐ (419), (ఎబిపిపి-ఒబిసిఎ (288)), యుఎఫ్‌ఎస్‌జె కూటమి బలపరిచిన జిఎస్‌ క్యాష్‌ పిహెచ్‌డిగా ఫిర్‌దోస్‌ స్వతంత్ర (679) (ఎబివిపి-ఒబిసిఎ (399)), తదితర పోస్టులన్నీ కూటమి ఖాతాలోనే పడ్డాయి. స్కూల్‌ కౌన్సిలర్‌, బోర్డ్‌ మెంబర్స్‌లో 55 పోస్టులకు గాను ఎస్‌ఎఫ్‌ఐ 27, ఎఎస్‌ఎ 4, ఎబివిపి 8 లభించగా 16 పోస్టులకు ఇంకా ఎన్నిక జరగాల్సి ఉన్నది. ప్రధానంగా అంబేద్కర్‌ స్టూడెంట్‌ అసోసియేషన్‌ (ఎఎస్‌ఎ)కు అధ్యక్ష పదవికి మంచి ఓట్లు రావడం ఒక శుభపరిణామం.

# వామపక్ష, సామాజిక శక్తుల ఐక్యగీతమెందుకు? #

ప్రస్తుత తరుణంలో దేశ రాజకీయాల్లో మరో ప్రశ్న ప్రధానంగా ఉత్పన్నమవుతున్నది. వామపక్ష, సామాజిక శక్తుల కలయిక ఎందుకు, ఆ కూటమి ఏర్పడటానికి ముఖ్యమైన కారణాలేంటి అనే ప్రశ్నలు ప్రధానంగా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం దేశంలో బిజెపి అధికారం చేపట్టిన తర్వాత తిరోగమన చర్యలకే అధిక ప్రాధాన్యమిస్తున్న విషయం తెలిసిందే. లోక్‌సభలో తన మందబలంతో మోడీ ఆర్డినెన్స్‌ల పేరుతో ప్రజాస్వామ్య వ్యవస్థనే అపహాస్యం చేస్తున్నారు. దేశంలో బిజెపి తన అధికారదాహాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం ప్రజలు, విద్యార్థుల మధ్య అనైక్యతను తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. ఎక్కడైతే లౌకిక, సామాజిక భావాలున్నాయో అక్కడ వాటిని ఏవిధంగా తుడిచిపెట్టాలనే ఆలోచనలో పడి తన ఇష్టానుసారంగా చేస్తున్నాయి. అందుకు ఉదాహరణ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో రోహిత్‌ వేముల ఆత్మహత్య. వర్శిటీ కేంద్రాల్లో తన వ్యక్తిగత భావాలు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఈ రోజు కనబడుతోంది. అలా విద్యార్థులు మాట్లాడితే వారిని రెస్టిగేట్‌ పేరుతో క్యాంపస్‌ బయటకు పంపిస్తున్నారు. ఇదేకాదు దేశంలో జెఎన్‌యులో దేశభక్తి అనే చర్చ తెచ్చి రాజద్రోహం కేసు పెట్టడం, ఆలీగఢ్‌ యూనివర్శిటీ స్టూడెంట్‌ యూనియన్‌ అధ్యక్షునిపై అసత్యప్రచారాలు చేయడం, ఇలా తన ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళేందుకు అబద్ధాలను నిజం చేసే పరిస్థితుల్లో బిజెపి మతోన్మాదులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారి ఉద్దేశం యూనివర్శిటీల్లో వీరి భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏ స్థాయికైనా తీసుకుపోతాము, ఏమైనా చేస్తాం అనే లక్ష్యంగా కనబడుతున్నది. వర్శిటీల్లో ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్న మతోన్మాదులను కాపాడేందుకు బిజెపి కృషి చేస్తున్నది. దానికి ఉదాహరణ రోహిత్‌ వేముల ఆత్మహత్యకు కారణమైన విసిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం.
అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో బిజెపి తన విధానాలు మార్చుకోవడం లేదు. అందులో లవ్‌ జిహాద్‌, ఘర్‌వాపసీ వంటి మతోన్మాద చర్యలతో ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నదీ బిజెపి సర్కారు. ఇక విద్యారంగంలో పూర్తిగా కాషాయీకరణను జొప్పించేందుకు చేయని ప్రయత్నం లేదు. వేదాల్లోనే విమానం(పుష్పక విమానం) నడిచిందని, వినాయకుడి తలను అతికించడాన్ని అప్పటికే ప్లాస్టిక్‌ సర్జరీ ఉందని చెబుతూ అబద్ధాలాడారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ రకమైన అశాస్త్రీయమైన వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ భారతంలో తొలిసారి. దీనిపై పౌరసమాజం తీవ్రంగా స్పందించింది. ప్రశ్నించిన వారిపై హిందూత్వ మతోన్మాదులు దాడులకు తెగబడుతున్నారు. గుజరాత్‌ను మోడల్‌గా చూపెడుతూ ఎలాంటి విద్యనైతే ప్రచారం చేశారో, అదే కాషాయీకరణ విద్యను నూతన విద్యా విధానం-2016 పేరుతో దేశవ్యాప్తంగా ప్రవేశపెడుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సైద్ధాంతికవేత్తలను యూనివర్సిటీ, విద్యా సంబంధిత సెంటర్లలోని కీలక పదవుల్లో కూర్చోబెడుతున్నారు. విద్య విషయంలో లౌకిక భావాలున్న వ్యక్తులకు ప్రాధాన్యమివ్వాలన్న కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నదీ ప్రభుత్వం. మేధావులకు కేంద్ర బిందువులైన యూనివర్సిటీలను తమ కబంద హస్తాల్లోకి తీసుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నది. కేంద్రీకరణ పేరుతో ఎన్డీయే ప్రభుత్వం యూనివర్సిటీలను తమ చేతుల్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నది. క్యాంపస్‌ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుంది. వర్శిటీలను పోలీస్‌ కేంద్రాలుగా మారుస్తూ ఉద్యమాలు చేసిన వారిపై కేసులు బనాయిస్తున్నది. మరోవైపు మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దాడులు చేయడం, అవసరమైతే చంపేయడం అత్యంత బాధాకరం. ఇటీవలి కాలంలో గుజరాత్‌లోని ఉనా ప్రాంతంలో చనిపోయిన ఆవును దళితులు తోలు వలుస్తుంటే మతోన్మాద మూకలు ఆ దళితులను తీవ్రంగా కొట్టడం దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది. ఇలాంటి ఘటనలకు నాయకుడైన మోడీ హైదరాబాద్‌ వచ్చి దళితులపై దాడిచేసే ముందు తనపై దాడి చేయండంటూ మొసలి కన్నీరు కార్చారు. అంత ప్రేమ దళితులపై ఉంటే తన సొంత రాష్ట్రంలో ఉనా ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా, బాధితులను పరామర్శించకుండా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జిగేష్‌ను అరెస్టు చేయడంలోనే బిజెపి రాజకీయం అర్థమౌతున్నది.
మతోన్మాదులు పేట్రేగుతున్న తరుణంలో వామపక్ష, సామాజిక, లౌకికవాదులు కలసి ఎదుర్కొవాలి. ఎన్నికల రాజకీయాలైనా, పోరాట రాజకీయాలైనా అందుకు అతీతం కాకూడదు. హెచ్‌సియులో జరిగిన పరిణామం పాఠం ఇదే చెబుతున్నదన్నది స్పష్టం. ఫాసిస్టు విధానాలను వ్యతిరేకించేందుకు విద్యార్థులు ఏకమైతేనే గెలుపు సొంతమైంది. ఇక రాజకీయ క్షేత్రంలో వామపక్ష, లౌకిక, సామాజిక శక్తులు సంఘటితమైతే మనుధర్మశాస్త్ర పుత్రులు, మిత్రులుగా చెప్పుకొంటున్న మతోన్మాదులను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు.    - బీరెడ్డి సాంబశివ 

|| అన్యాయమైపోతున్న ఆదివాసీ జనం పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ||


రిజనుల వ్యథాభరిత యదార్థ గాథలకు దర్పణం పట్టే రెండు చిత్రాలు ఇటీవల మీడియాలో విస్తృత ప్రాచుర్యం పొందాయి. గుండెలను పిండేసే ఆ రెండు చిత్రాల్లో ఒకటి విశాఖ జిల్లా చింతపల్లి మండలానికి చెందిన గిరిజనుడు పీకల్లోతు నీటిలో తన బిడ్డను అరచేతిలో పెట్టుకుని ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నదిని దాటుతున్నప్పటిది కాగా, రెండవది అరకులోయకు సమీపంలోని డుంబ్రిగుండ మండలం కితలంగిలో 108 వాహనం ఎంత సేపటికీ రాకపోవడంతో నడిరోడ్డుపైనే ప్రసవించిన గిరిజన మహిళ దయనీయ పరిస్థితికి దర్పణం పట్టే చిత్రం. ఈ రెండు చిత్రాలు చూసిన ప్రతి ఒక్కరినీ కలచివేశాయి. విష జ్వరం బారినపడ్డ తన మూడు నెలల బిడ్డను అరచేతిలో పెట్టుకుని ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న కుడుముసారి వాగును దాటేందుకు ఆ తండ్రి సాగించిన జీవన్మరణ పోరాటాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. మీడియా మాత్రం దానిని సాహసం 'బాహుబలి'గా వర్ణించింది. ఆ చిత్రంలోని రెండో కోణాన్ని గురించి విస్మరించింది. స్వాతంత్య్రం వచ్చి డెబ్బయ్యేళ్లు అయినా గిరిజనుల దుర్భర జీవితాల్లో మార్పు లేదనడానికి ఈ చిత్రం తిరుగులేని ఉదాహరణ. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరు పాలకుల నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. చింతపల్లిలో రూ.రెండు కోట్లతో కుడుముసారి వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పి ప్రభుత్వం చేతులు దులిపేసు కుంది. గతంలో ఇచ్చిన హామీలకే అతీగతీ లేదు. ఈ హామీ కూడా అమలు జరగుతుందన్న గ్యారంటీ లేదు.
రాష్ట్రంలో అన్ని కీలక వికాస సూచికలలో గిరిజనులు వెనుకబడి వున్నారని, తాము అధికారంలోకి వస్తే గిరిజనులను బ్రహ్మాండంగా ఉద్ధరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా ఆ దిశగా తీసుకున్న చర్యలు శూన్యం. ఈ ఏడాది ఆగస్టులో అరకులో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో అమలు కాని ఎన్నికల హామీలనే పునరుద్ఘాటించారు. 'యేరు దాటేదాక ఓడ మల్లన్న. ఏరు దాటాక బోడి మల్లన్న ' అన్న చందంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించింది. డయేరియా, మలేరి యా, డెంగీ లాంటి అన్ని రకాల జబ్బులకు ఆరోగ్య బీమా కల్పించి అత్యాధునిక వైద్యసేవలందిస్తామని చెప్పిన చంద్రబాబు ఆ దిశగాతీసుకున్న చర్యలు ఒక్కటంటే ఒక్కటి కూడా లేవు. విష జ్వరాలతో విలవిల్లాడుతున్న మన్యాన్ని పట్టించుకోక పోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్నే సూచిస్తుంది. ఏజెన్సీలోని ప్రభుత్వాసు పత్రుల పరిస్థితి దారుణాతిదారుణం. కనీసం సూది ముందు కూడా లేక ప్రాథమిక వైద్య కేంద్రాలు ఈసురోముంటున్నాయి. అయినా, పాలకుల్లో చలనం లేక పోవడం సిగ్గుచేటు. అంటువ్యాధులు, జ్వరాలతో సతమతమౌతున్న మన్యంలో ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించాలని సిపిఎం, ప్రజాసంఘాలు చేస్తున్న డిమాండ్‌ను సైతం పెడ చెవిన పెడుతుండటం దారుణం.
పోలవరం ముంపు ప్రాంతాలుగా పరిగణించి ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన మండలాల్లో పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ముంపు బాధిత ప్రజలు వేరే రాష్ట్రంలో వుంటే వారి కష్టాలను పట్టించుకునేవారు ఉండరని, అందుకే వారిని ఏపిలో కలిపామని గొప్పగా చెప్పిన కేంద్ర ప్రభుత్వం, గిరిజనుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. వారిని ఇప్పుడు త్రిశంకు స్వర్గంలోకి నెట్టేసింది. ప్రజాప్రాతినిధ్యం లేకపోవడంతో పాటు, పర్యవేక్షణ, పరిపాలన కొరవడి విలీన మండలాల్లో విద్య, వైద్యం అటకెక్కడం అక్షరాల పాలకుల నిర్లక్ష్య ఫలితమే. డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలతో పాటు అంతుచిక్కని కాళ్ల వాపు వ్యాధులు మన్యాన్ని వణికిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతులు లేకపోవడం, మరోవైపు ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లే స్థోమత లేకపోవడంతో పిట్టల్లా గిరిజనులు రాలిపోతున్నారు. ఈ మరణాలన్నీ సర్కార్‌ హత్యలుగానే పరిగణించాలి. సరైన రహదారులు, వంతెనలు లేకపోవడంతో గిరిజనులు ఏ చిన్న అంటు వ్యాధి వచ్చినా తట్టుకోలేని పరిస్థితి. గిరిజనులను అడవులనుంచి గెంటేయడం, న్యాయంగా గిరిజనులకు దక్కాల్సిన బాక్సైట్‌ వంటి ఖనిజాలను జిందాల్‌, వేదాంత వంటి కార్పొరేట్‌ కంపెనీల పరం చేసేందుకు యత్నించడం, అటవీ హక్కుల చట్టం కింద ఆదివాసీలకు దఖలు పర్చాల్సిన పది ఎకరాల భూమి ఇవ్వకపోవడం, గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధర కల్పించకుండా వారి శ్రమను దోపిడీ చేయడం వంటి విధానాలు ఒక వైపు కొనసాగిస్తూ ఇంకో వైపు వారి సంక్షేమాన్ని గాలికొదిలేయడం పాలకుల బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు నిదర్శనం.
జనాభా దామాషా ప్రకారం బడ్జెట్‌లో గిరిజనులకు దక్కాల్సిన నిధులను సైతం కేటాయించకుండా, కేటాయించిన అరకొర నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కదలాలి. మన్యంలో విష జ్వరాల నివారణకు తక్షణమే తగు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఆధునిక వైద్యం అందించాలి. సరైన వైద్యం అందకపోవడం వల్ల మృతి చెందిన గిరిజన కుటుంబాలకు నష్ట పరిహారం అందించాలి. ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టపరచాలి. ఈ విషయంలో మొద్దు నిద్దర నటిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజా ఉద్యమాలు అనే ములుగర్రతో పొడిచి లేపాలి.

Thursday, 29 September 2016

# ఎందుకీ ఉలికిపాటు? #



'లెప్ట్‌కి తోడు దొరికి నట్టేనా' అని ఆంధ్రజ్యోతిలో ఆర్కే వ్యాసం రాశారు. దీన్ని 'కొత్తపలుకు' అన్న వ్యాస పరంపరలో చేర్చారు. కానీ ఇందులో పలికినదంతా పాచిపోయిన పాతపలుకే. ''మేమంతా మీ శ్రేయాభిలాషులం. కానీ మీరు 'మూర్ఖంగా' ఆందోళనలు చేపడుతున్నారు. మీరు అదే తీరు కొనసాగిస్తే మేం మా వైఖరి పునరాలోచించుకుంటాం'' అని మార్కిస్టులకు ఆర్కే హెచ్చరిక చేశారు. కార్మిక సంఘాల నాయకులకు, ప్రజా ఉద్యమాల నాయకులకు ఇదే తరహా హెచ్చరికలు రోజూ యజమానుల నుంచో, పోలీసుల నుంచో వస్తూనే ఉంటాయి. ఈసారి పత్రిక సంపాదకుని నుంచే వచ్చాయి. ఇంతకీ మార్కిస్టులు ఆందోళనలు ఎందుకు చేస్తున్నారో ఆర్కే చెప్పలేదు. మార్క్సిస్టులు బలవంతంగా ప్రజల నుండి భూములు ఊడలాక్కోవద్దని ఆందోళన చేస్తున్నారు. ఆర్కేగారి దృష్టిలో ఇదే మూర్ఖం అయితే ఆయన చెప్పదలచుకున్నది ఏమిటి? బలవంతంగానైనా భూములు లాక్కోవడం సరైనది అనా? కనీసం బతకడానికి సరిపడా జీతాలు కావాలని కార్మికులు సెప్టెంబరు 2న సమ్మె చేశారు. ఆ మోతాదులో జీతాలు యజమానులు ప్రభుత్వంతో సహా ఇవ్వడం లేదు. పదేపదే అడిగి, రాయబారాలు నడిపి విసిగిపోయి సమ్మె చేశారు. ఆర్కేగారి దృష్టిలో ఈ సమ్మె చేయడమూ, దానిని మార్క్సిస్టులు బలపరచడమూ మూర్ఖమేనా? కడుపు నిండా తిండి తినేందుకు కూడా జీతాలు రాకపోయినా సమ్మె చేయకూడదు అనేది నయా ఉదారవాదం చెప్తోంది. ఎందుకంటే అలాచేస్తే 'పెట్టుబడి'కి కోపం వచ్చి ఎక్కడికో వెళ్లిపోతుంది. దానికి కోపం తెప్పించకూడదు. ఇదే ఆర్కే వాదం. ఇంకా మన అమాయక జనాలకు చాలా డిమాండ్లు, ఆశలు ఉన్నాయి ఆర్కేగారూ! మీ చంద్రబాబుగారేమో ఎన్నికల ముందు 'జాబు కావాలంటే బాబు రావాలి' అన్నారు. మీ బోటి చెయ్యితిరిగిన పాత్రికేయుడు ఎవరో ఆ నినాదం రూపొందించారు. బాబు వచ్చి రెండేళ్లు దాటిపోయింది. జాబులేవీ? ఏడు వందల ఉద్యోగాల కోసం ఏడు లక్షల మంది గ్రూప్‌-2 అభ్యర్థులు సంవత్సరాల తరబడి నిరీక్షిస్తున్నారు. ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడది సాధ్యం కాదని తేల్చేశారు. ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చకపోయినా ఆందోళనలు చెయ్యకూడదంటారా? అలా ఆందోళన చేయడం మూర్ఖత్వమా? ప్రజలకిచ్చిన వాగ్దాన భంగం మాటేమిటి ఆర్కేసార్‌! అయిన దానికీ, కాని దానికీ ఆందోళనలు చేయడమే కమ్యూనిష్టుల పని అని ఆర్కే సెలవిచ్చారు. మేం చేసిన, చేస్తున్న ఆందోళనలలో కాని దానికి చేసిన ఆందోళన ఏది సార్‌? చెబితే తెలుసుకుంటాం. మేం పోరాడుతున్న అంశాలన్నీ చంద్రబాబు, వెంకయ్య జమిలిగా గాని, విడివిడిగా గాని ఇచ్చిన హామీల అమలుకే కదా? ''మీ భూములు లాక్కుంటాం. మిమ్మల్ని నిర్వాసితుల్ని చేసి నష్టపరిహారం ఇవ్వకుండానే తరిమేస్తాం'' అని చెప్పి ఓట్లడిగారా చంద్రబాబు? అరచేతిలో వైకుఠం చూపించారు. ఆ చూపించిన స్వర్గం ఏది? అని అడుగుతున్నాం. తప్పెవరిది? మీరు ఎవరిని విమర్శిస్తున్నాను ఆర్కే? పవన్‌ కళ్యాణ్‌ కమ్యూనిష్టులతో కలిసి పోరాడతాను అనగానే ఎందుకంత ఉలిక్కిపాటు? అసలు ఒక పాత్రికేయునిగా మీరు ముందు ఎవరిని ప్రశ్నించాలి? రెండున్నర సంవత్సరాల క్రితం ఇదే పవన్‌ కళ్యాణ్‌ బిజెపి మిత్రుడిగా, చంద్రబాబుకి ఆప్తుడిగా ప్రజల మధ్యకు వచ్చి రాష్ట్రాన్ని వీరిద్దరూ అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారా, లేదా? ఇప్పుడు అదే పవన్‌ కళ్యాణ్‌ ఆ బిజెపినే విమర్శిస్తున్నారు. ఎందుకు? ప్రత్యేక హోదా మీద మాట తప్పినందుకు. తెలుగుదేశం నాయకులను కూడా అదే మోతాదులో గాకపోయినా నిలదీశాడు. ఎందుకు? ప్రత్యేక హోదా విషయంలో మెతకగా వ్యవహరిస్తున్నందుకు. ''మీకు నిన్న మొన్నటి దాకా మిత్రుడిగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ ఈరోజు ఇలా విమర్శించే పరిస్థితిని మీరెందుకు తెచ్చుకున్నారు?'' అని నిజానికి ఆర్కే బిజెపిని, టిడిపిని అడగాలి. ఆంధ్ర ప్రాంతమంతా విభజన వద్దన్నా, విభజనను నేరుగానో, మరో విధంగానో టిడిపి బలపరిచింది. బిజెపి నేరుగానే సమర్థించింది. జనాల్లో ఓట్లు కావాలంటే ఏం చెయ్యాలి? ''అయిందేదో అయిపోయింది. మిమ్మల్ని చీల్చేందుకు మేం సహకరించినా మీరు మమ్మల్ని గెలిపించండి. మేమైతే ప్రత్యేక హోదా తెస్తాం. అలా చేస్తాం. ఇలా చేస్తాం'' అని వెంకయ్యనాయుడుగారు ప్రచారం చేసారు. ''మోడీ, వెంకయ్య, అందరూ నా దగ్గరవాళ్లు, నేను చెప్పింది కాదనరు, కనుక నన్ను గెలిపించండి. ఒక్క ప్రత్యేక హోదా ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌ రూపురేఖల్ని మార్చేస్తాను'' అని చంద్రబాబు ప్రచారం చేశారు. ప్రత్యేక హోదా ప్రస్తావన తెచ్చిందెవరు? మావల్లే అది సాధ్యం అని చెప్పిందెవరు? ఇప్పుడు మాట మార్చిందెవరు? ఈ విషయాలనే కదా పవన్‌ కళ్యాణ్‌ కాని, కమ్యూనిష్టులు గాని, ప్రజలు గాని అడుగుతున్నారు? దానికి ఏది సమాధానం? దాన్ని దాటవేసి ప్రత్యేక హోదానా? ప్యాకేజీనా? అని మెలిక పెట్టి డొంకతిరుగుడుగా జారిపోవడానికి చంద్రబాబు, వెంకయ్య ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేక హోదా ప్రస్తావనా వారిదే. కాదన్నదీ వారే. ప్యాకేజీ అన్నదీ వారే. జవాబు మాత్రం మనం చెప్పాలట. ఏం విడ్డూరం! ఈ సంగతి తేల్చండి ఆర్కే!
కమ్యూనిష్టులకి ప్రజలలో పలుకుబడి తగ్గిపోయిందని, కార్యకర్తలకు నీరసం వచ్చిందని, ప్రజలు ఓట్లు వెయ్యడం లేదని ఇలా చాలా చెప్పుకొచ్చారు ఆర్కే. తప్పులు చేయడం కమ్యూనిస్టులకు అలవాటైపోయిందనీ వాపోయారు.  ఒక్క కళ ఇంకా పట్టుబడడం లేదు ఆర్కేగారూ! ప్రజలకు చేసిన వాగ్దానాలను భంగం చేసి సింగపూర్‌కు, అదానీకి సేవచెయ్యడం అనే కళ ఉంది చూశారూ! అది మాత్రం మాకు చాతకాదు. రాదు కూడా. అందులో మీ చంద్రబాబే మాస్టారు. ఇంతకీ మీ ఆలోచన ఏమిటీ ఆర్కే? ఒక పక్క వ్యవస్థలో ''సంయమనం, సమతూకం'' ఉండాలంటే కమ్యూనిస్టులు ఉండాలని నమ్ముతారా! ఇంకో పక్క ఆ కమ్యూనిస్టులతో పవన్‌ కళ్యాణ్‌ కలిసి పోరాడతానని అంటే మాత్రం పనికి రాదా? 'పోరాడదాం' అని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించాక ''ఎలా పోరాడతామో అది కూడా చెప్పవయ్యా, మాటలు కాదు చేతలు కదా ముఖ్యం'' అని రాఘవులు అంటే అదీ ఆక్షేపణీయమైపోతుందా మీకు! ప్రత్యేక హోదా కోసం కమ్యూనిష్టులతో కలిసి పోరాడతా అని పవన్‌ కళ్యాణ్‌ అంటే దాన్ని ఉభయ కమ్యూనిష్టు పార్టీల నేతలూ స్వాగతించడమూ మీకు కష్టంగా తోస్తున్నట్టుందే! ప్రత్యేక హోదా మీద వెంకయ్య మాట మార్చడం కష్టంగా తోచలేదా? ''ప్రత్యేక హోదా'' మన హక్కు కాదా?
కూరలో కరివేపాకులా కమ్యూనిష్టులని, అందరూ వాడేసుకుంటున్నారని మీరు వాపోయారు. అటువంటప్పుడు ఈ కరివేపాకు వంటి కమ్యూనిష్టుల మీద సానుభూతి ఉండాలి కదా! కానీ సానుభూతికన్నా అక్కసే మీ 'కొత్తపలుకు'లో వ్యక్తం అయింది. రాష్ట్రాన్ని, రాష్ట్రంలోని భూములను, ఖనిజసంపదను, అడవులను, నదులను, సముద్రతీరాన్ని, ఏది వీలైతే దాన్ని వ్యాపార సరుకుగా మార్చి అమ్ముకోవాలనే ఎజెండాకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు శక్తి కొద్దీ నిలకడగా, నిజాయితీగా పోరాడుతున్నారు. మాకు ప్రజల్లో బలంలేదని ఒక పక్క అంటూనే ఇంకో పక్క ముఖ్యమంత్రి పర్యటనల సందర్భంగా ముందస్తు అరెస్టులు మామీదే ప్రయోగిస్తున్నారు. కేసులు బనాయిస్తున్నారు. దళితుల మీద, మహిళల మీద దాడులు చేస్తున్నవారిని, భూ కబ్జాలు చేస్తున్నవారిని, ఇసుక మాఫియా గ్యాంగుల్ని-అందరినీ వదిలేసి బొత్తిగా బలంలేదని మీరనుకుంటున్న కమ్యూనిష్టుల మీదే ఎందుకు చంద్రబాబు కన్నెర్ర చేస్తున్నారు? ప్రజలకు దూరం అయిపోయారని మీరనుకొంటున్న కమ్యూనిస్టులతో ప్రత్యేక హోదా విషయంలో కలిసి ఉద్యమించడానికి వైఎస్సార్‌ సిపి, పవన్‌ కళ్యాణ్‌ వంటి వారంతా ఎందుకు సుముఖంగా ఉన్నారు? నికరంగా, నిజాయితీగా ప్రజల తరపున నిలబడి నిర్బంధాలను లెక్కచేయకుండా పోరాడుతున్నాం గనకనే మాకు విలువ ఉంది. అది కూడా లేకుండా పోవాలని మీరు కోరుతున్నారా! మొత్తం ఆర్కేగారి 'కొత్తపలుకు' చదివితే సారాంశం ఒక్కటి కనబడుతోంది. ''ఓ కమ్యూనిష్టులారా! మీరు పోరాటాలు మానేసి గమ్ముగుండండి. వాళ్లతో, వీళ్లతో కలిసి పోరాడే బదులు చంద్రబాబును బలపరచండి. ప్రత్యేక హోదా ఊసు ఎత్తకండి. వెంకయ్యనాయుడుగారిని ఇబ్బంది పెట్టకండి'' అన్నదే సారాంశం. సారీ ఆర్కేగారూ! మీరు కోరుకుంటున్నది కమ్యూనిష్టుల నుంచి మీకు లభించదని, అటువంటిది ఆశించవద్దని స్పష్టం చేస్తున్నాం.

Wednesday, 28 September 2016

|| నూరు వసంతాల ‘అక్టోబర్’ ||



అక్టోబర్ విప్లవం పెట్టుబడిదారీ విధానానికి, పరపీడన పరాయణత్వానికి మరణ శాసనాన్ని ప్రకటించింది. దోపిడీ పీడనలు లేని సమసమాజం ఆదర్శవాద స్వప్నం కాదని రుజువు చేసింది. అందుకు ఆచరణాత్మక మార్గమైంది. ఖండఖండాలలో కార్మికవర్గ, కమ్యూనిస్టు ఉద్యమాలకు ఊపిరులూదింది. సోషలిజాన్ని ఆవిష్కరించింది. ఆ మహత్తర శ్రామికవర్గ విప్లవ శత వత్సర స్వాగత గీతికగా సకల విప్లవాల, పోరాటాల, ఉద్యమాల మాతృత్వ ప్రతీకయైన గోర్కీ ‘అమ్మ’ వంటి అసంఖ్యాకులైన అమ్మలందరినీ సంస్మరించుకుందాం.

 నిన్నటి నెత్తుటి విజయాల జ్ఞాపకాలు, గాయాల గురుతులు, త్యాగాల ఆనవాళ్లను ఆలపిస్తూ ఆగమించే విప్లవాల అక్టోబర్ ఎప్పుడూ వినూత్నమే. నేటి కర్తవ్యాల, రేపటి మజిలీల, అంతిమ గమ్యాల నెమరువేతకు సమాయ త్తమయ్యే సందర్భమే. ఈ విప్లవాల అక్టోబర్... మహత్తర శ్రామికవర్గ అక్టోబర్ విప్లవ శతవార్షికోత్సవ వత్సర సంరంభంతో వస్తోంది. నిండు గుండెలతో ఆహ్వానిద్దాం, హత్తుకుందాం, ఆవాహన చేద్దాం. 1917 నవంబర్ 7న రష్యాలో జరిగిన మొట్టమొదటి శ్రామికవర్గ విప్లవం ప్రపంచ చరిత్రలో ఒక నూతనాధ్యాయానికి నాంది పలికింది. రష్యన్ల పాత జూలియన్ కాలెండర్ ప్రకారం అక్టోబర్ 25 అంటే నేడు వాడుకలో ఉన్న గ్రెగెరియన్ కాలండర్ ప్రకారం నవంబర్ 7 అవుతుంది.

 1917 నాటి రష్యాలో అక్టోబర్ 25న రాజధాని పెట్రోగ్రాడ్‌లో బోల్షివిక్కులు సార్వత్రిక తిరుగుబాటును జరపడం వల్ల రష్యా విప్లవానికి అక్టోబర్ విప్లవం పేరు స్థిరపడిపోయింది. పైగా చైనా విప్లవం విజయవంతమైనది కూడా అక్టోబర్ మాసంలోనే (1949 అక్టోబర్ 1). అందుకే అక్టోబర్ అంటేనే విప్లవాల మాసంగా మారింది. రష్యా అక్టోబర్ విప్లవ విజయం పెట్టుబడిదారీ విధానానికే కాదు, ఒక మనిషిని మరో మనిషిని దోచుకునే వేల ఏళ్ల పరపీడన పరాయణత్వానికి మరణ శాసనాన్ని ప్రకటించింది. దోపిడీ పీడనలు లేని సమసమాజం ఒక ఆదర్శవాద స్వప్నం కాదని మానవ సమాజ చారిత్ర గమ్యమనే సత్యానికి రుజువైంది. ఆ మార్గా నికి వెలుగై నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాలలోనూ కార్మికవర్గ ఉద్యమాలకు, సోషలిజానికి, కమ్యూనిజానికి ఊపిరులూదింది. సామ్రాజ్య వాదంగా మారి పండుటాకుగా మారిన పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యా మ్నాయంగా సోషలిజాన్ని నిలిపింది.

 || ‘అమ్మ’... అక్టోబర్ విప్లవం ||

 అక్టోబర్ విప్లవ శతవార్షికోత్సవాలు ఆరంభం కానుండగా రష్యా విప్లవంలో కీలక భూమికను నిర్వహించిన మాగ్జిమ్ గోర్కీ ‘అమ్మ’ గుర్తుకొస్తోంది. శ్రామికవర్గ తల్లుల విప్లవ చైతన్యానికి ప్రతీక అమ్మ. దోపిడీ, పీడనలను ధిక్కరించే చైతన్యాన్ని అందిపుచ్చుకొని, కొడుకు ఆశయసాధనలో లీనమైన ఆ అమ్మ తల్లుల త్యాగనిరతికి చిరునామా.

 అక్టోబర్ మహావిప్లవానికి ముందు అత్యంత నిర్బంధం మధ్య సాహసోపేత కార్మికవర్గ పోరాటంలో కొడుకుకి తోడుగా తొలిసంతకం చేసిన అమ్మ... పావెల్ తల్లి. గోర్కీ 1906లో రాసిన ‘అమ్మ’ నవలే. కానీ ఆ అమ్మ నిన్న, నేడూ, రేపు సర్వత్రా వాస్తవమే. నాటికీ, నేటికీ విప్లవకారుల త్యాగాల బాటన నడిచే ‘అమ్మ’కు సోషలిజం, కమ్యూ నిజం, విప్లవం, రాజకీయాలు, సిద్ధాంతాలు, వైరుధ్యాలు అర్థం కాకపోవచ్చు. కానీ  దోపిడీ, పీడనలకు, అన్యాయాలు, అక్రమాలకు వ్యతిరేకంగా సాగే అన్ని ఉద్యమాలను వెన్నంటే ఆమె ఉంటుంది.

 రష్యాలో పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా కార్మికవర్గాన్ని కూడ గట్టిన కొడుకు పావెల్ పోరాటంలో అమ్మ భాగం అవుతుంది.  పోలీసు జులుంకు వెరవక ఎర్రజెండాను దించకుండా కార్మిక దినోత్సవ ప్రదర్శనకు అగ్రభాగాన నిలిచిన కొడుకు పావెల్‌ను వెన్నంటే ఉన్నది అమ్మే. పావెల్ చేజారిన జెండాను ఎత్తిపట్టి జనం మధ్య నిలిచి ఆ అమ్మ కార్మికులనుద్దేశించి మాట్లాడిన మాటలివి..  ‘‘నాయనలారా వినండి! మన రక్తంలో రక్తమైన పిల్లలు, అందరికీ సమానంగా న్యాయం జరగాలనే సంకల్పంతో కొత్త ప్రపంచంలో పడ్డారు.

 మీకందరికీ, మీకు పుట్టబోయే పిల్లలందరికీ మంచి జరిగే రోజుల కోసం వెతకడానికి వారు కంకణం కట్టుకున్నారు. సత్యమూ, న్యాయమూగల మరొక జీవిత విధానాన్ని వాళ్ళు అన్వేషిస్తున్నారు. జనానికందరికీ వాళ్ళు మంచిని కోరుతున్నారు’’. ఉద్యమసారథియైన కొడుకు పావెల్  జైలుపాలు కాగా, అతని ఆశయాన్ని కొనసాగించేందుకు చీరలో దాచుకున్న కరపత్రాలతో నీలోవ్నా వర్గదోపిడీకి వ్యతిరేకంగా సాగుతోన్న కార్మికోద్యమానికి ప్రాణం పోస్తుంది. చివరకు పోలీసు తూటాలకు ఎదనడ్డం పెట్టి మరీ కొడుకు ఆశయాల కరపత్రాలను వెదజల్లుతూ ఆ అమ్మ అన్న మాటలు చిరస్మరణీయం.. ‘‘రక్తసముద్రం కూడా సత్యాన్ని ముంచెయ్యలేదు’’ అని. ఏ అమ్మయినా ఎప్పుడూ కొడుకు సత్యమని నమ్ముతుంది. అతడు సత్యదూరుడైతే  నయానా, భయానా నచ్చజెప్పి సన్మార్గంలో పెడుతుంది. తనలో ఊపిరి ఉన్నంత వరకు బిడ్డ ప్రాణాలకు తన ప్రాణాలడ్డుపెడుతుంది. రక్తప్రవాహాలు సైతం తన బిడ్డ నమ్మిన సత్య మార్గాన్ని ముంచెయ్యలేవని ప్రకటిస్తుంది నవల చివర్లో  గోర్కీ ‘అమ్మ’.


 || అమ్మంటే తెలంగాణ పోరు పాట, ఉద్యమాల బాట  ||

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నైజాం రజాకార్లనెదిరించి, యూనియన్ సైన్యాన్ని ధిక్కరించి నడిపిన పోరాటంలో ఎందరో తల్లుల గుండె చెదిరే త్యాగాలున్నాయి. పాలిచ్చే బిడ్డలను పంటపొలాల్లో వదిలేసి ఆయుధాలు పట్టిన వీరమాతలెందరో. తమ బిడ్డలు ఎక్కడున్నారో, ఏమై పోయారో కూడా తెలియకుండా ఏళ్ళు, దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న తల్లులను కూడా  ఉద్యమం మనకి అనుభవంలోకి తెచ్చింది.

 ఉద్యమాన్ని కాపాడుకోవడం కోసం బిడ్డల ప్రాణ త్యాగాలను ప్రోత్సహించిన వారు కొందరైతే, బిడ్డల పోరాటంలో భాగం పంచుకొన్నవారు మరికొందరు. బానిస బతుకుల విముక్తి కోసం అమ్మ ఆ రోజున అన్నీ భరించింది. కొడుకు జాడచెప్పమన్న పోలీసులు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ తల్లి ధీరోదాత్తత ముందు ఓటమిపాలు కాక తప్పలేదు.

 తల్లుల పోరాట పటిమ ముందు అన్నీ దిగదుడుపే. దొరల పెత్తనానికీ, పోలీసుల దాష్టీకాలకూ చరమ గీతం పాడుతూ ప్రతి తల్లీ ఆనాడొక చైతన్యకెరటమయ్యింది. ఊరిదొరల ఆట కట్టించే ఉప్పెనయ్యింది. ఉద్యమానికి ఊపిరయ్యింది. చంటి బిడ్డలను వదిలేసి చంకన తుపాకులనెత్తుకున్న తల్లులెందరో. తెలంగాణ సాయుధ పోరాటంలో భాగమైన ఒక్కో తల్లిదీ ఒక్కో విలక్షణమైన అనుభవం. చాకలి ఐలమ్మ మొదలుకొని ఎందరో తల్లులు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ దోపిడీ, పీడనల నుంచి విముక్తి కోసం నాటి మహత్తర తెలంగాణ పోరా టంలో సమిధలుగా మారారు.

 వీరగాథలను చనుబాలతో నూరిపోసి, విప్లవమార్గాన్ని చూపిన వీరమాతలను చరిత్ర మరచిపోదు.  ‘అమ్మ’ అలుపెరుగని పోరాట గీతం, అమ్మ త్యాగానికి ప్రతీక. మహత్తర అక్టోబర్ విప్లవ శత వత్సర స్వాగత గీతికగా సకల విప్లవాల, పోరాటాల, ఉద్యమాల మాతృ పతాకకు ప్రతీకయైన గోర్కీ అమ్మల లాంటి అసంఖ్యాకమైన అమ్మలందరినీ సంస్మరించుకుందాం. ఆ అమ్మలందరి ఆశలను నిజం చేసేందుకు అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో ముందుకు సాగుదాం.    


అక్టోబర్ విప్లవ శత వార్షికోత్సవం ప్రారంభం కానున్న సందర్భంగా
- మల్లెపల్లి లక్ష్మయ్య

Monday, 26 September 2016

|| ప్రగతి పేరు - ప్రకృతితో పోరు ||



పారిశ్రామిక విప్లవానికి ముందు ఈ స్థాయిలో మానవాళి ఎరుగని విధ్వంసానికి అసలు కారణం ఏమిటి? విధ్వంసంలో కూడా ‘ప్రగతినీ/అభివృద్ధి’నీ చూడగల్గినది సామ్రాజ్యవాద -పెట్టుబడి వ్యవస్థ మాత్రమే. ప్రసిద్ధ పర్యావరణ శాస్త్ర పరిశోధకుడు, ఆర్థిక విశ్లేషకుడు బెలామీ ఫాస్టర్ చెప్పినట్టు ‘ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అవతరించినది మొదలు మానవాళికి, ప్రకృతికి మధ్య అంతకుముందు నెలకొని ఉన్న సంప్రదాయ సమతుల్యత కాస్తా తిరిగి పాదుకొల్పడానికి వీలులేనంతగా తారుమారైపోయింది.’

 ‘వాదనలు ఎన్నిరకాలైనా వినిపించవచ్చు గాక! కానీ, బహుకొద్దిగానే ఉన్న దేశ అపురూపమైన వనరులనూ, ప్రకృతి వనరులనూ; అంతే స్థాయిలో ఉన్న నిధులనూ అదుపుగా, పొదుపుగా ఆచితూచి వినియోగించుకోగల జీవన శైలికి ప్రభుత్వాలూ, పౌరులూ అలవాటు పడకపోతే భవిష్యత్తు, మనుగడ ప్రశ్నార్థకం కాకతప్పదు.’
 - గౌతమ్ భాటియా (ప్రసిద్ధ వాస్తుశాస్త్రవేత్త, శిల్పకారుడు)

 వాన ఎక్కువైతే రొంపి కరువు, వాన తక్కువైతే వరపు కరువని శతాబ్దాల అనుభవం. తమ అవసరాల కొద్దీ మానవులు, అధికార తాపత్రయంతో ప్రభుత్వాలు అపురూపమైన ప్రకృతి వనరుల మీద శక్తికి మించి ఆధిపత్యం నెలకొల్పడానికి చేస్తున్న ప్రయత్నం ఎంత ఉధృతంగా వికటిస్తుందో ఇంతకు ముందు చూశాం. ఇప్పుడు కూడా చూస్తున్నాం. ప్రత్యక్షంగా అనుభవి స్తున్నాం. గతంలో ఎన్నడూ ఎరుగని ప్రకృతి వైపరీత్యం దూసుకువచ్చి లక్షలాది ప్రాణాలను తోడుకుపోయిన ఉదంతాలు కూడా మన ఇరుగు పొరు గున, ఆసియా ఖండంలోనూ (అండమాన్, తమిళనాడు; ఇండోనీసియా) చూశాం.

 ఎప్పటివారో తెలియదు కానీ కాకరపర్తి కృష్ణశాస్త్రి ‘ప్రళయ సంరంభం’ శీర్షికతో రాసిన కవితలో సునామీ జలఖడ్గాన్ని స్వయంగా చూశారా అన్న రీతిలో, అనూహ్యమైన శైలితో, ‘భీకర లీల లేచి అతివేల జవం బున వచ్చి/ దుస్సహమై ధరముంచి’ అని రాశారు. ప్రకృతి వైపరీత్యాలకు మారుపేర్లుగా గత కొద్ది సంవత్సరాలుగా అలాంటి భీకర దృశ్యాలు వాతావరణంలో కనిపించి ప్రజలను అతలాకుతలం చేశాయి. ఎల్-నినో (దుర్భిక్షానికి), లా నినో (అతివర్షానికి) మరింత విధ్వంసంతో కూడిన వైపరీ త్యాలుగా నమోదైనాయి. ఇవి రుతువులను తారుమారు చేశాయి. విభజనకు నిరసన అన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాలను గత రెండువారాలుగా నూరేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో వర్షాలు ముంచెత్తాయి.

 వేలాది ఎకరాలలో పంటలు నాశనమైనాయి. వానకన్నా ముందు ఆకస్మిక వరదలు వచ్చి (కొన్నేళ్ల నాటి కర్నూలు విధ్వంసం మాదిరిగా) నగరాలను, పట్టణాలను ధ్వంసం చే శాయి. ఇప్పట్లో పూరించలేని స్థాయిలో నష్టం కలిగించాయి. వాణిజ్యం స్తంభించింది. వాతావరణ శాఖ హెచ్చరికలను సైతం అవహేళన చేస్తున్నట్టు ఈ వైపరీత్యం విరుచుకుపడింది. కానీ ఒకటి... గతంలో కన్నా, ప్రస్తుతం ఉన్న మెరుగైన సాంకేతిక వ్యవస్థ చాలావరకు జననష్టాన్ని నివారించడానికి ఆస్కారం కల్పిం చింది. సకాలంలో అప్రమత్తం చేయగల సాంకేతిక వ్యవస్థ ఉన్నప్పటికీ, ముందు చూపులేని నాయకులు మాత్రం సరైన సమయంలో స్పందించ డంలో విఫలమైనారు. పేదలు, బలహీన వర్గాలు, మధ్య తరగతి ప్రతిసారి దారుణంగా నష్టపోతోంది. నిజానికి పాలకుల ఈ తరహా చండితనానికి మరో ప్రధాన కారణం ఉంది.

||  పాలకులకూ కావాలి ఆ స్పృహ ||

 పర్యావరణ సమతౌల్యం ఘోరంగా దెబ్బతిన్న ప్రాంతాలలో భారత్ 13వ స్థానంలో ఉన్నదని శాస్త్రవేత్తలు నిర్వహించిన సర్వేలు ఘోషిస్తున్నాయి. సముద్ర గర్భంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ప్రకారం గతంలో విశ్వ వ్యాప్తంగా భూతలం మీద పర్యావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేయడానికి తగిన సాక్ష్యాలు దొరికాయని లండన్‌లోని జాతీయ సాగర పరి శోధన కేంద్రం వెల్లడించింది. హిమనదాలుగా నిరంతరం తమ ఉనికిని కాపా డుకునే ధృవప్రాంతాలను ఆవరించి ఉండే ఆర్కిటిక్ ప్రాంత శీతల స్థితి కూడా అదుపు తప్పి, అక్కడ వాతావరణం వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు హెచ్చ రించారు. భూగర్భంలో శీతల స్థితిని అంచనా కట్టేందుకు కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ అంశాలకు పూర్తి స్పృహ పాలకులకు కూడా ఉండాలి. అప్పుడే ప్రకృతి వైపరీత్యాల వేళ స్పందించవలసిన విధంగా స్పందించ గలుగుతారు. సమర్థ పాలకునిగా, ఉన్నతాధికారిగా, ఇంజనీర్‌గా సేవలు అందించిశాశ్వత కీర్తిని పొందిన సర్ ఆర్థర్ కాటన్‌ను గోదావరి జిల్లాల ప్రజలు నాటికీ నేటికీ వివాహాది శుభకార్యాలలో ‘కాటనాయ నమః’ అంటూ పూజిస్తారు. కాని ఈ ఆధునిక భగీరథుడిని (కాటన్‌ను) కరువు కాటకాలొస్తే ప్రజలు చస్తే చస్తారు, పరాయి దేశంలో ప్రజల కోసం ఎందుకు అంత ఖర్చు చేయవలసి వచ్చిందో సంజాయిషీ ఇవ్వమని లండన్ కోర్టు ముందుకు బ్రిటీష్ వలస పాలకులు ఈడ్చారు.

 దానికి  కాటన్ సమాధానం - ‘కరువు కాటకాలతో చనిపోతున్న ప్రజలకు మనం ఆనకట్టలు, రిజర్వాయర్ల ద్వారా జలధారలు అందజేస్తే మన పాలనలోని ప్రజలను రక్షించుకోవడంతో పాటు, ప్రభుత్వానికి ఆదాయానికి ఆదాయం పెరుగుతుంద’ని బుద్ధిచెప్పి వచ్చాడు. ఈ స్ఫూర్తి ఇప్పటి కొందరు మన పాలకులకు లేదు. ‘యథా రాజా తథా ప్రజా’ అన్న సామెత అవినీతిలో కూరుకుపోయిన నేటి కొందరు పాల కులకు, కొందరు ఇంజనీర్లు, మరికొందరు కాంట్రాక్టర్లకు వర్తించినంతగా మరెవరికీ వర్తించదు. కనుకనే కాటన్ సహా కొందరు ప్రజా ప్రయోజనాల స్పృహకల్గిన పాలకులు, మోక్షగుండం విశ్వేశ్వరయ్యలాంటి హేమాహేమీ ఇంజనీర్లు వివిధ చిన్న జలమార్గాల అనుసంధానం ద్వారా కాల్వల ద్వారా రవాణా వ్యవస్థను పెంపొందించి, స్థిర పరచడానికి కృషి చేశారు.

 ఫలితంగా 1890ల నాటికే గోదావరి, కృష్ణల నదీ వ్యవస్థతో బకింగ్‌హామ్ కెనాల్‌కు వంకలు, వాగుల్ని కూడా అనుసంధానించి, ఆంధ్రలోని కాకినాడ నుంచి తమిళనాడులోని విల్లుపురందాకా, 450 మైళ్ల పర్యంతం జలమార్గాన్ని సుస్థిరం చేశారు. ఈ వరసలోనే కాకినాడ-పుదుచ్చేరి మార్గంలో బకింగ్‌హామ్ కెనాల్ సహా పెక్కు కాల్వలను కలపడానికి ఆ తరువాత కాలంలో ప్రయత్నం జరిగింది. ఈ బకింగ్ కెనాల్ చరిత్ర కాలగతిలో ‘గత జలసేతు బంధనం’గా ముగిసిపోకుండా ఉండి ఉంటే, సెకనుకు 5,600 క్యూబిక్ అడుగుల నీటిని బట్వాడా చేయగల శక్తిగల బకింగ్‌హామ్ ఇటీవల తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్ని భారీ వరద ముంపునుంచి రక్షించుకుని ఉండే పని అని పాల్ హైలాండ్ రాసిన ‘ఇండియన్ బామ్’ పుస్తకం వెల్లడిస్తోంది (హిందూ, 5-12-2015).

||  నిజాం కాలం ప్రాజెక్టులు ||

 పాలనా వ్యవస్థలో అవినీతి అంతర్భాగమైనప్పుడు జలమార్గాల వ్యవస్థ నిర్వహణలోనూ, కట్టడాలలోనూ చోటు చేసుకుంటుంది. కాని నిరంకుశ నిజాం పాలనలో రిజర్వాయర్ల నిర్మాణంలోనే కాదు, కనీసం మురుగునీటి పారుదలకు డ్రైనేజీ వ్యవస్థను నిర్మించిన తీరు గమనించాల్సిందే. అలాంటి పథకం లేనందుననే ప్రస్తుతం నగరాలను, పట్టణాలను ముంచెత్తుతున్న వానలు, వరదలతో డ్రైనేజీ వ్యవస్థకు నవరంధ్రాలు మూసేసినట్టయింది. ఉపరితలంలోనే మురుగు పారుదలయ్యేట్టు స్వతంత్ర భారత పాలకులు వ్యవస్థను నిర్మించినందున మొత్తం డ్రైనేజీ పారుదల నిర్మాణ పథకం లోప భూయిష్టంగా తయారై నగర శోభ కూడా మారు రూపు తొడిగింది.

  ఇటీవల భారీ వరదలకు ఇబ్బందులపాలైన హైదరాబాద్ నగరంలో, కొన్ని రోజులనాడు మొజంజాహి మార్కెట్ పొడవునా, పబ్లిక్ గార్డెన్స్ వద్ద (తెలుగు విశ్వవిద్యాలయం లైన్‌లో) తవ్వకాలు జరుగుతున్నప్పుడు  నిజాం నాటి మురుగునీటి, వర్షపునీటి పారుదల వ్యవస్థకు సంబంధించి  నిర్మించిన కట్టడం పది అడుగుల లోతున కన్పించింది. భూమిని పరీక్షించే సమయంలో అది కన్పించలేదు. మెట్రో రైలు నిర్మాణంలో భారీ దిమ్మలకు అవసరమైన పునాదుల తవ్వకంలో ఆ నిర్మాణ రహస్యం బయల్పడింది.

 అందుకే అంత లోతుగా డ్రైన్ పైప్‌లైన్‌ను పది అడుగుల లోతున వేస్తారని అనుకోలేదని మెట్రోరైల్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.వి.ఎస్. రెడ్డి ఆశ్చర్యం  వెలిబుచ్చారు. ‘ఆ పైప్‌లైన్ సుందరమైన నిర్మాణం’ అని కూడా కితాబు ఇచ్చారు. ఆశ్చర్యమే మంటే ఇందుకు సంబంధించిన పటాలుగానీ, డ్రాయింగ్స్‌గానీ జి.హెచ్. ఎం.సి. దగ్గర, మున్సిపల్ వాటర్ బోర్డు వద్ద లభించక పోవటం. ఇదే సమయంలో ‘హైటెక్ సిటీ’ నిర్మాణం తన గొప్పేనని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతాచేసి అదే హైటెక్ సిటీకి కీలకమైన భూగర్భ (అండర్ గ్రౌడ్) డ్రైనేజీ వ్యవస్థను నిర్మించలేకపోయాడని మరవరాదు. ఆధు నిక పాలకులు ‘ప్రగతి/అభ్యుదయం’ చాటున సహజ వనరుల విధ్వంసానికి పాల్పడుతున్నందుననే ప్రకృతి ఎదురుదాడికి దిగవలసివస్తోంది.

 దెబ్బతిన్న సమతౌల్యంతో ఇక్కట్లు
 పారిశ్రామిక విప్లవానికి ముందు ఈ స్థాయిలో మానవాళి ఎరుగని ఈ విధ్వం సానికి అసలు కారణం ఏమై ఉంటుంది? విధ్వంసంలో కూడా ‘ప్రగతిని/ అభివృద్ధి’నీ చూడగల్గిన ఏకైక వ్యవస్థ సామ్రాజ్యవాద -పెట్టుబడి వ్యవస్థ మాత్రమే. పర్యావరణ శాస్త్ర ప్రసిద్ధ పరిశోధకుడు, ఆర్థిక విశ్లేషకుడైన బెలామీ ఫాస్టర్ చెప్పినట్టు ‘ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అవతరించినది మొదలు మానవాళికి, ప్రకృతికి మధ్య అంతకుముందు నెలకొని ఉన్న సంప్రదాయ సమతుల్యత కాస్తా తిరిగి పాదుకొల్పడానికి వీలులేనంతగా తారుమారై పోయింది’’ (‘ది వల్నరబుల్ ప్లానెట్: 1999 న్యూయార్క్). అంత కన్నా నిశితంగా, కారల్‌మార్క్స్ సహచరుడైన ఫ్రెడరిక్ ఏంగెల్స్ ఈ పరిణామం గురించి 150 ఏళ్ల క్రితమే ఇలా హెచ్చరించాడు: ‘ఆసియా మైనర్, మెసపటోమియా, గ్రీస్ తదితర ప్రాంతాల్లోనూ ప్రజలు సాగుకు లాయకైన భూముల్ని పొందేందుకు అటవీభూముల్ని ధ్వంసం చేశారేగాని, ఈ పని మూలంగా భూమిలో తేమను సంరక్షించగల రిజర్వాయర్లు, అడవులకీ పరి రక్షణా కేంద్రాలనీ గుర్తించలేకపోయారు.

అలాగే, ఏడాదిలో ఎక్కువ రోజుల పాటు పర్వత సానువుల నుంచి నిరంతరం జాలువారే ఊటలను కాపాడు కోలేక పోతామని వారు గుర్తించలేక పోతున్నారు. ఫలితంగా, వర్షాకాలాల్లో మైదాన ప్రాంతాల్ని ముంచెత్తే భారీ వరదల్ని నిరోధించలేక పోతున్నారు. ఆ విధంగా విదేశాలలోని ప్రజల్ని జయించి  పెత్తనం చెలాయించే పరాయి వాడిలా మనం ప్రకృతిపట్ల వ్యవహరించరాదు.  - ఏబీకే ప్రసాద్ (సాక్షి)

|| గోవధ - గోమాంసం - శాస్త్రీయ పరిశీలన ||


మాంసం కోసం పశువులను వధించడం వల్ల పశు జనాభా తగ్గకపోగా వాటి పునరుత్పత్తికి ఆలంబన అవుతుందనే సత్యం పశు వైద్యులుగా, జంతు శాస్త్రవేత్తలుగా మాకు తెలుసు. పశు వధపై నిషేధాలు నిజానికి పశువుల పెంపకంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయనడానికి అనేకానేక రుజువులు వున్నాయి. 

దేశవ్యాప్తంగా పశు వ్యాపారులు, గొడ్డు మాంసం వినియోగదారులు, మాంసం విక్రయదారులపై గో సంరక్షణ నిఘా బృందాల దాడులు నిత్యకృత్యమైపోయాయి. గుజరాత్‌లో ఊనా ఘటన, పశు కళేబరాలను తీసుకువెళుతున్న దళితులపై గోరక్షకుల దురాగతం - అనంతరం ఈ దాడులు మరింతగా పెరిగాయి. పశువుల కళేబరాలను పారవేయడమనే కుల పరమైన నిర్బంధ శ్రమను తమపై రుద్దడాన్ని దళితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గుజరాత్ లో, ఆ అమానుష వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న దళితులు ‘మీ ఆవు తోక, చర్మం, ఎముకలు మీరే ఉంచుకోండి, మా భూమి మాకు ఇవ్వండి’ అని నినదిస్తున్నారు. చర్మ ఉత్పత్తులను ఉపయోగిస్తున్న వారిపైన కూడా గో సంరక్షకులు ఇటీవల దాడులు చేయడం ప్రారంభించారు.
పశు వధ, గొడ్డు మాంసం వినియోగంపై పర్యవేక్షణ, నిఘా (మానిటరింగ్‌ అండ్‌ సర్వేయిలన్స్‌) నెట్‌వర్క్స్‌లో హర్యానాలోని లాలా లజ్‌పతరాయ్‌ యూనివర్శిటీ ఆఫ్‌ వెటెరినరీ అండ్‌ ఏనిమల్‌ సైన్సెస్‌ (ఈ విశ్వవిద్యాలయంలోనే నేను పశువైద్య శాస్త్రవేత్తగా శిక్షణపొందాను) కూడా చేరింది. మేవాట్‌ బిర్యానీ నుంచి సేకరించిన మాంసం ముక్కలపై లాలాలజ్‌పతరాయ్‌ విశ్వవిద్యాలయ ప్రయోగశాల ఒకటి జరిపిన పరీక్షలలో అది ‘ఆవు మాంసం’ అని నిర్ధారణ అయిందని ఈ నెల 9న ఒక వార్త వెలువడింది. మహారాష్ట్ర ననుసరించి హర్యానా గత ఏడాది మార్చి 16న గోవంశ్‌ సంరక్షణ్‌ అండ్‌ గో సంవర్ధన్‌ చట్టంను తీసుకొచ్చింది. పశువుల వధను ఈ చట్టం పూర్తిగా నిషేధించింది. అంతేకాక ఏ పశువునైనా వధిస్తూ లేదా కబేళాకు పశువులను పంపిస్తూ లేదా కబేళాకు పంపించడానికై పశువిక్రయాలు జరుపుతూ పట్టుబడిన వ్యక్తి లేదా వ్యక్తులకు విధించే జరిమానాను ఈ చట్టం భారీగా పెంచింది. ఈ చట్టం ప్రకారం గొడ్డు మాంసంను కలిగివుండడం కూడా నేరమే. ఈ అపరాధులకు సైతం భారీ జరిమానా విధిస్తారు 1955నాటి పంజాబ్‌ గో వధ నిషేధ చట్టం వలే ఈ హర్యానా చట్టం కూడా తమ అమాయకత్వాన్ని నిరూపించుకునే భారాన్ని నిందితుడిపైనే మోపింది. మహారాష్ట్ర చట్టంలో కూడా ఇవే నిబంధనలు వున్నాయి.
సరే, తెలంగాణ విషయానికి వద్దాం. ఇటీవల బక్రీద్‌ వేడుకలకు గాను ఎద్దులు, దున్నపోతులు మొదలైన పశువులను చట్టబద్ధంగా రవాణాచేస్తున్న పశు వ్యాపారులకు అధికారుల నుంచి వేధింపులను నిరోధించాలని పలువురు చేసిన విజ్ఞప్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించనే లేదు. పశు వధకు సంబంధించిన రాష్ట్ర చట్టాలేవీ పశువుల క్రయ విక్రయ వ్యాపారాన్ని నిషేధించలేదు. ‘వధకు అర్హమైన’వని సంబంధిత అధికారులు ధ్రువీకరించిన పశువులు వేటినైనా సరే వధించవచ్చని ఆంధ్రప్రదేశ్‌ గో వధ నిరోధం, జంతువుల సంరక్షణ చట్టం-1977 స్పష్టం చేసింది. అయితే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఒక బహిరంగ ప్రకటన ద్వారా గోరక్షకులకు వ్యూహాత్మకంగా మద్దతునిచ్చింది. గో వధ విషయంలో అప్రమత్తంగా వుండాలని తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ నెల 16న ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేసింది. బక్రీద్‌ సందర్భంగా మాంసం వినియోగం అధికంగా ఉంటుంది గనుక గోవధ విషయంలో ప్రజలు జాగరూకత వహించాలని ఆ ప్రకటన పేర్కొంది.
ఇక్కడ చర్చ మాంసం నమూనాలపై జరిపిన పరీక్షల ఫలితాలు ఎలా వున్నాయి, లేదా ‘గో వధ’ జరుగుతున్నదా జరగడంలేదా అన్న అంశం గురించి గానీ కాదు. ఆహార సంస్కృతులను, జీవనాధారాలను నేరమయమైనవిగా చేయడంలో ప్రభుత్వ ఉద్దేశం (ప్రస్తుత సందర్భంలో గొడ్డు మాంసం, సంబంధిత జీవనాధారాలు); అలా చేయడం ద్వారా మన దేశ జనాభాలో యాభై శాతంగా ఉన్న సామాజిక వర్గాలను పూర్తిగా నేరపూరితమైనవిగా చేయడం గురించే ఈ చర్చ. ఆవులకు, వాటి సంతతికి, దేశవాళీ పశుజాతులకు, ఆవుకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలకు రక్షణ, భద్రత కల్పించడానికి చట్టాన్ని ఉద్దేశించామని రాజ్య వ్యవస్థ చెబుతోంది. అలా చెప్పడం ద్వారా భారతీయ సంస్కృతికి సంబంధించిన ఒక ప్రాబల్య భావనను సమర్థించే సంకల్పాన్ని దాచి పెడుతున్నదనేదే అసలు వాస్తవం.
మాంసం కోసం పశువులను వధించడం వల్ల పశు జనాభా తగ్గిపోదని, తగ్గకపోగా వాటి పునరుత్పత్తికి ఆలంబన అవుతుందనే సత్యం పశు వైద్యులుగా, జంతు శాస్త్రవేత్తలుగా మాకు తెలుసు. భారతీయ గేదెలు, దున్నపోతుల విషయంలో ఇది ఒక నిదర్శనంగా ఉన్నది. పశు వధపై నిషేధాలు నిజానికి పశువుల పెంపకంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయనడానికి అనేకానేక రుజువులు వున్నాయి. పాలివ్వని గోవులు, అనుత్పాదక ఎద్దులు, చిన్న ఎద్దులు మొదలైన వాటిని విక్రయించేది రైతులేగాని, పశువ్యాపారులు కాదు. పశువుల యజమానుల నుంచి వాటిని తస్కరించడం లేక నిర్బంధంగా కొనుగోలుచేయడమే వ్యాపారులకు పరిపాటి. దేశ గ్రామీణజనాభాలో 80శాతంగా వున్న చిన్న రైతులు, సన్నకారు రైతులు, దేశంలోని 1900 లక్షల పశువులు, 1080 లక్షల గేదెలలో 70శాతాన్ని కలిగి వున్నారు. కరువు కాటకాలు, పాడి ఉత్పత్తులకు సరైన ధరలు లేకపోవడం మొదలైన కారణాల వల్ల గోవులు, గేదెలు, ఎద్దులు మొదలైన పశువులను రైతులు సరైనవిధంగా పోషించలేకపోతున్నారు.
పశుగ్రాసం లభించకపోవడం వల్ల, నీటికరవు వల్ల రైతులకు తమ పశువులను విక్రయించక తప్పడం లేదు. అయితే తోటి రైతు ఎవరైనా వాటిని కొను గోలు చేసినప్పుడు వాటికి ఆకలిదప్పుల నుంచి కనీసం కొంతకాలమైనా ఉపశమనం లభిస్తుంది, అయితే పశు వ్యాపారులు కొనుగోలు చేసినప్పుడు అవి అంతిమంగా కబేళాలకు పంపబడుతున్నాయి. తమ పశువులను విక్రయించుకోవడమనేది రైతుల హక్కు. జీవనాధారాల సుస్థిరతకు, పశుగణాల కేంద్రిత ఆర్థిక వ్యవస్థ వర్ధిల్లడానికి రైతులకు గల ఈ హక్కు చాలా కీలకమైనది.
గో వధపై నిషేధం గోవులను రక్షించకపోగా, రైతులు విక్రయించిన అనంతరం గో సంబంధిత ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర అవరోధమవుతోంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఇప్పటికే అదృశ్యమవుతున్న పశు కేంద్ర ఆర్థికతకు ఆ నిషేధం చావు దెబ్బవుతోంది. మన ఆహార సంస్కృతులలో గొడ్డు మాంసం చాలా ముఖ్యమైనది. అత్యధిక సంఖ్యాకులకు అది చౌకగా లభించే బలవర్థక ఆహారం. 1100 కోట్ల డాలర్ల విలువైన భారతదేశ చర్మోత్పత్తుల పరిశ్రమకు అవసరమైన ముడి సరుకు అంటే పశు చర్మాలు సమకూరుతున్నాయి. అంతేగాక మన పాదరక్షల అవసరాలలో 95 శాతం మన పశుగణాల ద్వారానే తీరుతున్నాయి. ఇంకా ఔషధ తయారీ, వస్తూత్పత్తి పరిశ్రమలకు కూడా పశుగణాల నుంచి విశేష సేవలందుతున్నాయి. ఈ కారణాల వల్ల అనుత్పాదక పశువులు, అవి ఆడవైనా, మగవైనా మంచి మార్కెట్‌ విలువ కలిగివుండి రైతులకు ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి.
ఎద్దులు, చిన్న ఎద్దుల వధపై నిషేధం వల్ల వాటి పునర్‌ విక్రయ విలువ గణనీయంగా పడిపోయిందని మహారాష్ట్ర రైతులు ఆరోపిస్తున్నారు. ఎద్దుల ధరలు 40 నుంచి 60 శాతం మేరకు తగ్గిపోవడంతో రైతులు తమ పశువులను విడిచిపెట్టక తప్పడం లేదు. దీనివల్ల కరువుకాటకాలు మొదలైన దురవస్థల్లో పశువుల ద్వారా లభించే ఆదాయాన్ని చాలా మంది రైతులు కోల్పోతున్నారు. 2015లో నెలకొన్న దుర్భిక్షంవల్ల రైతులు తమ తాగునీటిని సైతం కొనుక్కోవల్సివచ్చింది. ఇటువంటి దుస్థితిలో పడ్డ రైతులు తమ పశువులకు కూడా తాగునీటిని ఎలా కొనగలుగుతారు? దుర్భిక్ష పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్న కారణంగా వారు ఆ దుస్థితి నుంచి ఇంకా బయటపడలేదు. తమ అనుత్పాదక పశువులను సైతం విక్రయించుకోలేని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందుకు రైతులు ఎంతో విచారిస్తున్నారు. గోశాలల ఏర్పాటునకు, అనుత్పాదక గోవులు, పశువులకు ఆశ్రయం కల్పించడానికి ప్రభుత్వ పెట్టుబడులను పెంచాలని పశు/గో వధపై నిషేధాలు అమల్లో వున్న రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్నాయి. దేశంలోని పశుగణాలలో మూడోవంతు అనుత్పాదకమైనవి అనుకుంటే వాటిని పోషించడానికి ప్రభుత్వానికి రూ.6,36,300కోట్ల వ్యయమవుతుంది!
గో/పశు వధ నిషేధించాలని కోరుతున్న సంస్కృతి, రాజ్యవ్యవస్థలు ఒక వాస్తవంపై మౌనం వహిస్తున్నాయి. చనిపోయిన ఆవులు, ఇతర పశువుల కళేబరాలను తొలగించడం, పారవేయడం మొదలైన పనులు చేసేవారు దాదా పుగా అందరూ అట్టడుగువర్గాల వారే కదా. దళితులు, ఆదివాసీలు, ముస్లింలు మినహా మరే కులంవారు కూడా మృత గోవుల, పశువుల కళేబరాలను పారవేయడానికి అంగీకరించరు. మృత గోవులు, పశువులకు సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొనే 25లక్షల మందిలో 45శాతం మంది దళితులు కాగా, 55శాతం మంది ముస్లింలు. వీరు మాత్రమే పశు కళేబరాలను తొలగించడం, పారవేయడం, వాటి చర్మాలను ఒలవడం, శుద్ధిచేయడం మొదలైన పనులు చేస్తారు. ఇటువంటి పనుల్లో పాల్గొనేవారి ఆదాయం అతితక్కువ కాగా భారతదేశపు విస్తరిస్తున్న చర్మోత్పత్తులు, మాంసోత్పత్తుల పరిశ్రమల నుంచి అపరిమిత లాభాలనార్జిస్తున్న వారందరూ అగ్రకులాలవారే కావడం భారతీయ సమాజంలో ఒక బాధాకర వైరుధ్యం.    -డాక్టర్‌ సాగరి ఆర్‌ రామ్‌దాస్‌, పశు వైద్య శాస్త్రవేత్త. (ఆంధ్ర జ్యోతి)

|| వామపక్షం - దళితులు ||




                         కార్పొరేట్‌ ఇండియాకు ప్రాణప్రదమైన 'గుజరాత్‌ నమూనా' కార్పొరేట్‌ లాభాల ను, దళితుల నిరాశా నిస్పృహలను అత్యంత స్పష్టంగా ప్రతిబింబిస్తున్నది. గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలోని ఉనాలో జరిగిన సంఘటనలు ఈ విషయాన్ని ఎత్తిచూపాయి. ఆవు చర్మం వలిచే వృత్తిని వదలేయాలని గోసంరక్షకులని పిలువబడుతున్నవారు దళితులను బెదిరిస్తున్నారని నేను సిపిఐ(ఎం) ప్రతినిధి బృందంలో భాగంగా ఉనా వెళ్ళినప్పుడు మాకు చెప్పారు. తన ఇద్దరు కొడుకులను దారుణంగా కొడుతున్నప్పుడు అడ్డుపడిన తండ్రిని కూడా కొట్టారు. వాస్తవంలో వారికి మరే ఇతర ఉద్యోగాలూ అందుబాటులో లేవని ఆ తండ్రి మాతో చెప్పారు. గుజరాత్‌ జనాభాలో దళితులు 8 శాతం ఉన్నారు. వీరిలో చాలామందికి భూమి లేదు. గ్రామీణ గుజరాత్‌లో వారు చాలా వరకు వ్యవసాయ కూలీలుగానూ, కుల నిర్థారిత వృత్తుల్లోనూ కొనసాగుతున్నారు. ఆస్తిపాస్తులు లేకపోవటంతో వారు అంటరానితనానికి, వెలివేతకు లోనవుతున్నారు. ఈ దురాచారాలు ప్రతిచోటా ఉన్నాయి. మేము దర్శించిన గ్రామం బాగా అభివృద్ధి చెందింది. ఆ గ్రామం నుంచి దళితవాడ వేరుచేయబడి ఉన్నది. దళితులు నివసించే ప్రాంతంలో కుళాయి నీరు, పారిశుధ్యం, పాఠశాల లేవు. రోడ్ల నిర్మాణం జరగలేదు. సౌరాష్ట్ర ప్రాంతంలోని గ్రామాలలో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉన్నదని వారు మాకు చెప్పారు. ఊట సిద్ధాంత ఆధారిత గుజరాత్‌ నమూనా సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను తీవ్రతరం చేస్తున్నదనటానికి లెక్కకుమించిన సాక్ష్యాధారాలున్నాయి. నయా ఉదారవాద విధానాలు దళితులను బాగా దెబ్బతీశాయి. ఆవిధంగా ఈ విషయాలను చేపట్టిన దళిత గ్రూపులు, ఉద్యమాలు నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలకు సహజ మిత్రులు.

|| అస్పృశ్యతా వ్యతిరేక పోరాడటానికి వామపక్ష ప్రత్యామ్నాయ నమూనా ||

                       ఈ సందర్భంగా భూమి, జీవనాధార సమస్యలపై దళిత అస్మిత, దళిత ఆత్మగౌరవం పేర్లతో గుజరాత్‌లోని దళిత సమాజం ఒక వెల్లువలా ఉద్యమించింది. నీచమైనవిగా భావింపబడుతున్న 'సంప్రదాయ' వృత్తులకు చెందిన పనులను తిరస్కరించాలని ఉద్యమ నేతలు దళితులకు విజ్ఞప్తి చేశారు. ఒక శక్తివంతమైన ప్రతీకాత్మక నిరసనగా దళితులు అనేక మృత పశువుల కళేబరాలను ప్రభుత్వ కార్యాలయాల ముందు పడేశారు. ఉనాలో జరిగిన హింసాత్మక సంఘటనల తరువాత భూ సంస్కరణల కోసం దళిత ప్రతిఘటన డిమాండ్‌ చేయటానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. 'మీరు ఆవు తోకను ఉంచుకొని మాకు మా భూమిని ఇవ్వండి' అనే నినాదం అత్యంత ప్రజారంజకం అయింది. సామాజిక, రాజకీయ సమీకరణలతోపాటు వివక్ష, అస్పృశ్యతలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భూ సంస్కరణల కోసం డిమాండ్‌ చేయాలనే వామపక్ష విధానాన్ని ఇది వెలుగులోకి తెచ్చింది.
1970వ దశకంలో బెంగాల్‌లో ప్రవేశ పెట్టిన వామపక్ష నమూనా ఇక్కడ బాగా ఉపయుక్తంగా ఉంటుంది. వామపక్ష ప్రభుత్వం 12 లక్షల ఎకరాలను 30 లక్షల మంది గ్రామీణ పేదలకు పంచింది. వీరిలో 37 శాతం దళితులే కావటం గమనార్హం. ఈ పునాదిపైనే గ్రామ పంచాయతీలలో దళితులు పాల్గొని నాయకులుగా ఎదిగారు. గ్రామీణ బెంగాల్‌లో ఈ భూ సంస్కరణల ప్రక్రియ, స్థానిక స్వపరిపాలన, కులతత్వ ధోరణుల నడ్డి విరిచింది. కులానికి వ్యతిరేకంగా రాజకీయంగా, సామాజికంగా వామపక్షం జోక్యం చేసుకునేందుకు తగిన వాతావరణాన్ని అది సృష్టించింది. బెంగాల్‌లో కుల వ్యవస్థ నిర్మూలించబడిందని నేను చెప్పటంలేదు. అయితే గుజరాత్‌ కంటే అది సామాజికంగా చాలా తక్కువ ప్రమాదకరంగా మారిందని కచ్చితంగా చెప్పవచ్చు. ఆ విధంగా గుజరాత్‌లో జరుగుతున్న దళిత ప్రతిఘటన, దాని నాయకత్వం ఇచ్చే నినాదాలు మరోసారి వామపక్ష ప్రత్యామ్నాయ నమూనా విశిష్టతను వెలుగులోకి తెచ్చాయి.
గుజరాత్‌ ఉద్యమం బయటకు తెచ్చిన మరో ముఖ్యమైన పార్శ్వం సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి ఆవశ్యకత. మోడీ నాయకత్వంలో గత దశాబ్దంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా వృద్ధి రేట్లను గుజరాత్‌ సాధించిందని చెబుతుంటారు. అయితే సామాజికంగా చూస్తే కేవలం ధనికులు, అదానీలు, అంబానీల వంటి ఆశ్రిత కార్పొరేట్‌ పెట్టుబడిదారులు మాత్రమే ఈ తరహా వృద్ధితో లాభపడ్డారు. ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? గుజరాత్‌ నమూనాలో పెట్టుబడి తీవ్రత అధికంగా ఉన్న పరిశ్రమలలో ఉద్యోగ కల్పన, వేతనాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. ఇలాంటి వృద్ధి వల్ల దళితులు అందరికంటే ఎక్కువగా నష్టపోయారు. ప్రత్యామ్నాయం అంటూ ఏదీ అందుబాటులో లేని స్థితిలో దళితులు సంప్రదాయ కుల ఆధారిత పనులను తిరస్కరిస్తున్నారు. గుజరాత్‌లో అనేక ప్రభుత్వ శాఖలలో షెడ్యూల్డ్‌ కులాలకు ఉద్దేశింపబడిన 64,000 ఉద్యోగాలను భర్తీచేయలేదని నవసర్జన్‌ అనే ప్రముఖ దళిత గ్రూపు చేసిన అధ్యయనంలో తేలింది. ప్రభుత్వం గత సంవత్సరం విడుదల చేసిన సమాచారం దీన్ని నిర్ధారించింది. 'పాకీపని, మృత పశువుల కళేబరాలను తొలగించటం వంటి కుల ఆధారిత వృత్తుల నుంచి బయటకు రాకుండాచేసి తద్వారా వారి సామాజిక అంతస్తు మారకుండా చూసే ఒక దోపిడీ వ్యవస్థ కుట్ర దీనిలో ఇమిడి ఉంది' అని నవసర్జన్‌ డైరెక్టర్‌ మార్టిన్‌ మక్వాన్‌ పేర్కొన్నారు. అనేక దళిత గ్రూపుల ఆలోచనలలోనూ, విశ్లేషణలలోనూ జీవనాధారం, ఉద్యోగాలు, భూమి, వేతనాలు ముందు కొచ్చాయనే వాస్తవానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. గతంలో సామాజిక అంతస్తుతో వీటికి సంబంధం ఉండేది కాదు. ఆ అవగాహన మారింది. ఇది ఆహ్వానింపదగిన పరిణామం. దీనితో దళిత గ్రూపులు, వామపక్ష ప్రజా సంఘాలు చేయగల సమిష్టి కార్యాచరణలకు ఒక పునాది ఏర్పడింది. ప్రత్యేకంగా చెప్పాలంటే కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఈ మైత్రిని నిర్మించటంలో ప్రధాన పాత్రను నిర్వహించగలుగుతాయి.

|| విద్యార్థులు-విద్యా సంస్థలు ||

నిరసనకు గల రెండవ పార్శ్వం రోహిత్‌ వేముల ఉదంతంతో వెలుగులోకి వచ్చింది. పాఠశాల తరగతి గది నుంచి సాంకేతిక, వృత్తి సంబంధిత ఉన్నత విద్యా సంస్థలతో సహా అన్ని రకాల విద్యా సంస్థలలో దళితులు ఎదుర్కొంటున్న వివక్ష ఈ ఉదంతంలో ఇమిడి ఉన్నది. విద్యా సంస్థలలోని వివక్షకు చెందిన వివిధ పార్శ్వాలపై స్రొఫెసర్‌ సుఖ్‌దేవ్‌ థోరట్‌ సవివరమైన పరిశోధన చేశారు. యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ చైర్మన్‌ హోదాలో ఆయన ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో దళితులు ఎదుర్కొంటున్న వివక్షపై సవివరమైన నివేదికను తయారు చేయించారు. ఆ విద్యా సంస్థలో సమాన అవకాశాల కార్యాలయాన్ని నెలకొల్పటంతో సహా దళిత విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షను అధిగమించటానికి అనేక సిఫార్సులు చేశారు. ఈ సిఫార్సులు ఎయిమ్స్‌కే కాకుండా ఉన్నత విద్యాసంస్థలన్నింటికీ వర్తిస్తాయి. అయితే ఈ నివేదిక 2007లో సమర్పించబడినప్పటికీ దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో జరిగిన సంఘటనలు దేశంలోని అనేక కాలేజీలకు, విశ్వవిద్యా లయాలకు చెందిన విద్యార్థులు సంఘీభావ ఉద్యమాన్ని చేపట్టేలా చేసింది. దళిత విద్యార్థులకు న్యాయం జరగాలంటే రోహిత్‌ వేముల చట్టం తేవాలనే డిమాండ్‌ ఈ ఉద్యమంలో ఆవిర్భవించింది. థోరట్‌ నివేదిక ముందుకు తెచ్చిన సమస్యలను అనేక విద్యాసంస్థలలో దళిత విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. వీటిని పరిష్కరించేందుకు ఒక చట్టాన్ని తేవలసిన అవసరం ఉన్నది. అలాంటి చట్టాన్ని తేవాలని చేసే పోరాటానికి సిపిఐ(ఎం) మద్దతు ఉన్నది. హెచ్‌సియు, జెఎన్‌యు, జాదవ్‌పూర్‌, హిమాచల్‌ విశ్వవిద్యాలయం వంటి విద్యాసంస్థలలో వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యాసంస్థలలో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయటం ముదావహం. అలా విశాల మైత్రి ఏర్పడటానికి అవకాశం ఏర్పడింది. కొన్నిచోట్ల అది ఆచరణలోకి వచ్చింది.

|| దళితులపై సాగుతున్న హింస ||

నిరసనకు గల మూడవ పార్శ్వం దళితులపై కొనసాగుతున్న హింస. ఈ హింస కేవలం అగ్రకులాలే కాకుండా మండల్‌ అనంతరం రాజకీయ, సామాజిక ప్రాబల్యం సముపార్జించిన మధ్యస్థ కులాలకు చెందిన కొన్ని వర్గాలు ఈ హింసకు పాల్పడుతున్నాయి. గత దశాబ్ద కాలంలో ప్రత్యేకంగా గత కొన్ని సంవత్సరాలలో దళితులపై హింస పెరిగింది. జాతీయ నేర రికార్డుల బ్యూరో గణనను బట్టి తేలిందేమంటే 2013లో దళితులపై జరిగిన హింసాత్మక సంఘటనలు 39,408 ఉంటే 2014లో అవి 47,064కు పెరిగాయి. ఈ ఘటనలు 2012లో 33,655, 2011లో కూడా అదే స్థాయిలో ఉన్నాయి. నిజానికి దళితులకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు జాతీయ సగటు కంటే 2013, 2014లో పది రాష్ట్రాలలో ఎక్కువగా పెరిగాయి. దళిత మహిళలపై జరుగుతున్న లైంగిక హింస అనేక సామాజిక కారణాల వల్ల రిపోర్ట్‌ కావటం లేదు. దళితులపై జరిగిన దాడులకు పడే శిక్షలు కేవలం 3.7 శాతం మాత్రమే.

|| కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట రాజకీయాలు ||

ఒకవైపు ఐక్యత ఆవశ్యకత పట్ల చైతన్యం పెరుగుతున్నప్పటికీ కొన్ని దళిత సంఘాలు, ఎన్‌జిఓలు రాజకీయ, భావజాల కారణాల వల్ల వామపక్ష ప్రజాసంఘాలకు వ్యతిరేక ధోరణిని ప్రదర్శిస్తున్నాయనేది నిజం. వామపక్షాల పట్ల ఎటువంటి దృక్పథం కలిగి ఉండాలనే విషయంలో దళిత గ్రూపుల మధ్య విభేదాలున్నాయి. వామపక్షాలను ప్రధాన లక్ష్యంగా చేసుకోవాలనీ, సమిష్టి ఉద్యమాలను వ్యతిరేకించాలనీ కొందరు భావిస్తున్నారు. ఈ దృక్పథం మూలాలు అస్తిత్వ రాజకీయాల ఆచరణలో ఉండటమే కాకుండా మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితిలో వచ్చిన గుణాత్మక మార్పును వీరు గ్రహించలేకపోతున్నారు. అయితే వామపక్షం ముఖ్యంగా సిపిఐ(ఎం) ఈ రాగద్వేషాలను అధిగమించి ద్వేషపూరితమైన కుల వ్యవస్థపై పోరాటాలను నిర్మించటానికి సుముఖులుగా ఉన్న వారందరితో కలిసి పనిచేయాలి. ఈ పోరాటంలో మనం మన బలహీనతలను అధిగమించాలి. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా కార్మికులను సమీకరించటం భారతదేశంలోని వర్గపోరాటాలకు అవసరమనే మార్క్సిస్టు అవగాహనను సిద్ధాంతంలోనూ, ఆచరణలోనూ బలోపేతం చెయ్యాలి. దళిత కార్మికులు ద్వంద్వ భారాలను మోయవలసి వస్తున్నది. దళిత మహిళా కార్మికులు కుల, లింగ వివక్ష, వర్గ దోపిడీల వల్ల మూడు భారాలను మోయవలసి వస్తున్నది. వీటిని గుర్తించి, పట్టించుకోవలసిన అవసరం ఉన్నది.
కుల వివక్షను పరిష్కరించటంలో పెట్టుబడిదారీ వ్యవస్థ విఫలం కావటం యాదృచ్ఛికం కాదు. దానికి భిన్నంగా పెట్టుబడిదారీ వ్యవస్థ వివిధ దశలలో తన లాభాలను పెంపొందించుకోవటానికి కులాన్ని ఉపయోగించు కోవటమేకాక బలోపేతం చేసింది. చారిత్రకంగా భారత సమాజంలోని కులాలు, వర్గాలు పెనవేసుకుని అభివృద్ధి చెందిన తీరు మనకు తెలియజేసేదేమంటే అంటరానివారి నుంచి, శూద్రుల నుంచి మిగులును మరింతగా దోపిడీ చేసేందుకు కులాన్ని ఉపయోగించటం జరిగింది. మహిళల శ్రమ విలువను మరీ ముఖ్యంగా దళిత మహిళల శ్రమ విలువను తగ్గించటానికి పితృస్వామిక సంస్కృతులను వాడటం జరిగింది. మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్న స్థితిలో హిందూత్వ శక్తులు 'హిందువుల ఐక్యత'ను నిర్మించే ప్రయత్నం చేస్తూ మైనారిటీలకు వ్యతిరేకంగా దళితులను సమీకరిస్తున్నారు. దేశంలోని కుల నిర్మాణాల గురించి వామపక్ష  మౌలిక సైద్ధాంతిక అవగాహనా చట్రం దళితుల మధ్య వామపక్షాల పనికి, దళిత గ్రూపుల, సంస్థలతోవామపక్షాల సంబంధాలకు, వామపక్షాల సామాజిక మైత్రీ బంధాల నిర్మాణానికి ఆధారమవ్వాలి. కుల వ్యవస్థపై పోరాటం చెయ్యటానికి, న్యాయం కోసం దళితులు చేస్తున్న నేటి పోరాటానికి గల మూడు పార్శ్వాలను చేపట్టటానికి ఒక నూతన సామాజిక, ఆర్థిక ఎజెండాతో ముందుకు సాగాలి.  - బృందా కరత్‌

Sunday, 25 September 2016

|| అజరామర కీర్తి - చిలకమర్తి || // నేడు చిలకమర్తి 150వ జయంతి //



‘నేను నా గురించి రాసుకునేంతవాణ్ని కాను’ అని ‘స్వీయ చరిత్ర’లో వినయశీలత చాటిన చిలకమర్తి లక్ష్మీనరసింహం- నిజానికి తెలుగుజాతి సమస్తం సగర్వంగా తలెత్తుకొని నిలిచేంత చరిత్ర సృష్టించారు. 1867 సెప్టెంబరు 26న అతి సాధారణ కుటుంబంలో పుట్టిన ఆయన, 75ఏళ్ల వయసులో వెలువరించిన ఆత్మకథ సమగ్ర సామాజిక జీవన దర్శిని! వేషభాషల్లో భారతీయతకు ప్రతిరూపంగా వెలిగిన ఆ బహుముఖ ‘కళాప్రపూర్ణ’తకు 150వ శతజయంతి వసంతమిది. గయోపాఖ్యానం పేరుతో 21 సంవత్సరాల యౌవన ప్రాయంలో ఆయన వెలువరించిన నాటక (ప్రదర్శన) ప్రతులు, అప్పట్లోనే దాదాపు లక్షా పాతికవేలు అమ్ముడయ్యాయి. మొదటి నుంచీ రేచీకటి బారినపడినా, ఆ తరవాత చూపునే కోల్పోయినా, ఆ ప్రజ్ఞాశాలి ఇతరులకు చెప్పి రాయించిన విభిన్న సాహితీ ప్రక్రియల గ్రంథాలు- వందకు పైమాటే! ఆధునిక భావాల వికాస కర్తగా, తొలి తరం సంఘసంస్కర్తగా, తన పుస్తకాల వల్ల లభించిన ధనంతో ఆ కాలంలోనే దళిత బాలలకు ప్రత్యేక పాఠశాల స్థాపించారు. విద్యావేత్తగా నాటి ఆంగ్లేయ పాలన తీరుతెన్నులపై కలంతో కదనం సాగించిన పాత్రికేయుడిగా చిలకమర్తిది అజరామర కీర్తి!

|| సంస్కరణాభిలాషి ||

పద్యం, గద్యం, నాటకం, నవల, ప్రహసనం, అనువాదం- అన్నింట్లోనూ ఆయన మేటి. ఒకే సంవత్సరంలో (1889) ఆయనవి ఆరు నాటక రచనలు వెలువడ్డాయి. హాస్య నవలల్లో ‘గణపతి’, ఆకాశవాణి ద్వారా శ్రవ్య రూపం సంతరించుకొని దశాబ్దాల తరబడి నవ్వుల పువ్వులు పూయించింది. ఆయన రచనల్లో అనేకం విద్యార్థులకు పాఠ్యాంశాలుగా మారాయి. నాడు ఓ పత్రిక నిర్వహించిన నవలల పోటీల్లో, వరసగా నాలుగేళ్లూ ఆయన గ్రంథాలే ప్రథమ బహుమతులు సాధించాయి. హరిశ్చంద్ర, పోతన అనే రెండు రచనలు అసంపూర్తిగానే మిగిలాయి. పలు పురాణ గాథలకు కావ్యరూపమిచ్చినా, సమకాలీన సమాజంలోని అనేక లోటుపాట్లను తూర్పారబట్టినా- సంస్కరణ కోణాన్ని ఏనాడూ మరవలేదు. తుదిదశ వరకు ఆయన తన రచనా వ్యాసంగాన్ని వీడలేదు. ‘కందుకూరి వీరేశలింగం కంటే వచనం సులభంగా రాయగలవారు ఇంకెవరైనా ఉన్నారా?’ అని ప్రశ్నించిన చిలకమర్తి, ఆయననే ఆదర్శంగా తీసుకున్నారు. ‘తన దేహము తన గేహము/ తన కాలము తన ధనమ్ము తన విద్య/ జగజ్జనులకు వినియోగించిన ఘనుడి’గా కందుకూరిని కొనియాడారు. అదే ఘనత చిలకమర్తికీ వర్తిస్తుంది. ధారణశక్తిలోనూ ఆయనకు తిరుగు లేదు. చదివించుకొన్న తెలుగు, సంస్కృత గ్రంథాలన్నింటినీ అక్షరం పొల్లుపోకుండా గుర్తుపెట్టుకునేవారు. దేశమాత, సరస్వతి వంటి పత్రికల నిర్వహణలో తనదైన బాణీ కనబరచి అసంఖ్యాకుల్ని ఆకట్టుకొన్నారు. ఏ పని చేపట్టినా స్వాభిమానం వదులుకోలేదు. ఆంగ్లేయులకు ప్రతికూల రాతలు కూడదన్న ఆంక్ష ఎదురుకావడంతో, ఒక దశలో ఓ పత్రిక నిర్వహణకే స్వస్తి చెప్పారాయన. రచనల్లో ఆయన చేసిన ప్రయోగాలు, సంధించిన చమత్కార బాణాలు అన్నీ ఇన్నీ కావు.
‘భరతఖండంబు చక్కని పాడి యావు...’ పద్యంలో చిలకమర్తివారి జాతీయ భావజాలం పెల్లుబుకుతుంది. ‘హిందువులు లేగదూడల్లా ఏడుస్తుంటే, వాటి మూతులు బిగకట్టి గడసరి తెల్లవారు పితుకుతున్నా’రన్నది నాడు ఆంగ్లప్రభుతకు కోప కారణమైంది. ఆ ‘తెల్లవారు’ను తెల్లవారుజామున అని అర్థంవచ్చే రీతిలో వాదించి ఉపశమింపజేసినవారు ఉండటం మరో ఆసక్తికర విశేషం. విద్యారంగంలో దళిత జన సముద్ధరణకు చిలకమర్తి చేసిన సేవల్ని అప్పటి మద్రాస్‌ ప్రభుత్వ ప్రతినిధి (గవర్నర్‌) లార్డ్‌ పేంట్‌లాండ్‌ ప్రశంసించారు. రచనా రంగంలో ‘షేక్‌స్పియర్‌’గా బ్రహ్మసమాజం సంస్థ నిర్వాహకులు పండిత శివానందశాస్త్రి అభివర్ణించారు. అవి ఆయన కీర్తికిరీటంలో కలికితురాళ్లు. పాతికేళ్ల ప్రాయంలోనే తిరుపతి వేంకట కవుల ఎదుట అవధాన విద్యలో చిలకమర్తి అనుపమాన ప్రతిభ ప్రదర్శించారు. ప్రహసనాల రూపేణా నాటి సమాజంలోని అంధవిశ్వాసాల మీద నిరంతర సమరభేరి మోగించారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని రేకెత్తిస్తూ, 1895లో 28 ఏళ్ల వయసులో వేదిక నుంచి ఆయన చేసిన పద్యపఠనం ప్రజల్ని ఉర్రూతలూగించింది. జాతీయ నాయకుల పర్యటనల్లో వారి ఆంగ్ల ప్రసంగాలను ప్రవాహవేగంతో అనువదించేవారు. ఆయన సామాజిక సేవా తత్పరత హితకారిణి సమాజం వంటి సంస్థలతో మరింత విస్తృతమైంది. జాతి పురోభివృద్ధికి మూలాధారం బాలికా విద్య అని, దాన్ని విస్మరిస్తే మనుగడ అసలే ఉండదని ఆయన ఆనాడే తేల్చిచెప్పారు. విద్యావంతులైనకొద్దీ మగపిల్లల్లో ధనాశ ఒక రోగంలా వ్యాపించి, కట్నాల రూపంలో ఆడపిల్లల్ని పట్టిపీడిస్తోందని నిరసించారు. ‘పెళ్లి పేరిట తండ్రి తన కూతుర్ని ఏ మూర్ఖుడికో డబ్బుకు అమ్ముకోవడం పాడు పని. పిల్లవాడికి కట్నం తీసుకోవడం అంతకంటే మించిన నీచపు పని’ అని ఆయన ఈసడించారు. సంఘ సంస్కరణలో భాగంగా, వితంతు వివాహాల్ని ప్రోత్సహించిన వీరేశలింగం, రాజ్యలక్ష్మమ్మ దంపతుల్ని ‘హిమాలయ సమాన ధీరోదాత్తులు’గా వర్ణించారు చిలకమర్తి. నిమ్నజాతుల సముద్ధరణ తన జీవిత ప్రధాన ఆశయమన్న ఆయన, ఆచరణలోనూ ప్రథమ స్థానంలో ఉండేవారు. పేదపిల్లలకు చదువు చెప్పేందుకు ధనాన్ని, సమయాన్ని పూర్తిగా వినియోగించిన ఉదాత్తత ఆయనది.

|| నైతిక విలువలకు పట్టం ||

కవులకు అక్షర లక్షలిచ్చే కాలం ఏనాడో గతించింది. ఏ పకోడీలో చేతిలో పెట్టే కాలం వచ్చిందన్న చిలకమర్తి, ఆ పకోడీల గురించే ఇలా చమత్కరించారు. ‘ఆ కమ్మదనము ఆ రుచి/ ఆ కరకర ఆ ఘుమఘుమ ఆ పొంకము ఆ/ రాకలు పోకలు వడుపులు/ నీకే దగు నెందు లేవు నిజము పకోడీ!’... మరో సందర్భంలో తన గురించి తానే రాసుకుంటూ- చిన్నప్పటి నుంచీ గణితంలో తాను అంతంతమాత్రమే అన్నారాయన. కానీ, ఆయనది అగణిత ప్రతిభ. మొత్తం 19 కథలతో కూడిన ఆయన సంకలనం ‘భారత కథామంజరి’ నైతిక విలువల సమాహారం. ‘నవ్వుల గని’ని వెలికితీసినా, ‘హాస్య లతలు’ అల్లుకొనేలా చేసినా, ఆ విలక్షణత ఆయనకే చెల్లింది. జీవితాంతమూ అక్షరసేవలో తరించిన లక్ష్మీనరసింహం తెలుగుజాతికి ప్రాతఃస్మరణీయులు! - సుధామాధురి ( ఈనాడు )

Saturday, 24 September 2016

|| జాషువా హేతువాద దృక్పథం ||


               సంప్రదాయ ఛందస్సులో ప్రగతిశీలక భావాలు చెప్పిన కవి జాషువా. మన వర్ణ వ్యవస్థ దళితుల్ని కనీసం మనుషులుగా కూడా గుర్తించలేదు. వర్ణవ్యవస్థకు బలమైన పునాది హిందూమత సంప్రదాయంలో ఉంది. హిందూమతంలోని మూఢాచారాలు అహేతుకమని ప్రశ్నించాడు జాషువా. ఈ దేశంలో దళితుని జీవితాన్ని మార్చలేనప్పుడూ; సృష్టిలో ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ అనే భావన కలిగించింది దేవుడే అయినప్పుడూ; అలాంటి దేవుడు మాకు అక్కరలేదు- అని హేతవాద దృష్టితో, దుష్టశిక్ష్షణ, శిష్టరక్షణార్థం అవతరిస్తానన్న దేవుడ్ని- 'నువ్వు ముందు పుట్టి చేసింది లేదు. ఇక పుడితే నెత్తికెత్తేది లేదు' అని గట్టిగా నిలశాడు జాషువా.
'కనుబడలేదు దైవతముగాని పదార్థములు భారతంబునన్‌
గనుపడలేదు వర్ణమున కన్న మహాకళ భారతంబునన్‌
కనుబడలేదు సత్కులము కన్న పిశాచము భారతంబునన్‌
గనుపడలేదు పంచమునికన్న నీచవు 'జంతు వేదియున్‌.' అని అన్నారు.
జాషువా గబ్బిలంలో హేతవాద దృష్టి ఉంది. తెలుగు సాహిత్యంలో వేమన, సామినేని ముద్దు నరసింహం, కందుకూరి, గురజాడ, త్రిపురనేని రామస్వామి చౌదరి, జాషువా లాంటివారు హేతువాద భావాల వ్యాప్తికి దోహదం చేశారు.
దళితుల కష్టంతో దైవానికి నైవేద్యం పెట్టి, ఆ కష్టజీవులనే అంటరానివారిగా చూసే సంఘాన్ని జాషువా ప్రశ్నిస్తాడు. 
'వాని నైవేద్యమున నంటుపడిననాడు
మూడు మూర్తులకును గూడ గూడులేదు'
దళితుల్ని దారిద్య్రానికి గురి చేయడమే గాక, వారిని అసహ్యించుకోడానికి కారణమైన హిందూమతాన్ని తీవ్రంగా నిరసిస్తాడు.
'ఆ యభాగ్యుని రక్తంబునా హరించి
యినుప గజ్జెలతల్లి జీవనము సేయు
గసరి బుసకొట్టు నాతని గాలిసోక
నాల్గుపడగల హైందవ నాగరాజు'
దళితుల శ్రమదోపిడికి గురికావడాన్ని కర్మ సిద్ధాంతంతో ముడిపెట్టడం తగదంటాడు. 
'కర్మ సిద్ధాంతమున నోరుకట్టివేసి
స్వార్థలోలురు నాభుక్తి ననుభవింత్రు'
బతికి ఉన్నప్పుడు మనిషిని, మనిషిగా చూడకుండా మరణించిన తర్వాత గౌవరం ఒలకబోసే సంప్రదాయం సరికాదంటాడు. హేతువాద భావాల్ని చెప్పిన కవి వేమనను గురించి కూడా తెలియజేశారు.
ఇంతకు ముందు జన్మలెత్తి ధర్మాన్ని స్థాపించిన అవతారమూర్తి అప్పటి అధర్మ, అసమాన సమాజాన్ని ఎందుకు మార్చలేకపోయాడని సూటిగా ప్రశ్నిస్తాడు.
'ధర్మ సంస్థాపనార్థాంబు ధరణిమీద
నవతరించెననె నబ్జభవుని తండ్రి
మునుపు జన్మించి నెత్తికెత్తినది లేదు
నేడు జన్మింపకున్న మున్గినదిలేదు'
పసిపిల్లల్ని బలి ఇవ్వటం, భర్త చనిపోతే భార్యను చితిలో దగ్ధం చేయడం మొదలైన మత దురాచారాల్ని నిశితంగా విమర్శించారు. అందుకే -
'మొక్కుబళ్ళ నెపాన పసిపాప
లెందరు గంగలో నిమిడిరొక్కొ
సహగమనాచార దహన దేవతలెన్ని
చిగురు కొమ్మల బూదిచేసెనొక్కా' అని పలికారు
కరుణను కమ్మగా బోధిస్తూ జాతర పేరిట జంతుబలి చేసే మతవాదులు దుశ్చర్యల్ని అసహించుకున్నారు జాషువా. కాబట్టే
'అరవంగుత్తుకగోసి జంతువుల గర్భాగారముల్‌ జీల్చినె
త్తురుటేళ్ళన్నటియంచు మూఢతమజాతుల్‌ జాతరల్‌ సేయజూ
తురు చూపింతురు ప్రోత్సహింత్రు తతివాదుల్‌ శాస్త్ర పారంగతుల్‌
కరుణల్‌ కమ్మని బోధలోపులు గుటక్కా చీ! హుళుక్కుల్‌ గదా' అని ప్రకటించారు.
నరుల్ని అస్పృశ్యులని దూరముంచి జంతువులకు పూజలు చేస్తారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇవి వేద రహస్యాలని వీటిని నిమ్నజాతులు ప్రశ్నించరాదని చెప్పే కుటిల నీతిని బట్టబయలు చేశారు కవి ఈ కింది పద్యభాగంలో-
'నరులవ్‌ ముట్టక నందులంగొలిచి పుణ్యంబెల్ల సాధించున
ప్పరమంబైన రహస్యమున్‌ శివునితో ప్రస్తావముంజేసితే'
కరుణతో మనిషివైపు చూపి సారించని సంఘం, విగ్రహాలపై భక్తి ప్రదర్శిస్తుంది. 'మానవసేవయే మాధవ సేవ' అని బోధిస్తారు. ఆచరణలో మాత్రం మానవత్వాన్ని విడిచిపెట్టి విగ్రహారాధనతో ఊరేగుతారు. దీన్ని విమర్శించారు జాషువా. అందుకే-
'ప్రతిమల పెండ్లిసేయుటకు వందలు వేలు వ్యయించుగాని దుః
ఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలవ్‌
మెతుకు విదల్పదీ భారతమేదిని ముప్పది మూడు కోట్లదే
వతలెగవడ్డ దేశమున భాగ్యవిహీనులక్షుత్తులారునే'

''ఏనాడు మా కావ్య స్పష్టికర్తల జిహ్వ
విశ్వసత్యంబు నాలపింపగలదొ
ఏనాడు మాజాతి దృష్టి మాంద్యమువాసి
చుట్టుపక్కల దేరిచూడగలదొ
ఏనాడు మా బుర్ర జుట్టు తలలేని
పుక్కిటి కథలలో జిక్కువడవొ
ఏనాడు మా విద్య లినుప సంఘమునందు
చిలుముపట్టక ప్రకాశింపగలవొ
తనువు దాచక సామరితనముమాని
యెన్నడీ మఠంబులు చిచ్చమెత్తుకొనవొ
అట్టి శుభవేళకై కొంగుబట్టి నిలిచి
నలిగివాపోవుచున్నది నామనస్సు' అని అశాభావం వ్యక్తం చేశాడు.
కవులు విశ్వసత్యాన్ని పలకాలన్నాడు. భారత జాతి సంకుచిత దృష్టి విడిచి, విశాల దృక్పథాన్ని అలవరచుకోవాలన్నాడు. పుక్కిటి పురాణాల్ని నమ్మవద్దన్నాడు. మూడ నమ్మకాల సంప్రదాయ బంధనాలు తొలగించుకొని వికాసం చెందాలన్నాడు. సోమరితనంతో బిచ్చమెత్తుకునే నైజం పోవాలన్నాడు. జాషువా దూరదృష్టి, వైజ్ఞానిక దృష్టి, సమతా దృష్టి ఇప్పటికీ అనుసరణీయం. ఎప్పటికన్నా ఇప్పుడు మరింత అవసరం కూడా!
(ఈనెల 28న గుర్రం జాషువా జయంతి)
- ప్రొఫెసర్‌ వెలమల సిమ్మన్న

# అంబానీ, అదానీ, టాటాలకే తప్ప దళితులకు, పేదలకు భూములివ్వరా? #


-మీడియా ఇంటర్వ్యూలో జిగేశ్‌ మేవానీ

                          ''మీరు మాకో 'ఉనా'నిస్తే.... 'ఉనా' మాకో 'జిగేశ్‌'నిచ్చింది....'' ఇదీ ఇప్పుడు గుజరాత్‌ దళితుల మాట! ఔను... చరిత్రను ప్రజలే నిర్మిస్తారు, కొందరు వ్యక్తులు కాదు. కానీ ఆయా చారిత్రక సన్నివేశాల్లో వ్యక్తులు నిరాకరించ వీలులేని తమవైౖన ముద్రలు వేస్తుంటారు.ఉనాలో చనిపోయిన ఆవు చర్మం వొలుస్తున్న దళిత యువకులను పట్టుకొని వాహనానికి కట్టేసి ఈడ్చుకెళ్లి ఒంటిపై చర్మం వూడిపోయేలా కొట్టిన దారుణ సంఘటన పై దళిత్‌ శోషణ్‌ మంచ్‌, దళిత సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కలిసి ఉద్యమించాయి. 
ఉనా ఉద్యమం నుంచి వెలుగులోకి వచ్చాడు రాష్ట్రీయ దళిత్‌ అధికార్‌ మంచ్‌ నాయకుడు మెవానీ. దళితులకు ఐదెకరాల భూమి కావాలన్నది ఆయన డిమాండ్‌. ప్రజా ఉద్యమ నేతలందరూ సాధారణంగా ఎదుర్కొనే రాజ్య నిర్బంధం ఇప్పుడు ఆయననూ 'పలకరిస్తోంది'. ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు అతన్ని అరెస్టు చేసి విడుదల చేసింది. ఈ నేపథ్యంలో, ఆయన 'ద హిందూ' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ఉద్యమ విశిష్టతకు సంబంధించిన పలు పార్శ్వాలను విశ్లేషించారు. ఆ విశేషాలు...
భూమిలేని ప్రతి దళిత కుటుంబానికీ ఐదెకరాల భూమి ఇవ్వాలని మీ ఉద్యమం ప్రధానంగా డిమాండ్‌ చేస్తోంది. ఇది ఏ మేరకు వాస్తవికమైందని మీరనుకుంటున్నారు? అంత భూమి ఎక్కడి నుంచి వస్తుంది?
                 ప్రతి జిల్లాలోనూ, తాలూకాలోనూ ప్రభుత్వానికి చెందిన బంజరు భూములు చాలా వున్నాయి. వాటిని పంచవచ్చు. గుజరాత్‌ భూ సీలింగ్‌ చట్టాన్ని అమలు చేయడం ద్వారా వేలాది ఎకరాల భూములు లభ్యమవుతాయి. అట్లాగే ఎస్‌సీ/ఎస్‌టీ సబ్‌ప్లాన్‌లో ఒక నిబంధన ఉంది. భూమి లేనివారి కోసం ప్రభుత్వం భూముల్ని కొని ఇవ్వవచ్చు. టాటాలకు, అంబానీలకు, అదానీలకు, ఎస్‌ఈజెడ్‌లకు భూములు దొరుకుతాయి. దళితులకు, ఆదివాసీలకు, ఓబీసీలకు ఇచ్చేందుకు భూమి ఎందుకు దొరకదు? రాజకీయ సంకల్పం ఉంటే ఇది కచ్చితంగా సాధ్యమే.
కార్పొరేట్‌ సంస్థలకు భూములివ్వడం వల్ల ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. అందరికీ లాభం కలుగుతుంది. దళితులకు ఐదెకరాల బంజరు భూమినివ్వడం వల్ల లాభమేంటి?
         భూసంస్కరణలు ప్రథమ పంచవర్ష ప్రణాళికలో భాగం. దేశాన్ని మరింత సమసమాజంగా మార్చడం, పేదల, భూమిలేని నిరుపేదల బతుకుల్లో వెలుగురేఖలు ప్రసరింపజేయడం దాని లక్ష్యం. దేశ జనాభాలో అత్యధికులు నేటికీ బతుకుదెరువు కోసం వ్యవసాయంపైనే ఆధారపడి వున్నారు. భూసంస్కరణలపై ఆధారపడిన ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా కావాలని మేం కోరుతున్నాం. భూమిని దానిపై శ్రమించేవారికి, అంటే దున్నేవారికి భూమిని పున్ణపంపిణీ చేయడం ద్వారా ఉత్పాదకతనూ, సంపద వృద్ధినీ సాధించవచ్చు.
సెప్టెంబర్‌ 16న మీరు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు తిరిగి రాగానే మిమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు?
          నా అరెస్టు గుజరాత్‌ మోడల్‌కు, ఇక్కడ సాగే పాలనా తీరుకు మచ్చుతునక. దళితుల ఆందోళనతో గుజరాత్‌ ప్రభుత్వం ఎంతగా కలవరపడుతున్నదో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు.
మీ అంచనా ప్రకారం దళిత రాజకీయాలు నేడు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఏమిటి?
                  అది 'మనువాద్‌ ముర్దాబాద్‌' వంటి నినాదాల దగ్గరే ఎక్కడో తచ్చాడుతూ ఉండిపోయినట్టు నాకనిపిస్తుంది. దళిత రాజకీయాలు ఈ తరహా నినాదాల పరిధిని దాటి ముందుకు పోవాల్సింది. కానీ అవి అస్తిత్వవాద రాజకీయాల్లోనే కూరుకుపోయాయి. అస్తిత్వవాద రాజకీయాలనూ, భౌతిక (మెటీరియల్‌) రాజకీయాలతో మిళితం చేయడం అంటే సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక న్యాయం కోసం కూడా పోరాడడమన్న మాట. సమిష్టి అభివృద్ధికన్నా వ్యక్తిగత పురోగతికే పెద్ద పీట వేస్తారనేది దళిత రాజకీయాలపె తరచూ వస్తున్న విమర్శ. దళితులెవరైనా అధికార పీఠానికి చేరుకుంటే చాలు దళితులు తమకు ప్రాతినిధ్యం లభించిందని సంతోషపడిపోతారు. కానీ జరుగుతున్నదేమిటంటే, వ్యక్తులుగా కొందరు దళితులకు లాభం జరిగినంత మాత్రాన మొత్తంగా దళిత సముదాయానికి భౌతిక ప్రయోజనమేదీ చేకూరడం లేదు.నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. పేదల, భూమిలేని నిరుపేదలకు సంబంధించిన రాజకీయాలెప్పుడూ విడివిడి వ్యక్తుల రాజకీయాలుగా ఉండలేవు. అవి ఎవరో ఒక నేత చుట్టూ తిరిగే రాజకీయాలుగా సాగలేవు. తప్పనిసరిగా అవి సమిష్టి రాజకీయాలే అయి ఉండాలి. దళిత కార్యకర్తలు లేదా దళిత రాజకీయ నేతలెవరైనా అధికార స్థానాలకు ఎన్నికయినట్టయితే, వారు తమ స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడంపైనే ఎక్కువ ఆసక్తి చూపడం మనం చాలా ఏళ్లుగా చూస్తున్నదే. కానీ ఇప్పుడు దళితులు ప్రజా ఉద్యమాలు, సమష్టి కృషి ద్వారానే విజయం సాధించగలమనే విషయాన్ని అర్థం చేసుకునే క్రమం ఆరంభమైంది. తమ ప్రయోజనాలను తమ రాజకీయ ప్రతినిధులే ఆటోమెటిక్‌గా నెరవేరుస్తారని వారిప్పుడు ఆశించడం లేదు.
వామపక్షాల (లెఫ్ట్‌) పట్ల అనుసరించాల్సిన వైఖరి విషయంలో దళిత రాజకీయ శక్తులలో భిన్నాభిప్రాయాలున్నట్టు కనిపిస్తున్నాయి. కుల సమీకరణను వామపక్షాలు ఎల్లప్పుడూ నిర్లక్ష్యం చేశాయని అంబేద్కరైట్లలో ఒక సెక్షన్‌ బలంగా అభిప్రాయపడుతోంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి?
                వామపక్షాలు కచ్చితంగా మిత్రపక్షాలేనని నా అభిప్రాయం. అసలిది వామపక్షాలు దళితులలో చేరడం లేదా దళితులు వామపక్షాల్లో చేరడానికి సంబంధించిన విషయం కాదు. ఇది దళితులు వామపక్షంగా మారడానికి సంబంధించిన అంశం. అంటే వర్గ పోరాటాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడమని నా అభిప్రాయం. మనం వర్గరహిత సమాజాన్ని నిర్మించలేకపోయినా, కనీసం ప్రస్తుతం సమాజం కన్నా అంతరాలు తక్కువగా ఉండే సమాజాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. 'ఆవు తోకను నువ్వే ఉంచుకో, మా భూమిని మాకిచ్చెరు' అనే నినాదం ద్వారా మేం సంఫ్‌ు పరివారపు మతతత్వ, విచ్ఛిన్నకర అజెండాను తోసిపుచ్చుతున్నాం. దళిత ఉద్యమంలో భాగంగానే భౌతిక అంశాలను లేవనెత్తుతున్నాం. కావాలనుకుంటే మీరు దీన్ని వామపక్ష దృక్పథంగా పిలవొచ్చు.
నిజమే, చారిత్రకంగా చూసినప్పుడు భారతదేశంలో వామపక్షాలు పొరపాట్లు చేశాయి. అంబేద్కరైట్‌ రాజకీయాలు కూడా పెద్ద పొరపాట్లు చేశాయి. మేం వామపక్షాల పొరపాట్లనూ, లోపాలనూ విమర్శిస్తాం. అయితే వారు మా ఉద్యమంలో భాగం కావడానికి ముందుకొస్తే వారిని వద్దని ఆపబోం. ఏ రాజకీయ ఉద్యమానికైనా కనీసం ఈ మాత్రం స్పష్టత తప్పక ఉండాలి. మాకది ఉంది. వామపక్షాలు ఎంత ఎక్కువ నిలకడగా, సీరియస్‌గా దళితుల సమస్యలను లేవనెత్తితే, దళితులు వామపక్షాలను అంత ఎక్కువగా విశ్వసిస్తారు. 
మీరు చాలా సార్లు దళిత-ముస్లిం ఐక్యతకున్న ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అదంత సులువైందేమీ కాదుగా?
         ఔను. రాజకీయంగా ఇదొక క్లిష్టమైన పని అని నాకు తెలుసు. కానీ కనీసం దాన్నో ఆలోచనగానైనా సరే ముందుంచగలిగితే, తప్పనిసరిగా ఏదో మేరకు ఫలితం వస్తుంది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో దళితులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కానప్పటికీ వారు పాల్గొన్నారు. ఒక దళితుడిగా అందుకు నేను సిగ్గుతో తలవంచుకుంటున్నా. దళితుల కాషాయీకరణను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియను అడ్డుకోవాలన్నా దళిత-ముస్లిం ఐక్యత అనే రాజకీయ ప్రాజెక్టు అవసరమైందే. ఇది ముస్లింల, దళితుల ఇద్దరి ప్రయోజనాలకూ అవసరమైందే. నేనోసారి సభలో మాట్లాడుతూ, నాకు ఇద్దరు చెల్లెండ్లు ఉండి ఉంటే ఒకరిని వాల్మీకీ సముదాయంలోకి, మరొకరిని ముస్లింల ఇంటికి ఇచ్చికి పెళ్లి జరిపించాలని ఆశించేవాడినని చెప్పాను. దళితుల్లో కులాంతర, మతాంతర వివాహాలు సాధారణం కావాలి. ఇప్పుడు ఇదంతా ఊహాజనితంగా అనిపించవచ్చు కానీ ఏదో ఒక రోజున వాస్తవంగా మారుతుందని నా నమ్మకం.
దళితులు సంఫ్‌ు పరివార్‌లో చేరడాన్ని మీరెలా చూస్తారు?
క్షమించండి, అటువంటి తెలివిమాలిన పనుల గురించి నేను వివరించలేను.
మీ భవిష్యత్‌ పథకాలేమిటి?
                మేం గుజరాత్‌లోనూ, గుజరాత్‌ వెలుపల కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేక రాజకీయాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నామనేది తేటతెల్లం. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. సెప్టెంబర్‌ 27న మేం గుజరాత్‌లో ఒక పెద్ద ప్రదర్శన నిర్వహించబోతున్నాం. సంఫ్‌ు పరివార్‌, బిజెపిలకు వ్యతిరేకంగా ఒక విశాల కూటమిని ఏర్పాటు చేసేందుకు ఓబీసీలు, ఆదివాసీలు, ముస్లింలు, రైతులు, ట్రేడ్‌ యూనియనిస్టులు అందరూ ఒక వేదికపైకి రాబోతున్నారు. గుజరాత్‌ మోడల్‌ను బట్టబయలు చేసేందుకు మేం సాంస్కృతిక, భౌతిక అంశాలను లేవనెత్తుతాం. భూమిలేని దళితులకూ, ఆదివాసులందరికీ 5 ఎకరాల భూమి ఇవ్వాలనే డిమాండ్‌తో నరేంద్రమోడీ నియోజకవర్గమైన అహ్మదాబాద్‌లోని మణినగర్‌లో అక్టోబర్‌ 1న రైల్‌ రోకో నిర్వహించబోతున్నాం.

Friday, 23 September 2016

|| యుద్ధం కాదు..చర్చలపై దృష్టి పెట్టండి ||

యురీ దాడి తరువాత ఆరెస్సెస్‌, బిజెపిలు దుందుడుకువాదంతో పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయని పీపుల్స్‌ డెమొక్రసీ (పిడి) వ్యాఖ్యానించింది. 18 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న యురీ దాడి జరిగిన వెంటనే భారత్‌ దీనిపై ఎలా స్పందించాలన్న అంశం ముందుకొచ్చిందని,, ఈ ఏడాది జనవరిలో పఠాన్‌ కోట్‌లో వైమానిక స్థావరంపై దాడి జరిగినప్పుడు కూడా మోడీ ప్రభుత్వానికి ఇదేవిధమైన సమస్య ఎదురైందని పిడి తన తాజా సంపాదకీయంలో పేర్కొంది. పదవీ విరమణ చేసిన సైనికాధికారులు, తమకు తాము వ్యూహాత్మక నిపుణులమని చెప్పుకునేవారు టెలివిజన్‌ ఛానళ్ళ చర్చల్లో పాల్గొంటూ పాక్‌కు గట్టి గుణపాఠం నేర్పాలని డిమాండ్‌ చేశారు. యురీ దాడిపై స్పందించిన ఆరెస్సెస్‌, వాటి అనుబంధ సంస్థలు పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలంటూ నానా యాగీ చేస్తున్నాయి. రామ్‌ మాధవ్‌ వంటివారు పాకిస్తాన్‌ పీచమణచాలంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గత లోక్‌సభ ఎన్నికల్లో పాకిస్తాన్‌ పట్ల మన్మోహన్‌ సింగ్‌ మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నారంటూ తీవ్రంగా ధ్వజమెత్తిన విషయాన్ని పీడీ గుర్తు చేసింది. వీటన్నిటిని బట్టి చూసినప్పుడు ఈ తాజా కవ్వింపు చర్యపై మోడీ ప్రభుత్వం దుందుడుకు వైఖరి తీసుకునే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే సైనిక చర్యవల్ల ఎదురయ్యే పర్యవసానాలు, ఇబ్బందులు, పరిమితుల గురించి రాజకీయ నాయకత్వానికి కచ్చితమైన అంచనా వుండాలి అని పిడి సంపాదకీయం పేర్కొంది. రెండు అణు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తితే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా వుంటాయని పీడీ హెచ్చరించింది. వాస్తవాధీన రేఖ వెంబడి పరిమిత దాడులు చేస్తామని అంటున్నారు. పరిమిత దాడి అంటే సరిహద్దు గుండా క్షిపణి దాడులు, రాకెట్‌ దాడులని, 2014-15లో సరిహద్దుల్లో జరిగిన కాల్పులు, ఫిరంగుల దాడులో వాస్తవాధీన రేఖకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో పౌరులు చనిపోయిన విషయాన్ని పీడీ సంపాదకీయం గుర్తు చేసింది. ఒకసారి గనుక యుద్ధం మొదలైతే అది అక్కడితో ఆగదని, పెద్దయెత్తున ప్రజలు నిర్వాసితులవుతారని పీపుల్స్‌ డెమొక్రసీ వ్యాఖ్యానించింది. 2003 నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పుల విరమణ ఎన్నిసార్లు ఉల్లంఘనకు గురైనదీ, . సరిహద్దుల్లో స్థానికంగా తలెత్తిన ఘర్షణలు కాశ్మీర్‌లో చొరబాట్లు పెరగడానికి ఎలా కారణమైనదీ., దీనివల్ల కాశ్మీర్‌లో ఎన్ని సమస్యలు తలెత్తినదీ పీడి వివరించింది. పాకిస్తాన్‌ జిహాదీ ఉగ్రవాదులకు మద్దతివ్వకుండా నిలువరించేందుకు ఆ దేశంపై దౌత్య పరంగా పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని పీడీ సంపాదకీయం పేర్కొంది.
యురీలోని సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడిని అమెరికా, రష్యా ఖండించాయని, అమెరికా ఖండనలో పాకిస్తాన్‌ పేరు ఎక్కడా ప్రస్తావించలేదన్నది. పాకిస్తాన్‌ నుంచే ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారన్న భారత్‌ వాదనను రష్యా అంగీకరించిందని తెలిపింది. రష్యా భారత్‌కు అత్యంత విశ్వసనీయమైన మిత్ర దేశమని దీని ద్వారా మరోసారి రుజువైందని పీడీ పేర్కొంది. రష్యా భారత్‌కు సహజ మిత్రురాలని, ఈ నెలాఖరున పాక్‌తో కలిసి తొలిసారిగా సంయుక్త సైనిక విన్యాసాల్లో అది పాల్గొనడానికి కారణం అమెరికాతో భారత్‌ వ్యూహాత్మకంగా దోస్తీ కట్టడమేనని అది తెలిపింది. వ్యూహాత్మక సంయమనాన్ని పాటిస్తూ వాస్తవాధీన రేఖ వద్ద చొరబాట్లను అరికట్టేందుకు భద్రతను మరింత పటిష్టం చేయడంపై దృష్టి పెట్టాలని పీడీ సూచించింది. పఠాన్‌ కోట్‌ వైమానిక స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులు భారత్‌లోకి ఎలా చొరబడ్డారనే విషయమై జరిపిన విచారణలో తేలిందేమిటో ఇంతవరకు ప్రజలకు తెలియజేయలేదని పీడీ విమర్శించింది. యురీలో వద్ద వాస్తవాధీన రేఖను ఉగ్రవాదులు దాటి సైనిక శిబిరంలోకి ఎలా చొరబడ్డారనేదానిపై దర్యాప్తు జరపాల్సి ఉందని పేర్కొంది. జీహాది ఉగ్రవాదుల చొరబాట్ల వలన ఎదురువతున్న ప్రమాదాలను ఎదుర్కొంనేందుకు సమగ్ర చర్యలు తీసుకోవలసిన అవసరమున్నదని తెలిపింది.
కాశ్మీర్‌ ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో యురీ దాడి చోటుచేసుకుందన్న విషయం మరువరాదు. కాశ్మీర్‌లో నిరసనకారులపై ప్రభుత్వం విచక్షణారహితంగా పెల్లెట్లను వాడడం, అశాంతిని అణచివేసేందుకు పెద్దయెత్తున నిర్బంధాన్ని ప్రయోగించడం వంటి ఘటనలు అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్టను మసకబార్చుతున్నాయని పీడీ పేర్కొంది. అణచివేసే దిశలో అక్కడి ప్రభుత్వం వివక్షతను ప్రదర్శిస్తున్నది ప్రజాస్వామిక హక్కులు అణచివేత, ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించడాలను నివారించడంపై మోడి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోనిదే పాకిస్తాన్‌పై తెచ్చే దౌత్య పరమైన ఒత్తిడి అంతగా ఫలితానివ్వవని సంపాదకీయం తెలిపింది. ఇక ఎంతమాత్రం జాప్యం చేయకుండా అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు చేపట్టాలని పీడీ సూచించింది. కాశ్మీర్‌లో పెచ్చుమీరుతున్న అణచివేతకు యురీ ఘటన మరో సాకు కాకుండా చూడాలని అది సూచించింది.

|| విద్య వ్యాపారీకరణ - జాతీయ విద్యా విధాన ముసాయిదా-2016 ||

                 కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం జాతీయ విద్యావిధాన రూపకల్పనకు ''నూతన విద్యా విధానం-చర్చనీయాంశాలు'' పేరుతో 33 అంశాలపై ప్రశ్నావళి రూపొందించి చర్చకు పెట్టింది. దీనిలో పాఠశాల విద్యకు సంబంధించి 13 అంశాలు, ఉన్నత విద్యకు సంబంధించి 20 అంశాలున్నాయి. 2015 అక్టోబర్‌లో కేబినెట్‌ మాజీ కార్యదర్శి టిఎస్‌ఆర్‌ సుబ్రమణ్యం నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఆ కమిటీ తన నివేదికను 2016 మే 27న ప్రభుత్వానికి సమర్పిం చింది. కేంద్ర ప్రభుత్వం ఆ కమిటీ నివేదికను పూర్తిగా బహిర్గతం చేయకుండా ''జాతీయ విద్యా విధాన ముసాయిదా-2016 కొరకు కొన్ని ప్రతిపాదనలు'' పేరుతో ఒక పత్రాన్ని విడుదల చేసి ప్రజాభిప్రాయాన్ని కోరింది. ఈ ముసాయిదాలో మొత్తం ఐదు అధ్యాయాలున్నాయి. అవి 1. పీఠిక, 2. విద్యారంగం-కొన్ని ముఖ్యమైన సవాళ్ళు, 3. జాతీయ విద్యా విధానం లక్ష్యాలు, దృష్టి, ధ్యేయాలు, 4. విధాన ముసాయిదా, 5. అమలు, పర్యవేక్షణ. వీటిలో నాల్గవ అధ్యాయంలో పాఠశాల విద్య, ఉన్నత విద్యకు సంబంధించిన విధాన అంశాలను తెలిపారు.

|| ముసాయిదా విస్మరించిన జాతీయ లక్ష్యాలు ||

గతంలో విద్యారంగంలో నివేదికలు ఇచ్చిన రాధాకృష్ణన్‌ కమిషన్‌ (1948-49), మొదలియార్‌ కమిషన్‌ (1952-53), కొఠారీ కమిషన్‌ (1968), జాతీయ విద్యా విధానం 1986 విద్యారంగం సాధించవలసిన రాజ్యాంగ, జాతీయ లక్ష్యాలను స్పష్టంగా పేర్కొన్నాయి. జాతీయ సమగ్రత, ఆర్థిక-సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య విధానం, ఆర్థికాభివృద్ధి వంటివి జాతీయ లక్ష్యాలుగా ఉండేవి. రాజ్యాంగ పీఠికలో కూడా ఇవే లక్ష్యాలున్నాయి. కేశవానంద భారతి (వర్సెస్‌) స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపం కాపాడుకోవటం ముఖ్యమని చెప్పింది. మౌలిక స్వరూపంగా పై లక్ష్యాలనే వివరించింది. కానీ జాతీయ విద్యావిధానం ముసాయిదా-2016 జాతీయ లక్ష్యాల రూపకల్పనలో పూర్తిగా విఫలమైంది. విద్యారంగంలో నాణ్యత, ఉపాధి కల్పనకు నైపుణ్యాలు పెంచటమే ప్రధాన లక్ష్యాలుగా ఈ ముసాయిదా పేర్కొనటం 'మార్కెట్‌' విధానాలకు మాత్రమే అనుగుణంగా ఉన్నది. ముసాయిదాలో ఎక్కడా ఆర్థిక- సామాజిక న్యాయం, లౌకికవాదం గురించి ప్రస్తావన లేదు. అవి లేకపోగా ముసాయిదాలో అంతర్లీనంగా కేంద్రీకరణ, వాణిజ్యీకరణ, మతతత్వీకరణ ప్రమాదాలున్నాయి.

|| కేంద్రీకరణ, వాణిజ్యీకరణ, మతతత్వీకరణ ||

రాజ్యాంగం అమలులోకి వచ్చిన కాలంలో విద్య రాష్ట్ర జాబితాలో ఉండేది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినే విధంగా అనేక రంగాలలో నిర్ణయాలు చేస్తున్నది. (ప్రణాళికా సంఘం రద్దు, జిఎస్‌టి చట్టం వంటివి దానిలో భాగమే). విద్యారంగ ముసాయిదాలో కూడా విద్యా రంగ కేంద్రీకరణకు దారి తీసే అనేక ప్రతిపాదనలున్నాయి. పరీక్ష విధానానికి సంబంధించిన సంస్కరణలు, 'నీట్‌' వంటి జాతీయ స్థాయి పరీక్షలు, ఇండియన్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌ పేరుతో ఒక అఖిల భారత సర్వీస్‌ను ఏర్పరచాలని ప్రతిపాదించటం, ఎడ్యుకేషన్‌ కమిషన్‌ నియమించాలనే ప్రతిపాదన మొదలైనవన్నీ కేంద్రీకరణలో అంశాలే. విద్యపై రాష్ట్రాలకు ప్రాధాన్యత ఉన్నప్పుడే 'భిన్నత్వంలో ఏకత్వం' పరిరక్షించబడుతుంది.

|| జాతీయ విద్యా హక్కు చట్టం అమలు-నిధులు ||

విద్యారంగానికి ప్రస్తుతం స్థూల జాతీయోత్పత్తిలో 3 శాతం నిధులు ఖర్చు చేస్తున్నారు. జిడిపిలో కనీసం 6 శాతం కేటాయించాలని కొఠారీ కమిషన్‌తో సహా అన్ని కమిషన్లూ ప్రతిపాదించాయి. 2016 ముసాయిదా 6 శాతం కేటాయించటం ప్రాధాన్యతగా ఉండాలని సూచించినప్పటికీ విద్య పట్ల కార్పొరేట్‌ సంస్థలకు బాధ్యత ఉండాలని, ప్రభుత్వ విద్యా సంస్థలు ఇతర మార్గాల ద్వారా నిధులు సమీకరించు కోవాలని చెప్పటం ఆ ప్రాధాన్యతను నీరుగార్చింది. ప్రభుత్వం కచ్చితంగా 6 శాతం నిధులు కేటాయించాలని చెప్పవలసిన అవసరం ఉన్నది. అనేక సామాజిక ఉద్యమాల ఫలితంగా 86వ రాజ్యాంగ సవరణ చేసి ప్రాథమిక విద్యను 21-ఎ నిబంధనలో చేర్చారు. సుప్రీంకోర్టు ఉన్నికృష్ణన్‌ (వర్సెస్‌) స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులో ప్రాథమిక విద్యను జీవించే హక్కులో భాగంగా గుర్తించింది. ఫలితంగా చేసిన జాతీయ విద్యాహక్కు చట్టం 2010 ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఆరేళ్ళు గడిచినా ఈ చట్టం అమలు చేయటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. సార్వత్రిక ప్రాథమిక విద్య సుదూరంగానే ఉన్నది. ఈ ముసాయిదాలో ఈ చట్టాన్ని సమీక్షించటంగాని, సమర్థవంతంగా అమలు చేయటానికి సూచనలుగాని, ప్రతిపాదనలుగాని లేవు. ప్రాయోజిత పథకాలైన సర్వశిక్షాఅభియాన్‌, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌(ఆర్‌ఎంఎస్‌ఎ)ల గురించి ముసాయిదాలో ఎటువంటి ప్రస్తావనాలేదు. వీటి పని తీరుపై ముసాయిదాలో చేర్చవలసిన అవసరమున్నది.

|| పాఠశాల విద్య-డిటెన్షన్‌ విధానం ||

పాఠశాల విద్యలో అభ్యసన ఫలితాలు సంతృప్తికరంగా లేకపోవటం తీవ్రమైన అంశంగా ముసాయిదా పరిగణిం చింది. చదవటం, రాయటం, గణితం నేర్చుకోవటం వంటి వాటిలో పిల్లలు వెనుకబడి ఉన్నారని అనేక నివేదికలు, సర్వేలు తెలియజేస్తున్నాయని ముసాయిదా చెప్పింది. దీనికి ఒక పరిష్కార మార్గంగా ఈ ముసాయిదా ప్రస్తుతం కొనసాగుతున్న నాన్‌-డిటెన్షన్‌ విధానాన్ని ఐదవ తరగతి వరకే పరిమితం చేసి, ఆరవ తరగతి నుంచి డిటెన్షన్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. ఇప్పటికే డ్రాపౌ ట్స్‌ రేటు ఎక్కువగా ఉన్న భారతదేశంలో హైస్కూల్‌ స్థాయిలో డిటెన్షన్‌ విధానం ప్రవేశపెడితే గ్రామీణ విద్యా ర్థులు, బాలికలు, షెడ్యూల్డ్‌ కులాలు/తెగల పిల్లలలో డ్రాపౌట్స్‌ రేటు ఇంకా పెరిగే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్‌లో 2013-14 పాఠశాల విద్యాశాఖ గణాంకాల ప్రకారం 10వ తరగతికి వచ్చేనాటికి డ్రాపౌట్స్‌ 27 శాతం ఉన్నారు. దళిత విద్యార్థుల్లో 34 శాతం, గిరిజన విద్యార్థుల్లో 60 శాతం, కర్నూలు జిల్లాలో 45 శాతం, ప్రకాశంలో 37 శాతం, కడపలో 36 శాతం ఉన్నది. డిటెన్షన్‌ ప్రతిపాదనను ఉపసంహరించు కోవాలి.

|| పూర్వ ప్రాథమిక విద్య-ప్రతిపాదనలు ||

మారిన ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో పూర్వ ప్రాథమిక విద్య ప్రాధాన్యత సంతరించుకున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యపై శ్రద్ధ వహించలేదు. ప్రస్తుతం మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లలకు ఆహారాన్ని, కొంత మేరకు పూర్వ ప్రాథ మిక విద్యను అందిస్తున్నారు. ఈ ముసాయిదా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారానే పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసి అందించాలని ప్రతిపాదించింది. కానీ ఆచరణలో ఇది సాధ్యం కాదు. పౌష్టికాహారాన్ని అందించే బాధ్యతను అంగన్‌వాడీలకు కొనసాగిస్తూనే, పూర్వ ప్రాథమిక విద్యను అందించే బాధ్య తను పాఠశాల విద్యాశాఖకు అప్పగించినప్పుడు మాత్రమే విజయవంతమౌతుంది.

|| పాఠశాలలు-ఉపాధ్యాయులు-పరీక్షలు-కంప్యూటర్‌ విద్య ||

ఎ) ప్రతి రాష్ట్రంలో విద్యార్థుల నమోదు తక్కువగా ఉన్న, మౌలిక వసతులు లేని పాఠశాలలను గుర్తించి, వాటిని విలీనం చేయాలని ముసాయిదా ప్రతిపాదించింది. విద్యా హక్కు చట్టంలోని నిబంధనలను బలహీన పరచకుండా పాఠశాలల విలీనం జరగటానికి రాష్ట్రాలతో సంప్రదించి నిబంధనలు రూపొందించాలని పేర్కొన్నది. పాఠశాలల పని విధానం, పర్యవేక్షణ, మౌలిక వసతులు, మీడియం వంటి సమస్యలు పరిష్కరించకుండా విలీనం ఒక్కటే సరిపోదని ఆంధ్రప్రదేశ్‌ అనుభవం నిరూపిస్తున్నది. ఈ నేపథ్యంలో విలీనానికి సంబంధించిన నిర్దిష్టమైన ప్రతిపాదనలు ఉండాలి. బి) మన పాఠ్య ప్రణాళికలు, విద్యార్థుల అభ్యసన ఫలితాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తోడ్పడేవిగా ఉండాలని, సామాన్యశాస్త్రం, గణితం, ఇంగ్లీషు సబ్జెక్టులకు జాతీయ స్థాయిలో ఒకే పాఠ్య ప్రణాళిక ఉండాలని ముసా యిదా ప్రతిపాదించింది. ఇది దేశంలోని వివిధ రాష్ట్రాలకున్న భిన్నత్వాన్ని దెబ్బతీయటమే. 10వ తరగతి పరీక్షా ఫలితాలు తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం గణితం, సైన్స్‌, ఇంగ్లీషు సబ్జెక్టులలో ఎక్కువ మంది వైఫల్యం చెండటమేనని ముసాయిదా భావించింది. ఉత్తీర్ణతా శాతం పెంచటానికి విద్యార్థులను రెండు స్థాయిలుగా విభజించి, పార్ట్‌-ఎ స్థాయిలో సైన్స్‌, గణితం, ఇంగ్లీషు కోర్సులు కోరుకునే విద్యార్థులు, పార్ట్‌-బి స్థాయిలో అవి కోరుకోని మిగిలిన విద్యార్థులుగా విభజించాలని చెప్పింది. ఈ విభజన విద్యార్థులను మొదటి తరగతి పౌరులు, రెండవ తరగతి పౌరులుగా వర్గీకరించే ప్రమాదమున్నది. ఇది సరైంది కాదు. సి) విద్యార్థులు లాభదాయకమైన ఉపాధి అవకాశాలు పొందటానికి వీలుగా పాఠశాల స్థాయిలోనే నైపుణ్యాలను పెంచే పథకాలను చేపట్టాలని ప్రతిపాదించారు. ముసా యిదా ప్రధానంగా నైపుణ్యాల గురించే ప్రస్తావన చేసింది. విజ్ఞానం లేని నైపుణ్యం పౌరులను కాకుండా, ''మార్కెట్‌ అవసరాలకు'' అనుగుణమైన మనుషులను మాత్రమే తయారు చేస్తుంది. ముసాయిదాలో కమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ గురించి అనేక ప్రతిపాదనలు చేశారు. విద్యారంగానికి, విద్యార్థులకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించాలో అనేక సూచనలు చేశారు. అన్ని పాఠశాలలకు, తరగతులకు కంప్యూటర్‌ విద్య ఒక సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టి శాశ్వత ప్రాతిపదికపై ఉపాధ్యాయులను నియ మించాలి. డి) ఉపాధ్యాయుల ఎంపికకు ఉపాధ్యాయ నియామక కమిషన్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఉపాధ్యాయులలో గైర్హాజరు, జవాబుదారీతనం గురించి కొన్ని అంశాలు సూచించింది. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలకు ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనివల్ల స్థానిక నాయకుల జోక్యం పెరిగి అనేక సమస్యలకు దారితీసే అవకాశముంది. అందువల్ల దీన్ని ఉపసంహరించు కోవాలి. హైస్కూళ్ళలో గైర్హాజరును బయోమెట్రిక్‌ వంటి సాధనాల ద్వారా అరికట్టాలని ప్రతిపాదించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని నిర్దిష్ట కాల వ్యవధులలో అంచనా వేసి, వాటి ఆధారంగానే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ముసాయిదా చెప్పింది. ప్రతి ఐదేళ్ళకొకసారి విషయ పరిజ్ఞానం, బోధనా నైపుణ్యాలపై ఉపాధ్యాయులు పరీక్షకు హాజరై ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది. దీన్ని అమలు చేయటంలో కూడా అనేక సమస్య లు తలెత్తవచ్చు. పై అంశాలన్నీ పరిశీలిస్తే జాతీయ విద్యా విధాన ముసాయిదా-2016 జాతీయ లక్ష్యాలు, ఆశయాలు కొరవడి, ఇంకా ఎక్కువగా విద్యారంగ వ్యాపారీకర ణకు దోహదపడే అవకాశం కనబడుతున్నది. మేధావులు, విద్యా వేత్తలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రజలు ముసాయిదా అంశాలను అధ్యయనం చేసి తమ సూచనలను, సలహాలను కేంద్ర మానవ వనరుల శాఖ వెబ్‌సైట్‌కు పంపవచ్చు. కేంద్రీ కరణ, వ్యాపారీకరణ, మతతత్వీకరణ విధానాలను నిరసిద్దాం.   - కెయస్‌ లక్ష్మణరావు 

Thursday, 22 September 2016

# అలీనోద్యమ సమావేశం కన్నా పుట్టినరోజే మిన్నా! #




              ఐక్యరాజ్యసమితి తరువాత ప్రపంచంలో అతి పెద్ద వేదికైన అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాలేదు. సెప్టెంబరు 13-18 మధ్య ఈ సమావేశం జరిగిన సమయంలో ఆయన ఆడంబరంగా తన పుట్టిన రోజు పండుగ చేసుకున్నారు. ఆయన స్వరాష్ట్రమైన గుజరాత్‌ పండుగ వన్నె, ఆడంబరం విషయంలో ప్రపంచానికే వెలుగు జిలుగులు నింపటానికి ఏ కొరతా లేకుండా చూసుకుంది. ప్రపంచంలోనే ఎవ్వరూ చేయనంత పెద్ద పుట్టిన రోజు కేకు కట్‌ చేసి గిన్నిస్‌ బుక్‌లో పేరు నమోదు చేయించుకునే ఏర్పాటు కూడా చేయటం జరిగింది. కానీ మోడీ పొరపాటున కూడా అలీనోద్యమ సమావేశం గురించి ఉచ్ఛరించలేదు. ప్రపంచంలో 120 దేశాలు సభ్యులుగా ఉన్న, భారత్‌ ప్రధాన వ్యవస్థాపక సభ్యుల్లో ఒకటిగా ఉన్న అలీనోద్యమ వేదిక 17వ శిఖరాగ్ర సమావేశంలో భారత దేశ ప్రధాని లేరు. అవకాశం దొరికితే చాలు విదేశాలకు పరుగులు తీసే, ఒక్కొక్క దేశాన్ని రెండు, మూడు సార్లు సందర్శించటానికి కూడా ఇబ్బంది లేని, విదేశాల సందర్శనంలో ఇప్పటికే ఇంతకు ముందున్న ప్రధానులందరినీ వెనక్కి నెట్టేసిన, స్వదేశం కన్నా విదేశాల్లోనే ఎక్కువ ఉత్సాహంగా, ఉల్లాసంగా కనబడే మోడీగారు అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాకుండా ప్రపంచానికి ఏమి సందేశం పంపారు?
దేశం లోపల, బయట మోడీగారికి అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశానికి హజరు కాలేనంత ప్రత్యేకమైన కీలకమైన ఏ కార్యక్రమం లేదు. ఆయన ఎందుకు వెళ్ళ లేదో ప్రభుత్వం తరపున కారణమేమీ చెప్పటం జరగలేదు. అలాగే వెళ్ళాలని అనిపించలేదు అనేలాంటి విషయం కాదిది. 1951లో ఏర్పడిన తరువాత మొత్తం 16 శిఖరాగ్ర సమావేశాల్లో ఒకటి తప్ప అన్నింటిలో భారత ప్రధానులు హాజరయ్యారు. హాజరు కావటమే కాదు, ఏకంగా నాయకత్వమే వహించారు. ఈ సారి వెనిజులాలో జరిగిన 17వ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రతినిధి హాజరయినా ప్రధాని లేరు. సహజంగానే భారత్‌ పేరుప్రతిష్టల ప్రస్తావన అక్కడ రాలేదు.
భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నాయకత్వంలో ఏర్పడిన దగ్గర నుంచి అలీనోద్యమానికి భారత్‌ నాయకత్వ స్థానంలో ఉంది. తను పోషించిన పాత్ర ఆధారంగానే 120 దేశాల వేదికలో ముందు పీఠికి రాగలిగింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు, ఫాసిజం పరాజయం తరువాత ప్రపంచమంతటా స్వాతంత్య్ర పోరాటాలు ఊపందుకుని వలస పాలన, దోపిడీని ఛిన్నాభిన్నం చేసి ఒకటి తరువాత ఒకటి దేశాలు స్వాతంత్య్రం పొందుతున్న తరుణంలో జన్మించింది అలీనోద్యమం. అమెరికా సామ్రాజ్యవాదం, సోవియట్‌ సోషలిజం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న సమయంలో అప్పుడే స్వాతంత్య్రం పొందుతున్న దేశాలకు వేరే వేదిక ఏర్పాటు చేసుకోవటమే ఈ అలీనోద్యమం అసలు ఉద్దేశం. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాకు చెందిన ఈ దేశాలే ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యాయి. వాస్తవానికి ఈ దేశాలతోనే తృతీయ ప్రపంచం ఆవిర్భవించింది. అలీనోద్యమం అన్నిటి కంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన అంశాలు జాతీయ స్వాతంత్య్రం, సార్వభౌమత్వ పరిరక్షణ, ఎటువంటి సామ్రాజ్యవాద కూటమికైనా వెలుపల ఉండటం, విదేశాల్లో సైనిక స్థావరాలు నిర్మించటాన్ని నిషేధించటం, ప్రజల స్వపరిపాలన హక్కును ప్రతిష్టింపజేయటం, ప్రపంచ శాంతి లక్ష్యంతో నిరాయుధీకరణ.
ఈ లక్ష్యాలు, ఉద్దేశాలను ముందుంచుకునే అలీనోద్యమంలో భారత్‌ నాయకత్వం ప్రతిష్టించబడింది. తృతీయ ప్రపంచ దేశాల్లో భారత్‌ గౌరవమర్యాదలు పెరిగాయి. సోవియట్‌ కూలిపోవటం, నయా ఉదారవాద ఆర్థిక విధానాలు మొదలైన తరువాత అలీనోద్యమం విషయంలో భారత్‌ ఉత్సాహం కొంత తగ్గినా మూల వైఖరిలో పెద్దగా మార్పు లేదు. మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్నీ వేగంగా మారటం మొదలైంది. హిందూత్వవాద బిజెపి నాయకత్వంలో ఉన్న మోడీ ప్రభుత్వం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం కాదు. సామ్రాజ్యవాదానికి దగ్గరగా ఉన్న మిత్రశక్తిగా ఎదగాలనే తహతహలాడుతున్నది. అందుకే అలీనోద్యమం నుంచి దూరం పెంచటం జరుగుతోంది. విదేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపై మోడీకి అభ్యంతరం లేదు. వీలైతే తను కూడా ఒకటీఅరా స్థావరాలు ఏర్పర్చుకోవాలనే ఆశ ఉన్నవారే. నిరాయుధీకరణకు బదులు ఆయుధ పోటీ సల్పటానికి, పెద్ద సైనిక శక్తిగా ఎదగటానికి కంకణం కట్టుకున్నారు. అంటే సామ్రాజ్యవాద అమెరికా చేయి పట్టుకుని అమెరికా ప్రయోజనాల్లోనే భారత ప్రయోజనాలను విలీనం చేయాలనుకుంటు న్నారు. ఇలాంటి పరిస్థితిలో అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశానికి హాజరయితే అమెరికా కరుణా కటాక్షానికి అంతరాయం ఏర్పడవచ్చు. అది కూడా వెనిజులాలో జరగడం కూడా ఒక కారణం. అమెరికా ఆ దేశపు వామపక్ష భావాలున్న ప్రభుత్వాన్ని కూలదోయటానికి అన్ని రకాల కుట్రలు పన్నుతున్నది. అందుకు 120 దేశాలు, వాటి ప్రజల హక్కుల పరిరక్షణ పోరాటంలో పాలుపంచుకునే కన్నా అమెరికా దృష్టిలో మంచిగా ఉండటమే మేలు. ఇదే మోడీ ప్రభుత్వ కవి హృదయం.     - వేదుల రామకృష్ణ

|| నీ శత్రువును గుర్తించు ||



                 కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉండటం, లోక్‌ సభలో దానికి స్పష్టమైన మెజా రిటీ రావటంవల్ల వామపక్ష, ఉదారవాద మేధావులలో అధికా రంలో ఉన్న ప్రభుత్వ స్వభావాన్ని గురించి ఒక చర్చ మొదలవ్వటానికి దారితీసింది. మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండటం దేశంలో మితవాద రాజకీయాల దూకుడును ప్రతిబింబి స్తున్నది. మితవాద నయా ఉదారవాద ఆర్థిక విధానాలు, హిందూత్వ ఎజెండాను దౌర్జన్యపూరితంగా ముందుకు తేవటం- ఈ రెండింటి కలయిక ఈ దూకుడులో భాగంగా ఉన్నాయి. ఈ దూకుడును ప్రతిఘటించటం ఎలా అనేది వామపక్ష, ప్రజా స్వామ్య, లౌకిక శక్తులకు నేటి భారతదేశంలో ప్రధాన సమస్యగా ఉన్నది. ప్రస్తుతం దేశంలోని పరిస్థితి ఫాసిజం ఆవిర్భవిస్తున్న స్థితిని తలపిస్తున్నదని వామపక్ష, ఉదారవాద మేధావులలోని ఒక ముఖ్యమైన భాగం భావిస్తున్నది. ఈ ఆలోచనా స్రవంతిలో ప్రభావశీలమైన విభాగం వర్తమాన స్థితిని 'మతతత్వ ఫాసిజం' అనీ, ఇది ఫాసిజానికి భారతీయ రూపాంతరం అని నిర్వచిస్తున్నారు.
భారతదేశం ఎటువంటి మితవాద ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది? పాలపక్షం గురించి, అది ప్రాతినిధ్యం వహించే ఉద్యమం గురించి మనకు సరియైన అవగాహన ఉండాలి. ఎందుకంటే బిజెపిపైనా, మోడీ ప్రభుత్వంపైనా పోరాటం చెయ్యటానికి ఉద్దేశింపబడిన వ్యూహం మీదా, దానిని అనుసరించి చేపట్టే ఎన్నికల ఎత్తుగడల మీదా దాని ప్రభావం ప్రత్యక్షంగా ఉంటుంది. బిజెపి స్వభావాన్ని నిర్వచించటంలో స్పష్టత ఉండాలి. అది ఒక సాదాసీదా బూర్జువా పార్టీ కాదు. ఆర్‌ఎస్‌ఎస్‌తో బిజెపికిగల సహజమైన సంబంధంలో దాని ప్రత్యేకత దాగి ఉన్నది. ఆర్థిక, సామాజిక ఎజెండాను బట్టి చూస్తే బిజెపి ఒక మితవాద పార్టీ. దానిని మితవాద మెజారిటీ మతతత్వ పార్టీగా భావించవచ్చు. అంతేకాకుండా దానికి అర్ధ ఫాసిస్టు భావజాలమున్న ఆర్‌ఎస్‌ ఎస్‌తో ఉన్న సంబంధాల రీత్యా అది అవసరమైన పరిస్థి తులలో నిరంకుశ రాజ్య పాలనను ప్రజలపై రుద్దగలదు.
20వ శతాబ్దంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో ఆవిర్భవించిన ఫాసిజం ఒక భావజాలం. అదొక రాజకీయ పాలనా రూపం. పెట్టుబడిదారీ వ్యవస్థ లోతైన సంక్షోభంలో కూరుకుపోయి ఉండగా, అదే కాలంలో కార్మికవర్గ విప్లవ ప్రమాదం కూడా ముంచుకొస్తున్న స్థితిలో దిక్కుతోచని జర్మన్‌ పాలకవర్గాలు బూర్జువా ప్రజాస్వామ్యాన్ని రద్దుచేసి ఒక వికృత పాలనా రూపాన్ని ఎంచుకున్నాయి. ముస్సోలినీ పాలనలో ఇటలీ, ఆనాటి జపాన్‌లు కూడా ఫాసిస్టు ప్రభుత్వాలే. ఫాసిజానికున్న సంప్రదాయ నిర్వచనం సందిగ్ధానికి తావివ్వదు. 'ద్రవ్య పెట్టుబడికి చెందిన అత్యంత ప్రగతి నిరోధక, అత్యంత జాతి దురహంకార, పచ్చి సామ్రాజ్యవాద శక్తులతో కూడిన బహిరంగ టెర్రరిస్టు నియంతృత్వ రూపమే ఫాసిజం'. భారతదేశంలో ఫాసిజం ఆవిర్భవించలేదు. ఫాసిస్టు ప్రభుత్వం అధికారంలోకి రావటానికి కావలసిన రాజకీయ, ఆర్థిక, వర్గ సంబంధిత పరిస్థితులు భారతదేశంలో లేవు. పెట్టుబడిదారీ వ్యవస్థ కూలిపోవటానికి దారితీసే ప్రమాదాన్ని జనింపజేసే సంక్షోభం దేశంలో లేదు. భారతదేశంలోని పాలకవర్గాల వర్గ పాలన ఎటువంటి ప్రమాదాన్నీ ఎదుర్కోవటం లేదు. బూర్జువా పార్లమెంటరీ వ్యవస్థను కూలదోయటానికి పాలక వర్గంలోని ఏ విభాగమూ ప్రయత్నం చేయటం లేదు. తమ వర్గ ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు నిరంకుశ రాజ్య పాలనా రూపాలను ఉపయోగించే పనిలో పాలక వర్గాలు ఉన్నాయి. హిందూత్వ భావజాలాన్ని, జాతి దురహంకారాన్ని ఉపయోగించి ప్రజలను మత ప్రాతిపదికన విభజిస్తూ మైనారిటీలపై దాడులు చేయటాన్ని మనం నేటి భారతదేశంలో చూస్తున్నాము. మైనారిటీలను, విమర్శను, లౌకిక మేధావులను అణచటానికి వారిపై 'జాతి వ్యతిరేకులు' అనే ముద్రవేసి క్రూరమైన పద్ధతులను ఉపయోగిస్తున్నారు. హిందదూత్వ దిశగా సమాజాన్ని, రాజకీయ వ్యవస్థను పునర్నిర్మించటానికి పై నుంచి రాజ్య సంస్థల స్థాయిలోనూ, కింద నుంచి హిందూత్వ సంస్థల ద్వారానూ ఒక తీవ్ర ప్రయత్నం జరుగుతోంది. ఈ చర్యలన్నింటి వల్ల ప్రజాస్వామ్యానికి, లౌకికతత్వానికి వర్తమానంలో పెను ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ ఇవే ఫాసిస్టు పాలనగా అవతరించ లేవు.
నేటి భారతదేశం నయా ఉదారవాదం, మతతత్వా లతో కూడిన నిరంకుశ పాలనను ఎదుర్కొంటున్నది. హిందూత్వ మతతత్వం కాక నియంతృత్వానికి గల మరొక వనరు మితవాద నయా ఉదారవాదం దూకుడు. నయా ఉదారవాదం ప్రజాస్వామ్యాన్ని కుచింపజేస్తుంది. అన్ని బూర్జువా పార్టీలను ఒకే విధమైన విధానాలు అవలంబిం చేలా చేస్తుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని డొల్లగా మారుస్తుంది. విధాన నిర్ణయాలలో ప్రజలకు భాగస్వామ్యం లేకుండా చేస్తుంది. రాజకీయ వ్యవస్థపై నయా ఉదారవాద దుష్ప్రభావం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది.
నేటి ప్రపంచంలో సామ్రాజ్యవాదం, వివిధ దేశాల లోని పాలక వర్గాలు తమ వర్గపాలనను, నయా ఉదారవాద విధానాలను కొనసాగించటం కోసం బహిరంగ ఫాసిస్టు పాలనకు దిగకుండా వివిధ రకాల నిరంకుశ పాలనా విధానా లను చేపడుతున్నాయి. ఎన్నికలతో ప్రభుత్వాలు ఏర్పడే లాంఛనప్రాయ ప్రజాస్వామ్య దేశాలలో నిరంకుశ పాలనను రుద్దటానికి వీలుంటుంది. నేటి ప్రపంచంలో అనేక రకాల నియంతృత్వ పాలనా రూపాలున్నాయి. కొన్ని దేశాలలో మత, జాతి సమస్యల చుట్టూ తిరిగే రాజకీయ సమీకరణాలతో నిరంకుశ పాలన రుద్దబడుతుంది. మతతత్వం లేక రాజకీయ సమీకరణాలతో తీవ్ర మితవాద ఆర్థిక విధానాలు అమలు లోకి వస్తాయి. భారతదేశం అలాంటి దేశాలలో ఒకటి. మత ఆధారిత రాజకీయ సమీకరణ, నిరంకుశత్వానికి సంబంధిం చి భారతదేశానికి, టర్కీకి బలమైన సారూప్యత ఉన్నది. 2014 మే నెలలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రచయిత అమితావ్‌ ఘోష్‌ మొట్టమొదటిసారిగా ఈ సారూప్యతల గురించి రాశారు. మద్దతును సమీకరించ టానికి రెండు దేశాలలోనూ మత ఆధారిత 'జాతీయవాదాన్ని' ఉపయోగించే పాలక పార్టీలున్నాయి. భారతదేశంలో బిజెపి హిందూ మతంపై ఆధారపడుతుంటే టర్కీలోని జస్టిస్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ పార్టీ(ఎకెపి) ఒక ఇస్లామిస్టు పార్టీ. ఒక్కో పార్టీకి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ, రిసెప్‌ ఎర్డోగాన్‌ల రూపంలో నిరంకుశ ధోరణులు గల బలమైన నాయకుడున్నాడు. టర్కీ రాజ్యానికి గల లౌకికతత్వాన్ని లేకుండా చేయాలని ప్రయత్నిస్తూ, మైనార్టీ కుర్దులను, లౌకిక మేధావులను లక్ష్యంగా చేసుకుని ఎకెపి దాడులు చేస్తున్నది. బిజెపి, మోడీ ప్రభుత్వం మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. అలాగే లౌకిక మేధావుల విమర్శనాత్మక దృక్ప థాన్ని అణచివేయాలని చూస్తున్నాయి. ఈ రెండూ నయా ఉదారవాదాన్ని తలకెత్తుకున్నాయి. అయితే భారత దేశం, టర్కీలలో గల ప్రభుత్వాలను, రాజ్యాన్ని ఫాసిస్టు అనటం తప్పవుతుంది. వీటిని మితవాద నిరంకుశ ప్రభుత్వాలన వచ్చు.
అమెరికాతో పెరుగుతున్న సైనిక, వ్యూహాత్మక సహకారం మోడీ ప్రభుత్వ నిరంకుశత్వానికి దన్నుగా నిలుస్తున్నది. ఆ విధంగా ఫాసిస్టు, ఫాసిస్టేతర శక్తుల మధ్య జరిగే ముఖాముఖి పోరాటంగా కాకుండా బిజెపి- ఆర్‌ఎస్‌ఎస్‌ల ద్వయానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం సంక్లిష్టమైనది. అది బహుముఖ స్వభావాన్నీ కలిగి ఉంటుంది. రాజకీయ, భావజాల, సామాజిక, సాంస్కృతిక క్షేత్రాలలో బిజెపి, దాని పోషకుడు ఆర్‌ఎస్‌ఎస్‌లతో పోరాడ వలసి ఉంటుంది. బిజెపి, ఇతర మితవాద శక్తులతో జరిగే పోరాటంలో మతతత్వంతోనూ, నయా ఉదారవాదంతోనూ జరిగే పోరాటాలను మిళితం చేయాలి. పాలక వర్గాల ప్రయో జనం కోసం రెండు ప్రధాన పార్టీలైన బిజెపి, కాంగ్రెసులు నయా ఉదారవాద పాలనను కొనసాగిస్తున్నందున బిజెపికి వ్యతిరేకంగా చేసే రాజకీయ పోరాటాన్ని మరో ప్రాధాన పాలకవర్గ పార్టీతో కలిసి చేయటం సాధ్యపడదు. ప్రజాస్వా మిక వ్యవస్థలో ఎన్నికలను కొరగాకుండా చేసిన ఫాసిజంపై చేసిన పోరాటానికి భిన్నంగా భారతదేశంలో ఎన్నికల పోరాటం కూడా ముఖ్యమైనదే.
బిజెపికి, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ప్రధాన సమస్యలపైనైతే ప్రజలను సమీకరించదలిచామో ఆ సమస్యలు ఫాసిజంపై పోరాటం చేయటమే నేటి కర్తవ్యం అనే నినాదంతో అర్థరహితంగా మారతాయి. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు, బడా పెట్టుబడికి ఊడిగం చేయటం, ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యం, ప్రజల జీవనాధారాన్ని, వారి ఆర్థిక హక్కులను ప్రభావితంచేసే విషయాలు ఈ ప్రధాన సమస్యలలో ఉంటాయి.
ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమం ఆధారంగా వామ పక్ష, ప్రజాస్వామిక శక్తులతో ఒకవైపు ఐక్య సంఘటనను నిర్మిస్తూనే మతతత్వంపై పోరాటం చేయటానికి దేశంలోని అన్ని ప్రజాస్వామిక, లౌకిక శక్తులనూ అత్యంత విశాల ప్రాతి పదికన సమీకరించాలి. కేవలం అలాంటి ద్వైదీయ విధానమే భారతదేశంలోని మిదవాద శక్తుల పురోగమనాన్ని నిరోధించి, తిరోగమింపజేయగలదు.    - ప్రకాశ్‌ కరత్‌