Wednesday, 31 August 2016

|| సరళీకరణ విధానాలను ఓడించడమే సెప్టెంబర్‌ 2 సమ్మె ప్రధాన లక్ష్యం ||




                 భారతదేశంలో సరళీకరణ విధానాలు ప్రవేశపెట్టి పాతికేళ్ళయ్యింది. సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి అమలుచేస్తున్నాయి. కేంద్రంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న గత కాంగ్రెస్‌ ప్రభుత్వం, నేటి బిజెపి ప్రభుత్వాలు పోటీలో అగ్రగాములుగా ఉన్నాయి. బిజెపి గత రెండు సంవత్సరాల పాలన మరింత దూకుడుగా ఉంది. బిజెపి విధానాల ప్రభావం సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్రంగా ఉంది. వీరి పాలన బహుళజాతి సంస్థలకు మరింత అనుకూలంగా మారింది. పోరాటాల ద్వారానే బిజెపి దూకుడును అడ్డుకోగలమనేది గత అనుభవం కూడా. 2004 సంవత్సరానికి ముందు ప్రజా పోరాటాలు ద్వారానే ఎన్డీయే విధానాలను ప్రజలు నిలువరించారు. 2004 ఎన్నికల్లో బిజెపి అన్ని పారిశ్రామిక కేంద్రాల్లో ఘోరంగా ఓడిపోయింది. సరళీకరణ విధానాలను ఆ నుంచి క్ష వరకు నికరంగా సిఐటియు వ్యతిరేకించి పోరాడుతున్నది.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యక్తిగత సగటు ఆదాయం సాలీనా రూ.1,40,000కు పెరిగిందని ప్రకటించింది. రాష్ట్రంలో మొదటి స్థానంలో గాజువాక మండలం (విశాఖ జిల్లా) ఉంది. గాజువాక స్టీల్‌ప్లాంట్‌, బెల్‌ లాంటి భారీ ప్రభుత్వరంగ పరిశ్రమల కేంద్రం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో రూ.30 వేల కోట్లకు పైగా చెల్లించింది. ప్రభుత్వరంగ పరిశ్రమలు ఆధునిక దేవాలయాలు. ప్రగతికి పట్టుగొమ్మలు. ప్రభుత్వరంగ సంస్థల కాలనీల్లో కార్మికులు అత్యాధునిక సౌకర్యాలున్నాయి. పాఠశాలలు, కాలేజీలు, ఆస్పత్రులు, పార్కులు, విద్యుత్‌, మంచినీరు లాంటి సౌకర్యాలకు కొదవ లేదు. ప్రభుత్వరంగం వల్లే ఈ ప్రాంతంల్లో ఎస్సీ, ఎస్టీలు బతకగలుగుతున్నారు. సామాజిక న్యాయం సాధ్యమౌతున్నది.
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను కూల్చేయాలని నిరంతరం కుట్రలు చేస్తున్నది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 2015-16లో మొదటిసారి రూ.1,640 కోట్లు నష్టాలు చవిచూసింది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగాల్లోని స్టీల్‌ప్లాంట్‌లకు స్వంత ఇనుప గనులు ఉన్నాయి. కానీ విశాఖ స్టీల్‌కు సొంత గనుల్లేవు. గతంలో కేంద్ర గనుల శాఖా మంత్రులుగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి టి సుబ్బిరామిరెడ్డి, దాసరి నారాయణ ఉన్నా విశాఖ స్టీల్‌కు ఇనుప గనులు తేలేదు. సొంత గనులు ఉన్న వారికి టన్ను ఇనుప ఖనిజం రూ.500లకు లభిస్తే, విశాఖ స్టీల్‌ టన్ను రూ.5 వేలు పెట్టి కొనవలసి వస్తున్నది. విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌ 80 శాతానికి పైగా ప్రయివేట్‌ పరమైంది. హిందూస్థాన్‌ పెట్రోలియం ఇప్పటికే 49 శాతం ప్రయివేట్‌పరమైంది. ప్రయివేట్‌ కత్తి పరిశ్రమ మెడపై వ్రేలాడుతున్నది. బెల్‌ పరిశ్రమకు వర్క్‌ ఆర్డర్లు లేవు. కార్మికులు 20 సంవత్సరాల నాటి జీతాలతో కాలం గడుపుతున్నారు. షిప్‌యార్డ్‌ రక్షణరంగంలో విలీనమైనా ఆర్డర్లు శూన్యం. ఆంధ్రప్రదేశ్‌లోని కీలకమైన భారీ పరిశ్రమల గురించి రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్ళలో ఒక్కసారి కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రభుత్వరంగాన్ని బలహీనపరిచి ప్రయివేట్‌వారికి పెద్ద పీట వేస్తున్నాయి. అయినా ఒక్క భారీ ప్రయివేట్‌రంగ పరిశ్రమా నేటికి రాష్ట్రంలో ఎక్కడా రాలేదు.
చైనాలో ప్రభుత్వరంగం బలంగా ఉండటం వల్లనే చైనా ప్రపంచంలో అమెరికా తరువాత రెండవ ఆర్థిక శక్తిగా మారిందని చైనా ప్రభుత్వం ప్రకటించింది. చైనాలో కార్మికుల జీతాలు పెంచడం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడింది. చైనాలో జీతాలు పెరగడం వల్ల కార్మికవర్గం మార్కెట్‌లో వస్తువుల కొనుగోలుచేయడం బాగా పెరిగింది. దీనికి విరుద్ధంగా కార్మికుల జీతాలు తగ్గిస్తే భారతదేశం అభివృద్ధి చెందుతుందనే పాలకుల సిద్ధాంతం సుద్ద తప్పు. విద్యాధికులు అవుతున్న యువతీయువకులకు ఉపాధి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలది. విశాఖఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ఉపాధి కోసం ప్రాణాలు బలిదానం చేశారు. కానీ నేడు ఉన్న ఉపాధికి కోత విధిస్తున్నారు. 1991లో ప్రభుత్వరంగంలో ఉన్న 54 వేల ఉద్యోగాలు నేడు 34 వేలకు పడిపోయాయి. అతి తక్కువ జీతాలతో చేయించుకొనే కాంట్రాక్టు లేబరు పెరిగింది. ఇదే కాలంలో అన్ని పరిశ్రమల్లో రెట్టింపుకు పైగా ఉత్పత్తి పెరిగింది. దీనినే 'ఉపాధి రహిత అభివృద్ధి' అంటాం. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న జబ్బు ఇది. అమెరికా, యూరప్‌ ఖండాలతో సహా నిరుద్యోగ భూతం ఆవరించింది. మనదేశంలో పర్మినెంట్‌ ఉద్యోగాలకు అవకాశం ఉన్నా పెట్టుబడిదారుల లాభాలు పెంచడం కోసం కాంట్రాక్టు పద్ధతి తీవ్రంగా అమలు చేస్తున్నారు. జీతాలు పెంచమంటే 'మారుతి ఉద్యోగ్‌ లిమిటెడ్‌' లో హైర్‌ అండ్‌ ఫైర్‌ పేరుతో 800 మంది కార్మికులను తొలగించారు. చౌక శ్రమ (చీప్‌ లేబర్‌)తో కార్మికులను శ్రమదోపిడీని తీవ్రం చేయడానికి స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్లు (సెజ్‌) ఏర్పాటు చేస్తున్నారు. సెజ్‌లు అంటే ఆధునిక జైళ్లు. సర్కస్‌ కంపెనీల్లాగా రాయితీలు అయిపోగానే ఒకచోట నుంచి మరోచోటకు మారుతుంటారు. కార్మికులను అతి తక్కువ జీతాలతో పనిచేయిస్తాయి. అచ్యుతాపురం స్పెషల్‌ ఎకానామిక్‌ జోన్‌లో బ్రాండిక్స్‌ కంపెనీకి ప్రభుత్వం వెయ్యి ఎకరాలు వెయ్యి రూపాయలకు సంవత్సరానికి లీజుకు ఇచ్చింది. వీరికి విద్యుత్‌, నీటి ఛార్జీలు తక్కువ.
ప్రయివేట్‌ అంటే లాభాలు. లాభాల కోసమే ప్రయివేట్‌ యాజమాన్యాలు కంపెనీలు నడుపుతాయి. ప్రభుత్వరంగ కంపెనీలు ప్రయివేట్‌ అయితే లాభాలు ప్రయివేట్‌కు వెళతాయి. ప్రభుత్వరంగంలో నష్టాలు సమాజం భరించాలి. ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వరంగం నేడు నష్టాలపాలవుతున్నది. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత గత రెండేళ్ళలో ప్రభుత్వరంగంలో అత్యంత లాభాలొస్తున్న ఆయిల్‌, బెల్‌, ఎన్‌టిపిసి వంటి సంస్థల వాటాలను రూ.20 వేల కోట్లకు పైగా వ్యూహాత్మాక అమ్మకాల పేరుతో ప్రయివేట్‌ వారికి అప్పగిస్తున్నది. బ్యాంకింగ్‌, ఇన్సూరెన్సు రంగాల్లో విదేశీ పెట్టుబడులను అత్యధికంగా ఆహ్వానించడం, వీటి లాభాలను పన్నుల్లేకుండా విదేశాలకు సాగనంపడమే. 'మేక్‌ ఇన్‌ ఇండియా' పేరుతో విదేశీ కంపెనీలు మన దేశంలో 'లూట్‌ ఇన్‌ ఇండియా'గా మారాయి. జాతీయవాదం గురించి తెల్లవారి లేస్తే జపంచేసే బిజెపి పాలకులు అమెరికాకు మన దేశాన్ని తాకట్టుపెడుతున్నారు. ఇది జాతీయవాదం కాదు. విదేశీవాదం. దీన్ని ప్రశ్నించే వారందరూ వీరి సిద్ధాంతం ప్రకారం దేశద్రోహులు. ప్రభుత్వరంగం బలహీనమైతే భారత ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది. ఉపాధి సమస్య తీవ్రమౌతుంది. ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయి. సామాజిక న్యాయం తీవ్రంగా దెబ్బతిని ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలు మరింతగా నష్టపోతారు. మనదేశ ఆహార అవసరాలకు విదేశాలపై ఆధారపడవలసిన దుస్థితి ఏర్పడుతుంది. విదేశాల నుంచి కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలతో సహా చిన్న దేశాల నుంచి ఎగుమతి చేసుకుంటున్నాం. 80 లక్షల టన్నుల రసాయనిక ఎరువులు, ఒక కోటి టన్నుల స్టీలు వగైరా గత సంవత్సరం దిగుమతి చేసుకున్నాం. దీనివల్ల ప్రభుత్వరంగ అభివృద్ధితో స్వయం సమృద్ధిని సాధించిన భారతదేశం నేడు పరాధీనత పాలుగావడం విచారకరం.
కార్మికవర్గం చైతన్యయుతమైన వర్గం. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గతంలో 16 సమ్మెలు చేశారు. 16 సమ్మెల్లోనూ సిఐటియు చురుకైన పాత్ర వహించింది. వచ్చే సెప్టెంబర్‌ 2వ తేదీన 17వ సమ్మెకు యావత్‌ కార్మికవర్గం సమరశంఖారావం పూరించింది. పూర్తి సన్నాహాలు చేస్తున్నది. కార్మికవర్గ పోరాటాలను అణచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను మారుస్తున్నాయి. సంఘం పెట్టుకునే హక్కును, సమ్మె హక్కును కాలరాయడానికి సిద్ధపడుతున్నాయి. పోరాడి సాధించుకున్న హక్కులను ఉక్కుపాదంతో అణచడం ఎవ్వరితరం కాదని చరిత్ర రుజువుచేసిన సత్యం. ఉద్యమాలను ఎంత అణిచేస్తే అంత తీవ్రరూపం దాలుస్తాయి. ఇది పోరాటాల కాలం. యూనియన్‌ లేకుండానే బెంగళూరులో గార్మెంట్‌ కార్మికులు లక్షమంది సెజ్‌ బంధాలు తెంచుకొని వచ్చి జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. విశాఖలో 16 వేల మంది బ్రాండిక్స్‌ కార్మికులు 15 రోజులు నిరవధిక సమ్మె నడిపారు. 22 ఏళ్ళ తరువాత రైల్వే కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 2న యావత్‌ కార్మికవర్గం సమ్మెలో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసన తెలియజేయాలని సిఐటియు కోరుతున్నది.  --సి హెచ్ నర్సింగరావు 

|| వైద్యో... నారాయణో... హరి ||


               పది రోజుల్లో ఆరు ఘటనలు. మనసు మెలి పెట్టేస్తాయి. సున్నిత హృదయుల కంట కన్నీరు పెట్టిస్తాయి. ఉడుకు రక్తం గలవారికి ఏలికలపై ఆగ్రహం తెప్పిస్తాయి. వైద్యుడికి రోగికి మధ్య దూరం ఎంతుందో మరో మారు తాజాగా ప్రపంచానికి చాటుతాయి. మానవజాతిని అప్రతిహతంగా ముందుకు నడిపిస్తున్న మహిళలు ప్రసవానికి ఎన్నెన్ని కష్టాలు పడుతున్నారో? నాగరికతను నిలువెల్లా నింపుకున్న ఆధునిక సమాజంలో, కట్టుకున్న భార్య అంతిమ యాత్రను ఓ బీద గిరిజనుడు ఎంత దీనాతి దీన పరిస్థితుల్లో చేశాడో? తల్లిదండ్రులిద్దరికీ బరువైన చిన్నారులు చీకటి గదిలాంటి మురికి కూపంలో తిండీతిప్పలు లేకుండా ఎలా పడున్నారో? విష జ్వరంతో బాధపడుతున్న కుమారుడిని భుజాన వేసుకుని ఆస్పత్రుల చుట్టూ పరుగెట్టినా అసమర్థ తండ్రిగానే ఎలా మిగిలిపోవాల్సి వచ్చిందో? తెలిపే ఘటనలివి. భార్య శవాన్ని భుజాన మోసుకెళ్లిన ఒడిషా గిరిజనుడి వార్తా కథనం పత్రికల్లో చూసి అక్కడెక్కడో వున్న బహ్రెయిన్‌ ప్రధాని స్పందించి డబ్బు పంపి ఆదుకోగలిగాడే కానీ, మన ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం పెదవి విప్పలేకపోయారు. ఆయన గిరిజనుడి కుటుంబానికి సంతాపం తెలపాలంటే 'మన్‌ కీ బాత్‌ కార్యక్రమమం' రావాలి కామోసు? వైద్యం ప్రయివేటు పరమై బడుగు జీవికి అంతంత మాత్రపు సేవలు అందుతున్న వేళ, ఒక చిన్ని అంబులెన్స్‌ వాహనం కూడా లేక బీదల ప్రాణాలెలా అల్లాడిపోతున్నాయో ?

|| సైకిల్‌పై ప్రసవ యాత్ర ||

ప్రసవ యాతనను మాటల్లో వర్ణించలేం. అలాంటిది నొప్పులు మొదలయ్యాక సైకిల్‌ మీద 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆస్పత్రికి చేరుకోవడమంటే మాటలు కాదు. ఆ మహిళ పార్వతి అయితే, సైకిల్‌ మీద ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లిన వ్యక్తి నన్హేభారు. పార్వతి తండ్రి. మధ్యప్రదేశ్‌లోని షాపూర్‌ గ్రామానికి చెందిన గిరిజనులు వీళ్లు. పార్వతికి నొప్పులు ప్రారంభమవడంతో అంబులెన్స్‌ పంపించమని, 'జనని ఎక్స్‌ప్రెస్‌' వారికి పదే పదే ఫోన్లు చేశారు. పురుటి నొప్పులతో బాధ పడుతున్న కుమార్తెను దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి ఎంత త్వరగా తీసుకెళ్దామా అన్న ఆతృతలో వున్న నన్హేభారుకు నిరాశే ఎదురైంది. అంబులెన్స్‌ రాకపోవడంతో సైకిల్‌ మీదే ఆమెను ఆస్పత్రికి చేర్చాడు. సుఖప్రసవమై పండంటి బాబు పుట్టాడు. అప్పటి వరకు పడ్డ మానసిక ఒత్తిడిని మర్చిపోయి తాత అయినందుకు ఎంతగానో సంతోషించాడు. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. తిరిగి తల్లీబిడ్డలను ఇల్లు చేర్చడమెలాగనేది పెద్ద సమస్యగా ఆయన ముందు నిల్చింది. ఆస్పత్రి అధికారులు వారి తిరుగు ప్రయాణానికి అంబులెన్స్‌ ఏర్పాటు చేయకపోవడంతో తన సైకిల్‌ మీదే పచ్చి బాలింతరాలిని, పసిగుడ్డుగా వున్న మనవణ్ణి తీసుకుని ఇల్లు చేరాడు.

|| భుజాలపైనే భార్య అంతిమ యాత్ర ||

క్షయ వ్యాధిగ్రస్తురాలైన భార్యను తీసుకుని ఆస్పత్రికి వెళ్లేప్పుడా గిరిజనుడు ఊహించనే లేదు! ఆమె కట్టెను భుజాన మోసుకెళ్లాల్సి వస్తుందని!! ఈ హృదయ విదారక ఘటన ఒడిషాలో జరిగింది. దానా మఝి భార్య అమన్‌గడై టీబీ వ్యాధి ముదిరి భవానీపట్నాలోని ఆస్పత్రిలో మృతి చెందింది. కాయాన్ని తీసుకెళ్లేందుకు అతని దగ్గర పైసా లేదు. ఎంతగా వేడుకున్నా, శవాన్ని తిరిగి స్వగ్రామం తీసుకెళ్లేందుకు పాడెగానీ, అంబులెన్స్‌గానీ ఆస్పత్రివారు ఏర్పాటు చేయలేదు. గత్యంతరం లేక దుప్పటి చుట్టిన శవాన్ని భుజాన వేసుకుని భార్య అంతిమ యాత్ర ప్రారంభించాడా భర్త. తల్లి మరణంతో పెల్లుబికి వస్తున్న దు:ఖాన్ని, కన్నీళ్లను ఆపుకోలేక అలాగని వీధుల్లో మనసారా ఏడవడానికి కూడా నోచుకోని కూతురితో కలిసి 60 కిలోమీటర్ల దూరంలో వున్న స్వగ్రామం బయల్దేరాడు. తండ్రీ కూతుళ్ల కన్నీటి యాత్రను జనం అలా నిలబడి చూశారేగానీ స్పందించే మనసే కరవైంది. ఇక మనసులేని ప్రభుత్వం సంగతి చెప్పేదేముంది?!

|| కడ ప్రయాణం ఇంత కష్టమా ||

ఎనభయ్యేళ్ల వితంతువు సలమాని బెహ్రా. ఇటీవల బాలాసూర్‌ దగ్గర సోరో రైల్వే స్టేషన్‌ సమీపంలో ఒక గూడ్సు రైలు గుద్దడంతో చనిపోయింది. అన్నేళ్ల జీవితానుభవంలో ఎన్నో చావులను, చివరి ప్రయాణాలనూ చూసి వుంటుంది కానీ తన కడ యాత్ర ఇంత అమానుషంగా వుంటుందని ఆమె కలలో కూడా అనుకొని వుండదు. రైలు పట్టాల మీద పడున్న ఆమె శవాన్ని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు చేర్చారు.
అక్కడి నుంచి పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం ఆస్పత్రికి చేర్చాలి. అయితే అధికారులు అంబులెన్స్‌ ఏర్పాటు చేయకపోవడంతో శవాన్ని గుడ్డలో చుట్టి వెదురు బొంగుకు కట్టేసి తీసుకెళ్లారు. ఇదంతా ఒక ఎత్తయితే, సుళువుగా మోసుకెళ్లేందుకు వీలుగా ఓ వ్యక్తి తన కాళ్లతో శవం కాళ్లు విరగ్గొట్టి మూట కట్టడమే మనసును తొలిచేస్తుంది. ఇలా కూడా జీవితం వెళ్లమారిపోతుందా అనిపించకమానదు. యాదృచ్ఛికమే అయినా ఈ ఘటన సైతం ఒడిషాలోనే జరిగింది.

|| వరదలో ప్రసవయాసం ||

వానొచ్చినా, వరదొచ్చినా పురుటి నొప్పులు ఆగవు. మధ్యప్రదేశ్‌ను వరద నీరు చుట్టిముట్టిన తరుణంలో టిమారిహ గ్రామానికి చెందిన సంధ్యా యాదవ్‌కు ప్రసవ వేదన మొదలైంది. ఆస్పత్రికెళ్లడానికి ఆటోలూ లేవు. ఎన్నిసార్లు పిల్చినా అంబులెన్సూ రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఇటీవలే జనని అంబులెన్సుల సేవలను ప్రారంభించింది. నెలలు నిండిన మహిళలను ఉచితంగా ఆస్పత్రికి తీసుకెళ్లడం, ప్రసవానంతరం తిరిగి ఇంటికి చేర్చడం కోసమే వాటిని కేటాయించింది. అయితే అదేమీ సంధ్యకు అక్కరకు రాలేదు. ముగ్గురు మహిళలను తోడు చేసుకుని మోకాళ్ల లోతు వరద నీటిని 6 కిలోమీటర్ల దూరం పంటి బిగువున ఈదుకుంటూ వెళ్లాకే ఆటో దొరికింది. అక్కడి నుంచి చత్తర్‌పూర్‌ ఆస్పత్రికి చేరుకుని ఆడపిల్లకు జన్మనిచ్చింది. అలా తల్లీ బిడ్డా సురక్షితంగా బైటపడ్డారు కాబట్టి సరిపోయింది. వరదనీళ్లలో నడిచేటప్పుడు నొప్పులెక్కువై బిడ్డ బైటపడితే దిక్కెవరు?!
  ఇలాంటి దుర్ఘటనలు మన రాష్ట్రంలోనూ తక్కువేం కాదు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలం ఎగువ ప్రాంతంలోని బొడ్డగండికి చెందిన గర్భిణి సాదల మణిమ్మకు పురిటి నొప్పులు రావడంతో ఏడు కిలోమీటర్ల మేర జట్టీపై ఆమెను బంధువులు తీసుకొచ్చారు. చివరికి 108 సిబ్బందికి సమాచారం అందించి ఆస్పత్రికి తరలించారు.

|| కన్నవాళ్లే కాదన్నారు ...||

ఇద్దరు చిన్నారులు. ఒకరికి 3, మరొకరికి 8 సంవత్సరాలు. వీరికి ఓ తమ్ముడు. వాడిని తీసుకుని అమ్మ ఎప్పుడో ఇంట్లోంచి వెళ్లిపోయింది. నాన్న వాయవ్య ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీలో కార్మికుడు. తాగుబోతు. ఒకరోజు ఆ చిన్నారులిద్దరినీ గదిలో పెట్టేసి తాళం వేసి వెళ్లిపోయాడెక్కడికో! తినడానికి తిండిలేదు. తాగడానికి నీళ్లు లేవు. నాన్న వస్తాడని ఆకలి తీరుస్తాడని ఎదురు చూసీ చూసీ అలసిపాయాయా నాలుగు పసి నేత్రాలు. నేలమీదే దుప్పటి చుట్టుకుని వుండిపోయారు. గదిలోంచి దుర్వాసన రావడంతో కిటికీ లోంచి చూసిన ఇంటి యజమానికి దయనీయ పరిస్థితుల్లో పడున్న చిన్నారులు కనిపించారు. క్రిమికీటకాల కారణంగా వారి శరీరాలపై లోతైన గాయాలయ్యాయి. ప్రస్తుతానికి న్యూఢిల్లీలోని హిందూరావ్‌ అస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో వున్న వారికి కొద్ది రోజుల్లో ఒంటిపైనున్న గాయాలు మానవచ్చు కానీ మనసుకైన గాయాల మాటేవిటి?!

|| నాన్న భుజాల మీదే చివరి శ్వాస ||

ఒళ్లు తెలీని జ్వరంతో బాధపడుతున్న పన్నెండేళ్ల కొడుకుని భుజాన వేసుకుని ఆస్పత్రికెళ్లిన తండ్రికి జీవితాంతం మరవలేనంత దు:ఖాన్ని మాత్రమే ఇచ్చింది మన వైద్య వ్యవస్థ. కాన్పూర్‌కి చెందిన సునీల్‌ కుమార్‌ కుమారుడు అన్షు. ఎప్పుడూ క్లాసులో ఫస్టుండే ఆ చిన్నారికి జ్వరం రావడంతో మొదట ఫజల్‌గంజ్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చూయించాడు తండ్రి. రెండు రోజులైనా జ్వరం తగ్గకపోగా పెరగడంతో లాలా లజపతిరారు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. జ్వరంతో సోయ లేకుండా పడున్న పసివాడికి అత్యవసర సేవలందించి ప్రాణాలు నిలపాల్సిన వైద్యులు ఆ చిన్నారిని పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పి మిన్నకుండిపోయారు. అక్కడికి 250 మీటర్ల దూరంలో వున్న ఆస్పత్రికి వెళ్లడానికి కనీసం స్ట్రెచర్‌ ఇమ్మని అధికారుల కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. అంబులెన్సూ లేదు. భుజన మోసుకెళ్లినా కొడుకును కాపాడుకోలేకపోయాడు. ఆస్పత్రికెళ్లేసరికే పసివాడు కన్నుమూశాడు. కొడుకు శవాన్ని భుజాన వేసుకునే తిరుగు ప్రయాణమయ్యాడా బీద తండ్రి. ఎవ్వరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. పది నిమిషాల ముందుగా తీసుకొచ్చినట్టయితే చిన్నారి ప్రాణాలు కాపాడేవారమన్న వైద్యుల మాట అతన్ని జీవితాంతం వెంటాడుతూనే వుంటుందేమో!     ఇంతకీ... ఈ ఘటనలకు బాధ్యులెవరో!?

# ఏదీ.. క్రీడా సంస్కృతి?#




రియోలో చైనా డ్రాగన్‌.. 70 పతకాలు కైవసం చేసుకుంది..! కానీ, ఈసారి ఎంతలేదన్నా పదికి తక్కువ కాకుండా పతకాలు తెస్తుందనుకున్న భారత రెండంటే రెండింటితోనే సంతృప్తి పడింది..!

ఒక దశలో స్టార్లంతా ఇంటిముఖం పడుతుంటే... ఆశలు అడుగంటుతుంటే.. ఇద్దరు అమ్మాయిలు.. భారత పరువును నిలబెట్టారు..! ‘రాజు వెడలె...’ అన్నచందంగా ప్రతిసారి విశ్వ క్రీడలకు ఆర్భాటంగా వెళ్లే భారత బృందం చచ్చీచెడి పతకాల్లో సింగిల్‌ డిజిట్‌కు పరిమితమవ్వడం.. ఒక్కోసారి అవి కూడా లేకుండా ఒట్టి చేతుల్తో తిరిగిరావడం మామూలైపోయింది! వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత సాధించింది 28 పతకాలే. మరి, జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారతకు ఒలింపిక్‌ పతకాలు ఎండమావిగా మారుతున్నాయెందుకు? భారత అథ్లెట్ల పేలవ ప్రదర్శనకు కారణాలు ఏమై వుంటాయి? జనాభాలో చైనాతో పోటీపడుతున్న మనం పతకాల విషయంలో మాత్రం వారితో కనీసం పోటీపడలేకపోతున్నామెందుకు? ఆ విశేషాలను పరికిస్తే..

-- ధనిక, పేద వర్గాల మధ్య భారీ అంతరం
-- ప్రభుత్వ ప్రోత్సాహం కరవు.. మౌలిక వసతుల లేమి
-- గ్రామీణ ప్రాంతాల్లో ఒలింపిక్స్‌పై అవగాహన శూన్యం

ప్రపంచ జనాభాలో ఆరోవంతు జనాభావున్న భారతలో క్రీడా సంస్కృతి లేకపోవడమే ఒలింపిక్‌ పతకాల లేమికి ప్రధాన కారణం. అలాగే క్రీడల ఎదుగుదలకు పేదరికం, ఆరోగ్య సమస్యలు, మౌలిక సదుపాయాలు ప్రతికూలంగా పరిణమించాయి. ధనిక పేదవర్గాల మధ్య భారీ అంతరం ఏర్పడటంతో పేదలకు బతుకు బండి నెట్టుకురావడమే దుర్భరమవుతోంది. గ్లోబలైజేషన్‌ వల్ల ప్రపంచమే కుగ్రామంగా మారిపోయిన ఈ రోజుల్లోనూ భారతలో చాలాచోట్ల అమ్మాయిలను క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతించే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు తమ పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్లుగా చూడాలనుకుంటున్నారే తప్ప క్రీడలవైపు మార్గదర్శకత్వం చేయడం లేదు. ఒకవేళ పిల్లలకు క్రీడలపై ఆసక్తి ఉన్నా.. మొగ్గలోనే తుంచేసి తమ ఆకాంక్షలను వారిపై రుద్దుతారు. ఒకప్పుడు ఒలింపిక్స్‌లో భారతకు స్వర్ణాల పంట పండించిన హాకీ ఆటపై గ్రామీణప్రాంతాల్లో అవగాహనే లేదు. ప్రభుత్వం కూడా క్రీడారంగంలో నామమాత్ర కేటాయింపులతో సరిపెడుతోంది.

|| గ్రామీణ యువతకు అవగాహన కల్పిస్తేనే..||

విశ్వక్రీడలంటే ఏదేశంలోనైనా యమా క్రేజ్‌! మరి.. అది గ్రామీణ ప్రాంతాలతో నిండి ఉన్న భారతలో మచ్చుకైనా కనిపించదు. విశ్వక్రీడల్లో భారత సక్సెస్‌ సాధించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒలింపిక్స్‌పై అవగాహన కల్పించాల్సిందేనని చైనా మీడియా నొక్కి చెబుతోంది. ఈమేరకు క్రీడలపై ప్రజల్లోగల అవగాహనను తెలుసుకునేందుకు కర్ణాటక, రాజస్థాన్‌ రాషా్ట్రల్లోని గ్రామీణ ప్రాంతాల్లో అధ్యయనం చేసింది. మీ దృష్టిలో అత్యున్నత ఉద్యోగం ఏదంటూ రాజస్థాన్‌లో ఓ గ్రామానికి చెందిన యువకులను ప్రశ్నిస్తే.. సాఫ్ట్‌వేర్‌, ఆర్కిటెక్‌ ఇంజనీర్‌, డాక్టర్‌, లాయర్‌ అనే చెప్పారు. టీచర్‌, సైనికుడు కావాలనుందని మరో గ్రామంలోని యువకులు చెప్పారు. వీరిలో ఏ ఒక్కరు కూడా క్రీడాకారునిగా ఎదగాలనే ఆకాంక్షను వ్యక్తం చేయకపోవడం గమనార్హం. రాజస్థాన్‌ కంటే మెరుగైన ఆర్థిక పరిస్థితి ఉన్న కర్ణాటకలోనూ సేమ్‌ టు ‘షేమ్‌’!

|| చైనాలో అలా...||

చైనా తర్వాత అత్యధిక జనాభాగల దేశం మనదేనని సగర్వంగా చెప్పుకునే మనమే ఒలింపిక్స్‌లో పతకాల విషయానికొచ్చేప్పటికి సైలెంట్‌ అయిపోతుంటాం. మరి, క్రీడల్లో చైనా అంతలా ఎలా దూసుకుపోతోంది? వాళ్లు కూడా మనలాంటి మనుషులే. కానీ, వాళ్లకు ఇచ్చే శిక్షణ, ప్రభుత్వ ప్రోత్సాహమే చైనాను ఆటల్లో అగ్రపథాన నిలుపుతున్నాయి. చైనాలో స్పోర్ట్స్‌ సిస్టమ్‌ కొంచెం భిన్నంగా, కఠినంగా ఉంటుంది. క్రీడల పట్ల ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరిస్తుంటుంది. పతకాలు సాధించాలి సాధించాలి అంటే సరిపోదు. క్రీడాకారులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలి. సరైన శిక్షణ అందించాలి. ప్రతిక్షణం క్రీడాకారుల వెన్నంటే ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తూ ప్రోత్సహిస్తుండాలి. చైనా అదే చేసింది. శిక్షణ విషయంలో చైనా చాలా కఠినంగా వ్యవహరిస్తుంటుంది.

|| పునాదులు పటిష్టంగా.. ||

భవిష్యత్తులో క్రీడల్లో పాల్గొనేందుకు అథ్లెట్లకు తగిన బాడీ షేప్‌, ఎత్తు తదితర విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని చిన్నారి క్రీడాకారులను ఎంపిక చేస్తారు. ఇందుకోసం చైనా ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక టీమ్‌ను నియమిస్తుంది. ఆ అధికారులు ఎలిమెంటరీస్కూళ్లకు వెళ్లి తగిన ప్రమాణాలుగల క్రీడాకారులకోసం జల్లెడ పడుతుంటారు. ఇక తమకు తగిన అథ్లెట్లు దొరికారంటే ఆ క్రీడాకారులు తమ కుటుంబాలకు దూరమవ్వాల్సిందే. జిమ్నా్‌స్టల కోసమైతే చైనా మరింత తీవ్రంగా అన్వేషిస్తుంది. ఇందుకోసం కేవలం 4 నుంచి 9 ఏళ్ల వయసుగల చిన్నారులను ఎంపిక చేసుకుని చాలా కఠినంగా ఎడతెరిపిలేకుండా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంది. ప్రతిరోజు ఏకంగా 12 గంటల పాటు తీవ్రసాధన ఉంటుంది. ఎంపికైన చిన్నారికి ఒలింపిక్స్‌లో పోటీపడే సత్తా ఉందా లేదా అనేది ఈ శిక్షణ కాలంలోనే తెలిసిపోతుంది. చిన్నారులు సాధనపై ఏకాగ్రత చూపడం కోసం వారి కుటుంబాలు సైతం త్యాగాలకు ఒడిగడుతుంటాయి. వారి కుటుంబాల్లో ఎవరైనా మరణించినా కనీసం ఆ విషయాన్ని సైతం చిన్నారుల దరిచేరనీయరు. అదే భారతలో ఐదేళ్లలోపు చిన్నారుల్లో 20 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతుంటారు. 43 శాతం మంది తక్కువ బరువుతో ఉంటారు. ఇక, వారికి ఆటలాడాలనే ఆసక్తి ఎక్కడినుంచి వస్తుంది.

|| ప్రపంచ స్థాయి సదుపాయాలు..||

ప్రపంచ స్థాయి అథ్లెట్లకు ఉత్తమ స్టేడియాలు, మౌలిక వసతులు, సామగ్రి, వ్యాయామ శాలలు అవసరం. అవి ఉంటేనే వారు తమ ప్రతిభను మరింత పెంచుకోగలరు. చైనాలో 8 లక్షల 50 వేల వ్యాయామశాలలు ఉన్నాయి. బీజింగ్‌ ఒలింపిక్స్‌కు ముందు చైనా నిర్మించిన స్టేడియాలను చూసి ప్రపంచం నివ్వెర పోయిన సంగతి తెలిసిందే. తాము ఏయే క్రీడల్లో బలహీనంగా ఉన్నామో గుర్తించి వాటిలో ముందంజ వేసే ప్రయత్నం చేస్తుంది. స్వదేశంలో నిష్ణాతులైన గురువులకు కొదవలేకున్నా అంతర్జాతీయ పోటీని దృష్టిలో ఉంచుకొని, ఫలితాలే లక్ష్యంగా విదేశీ కోచ్‌ల సహాయం తీసుకుంటుంది.

|| ఆటలే లోకం.. అద్భుత పోత్సాహం..||

చైనా అథ్లెట్లకు ఆటలే లోకం. అదే వారికి జీవనోపాధి కూడా. ప్రాథమిక విద్యతో పాటే చిన్నప్పటి నుంచి కఠోర శ్రమతో చాలా మంది నిరుపేదలే క్రీడల్లో స్టార్లుగా ఎదుగుతారు. చైనా ప్రభుత్వం పతకాలు నెగ్గిన అథ్లెట్లకు భారీ ప్రోత్సాహకాలు ఇస్తుంది. దీంతో, క్రీడలను చైనీయులు అద్భుతమైన కెరీర్‌గా భావిస్తారు. చైనాలో అథ్లెట్లకు, క్రీడా సంఘాలకు మధ్య మంచి సమన్వయం ఉంటుంది. అందుకే, క్రీడాకారులంతా తమ లక్ష్యంపైనే గురిపెడతారు. అధికారులు వారికి కావాల్సినవి అందేలా చూస్తారు. మనదేశంలో ఇవన్నీ లోపించడం వల్లే ఏ దశలోనూ మనం వారిని అందుకోలేకపోతున్నాం. మన ఆలోచన, ఆచరణ మారినప్పుడే ఆటల్లో భారత అభివృద్ధిని చూస్తాం.

|| ఆటగాళ్లదీ తప్పే ||
దేశానికి పతకాలు రావడం లేదంటే అందులో అథ్లెట్ల పాత్రా ఉంది. ఇష్టమైన క్రీడాంశాన్ని ఎంచుకొని, నామమాత్రపు సదుపాయాలున్నా కఠోర సాధనతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అథ్లెట్లు ఒలింపిక్‌ పతకం మాట అటుంచి ఆ పోటీలకు అర్హత సాధించడాన్ని మాత్రమే అంతిమ లక్ష్యంగా భావిస్తున్నారు. విశ్వక్రీడలకు అర్హతనే ‘ఎవరె్‌స్ట’గా భావిస్తూ అనంతరం రిలాక్స్‌ అవుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. అంతర్జాతీయ ఈవెంట్లకు, వీలైతే ఒలింపిక్స్‌కు అర్హత సాధించి...అదృష్టం కలిసొచ్చి ఓ పతకం నెగ్గారంటే చాలు.. ఓ సర్కారు కొలువు, ఇంటి స్థలం వాలిపోతాయి. జీవితంలో హాయిగా సెటిలవ్వొచ్చు అనే ‘కంఫర్ట్‌జోన్‌’లో బందీ అవుతున్నారు. ప్రపంచంలోనే మేటి క్రీడాకారునిగా ఎదగాలనే అంతిమ లక్ష్యాన్ని వదిలి తమకు తెలియకుండానే ఇక చాలనుకుంటున్నారు.

|| చాంపియన్ల కార్ఖానాలు..||

చైనాలో 4000 స్పోర్ట్స్‌ స్కూళ్ల నుంచి ఇప్పటికే 4 లక్షల మంది చిన్నారులను భావి చాంపియన్లుగా తీర్చిదిద్దుతున్నారు. చిన్నారులంతా తమదేశ ఖ్యాతిని పెంచేందుకు నిత్యం శ్రమిస్తున్నారు. బీజింగ్‌లోని షిచాహై స్పోర్ట్స్‌ స్కూల్‌ నుంచి ఇప్పటికే 25 మంది ప్రపంచ చాంపియన్లు వెలుగులోకొచ్చారు. చైనా దక్షిణ భాగంలోని వీలన్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ వెయ్యి మంది పూర్తి స్థాయి విద్యార్థులతో ఒలింపియన్ల కర్మాగారంగా పేరొందుతోంది. చైనీయులకు క్రీడల పట్ల ఎంతటి ఆసక్తి ఉందో చెప్పేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.(ఆంధ్ర జ్యోతి)




|| అమానుషం - హృదయవిదారకం ||




వారం రోజుల వ్యవధిలో చానెళ్లలో కనబడిన వేర్వేరు దృశ్యాలు మానవత్వం గల ప్రతి ఒక్కరినీ కదిలించాయి. తొలి ఉదంతం ప్రభుత్వాసుపత్రిలో క్షయ బారిన పడి తనువు చాలించిన భార్య మృతదేహాన్ని భుజానకెత్తుకుని 60 కిలోమీటర్ల దూరం లోని స్వగ్రామానికి బయల్దేరిన ఒక నిరుపేద గిరిజనుడికి సంబంధించింది. అతని వెంట ఉబికివస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ నడుస్తున్న పన్నెండేళ్ల వారి కుమార్తె కూడా ఉంది. ఒడిశాలో ఆకలి, దారిద్య్రం విలయతాండవం చేస్తున్న కలహండి జిల్లాలోనిది ఈ ఘటన. వారిద్దరూ ప్రధాన రహదారిపై ఆ మృతదేహంతో పది పన్నెండు కిలోమీటర్లు నడిచాక పాత్రికేయుల కంటబడ్డారు కాబట్టి అది ప్రపంచా నికి వెల్లడైంది. రెండో ఉదంతం కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిందే.

బాలాసోర్‌ జిల్లాలో మరణించిన 80 ఏళ్ల వృద్ధురాలి భౌతికకాయాన్ని నడుం దగ్గర విరిచి ఒక కట్టెకు కట్టి మోసుకెళ్తున్న దృశ్యమది. యధాతథ స్థితిలో మృతదేహం తరలింపు సాధ్యం కాదు గనుక అలా చేశానని ఆ ఘోరానికి పాల్పడ్డ వ్యక్తి సంజాయిషీ ఇచ్చాడు. తన కళ్లెదుటే ఇలా జరగడం చూసి వృద్ధురాలి కొడుకు రోదిస్తుండటం కూడా ఆ దృశ్యంలో కనబడింది. మరొకటి మధ్యప్రదేశ్‌లోనిది. జబ్బుపడిన  భార్యను ఆసుపత్రిలో చేర్పించేందుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో కన్నుమూసిందని తెలియగానే ఆమె భర్తను, వారి అయిదునెలల పసికందునూ, వృద్ధురాలైన వారి బంధువునూ బస్సునుంచి గెంటేసిన ఉదంతమది. ఎడతెరపిలేని వర్షం, పైగా అటవీ ప్రాంతం... అలాంటిచోట నిర్దాక్షిణ్యంగా మృతదేహంతో సహా వారందరినీ నెట్టేస్తే ఎవరూ నోరెత్తలేదు. గంట తర్వాత అటుగా వాహనంలో వెళ్తున్న న్యాయ వాదులు వారిని గమనించి అంబులెన్స్‌ రప్పించి వారి స్వస్థలానికి చేర్చారు. ఈలోగా మృతదేహంతో ఆ ముగ్గురూ తడిసిముద్దయ్యారు.

వీటన్నిటా బాధితులు అట్టడుగు వర్గాలవారు. పూటకు గతి లేని నిరుపేదలు. ఆ ప్రాంతాలన్నీ కనీస సౌకర్యాలు కూడా కరువై చెప్పనలవికాని కష్టాలు పడు తున్నవి. ఈ ఘటనల సమయంలో యాదృచ్ఛికంగా కెమెరాలు ఉండటంవల్ల అవి బయటి ప్రపంచానికి వెల్లడయ్యాయిగానీ అక్కడ బతుకులీడుస్తున్నవారికి మాత్రం అలాంటివి కొత్తగాదు. భార్య శవాన్ని భుజాలకెత్తుకుని మధ్య యుగాల ఆవలినుంచి నాగరిక ప్రపంచంలోకి నడిచి వస్తున్నవాడిగా కనబడిన ఆదివాసి వల్ల మాత్రమే ఇప్పుడు కలహాండి ప్రాంతం వార్తలకెక్కలేదు.
కొన్నేళ్లక్రితం ఆకలిచావులతో అది మార్మోగు తూనే ఉంది.  మైనింగ్‌ కోసం వేదాంత ప్రాజెక్టుకు విలువైన అటవీభూముల్ని కట్టబెట్టడాన్ని నిరసిస్తూ గిరిజనులు కొన్నేళ్లుగా అక్కడ ఉద్యమిస్తున్నారు. పోలీసు కాల్పులు, చావులు, నిర్బంధాలు, కేసులు, జైళ్లు వారి జీవితంలో భాగమై పోయాయి. రెండేళ్లక్రితం ఇదే కలహండి జిల్లాలో వెట్టిచాకిరీ వెతల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినందుకు ఒక లేబర్‌ కాంట్రాక్టర్‌ ఇద్దరు యువ కుల చేతులు నరికి నడిరోడ్డుపై పడేసి పరారయ్యాడు. వారి ఆర్తనాదాలు విన్నవారు ఆసుపత్రిలో చేర్పించబట్టి ఆ యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. ఇవన్నీ చూసినప్పుడూ, విన్నప్పుడూ ఇంత అమానవీయమైన, అమానుషమైన సమా జంలో మనం ఉన్నామా అన్న దిగ్భ్రాంతికి లోనవుతాం.
ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం వల్ల ఒరిగిందేమిటన్న సందేహం కలుగుతుంది. అట్టడుగు, నిరుపేద వర్గా లను తాకని అభివృద్ధి వల్ల ప్రయోజనమేమిటన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇలాంటి ఉదంతాలు బట్టబయలైనప్పుడల్లా ఆవేదన చెందినట్టు, చర్యలు తీసుకుంటున్నట్టు  కనబడటం మన ప్రభుత్వాలకు మామూలే. ఆ తర్వాత మళ్లీ మరొకటేదో మీడియాలో వెల్లడై పరువు పోయాక మళ్లీ ఈ తంతు అంతా పునరావృతమవు తుంది.

ఒడిశా, మధ్యప్రదేశ్‌లు రెండూ తమ రాష్ట్రాల్లో జరిగిన ఉదంతాలపై స్పందిం చాయి. బాధ్యులైనవారిపై చర్య తీసుకున్నాయి కూడా. భార్య శవాన్ని మోసుకెళ్లిన ఉదంతంలో ఒక నర్సును సస్పెండ్‌ చేసి, ఆసుపత్రి సెక్యూరిటీ బాధ్యతలు చూస్తున్న ఏజెన్సీ కాంట్రాక్టును ఒడిశా రద్దు చేసింది. బహుశా వృద్ధురాలి శవాన్ని విరిచిన వ్యక్తిని పనిలోకి రానీయొద్దని కూడా ఆదేశాలిచ్చి ఉంటుంది. మధ్యప్రదేశ్‌ సర్కారు బస్సు డ్రైవర్‌నూ, కండక్టర్‌నూ అరెస్టు చేసింది. బస్సు పర్మిట్‌ను రద్దు చేసింది. ఈ అరకొర చర్యలే వ్యవస్థనంతటినీ ప్రక్షాళన చేస్తాయా? మారుమూల ప్రాంతాలకు వైద్య సౌకర్యాలనూ, రవాణా సదుపాయాలనూ కల్పించలేని తమ అశక్తత మాటేమిటి? వెనకబడిన ప్రాంతాలనూ, దారిద్య్రరేఖకు దిగువు నున్నవారిని అదే స్థితిలో శాశ్వతంగా ఉంచేసిన తమ చేతగానితనం సంగతేమిటి? అందుకు సిగ్గుపడాల్సింది పోయి, బహిరంగ క్షమాపణ అడగాల్సిందిపోయి కింది స్థాయి వ్యక్తులపై చర్య తీసుకుంటే సరిపోతుందా? నిజానికిది ఒడిశా, మధ్యప్రదేశ్‌లకు పరిమితమైంది కాదు. కొంతకాలం క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ప్రభుత్వా సుపత్రిలో ఒక శిశువును మూషికాలు కొరికి చంపేస్తే... విజయవాడ ప్రభుత్వాసు పత్రిలో చీమలు కుట్టి మరో శిశువు కన్నుమూసింది. అప్పుడూ ఇలాగే కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. బట్టబయలు కానంతవరకూ బాగున్నట్టు భ్రమింపజేయడం, వెల్లడయ్యాక కపటనాటకా లాడటం పాలకులు సాగిస్తున్నంత కాలమూ ఈ స్థితి మారదు. (సాక్షి)

|| సామ్రాజ్యవాద అమెరికాకు భారత్ సైనిక భాగస్వామ్యం..! ||



 -- యుద్ధ సామగ్రి మరమ్మతు, సరఫరాలకు లాజిస్టిక్‌ ఒప్పందం
 -- అమెరికాకు భారత్ సైనిక స్థావరాల వినియోగానికి  ఎర్ర తివాచి
 -- అమెరికా యుద్ధ వ్యూహాలకు మోదీ ప్రభుత్వం దాసోహం
 -- భారత వ్యూహాత్మక స్వాతంత్య్రానికి ప్రమాదం

భారత్‌, అమెరికాలు తమ సైనిక స్థావరాలను పరస్పరం ఉపయోగించుకునేందుకు ఉద్దేశించిన వ్యూహాత్మక ఒప్పందంపై మంగళవారం సంతకాలు చేశాయి. 'లాజిస్టిక్స్‌ ఎక్స్‌ఛేంజ్‌ మెమోరాండం ఆఫ్‌ అగ్రిమెంట్‌ (లెమోవా)'గా పిలుస్తున్న ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల సైనిక స్థావరాలలో పరస్పరం యుద్ధ సామగ్రి మరమ్మత్తు, సరఫరా, ఇంధనం నింపుకోవడం వంటివి ఇకపై అధికారికంగా సాగిపోతాయి. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భారత రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌, అమెరికా రక్షణ మంత్రి ఎష్టన్‌ కార్టర్‌ల భేటీ తర్వాత ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. నిజానికి, గత ఏప్రిల్‌లో కార్టర్‌ భారత్‌ పర్యటనకు వచ్చినప్పుడే ఈ ఒప్పందంపై సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందం ఫలితంగా ఇరు దేశాల సైన్యాలు కలిసిమెలిసి పని చేయడం సులువవుతుందనీ, అయితే ఇది ఇరు దేశాల ఆమోదంతోనే జరుగుతుందనీ అమెరికా రక్షణ మంత్రి కార్టర్‌ అన్నారు. అట్లాగే, ఈ ఒప్పందం ద్వారా ఇరు పక్షాల్లో ఎవరికీ మరో దేశపు స్థావరాల్లో సైనికులను మోహరించడానికి అనుమతి లభించదని కార్టర్‌, పారికర్‌లిద్దరూ స్పష్టం చేశారు. భారతదేశంలో ఈ ప్రతిపాదనలను వామపక్ష పార్టీలు తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం గత దశాబ్ద కాలంగా అమెరికాతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. వామపక్ష పార్టీల ఒత్తిడితోనే మునుపటి యూపీఏ ప్రభుత్వం దీన్ని వాయిదా వేస్తూ వచ్చింది. చివరకు మోడీ ప్రభుత్వం దేశ ప్రయోజనాలను లెక్క చేయకుండా ఈ ఒప్పందానికి సై అంది. దీని ద్వారా భారత్‌ తాను చిరకాలంగా కట్టుబడి వున్న అలీన విధానం నుంచి వైదొలిగినట్టు అవుతుందన్నది కూడా పలువురి విమర్శ.

|| పెద్దన్నతో పీటముడులు ||

గత దశాబ్ద కాలంలో భారత్‌, అమెరికాల మధ్య సైన్య సంబంధాలు బాగానే గట్టిపడ్డాయని చెప్పవచ్చు. ప్రస్తుతం అమెరికా భారత్‌కు అత్యధికంగా ఆయుధ సామగ్రిని ఎగుమతి చేస్తున్న దేశంగా ఉంది. 2007 నుంచి ఇప్పటి వరకు దానికి భారత్‌ నుంచి దాదాపు 1400 కోట్ల డాలర్ల (రూ. 93,897 కోట్లు) కాంట్రాక్టులు లభించాయి. గత కొన్నేండ్లుగా భారత్‌ అన్నింటికన్నా ఎక్కువగా అమెరికాతోనే సైనిక విన్యాసాలు సాగిస్తోంది. కొద్ది నెలల క్రితమే అమెరికా భారత్‌కు కీలక సైనిక భాగస్వామి హౌదానిచ్చింది. సాధారణంగా అది ఇలాంటి హౌదాను తన సన్నిహిత మిత్రులకే ఇస్తుంది. ఈ హౌదాతో భారత్‌ ఇప్పటి వరకు తనకు అందుబాటులో లేని కీలక సైనిక సాంకేతికతను అమెరికా నుంచి పొందగలుగుతుంది. వాస్తవానికి ఇరు దేశాలు అవసరమైనప్పుడు సైనిక స్థావరాల నుంచి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూనే వున్నాయి. అయితే, ఈ ఒప్పందం ద్వారా దీనికి లాంఛనమైన ఆమోదముద్ర పడుతుంది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక సంబంధాలకు ప్రతీక అని వాషింగ్టన్‌లోని హడ్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో భారత్‌-అమెరికా సంబంధాలపై అధ్యయనం చేస్తున్న అపర్ణా పాండే అన్నారు. 'రెండు దేశాల సైన్యాధికారుల మధ్య ఇప్పటికే విశ్వాసం పాదుకొంది. ఈ ఒప్పందం దాన్ని మరింత బలోపేతం చేస్తుంది' అని ఆమె చెప్పారు. 'అమెరికాతో రక్షణ ఒప్పందాలతో కలుగబోయే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం తక్షణం ఎదురయ్యే రాజకీయ విమర్శలను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది' అని పెంటగాన్‌ అధికారి బెంజమిన్‌ ష్వార్జ్‌ అన్నారు. అయితే, అమెరికా, భారత్‌ల మధ్య బలపడుతున్న సైనిక సమన్వయం పెరుగుతున్న చైనా ప్రభావాన్ని నియంత్రించే దిశలో వేస్తున్న అడుగులేనని వాషింగ్టన్‌లోని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

|| దేశ సార్వభౌమత్వానికే తలవంపులు : సిపిఎం ||

భారత్‌, అమెరికాల మధ్య కుదిరిన లాజిస్టిక్స్‌ సపోర్ట్‌ ఒప్పందాన్ని సిపిఎం పొలిట్‌బ్యూరో ఖండించింది. ఇది అమెరికన్‌ సాయుధ బలగాలకు భారత సైనిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు వీలు కలిగిస్తుందని అది ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా భారత్‌ అమెరికాకు సైనిక భాగస్వామిగా మారినట్టేనని పార్టీ పేర్కొంది. 'ఈ ఒప్పందం మాటున అమెరికా సైన్యాలు యుద్ధసామగ్రి అవసరాలు, ఇంధనాన్ని నింపుకోవడం, ఇతర సేవల కోసం భారత నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ స్థావరాలను నిరంతరం ఉపయోగించుకోగలుగుతాయి. బడుగుదేశాలపై యుద్ధాలు చేసేటప్పుడు అమెరికా సైన్యాలు భారత సైనిక స్థావరాలను ఇంధనం, మరమ్మత్తు వంటి అవసరాలకు వాడుకోగలుగుతాయి' అని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన సామ్రాజ్యవాద దేశంతో ఇలాంటి ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా మోడీ ప్రభుత్వం భారత సార్వభౌమత్వాన్ని అపహాస్యం చేసిందని, దేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని సైతం తాకట్టు పెట్టిందని పొలిట్‌బ్యూరో ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా ముందు ఇలా మోకరిల్లడాన్ని దేశభక్తి గల భారతీయులంతా వ్యతిరేకించాలని అది విజ్ఞప్తి చేసింది.

|| అమెరికా తోకపట్టుకొని పోకండి : చైనా హితవు ||

చైనా దినపత్రిక  'గ్లోబల్‌ టైమ్స్‌' సంపాదకీయంలో మాత్రం అమెరికా తోకపట్టుకొని పోవడం భారత్‌కు శ్రేయస్కరం కాదంటూ కుండబద్దలు కొట్టింది. ఇలా అమెరికాకు అనుయాయిగా మారడం ద్వారా భారత్‌ తన వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అందులో రాసింది.

Tuesday, 30 August 2016

|| హిందూత్వ 'అభివృద్ధి' డొల్లతనం - రైతుల ఆత్మహత్యలు ||



వ్యవసాయ రంగం లో 'సమగ్రాభివృద్ధి'ని సాధించేందు కు రైతు సంక్షేమంపై దృష్టి సారిస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోడీ తన స్వాతంత్య్ర దినోత్సవ ఉపన్యాసంలో తనను, తన ప్రభుత్వాన్నీ తానే అభినందించుకున్నారు. మూడు ప్రధాన స్తంభాలపై ఈ అభివృద్ధి నమూనా ఆధారపడి ఉన్నది. 2016వ సంవత్సరపు ఆర్థిక సర్వేలో పేర్కొన్నట్టు చిల్లర వర్తకంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమ తించటం ద్వారా మౌలిక వసతులను అభివృద్ధి చేసి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను ఐక్యం చేయటం మొదటిది. గతంలోని వ్యవసాయ బీమా పథకాన్ని ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పేరుతో పునః ప్రవేశపెట్టటం రెండవది. మెట్ట ప్రాంతాలలో నీటి పారుదలను విస్తృతపరచటం మూడవది. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించటానికి ఈ ద్రవ్య, మార్కెట్‌ సాధనాలను సమిష్టిగా ఉపయోగించటమే వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ పరిష్కారం అని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం భావిస్తున్నది. అయితే మధ్య, దీర్ఘకాల ప్రభుత్వ ప్రణాళికలలో ప్రభుత్వం ఈ దృక్పథాన్ని అవలంబించడం ద్వారా ప్రస్తుతం సంభవించనున్న సంక్షోభాన్ని విస్మరిస్తున్నది. స్వరాజ్‌ అభియాన్స్‌ పిటిషన్‌ పేర్కొన్నట్టుగా గతించిన అనేక దశాబ్దాలలో దేశంలో ఎన్నడూ లేనంతగా 54 కోట్ల మంది ప్రజలు తీవ్ర స్థాయి కరువుతో గిలగిలా కొట్టుకుంటున్నారు. దీనివల్లనే 2014-2016 మధ్య కాలంలో రైతు ఆత్మహత్యలు 40 శాతం పెరిగాయి. 'కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి' అని ఈ ప్రభుత్వంలోని మంత్రులు బహిరంగ ప్రకటనలు చేస్తూ ఈ ఆత్మహత్యలను పట్టించుకోవటం లేదు. రైతు ఆత్మహత్యలను పట్టించుకోకపోవడమనేది ప్రధాని వార్షిక అంచనాలోనూ, దేశ ఆర్థిక సర్వేలోనూ స్పష్టంగా కనబడుతున్నది.

|| రైతు ఆత్మహత్యల గణన ||
రైతు ఆత్మహత్యలకు సంబంధించిన లెక్కలు సమగ్రంగా లేవనేది అందరికీ తెలిసిందే. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో కేవలం పురుష రైతుల ఆత్మహత్యలనే లెక్కిస్తున్నది. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా 2014 వరకు అలాంటి విషయం ఒక అంశంగా కూడా లేదు. అంతేకాకుండా రైతుల ఆత్మహత్యల వర్గీకరణలో భూమి యాజమాన్యం గల రైతులనే పరిగణనలోకి తీసుకోవాలనే ఉప వర్గీకరణను సృష్టించి ఈ సమస్యను మరింతగా నీరుగార్చారు. ఆత్మహత్యలకు గల కారణాలను 'రుణ భారం', 'కుటుంబ సమస్యలు', 'వ్యవసాయానికి సంబంధించిన కారణాలు'గా వర్గీకరించి మరింత గందరగోళాన్ని సృష్టించారు. ఇలా కారణాలను వర్గీకరించటం వల్ల ఈ మూడు కారకాల మధ్యగల అంతస్సంబంధం మరుగున పడిపోయి రైతులు ఆత్మహత్య చేసుకోవటానికి కారణం వ్యవసాయ రంగాన్ని నిస్పృహ ఆవహించటం కాదనే భావన కలగటానికి దారితీస్తున్నది. ఈ నిర్ధారణ మౌలికంగా తప్పుల తడక. ఎందుకంటే వ్యవసాయ రంగంలో నిస్పృహ వల్ల సామాజిక ఉద్రిక్తతలు తీవ్రతరమై అది రైతులు ఆత్మహత్య చేసుకోవటానికి దారితీస్తుంది. ప్రత్యేకంగా 1995 తరువాత రైతుల ఆత్మహత్యలు పెరగటాన్ని మరోలా ఎలా వివరించగలుగుతాము? వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో వ్యవసాయ మార్కెట్లలో పరిమాణాత్మక పరిమితులను తొలగించి రైతులను ప్రపంచ మార్కెట్‌, బడా కార్పొరేట్‌ కంపెనీల దయాదాక్షిణ్యాలకు వదలివేయటం, రైతుల ఆత్మహత్యలు పెరగటం ఒకే కాలంలో జరగటం యాదృచ్ఛికం కాదు. అప్పటి నుంచి ఈ ధోరణి పెరుగుతూ వస్తున్నది. రైతుల ఆత్మహత్యలు 40 శాతం పెరిగాయని రాజ్యసభలో ప్రభుత్వమే అంగీకరించింది. రైతులు అత్యధికంగా ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లు ముందు వరుసలో ఉన్నాయి. అయితే 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవటానికి కారణం వ్యవసాయ రంగంలో నిరాశానిస్పృహలనే విషయాన్ని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం అంగీకరించటం లేదు. 2013-2014 మధ్య కాలంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అందుబాటులోకి వచ్చిన సమాచారం తెలుపుతున్నది.
అన్ని రాష్ట్రాలలోకెల్లా బిజెపి పాలిత రాష్ట్రమైన గుజరాత్‌ అందిస్తున్న సమాచారం చాలా అస్పష్టంగా ఉన్నది. 2013లో ఒకే ఒక్క రైతు గుజరాత్‌లో ఆత్మహత్య చేసుకున్నాడని లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే 2015 జులై 24న రాజ్యసభలో 23వ నంబరు ప్రశ్నకు సమాధానంగా గుజరాత్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య 582 అని చెప్పారు. కౌలుదారులను గుజరాత్‌ ప్రభుత్వం లెక్కలోకి తీసుకోలేదనేది సుస్పష్టం. ఆత్మహత్య చేసుకునే రైతులలో చాలామంది కౌలుదారులే. చిన్న స్థాయి ఉత్పత్తిని కూడా కాంట్రాక్టులతో నియంత్రించే కార్పొరేట్‌ దగా గుజరాత్‌ నమూనాగా కొనసాగుతున్న రాష్ట్రంలో ఆత్మహత్యలు మరీ ఎక్కువగా ఉండటం సహజం. ఆత్మహత్యలపై ప్రస్తుతం తాజా సమాచారం అందుబాటులో లేనప్పటికీ 2015 మార్చి తరువాత రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నారని భావించటానికి కావలసినన్ని ఆధారాలున్నాయి. బిజెపి పాలిత మహారాష్ట్రలో ఆత్మహత్యలు 40 శాతం వరకూ పెరిగాయి. ఇది కాంగ్రెసు పాలిత కర్ణాటకలో కంటే ఎక్కువ. రైతుల ఆత్మహత్యలలో మూడింట రెండు వంతులు బిజెపి పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌ఘఢ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్రలలోనే జరిగాయి. దీనికి కారణం ఈ రాష్ట్రాలు కార్పొరేట్‌ వ్యవసాయాన్ని ప్రవేశపెట్టటంలో చాలా దూకుడును ప్రదర్శించటమే. అయితే 'వ్యవసాయ సంబంధిత కారణాల వల్ల' ఈ ఆత్మహత్యలు జరుగు తున్నాయని వీటిలో ఏ ఒక్క రాష్ట్రమూ అంగీకరించటం లేదు. ఉదాహరణకు బ్రూక్‌లిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో చేసిన అధ్యయనం ప్రకారం ఆత్మహత్య చేసుకుంటున్న రైతులలో చాలామంది కుంగుబాటు, మానసిక అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకుంటు న్నారు. కాబట్టి సమస్య పరిష్కారానికి డబ్బు సహాయం కంటే కౌన్సిలింగ్‌ అవసరమే ఎక్కువగా ఉన్నదని ఆ అధ్యయనం పేర్కొన్నది. ఈ తప్పుత్రోవపట్టించే తోలుమందం విశ్లేషణకు అదనంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులలో మెజారిటీ 'విఫల ప్రేమ, మాదక ద్రవ్యాల వాడకం, నపుంసకత్వం వంటి కారణాల చేతనే ఆత్మహత్య చేసుకుంటున్నారు' అని ప్రస్తుత వ్యవసాయ మంత్రి చెబుతున్నారు. దీనివల్ల సమస్య తీవ్రతను తక్కువ చేసి చూపటమే కాకుండా ప్రభుత్వం ఈ సమస్య పట్ల ఏమాత్రం ఆందోళన చెందటం లేదని స్పష్టమవుతున్నది.  - అర్చనా ప్రసాద్‌

|| 2న సమ్మెయథాతథం ||


 సమ్మెను నీరుగార్చేందుకు కేంద్రం కుట్ర
 కేంద్రమంత్రులవి మోసపూరిత ప్రకటనలు
 కనీస వేతనం ఆమోదించామన్నది పూర్తి అబద్ధం : తపన్‌సేన్‌
 సమ్మెతోనే సర్కారుకు సమాధానం : సిఐటియు
 వెనక్కి తగ్గేది లేదు : ఐఎన్‌టియుసి ||

కేంద్ర కార్మిక సంఘాలు సెప్టెంబర్‌ 2న తలపెట్టిన సమ్మె యథాతథంగా కొనసాగు తుందని సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ స్పష్టం చేశారు. కనీస వేతన సలహా కమిటీ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించిందన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ ప్రకటన పూర్తి అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లను కేంద్రం అంగీకరిం చిందని కేంద్రమంత్రుల బృందం మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కార్మిక సంఘాల కనీస వేతనంతో పాటు పలు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందన్న ప్రకటన మోసపూరితమని, పరిహాసంగా ఉందని తపన్‌సేన్‌ విమర్శించారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, పెట్రోలియం, విద్యుత్తు శాఖ మంత్రి పియూష్‌గోయల్‌ నేతృత్వంలోని మంత్రుల బృందం మంగళవారం నార్త్‌బ్లాక్‌లో విలేకరుల సమావేశం నిర్వహించింది. కేంద్ర కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించిందని, కాబట్టి సెప్టెంబర్‌ 2న సమ్మె చేపట్టాల్సిన అవసరం లేదని జైట్లీ ప్రకటించారు. ఈ ప్రకటనపై సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్మికులను మోసపుచ్చేందుకే ప్రభుత్వం ఇలాంటి ప్రకటన చేసిందని ఆయన విమర్శించారు.


|| గందరగోళం సృష్టించేందుకు ప్రభుత్వం కుట్ర ||
కనీస వేతన సలహా కమిటీ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించిందన్న ప్రకటన పూర్తి అవాస్తవమని తపన్‌సేన్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు. 'కార్మిక సంఘాలతో కనీస వేతన సలహా కమిటీ ఆగస్టు 30వ తేదీన మూడు గంటలకు సమావేశమయ్యింది. కనీస వేతనం రూ. 18,000 చెల్లించాలని కార్మిక సంఘాలు తమ డిమాండ్‌ను మరోసారి పునరుద్ఘాటించాయి. కానీ సమావేశంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండానే అసంపూర్తిగా ముగిసింది. ప్రభుత్వం మాత్రం ఉద్దేశపూర్వకంగా కార్మికులను తప్పుదారి పట్టించేందుకు, గందరగోళపరిచేందుకు ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేసింది' అని విమర్శించారు. ప్రభుత్వం రోజువారి కనీసవేతనం రూ.350 ప్రకటించి(నెలకు (26 రోజులకు) మొత్తం రూ.9100) కార్మికుల డిమాండ్లను అంగీకరించామని ప్రకటించడం పెద్ద జోక్‌గా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గత సంవత్సరం బోనస్‌ విడుదల చేయడంలో ప్రభుత్వ ఔదర్యమేమీ లేదని పేర్కొన్నారు. బోనస్‌ చట్టం అమలుకు సంబంధించి కోర్టు కేసులను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతనని స్పష్టం చేశారు. ఇక 45 రోజుల్లో కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రాష్ట్రాలకు కావాల్సింది కేంద్ర సూచనలు కాదని, చట్టబద్ధమైన ఆదేశాలని వివరించారు. అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశాలు వాలంటీర్లని జైట్లీ ప్రకటించడాన్ని కూడా తపన్‌సేన్‌ తప్పుపట్టారు. ఎన్డీయే హయాంలో జరిగిన 46వ ఇండియన్‌లేబర్‌ కాన్ఫరెన్స్‌(ఐఎల్‌సీ)లో స్కీంవర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలన్న మునుపటి ఐఎల్‌సీ ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదించారని గుర్తు చేశారు. ఇక స్కీం వర్కర్లకు సామాజిక భద్రత కల్పించడంపై కమిటీని ఏర్పాటు చేస్తామని యేడాదిగా ఇదే ప్రకటన చేస్తున్నారని విమర్శించారు. కేవలం ప్రజలను, కార్మికులను తప్పుదారి పట్టించేందుకే కేంద్రమంత్రులు విలేకరుల సమావేశం నిర్వహించారని దుయ్యబట్టారు. ప్రభుత్వ మోసపూరిత ప్రకటనలను, కుట్రలను సమ్మె విజయవంతం చేసి తిప్పికొడతామని పేర్కొన్నారు.

|| కేంద్రం కుయుక్తులు ||
పన్నెండు అంశాలతో కూడిన డిమాండ్ల పత్రాన్ని జాతీయ కార్మిక సంఘాలు మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం ముందుంచాయి. ఆ నెలలోనే జరిగిన జాతీయ కన్వెన్షన్‌లో సెప్టెంబరు 2న దేశవ్యాప్తంగా సమ్మె జరపాలని నిర్ణయించాయి. కాని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలు జరపలేదు. బిజెపి అనుబంధ కార్మిక సంఘమైన బిఎంఎస్‌ నాయకులతో మాత్రం రెండు సార్లు చర్చలు జరిపింది. జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన డిమాండ్లను వారు చర్చలో లేవనెత్తారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. కార్మిక సంఘాల డిమాండ్లపై ఇప్పటికి వరకు చలించని ప్రభుత్వం, ఉన్నట్టుండి ఒక్కసారిగా హడావుడి చేస్తోంది. సమ్మెపై గందరగోళం సృష్టిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ నేతృత్వంలోని మంత్రుల బృందం ప్రధాన మంత్రి మోడితో భేటీ అయ్యింది. ఎలాగైనా సమ్మె ఆపాలని మోడీ వారికి సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అందులో భాగంగానే మంగళవారం కేంద్ర మంత్రుల బృందం కార్మిక సంఘాల డిమాండ్లును అంగీకరిస్తామని ప్రకటించింది. మరోవైపు ప్రభుత్వ వైఖరితో బిఎంఎస్‌ అయోమయంలో పడింది.

|| ఇప్పటికే డిమాండ్లు నెరవేర్చాం: బండారు దత్తాత్రేయ ||
కార్మిక సంఘాలు ఇచ్చిన డిమాండ్లు ఇప్పటికే నెరవేర్చామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. సెప్టెంబర్‌2న తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని కార్మిక సంఘాలను కోరారు. కార్మిక సంఘాలు సమర్పించిన ఎనిమిది డిమాండ్లుల్లో ఏడిటిని ఇప్పటికే నెరవేర్చినట్లు తెలిపారు. దినసరి కూలీల వేతనం రు.350లుగా నిర్ణయించామన్నారు. 2014-15 బోనస్‌ విడుదలకు అంగీకరిస్తామన్నారు. కార్మికుల సంక్షేమమే తమకు ముఖ్యమని చెప్పారు.

|| వెనక్కి తగ్గేది లేదు: సంజీవ్‌ రెడ్డి, ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షులు ||
ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా సమ్మె నుంచి వెనక్కి తగ్గేది లేదని ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షులు సంజీవ్‌ రెడ్డి స్పష్టం చేశారు. కనీస వేతనం రు.18వేలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించ వద్దని, కార్మిక చట్టాలను మార్చవద్దని సమ్మె చేస్తున్నామని పేర్కొన్నారు.

మీడియా సమావేశంలో  కేంద్రమంత్రుల బృందం వెల్లడించిన వివరాలు :-
- బోనస్‌ సవరణ చట్టాన్ని నిష్కర్షగా అమలు చేస్తాం. 2014-15, 2015-16కు సంబంధించిన బోనస్‌ను            ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందుకు సంబంధించి తక్షణమే నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం.
- బోనస్‌ చెల్లింపులపై హైకోర్టు, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు కేంద్రం చర్యలు చేపడుతుంది.
- కనీస వేతన సలహా బోర్డుతో సంప్రదింపుల అనంతరం నైపుణ్యంలేని, వ్యవసాయేతర కార్మికులకు రోజు వారి వేతనం రూ.350గా ప్రభుత్వం నిర్ణయించింది.
- కాంట్రాక్టు కార్మికుల రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచిస్తాం.
- అసంఘటిత రంగ కార్మికులైన(అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా వర్కర్లకు) సామాజిక భద్రత కల్పించే అంశంపై ఒక కమిటీ పరిశీలిస్తోంది. త్వరలో నివేదిక సమర్పిస్తుంది.
- 45 రోజుల్లో కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచిస్తాం.
- త్రైపాక్షిక సంప్రదింపుల ప్రక్రియను కొనసాగిస్తాం.
- పరిశ్రమలకు సంబంధించిన అంశాలను పరిష్కరించేందుకు సెక్టార్ల వారిగా ప్రత్యేక సమావేశాలు నిర్ణయిస్తాం.

|| కరుణలేని పాలనలో కన్నీటి ధారలు ||


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు పాలనలో నిర్దయ కనిపిస్తుంది. పైపై ఆడంబరాలకు పోయి రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు. రాష్ట్రమంతా కరువుతో విలవిల్లాడు తోంది. విషజ్వరాలతో ఊళ్ళకు ఊళ్ళు మంచాన పడ్డాయి. సాగునీరు, తాగునీరు లేక ప్రజలు వలస బాట పట్టారు. దుర్భిక్షంతో మేఘాలు తెల్లబోయి, జీవితాలు డొల్లబోయి రైతులు, వ్యవసాయ కార్మికులు కన్నీరు కనుకొలకుల్లో ఇంకిపోయి నిర్భాగ్యంగా ఆకాశం వైపు చూస్తున్నారు. చంద్రబాబును మనోవిశ్లేషకులు ఆర్ధ్రత, కరుణ లేని మనిషిగా వ్యాఖ్యానిస్తున్నారు. భావోద్వేగాలు లేని మనిషి పాలకుడైతే దుఃఖపడాల్సిన చోట కూడా కఠినంగానే ఉంటాడని మనోవిశ్లేషకులు చెబుతున్నారు. రూ.1.36 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ కలిగిన రాష్ట్రంలో ప్రజలు మంచాన పడితే నాలుగు మాత్రలు ఇవ్వలేని దుస్థితి ఎందుకు వచ్చింది? చంద్రబాబు పుట్టింది రాయల సీమలో. ఈనాడు రాయలసీమ పరిస్థితి ఏమిటి? అనంతరపురం జిల్లాలో పన్నెండు లక్షల ఎకరాల్లో వేరుశనగ ఎండిపోయింది. అసలు అనంతపురం జిల్లాలోని సాగుభూమి 24 లక్షల ఎకరాలు. అందులో 20 లక్షల ఎకరాల్లో వేరుశనగ వేశారు. 15 లక్షల ఎకరాల్లో పంట వాడిపోతుంది. 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. వ్యవసాయం కోసం రైతులు వాడుకునే ట్యాంకర్లు, రెయిన్‌గన్లు, డ్రిప్‌, పైపులన్నీ మూలబడిపోయాయి. కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నం అవుతోంది. దారిద్య్రంలోకి ప్రజలు నెట్టబడి, ఉన్న కొంప, గొడ్డు అమ్ముకొని రైతులు కూలీలుగా మారుతుంటే, వ్యవసాయ కార్మికులైన దళితులు ఊళ్ళు విడిచి ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోతుంటే, తన భజంత్రీల ద్వారా ముఖ్యమంత్రి బాకాలు ఊదించుకొంటూ పుష్కరాల పేరుతో కోట్ల రూపాయలు బుగ్గిపాలు చేసి నిమ్మకు నీరెత్తినట్టుగా తనకు అనుకూలమైన పత్రికల్లో 'అంతా సుభిక్షంగా ఉంది' అని ప్రకటనలిస్తున్నారంటే ఎంత కరుణరహితమైన భావనతో ఆయన వాస్తవాలను చూసే పరిస్థితి నుంచి ఒక అంధత్వంలోకి జారిపో తున్నారో అర్థం చేసుకోవాల్సి ఉంది. అసలు మేము ప్రత్యేకాంధ్రను కోరడంలో ముఖ్యోద్దేశం పరిపాలన హైదరాబాద్‌ చుట్టుపక్కలకు పరిమితం అవుతోంది. రెండు రాష్ట్రాలు ఏర్పడితే పరిపాలన ప్రజల దగ్గరకు ముఖ్యంగా నిర్లక్ష్యం చేయబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమలకు విస్తరించాలని కోరుకొన్నాం. మరోపక్క ఉత్తరాం ధ్రలో పరిశ్రమలు ఒక్కొక్కటీ మూతబడుతూ కార్మికులు నిర్భాగ్యులవుతున్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పది జూట్‌ మిల్లులు, 14 ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలు మూతబడుతూ వస్తున్నాయి. విజయనగరం, కొత్తవలస, బొబ్బిలి, సాలూరుల్లో జూట్‌ మిల్లులు మూతబడటంతో కార్మికులు రోడ్డున పడ్డారు. అతి పెద్ద మ్యాంగనీస్‌ ఫ్యాక్టరీ, గవిడిలో పెట్రో అల్లాయిస్‌ ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. ఈ ఫ్యాక్టరీల మూసివేతకు కారణం విద్యుత్తు ఛార్జీలు యూనిట్‌కు రూపాయిన్నర పెరగడం. ఒక టన్ను ఉత్పత్తి చేస్తే రూ.8 వేలు సంస్థకు నష్ట వస్తుండటంతో మూసేస్తున్నామని యజమానులు చెబుతున్నారు. ఈ సందర్భంగా 20 వేల మంది కార్మికులు ఈ సంవత్సరం ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇతర దేశాల పెట్టుబడిదారులకు 13 జిల్లాల్లో ఏ భూమి అమ్ముకోవాలి, తాకట్టుపెట్టాలి అని ఆలోచించడం తప్ప ఆయన రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో ఎన్ని రోజులు నివసిస్తున్నారు. అక్కడ ఆర్థిక, సాంఘిక పరిస్థితులు ఏమి పరిశీలిస్తున్నారు? ఆలోచిస్తే శూన్యం. ముఖ్యమంత్రి రాజకీయ అనిశ్చితిలో ఉండి ఆ పార్టీ నుంచీ, ఈ పార్టీ నుంచీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా రాజకీయంగా బలపడాలని చూస్తున్నారు. అందువల్ల ప్రజల ఆకలి బాధలు తీరుతాయా అని ఆయన ఆలోచించాల్సి ఉంది. ఒక పక్క కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జ్వరాల వ్యాప్తి విపరీతంగా పెరుగుతోంది. ప్రాథమిక వైద్యశాలలు నరక కూపాలు అయిపోయాయి. కార్పొరేట్‌ వైద్యం వ్యాపారమయం అయ్యింది. జ్వరం అని వెళ్తే ప్లేట్‌లెట్లు పడిపోయాయని డబ్బు దండుకుంటున్నారు. ప్రతి ప్రభుత్వ డాక్టర్‌ ఒక ప్రయివేట్‌ వైద్యశాల లేకపోతే కార్పొరేట్‌ వైద్యశాలలో అదనపు వృత్తి. పెద్ద పెద్ద కార్పొరేట్‌ వైద్యశాలల నిర్మాణానికై మైనారిటీల ఆస్తులు లీజులకు తీసుకోవడం, దళితుల అసైన్డ్‌ భూములను ఆక్రమించడం చేస్తున్నారు. చివరికి ఎవరి భూములు ఆక్రమించారో వారికి అక్కడ వైద్య సౌకర్యం మృగ్యం. చంద్రబాబు అగ్రకులాల్లోని ధనవంతులకు మేలు జరిగే పద్ధతిలో ఆలోచిస్తున్నారు. తాను, తన అనుయాయులు ఎంత దోపిడీ చేసినా ప్రజలు తనకే ఓటు వేస్తారని, ఎన్నికలు నాలుగు రోజులు ఉన్నాయనగా డబ్బు, మందు పంచితే వెనకటివన్నీ మర్చిపోయి మళ్ళీ అధికార పార్టీకే వేస్తారని ముఖ్యమంత్రి భరోసా. నిజానికి ఓటు చాలా విలువైంది. కానీ ఆ ఓటును ప్రజలు సులువుగా అమ్ముకుంటున్నారు. వామపక్ష, అంబేద్కర్‌వాద పార్టీలు స్వాతంత్య్ర కాలం నుంచీ ఉన్నాయి. ఎన్నో పోరాటాలు చేసి వీరు ప్రజలకు ఎన్నో హక్కులు సాధించారు. కానీ ఎన్నికల్లో ప్రజలు వీరికి ఓటువేయడం లేదు. కారణం ఏమిటి? వామపక్షవాదులు, అంబేద్కర్‌వాదులు ప్రజలకు చైతన్యవం తంగా ఓటును ఉపయోగించుకోవడాన్ని నేర్పలేకపోయారు. రాజ్యాధికార భావన ప్రజల్లో చైతన్యం తెస్తుంది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తంగా రెండు కులాలు పాలిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ పరిశ్రమలు, విద్యాలయాలు, భూములు అన్నీ ఈ కులాల చేతుల్లోనే ఉన్నాయి. బహుజనుల జనాభా 85 శాతం ఉంది. రాను రాను దళిత, బహుజన, మైనార్టీలు అణగారిపోతున్నారు. స్వాతంత్య్రానంతరం ప్రధానంగా తమ పిల్లలను చదివించు కోవాలనే కాంక్ష బలంగా ఉంది. అయితే ఇంకా ఈ వర్గాల్లో 40 శాతం పైగా ప్రజలు నిరక్ష్యరాసులుగానే ఉన్నారు. అక్షరం నుంచి చైతన్యం వీరికి అందడం లేదు. ప్రాథమిక విద్యపై ప్రభుత్వం పెద్ద ఎత్తున దాడి చేస్తున్నది. నిరంతరం స్కూళ్ళు, హాస్టళ్ళు మూసివేసే పనిలో ప్రభుత్వం ఉంది. ఎన్నో స్కూళ్ళలో పిల్లలు బడికి రాలేక జ్వరాలతో మూల్గుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రాథమిక వైద్యం నానాటికీ కుంచించుకుపోవడం వల్ల పిల్లలు జ్వరాలతో నీరసంగా అనాకారులవు తున్నారు.కన్న బిడ్డలు కళ్ళ ముందు శుష్కించిపోతూ, కొబ్బరినీళ్ళు, బార్లీ, ఎలక్ట్రాల్‌ పౌడర్‌ ఇచ్చుకోలేక కనీసం మంచినీళ్ళు కూడా పూర్తిగా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో తల్లులు కొట్టుమిట్టాడుతున్నారు. ఎందరో పసికందులు, వృద్ధులు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాలతో మరణిస్తున్నారు. శ్మశానాల్లో చోటులేక పూడ్చిన వారి మీదే పూడ్చుతున్నారు. ఇంటిలో యజమానికి జ్వరం వస్తే నాలుగైదు రోజులు పనికి వెళ్ళలేకపోతే ఇంటిలో పస్తులు. ఒక పక్క ప్రభుత్వం పుష్కరాలని, పండుగలని కోట్ల ధనం వ్యర్థంగా ఖర్చుపెడుతోంది. నవ్యాంధ్ర ప్రజలు తమ కన్నీటికి కారణాలు తెలియక ఏ దేవుడో కారణం అనుకొని మొరపెట్టుకొంటున్నారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడే భక్తి పెరుగుతుంది. మరో పక్క ధనవంతులు తమ సంపదను పేద ప్రజలకు వడ్డీలకిచ్చి, మందుల షాపులు నడుపుతూ కోట్లకు పడగలెత్తుతున్నారు. రాజకీయ నాయకులు గూండాలను మేపుతూ దందాలు చేస్తూ, పైరవీలు చేస్తూ, కత్తి, తుపాకీ చూపించి నిరాధారమైన ప్రజలను బెదిరించి డబ్బు గుంజి స్థలాలు, పొలాలు, ఇళ్ళు అక్రమంగా రాయించుకొంటూ బ్రతుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో కులాధిపత్య దోపిడీ ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయ రాజ్యాధికార భావన ప్రజల్లో పెరగాలి. అంబేద్కర్‌ రాజకీయ ఆలోచనల ద్వారానే మనం ఈ రాజ్యాధికార భావనను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సి ఉంది. అంబేద్కర్‌ బౌద్ధ తాత్విక స్వీకరణకు, రాజకీయ పార్టీల నిర్మాణానికి, పోరాటానికి అవినాభావ సంబం ధం ఉంది. బౌద్ధ సూత్రాలలోని అహింస విధానాన్ని అంబేద్కర్‌ అభిలషించాడు. అందుకే ఆయన పార్లమెంటరీ ఎన్నికల నుండి రాజ్యాధికారాన్ని సాధించే మార్గాన్ని నిర్దేశించాడు. ఒక మనిషికి రాజకీయ విలువ ఓటు ద్వారా లభిస్తుంది. సామాజిక, ఆర్థిక సమానత్వానికి దారితీసే వరకూ ఆ పోరాటం జరగవలసిందే. ఇది ఒక పెద్ద పరిణామ క్రమం. ఈ పరిణామ క్రమం ఒక తాత్వికునికే అర్థమవుతుంది. రాజకీయ అధికారమంటే ఆధిపత్యానికో, అవినీతికో, అధర్మవర్తనకో, సంపదను పోగేసుకోవడానికో కాదు. అది మానవ పునర్నిర్మాణానికి అని అంబేద్కర్‌ ఉద్దేశం. అందుకే సంపత్తికి కేంద్రంగా కాక ఆలోచనా కేంద్రంగా ఆయన రాజకీయ పార్టీని నడిపించాడు. 1946లో రాజ్యాంగ నిర్మాణంలోకి అడుగు పెట్టినప్పుడు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసమే ఈ పనికి పూనుకున్నానని చెప్పాడు. ఆయన సిద్ధాంతపటిమ, నిరంతర అధ్యయనశీలత, పునర్నిర్మాణ దక్షత బౌద్ధతాత్వికత నుంచే వచ్చింది. తాత్వికుడు కానివాడు రాజకీయవేత్త అయితే అధికారం కోసం, ఆధిపత్యం కోసం వెంపర్లాడటం మాత్రమే జరుగుతుంది. అంబేద్కర్‌ విలువల కోసం పోరాడిన నాయకుడు. భారత రాజ్యాంగ నిర్మాణం తరువాత మొత్తం భారతదేశ ప్రజలకు మేలు చేసేవాడిగా ఆయనకు గుర్తింపు లభించింది. అగ్రవర్ణాలు చేసిన అనేక దుష్ప్రచారాలకు ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన బౌద్ధ సూత్రాలు సమాధానం చెప్పాయి. భారతదేశంలో వ్యక్తిగత కక్షలు లేని రాజకీయ నాయకునిగా అంబేద్కర్‌ నిలబడ్డాడు. గాంధీ, నెహ్రూ, పటేల్‌, రాజేంద్రప్రసాద్‌ లాంటి రాజకీయ నాయకుల్లో అనేక సందర్భాల్లో వర్ణ, వర్గ, కుల ఆధిపత్య ద్వేష స్వభావాలు బయటపడ్డాయి. ఆ స్వభావాల వల్ల అనేక సందర్భాలలో దేశం కకావికలం కూడా అయింది. అంబేద్కర్‌ లౌకికవాద వ్యక్తిత్వం ఇందుకు భిన్నమైంది. భారతదేశ పౌరులు తమ రాజ్యాంగాన్ని తాము అర్థం చేసుకోగలిగితే ప్రజలలో సమతాభావం పెరుగుతుంది. అంబేద్కర్‌ రచనల్లో జ్ఞానం ఉంటుంది. ఆయనొక జ్ఞాన స్రవంతి. ఆయనొక విజ్ఞాన సర్వస్వం. ఆయనొక సందర్భంలో మామూలు మనిషి చిన్న కాలువ వంటివాడు. మహాపురుషుడు నది లాంటివాడు అని చెప్పాడు. ఇప్పటి రాజకీయ నాయకులు ఎండిపోతున్న చెరువుల్లా ఉన్నారు. మార్క్సిస్టులు-అంబేద్కరైట్లు పార్లమెంటరీ రాజకీయాల్లో కీలకమైన ఓటు విలువ గురించి ప్రచారం చేయాల్సి ఉంది. ప్రజాస్వామ్యంలో మనం కట్టే పన్ను మనకే ఉపయోగపడాలంటే నీతి, నిజాయితీ, సిద్ధాంత బలమున్న మన పార్టీలకు ఓటు వేసుకోగలగాల్సి ఉంది. ఆపద వచ్చినప్పుడు, హక్కుల కోసం పోరాడేటప్పుడు మనం ఎరుపు, నీలం పార్టీలను, ఉద్యమాలను ఆశ్రయించి ఆ తరువాత ఎన్నికలు వచ్చేటప్పటికి డబ్బుకు, మందుకు, ప్రచారానికి లోబడి చంద్రబాబు వంటి కరుణరహితమైన, ప్రజల కష్టాలను, కన్నీళ్ళను, పేదరికాన్ని పట్టించుకోని నాయకులను ఎన్నుకుంటే, ఆ పార్టీలకు కొమ్ముకాస్తే, మన పేదరిక నిర్మూలన మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతుంది తప్ప ప్రయోజనం లేదు. బృహత్తరమైన బడ్జెట్‌, వనరులున్న అధిక జనాభా గలిగిన దళిత, బహుజన, మైనార్టీలు, మన దేశం, మన రాష్ట్రంలోని అగ్రకులాల్లోని పేదలు, స్త్రీలు కలసి నిర్మించుకొనే రాజకీయ అధికార చైతన్యం కోసం పోరాడదాం. రాబోయే చరిత్రను మనమే నిర్మిద్దాం. మన వనరులు మనకే ఉపకరించే సమతా రాజ్యాన్ని నిర్మిద్దాం..     - డాక్టర్‌ కత్తి పద్మారావు

# మతోన్మాదం - భారతీయుల కర్తవ్యం #




 భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ 70వ స్వాతంత్య్ర దినోత్సవ దినాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడుల పట్ల ఆందోళన చెందారు. ప్రజాస్వామ్యమంటే కొన్నేళ్లకొకసారి ప్రభుత్వాన్ని ఎన్నుకునే కసరత్తు కాదు. అంతకన్నా మించిన ప్రక్రియ. స్వేచ్ఛ అనే మహా వృక్షానికి ప్రజాస్వామ్య వ్యవస్థల ద్వారా నిరంతర పోషకాలు అవసరం. అంతరాయాలు, విభజనవాద రాజకీయ అజెండా వల్ల వ్యవస్థలకు విలువ లేకుండా పోతుందన్నారు. ప్రధాని మోదీ కూడా ఎర్రకోట ప్రసంగంలో దళితులపై దాడులను ఖండించారు. ఒకపక్క ప్రభుత్వమే దాడులను ప్రోత్సహిస్తూ ఆర్‌.ఎస్.ఎస్‌., విశ్వహిందూ పరిషత్‌ వంటి సంస్థలను బలోపేతం చేస్తూ, మరోపక్క దళితులపై దాడులు జరుగుతున్నాయనడం ప్రధానమంత్రి ద్వంద్వ నీతికి నిదర్శనం. నిజానికీ ఈ రెండు సంవత్సరాల్లో హిందూ రాజ్యాన్ని స్థాపించాలనే ఆర్‌.ఎస్‌.ఎస్‌., విశ్వహిందూ పరిషత్‌ల వ్యూహరచన హిందూ మతంలో ఉన్న ఫాసిస్ట్‌ కోణానికి మరింత పదునుపెడుతుందని మనకు అర్థమవుతుంది. అటు ప్రణబ్‌ముఖర్జీ కానీ, ఇటు మోదీ కానీ స్వాతంత్రోద్యమ ప్రస్తావనల సందర్భంగా అంబేడ్కర్‌ సిద్ధాంతాలను విస్మరించారు. బ్రిటీష్‌ వాళ్ళు పాలించేటప్పుడే భారతదేశంలో అనేక మత సంస్కరణోద్యమాలు జరిగాయి. హిందూ మతంలో మార్పులు తీసుకురావటం కోసమే బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం ఆవిర్భవించాయి. ఎంతో కొంత సంస్కరణలకు ప్రయత్నం చేశారు. మరోపక్క కొత్త విజ్ఞానం, యంత్రాలు, ఉత్పత్తి సాధనాలతో వచ్చిన మార్పులను కూడా హిందూ మతోన్మాదులు ఎదిరిస్తూ వచ్చారు. భారతదేశంలో మూలవాసులు కనిపెట్టిన తోలు పరిశ్రమను, జంతు ఆహార వినిమయాన్ని గోరక్షణ పేరుతో అడ్డుకొని దేశీయ ఉత్పత్తులను దెబ్బతీయాలనేది, భారతదేశాన్ని ఇతర దేశాలకు తాకట్టు పెట్టాలనేది ఆర్‌.ఎ్‌స.ఎస్‌. ఎజెండాగా మనకు అర్థమవుతున్నది. హిందూ మతోన్మాదం హేతురహితమైంది. తర్కానికి నిలవనిది, జ్ఞానానికి వ్యతిరిక్తమైంది, మానవత్వానికి భిన్నమైంది కూడా. మనిషి అభివృద్ధికి నిరోధకమైంది. మానవ సమాజ విస్తృతికి ఉక్కుగోడలా అడ్డు నిలిచింది. మానవుడి మెదడును కొన్ని పరిమితులకే లోబడేటట్లు నియంత్రించింది. అటువంటి హిందూవాదం నుంచి కొందరు బ్రాహ్మణులు కూడా విముక్తి చెందారు.

                  హిందూ మతాన్ని సంస్కరించాలని వివేకానందుడు, రామతీర్థ, బాలగంగాధర్‌తిలక్‌, మహాత్మాగాంధీ, డాక్టర్‌ రాధాకృష్ణన్‌ కొంతలో కొంత ప్రయత్నం చేశారు. అయితే ఆర్‌.ఎ్‌స.ఎస్‌., విశ్వహిందూ పరిషత్‌ హిందూ సంస్కరణవాదానికి మొదటినుంచి శత్రువులుగానే ఉన్నాయి. హిందూ మతోన్మాదం ఒక నియంతృత్వ వాదంగా, మూలవాసులను శత్రువులుగా భావించే వాదంగా మొదటి నుంచి ముందుకొచ్చింది.

                  ఒకసారి మనం ఆర్‌.ఎస్‌.ఎస్‌. పూర్వ చరిత్రకు వెళితే అసలు మతోన్మాదం పుట్టు పూర్వోత్రాలు, దళిత ముస్లిం ద్వేష పునాదులు, హిందూ సంస్కర్తలను వారు ఎందుకు తూలనాడుతున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. భారతదేశంలో హిందూ మతోన్మాదాన్ని పెంపొందించటంలో ఆర్‌.ఎ్‌స.ఎస్‌. పాత్ర గణనీయమైంది. దాని కుతంత్ర పూరితమైన వ్యూహమే ’రామజన్మభూమి - బాబ్రీ మసీద్‌’ వివాదం. ఆర్‌.ఎ్‌స.ఎస్‌. శక్తుల మతోన్మాద చరిత్రను మనం అర్థం చేసుకుంటే గాని ఈ దాడుల విషయం మనకు అవగతం కాదు. ఈ 70 ఏళ్ళ స్వాంతత్య్ర భారతంలో అది వర్ణ వ్యవస్థను పెంచి పోషించింది. కుల విద్వేషాలు రేపింది. అస్పృశ్యతా మారణ హోమాన్ని ఆచరించింది. ఈ హిందూ నియంతృత్వాన్ని అమానుషత్వాన్ని భరించలేక దళిత బలహీన వర్గాల ప్రజలు సిక్కు, ఇస్లాం, క్రైస్తవ మతాలను స్వీకరించారనే సత్యాన్ని వీరు తెలుసుకోలేకపోతున్నారు. ఈ దాడుల వల్ల మైనార్టీ మతాలు పెరుగుతాయే తప్ప తగ్గవు. హిందూ, ముస్లిం వివాదాలను శాసీ్త్రయంగా పరిష్కరించకుండా, నిరంతరం తమ రాజకీయాల కోసం పెంచుతూనే వచ్చారని అంబేడ్కర్‌ విమర్శించారు. రాజకీయ అవసరాల కోసం మతోన్మాదాన్ని పెంచి పోషించారని ఆయన స్పష్టంగా చెప్పారు.

  హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఆనాటికీ, ఈనాటికీ పెద్ద ఉద్యమం జరుగుతూనే వస్తుంది. ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు అవి నిరంతర ప్రవాహాలు, ప్రజ్వలితాలు కూడా. అయితే ప్రతి సమాజపు కదలికకు ఒక తాత్విక దృక్పథం కావాలి. సమాజం నిరంతర ఘర్షణతో చలనశీలంగా వుంటుంది. నిన్నటి సిద్ధాంతాలు నేడు అన్వయం కాకపోవచ్చు. సిద్ధాంతాల కంటే సమాజం ముందుకు పోవచ్చు, వెనక్కి పోవచ్చు. మొత్తం సమాజం వెలుగొందాలంటే, ఆశయపూర్ణం కావాలంటే స్తబ్దమైన సమాజాన్ని కొన్ని శక్తులు కదిలించి తీరాల్సి వుంది. నిజానికి హిందూమతం ఒక్కదానిలోనే కాదు. ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ మతాలన్నింటిలోకి కులతత్వం ఈనాడు చొరబడింది, ఛాందసత్వం చొరబడింది.  దళితుల్లో కొన్ని ప్రాంతాల్లో హిందూ మతభావాలు పెరుగుతున్నాయి. అగ్రవర్ణాలకు పోటీపడి కొలుపులు, జాతరులు చేస్తున్నారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌., ఎస్సీ, ఎస్టీల్లోకి చొచ్చుకుపోవాలని చూస్తుంది. వాడ, వాడల్లో రామమందిరాలు నిర్మించాలని చూస్తుంది. దీనివలన దళితులు మళ్ళీ పూర్వ స్థితికి నెట్టబడే ప్రమాదం ఉంది.

               అంతేగాక అంబేడ్కర్‌ పేరుతో ఆర్‌.ఎస్ .ఎస్‌. దళిత వాడల్లో చొరబడాలని చూస్తుంది. అంబేడ్కర్‌ని దేవుణ్ణి చేసి ఆయన సిద్ధాంతాలను, వక్రీకరించాలని చూస్తున్నారు. ఆర్‌.ఎస్ .ఎస్‌. వ్యూహం మార్చుతోంది. విశ్వవిద్యాలయాల్లో దళితులు ఉన్నత విద్యను అడ్డుకోవాలని చూస్తుంది. వారిలో ఆత్మన్యూనత కలిగించాలని చూస్తుంది.
       
               ఏ ఉన్మాదం అడ్డొచ్చినా అది మతమైనా, అది కులమైనా, అది ప్రాంతమైనా దానిని తొలగించుకోవాల్సిన శాస్త్రీయ అవగాహన ఈనాటి భారతీయుల కర్తవ్యం.    -డాక్టర్‌ కత్తి పద్మారావు

Saturday, 27 August 2016

|| తెలుగు భాషా సేవలో ఆ ఇద్దరూ ... ||



                  ఆ ఇద్దరిలో ఒకరు గిడుగు రామ్మూర్తి పంతులు, మరొకరు గురజాడ వేంకట అప్పారావు. ఒకరు శ్రీకాకుళానికి 20 మైళ్ల దూరంలో ఉన్న పర్వతాలపేటలో ఆగస్టు 29, 1863లో జన్మిస్తే, మరొకరు విశాఖ జిల్లా, యలమంచిలికి దగ్గరలో ఉన్న రాయవరంలో సెప్టెంబరు 21, 1862లో జన్మించారు. వీరిద్దరూ విజయనగరంలోని మహారాజావారి ఉన్నత పాఠశాలలో సహపాఠులై ఆంగ్లం, సంస్కృతం, చరిత్ర పట్ల అమితమైన శ్రద్ధ చూపేవారు. వృద్ధిలోకి వస్తారనుకున్న పిల్లలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులైన చంద్రశేఖరశాస్త్రి ఇంటిదగ్గర పాఠాలు చెప్పేవారు. అక్కడా వీరిద్దరూ సహాధ్యాయులయ్యారు. అప్పటి నుంచి వీరు ఒకరికొకరు మిత్రులు, సన్నిహితులు, ఆప్తులయ్యారు. తరువాత ఒకరు పర్లాఖిమిడి మహారాజా కళాశాలలో, మరొకరు విజయనగరం మహారాజా కళాశాలలలో ఉపన్యాసకులుగా ప్రసిద్ధులయ్యారు.
ఏ జాతి సంస్క ృతిలోనైనా ఆహారం తరువాత కీలకమైన పాత్ర పోషించేది భాష. మానవ సమూహాలు తమ అనుభవాలను, కష్టసుఖాలను పంచుకోవడానికి భాషను సృష్టించుకుంటాయి. మనిషికీ మనిషికీ మధ్య సజీవ సంబంధాలు నెలకొల్పే వాహిక భాష. అటువంటి భాష మనిషికీ మనిషికీ మధ్య గుదిబండగా నిలిచిన వైనాన్ని ఇద్దరూ స్పష్టంగా దర్శించారు. ఈ దేశవాసుల వాడుకలోలేని భాషలో భారతీయ ప్రాచీన సాహిత్యమంతా వచ్చింది. అదే సంస్కృత  భాష.

 ఆంధ్రసాహిత్యంలో పొద్దుగుంకి చీకటిపడింది. మూడు శతాబ్దాల అనంతరం గురజాడతో మళ్లీ తూర్పు భళ్లున తెల్లవారింది. గురజాడ తరువాత వాడుకభాషలో కథా సాహిత్యాన్ని అద్భుతంగా నిర్వహించిన శ్రీపాద ఈ సందర్భంలో గురజాడనుద్దేశించి 'భాష ఎంత శృంఖలాబద్ధమైపోవాలో, అంత శృంఖలాబద్ధమైపోయాకా, సాహిత్యం ఎంతగా దిగజారిపోవాలో, అంతగా దిగజారిపోయాక, భవిష్యత్తు ఎంతగా అంధకారమైపోవాలో అంతగా అంధకార బంధురమైపోయాక పుట్టుకొచ్చాడీ మహాకవి' అన్న మాటలను బట్టి ఇరవయ్యో శతాబ్ది ఆరంభానికి తెలుగు భాషా సాహిత్యాల స్వరూపమెట్లా ఉందో మనకు స్పష్టమౌతుంది.
గిడుగు పిడుగే, ప్రజాభాషకు సాహిత్యంలో స్థానం ఉండాలని, అసలే అత్యధిక సంఖ్యాకులు నిరక్షరకుక్షులుగా ఉన్న సమాజంలో ప్రాచీన రూపాలను, సంస్కృతభాషా మర్యాదలనూ చొప్పించి కృత్రిమంగా నిర్మించిన భాషకు బహుముఖమైన ఆధునిక సారస్వతంలో స్థానం లేదని వాదించిన మొట్టమొదటి భాషా శాస్త్రవేత్త. సమాజంలో భాషా విషయకంగా వచ్చిన, వస్తున్న సిద్ధాంతాలనూ, ఆచరణలనూ గుర్తించిన తొలి తెలుగు భాషా శాస్త్రవేత్త గిడుగు. ఈ సందర్భంలో భారతీయ భాషల గురించి ప్రపంచ భాషా శాస్త్రవేత్తల అభిప్రాయాలను ఇక్కడ గమనించవలసిన అవసరముంది.

"The Vernacular has been split into two sections. The tongue which is understanded of the people and the literary dialect known only through the press, which is not intelligible to those who donot know Sanskrit. Literature has thus being divorced from the grate masses of the populations and also to the literary classes\" (GREARSON)

'భారతీయ భాషలకు గమనార్హమైన ఒక ప్రత్యేక లక్షణముంది. వీటిలో రచనలు వెలువడ్డం ప్రారంభం కాగానే, భాషా శైలులు ప్రజాజీవితం నుంచి వేరుపడి తన స్వంత వ్యాకరణమూ, పదజాలమూ ఉన్న ఒక గ్రాంధిక భాషగా రూపొందే ధోరణిని అలవర్చుకుంటుంది.' (కాడ్వెల్‌, ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణం).
'దక్షిణ భారతదేశ భాషలలో ప్రతీ ఒక్కదానికి కవిత్వభాష, వ్యావహారిక భాష ఉన్నాయి. వీటిమధ్య శేగ్జన్‌ భాషకూ, ఇంగ్లీషు భాషకు మధ్య ఉన్నంత తేడా ఉంది. (సి.పి.బ్రౌన్‌, తెలుగు, ఇంగ్లీషు, నిఘంటు పీఠిక).
భాషకు సంబంధించి తన ఆలోచనతో ఏకరూపత కలిగిన ఈ అభిప్రాయాలన్నీ గిడుగును వాడుకభాషా ఉద్యమానికి పురికొల్పడమే కాకుండా ఎంతో విశ్వాసాన్ని, ధైర్యాన్ని కల్పించాయి. గిడుగు సిద్ధాంత ప్రవక్త. వాద వివాదాల సందర్భంగా పండితులనుద్దేశించి రాసిన భాష, ఖండన గ్రంథాల్లో రాసిన భాష సహజంగా క్లిష్టంగానే ఉండేది.
ఇక గురజాడ విషయానికి వస్తే ఆయన తన పరిశీలనా, అధ్యయనాల ద్వారా వాడుక భాషపై సాహిత్య భాష (గ్రాంథిక భాష) ఆధిపత్య, ప్రభావాలకు గల మూలాలను గ్రహించినట్లుగా వివిధ సందర్భాల్లో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాల ద్వారా మనకు స్పష్టంగా అర్ధమౌతుంది. 'సంకుచిత, సామాజిక, రాజకీయ సాహిత్యాదర్శాలది పైచేయిగా ఉన్న సామాజిక పరిస్థితుల వలన కావ్యభాష ఉత్పన్నమయింది. విశాల ప్రజానీకం, ప్రభువర్గం కోసమే బతికేది, శ్రమించేది, ఆనాడు సూద్రుడు చదువుకోవడమే ఒక నేరం'. 'విశాల ప్రజానీకం చదువుకోవడం, పూర్వాచార సాంప్రదాయంలో భాగం కాదు. నాడు జ్ఞానార్జన, సాహిత్యం, బ్రాహ్మణుని గుత్త సొమ్ము. అతని దృష్టిలో సంస్క ృతం పెట్టిన ఒరవడి పవిత్రమైనది, మీరరానిది. తెలుగు సాహిత్యం సంస్క ృత ప్రభావంలో అంకురించింది. సంస్క ృత సాహిత్యం క్షీణదశలో ఉన్న కాలంలో తెలుగు సాహిత్య సృష్టి ప్రారంభమైనందువల్ల క్షీణదశ లక్షణాలైన భాషా, కళా సాంప్రదాయాలు తెలుగు సాహిత్యంలో పాతుకుపోయాయి'. 'ఈ సందర్భంలో తెలుగు సాహిత్యానికి సంకెళ్లు వేసి కడుపుమాడ్చడమా? లేక దానికి జవసత్వాలనిచ్చి ఒక నాగరిక శక్తిగా చేయడమా అనేది మనపై ఆధారపడి ఉంది'. అంటూ ఈ దృష్టితోనే తను వివిధ తెలుగు సాహిత్య ప్రక్రియల్లో కావ్యసృష్టికి అంకురార్పణ చేసి, పరాకాష్ట స్థాయిలో వాటిని అద్భుతంగా నిర్వహించిన మహాకవి గురజాడ.
గిడుగు జీవితమంతా ప్రత్యర్థి వాదాన్ని పరాస్తం చేయడంలోనే గడిచిపోయింది. సిద్ధాంతానికి అనువర్తన ప్రధానం. ఆచరణ సాధ్యం కాని ఏ సిద్ధాంతమూ నిలబడదు, బతకదు. సామాన్య రచనల్లో, వ్యావహారిక భాషా వాదాన్ని ప్రతిష్టాపించగల సత్తా ఉండదు. లక్ష గ్రంథాలకంటే ఒక మహా కావ్యం తెచ్చిపెట్టగలిగిన గౌరవం మిన్న. ఏ ఆదర్శం కోసమైతే జీవితాన్ని ధారపోస్తామో ఆ ఆదర్శపు ఔన్నత్యాన్ని బట్టి అతడు చరితార్ధుడౌతాడని గ్రహించి, 'నాకు కావలసింది నా దేశ భాష, సజీవమైన తెలుగు భాష. నాది ప్రజల ఉద్యమం దానిని ఎవరినో సంతోష పెట్టడానికి వదులుకోలేను' అని ప్రకటించి వ్యావహారిక భాషకు మహాసాహితీ గౌరవం సంపాదించి పెట్టి గిడుగు ఆబోరు దక్కించినవాడు గురజాడ. దీనికి ప్రథమ సాక్షి 'ముత్యాలసరాలు', ప్రధాన సాక్షి 'కన్యాశుల్కం' ముఖ్యమైన సాక్షి 'దేవుళ్లారా మీ పేరేమిటి' వ్యావహారిక భాషా నిరూపకడు గిడుగు అయితే, ప్రతిష్టాపకుడు గురజాడ. ఈ వాదాన్ని నిలిపిన మరో మహాశక్తి తెలుగుజాతి.    - డా|| బి.వి.ఎ.రామారావు నాయుడు 

|| వృథాకాని వీరుల త్యాగం || # నేడు బషీర్‌బాగ్‌ అమరుల సంస్మరణ దినం#




                 వారు చిందించిన నెత్తుటి తడి ఇంకా ఆరలేదు. తుది శ్వాస విడవడానికి కొన్ని నిమిషాల ముందువరకు వారు చేసిన నినాదాలు ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. తెలుగు ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. తుపాకీ గుండ్లు దూసుకు వస్తూంటే ఒక్క అడుగైన వెనక్కి వేయక, ముందుకే దూసుకెళ్లిన వారి ధైర్యం తెలుగు ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచి పోతుంది. వారు బషీర్‌బాగ్‌ అమరులు. ప్రజల ప్రాణాలను తోడేసే సరళీకరణ ఆర్థిక విధానాలు, వాటి ప్రతి రూపమైన విద్యుత్‌ సంస్కరణలపై తిరగబడ్డ తెలుగు బిడ్డలు! యవ్వన ప్రాయంలోనే ప్రజల కోసం ప్రాణాలర్పించిన యోధులు! తెలుగు ప్రజలు నిర్వహించిన చారిత్రాత్మక ఉద్యమాలకు మరో మెరుపును జోడించిన అమర వీరులు!
                తెలుగు నేలపై సాగిన మహత్తర పోరాటాల్లో విద్యుత్‌ పోరాటానిది ఒక ప్రత్యేక అధ్యాయం. 'పోరాటాలకు కాలం చెల్లింది. ఇజాలు లేవు, ఉన్నదల్లా టూరిజమే!' అంటూ ఊదరగొట్టిన ప్రపంచీకరణ ప్రచారాన్ని సవాల్‌ చేస్తూ పూరించిన సమరశంఖం అది. పాలకుల ఆంక్షలను, పైశాచిక దమనకాండను, పోలీసుల హింసా కాండను తట్టుకుని ప్రజల పోరాట పతాకాన్ని పైపైకి ఎగరేసిన ఘనత ఆ పోరాటానిదే. నూతన సహస్రాబ్ది ప్రారంభం, రెండు వేల సంవత్సరంలో జరిగిన ఆ పోరాటం, పోరాట వీరుల త్యాగం వృథా కాలేదు. విద్యుత్‌ ఛార్జీల జోలికి పోవడానికి దశాబ్దాల పాటు పాలకులు తటపటాయించే పరిస్థితిని ఆ పోరాటం సృష్టించింది. జాతీయ స్థాయిలోనూ ప్రపంచ బ్యాంకు అజెండాకు బ్రేక్‌లు వేసింది. హైదరాబాద్‌ను ప్రపంచ బ్యాంకు ఆదేశిత విధానాల ప్రతిఘటనకు వేదికగా మార్చింది. ' మరో ప్రపంచం సాధ్యమే' అని ఎలుగెత్తింది. అప్పటిదాకా అధికారాన్ని వెలగబెట్టిన తెలుగుదేశం పార్టీని, దాని నేత చంద్రబాబునాయుడును రెండు దశాబ్దాల పాటు ప్రతిపక్షానికే పరిమితం చేసింది.
చంద్రబాబునాయుడి నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం చేపట్టిన వినాశకర విద్యుత్‌ సంస్కరణలు, భారీ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా తొమ్మిది వామ పక్షాలు ఇచ్చిన పిలుపునకు రాష్ట్ర ప్రజలు సానుకూలంగా స్పందించారు. చిన్నగా ప్రారంభమైన ఉద్యమం క్రమేణా మహత్తర పోరాటంగా మారింది. ధర్నాలు, రాస్తారోకోలు వంటి ఆందోళనలతో పాటు ఎక్కడికక్కడ కొత్త పోరాట రూపాలు పుట్టుకొచ్చాయి. ప్రజల అభిప్రాయం వెల్లడించడానికి నిర్వహించే ప్రజా బ్యాలెట్లు విద్యుత్‌ సంస్కరణలకు వ్యతిరేక తీర్పునిచ్చాయి. హైదరాబాద్‌లో బిజిలీ బంద్‌కు పిలుపునిస్తే రాష్ట్రమంతా అంధకారం అలముకునేది. అధికార పార్టీ నేతలకు, చివరికి ముఖ్యమంత్రికి కూడా ప్రజల నుండి ప్రశ్నల వర్షం, నిరసనల నినాదాలు అనివార్యంగా మారాయి. పెనుభారం మోపిన పాలకులను ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకుంటుండటంతో ప్రభుత్వం కూడా అంతే తీవ్రంగా స్పందించింది. విపరీత స్థాయిలో నిర్బంధాన్ని అమలు చేసింది. వేలాది మందిని అరెస్ట్‌ చేసింది. కేసులు బనాయించింది. వివిధ జిల్లాల్లో ఆందోళనల సందర్భంగా జరిగిన లాఠీఛార్జీలలో గాయపడిన వారి సంఖ్యకు లెక్కే లేదు. నిర్బంధాన్ని, లాఠీఛార్జీలనూ ప్రజలు లెక్క చేయకపోవడంతో మూడు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం గుక్క తిప్పుకోలేక పోయింది. అణచి వేయడమే లక్ష్యంగా అమానుషంగా హింసాకాండకు దిగింది. దీనికి పరాకాష్టే 2008 ఆగస్టు 28 చలో అసెంబ్లీ సందర్భంగా జరిగిన ఘటనలు. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన ప్రజానీకం ఉవ్వెత్తున పొంగింది. ఇనుప తీగలను, బాష్పవాయువును, లాఠీఛార్జీలను, జలఫిరంగులను లెక్క చేయకుండా కదం తొక్కింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. అప్పటిదాకా ప్రపంచబ్యాంకు తప్ప మరోమాట మాట్లాడటానికి సిద్ధపడని చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ వామపక్షాల పోరుకు మద్దతు పలికింది. అప్పటిదాకా ఆరోపణలకు, ప్రత్యారోపణలకే పరిమితమైన రాజకీయాల్లోకి ప్రజా సమస్యలు అజెండాగా వచ్చాయి. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పతనానికి బషీర్‌బాగ్‌ పోరాటం నాంది పలికింది.

|| నేటి కర్తవ్యం ||
విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో బిజెపితో చెలిమి కట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల ముందు వరకు మారిన మనిషినని చెప్పుకున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే సంస్కరణల జపం ప్రారంభించారు. స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగుతోంది. సామాన్యుల సమస్యలను గాలి కొదిలేసిన ప్రభుత్వం, ప్రజల నుండి భూమిని గుంజుకోవడం, కార్మిక చట్టాలను నీరుగార్చడం, నిర్బంధాన్ని అమలు చేయడాన్ని తన విధానంగా మార్చుకుంది. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం కాంగ్రెస్‌ కన్నా దూకుడుగా ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తోంది. కీలకమైన రక్షణ రంగంతో పాటు అనేక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు రెడ్‌కార్పెట్‌ పరిచింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు ఉరకలేస్తోంది. దశాబ్ద కాలం క్రితమే రాష్ట్ర ప్రజానీకం చీదరించి, తిరస్కరించిన ప్రపంచ బ్యాంకు అజెండాను ప్రజలపై పచ్చిగా రుద్దడానికి సిద్ధపడుతోంది. దీనికి మతోన్మాదం అదనం. ప్రజలను కులాలు, మతాల ప్రాతిపదికగా చీల్పి అధికారాన్ని పదిలం చేసుకోవడానికి కుట్రలు చేస్తోంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు, పోరాటాలు ప్రారం భమైనాయి. సెప్టెంబర్‌ రెండున చారిత్రాత్మక సార్వత్రిక సమ్మెకు దేశవ్యాప్తంగా కార్మికలోకం నడుంకట్టింది. రాష్ట్రంలోనూ పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. బాధిత ప్రజలు, కార్మికులు ఎక్కడికక్కడ ఈ పోరాటాల్లో భాగస్వా ములవుతున్నారు. ఈ పోరాటాలకు సంఘీభావం తెలపడం, మరింత సంఘటితం చేయడమే బషీర్‌బాగ్‌ అమరవీరులకు అర్పించే నివాళి.
                  

# పోలవరం ప్రాజెక్టు - కొన్ని వాస్తవాలు #



దేర్‌ ఈజ్‌ నో ఎక్సర్‌సైజ్‌ బెటర్‌ ఫర్‌ ద హార్ట్‌ ద్యాన్‌ రీచింగ్‌ డౌన్‌ అండ్‌ లిఫ్టింగ్‌ పీపుల్‌ అప్‌’ (ప్రజల అభ్యున్నతి కోసం లొంగి పనిచేయడం కన్నా ఉన్నతమైనది, ఉత్తమమైనది ఏదీ లేదు)-అని ప్రముఖ కవి జాన్‌ హోమ్స్‌ సూక్తి పోలవరం నిర్వాసితుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం పాటించాల్సిన తారక మంత్రం. ఒక సమస్యను అర్థంచేసుకునే కోణాలను బట్టి పరిష్కారాలు కనిపిస్తాయి. 

                   ప్రపంచంలోనే ఉత్తమమైన పునరావాస ప్యాకేజీని అందజేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెబుతుంటే... ఇంత చెత్త ప్యాకేజీ మరొకటి లేదనేది నిర్వాసితుల వాదన. ప్యాకేజీ కేవలం డబ్బు రూపంలో మాత్రమే కాదు... మానవీయ కోణంలోనూ ఉండాలి. ప్రభుత్వం తనకున్న సర్వాధికారాలను ఉపయోగించి ఏమైనా చేయవచ్చు కానీ, నిర్వాసితుల మనసులను గెలుచుకొని, కుంగిపోయిన వారి జీవితాలకు వెలుగుచూపడం నిజమైన ప్రజా ప్రభుత్వ బాధ్యత.

                  పట్టిసీమ భూసేకరణ, నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం చూపిన ఉదా రత పోలవరం పునరావాస ప్యాకేజీకి ఆదర్శం కావాలి. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించేవారు, సమర్థించేవారు ముందుగా ఆ ప్రాజెక్టును సందర్శించడం మంచిది. అప్పుడే అక్కడ నిజంగా జరుగుతున్నదేమిటి? అక్కడ నిర్వాసితులు కోరుకుంటున్నదేమిటో కళ్లకు కట్టినట్లు తెలుస్తుంది. అన్యాపదేశంగా ఎవరో చెప్పింది విని ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లుగా విమర్శలు చేసుకుంటూ పోవడం వల్ల నిర్వాసితులకు ఒరిగేదేమీ లేదు. వైఎస్‌ హయాం నుంచి ప్రస్తుతం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి వరకూ ఢిల్లీలో ఉంటూ పోలవరంపై ఎన్నో వార్తలు రాసిన నాకు ఇటీవల పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టును సందర్శించే అవకాశం లభించింది. నిర్వాసితులతో మాట్లాడినప్పుడు వారు కోల్పోయిందేమిటి? కోరుకుంటున్నదేమిటి అన్నది స్పష్టంగా తెలిసింది.

                  1980లో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టాలనుకున్నా అనివార్య కారణాలవల్ల ముందుకు సాగలేదు. 1991 జనాభా లెక్కల ఆధారంగా నిర్వాసితుల లెక్కలను ప్రభుత్వం తేల్చింది. అంటే 25 ఏళ్ల క్రితం జనాభా లెక్కల్లో ఎక్కిన వారికి మాత్రమే నష్టపరిహారం అందుతోంది. మరి ఆ తరువాత పెరిగిన జనాభా సంగతేంటి? వారికి ప్రభుత్వం ఎందుకు నష్టపరిహారం ఇవ్వదన్నదే నిర్వాసితులు అడుగుతున్న ప్రధానమైన ప్రశ్న. నిజానికి ప్రతి 16 ఏళ్లకు ఒక తరం(జనరేషన్‌)గా లెక్కగడతారు. అంటే ఇప్పుడు రెండు తరాలు పూర్తయ్యాయి. కానీ కొత్త తరానికి పోలవరం నష్టపరిహారం అందడం లేదన్నది స్థానికుల మనోవేదన. అప్పట్లో మైనర్లుగా ఉన్నవారంతా ఇప్పుడు మేజర్లు అయ్యారు. వారికి కూడా ఒక దారి చూపాలన్నదే వారి డిమాండ్‌. ‘పోలవరం ప్రాజెక్టును ఆపేంత శక్తి మాకు లేదు... ఏదో మా తరపున పోరాడతామంటూ మా దగ్గరకు చాలామంది వచ్చి చందాలు అడుగుతున్నారు... మొదట ప్రభు త్వం ఇచ్చిన దాంట్లో కాస్తో, కూస్తో ఉంటే ఇచ్చాం... ఇక మేం ఏమీ ఇచ్చుకోలేము...’ అని గిరిజనులు వాపోతున్నారు. ‘నోటి మాటలే శాసనాలుగా భావించి బ్రతికేవాళ్లం.... ఎన్నికలప్పుడు చంద్రబాబు, జగన్‌లు మా దగ్గరకు వచ్చి అధికారంలోకి వస్తే రూ.10 లక్షలు నష్టపరిహారం ఇస్తాం.. కొత్త చట్టం ప్రకారం కొత్త ప్యాకేజీ ఇస్తామన్నారు.. చంద్రబాబు గెలిచారు... కానీ మాకు ఇచ్చిన మాట గుర్తుచేస్తే ఆయనకు కోపం వస్తంది... మేమేమి చేయాల’ అంటూ నిస్సహాయంగా చెబుతున్నారు.
                  ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలలో ఈ ప్రాజెక్టు కారణంగా 299 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఏపీలో మాత్రమే 270 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ప్రస్తుతానికి ప్రాజెక్టుకు దిగువున ఉన్న దేవరకొండ, రామాయంపేటతో పాటు ఆరు గ్రామాలను మాత్రమే ఖాళీ చేయించారు. మిగతావన్నీ ప్రాజెక్టుకు ఎగువభాగాన ఉన్నవి కాబట్టి వాటిని ఇప్పుడే ఖాళీ చేయించాల్సిన అవసరం లేదు. ప్రాజెక్టు పూర్తి అవుతుందనుకుంటున్నప్పుడు ఖాళీ చేస్తే సరిపోతుంది. 2006లో వైఎస్‌ జమానాలో ప్రవేశపెట్టిన పునరావాస ప్యాకేజీ ప్రకారం ఏపీలోని 270 గ్రామాల్లోని వారందరికీ నష్టపరిహారం నామమాత్రంగా చెల్లించారు. ఇప్పుడు వారు అడుగుతున్నది 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు నష్టపరిహారం కావాలని. కానీ ప్రభుత్వం మాత్రం వారి గోడు పట్టించుకోవడం లేదు. సుప్రీంకోర్టు కూడా బాధితులు కోర్టును ఆశ్రయిస్తే పరిశీలిస్తామంటూ వారి తరపున దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఇటీవలే కొట్టివేసింది. నిర్వాసితుల్లో 60శాతం మంది ఎస్సీ, ఎస్టీలు కాగా ఓబీసీలు 40 శాతం మంది ఉన్నారు. 60 నివాస ప్రాంతాలు(హ్యాబిటేషన్స్‌)లో 100శాతం గిరిజనులుంటే కొన్ని చోట్ల మాత్రం 90 శాతం గిరిజనులున్నారు. కొండలు, అడవుల్లో నివసించే వీరందరినీ పట్టణాలకు తరలించి వారికి అక్కడ ఇళ్లను నిర్మించి ఇస్తామంటే వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయా? తరుగుతాయా? అన్నదే ఇప్పుడు ప్రధాన సమస్య.
                  స్వచ్ఛమైన గాలి, నీటితో పాటు అడవుల్లో దొరికింది తిని, పోడు వ్యవసాయం చేసుకుంటూ, పశువులను మేపుకుంటూ బ్రతికే వారిని ఒక్కసారిగా జనజీవన స్రవంతిలోకి తీసుకొస్తే వారికి ఊపిరి ఆడుతుందా? గిరిజనజాతులు పూర్తిగా అంతరించిపోతాయి. కొండల్లో, అడవుల్లో ఉంటేనే వారిని గిరిజనులుగా గుర్తిస్తారు. మరి పోలవరం నిర్వాసితులకు జంగారెడ్డిగూడెం లాంటి మండల కేంద్రాల్లో ఇళ్లు కట్టిస్తే అక్కడ వారికి ఎస్టీ సర్టిఫికెట్లు ఎవరిస్తారు? వారికి ఎన్ని డబ్బులిచ్చినా వారు ఏమి చేసుకుంటారు? డబ్బులు తిని బ్రతకలేరు. వారి జీవన విధానాన్ని తిరిగి తీసుకురాగలరా? 2.5 ఎకరాల కన్నా ఎంత తక్కువ ఉంటే అంత సాగుభూమిని, అంతకన్నా ఎంత ఎక్కువ ఉన్నా 2.5 ఎకరాలను మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఏజెన్సీ ఏరియాలో రిజిసే్ట్రషన్‌లు ఉండవు. వారికి చేతనైంత మేరకు వ్యవసాయం చేసుకుంటారు? కొంతమంది 20 నుంచి 30 ఎకరాలు కూడా సాగు చేసుకుంటున్న వారు ఉన్నారు. కానీ రిజిస్ర్టేషన్‌లు, పట్టాలు లేవన్న కారణంగా వారికి కేవలం అరకొరగా సాగు భూములను అధికారులు కట్టబెట్టారు. కొన్ని లక్షల మందిని ఖాళీ చేయిస్తున్నప్పుడు వారికి ప్రత్యామ్నాయం చూపకుండా మీ దారిన మీరు వెళ్లండి అంటూ హుకుం జారీచేయడం క్రూరత్వమే అవుతుంది. మానవతా దృక్ఫధంతో వ్యవహరించి నిర్వాసితులందరిలో విశ్వాసాన్ని నింపినప్పుడు శాంతి నెలకొంటుంది. లేదంటే రావణకాష్టంలా అశాంతితో రగిలిపోయి పెద్ద ఎత్తున నిర్వాసితుల ఆగ్రహం పెల్లుబుకుతుంది. నిర్వాసితులకు ప్రభుత్వం అండగా నిలబడటమే కాక వారి జీవితాలకు భరోసా కల్పించాలి.

                  2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామంటూ ఏపీ సీఎం పదే పదే చెబుతున్నా అది అసాధ్యమన్నది ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన వారెవరికైనా అర్థమవుతుంది. రాక్‌ఫిల్‌ డ్యామ్‌, స్పిల్‌వే పనులకు కావాల్సిన పూర్వరంగాన్ని సిద్ధం చేయడానికే మూడేళ్ల సమయం పడుతుందని ప్రాజెక్టు వద్దనున్న ఇంజనీర్లే చెబుతున్నారు. 160 మీటర్ల లోతులో రాక్‌ఫిల్‌ డామ్‌ పునాది వెడల్పు 1 కిలోమీటరు, పొడవు 1.4 కిలోమీటర్లు. స్పిల్‌వే పొడవు, వెడల్పు కూడా దాదాపు ఇంతే ఉంటుంది. సుమారు ఐదారు కొండల్ని పిండి చేయాలి.. పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ నిధుల కొరత వెంటాడుతూనే ఉంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత కేంద్రం ఇప్పటికి కేవలం రూ.850 కోట్లు మాత్రమే కేటాయించింది. 2011 అంచనాల మేరకు పోలవరం నిర్మాణ వ్యయం రూ.16వేల కోట్లు కాగా తాజాగా సవరించిన అంచనాల మేరకు దీని వ్యయం రూ.36వేల కోట్లకు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును తమ పరిధిలోకి తీసుకోవడానికి మీనమేషాలు లెక్కపెడుతోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ఏపీ ప్రభుత్వం మధ్య ఇంకా ఎంవోయూ కుదరలేదు. నాబార్డ్‌ ద్వారా రుణాలు ఇప్పిస్తామంటున్న కేంద్రం రీపేమెంట్‌ ఎవరు చేయాలన్నదానిపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు.  పోలవరం నిర్మాణం పేరిట జరుగుతున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. కానీ ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడికన్నా ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడని రాష్ట్ర పాలకులు గుర్తుంచుకుంటే బావుంటుంది. --మందడపు కృష్ణ (ఆంధ్ర జ్యోతి)  

# సుప్రీం హితవు!#

ప్ర‌జాజీవితంలో ఉన్నవారు విమర్శలకు తలొగ్గాల్సిందేనంటూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టు చెప్పిన హితవు అనేకమంది పాలకులకు వర్తిస్తుంది. ఆమెకూ, ఆ రాష్ట్రానికీ సంబంధించి ప్రత్యేకించి చేసిన వ్యాఖ్యలతో పాటు న్యాయస్థానం మరికొన్ని మంచిమాటలూ చెప్పింది. ‘పరువునష్టం’తో ఎదుటివారిని భయపెట్టడం ద్వారా విమర్శనూ, అసమ్మతినీ తొక్కిపెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయవద్దన్నది. ‘దేశద్రోహం’ మాదిరిగానే, ‘పరువునష్టం’ కూడా దుర్వినియోగమవుతున్న తరుణంలో అనేకమంది ఉద్యమకారులు, సంస్థలు డిమాండ్‌ చేస్తున్నట్టుగా దీనిని సివిల్‌ నేరంగా మార్చడంలో నష్టమేమున్నదో న్యాయవేత్తలు ఆలోచించాలి.
                  ప్రభుత్వాన్నీ, అధికార యంత్రాంగం పనితీరునూ తప్పుపట్టినవారిపై పరువునష్టందావా వేస్తూపోతుండటం ద్వారా ప్రతిపక్షాలపై కక్షసాధింపునకు పాల్పడటం వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిస్తుందనీ, విపక్షాల విమర్శలను సహించడం పాలకులు అలవర్చుకోవాలని సుప్రీంకోర్టు హితవు చెబుతున్నది. ఎండీఎంకే నాయకుడు విజయకాంత, ఆయన భార్య ప్రేమలతపై తమిళనాడు ప్రభుత్వం దాఖలు వేసిన పరువునష్టం దావా విచారణకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలే చేసింది. జూలైలో ఈ కేసులో వీరిపై జారీ అయిన నాన్‌బెయిలబుల్‌ అరెస్టువారెంట్లను నిలిపివేస్తున్న సందర్భంలోనే సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని కొంత తెలియచెప్పింది. పాలకులు తమ ప్రభుత్వాన్ని విమర్శించేవారిపై పరువునష్టం కేసులను ఆయుధాలుగా ప్రయోగించడం సరికాదనీ, ఇందుకు అధికారయంత్రాంగాన్ని వినియోగించుకోవడం సమ్మతం కాదని వ్యాఖ్యానించింది. ఐదేళ్ళకాలంలో జయలలిత ప్రభుత్వం రెండువందలకుపైగా పరువునష్టం దావాలు వేయడం, అందులో 80 పైచిలుకు ప్రధాన ప్రతిపక్షం డీఎంకేపైనా, యాభైవరకూ విజయకాంతపార్టీపైనా, మరో ముప్పై ఆయనపై వ్యక్తిగతంగానూ, మరో యాభై వివిధ మీడియా సంస్థలపైనా ఉండటం సుప్రీంకోర్టుకు ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం కలిగించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్‌ చేసినందుకు సుబ్రహ్మణ్యస్వామి ఐదు కేసులు ఎదుర్కొంటున్నారు. జయలలిత ఆరోగ్యంపై రాసినందుకూ, మాట్లాడినందుకూ పత్రికలూ, వ్యక్తులు కేసులు ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, అవసరమైతే వ్యక్తిగతంగా తేల్చుకోండి అని సుప్రీంకోర్టు హితవుచెప్పింది. ప్రభుత్వం అవినీతిమయమైపోయిందనీ, సక్రమంగా పరిపాలించడం లేదనీ అన్నంత మాత్రాన కేసులు పెట్టి నోరుమూయించే ప్రయత్నాలు చేయవద్దని వ్యాఖ్యానించింది.
                  ఒక వ్యక్తి పరువుప్రతిష్టలను దిగజార్చేలక్ష్యంతో చేసిన ఒక తప్పుడు వ్యాఖ్య లేదా ప్రకటన అంటూ ఈ చట్టం విస్తృతమైన నిర్వచనాన్ని ఇస్తున్నది కనుక అధికారంలో ఉన్నవారు అవలీలగా దానిని వాడుకోవడానికి వీలుకలుగుతున్నది. ఆరుసార్లు ముఖ్యమంత్రి అయి పలు కేసులు ఎదుర్కొన్న జయలలిత, తన ఆరోగ్యం గురించి వచ్చిన వ్యాఖ్యలు, పర్యటనలపై వచ్చిన విమర్శలతోపాటు, పరిపాలనకు సంబంధించిన విమర్శలను కూడా దీని పరిధిలోకి తీసుకురావడం సహజంగానే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమె పదవిలో ఉన్న మొత్తం కాలంలో దాదాపు వెయ్యికేసులు వేసినట్టు ఒక అంచనా. గత ఏడాది రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తినప్పుడు వాట్సాప్‌ ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించిన కొందరిపై ఆదిలోనే పరువునష్టం కేసులు వేసి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎవరూ ప్రశ్నించకుండా ఆమె నిలువరించగలిగారు. జయలలిత తీరును ఏకేస్తూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు పరువునష్టం దావా ప్రాధాన్యతను తగ్గించినట్టుగా భావించనక్కరలేదు. రాజకీయప్రత్యర్థుల నోరుమూయించడానికి అధికారంలో ఉన్న పార్టీలు ప్రభుత్వం తరఫున దీనిని ఆయుధంగా ప్రయోగించడాన్ని మాత్రమే అది తప్పుపడుతున్నది. ఈ చట్టం దుర్వినియోగమవుతున్నదన్న విమర్శలు అనేకం వచ్చినప్పటికీ, తాను దానిని కాపాడుకొచ్చిన విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు గుర్తుచేసింది. దానిని ఇలా దుర్వినియోగం చేసి అసలు స్ఫూర్తిని దెబ్బతీయవద్దని కోరుతున్నది. గతంలో సుబ్రహ్మణ్యస్వామి కేసులో ఐపీసీ 499, 500 సెక్షన్ల చెల్లుబాటును సుప్రీంకోర్టు నిర్థారించి, ‘డీక్రిమినలైజ్‌’ చేయడానికి నిరాకరించింది. వాక్‌స్వాతంత్ర్యాన్ని అడ్డుపెట్టుకొని ఒక వ్యక్తి ఇతరుల పరువు ప్రతిష్ఠలను ఏమాత్రం నష్టపరచకూడదన్న ఉద్దేశంతో ఈ పనిచేస్తూనే, వాక్‌స్వేచ్ఛ, భావస్వేచ్ఛ నిరంకుశమైనవి కావు, వాటికీ పరిమితులున్నాయ్‌ అని హెచ్చరిక కూడా చేసింది. అప్పటి సంగతి అలా ఉంచితే, జయలలిత వ్యవహారంలో సుప్రీంకోర్టు స్వయంగా అధికారంలో ఉన్నవారు పరువునష్టం దావాలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూసింది. అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు, ప్రజాసంక్షేమం కోసం కృషిచేసేవారు, పాలనలో పారదర్శకతను వాంఛిస్తున్నవారు కూడా మెడమీద ఇలా కత్తివేలాడుతున్నప్పుడు తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించలేరు. పరువునష్టాన్ని సివిల్‌ నేరంగా మార్చిన పక్షంలో మిగతా స్వేచ్ఛలను రక్షిస్తూనే, నోరువిప్పడానికి కూడా భయపడే పరిస్థితులను కాస్తంత మార్చవచ్చు. ( ఆంధ్ర జ్యోతి ) 

Friday, 26 August 2016

# ప్రజా సంక్షేమానికి విజయన్‌ ప్రభుత్వ ఐదేళ్ళ ప్రణాళిక..#



                    మలబార్‌ తీరంలో ఎర్రజెండా మరోసారి రెపరెపలాడింది. నాలుగు నెలల సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగు తోంది. మూడు నెలల ప్రభుత్వాన్ని పురిటిలోనే హతమార్చేందుకు కసాయి (కాషాయి) మూకలు కుట్రలు పన్నుతున్నాయి. తమ వ్యూహాలతో భయోత్పాతం సృష్టిస్తున్నారు. బాంబులతో దాడులు చేస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో అల్లర్లతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. వీటిని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొంటున్నది. ప్రజా సంక్షేమానికే పెద్ద పీట వేస్తూ ఐదేళ్ల ప్రణాళికలు రూపొందించింది. గత యుడిఎఫ్‌ ప్రభుత్వ వైఫల్యాలకు భిన్నమైన విధానాలను రూపొంది స్తోంది. ప్రజా వ్యతిరేక విధానాలు, మహిళలపై అత్యాచారాలు, లౌకికవాదం బలహీన పడటం, వ్యవసాయ వృద్ధి తిరోగమనం, ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లోకి దిగజారటం, సంప్రదాయ పరిశ్రమలు దెబ్బతినడం, విద్య కార్పొరేటీకరణ, ప్రజా ఆరోగ్య వ్యవస్థ బలహీన పడటం, విచ్చలవిడి అవినీతి, బంధుప్రీతి వంటి యుడిఎఫ్‌ విధానాలకు చమరగీతం పాడి ప్రత్యామ్నాయ విధానాల రూపకల్పనకై ప్రజలు ఆశతో సిపిఎం నేతృత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర కూటమికి అనుకూలంగా తీర్పునిచ్చారు. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే అవినీతి అంతం, సున్నా అసహనానికై దూరదృష్టి గల విధానాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఒక వైపు ప్రజా సంక్షేమం, మరోవైపు దూరదృష్టి గల విధానాల రూపకల్పన రెండూ సమాంతరంగా ముందుకు సాగుతున్నాయి. ఇలా ప్రజామోదమైన ప్రభుత్వం, ప్రజలతో మమేకమై విజయ పథంలో నడవటం కొన్ని మూకలకు మింగుడుపడటం లేదు. ఎలాగైనా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. వాటికి ఒక సెక్షన్‌ (కార్పొరేట్‌) మీడియా కూడా వత్తాసు పలుకుతూ... ప్రచారంలో అండగా నిలస్తున్నది. చిన్న చిన్న అంశాలను పెద్ద పెద్ద పతాక శీర్షికలుగా రాస్తున్నది. ప్రజా విశ్వాసాన్ని నీళ్ల పాలు చేసి తన మీడియా నైతికతను గంగలో కలిపుతున్నది.

|| ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ కీలక నిర్ణయాలు ||

తమ అవసరాలు తీర్చే ప్రభుత్వం తక్షణ అవసరమని కేరళ ప్రజానీకం ఎవరూ ఉహించలేని మెజార్టీతో ఎల్‌డిఎఫ్‌ కూటమిని గెలిపించారు. అధికారంలోకి వచ్చిన ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ విధాన నిర్ణయాలు కూడా ప్రజల ఆశలకు, ఆశయాలకు లోబడే నిర్మించబడుతున్నాయని ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల కల్పన వంటి ప్రాథమికాంశాలకు పెద్దపీట వేసే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుందని ప్రజలు భావిస్తున్నారు. మంత్రివర్గ తొలి నిర్ణయం దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. దళిత విద్యార్థిని జిషా హత్యాచారంపై ఐపిఎస్‌ అధికారిణితో విచారణ జరిపించింది. ఆమె కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, తల్లికి నెలకు రూ.5 వేల పెన్షన్‌తో పాటు వారికి ప్రభుత్వమే పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలలకే పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. దళితులపై సిపిఎం నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం. ప్రజల ఆక్షాంక్షలకు అనుగుణంగా పినరయి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. నిర్ణయాలు కూడా దీర్ఘకాలం పాటు ఆచరణలో ఉండాలని ప్రణాళిక వేసింది. ప్రజానుకూల నిర్ణయాలకు, అవినీతి నిర్మూలనకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. సంక్షేమ పింఛన్‌ వెయ్యి రూపాయలకు పెంచటం, యుడిఎఫ్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన పంచవర్ష ప్రణాళిక విధానాన్ని తిరిగి కొనసాగించడం, గత యుడిఎఫ్‌ ప్రభుత్వం 2016 జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు తీసుకున్న నిర్ణయాల్లో అవినీతి జరిగిందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణకు సబ్‌ కమిటీ(మంత్రి వర్గ ఉప సంఘం) వేసింది. అతి తక్కువ కాలంలోనే ఎకె బాలన్‌ నేతృత్వంలోని ఆ కమిటీ 19 చట్ట విరుద్ధ నిర్ణయాలు తీసుకున్నట్టు తేల్చింది. ప్రజలు చేసే ప్రతి ఫిర్యాదునూ నెల రోజుల్లో పరిష్కరించేందుకు, ప్రభుత్వ వ్యవహారాలను చక్కదిద్దడానికి అధికార యంత్రాంగం వారంలో ఐదు రోజులు రాష్ట్ర రాజధానిలో ఉండాలి. జిల్లా స్థాయిలో పరిష్కారానికి వీలుండే ఫిర్యాదులను రాష్ట్ర స్థాయికి తేవాల్సిన అవసరం లేదు. మూడంచెల పంచాయతీలకు 12 దశల్లో ఆర్థిక సహకారం, కొచ్చి మెట్రో, వాటర్‌ మెట్రో, స్మార్ట్‌ సిటీల పూర్తికి కృషి, రవాణా వ్యవస్థను మెరుగుపర్చడం, రోడ్ల నిర్మాణంలో నాణ్యత, రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు 45 కిలోమీటర్ల పొడవునా రోడ్డు విస్తరణ, తదితర అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది.

|| ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం ||

ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం దిశగా కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. దానికి అనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపులు చేస్తోంది. ఇప్పటికే ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తృత పరిచేందుకు రూ.150 కోట్లు కేటాయించింది. కేరళ ప్రజలు మినప్పప్పు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇటీవలి కాలంలో మినప్పప్పు ధర ఆకాశాన్నంటింది. దాంతో ప్రభుత్వమే మినప్పప్పును కొనుగోలు చేసి రూ.181 ఉన్న దాన్ని రూ.66కే మలెలి స్టోర్‌(ప్రభుత్వ దుకాణం) ద్వారా ప్రజలకు అందిస్తున్నది. ఇదే దుకాణం ద్వారా కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, కారం, పంచదార, కొబ్బరి నూనె, బియ్యం లాంటి 13 నిత్యావసర వస్తువులు అందిస్తున్నది. మళయాళీలకు అత్యంత ముఖ్యమైన ఓనం పండుగకు బియ్యం కొరత సృష్టించడానికి కొంత మంది కుట్రపన్నుతున్నారు. దాన్ని అధిగమించేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్చలు జరిపి, తక్కువ ధరకే ప్రజలకు అందించేందుకు విధానాలు రూపొందిస్తోంది. వ్యాపారులు మంకుపట్టు పడితే ప్రభుత్వమే బియ్యం కొనుగోలు చేసి, ప్రజలకు సబ్సిడీ ధరలకు అందించేందుకు నిర్ణయాలు చేస్తోంది.

|| ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి ||

కేరళలో మందుల కొరత విపరీతంగా ఉండేది. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం మందుల కొరత నివారణకు రూ.372 కోట్లు కేటాయించింది. ప్రభుత్వమే కొన్ని ప్రత్యేక దుకాణాల ద్వారా తక్కువ ధరలకే మందుల అమ్మకాన్ని నిర్వహిస్తున్నది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి సకాలంలో వైద్యాన్ని అందించే ప్రక్రియను చేపట్టేందుకు, ప్రయివేటు ఆస్పత్రుల్లో ప్రమాణాలతో పాటు వైద్యం ఖరీదు కాకుండా చర్యలు తీసుకునేందుకు, వైద్య, ఆరోగ్య శాఖల్లో ఖాళీలను భర్తీ చేసి వైద్యాన్ని అందించే చర్యలు చేపట్టేందుకు, సుదూర ప్రాంతాలకు కూడా వైద్యం సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

|| మెరుగైన విద్య...||

ప్రభుత్వ విద్యను మెరుగుపరిచేందుకు తక్షణ చర్యల ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించింది. మూసివేతకు సిద్ధంగా ఉన్న ఎయిడెడ్‌ స్కూళ్ళను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని విద్యాభివృద్ధికి బాటలు వేసింది. ఐదేళ్ళలో ఎయిడెడ్‌ పాఠశాలల అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించింది. మొదటి ఏడాది రెండు కార్యక్రమాల ద్వారా రూ.450 కోట్లు ఖర్చు చేయనుంది. ఐటి స్కూల్స్‌గా రూపకల్పన చేయాలని, 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎయిడెడ్‌ పాఠశాలల్లో 60 వేల హైటెక్‌ తరగతి గదులు, వెయ్యి స్కూళ్ళలో అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించాలని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య విద్యలో ప్రమాణాలు పాటించాలని కాలేజీలకు ఆదేశించింది. నాటి యుడిఎఫ్‌ ఇచ్చిన అక్రమ అనుమతులు రద్దు చేయడం, బోధనా ప్రమాణాలు లేని, మౌలిక సదుపాయాల కల్పనకు నోచుకోని కాలేజీలపై చర్యలు చేపట్టడం, ప్రయివేటు మెడికల్‌ కళాశాలల్లో ప్రభుత్వ జోక్యం తప్పనిసరి చేయటం, సెల్ఫ్‌పైనాన్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల అడ్మిషన్లు, ఫీజుల నిర్ణయంలో ప్రభుత్వాన్ని సంప్రందించడం వంటి నిర్ణయాత్మక చర్యలకు శ్రీకారం చుట్టింది.

|| నిరుద్యోగంపై యుద్ధం...||

నిరుద్యోగాన్ని తరిమికొట్టేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ప్రభుత్వ సంస్థల్లో, విభాగాల్లో ఏళ్ల తరబడి భర్తీకాని ఖాళీలను భర్తీ చేయాలని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐటి సంబంధిత రంగాల్లో ఉద్యోగ కల్పన, ఒక్క కొచ్చిలోనే లక్ష ఉద్యోగాల కల్పన లాంటి అనేక నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ రంగంలో 25 వేల ఉద్యోగాలు, పర్యాటక రంగంలో పది వేల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ఉద్యోగాల భర్తీకి అనుమతులు కూడా ఇచ్చింది.

|| వ్యవసాయాభివృద్ధి ||

ప్రాథమిక రంగమైన వ్యవసాయానికి కేరళ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. వరి అవసరం ఎక్కువ. ఉత్పత్తి తక్కువగా ఉండటంతో వరి సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వరి సాగును 1.98 లక్షల హెక్టర్ల నుంచి మూడు లక్షల హెక్టర్ల వరకు పెంచాలని నిర్ణయించింది. వ్యవసాయ సబ్సిడీలను పెంచాలని, వ్యవసాయోత్పత్తుల ధరల్లో రైతులకు తగిన పాత్ర ఉండాలని ప్రభుత్వం చెబుతోంది.

|| పరిపాలన ప్రక్షాళన...||

గత యుడిఎఫ్‌ ప్రభుత్వం ఐదేళ్లలో పరిపాలనా దుర్వినియోగానికి పాల్పడింది. అవినీతి విచ్చలవిడి అయిపోయింది. అన్ని రంగాలూ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయాయి. అధికార యంత్రాంగం ప్రజలకు దూరంగా ఉంది. ఈ అభివృద్ధి ఆటంకాలను తొలగించేందుకు ప్రస్తుత పరిపాలనా విధానంలో మార్పులు అవసరమని భావించిన ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలకు రాజ్యాంగ బద్ధమైన కమిటీని నియమించింది. ఈ కమిటీకి మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం సీనియర్‌ నేత విఎస్‌ అచ్యుతానందన్‌ను ఛైర్మన్‌(మంత్రి వర్గ హోదా)గా నియమించింది. గతంలో పరిపాలనలో పంచాయతీలకు పెద్దపీట వేసి దేశానికే ఆదర్శంగా నిలబడ్డ కేరళ వామపక్ష ప్రభుత్వం ఈసారి నూతన పరిపాలనా సంస్కరణలతో ప్రజల ముందుకు రాబోతోంది. ఇంతటి ప్రజారంజక ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ విధానాలు కొంతమందికి మింగుడుపడటం లేదు. దేశానికే ఆదర్శవంతమైన, ప్రజామోదమైన సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంపై కేంద్రంలోని బిజెపి దాడులకు ఒడిగట్టడం రాజకీయ తిరోగమనానికి నిదర్శనం. వీరికి స్థానిక అస్తిరతను కోరుకునే మూకలు జతకలవడం మరో పెద్ద ప్రమాదం. ఈ పరిస్థితులు ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుకు పెద్ద సవాల్‌గా మారాయి. ఒక్క కేరళనే కాక చిన్న ఈశాన్య రాష్ట్రమైన త్రిపురను కూడా ఈ మూకలు వదలటం లేదు. అక్కడ విభజన అల్లర్లు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారు. కేరళలో హిందూత్వ శక్తులు బాంబుల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసి అనిశ్చిత పరిస్థితులను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఏళ్ల చరిత్ర గల కమ్యూనిస్టు ప్రభుత్వాలు వారి ఆటలకు ఆదిలోనే అడ్డుకుంటాయి. ప్రజాందోళనతో తిప్పికొడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
- జె జగదీశ్‌