Thursday, 30 June 2016


|| మోళీ...మోడీ, అంకెల గారడీ ||



ఏ విషయాన్నైనా తిమ్మిని బమ్మిని చేసే వెసులుబాటు కేవలం సంఖ్యాశాస్త్రానికే పరిమితం. టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యల్లో ఆరితేరిన నరేంద్ర మోడీ ప్రభుత్వం తాజాగా 7వ వేతన సంఘం అమలులో అంకెలతో ఆడుకుంది. జస్టిస్‌ ఎకె మాథుర్‌ నేతృత్వంలోని వేతన సంఘం గతేడాది నవంబర్‌లో చేసిన సిఫారసులను ఉద్యోగులు, కార్మికులు నిర్ద్వందంగా వ్యతిరేకించినా, ఎలాంటి మార్పులూ చేయకుండానే మక్కీకి మక్కీ ఆమోదించడం అభ్యంతరకరం. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం 7వ వేతన సంఘం సిఫారసులకు ఆమోదముద్ర వేసి, ఇది చారిత్రాత్మక నిర్ణయమంటోంది. కోటి కుటుంబాలకు సంతోషం పంచామని కోతలు కోస్తోంది. వేతన సంఘం సిఫారసుల అమలుపై బిజెపి ప్రభుత్వ ప్రచారం అనుకూల డబ్బా. 7వ వేతన సంఘం అమలు వలన ప్రభుత్వ ఖజానాపై అదనంగా రూ.1.02 లక్షల కోట్ల భారం పడుతున్నమాట నిజమే కానీ ఉద్యోగుల వేతనాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయనడం ఎంతమాత్రం నిజం కాదు. 5వ వేతన సంఘం వలన రూ.17 వేల కోట్లు, 6వ వేతన సంఘం వలన రూ.40 వేల కోట్లు ఖజానాపై భారం పడగా ఈ సారి రూ.1.02 లక్షల కోట్ల బండ మోయాల్సి వస్తోందంటూ అక్కడికి ఉద్యోగులకు భారీగా ఒరగబెట్టామంటోంది సర్కారు. 2008లో 6వ వేతన సంఘం భారం అప్పటి జాతీయ స్థూలోత్పత్తి (జిడిపి)లో 0.77 శాతం కాగా ఏడేళ్ల తర్వాత మోడీ సర్కారు అమలు చేస్తున్న 7వ వేతన సంఘం భారం జిడిపిలో 0.65 శాతమే. గతం కంటే కూడా జిడిపిలో వేతనాల ఖర్చును తగ్గించుకొని ఉద్యోగులకు పెద్ద పీట వేశామనడం మోసం. ఈ ఏడేళ్లలో జిడిపి ఎంతో పెరిగింది. నిత్యావసరాలు సహా సమస్త ధరలూ కొన్ని వందల రెట్లు పెరిగాయి. వాటితో పోల్చితే సగటున ఉద్యోగుల వేతనాలు, భత్యాలు కలిపి 23.55 శాతం పెంచడం భారీ ఊరట ఏమీ కాదు. వాస్తవానికి ఈ పెంపుదలతో ఉద్యోగుల స్థూల వేతనం పెరిగేది 14.2 శాతం మాత్రమే. కింది స్థాయి ఉద్యోగుల చేతికొచ్చే వేతనంలో పెరుగుదల కేవలం 7.4 శాతం మాత్రమే. పైగా ఇప్పటికే ఇంక్రిమెంట్లు, భత్యాల రూపంలో పెరిగిన వేత నాలతో లెక్కిస్తే అదనంగా ఉద్యోగుల చేతికొచ్చేది నామమాత్రమే.
గడచిన 70 సంవత్సరాల్లో అత్యల్ప పెంపు ఇదే. జూనియర్‌ స్థాయి ఉద్యోగులు, పింఛనుదారులకు మూలవేతనంలో 14.27 శాతం పెంపును 7వ వేతన సంఘం సిఫారసు చేయగా కేంద్రం దాన్నే ఓకే చేసింది. గతంలో 6వ వేతన సంఘం 20 శాతం సిఫారసు చేయగా అప్పటి సర్కారు అమలు చేసేటప్పుడు రెట్టింపు చేసింది. ఈ నిజాన్ని కావాలనే బిజెపి సర్కారు దాచి పెట్టింది. అందరికీ సరాసరిగా చూసుకున్నా 17 ఏళ్లలో ఈ తడవే అత్యల్ప పెంపు. కానీ కనీస వేతనాన్ని రూ.7 వేల నుంచి రూ.18 వేలు, గ్రాట్యూటీ, పరిహారం, గృహ రుణ పరిధి పెంచామని గొప్పలకు పోతోంది కేంద్రం. కేబినెట్‌ సెక్రటరీ జీతం రూ.90 వేల నుంచి రూ.2.25 లక్షలకు పెంచామంటోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 47 లక్షల మందిలో కేబినెట్‌ సెక్రటరీ ర్యాంక్‌ వారిని వేళ్లపై లెక్కించవచ్చు. క్లాస్‌-1 ఆఫీసర్ల ప్రారంభ జీతం ఇక రూ.56,100 కాగా ఆ స్థాయి అధికారుల సంఖ్య పరిమితమే. లక్షలాదిగా ఉన్న ఉద్యోగుల జీతాలు పెరిగేది అంతంతమాత్రమే. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త వేతనాల వలన కనీస, అత్యధిక వేతనాలు తీసుకునే వారి మధ్య అసమానతలు పెంపొందుతాయి. ప్రైవేటు సంస్థల్లో కంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు గౌరవనీయ స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకుంటామంటోంది సర్కారు. అప్పుడే ప్రతిభావంతులు సర్కారీ ఉద్యోగాలపట్ల ఆకర్షితులవుతారనీ చెబుతోంది. ఉద్యోగుల జీతాల్లో భారీ అసంబద్ధత పెట్టుకొని తమ లక్ష్యాలు సాధిస్తామంటే ఎలా?
వేతన సంఘం సిఫారసులను ఉద్యోగ, కార్మికులు గతంలోనే వ్యతిరేకించగా బిజెపి సర్కారు వారి అభిప్రాయాలను, డిమాండ్లను పట్టించుకోలేదు. కనీసం చర్చలు కూడా జరపకుండా ఏకపక్షంగా వ్యవహరించింది. దీంతో ఉద్యోగులు, కార్మికులు నిరసనలు తెలుపుతున్నారు. నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం, ఉద్యోగుల కోత, కొత్త రిక్రూట్‌మెంట్‌ లేమి, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతుల ప్రవేశం నిరుద్యోగ యువతను ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌ ఆదేశిత విధానాలను గత కాంగ్రెస్‌, ప్రస్తుత బిజెపి పుణికిపుచ్చుకొని అవి ఆడమన్నట్లు ఆడుతున్నాయి. కొన్ని రకాల భత్యాలను తొలగించాలని, కొన్నింటిలో మార్పు చేయాలన్న మాథుర్‌ సిఫారసులు ఆ కోవలోనివే. ఉద్యోగుల ఆగ్రహంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గినా పరిశీలన పేర కత్తి వేలాడుతూనే ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల జీత, భత్యాల పెంపుతో ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతుందని, పొదుపు, కొనుగోళ్లు పెరుగుతాయంటున్నారు విత్త మంత్రి జైట్లీ. కోట్లాది మంది సంఘటిత, అసంఘటిత, ప్రైవేటురంగాల్లో అరకొర వేతనాలతో నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వరంగంలోనే కాంట్రాక్టు, ఔట్‌సోర్స్‌పై అత్యల్ప జీతాలపై వెట్టి చేస్తున్నారు. వీరందరికీ ధరల పెరుగుదలకనుగుణంగా కనీస, నిజ వేతనాలు పెంచి అమలు చేస్తే ఇంకా గిరాకీ పెరిగి ఆ మేరకు వ్యవస్థ బాగుపడుతుంది. ఇప్పటికైనా 7వ వేతన సంఘం సిఫారసులను కేంద్రం పునఃసమీక్షించాలి. ఉద్యోగ, కార్మిక సంఘాల అభిప్రాయాలను, డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలి
|| విదేశీ ప్రత్యక్ష మాయజాలం ||

             నయా ఉదారవాద ఆర్థిక విధానాలు సంస్కరణలనే ముసుగు వేసుకొని దేశసంపదను బాహాటంగా కొల్లగొట్టడం మొదలుపెట్టి పాతిక సంవత్సరాలు పూర్తయిన ఈ సందర్భంలో ఆ విధానాల నిజస్వరూపం నగంగా బయట పడుతోంది. కొన్ని రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు లు ససేమిరా ఆహ్వానించరాదని ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అప్పట్లో వాదించగా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అవే పెట్టుబడులు అద్భుత మంత్రదండాల్లాగా కనబడుతుండడం యాదృచ్ఛికమేమీ కాదు!! ఆడేదెవరైనా ఆడించేవారు ఒక్కరే అని మరొక్కసారి రుజువవుతున్న సందర్భం ఇది. పైకి స్వదేశీ ముసుగు వేసుకున్న కాషాయదళం అధికారంలోకి రాగానే విదేశీ సామ్రాజ్యవాద శక్తులకు రక్షణ రంగంతో సహా అనేక కీలక రంగాలను దాసోహం చేయడం వారి సామ్రాజ్యవాద ఊడిగపు చరిత్ర కొనసాగింపే సుమా! మతమౌఢ్యపు మత్తుతో ఓలలా డుతూ, శాస్త్రీయత, హేమబద్ధతలను కాలరాస్తూ, ఒక పక్క బుద్ధిజీవులను భౌతికంగా సైతం నిర్మూలిస్తూ, మరో పక్క పాశ్చాత్య సాంకేతికత మన దేశానికి అవసరమని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నిస్సిగ్గుగా ఆహ్వానించడం బిజెపివారికే చెల్లింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అవసరమైతే యుద్ధ విమానాలను సరఫరా చేస్తామని విర్రవీగిన అమెరికాకు 'మాకు కేవలం ముడి అల్యూమినియం పంపించండి చాలు' అని చెప్పిన స్టాలిన్‌ ధీరోదాత్తత ఎక్కడీ? ప్రపంచంలోనే అత్యధిక ముడి అల్యూమినియం నిల్వలున్న దేశాల్లో ఒకటైన భారతదేశానికి ఆయుధ కర్మాగారాలను విదేశాల నుంచి ఆహ్వానిస్తున్న మోడీ నిర్లజ్జ లొంగుబాటు ఎక్కడీ? నిజానికి ముడిపదార్థాల పట్టుగొమ్మ అయిన భారతావని నుంచి వాటిని కొల్లగొట్టుకు పోయిన, పోతున్న సామ్రాజ్యవాదుల కన్నా మా వనరులు కొల్లగొట్టండి మహాప్రభు అంటూ ప్రాధేయపడుతున్న భారత పాలకవర్గం ప్రతినిధులు ఏ మాత్రం తక్కువ ద్రోహులు కాదు.

జాతీయోత్పత్తి వృద్ధిరేటు, తలసరి ఆదాయం వంటి గణాంక మాయజాల మత్తులో గత పాతికేళ్లుగా నిరుపేదల సంఖ్య పెరుగుతూనే ఉందన్నది వాస్తవం. మరుగున పడుతున్నా ఈ పరిణామం ఆయా విధానాల వైఫల్యం కాదా!! ఒక పక్క ఆగర్భ శ్రీమంతుల జాబితాలో భారతీయులు పెరుగుతూ ఉండటంతో పాటు మానవాభివృద్ధి సూచీలలో మనదేశం అనేక ఆఫ్రికా దేశాల కన్నా వెనుకబడి ఉండడం చేదు నిజం కాదా!! కేవలం కోట్లకు పడగలెత్తినవారే ఎన్నికల్లో పోటీ చేయగలిగే పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు ప్రజలకు ప్రాతినిధ్యం వహించకుండా బడాబాబుల కొమ్ముకాయడం, సామాన్యుల నడ్డివిరిచే విధానాల వాహకులుగా మారి ఉన్నత వర్గాల ఊడిగంలో ఓలలాడటం రాజకీయార్థిక దివాళాతనం కాదా!!

విజరు మాల్యా వంటి అపరాధులు అతి సులభంగా దేశం దాటి వెళ్లిపోయి సర్వసుఖాలూ అనుభవిస్తూండటం ఒక సామాన్య వ్యవసాయ రుణం తీసుకుని నిజాయితీగా వ్యవహరించే సగటు భారతీయ రైతుపై జరుగుతున్న క్రూర పరిహాసం కాదా!! విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల ధరల నుంచి ఎప్పుడు, ఎక్కడ, ఏ పంట వెయ్యాలో నిర్ణయించే అధికారం వరకూ గుత్తగా సొంతం చేసు కున్న బహుళజాతి కంపెనీలు భారత వ్యవసాయరంగాన్ని ఒంటిచేత్తో శాసిస్తూ మన ఆహార భద్రతకే తీవ్ర ప్రమాదంగా పరిణమించడం సిగ్గుచేటు కాదా!!

జిజ్ఞాస, పరిశోధన, అన్వయ శోధన వంటి మూల వ్యవస్థలోనే నిర్వీర్యం చేసి, శాస్త్రీయ అవగాహనను చిదిమివేసి, అతి పెద్ద సంఖ్యలో విదేశీ శక్తులకు చౌక కూలీలను అందించడమే ఏకైక ధ్యేయంగా విద్యారంగాన్ని భ్రష్టుపట్టించి కొన్ని తరాలపాటు వెన్నెముక లేని విద్యార్థులను ఉత్పత్తి చేయడం తిరోగమనం కాదా!!

ఇలా ఏ రంగం తీసుకున్నా సంక్షోభానికి అతిచేరువలో ఉన్న పరిస్థితి ఆయా విధానాల దుష్టపరిణామమే కదా!! ఎక్కువగా జరిగిన, జరుగుతున్న చెడుకు సైడ్‌ ఎఫెక్ట్‌లా మంచి కూడా ఉండడం విలోమ వైచిత్రి. ఇలాంటి తలకిందులు విధానాల కొనసాగింపుగా ఇప్పుడు రక్షణ, విమానయాన, ఔషధ, వ్యవసాయోత్పత్తుల వాణిజ్యం వంటి కీలక రంగాలతో పాటు మరికొన్ని ఇతర రంగాలకు ఇంచుమించు వంద శాతం ప్రత్యక్షపెట్టుబడులను ఆహ్వానిస్తూ విదేశీ శక్తులకు బార్లా తెరవడం ఆశ్చర్యకరమేమీ కాదు కానీ తప్పకుండా ప్రమాదకరం. ఈ సందర్భంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిజస్వరూపం నిగ్గుతేల్చాల్సిన అవసరం కూడా ఉంది.

ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉద్యోగ కల్పనకు ఉపయోగపడతాయనే ఒక దుష్ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని స్వయానా స్వయం సేవకుడైన గురుమూర్తి వంటి వారే సెలవిచ్చారు. 1991 నించి 2013 వరకు కార్పొరేట్‌ రంగం కొత్తగా 28 లక్షల ఉద్యోగాలు కల్పించింది. అయితే కేవలం సాఫ్ట్‌వేర్‌ రంగమే ఈ కాలంతో 35 లక్షల ఉద్యోగాలు కల్పించింది. దానర్థం ఏమిటంటే ఇంచుమించు ఏడు లక్షల ఉద్యోగాలు ఉత్పత్తి ఆధారిత వ్యవస్థీకృత రంగం నించి మాయమయ్యాయన్న మాట. అంటే ఉపాధి కల్పన అభూత కల్పన కాక మరేమిటి?

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టుల్లో కన్నా బ్రౌన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టుల్లోకి ఎక్కువ ప్రవహించడం పచ్చినిజం. అంటే కొత్తగా మొదలెట్టే వ్యాపారాల కన్నా ఇప్పటికే మనుగడలో ఉన్న వ్యాపారాలలో వాటా కనుక్కోవడానికి ఈ పెట్టుబడులు మొగ్గు చూపుతున్నాయి. దేశీయ పెట్టుబడిదారుల దళారీకోరుతనం అందుకు సహాయ సహకారాలు అందిస్తోంది. తద్వారా యాజమాన్య మార్పు తప్ప కొత్తగా ఈ దేశానికి ఒరిగిందేమీ లేదు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానం గమనించి మనం కూడా అది నేర్చుకుంటూ క్రమంగా స్వావలంబన వైపు పరుగులు పెడతామని పాతికేళ్లుగా చెబుతూ వచ్చిన రంగుల కల అంతరిక్ష పరిశోధన, సాఫ్ట్‌వేర్‌, ఫార్మా వంటి రంగాల్లో తప్ప ఏ ఇతర రంగంలోనూ నిజమవుతున్న దాఖలాలు లేవు. ఇప్పటిదాకా సాధించిన సాంకేతిక పురోగతి కూడా ఇప్పుడు విదేశీ శక్తులకు ధారాదత్తం చెయ్యబూనడం మరో మోసం. లక్షల మంది ఇంజనీర్లను ప్రతి సంవత్సరం తయారు చేస్తున్న మనం అన్వేషణల్లో, ఆవిష్కరణల్లో మాత్రం ఎంత వెనకబడి ఉంటున్నామో గమనిస్తే ఈ వాదనల్లోని డొల్లతనం బయటపడుతుంది.

విదేశీ పెట్టుబడి మన ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశిస్తే ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుందన్న అపోహ కూడా సరైనది కాదు. ఎందుకంటే మనదేశంలోకి ప్రవహించే పెట్టుబడుల్లో కనీసం సగం మొత్తం రాయల్టీల రూపంలో, డివిడెండ్ల రూపంలో, కన్సల్టెన్సీ ఫీజుల రూపంలో బయటికి తరలించబడుతోందన్నది వాస్తవం కాబట్టి. అలాగే సేవారంగంలోకి ప్రవేశిస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేవలం భారతీయ నిపుణుల శ్రమను దోచుకుంటూ లాభాలు కొల్లగొడుతున్నారనేది స్పష్టం కాబట్టి. అలాగే బ్యాంకింగ్‌, బీమా రంగాల్లో విదేశీ కంపెనీలు తెచ్చే పెట్టుబడి అత్యంత స్వల్పం. కానీ మన ప్రజల దగ్గర డబ్బు సేకరించి దానితో వ్యాపారం చెయ్యడం వాటి లక్షణం కాబట్టి.
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, దేశీయ ఉత్పత్తి రంగానికి ఊతమివ్వడం, విద్యావ్యవస్థను శాస్త్రీయంగా సంస్కరించడం, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం, కొనుగోలు శక్తి పెరిగేలా చర్యలు తీసుకోవడం వంటి ముఖ్య చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు వీటికి మాత్రం అద్భుతమైన పేర్లు పెట్టి అంతర్లీనంగా సదుపాయాలు, నిధులు, వనరులు, దేశసంపద అయిన ముడిపదార్థాలు మాత్రం బడా కార్పొరేట్‌ శక్తులకు, విదేశీ బహుళజాతి గుత్తసంస్థలకు ధారాదత్తం చేయడం కేవలం కపటనాటకమే!!
విదేశీ పెట్టుబడులు మాత్రమే ఆహ్వానిస్తున్న ప్రభుత్వాలు ఎంతో ముఖ్యమైన ఒక నిర్ణయానికి ప్రజాభిప్రాయాన్ని కోరిన బ్రిటన్‌ నుంచి అటువంటి ప్రజాస్వామ్యిక విలువలు కూడా ఆహ్వానించి అవాహన చేసుకుంటే మంచిది. అయినా ఆశావాదం మంచిదే కానీ మిధ్యావాదం నిరుపయోగం.
- ప్రొఫెసర్‌ రాంపల్లి శశికుమార్‌

|| రాజధాని నిర్మాణం-కుంభకోణాల కేంద్రం ||

           అమరావతి రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, చేసుకుంటున్న ఒప్పందాల వల్ల భవిష్యత్‌లో ఈ ప్రాంతం కుంభకోణాల కేంద్రంగా మారే ప్రమాదముంది. అభివృద్ధి పేరుతో చంద్రబాబు చేస్తున్న వ్యవహారం మొత్తం కుంభకోణాలతో పాటు అసాంఘిక శక్తులను ఒకచోట చేర్చే కేంద్రంగానూ మారే అవకాశాలూ లేకపోలేదు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను లోతుగా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. రాజధాని నిర్మాణంలో తొలి నుంచీ గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం నడుపుతోంది. ఒప్పందం ఒక విధంగా చేసుకుని ప్రజలకు మరో విధంగా చెబుతోంది. ఈ పద్ధతిని ఏమనుకోవాలి. ప్రజా రాజధాని అంటూనే అబద్ధాలు ప్రచారం చేస్తోంది. కేవలం ప్రజా ధనాన్ని లూఠీ చేయడం కోసమే ప్రభుత్వం ఈ విధానాలను, పద్ధతులను అనుసరిస్తోంది. ప్రపంచబ్యాంకు విధానాలను వేగంగా అమలు చేసే చంద్రబాబునాయుడు అదే ప్రపంచబ్యాంకు స్విస్‌ ఛాలెంజ్‌ నష్టదాయమని చెప్పినా పట్టించుకోకుండా ముందుకు పోతున్నారు. కేల్కర్‌ కమిటీ కూడా స్విస్‌ ఛాలెంజ్‌ సరైన పద్ధతి కాదని తెలిపింది. ఇదొక అంశమైతే అసలు రాజధానిలో విదేశీ యాజమాన్యం చేతిలో ఉండే కంపెలు నిర్మించే భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించుకోవడం సిగ్గుచేటు. ఇక్కడ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింగపూర్‌ కంపెనీలు నిర్మించే భవనాలపై యాజమాన్య హక్కులు ఎవరికి ఉంటాయనేది స్పష్టత లేదు. ఒకవేళ డబ్బులిచ్చి నిర్మించుకునేటట్లయితే ఓపెన్‌ టెండర్‌ విధానానికి ఎందుకు వెళ్లరు. మేక్‌ ఇన్‌ ఇండియా అని కేంద్రం ప్రచారం చేస్తోంటే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి మేక్‌ ఇన్‌ ఇండియా అవసరం లేదా ? సీడ్‌ కేపిటల్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాలో సింగపూర్‌ కంపెనీలు భవనాలు నిర్మించిన తరువాత వాటిల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ పద్ధతిలో ఉంటుందనే విషయాన్నీ స్పష్టం చేయలేదు. వాటిని లీజుకు తీసుకుంటారా? కొనుగోలు చేస్తారా? అద్దెలు చెల్లిస్తారా అనే విషయాలపైనా స్పష్టత లేదు. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే సింగపూర్‌కు చెందిన ఇంటర్నేషనల్‌ ఎంటర్‌ప్రైజెస్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఉన్న అంశాన్ని బయటకు రానీయకుండా చూస్తోంది. వచ్చినా అసలు విషయాలు చెప్పకుండా దాచిపెడుతోంది. ఒకవైపు ప్రజా రాజధాని అంటూనే ప్రజలకు చెప్పాల్సిన ఏ సమాచారాన్నీ చెప్పడం లేదు. రైతుల నుంచి తీసుకున్న భూములను ఉచితంగానో, కారుచౌకగానో ప్రయివేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తోంది. పూలింగుకు భూములివ్వబోమన్న రైతుల గోళ్లూడగొట్టింది. భయపెట్టింది. పోలీసులతో కొట్టించి జైళ్లలో పెట్టించింది. వ్యతిరేకిస్తున్న వారిళ్లకు పోలీసులను పంపించి అరెస్టుల పేరుతో భయానక వాతావరణం సృష్టించింది. భూములు తీసుకుంది. వాటినిప్పుడు విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. ఈ మొత్తం ప్రక్రియ వెనుక పెద్దపెద్ద సంస్థల ప్రయోజనాలు, తద్వారా వారితో అనుబంధం ఉన్న వ్యక్తులతో రాజకీయ, ఆర్థిక లబ్ధిపొందడం కీలకంగా కనిపిస్తోంది మినహా ప్రజా ప్రయోజనం మచ్చుకైనా కనిపించడం లేదు. విశ్వసనీయత లేని స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిని ఎంచుకోవడమే కుంభకోణాలు జరుగుతాయనే అనుమానాలకు బలాన్నిస్తోంది. ఇంతకు ముందు మహారాష్ట్ర ప్రభుత్వానికి, రవి కన్సల్టెన్సీకి మధ్య జరిగిన వివాదంలో మద్రాసు హైకోర్టు స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతి కరెక్టు కాదని తీర్పుచెప్పింది. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే స్విస్‌ ఛాలెంజ్‌కు ఆమోదం తెలిపినా దానిలోని విషయాలన్నీ ప్రజలకు వివరించాలని పేర్కొంటూ అనుమతిచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎవరూ ఈ పద్ధతిని వాడుకలోకి తీసుకోలేదు. ఈ పద్ధతి నిజంగా కంపెనీల మధ్య పోటీకి పిలిచిందా లేక ప్రజలను నమ్మించేందుకు ప్రభుత్వం ఆడుతున్న నాటకమా అనే విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా స్విస్‌ ఛాలెంజ్‌ కరెక్టా, కాదా, ప్రభుత్వం చేస్తోంది మోసమా, లాభమా అనే విషయాలను ప్రజలే నిర్ణయిస్తారు. ఇలా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే ప్రభుత్వం ఏమి చేస్తుందనే విషయం ఇప్పటి వరకూ ఎవరికీ అర్థం కావడం లేదు. ఏకపక్షంగా చేసుకుపోతోంది. భూములు తీసుకున్న తరువాత ఉపాధి కోల్పోయేవారికి ఆ ప్రాంతంలో ఉపాధి కల్పిస్తామని చెప్పింది. అరకొరగానే కల్పించింది. కౌలు చెక్కులూ అందడం లేదు. నిరుద్యోగ యువతకు ఉపాధి లేదు. సమీకరణకు ముందు ప్రభుత్వమిచ్చిన ఏ హామీ పూర్తిగా అమలు కాలేదు. అమలయిందల్లా భూములు లాక్కోవడమే. ఈ ప్రక్రియకు ముందే సింగపూర్‌కు చెందిన ప్రయివేటు కంపెనీలకు వాటిని అప్పగించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి సింగపూర్‌ ప్రభుత్వం తమకు ఉచితంగా ప్లానిస్తోందని పదేపదే చెప్పారు. ఇదీ అబద్ధమే. భూములు తీసుకోక ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు అబద్ధాలు చెప్పారు. వాటిల్లో ఒకటి భూమిని ఎవరికీ ఇవ్వబోమని, రెండోది సింగపూర్‌ ప్రభుత్వం ఉచితంగా ప్లానిస్తోందని. అలా చెప్పి ప్రజలను మోసం చేశారు. ఈ మొత్తం ప్రక్రియలో ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలు, అర్ధసత్యాలు. అందుకే కుంభకోణాల కేంద్రం అవుతుందని వ్యాఖ్యానించాల్సి వచ్చింది. అలా జరగదు అని ప్రభుత్వ పెద్దలు ఎవరైనా చెబితే, ఒప్పందాల విషయాన్ని ఇప్పటి వరకూ ఎందుకు గోప్యంగా ఉంచారో అదన్నా చెప్పాలి. దీని వెనుక ప్రధానంగా రెండు కుట్రలున్నాయి. ఒకటి రాజధాని ప్రాంతాన్ని విదేశీ సంస్థలకు కట్టబెట్టడం, రెండోది దాని ద్వారా అయాచిత లబ్ధిపొందడం.

#చీకటి ఒప్పందం #

రాజధాని ప్లానింగుకు సంబంధించి 2014 ఆగస్టు 8వ తేదీన అప్పటి సదుపాయాల కల్పనశాఖ ఛైర్మన్‌ దొండపాటి సాంబశివరావు, ఇంటర్నేషన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సిఇఒ తోఎంగ్‌ చియాంగ్‌ మధ్య పరస్పర ఒప్పందం జరిగింది. దీనిలో పలు దశలుగా పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే క్లాజ్‌ 3(1)లో నిర్మాణ రంగాన్ని కచ్చితంగా సింగపూర్‌ సంస్థలకు అప్పగిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. 3(2)లో ఒకటి లేదా అంతకు మించి కంపెనీలతో కూడిన మాస్టర్‌ డెవలపర్‌ను సింగపూర్‌ ప్రతిపాదిస్తుంది అని పేర్కొన్నారు. 3(3)లో సింగపూర్‌ ప్రభుత్వం ఇచ్చే మాస్టర్‌ డెవలపర్‌ను ఆంధ్రప్రదేశ ప్రభుత్వం ఆమోదిస్తుంది అని స్పష్టంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. సెక్షన్‌ 5(1)లో రాజధాని ప్లానింగు ఏర్పాటు, తదితర అంశాలకు సింగపూర్‌కయ్యే ఖర్చును ఉమ్మడిగా భరించాలని పేర్కొన్నారు. 2014లోనే నిర్మాణ కంపెనీలను సింగపూర్‌ ప్రతిపాదిస్తుందని ఒప్పందం చేసుకుని ఇప్పుడేదో కొత్తగా అనుభవమున్న కంపెనీలను ఎంచుకుంటున్నట్లు ప్రభుత్వం ఫోజు పెడుతోంది. ఇది ప్రజలను పక్కాగా మోసం చేయడమే, సొమ్మును లూఠీ చేయడమే అవుతుంది. ఒప్పందం చేసుకున్న కంపెనీలు రెండూ పూర్తిగా వ్యాపారం నిర్వహించేవే. ప్రపంచంలో ఎక్కడైనా లాభాలు వస్తున్నాయంటే అక్కడ వాలిపోయే సంస్థలు. ఆ విషయాన్ని అవే ఒప్పకుంటున్నాయి. ఇటువంటి సంస్థలను తీసుకొచ్చి ప్రజా రాజధానిగా ప్రచారం చేస్తున్న అమరావతిలో పెట్టడం, పైగా అటువంటి సంస్థలు ప్రపంచంలో మరెక్కడా లేవని చెప్పేందుకు దేశవాళీ సంస్థలపై విషంగక్కడం అవమానకరం.

# ఉచితమనేది ఒట్టిమాట #

రాజధాని నిర్మాణానికి ప్లానింగిచ్చిన సుబ్బారా, జురాంగ్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీలు ఉచితంగా ఇచ్చాయని చెప్పడం ఒట్టిమాటే అవుతుంది. ఆగస్టు 28వ తేదీన జరిగిన సిఆర్‌డిఎ తొలి అథారిటీ సమావేశంలో ప్లానింగు ఇచ్చినందుకు రూ.11.92 కోట్లు ఇవ్వాలని తీర్మానించారు. 2016 మే నాలుగో తేదీన జరిగిన రెండో సమావేశంలో దాన్ని రూ.14,79,66,934కు పెంచారు. మాస్టర్‌ ప్లాను రివిజన్‌ చేసినందుకు ఈ మొత్తాన్నిచ్చామని ప్రతిపాదించారు. అంటే ఉచితంగా ప్లాను ఇవ్వలేదని స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఇప్పటికీ సింగపూర్‌ కంపెనీలు ఉచితంగా ప్లానిచ్చాయని ప్రచారం చేస్తున్నారు. ఏ లబ్ధీ ఆశించనప్పుడు ప్రయివేటు కంపెనీలను ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి.

# కన్సార్టియంలో దేశీయ కంపెనీల వాటా #

రాజధాని అభివృద్ధికి ఏర్పాటు చేసిన సింగపూర్‌ కన్సార్టియంలో ఉన్న సెంబ్‌కార్ప్‌, అసెండాస్‌ సింగ్‌బ్రిడ్జ్‌ కంపెనీలు ఆకాశం నుంచి ఊడిపడినట్లు చంద్రబాబు ప్రచారం చేయడం శుద్ధఅబద్ధం. ఆయా కంపెనీలు ఇప్పటికే దేశంలో విద్యుత్‌, నిర్మాణ, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో కృష్ణపట్నంలో 2,640 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీ గాయత్రి పవర్‌ లిమిటెడ్‌ పేరుతో నిర్మించింది. ఇది పార్లమెంటు మాజీ సభ్యులు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి, ఆయన వియ్యంకుడు జివికెకు చెందినది. దీనిలోనే టివి సందీప్‌కుమార్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారు. డి వెంకటాచలం కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు. ఆయన వివిధ విద్యుత్‌ సంస్థల్లో ధరల సలహాదారుగా ఉన్నారు. సెంబ్‌కార్ప్‌ గ్రీన్‌ ఇన్‌ఫ్రాలో సునీల్‌కుమార్‌ గుప్తా, సతీష్‌కుమార్‌ మందన, విజరు ఎల్‌ కేల్కర్‌, బాబీ కునాబారు పారిక్‌ డైరెక్టర్లుగా ఉన్నారు. అసెండాస్‌ సింగ్‌బ్రిడ్జ్‌లో మన దేశానికే చెందిన ఎస్‌ చంద్రన్‌ ఇండిపెండెంట్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. మనోహర్‌ ఖైతాని డిప్యూటీ సిఇఒగా వ్యవహరిస్తున్నారు. ఆకాశం నుంచి ఊడిపడిన సంస్థల్లో భారతీయులు ఎందుకున్నారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ప్లానింగిచ్చిన సుర్బానా ఇంటర్నేషనల్‌ అసెండాస్‌ భాగస్వామి. ఇవేమీ తెలియనట్లు సింగపూర్‌ కంపెనీలే అన్నీ చేస్తాయని చెప్పడం శుద్ధ అబద్ధం. పైగా ఆ రెండు కంపెనీలూ సింగపూర్‌ ప్రభుత్వానికి చెందిన టెమాసెక్‌లో వ్యాపార భాగస్వామిగా ఉన్నాయి. దీనిలో సెంబ్‌కార్ప్‌ వాటా 51 శాతానికి పెంచుకున్నారు. మిగిలిన వాటాలను కూడా ప్రయివేటు వ్యక్తులకు అమ్ముకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ముందు పూర్తిగా ప్రయివేటు వ్యాపారం నిర్వహించుకోనున్నారు. టెమాసెక్‌ అనేది సింగపూర్‌ కేంద్రంగా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది. ప్రపంచంలోని ప్రయివేటు పెట్టుబడ ిదారులను పెంచి పోషించడమే దీని ప్రధాన ఉద్దేశంగా ఉంది. ఇటువంటి కంపెనీలను నెత్తికెత్తుకుని మాట్లాడుతున్న చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవానికి అన్యాయం చేశారు.

చివరిగా ఒకమాట. ప్రపంచంలో అనేక దేశాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మిస్తోంది, పెద్దపెద్ద రోడ్లు వేస్తోంది భారతీయ కంపెనీలే. వాటిని పట్టించుకోకుండా ప్రయివేటు వ్యక్తుల వ్యాపార లావాదేవీల కోసం పాకులాడే సింగపూర్‌ కంపెనీల చుట్టూ తిరగడం దోచుకోవడానికి తప్ప మరొకటి కాదు. విదేశీ యాజమాన్యం చేతుల్లో ఉండే కంపెనీల ద్వారా మన అసెంబ్లీ నిర్వహించుకోవడం నిజంగా సిగ్గుచేటైన విషయం.
- బి.వి.రాఘవులు




Friday, 24 June 2016

|| యఫ్‌.డి.ఐ లకు స్వేచ్ఛ దేశానికి చేటు ||

             కేంద్ర ప్రభుత్వం రక్షణ, మీడియా, ఔషధాలు, విమానయానం, ఆహార శుద్ధి, చిల్లర వర్తకం, తదితర రంగాల లో వంద శాతం యఫ్‌డిఐల ప్రవేశానికి అవకాశం కల్పిం చింది. ఈ రంగాలలోకి నూరు శాతం యఫ్‌డిఐలకు ప్రవేశం కల్పించి సంస్కరణలను వేగవంతం చేయటం వల్ల విదేశీ పెట్టుబడులు పెద్దమొత్తంలో దేశంలోకి వస్తాయని, పారిశ్రామికాభివృద్ధి జరుగుతుం దని, ఉద్యోగ కల్పన పెరుగుతుం దని, భారత్‌ ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా మారుతుందని, మేక్‌ ఇన్‌ ఇండియా జయప్రదం అవు తుందని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. రాజన్‌ రెండవసారి రిజర్వుబ్యాంక్‌ ఛైర్మన్‌గా ఉండటానికి తిరస్కరించటం, బ్రెగ్జిట్‌ భయాలతో పెట్టుబడులు బయటకు పోతాయని ఆందోళన చెందిన ప్రభుత్వం ఈ సంస్కరణలను ప్రకటించిందని ఆర్థిక నిపుణులు, పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గతంలో బీహార్‌ ఎన్నికలలో ఓటమి తర్వాత పెట్టుబడిదారులలో తగ్గుతున్న విశ్వాసాన్ని నిలబెట్టేందుకు 2015 నవంబరులో కొన్ని రంగాలలో యఫ్‌డిఐ పరిమితులను ప్రభుత్వం పెంచింది. ఇప్పుడు మరోసారి మరికొన్ని రంగాలలో సంస్కరణలను వేగవంతం చేస్తూ నిర్ణయం తీసుకున్నది. వంద శాతం యఫ్‌డిఐల ప్రవేశానికి అవకాశం కల్పించటం వల్ల ప్రభుత్వం చెబుతున్నట్లుగా దేశం తయారీ హబ్‌గా మారటానికి, ఉద్యోగ కల్పన పెరగటానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందుకు బదులుగా దేశంలో ఆయు ధాల లభ్యత, యుద్ధోన్మాదం పెరగటానికి, సామ్రాజ్య వాద ప్రయోజనాలకు దోహదం చేసే విధానాలను ముందుకు తీసుకెళ్ళడానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వంద శాతం యఫ్‌డిఐకి అనుమతించటం వల్ల దేశంలోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతాయనేది భ్రమ మాత్రమే. విదేశీ పెట్టుబడులు ఏ దేశంలోకి ప్రవేశించటానికైనా లాభాలే కారణం. లాభాలు వస్తాయనుకొంటే పెట్టుబడులు ఆ దేశంలోకి వస్తాయి. లాభాలకు అవకాశం లేదనుకుంటే ఏ దేశం నుంచైనా నిష్క్రమిస్తాయి. ఈరోజు మనదేశంలో ఉన్న పరిస్థితులు లాభాలకు గ్యారంటీ కల్పించేలా లేవు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తున్నాయి. కార్మికులు, కర్షకులు, మధ్యతరగతి ప్రజలపై ప్రభుత్వం కొత్త భారాలను మోపుతుండటంతో దేశీయ మార్కెట్‌ కుంచించుకుపోతున్నది. దేశంలో సగానికి పైగా కరువుతో అల్లాడుతుండగా ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చటానికి ప్రభుత్వం పూనుకున్నది. కరువు నుంచి తేరుకోవటానికి రైతాంగానికి ఏ మాత్రం సహాయం అందించలేదు. ధాన్యం సేకరణ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవటంతో రైతాంగం కనీస మద్దతు ధరలు పొందటానికి అవకాశం లేకుండాపోయింది. ఇతర పంటల రైతాంగానికి కూడా గిట్టుబాటు ధరలు లభించటం లేదు. కార్మికులకున్న కనీస హక్కులను కూడా హరించే విధంగా ప్రభుత్వం చట్టాలకు సవరణలు చేస్తుండటంతో కార్మికులకు లభించే కనీస వేతనాలు తగ్గిపోతున్నాయి. కోట్లాదిమంది విద్యావంతులు నిరుద్యోగం బారినపడి బతకటానికి ఇబ్బందుల నెదుర్కొంటున్నారు. ఈ విధంగా ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిపోతుండటం వల్ల దేశంలో ఇప్పటికే మాంద్యం పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు ప్రపంచంలో నెలకొన్న మాంద్యం పరిస్థితుల వల్ల మన ఎగుమతులు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఒకవైపు దేశీయ మార్కెట్‌, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌ క్షీణిస్తుండగా ఏ ఆశతో ఉత్పత్తిరంగంలోకి యఫ్‌డిఐలు వస్తాయనేది ప్రశ్న.
రక్షణరంగంలోకి నూరు శాతం యఫ్‌డిఐని అనుమతించటం వల్ల దీర్ఘకాలంలో తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. ఇప్పటి వరకు మన రక్షణ పరిశ్రమలు ప్రభుత్వరంగంలోనే ఉండి దేశరక్షణ అవసరాలకు, మిత్ర దేశాలకు పరిమితంగా మాత్రమే ఎగుమతులు చేస్తున్నది. రక్షణరంగంలోకి విదేశీ పెట్టుబడులు, దేశంలోని కార్పొరేట్‌ రంగం ప్రవేశించటం వల్ల దాని స్వభావంలోనే పూర్తి మార్పు సంభవిస్తుంది. విదేశీ, ప్రయివేటు పెట్టుబడులకు లాభాలే ప్రధానం. లాభాలు ఎక్కువ కావాలంటే ఎక్కువ ఉత్పత్తి చేయాలి. ఉత్పత్తి చేస్తుండాలంటే వినియోగం కూడా ఉండాలి. ఆయుధాలను ఎక్కువ ఉత్పత్తి చేయాలంటే కొనే వారు ఎక్కువ సంఖ్యలో ఉండాలి. ఎక్కువ స్థాయి వినియోగం అవటం అంటే తుపాకులు, బాంబులు విస్తారంగా ఉనికిలోకి వస్తాయి. తీవ్రవాదులు, అరాచక వాదుల చేతుల్లోకి ఆయుధాలు చేరటంతో శాంతిభద్రతల సమస్య తీవ్ర మౌతుంది. ఆత్మరక్షణ కోసం పౌరులు కూడా తుపాకులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది అమెరికాలో వలె తుపాకి సంస్కృతికి దారితీసి ప్రజల జీవితాలకు ఏమాత్రం భద్రతలేని పరిస్థితిని కల్పిస్తుంది. ఆయుధ వ్యాపారులకు ఇటువంటి పరిస్థితే కావాలి. అప్పుడే ఆయుధాలు పెద్దమొత్తంలో ఖర్చయి లాభాలొస్తాయి. అందువల్ల విదేశీ, ప్రయివేటు ఆయుధ ఉత్పత్తి కంపెనీలు దేశంలోకొస్తే ఇటువంటి అభద్రతా వాతావరణాన్ని సృష్టిస్తాయి. రెండవ అంశం ఆయుధాలు పెద్దమొత్తంలో అమ్ముడుపోయి లాభాలు రావాలంటే మన ప్రభుత్వం, ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా పెద్దమొతంలో ఆయుధాలను కొనుగోలు చేయాలి. పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలుంటే ప్రభుత్వం పెద్దమొత్తంలో ఆయుధాలు కొనుగోలు చేయటానికి ప్రాతిపదిక ఉండదు. సైనిక వ్యయం పెంపుదల కోసం ప్రజలను ఒప్పించలేదు. అందువల్ల మన దేశానికి పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు లేకుండా నిరంతరం ఉద్రిక్త వాతావరణం, యుద్ధజ్వాలలు రగులుతూ ఉండాలి. అప్పుడు ప్రభుత్వం సైనిక వ్యయం పెంచటానికి, పెద్దమొతంలో ఆయుధాలు కొనుగోలు చేయటానికి వీలైన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రస్తుత ప్రభుత్వం ఇరుగుపొరుగు దేశాలతో మనకున్న సత్సంబంధాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నది. చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేస్తున్న కూటమిలో మనదేశం భాగస్వామి అవుతున్నది. పాకిస్తాన్‌తో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నది. నేపాల్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆయుధాల ఉత్పత్తి సంస్థలు పొరుగు దేశాలతో మన సంబంధాలు మెరుగుపడకుండా, మరింత క్షీణించేలా చేస్తాయి. ప్రస్తుతం అమెరికా, ఇతర యూరోపి యన్‌ దేశాలు చేస్తున్న విధంగా మనదేశంతో పాటు మనకు వ్యతిరేకంగా ఉన్న దేశాలకు కూడా ఆయుధాలు విక్రయి స్తాయి. ఫలితంగా దేశంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణి స్తుంది. ప్రజలు నిరంతరం అభద్రత, అశాంతితో జీవించా ల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
మీడియా రంగంలో కూడా వంద శాతం యఫ్‌డిఐకి అవకాశం కల్పించారు. దీని పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి. రాజకీయంగా ప్రజల అభిప్రాయాలను మలచగల శక్తి మీడియాకు ఉంటుంది. నేడు యువకుల అభిప్రాయాలను మలచటంలో, హింసను ప్రేరేపించటంలో సినిమాలు, టీవీలు నిర్వహిస్తున్న పాత్రను చూస్తున్నాం. దేశంలోనూ, విదేశాలలోనూ బడా కార్పొరేట్‌ సంస్థలు తమ ప్రయోజనాల పరిరక్షణ కోసం వేల కోట్ల రూపాయలతో మీడియా సంస్థలను నడుపుతున్నాయి. ప్రజలకు వినోదం కల్పించటానికో, ప్రజల కష్టాలను ఎలుగెత్తి చాటటానికో కాక తమ సంస్థల ప్రయోజనాల పరిరక్షణ కోసమే కార్పొరేట్‌ సంస్థల చేతుల్లోని, వారి పలుకుబడిలోని మీడియా నిరంతరం పని చేస్తుంటుంది. తమ ప్రయోజనాల సాధన కోసం మనదేశానికి వ్యతిరేకమైన అంశాలను మనకు ప్రయోజనం కలిగించే అంశాలని ప్రచారం చేస్తారు. ఈరోజు దేశంలో ఉన్న కార్పొరేట్‌ మీడియా అంతా అమెరికాతో మనదేశం చేసుకున్న అణు సహకార ఒప్పందాన్ని గొప్పగా ప్రచారం చేస్తున్నది. ఆ ఒప్పందం మనదేశ సార్వభౌమత్వాన్ని హరించి, అమెరికాకు జూనియర్‌ భాగస్వామిగా మారుస్తుంది. మరి అటువంటప్పుడు మనదేశ మీడియా ఈ ఒప్పందాన్ని గురించి ఎందుకని గొప్పగా ప్రచారం చేస్తున్నది? అమెరికాతో అణు సహకార ఒప్పందం చేసుకోవటం వల్ల విదేశీ అణు శక్తి సంస్థలతో ఒప్పందాలు చేసుకొనే దేశీయ బడా కంపెనీలు లాభపడతాయి. అమెరికాతో సంబంధాలు బలపడటం వల్ల సరళీకరణ విధానాల అమలు వేగం పుంజుకొని కార్పొరేట్‌ సంస్థలకు ప్రయోజనం కలుగుతుంది. దేశానికి నష్టమైనా తమకు ప్రయోజనం కలుగుతుంది కాబట్టి మనదేశ మీడియానే అణు సహకార ఒప్పందం వల్ల దేశానికి ప్రయోజనం కలుగు తుందని ప్రచారం చేస్తున్నది. ఇదే విదేశీ మీడియా సంస్థలైతే మరెంతగా ప్రచారం చేస్తాయి! బహుళజాతి సంస్థల దోపిడీ వల్ల దుర్భరమౌతున్న ప్రజల జీవితాలు, దారిద్య్రం, నిరుద్యోగం పెరుగుదల నుంచి ప్రజల దృష్టి మళ్ళించటానికి కుల, మత, జాతి, ప్రాంతీయ వైరుధ్యాలను రెచ్చగొడతారు. దేశ సమస్యలపై శ్రద్ధపెట్టకుండా ప్రజలను తప్పుడు మార్గాల వైపు మళ్ళిస్తారు. మూఢ విశ్వాసాలు, మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలను చేసే ప్రయత్నాలు చేస్తారు.
ప్రభుత్వం వంద శాతం యఫ్‌డిఐకి ద్వారాలు తెరిచిన రంగాలన్నింటిలోనూ దోపిడీ తీవ్రం అవుతుంది. వైమానిక రంగంలోకి విదేశీ సంస్థల ప్రవేశం దేశ భద్రతకు ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఫార్మారంగంలోకి విదేశీ సంస్థల ప్రవేశం వల్ల దేశీయంగా తక్కువ ధరలకు మందులను ఉత్పత్తి చేసే సంస్థలు అదృశ్యమౌతాయి. సాధారణ ప్రజలు కొనుగోలు చేయలేని విధంగా అత్యవసర మందుల ధరలు పెరుగు తాయి. ఈ విధంగా బహుళజాతి సంస్థలు దేశ సంపదను కొల్లగొడతాయి. వంద శాతం యఫ్‌డిఐ ప్రవేశానికి అవకాశం కల్పించటం వల్ల ఉద్యోగాల కల్పన జరుగుతుందని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. బహుళజాతి సంస్థలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, తక్కువ ఖర్చుతో సరుకులను ఉత్పత్తి చేయటం వల్ల దేశీయ చిన్న పరిశ్రమలు పోటీకి తట్టుకోలేక దివాళా తీస్తాయి. బహుళజాతి సంస్థలు కల్పించే ఉద్యోగాల కన్నా దేశీయ పరిశ్రమల మూత వల్ల కోల్పోయే ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వాస్తవంగా అదనంగా ఉద్యోగాలు రాకపోగా ఇప్పటికే ఉద్యోగాలలో ఉన్నవారే నిరుద్యోగులుగా మారటంతో నిరుద్యోగం పెరుగుతుంది. ప్రజల ఆదాయాలు తగ్గుతాయి. విదేశీ పెట్టుబడులకు పెద్ద మొత్తంలో రాయితీలు కల్పించటంతో ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. వీటన్నింటి ఫలితంగా పెరుగుతున్న ప్రజల అసంతృప్తిని అణచటానికి ప్రభుత్వం మరింతగా నిరంకుశ విధానాలను అమలు చేస్తుంది. అందువల్ల సరళీకరణ విధా నాలను వేగంగా అమలు చేయటం కోసం ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలు దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తాయి.
- ఎ కోటిరెడ్డి
|| బ్రెగ్జిట్‌ - బ్రిటిష్‌ ప్రజలు ||

         బ్రిటిష్‌ ప్రజలు చారిత్రాత్మక తీర్పు చెప్పారు. 28 దేశాల ఐరోపా యూనియన్‌ నుండి బ్రిటన్‌ వైదొలగాలని నిర్ద్వంద్వంగా ప్రకటించారు. నిన్నటి వరకు బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ప్రజాతీర్పు వస్తుందని జోస్యం చెప్పిన కార్పొరేట్‌ మీడియాను బ్రిటిషర్లు కంగు తినిపించారు. రెండు శాతం తేడాతో ప్రజలిచ్చే తీర్పుతో బ్రిటన్‌ ఇయులో కొనసాగుతుందని వచ్చిన అంచనాలు సరిగ్గా తలకిందులై రెండు శాతం ఓట్ల తేడాతో బ్రిటన్‌ వైదొలగుతోంది. బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా తన ప్రతిష్టనంతటినీ ఒగ్గి ప్రచారం చేసిన బ్రిటన్‌ ప్రధాని కెమరాన్‌ పదవినుండి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. 59 ఏళ్ల క్రితం లిస్బన్‌ ఒప్పందం ప్రకారం ఏర్పడిన ఐరోపా యూనియన్‌లోకి ఇప్పటివరకు కొత్త సభ్యులు వచ్చి చేరడమే గాని వైదొలగింది లేదు. లిస్బన్‌ ఒప్పందంలోని 50వ అధికరణాన్ని అమలులోకి తీసుకురావడం ద్వారా ఇయు నుండి బ్రిటన్‌ వైదొలగే ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. అన్ని వ్యవస్థలూ తెగతెంపులు చేసుకోడానికి కొన్ని మాసాలు పట్టవచ్చు. తన వారసుడు ఆ పని చేస్తాడని రాజీనామా ప్రకటించిన కెమరాన్‌ చెబుతున్నారు. అయితే వెనువెంటనే ఈ ప్రక్రియ ప్రారంభించాలని ఇయు పాలక వర్గం కోరుతోంది.
బ్రెగ్జిట్‌ వార్తతో ఇయూలో బయలుదేరిన ప్రకంపనలు ప్రపంచమంతటా వ్యాపించాయి. ఈ వార్త ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో రక్తం ప్రవహింపచేసింది. అమెరికా నుండి జపాన్‌ వరకు స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. డౌజోన్స్‌ 450 పాయింట్లు పతనమైంది, నిక్కీ ఇండెక్స్‌ 8 శాతం పడిపోయింది. అనేక కరెన్సీలు నేల చూపులు చూశాయి. బ్రిటిష్‌ పౌండ్‌ 39 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇప్పటికే అటుఇటు ఊగిసలాడుతున్న ఆర్థిక వ్యవస్థలు కుదుపుకు లోనైనాయి. పెట్టుబడిదారులకు ఆర్థిక వ్యవస్థలపైనా, కరెన్సీల పైనా భయం పట్టుకున్నందున బంగారంవైపుకు మళ్లారు. అందువల్లనే ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు ఆకాశం వైపు చూశాయి. బ్రెగ్జిట్‌ ప్రభావం భారత్‌ను కూడా తాకింది. సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా ఒక్కసారే పతనం కాగా అంతర్జాతీయ ధోరణిని అనుసరించి బంగారం ధరలు ఇక్కడా పెరిగాయి. రూపాయి నేలచూపులు చూసింది.
ఇయు నుండి వైదొలగితే ప్రపంచ తల్లకిందులైపోతుందని కార్పొరేట్‌ మీడియా తీవ్రంగా ప్రచారం చేసినా బ్రిటిష్‌ ప్రజలు పట్టించుకోకుండా బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేయడానికి కారణం వారి అనుభం నేర్పిన పాఠాలే. బ్రెగ్జిట్‌ వల్ల బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ మాంద్యానికి గురవుతుందనీ, వాణిజ్యం తగ్గిపోతుందనీ, వీటి వల్ల తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని బ్రిటిష్‌ మీడియా, పాలక వర్గాలు, కార్పొట్‌ సంస్థలు, బడా బ్యాంకులు ప్రచారం చేశాయి. కానీ ప్రజలు వీటిని పట్టించుకోలేదు. ఇయు నిర్ణయాల పేరుతో కెమరాన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నయా-ఉదారవాద ఆర్థిక విధానాలు కార్మికుల జీతాలకు కోత పెట్టింది, సంక్షేమ కార్యక్రమాలను నీరుగార్చింది. పని భారం పెంచింది. నిరుద్యోగం, పేదరికం కట్టలు తెంచుకున్నాయి. జర్మనీ నేతృత్వంలోని యూరోపియన్‌ యూనియన్‌ సూపర్‌ పార్లమెంటులా వ్యవహరించి దేశ ప్రజల అభిప్రాయాలకు విలువ లేకుండా చేసింది. సూపర్‌ పార్లమెంటు, సూపర్‌ కార్పొరేట్లకు సూపర్‌ లాభాలు వచ్చే విధానాలు అనుసరిస్తుంటే మరో వైపు సామాన్య ప్రజలు భారాలు మోయాల్సి వచ్చింది. అందుకే పాలక వర్గాల ప్రచారాన్ని పట్టించుకోకుండా 'ఐరోపా యూనియన్‌' అనే పెనుభారాన్ని బ్రిటిష్‌ ప్రజలు వదిలించుకున్నారు.
బ్రెగ్జిట్‌ ఆర్థిక ప్రభావమే కాదు రాజకీయ ప్రభావం కూడా రానున్న కాలంలో యూరప్‌ మీద, మొత్తం ప్రపంచం మీద పడుతుంది. ఇప్పటికే ఫ్రాన్స్‌, ఇటలీ, స్వీడన్‌, బెల్జియం వంటి ఇయు దేశాలో మెజారిటీ ప్రజలు తమ దేశాల్లో కూడా ఇటువంటి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. తమ దేశాల్లో రిఫరెండం జరిపితే విడిపోడానికే ఓటు వేస్తామని వారు అంటున్నారు. ఇయు, ఐఎంఎఫ్‌ కలిసి గ్రీసుపై రుద్దిన ఆర్థిక సంస్కరణలు ఆ దేశ కార్మికుల రక్తమాంసాలను ఎలా పిండి పిప్పిచేస్తున్నాయో, దానికి వ్యతిరేకంగా అక్కడి కార్మికులు ప్రతినిత్యం ఎంతటి వీరోచిత పోరాటాలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. బ్రిటిష్‌ ప్రజలు ఇప్పుడు ఇచ్చిన తీర్పు కూడా ఇయు పేరుతో తమ మీద నిత్యం కార్పొరేట్‌ పాలక వర్గాలు వేస్తున్న భారాలకు ప్రతిఘటనగానే చెప్పుకోవచ్చు. ఆ దేశంలో ఇటీవల కాలంలో కార్మిక వర్గం జరుపుతున్న పోరాటాలకు ఇది ప్రతిబింబం. ఫ్రాన్స్‌లో కూడా ప్రజాభిప్రాయం ఇదే విధంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఫ్రెంచి కార్మకవర్గం తీవ్రమైన పోరాటాలు చేస్తున్నది. బ్రెగ్జిట్‌ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థమీద పెద్దగా ఉండదనీ, మన ఆర్థిక వ్యవస్థ నియంత్రణలోనే ఉందని మన ఆర్థిక నిర్వాహకులు చెబుతున్నారు. కానీ ఒకవైపు ఆర్థిక వ్యవస్థపై నియంత్రణలు వదిలేస్తూ మరోవైపు ప్రభావం ఉండదని చెప్పడం ఆత్మవంచనే. నిజానికి ఆర్థిక సంస్కరణలను మరింత లోతుగా, విస్తృతం గా అమలు జరుపుతున్న కొద్దీ మన ఆర్థిక వ్యవస్థ మరింతగా రక్షణ కోల్పోయి ప్రపంచంలో ఏ చిన్న పరిణామం జరిగినా కుదుపులకు గురవుతుంది. బ్రెగ్జిట్‌ పరిణామాన్ని మన దేశం ఎంతవరకు తట్టుకుని నిలవగలుగుతుందో వేచి చూడాలి.

Monday, 20 June 2016



'షా-ట్రంప్‌' మతోన్మాద రాగం

 *తూర్పు పడమరలనుకలిపిన ముస్లిం వ్యతిరేకత
 *ఎన్నికల వేళ ఓట్ల చీలికే ఇరువురి లక్ష్యం
                  
'
తూర్పు తూర్పే. పశ్చిమం పశ్చిమమే. రెండూ ఎప్పుడూ కలవవు' అనుకుంటాం. పెద్దలు కూడా అదే చెప్తుంటారు. అయితే తాజా రాజకీయ పరిణామాలు అందుకు భిన్నంగా వున్నాయి. పశ్చిమ దేశమైన అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హోరు జోరు మీదుంది. తూర్పు దేశమైన భారత్‌లోని ప్రధాన భూభాగం రానున్న ఒకటి రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమౌతోంది. ఈ సందర్భంగా రెండు చోట్లా ముదిరి పాకాన పడుతున్న ముస్లిం వ్యతిరేక రాగాలు... లౌకిక ప్రజాస్వామిక వాదులను కలవర పెడుతున్నాయి. అమెరికన్‌ అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ తరపున పోటీ పడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌, మన దేశంలో బి.జె.పి అధ్యక్షుడు అమిత్‌ షా బృందం ఒకే రాగం ఆలపించడమే 'తూర్పు-పడమర' సిద్ధాంతులను విస్తుగొల్పుతోంది. తొలి నుంచీ ముస్లిం వ్యతిరేక రాగాలు ఆలపించడంలోను, ఉద్రిక్తపూరిత ప్రసంగాలు ఇవ్వడంలోనూ ట్రంప్‌ది అందెవేసిన చెయ్యి. మామూలుగానే ఆయన ఉపన్యాసాలలో సందర్భం వచ్చిన ప్రతిసారీ ఆ ధోరణి వ్యక్తమౌతుంటుంది. ఓర్లాండో కాల్పుల ఘటన అందుకు తాజా ఉదాహరణ. ముస్లింలను దేశంలోకి రానివ్వకుండా నిషేధం విధించాలని ఈ సందర్భంగా మరోసారి గొంతు చించుకున్నారు ట్రంప్‌. మనదేశంలో బి.జె.పి, దాని అనుబంధ సంస్థల నేతలు ట్రంప్‌కేమీ తీసిపోలేదు. అస్సాం నుంచి ఉత్తరప్రదేశ్‌ కైరానా వరకు ఇదే రాగం ఆలపిస్తున్నారు. అస్సాం భూభాగంలోకి వస్తున్న బంగ్లా ముస్లింలను బూచిగా చూపించారు అక్కడి బి.జె.పి నేతలు. 2001 సంవత్సరం వరకు కైరానాలో 68 శాతం హిందువులు నివసించేవారని, ప్రస్తుతం వారు 8 శాతానికి తగ్గిపోయారని, ఈ విషయమై ఆలోచించాల్సిందేనంటూ బి.జె.పి ఎం.పి యోగి ఆదిత్యనాథ్‌ రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు. ముస్లింల కుట్ర కారణంగానే కైరానా హిందువులు వలస వెళ్లారని షా అబద్దపు బృందగానం ఆలపించారు. వాస్తవ మేమిటనేది నిజనిర్ధారణ బృందాలు, పత్రికలు, పోలీసు అధికారులు ప్రపంచానికి చాటినా... కరడు గట్టిన కాషాయ నేతలు, కార్యకర్తలు మాత్రం తమదైన మతోన్మాద మార్గంలోనే ప్రయాణిస్తున్నారు. ట్రంప్‌ పుట్టిన రోజును ఢిల్లీ, జంతర్‌మంతర్‌లో బూరలు కట్టి, కేకు కోసి మరీ ఘనంగా జరిపారు 'హిందూ సేన' కార్యకర్తలు. ఇస్లాం వ్యతిరేకతే వారిని ట్రంప్‌ జన్మదిన ఉత్సవాలు జరుపుకునేంతగా, 'ఆయనే మా హీరో' అనేంతగా దగ్గరకు చేసింది. అంతటితో ఆగక ఈ విధమైన ఉత్సవాలను యు.ఎస్‌ రాయబార కార్యాలయం వెలుపల, జెఎన్‌యు ప్రాంగణంలో సైతం చేసే ఆలోచనలున్నట్టు సేన ప్రకటించింది. తక్షణం కాకపోయినా... సమీప భవిష్యత్తులోనైనా ...మత ఉద్రిక్తతలతో ఓట్లు చీల్చాలన్నది ఇక్కడ కమలనాథులు, అక్కడ రిపబ్లికన్ల విశ్వప్రయత్నంగా కనిపిస్తోంది మరి!

Monday, 13 June 2016

|| ఉగ్రవాదం ఏదైనా బలయ్యేది అమాయకులే ||

         సామాజిక అంతర్జా లం లో 2016 మే 14న ఒక వీడియో దుమారం రేపింది. అయోధ్యలో బజరంగ్‌దళ్‌ శిక్షణా శిబిరంలో భాగంగా సభ్యులకు మరణాయుధాలు వాడటంలో శిక్షణ ఇస్తున్నారు. వారి ఉద్దేశం దేశంలో ముస్లిం తీవ్రవాదులను ఎదుర్కోవడం, ఉగ్రవాదాన్ని అంతం చెయ్యడమట! ఆ పనులు చేయడానికి మనం పటిష్టమైన భద్రతా యంత్రాంగాన్ని ఏర్పర్చుకున్నామని వారు మర్చి పోయారా? అదే నెల 30న విహెచ్‌పి మహిళా శాఖ 'దుర్గావాహిని' తన సభ్యులకు మారణాయుధాలలో సైనిక శిబిరం లాంటి శిక్షణ ఇస్తుందని వివిధ వార్తా పత్రికల్లో ప్రచురితమైంది. ఆత్మరక్షణ కోసం శిక్షణ ప్రతి స్త్రీకీ అవసరమైనప్పటికీ మారణాయుధాలతో శిక్షణ వారికి ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు? జూన్‌ 2న మథురలో ఒక నమ్మశక్యం కాని హింసాత్మక ఉదంతంలో ఆజాద్‌ విధిక్‌ వైవారిక్‌ క్రాంతి సత్యాగ్రహి అనే మత సంస్థకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో 27 మంది చనిపోయారు. మధుర ఎస్‌పితో సహా మూడు వేల మంది ఉన్మాదులు 200 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రెండేళ్ళపాటు కబ్జా క్రింద ఉంచుకొని తమదైన శైలిలో లోపల అరాచకాలు సృష్టిస్తున్నా రెండేళ్ళపాటు ఎవరూ అడ్డుచెప్పలేదు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు తలెత్తక మానవు. 80 శాతం మంది అవలంబిస్తున్న హిందూ మతంలో కొంత మంది మాత్రం విపరీతమైన అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఇవి పరిస్థితులు సృష్టించినవా లేక మానవ కల్పిత అభద్రతా భావమా? ఆయుధ చట్టం 1959, 1962 భారత ఆయుధ నిబంధనలు మరణాయుధాల తయారీ, అమ్మకం, ఆయుధాలు కలిగి ఉండటాన్ని నిషేధిస్తున్నాయి. మరి మత ఛాందసవాద సంస్థలు మారణాయుధాలను వేల సంఖ్యలో ఎలా పొందుతున్నాయి? మత ఉగ్రవాదం రోజురోజుకూ పెరుగుతున్నా సరే పీకల మీదకు వచ్చే వరకూ నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోతున్నాము ఎందుకు? మత ఛాందస సంస్థలు ఎవరినీ చంపట్లేదని కొంత మంది వాదన. మరి మొన్నకు మొన్న మథురలో జరిగిందేమిటి?
మత ఉగ్రవాదం
మతం పేరుతో ఉగ్రవాదం రాజకీయ హింసకు మరో రూపంగా మారింది. మత సంరక్షణకు హింసను ఆయుధంగా వాడడంలో తప్పులేదని మత ఉగ్రవాదులు గుడ్డిగా నమ్ముతారు. మత ఉగ్రవాదం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ గుర్తుకు వచ్చేది ముస్లిం ఉగ్రవాదమే. కానీ మత ఉగ్రవాదానికి బీజం మధ్యయుగంలో ఇంగ్లాండ్‌లో పడింది. 'క్రూసేడులు' లేదా పవిత్ర యుద్ధాల పేరుతో రోమన్‌ క్రిస్టియన్‌ చర్చి అనుచరులు ముస్లిం దేశాల మీద దాడి చేసి వారిని ఊచకోత కోశారు. ఆధునిక కాలంలో కూడా మనకు 'కూక్లక్స్‌క్లాన్‌' వంటి ప్రొటెస్టెంట్‌ మత ఛాందస సంస్థలు ఉన్నాయి. వారి అనుచరులు 18వ శతాబ్దం నుంచి మత సంరక్షణ పేరు మీద దోపిడీలు, అత్యాచారాల వంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికీ వారి అనుచరులు పాశ్చాత్య ప్రపంచంలోని అనేక దేశాలలో వ్యాపించి వారి హింసాత్మక కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అమాయక ప్రజల మీద అటువంటి క్రిస్టియన్‌ ఛాందస సంస్థల అనుచరులు దాడిచేసిననప్పుడల్లా దోషిని పాశ్చాత్య మీడియా ఉన్మాదిగానో, హంతకుడిగానో వ్యవహరిస్తుందే తప్ప 'క్రైస్తవ ఉగ్రవాది' అని మాత్రం అనదు. మధ్య ఆఫ్రికాలోని అనేక దేశాలలో సామాజిక అస్థిర పరిస్థితుల్లో క్రైస్తవ ఉగ్రవాదులు మసీదులన్నింటినీ తగులబెట్టినప్పటికీ ఆ వార్తలు మీడియాలో ప్రాచుర్యం పొందలేదు. ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు మతంతో సంబంధం లేదని మనం చెబుతున్నప్పుడు ఒక్క ఇస్లామిక్‌ ఉగ్రవాదం గురించే మనం మాట్లాడుకుంటున్నాము. క్రైస్తవ ఉగ్రవాదం, హిందూ ఉగ్రవాదం గురించి ఎందుకు కాదు? బౌద్ధ ఉగ్రవాదం కూడా ఉందనే సంగతి చాలా మందికి తెలియదు. ముజాహిద్ధీన్‌, తాలిబాన్‌, అల్‌ఖైదాల పుట్టుపూర్వోత్తరాలు మనకు మీడియాలో రోజు విడిచి రోజు పూస గుచ్చినట్లు చూపిస్తుంది కానీ మన దేశంలో క్రైస్తవ ఉగ్రవాదం ఉనికిని కూడా గుర్తించడానికి ఇష్టపడదు. నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర (ఎన్‌ఎల్‌ఎఫ్‌టి) గత దశాబ్దంలో 30 మందికి పైగా హిందువులను క్రైస్తవ మత సంరక్షణ పేరుతో చంపింది. నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌ (ఎన్‌ఎస్‌సిఎన్‌) అనే ఒక క్రైస్తవ ఛాందసవాద సంస్థ క్రైస్తవ సమాజ నిర్మాణ ధ్యేయంగా 1992-93 మధ్యకాలంలో కూకీ జాతికి చెందిన 900 మంది గిరిజనులను ఊచకోత కోసింది. లక్ష మందిని వారి ఊరి నుంచి తరిమికొట్టింది. కొందరు మత ఛాందస బౌద్ధ మతస్తులు శ్రీలంక, బర్మాల్లో ఈ మధ్యకాలంలో చాలా మంది ముస్లింలను మత సంరక్షణ పేరుతో హత్య చేశారు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మనం ఉగ్రవాదాన్ని ఏదో ఒక మతానికే ఆపాదిస్తే అది మూర్ఖత్వం అవుతుంది.
మత ఉగ్రవాదానికి కారణాలు
విశ్వీకరణ, వలస ప్రపంచంలో నిరంతరం విభిన్న సంస్కృతులు ఒక దానితో ఒకటి కలుస్తుంటాయి. పరస్పర ప్రభావాలకు లోనవుతాయి. ఆలోచనలు, అభిప్రాయాలు మారుతుంటాయి. ఈ ప్రభావాల వల్ల మతపరమైన విశ్వాసాలు వారి అవసరాలకు అనుగుణంగా సరళీకరించబడుతుంటాయి. కొంత మంది ఈ సహజమైన సామాజిక మార్పును సహించలేక మత ఉద్ధరణను తమ భుజాల మీద వేసుకొంటారు. తరతరాల నుంచి వస్తున్న మత విశ్వాసాలకు సవాలుగా నిలుస్తున్న విశ్వీకరణకు ప్రతిఘటనే ఈ మత ఉగ్రవాదం. మత ఉగ్రవాదం ప్రపంచంలోని చాలా భాగాలలో బలంగా ఉండటానికి కారణం అక్కడి వ్యవస్థ, ప్రభావశీల వ్యక్తులు వారి కార్యకలాపాలకు అండదండలు అందివ్వడమే. ప్రాథమికంగా ఇటువంటి ఉగ్రవాద సంస్థలకు స్వార్థపూరిత కారణాలతో అక్కడి ప్రభుత్వం అండనివ్వగా రాను రాను అవి అండనిచ్చేవారినే మింగేసే దశకు చేరాయి. సోవియట్‌ను తరిమి కొట్టడానికి అమెరికా తాలిబాన్‌లను ప్రోత్సహించిన పర్యవసానాలు మనం ఇప్పటికీ చూస్తున్నాము.
మత ఉగ్రవాద నిర్మూలన
ఎటువంటి ఉగ్రవాదమైనా సరే దాన్ని తుడిచిపెట్టాలనే ప్రభుత్వం, ప్రజల దృఢ సంకల్పం ముందు చిన్నబోవాల్సిందే. అమెరికాకు ఆప్ఘనిస్తాన్‌ నుంచి తాలిబాన్‌ను తరిమికొట్టడానికి అయిదేళ్ళు పట్టింది. దేశం లోపలైనా, దేశం బయటైనా ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడానికి కావాల్సింది దృఢసంకల్పం మాత్రమే. మారణాయుధాలు చేపట్టి ఎదురు దాడికి దిగిన రెండు వేల మందిని యుపి ప్రభుత్వం రెండు రోజుల్లో లొంగదీసింది... రెండేళ్ళు చూస్తూ కూర్చున్న తర్వాత. అన్ని మతాల ప్రజలు తమ తమ మత విశ్వాసాలకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగించే స్వేచ్ఛ ప్రభుత్వం వారికి కల్పించాలి. ఎటువంటి అభద్రతా భావానికిలోను కాని సామాజిక పరిస్థితులను సృష్టించాలి. తమ తమ మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు అందరికీ ఉన్నప్పటికీ ఇతర మతాలను అవహేళన చేసే చర్యలను ప్రోత్సహించకూడదు. అది మత ఉగ్రవాదానికి పునాది వేస్తుంది. ప్రత్యక్షంగా అయినా, పరోక్షంగా అయినా మత ఛాందలవాద సంస్థలకు ఎటువంటి సహాయం అందించకూడదు. ఒక ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి మరో ఉగ్రవాదాన్ని ప్రేరేపించుకుంటూపోతే దానికి అంతం ఉండదు. మత ఉగ్రవాదం హిందూ, ఇస్లాం, క్రైస్తవ రూపాల్లో ఉండొచ్చు కానీ దానికి బలయ్యేది మాత్రం ఎల్లప్పుడూ అమాయక ప్రజలే.
- సంజీవని కుసుమ్‌