Monday, 18 July 2016

|| రాష్ట్రాల హక్కులను హరించే జిఎస్‌టి ||

                వస్తువుల, సేవల పన్ను (జిఎస్‌టి) చట్టాన్ని ఆమోదింప జేసుకునేందుకు ఎన్డీయే ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ఆడుతోంది. జిఎస్‌టి అమలైతే దేశ వార్షిక స్థూల జాతీయోత్పత్తి 2 శాతం పెరుగుతుందని వాదించటం అన్నిటికంటే హేయమైన అబద్ధం. జిఎస్‌టికి అలా అద్భుత ప్రభావం చూపగల సత్తాయే ఉంటే ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో నెలకొన్న సంక్షోభం ఎప్పుడో సమసిపోయి ఉండేది. అదే నిజమైతే అమెరికా జిఎస్‌టిని ఎప్పుడో అమలుచేసి తన స్థూల జాతీయోత్పత్తిని, తద్వారా ప్రపంచ జిడిపిని పెంచగలిగి ఉండేది. నేటి ప్రపంచంలో పరిశోధనతో సహా ప్రతిదీ సరుకుగా మారుతున్న పరిస్థితి ఉన్నది. పరిశోధనా ఫలితం ఎవరికి ఎలా కావాలంటే అలా మార్కెట్‌లో ఒక చొక్కా కొనుక్కున్నట్లు తగినంత డబ్బు చెల్లించి కొనే వీలుంది. ఇలాంటి కుహనా పరిశోధనను ఉటంకిస్తూ జిఎస్‌టిని అమలుచేస్తే దేశ జిడిపిలో ఏటా 2 శాతం వృద్ధి ఉంటుందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెబుతున్నారు. ఆ విధంగా తమిళనాడు తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలూ జిఎస్‌టికి మద్దతిస్తున్నాయని ఆర్థిక మంత్రుల సమావేశంలో జైట్లీ చెప్పారు. అయితే జిఎస్‌టి కౌన్సిల్‌ ఏర్పాటుకు తమిళనాడుతో సహా చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని ఆ సమావేశానికి సంబంధించిన నివేదిక తెలియజేస్తున్నది. బహుళజాతి కంపెనీలు, దేశీయ కార్పొరేట్‌ పెట్టుబడిదారులు చేస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా జిఎస్‌టి చట్టాన్ని ఆమోదింపజేయాలనే తొందరలో ప్రభుత్వం ఉన్నది. ఈ చర్యతో రాజకీయ వ్యవస్థ ఫెడరల్‌ స్వభావానికి విఘాతం ఏర్పడుతుందా అనే విషయం గురించి ఎటువంటి ఆలోచనా చేయటం లేదు.
ఈ విషయాన్ని చర్చించే ముందు జిఎస్‌టికి అనుకూలంగా చేసే వాదనలను చూద్దాం. జిడిపి పెరుగుతుందని, రాష్ట్రాల ఆదాయం పెరుగుతుందనే ఊహాజనిత వార్తలను పక్కనబెట్టి జిఎస్‌టికి అనుకూలంగా చేస్తున్న మూడు మౌలిక వాదనలను పరిశీలిద్దాం. మొదటి వాదన ప్రకారం ఒకే రకమైన జిఎస్‌టి రేటువల్ల జాతీయ మార్కెట్‌ ఏకీకృతమవుతుంది. నిజానికి ఈ ఏకరూప రేటు మూడు ఏకరూప రేట్లుగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పరోక్ష పన్నుకు బదులుగా రాష్ట్ర వస్తువులు, సేవల పన్ను, కేంద్ర ప్రభుత్వం విధించే పరోక్ష పన్నుకు బదులుగా కేంద్ర వస్తువుల, సేవల పన్ను, మూడవది అంతర్రాష్ట్ర లావాదేవీలకు సంబంధించిన పన్ను. వివిధ స్థానాల వద్ద వేరువేరుగా పన్నులుండే ప్రస్తుత విత్త విధానాలకు భిన్నంగా ఏకరూప విధానాన్ని ప్రవేశపెట్టటంవల్ల దేశవ్యాప్తంగా సరకుల రవాణాకు అడ్డంకులు తొలగి మార్కెట్‌ ఏకీకృతమవుతుందని చెబుతుంది.
రెండవ వాదన మొదటి వాదనకు అనుబంధంగా ఉన్నప్పటికీ దీని ప్రత్యేకత దీనికున్నది. ఉత్పత్తి, అమ్మకం విలువపై వేసే పరోక్ష పన్ను రేట్లను ఏకరూపంగా చేయటం వల్ల పన్నుల వ్యవస్థలో హేతువు నెలకొంటుంది. ఇది ఏమి సాధించినా, సాధించక పోయినా దీని సుగుణం దీనికున్నది. సాధారణీకరించే, హేతుబద్ధంచేసే సాధనంగా ఏకరూపతకు ఒక సుగుణం ఉన్నది. మొత్తం విలువపై కాకుండా తోడైన విలువపై పన్ను విధించటం వల్ల 'పర్యవసాన ప్రభావం' లేకుండా పోతుంది. గతంలో చెల్లించిన పన్నులపై తిరిగి పన్ను చెల్లించవలసి రావటంతో ఈ ప్రభావం ఏర్పడుతుంది.

# 'పర్యవసాన ప్రభావం' భావన #
'పర్యవసాన ప్రభావం' భావన పట్ల స్పష్టత రావటానికి ఒక ఉదాహరణ ఇస్తే సరిపోతుంది. 'ఎ' అనే ఒక యూనిట్‌ సరుకు 'ఎల్‌' యూనిట్‌ శ్రమతో కలిస్తే యూనిట్‌ 'బి' అనే సరుకు ఉత్పత్తి అవుతుంది. వేతనం రేటు రూ.100 అనుకుంటే పన్ను చెల్లించటానికి ముందు యూనిట్‌ 'ఎ' సరుకు ధర రూ.100. 'బి' అనే సరుకు మీద 20 శాతం లాభం వేసుకుంటే ఎ, బి సరుకుల మీద విడివిడిగా వేసే పరోక్ష పన్ను 10 శాతం చొప్పున ఉంటుంది. ఆ తరువాత ఒక యూనిట్‌ బి అనే సరుకును రూ.277.20కి అమ్ముతారు(ఒక యూనిట్‌ ఏ సరుకు ధర 100 రూపాయలు+10 శాతం దానిపై పన్ను+100 రూపాయల శ్రమ+20 శాతం లాభం+10 శాతం పన్ను). దీనిలో మొత్తం పన్ను రూ.35.20గా ఉంటుంది. ఈ పన్నులో ఎ మీద వేసిన 10, బి మీద వేసిన 25.2, అంతకు ముందు వేసిన పన్ను వల్ల వ్యయం పెరగడంతో 1.2 రూపాయల పన్ను అదనంగా జోడింపబడింది. వేరేవిధంగా చెప్పాలంటే ఇంతకు ముందు చెల్లించిన పన్ను మీద తిరిగి అదనంగా పన్ను చెల్లించవలసిరావటం అహేతుకం. ఎందుకంటే పన్ను వేయవలసింది ఎంత విలువ జోడింపబడిందనే దానిపైన మాత్రమే.
రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ రాష్ట్రాలలోకి పెట్టుబడులను ఆకర్షించటానికి పన్నులను తగ్గించటం ద్వారా పోటీపడకుండా ఏకరూప పన్ను విధానం అడ్డుకుంటుందనేది మూడవ వాదన. మరో విధంగా చెప్పాలంటే ఇది రాష్ట్రాలకున్న 'నియంత్రణల తొలగింపు' స్వేచ్ఛను అడ్డుకుంటుంది. పెట్టుబడులను ఆకర్షించటానికి వివిధ దేశాల ఆర్థిక విధానాలు పోటీపడే స్వభావాన్ని కలిగి ఉంటాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా చేసిన నిదర్శనాలు చాలానే ఉన్నాయి. అయితే మొదటి రెండు వాదనలకు బలం లేదు. ఇంతకు ముందే పేర్కొన్నట్టు జోడించిన విలువపై పన్ను వేసే జిఎస్‌టి వంటి విధానం అమెరికాలో లేదు. మరోవిధంగా చెప్పాలంటే 'పర్యవసాన ప్రభావాల'ను అమెరికా ఆనందంగా అనుమతిస్తుంది. అదే సమయంలో ఆ దేశంలో ఏకరూప పన్ను రేటు లేక కనీసం ఒక స్థాయి కంటే తక్కువ టర్నోవర్‌పై పన్ను మినహాయింపునిచ్చే ఏకరూప విధానం కూడా లేదు. పన్ను, మినహాయింపు పరిమితులు రెండూ ఒక రాష్ట్రానికి, మరో రాష్ట్రానికి పొంతనలేకుండా ఉంటాయి. అంతేకాక అనేక రకాల పన్నులుంటాయి. ఇవి కూడా ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి పొంతనలేకుండా ఉంటాయి. కాబట్టి అమెరికాలో ఏకీకృతమైన జాతీయ మార్కెట్‌ లేదని ఎవరూ అనలేరు. ఒకవేళ అన్నా ప్రపంచంలో అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఏకీకృత జాతీయ మార్కెట్‌ లేనప్పుడు ఏకీకృతం కాకపోవటంవల్ల ఏమవుతుందని ప్రశ్నించవచ్చు. వ్యాట్‌ అమలులో ఉన్న ఐరోపా యూనియన్‌ ఈ విషయంలో మార్గదర్శకంగా ఉండేది. దీనివల్ల అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు తలెత్తి ఐరోపా యూనియన్‌ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వ్యాట్‌ అమలులో ఉండటానికీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవటానికీ సంబంధం లేదనేది నిజం. అయితే వ్యాట్‌ అమలులో ఉన్నదా, లేదా అనేది ఆర్థిక వ్యవస్థ పనిని ప్రభావితం చేయలేదనే విషయాన్ని అది స్పష్టం చేస్తున్నది.
కానీ మరో కారణం చేత దీనికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. అదేమంటే అమెరికాకు ఏకరూప వ్యాట్‌ లేకపోవటానికి కారణం ఆ దేశంలోని ఫెడరల్‌ వ్యవస్థను పదిలంగా ఉంచటంలో ఉన్నది. దేశంలో ఏకరూప పన్ను రేటు ఉండటం వల్ల రాష్ట్రాలకు పన్ను విధించే స్వేచ్ఛ పోతుంది. వేరే మాటల్లో చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను ఇది కబళిస్తుంది. దానితో దేశ రాజకీయ వ్యవస్థకున్న ఫెడరల్‌ స్వభావం దెబ్బతింటుంది. ఈ విషయం గురించి అంతగా చర్చ జరగలేదు. ప్రస్తుతం ఉన్న దానికన్నా రాష్ట్రాల ఆదాయం పెరుగుతుందా లేక తరుగుతుందా అనే దానిపైనే చర్చంతా జరుగుతున్నది. రాష్ట్రాల ఆదాయం తగ్గితే మూడు సంవత్సరాలపాటు పరిహారం చెల్లిస్తానని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.

# ఫెడరల్‌ వ్యవస్థను అతిక్రమించడమే #
అయితే ప్రస్తుత ఆదాయంతో పోల్చినప్పుడు ఆదాయాన్ని కోల్పోవటం అనేది సమస్య కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో తమకు తోచిన రీతిలో ఆదాయాన్ని పెంచుకునే స్వేచ్ఛను కోల్పోవటమనేదే అసలు సమస్య. మన ఫెడరల్‌ వ్యవస్థ ఆమాటకొస్తే ఏ ఫెడరల్‌ వ్యవస్థకైనా ప్రమాణ చిహ్నం ఏమంటే పరస్పరం సంబంధంలేని అనేక రాజకీయ పార్టీలు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేయటం. ఆర్థిక విధానాలను తమ దృక్పథాలకనుగుణంగా రూపొందించుకునే స్వేచ్ఛ వాటికుండటం. కొన్ని ప్రభుత్వాలు 'ఆర్థికాభివృద్ధి' కోసం పెట్టుబడులను ఆకర్షించటానికి పన్ను రాయితీలను ఇవ్వవచ్చు. ఇతరులు పన్నులను పెంచి సంక్షేమ కార్యకలాపాలపై లేక విద్య, ఆరోగ్యం వంటి సామాజిక రంగాలపై వ్యయాన్ని పెంచాలని భావించవచ్చు. వేరే మాటల్లో చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు తమకు నచ్చిన విత్త విధానాలను రూపొందించుకునే అవకాశం ఉండాలి. 'నియంత్రణల తొలగింపు' స్వేచ్ఛను లేకుండా చేయాలనే వాదనను తరువాత చర్చిస్తాను. ప్రతిపాదిత జిఎస్‌టి ఈ స్వేచ్ఛను హరిస్తుంది. పన్ను రేటులో ఏమాత్రం మార్పు తేవాలన్నా జిఎస్‌టి కౌన్సిల్‌ను సంప్రదించాలి. ఈ కౌన్సిల్‌లో కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సభ్యులుగా ఉంటాయి. ఈ కౌన్సిల్‌లో అనేకమంది సభ్యులలో ఒకే ఒక్క సభ్యత్వం కలిగిన రాష్ట్ర ప్రభుత్వం తాను పన్ను రేట్లను సవరించుకోవాలంటే కౌన్సిల్‌ ఆమోదాన్ని తీసుకోవలసి ఉంటుంది.
దీనితో మన ఫెడరల్‌ రాజ్యాంగాన్ని పెద్ద ఎత్తున మార్చినట్టు అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సభ్యులుగా ఉన్న జిఎస్‌టి కౌన్సిల్‌ రాజ్యాంగేతర సంస్థ. రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఈ సంస్థ కబళిస్తుంది. ఇది అధికారాలను కేంద్రీకృతం చేసే చర్య. ఈ చర్యను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ అంగీకరించినప్పటికీ దీనితో రాజ్యాంగ 'మౌలిక నిర్మాణం' దెబ్బతినదా అనే ప్రశ్న తలెత్తుతుంది. అమ్మకపు పన్నుకు బదులుగా వ్యాట్‌ను ప్రవేశపెట్టినప్పుడు పన్నులు విధించే రాష్ట్ర ప్రభుత్వ స్వేచ్ఛ దెబ్బతింటుందనే సమస్య ఎదురవుతుందని విత్త విధానాల నిపుణుడు అమరేష్‌ బాగ్చీ ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీలో రాశారు. అయితే వ్యాట్‌ విషయానికి వచ్చినప్పుడు దానిలో నాలుగు రకాల పన్ను రేట్లు ఉన్నాయి. అదే జిఎస్‌టిలో ఒకే ఒక్క రేటు ఉండటం చాలా తీవ్రమైన విషయం. ఒకవేళ ఒకే ఒక్క కనీస ఎస్‌జిఎస్‌టిని ప్రతిపాదించి ఆపైన రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఇష్టమైన రేట్లను పెట్టుకునే అవకాశం కల్పించి ఉంటే రాష్ట్రాల అధికారాలు అంతగా దురాక్రమణకు గురై ఉండేవికావు. దీనితో ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షించటానికి రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడే సమస్య కూడా పరిష్కరింపబడేది. అయితే దీన్ని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపాదించటం లేదు. ఇంతకుముందున్న మన్మోహన్‌-చిదంబరం కూడా ఈ ప్రతిపాదన చేయలేదు. వాళ్ళు కూడా సిజిఎస్‌టి సరసన ఏకరూప ఎస్‌జిఎస్‌టి రేటును ప్రతిపాదించారు. అలాంటి ఏకరూప ఎస్‌జిఎస్‌టి రేటును జిఎస్‌టి కౌన్సిల్‌ నిర్ణయిస్తుంది. ఇది ఫెడరల్‌ నిర్మాణంపై దారుణమైన ఉల్లంఘనగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను జిఎస్‌టి హస్తగతం చేసుకునే ప్రయత్నానికి వ్యతిరేకంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ గళాన్ని విప్పటం, తద్వారా ఏకరూప పన్ను రేటును వ్యతిరేకించటం ఆనందించదగ్గ విషయం.
- ప్రభాత్‌ పట్నాయక్‌

No comments:

Post a Comment