|| ప్రశ్నతోనే ప్రగతి ||
వానల్లొ హరివిల్లు ఎందుకని/చుక్కల్లొ మిలమిల లెందుకని/మిణుగురు పురుగుల రెక్కల్లోన/వెలుగుల దీపం ఎందుకని...? పసి హృదయాల్లో, సుతిమెత్తని మనసుల్లో మెదిలే అపురూపమైన ప్రశ్నలకు అందమైన అక్షర రూపమే ఈ పాట. ఈ పాట నిండా ప్రశ్నలే... ఇటువంటివే కొన్ని వందలు, వేలు, లక్షల ప్రశ్నలు... ఈ అవనిపై ఆవిర్భవించినప్పటి నుంచి మానవజాతి ప్రశ్నించుకుంటూనే రాతియుగం నుంచి రాకెట్ యుగంలోకి ప్రవేశించింది. ఈ ప్రశ్నోపనిషత్తు ఇక ముందు కూడా కొనసాగుతూనే ఉంటుంది... ప్రశ్నించడం లేనప్పుడు ఎలాంటి పురోగతి ఉండదనేది నగసత్యం. ప్రపంచం అంచెలంచెలుగా పురోగమించడానికి ప్రశ్నే ఆధారం. అది లేనినాడు ప్రగతి నిలిచిపోదూ...!
ప్రశ్న ప్రగతికి రూపం...! ప్రశ్న ఈ జగతికి దీపం...! అది కేవలం సమాధానాలు రాబట్టే సాధనం మాత్రమే కాదు. అలాగైతే తాజ్‌మహల్‌ను ఎవరు నిర్మించారన్నప్పుడు షాజహాన్ అన్న సమాధానానికే సంతృప్తిచెందాల్సి వచ్చేది. కానీ తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు అంటూ శోధనకు దిగింది. దాని నిర్మాతలు కష్టజీవులే అనే సత్యాన్ని సాధించింది. అంతటితో ఆగలేదు. మహాకవి శ్రీశ్రీ మాటల్లోనే చెప్పాలంటే... నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది... సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది... చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసమెట్టిది... అంటూ ముందుకు సాగింది. ప్రజలే చరిత్ర నిర్మాతలన్న నిజాన్ని కనిపెట్టింది. శ్రమజీవే జగతికి మూలం, శ్రమ శక్తే విశ్వ సమస్తమని చాటి చెప్పింది. ప్రశ్న లక్ష్యం కేవలం సమాధానం మాత్రమే కాదనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అది సత్యం కూడా...! సత్యాన్ని కనిపెడుతూ పురోగమించడమే ప్రశ్న అసలు లక్ష్యం. కనుకనే పరిణామ క్రమంలో సమాజ అభ్యుదయానికి గల అడ్డంకులను, అవరోధాలను ధ్వంసం చేసి ప్రగతికి దారులు తీసింది. మానవ పురోగమనంలోని ప్రతి మలుపులో వెలుగై విజ్ఞానాన్ని పంచింది.
చెట్టు నుండి రాలే పండు నేలమీదికే ఎందుకు పడుతుంది, ఆకాశానికి ఎందుకు వెళ్లడం లేదు అన్న ప్రశ్నకు సమాధానమే న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతం... ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతానికి, డార్విన్ జీవపరిణామ సిద్ధాంతానికి మూలం ప్రశ్నే. మార్క్స్ సామ్యవాద సిద్ధాంతానికి ఆధారం కూడాప్రశ్నే. ప్రశ్నే లేకపోతే ఇవ్వాల్టి మన ఈ ప్రపంచమే లేదంటే అతిశయోక్తి కాదు...! ప్రశ్నేం చేస్తుందనుకోవద్దు... అది ప్రపంచాన్నే మార్చేస్తుంది... అది పోరాటానికి సంకేతం... భవిష్యత్‌కు సందేశం... అందుకే ప్రశ్నంటే కొందరికి భయం. అది అన్యాయాన్ని సహించదు. అవమానాలను భరించదు. అసమానతలను, అణచివేతలను అంగీకరించదు. అందుకే దొరతనాన్ని ధిక్కరించిన ప్రశ్న తెలంగాణ సాయుధ పోరాటమైంది. ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని సహించని ప్రశ్న స్వాతంత్య్ర సమరాంగణమైంది. దోపిడీని ఎదిరించిన ప్రశ్న అక్టోబర్ మహా విప్లవమైంది. అందుకే ప్రశ్నంటే ప్రజా కంటకులకు భయం. కానీ ప్రశ్నంటే ప్రగతికాముక శక్తులకు ప్రాణం. కనుక ప్రశ్ననెప్పుడూ స్వాగతించాలి. ఆదరించాలి. బలపరచాలి. ప్రశ్నను అడ్డుకోకూడదు. ప్రశ్నను అడ్డుకోవడమంటే ప్రగతిని అడ్డుకోవడమే...! ప్రశ్నను అడ్డుకోవాలనుకునేవారు అజ్ఞానులు, లేదంటే అభివృద్ధి నిరోధకులే. కానీ ప్రశ్నను అడ్డుకోగలరా? ప్రశ్న నియంతృత్వాన్ని సవాలు చేస్తుంది... నిర్బంధాన్ని బద్దలు కొడుతుంది... ప్రశ్న ఎప్పుడూ స్వేచ్ఛను కోరుకుంటుంది... ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంది... వికాసాన్ని ఆశిస్తుంది... ప్రశ్నించగలిగే స్వేచ్ఛ నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతీక. ప్రశ్నలేకుండా ఆలోచనలేదు. ఆలోచన లేకుండా పరిశీలన లేదు. పరిశీలన లేకుండా ప్రయోగం లేదు. ప్రయోగం లేకుండా సైన్సు లేదు. ఇవేవీ లేకుండా ప్రగతేలేదు. అందుకే ప్రశ్నించాలి... ప్రశ్నించడం ప్రతి ఒక్కరి హక్కు. ఇప్పుడు మనకు సమాధానం కావాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. కొండలు ఎందుకు తొలిచేస్తున్నారు, చెట్లను ఎందుకు నరికేస్తున్నారు, ప్రజలకు అన్నపానీయాలు అవసరముండగా అణు బాంబులు ఎందుకు తయారుచేస్తున్నా? బడిలో గడవాల్సిన బాల్యం బజారులో మాడిపోతోందెందుకు...? కులాల పేరిట, మతాల పేరిట కొట్టుకు చస్తున్నారెందుకు...? ప్రపంచంలో ఇప్పటికే ఉత్పత్తి అయి చలామణిలో ఉన్న సంపద కొన్ని వేల లక్షల కోట్ల డాలర్లుంటుంది. అందులోని సున్నాలను లెక్కించడమే చాలా కష్టం. సులువుగా అందరికీ అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే ప్రపంచ జనాభా మొత్తం కాలు మీద కాలేసుకుని తిన్నా కొన్ని వందల సంవత్సరాలకు ఈ సంపద సరిపోతుంది. ఇప్పటి ఈ సంపదను వాడుకోకుండానే అది ఏటా ఉత్పత్తి చేసే సంపదే ప్రపంచ జనాభాకు కడుపునిండా అన్నం పెడుతుంది. ప్రపంచంలో ఇంత సంపద ఉంది కదా మరి ఆకలెందుకుంది, పస్తులు ఎందుకు, పేదరికం ఎందుకు, అజ్ఞానం, అవిద్య ఎందుకు...? ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రశ్నించడమొక్కటే మార్గం.. ప్రశ్నిద్దాం...! భయం, నదురూబెదురూ లేకుండా గొంతెత్తి సూటిగా ప్రశ్నిద్దాం...!
(ప్రజాశక్తి దినపత్రిక)
No comments:
Post a Comment