* మహిళా పార్లమెంటుపై విమర్శల వెల్లువ
* సాధికారత చర్చలు నామమాత్రమే
* డిక్లరేషన్ వాయిదా
* నాయకుల కుటుంబ సభ్యులకే ప్రాధాన్యత
అమరావతి వేదికగా కొత్త చరిత్రను సృషిస్తామంటూ నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంటు లక్ష్యసాధనలో విఫలమైంది. కీలకమైన మహిళా సాధికారిత అంశంపై కూడా చర్చలు నామమాత్రంగానే సాగాయి. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి స్పష్టమైన కారక్రమాన్ని రూపొందించుకోవడం లోనూ విఫలమైంది. రిజర్వేషన్లను అడ్డుకుంటున్న వారి పేర్లను ప్రకటించాలన్న ప్రతినిధుల డిమాండ్లనూ పట్టించుకోలేదు. దానికి భిన్నంగా రాబోయే ఎన్నికల్లో మాకు సంపూర్ణ మెజార్టీ ఇవ్వండి రిజర్వేషన్లు ఇస్తామంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన విజ్ఞప్తి వివాదాస్పదంగా మారింది.
మహిళల హక్కులపై చర్చించాల్సిన సమయంలో ఎన్నికల రాజకీయాలు చేస్తారా అన్న వ్యాఖ్యలు వినిపించాయి. వేదికపై చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు కుటుంబసభ్యులకు స్థానం కల్పించడం, వారితో ఉపన్యాసాలు చేయించడం కూడా వివాదాస్పదంగా మారింది. వీరికి అనుకూలంగా వ్యవహరించే ఒక మీడియా సంస్థ యాజమా న్యానికి చెందిని వారికీ ప్రాధాన్యత ఇవ్వడం అంతే చర్చనీ యాంశంగా మారింది. మూడు రోజుల సదస్సులో భాగంగా చివరిరోజు డిక్లరేషన్ ఉంటుందని అధికారయంత్రాంగం పదేపదే ప్రకటించింది. ఆ డిక్లరేషన్ ప్రకటనా వాయిదా పడింది. దీనిపై ప్రశ్నించిన విలేకరులకు 'సదస్సులో వచ్చిన అన్ని అంశాలను క్రోడీకరించడానికి కొంత సమయం పడుతుందని, అందువల్ల కొన్ని రోజుల తరువాతే డిక్లరేషన్ ఉంటుంది' అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎన్ని రోజులు పడుతుందన్న విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్ప లేదు. అయితే, మహిళా పార్లమెంటు తరపున వెలువరించే కీలకమైన డిక్లరేషన్ ప్రతినిధుల ముందు ఉంచకుండా, వారి ఆమోదం లేకుండా ఎలా ప్రకటిస్తారన్నది అర్ధంకాని స్థితి. ఈ నేపథ్యంలోనే జాతీయ మహిళా పార్లమెంటు టిడిపి కార్యక్ర మంలా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. మూడు రోజుల పాటు పవిత్రసంగమంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టిడిపికి చెందిన నాయకుల కుమార్తెలకు, వారి కుటుంబ సభ్యులు, అనుబంధ వ్యాపార సంస్థలకు ప్రాధాన్యత లభిం చింది. మహిళా హక్కుల గురించి దేశమంతా తిరిగి పోరాటం చేస్తున్న బృందాకరత్, వందనాశివ, మేథాపాట్కర్ వంటి నేతలను విస్మరించడంపై సదస్సు ప్రారంభంలోనే విమర్శలు వ్యక్తం కావడం ఈ సందర్భంగా గమనార్హం. ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీకి కూడా ఆహ్వానపత్రంతో సరిపెట్టారు. వైఎస్ఆర్సిపికి చెందిన ఎంఎల్ఏ రోజాను ఆహ్వానించి మరీ అవమానించిన తీరు కూడా ఇక్కడ ప్రస్తావనార్హం అదే సమయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా, కోడెల శివప్రసాదరావు కుమార్తె, బాలకృష్ణకుమార్తె బ్రహ్మణికి పెద్దపీట వేశారు. మహిళా మంత్రులను శాలువాలు కప్పేందుకు మాత్రమే వినియోగించారు.
|| వ్యాపార వేత్తలకు పెద్దపీట ||
ఈ సమావేశానికి పిలిచిన వక్తలందరూ కూడా వేలకోట్ల లావాదేవీలు నిర్వహించే సిఈఓలను, వ్యాపారవేత్తలను ఆహ్వానించారు. అలాగే ప్రకృతి పొద్దార్నూ పిలిచారు. పేపరు మిల్లుల వ్యవస్థను దెబ్బతీసి రైతుల ఉపాధిని గండికొట్టిన వారిలో పొద్దార్ కంపెనీ కీలకంగా ఉంది. 3000 మంది కార్మికులను రోడ్డుపాల్జేశారనే విమర్శలున్నాయి. ఆమెను తీసుకొచ్చి ప్రసంగం ఇప్పించారు. అదే సమయంలో వేదికపై మాట్లాడినవారందరూ వారి కుటుంబాల గురించి చెప్పుకున్నారే మినహా మహిళా సాధికారిత గురించి మాట్లాడిందేమీ లేదు. పని ప్రాంతాల్లో నిముషాల ఆధారంగా పనిచేయించి హక్కులను కనీసం పట్టించుకోని సంస్థల యజమానులు యువతకు ఏం చెబుతారనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైంది. అన్ని కార్యక్రమాల మాదిరే టిడిపి సొంత కుటుంబ వ్యవహారంలా దీన్ని నడిపించారు. ఈ సదస్సుకు కన్వీనర్‌గా ఉన్న రాహుల్ వి కరాద్ రాజకీయాలకు అతీతమని చెప్పినప్పటికీ ఖచ్చితంగా టిడిపి నాయకత్వానికి అనుబంధం ఉన్న వారికే ఎక్కువ ప్రాధాన్యతిచ్చారనే విమర్శలున్నాయి. వక్తలు కూడా వ్యాపార సదస్సులో మాట్లాడిన తీరుతో మాట్లాడటమే మినహా సాధికారిత అంశాలను ఎక్కడా ప్రస్తావించలేదని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని చెబుతూనే ఇలా కోట్లాది రూపాయలు వెచ్చించి కార్యక్రమాలు నిర్వహించడం ఏమటనీ ప్రశ్నించారు. మహిళా సాధికారిత అంటూనే వందలాది మంది మహిళలతో శానిటేషన్ పనులు చేయించారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన మంత్రులైతే భోజన సమయంలో దీనిపైనే చర్చించుకున్నారు. అలాగే వాలంటీర్లుగా వచ్చిన విద్యార్థులకు భోజనం కూడా సరైన సమాయానికి ఇవ్వలేదు. మహిళా పోలీసులైతే గంటల తరబడి నిలబడి సరైన సమయానికి భోజనం లేక నానా అవస్థలు ఎదుర్కొన్నారు. తొలిరోజు నలుగురు మహిళా కానిస్టేబుళ్లు స్ఫృహతప్పిపడిపోయారు. తొలిరోజు కొద్దిమంది యువతులను పొక్లెయినర్‌పై అత్యంత అవమానకరరీతిలో తరలించడంపైనా విమర్శలు వ్యకమయాయ్యయి.
|| కాంట్రాక్టులన్నీ టిడిపి వారికే ||
వేదిక ఏర్పాటు మినహా మిగిలిన భోజన సదుపాయాలు, టిఫిన్లు వంటివన్నీ విజయవాడకు చెందిన టిడిపి నాయకులకు కేటాయించారు. ఆ భోజనం తినేందుకు ప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో ఉన్న కళాశాలలు, మేనేజ్మెంట్ విద్యాసంస్థలన్నీటికీ విద్యార్థులను పంపించాలని ఆదేశాలు జారీచేశారు. వారి ఖర్చులు కూడా పెట్టుకోవాలని సూచించారు. విజయవాడ నగరంలో బస కల్పించాలనే పేరుతో పలు స్కూళ్లు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో సెలవులు పెట్టించడం, వారిని సదస్సుకు తీసుకెళ్లడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. బస్సులు పంపించాలని ఇంజనీరింగ్ కళాశాలలకు ఆదేశాలు జారీచేశారు. ఈ వ్యవహారాన్ని రవాణా శాఖ అధికారులకు అప్పగించారు. సామాజిక భద్రత కల్పించాలంటూనే దాని గురించి చెప్పేవారినెవరినీ సదస్సుకు ఆహ్వానించడకపోవడం లోటుగా కనిపించిందని పలువులు వక్తలు పేర్కొన్నారు. ఉచిత బస్సు సదుపాయం కల్పించామని చెప్పినప్పటికీ చాలా వరకూ ఆర్టిసి బస్సుల్లో టిక్కెట్లు తీసుకున్నారు. మూడురోజులపాటు జరిగిన గ్రూపు చర్చలు నిర్వహించిన తీరు హాస్యాస్పదంగా ఉంది. సదస్సు నిర్వహించిన హాలులో పెద్ద మైకు సిస్టం ఉండగా, మిగిలిన వారందరూ వాటి ముందే ఎక్కడివారక్కడ గ్రూపులుగా కూర్చున్నారు. అందులో ఎవరు ఏం మాట్లాడుతున్నారో పక్కన వాళ్లకు వినిపించని విధంగా చర్చలు సాగాయి. చర్చల నిర్వహణకు ఒక ప్రొఫార్మా కూడా తయారు చేయలేదు. ప్రభుత్వం చెప్పింది చివరికి తీర్మానంగా చేసేశారు మినహా ప్రతినిధుల అభిప్రాయాలు ఎక్కడా సరైన విలువ ఇవ్వలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది.

No comments:
Post a Comment