Friday, 17 February 2017

|| అమ్మభాషే అమృతం ||



          ఆంధ్రుల ఆత్మాభిమానంతో పురుడుపోసుకున్న పార్టీగా పేరులోనే 'తెలుగు' తగిలించుకున్న తెలుగుదేశం పార్టీ స్వీయ ఏలుబడిలో అమ్మభాష తెలుగును కాదని, ఆంగ్లభాషను రుద్దేందుకు తెగించడం సిగ్గుచేటు. రాష్ట్రంలో తన యాజమాన్యంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో తెలుగు మాధ్యమం రద్దు చేసి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్దేశిస్తూ పురపాలక మంత్రిత్వశాఖ జనవరి 2న జారీ చేసిన ఉత్తర్వులు మాతృభాషలో విద్యాబోధన చేయాలన్న మన సంస్కర్తల ఆశయాలకు గండికొట్టింది.
అమ్మఒడి వీడి అక్షరాలు దిద్దుకునేందుకు బడిబాట పట్టే ప్రారంభ సమయంలో పసి మనసులకు తెలిసిన అమ్మభాషలో కాకుండా ఇతర భాషలో బోధన సబబా కాదా అనే సమాలోచనలు చేయకుండా, విద్యావేత్తలు, తల్లిదండ్రులతో కనీస సంప్రదింపులైనా జరపకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అనాలోచితం. అప్రజాస్వామికం. ప్రస్తుత సమాచార, సాంకేతిక యుగంలో ఆంగ్ల భాష ప్రాధాన్యత పెరిగినందునే మన పిల్లలు కూడా ఉన్నతస్థానాలకు చేరాలనే సదుద్దేశంతోనే తాము ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నామని పాలకులు చేస్తున్న ప్రచారం కూడా పచ్చి బూటకం. 2011లో ఒకటో తరగతి నుంచి ఆంగ్లాన్ని ఒక బోధన విషయంగా రెండో భాషగా ప్రవేశపెట్టిన ప్రభుత్వం అందుకు వీలుగా ఉపాధ్యాయు లను నియమించకపోవడమే దీనికి నిదర్శనం. ప్రపంచ భాషగా ఆంగ్లానికి కచ్చితంగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే. ఇందులో ఎవ్వరికీ ఎలాంటీ సంశయాలు అక్కర్లేదు. నిష్ణాతులైన ఉపాధ్యాయులను తగిన సంఖ్యలో నియమించి ఆంగ్లంలో సరైన తర్పీదు ఇస్తే సరిపోతుంది. అమ్మ కడుపులో చివరి మూడు మాసాల నుంచే అమ్మ చెప్పే మాటలను బిడ్డ ఆలకిస్తుందని, పుట్టీపుట్టగానే అమ్మభాషలోనే ఏడుస్తుం దని కూడా వివిధ అధ్యయనాలు తేల్చాయి. అలాంటి అమ్మ భాషను కాదని ప్రారంభం లోనే పరాయి భాషలో విద్యా ప్రవేశమంటే మానసికంగానూ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడులోని తిరువళ్లూరులో తమిళ మాధ్యమంలో ప్రాథమిక విద్యనభ్య సించిన భారత కమ్యూనిస్టు యోధ పుచ్చలపల్లి సుందరయ్య స్వీయానుభవాన్ని వివరిస్తూ 'బోధన అంతా తమిళంలో సాగేది. నాకు తమిళం ఒక్క అక్షరం ముక్క రాదు. ఉపాధ్యాయులు ఒక్కటి అడిగితే నేను ఇంకేదో చెప్పేవాణ్ణి. పరీక్షల్లోనూ ఇదే పెద్ద సమస్య. ఫలితం మిగిలినవారికంటే నాకు మార్కులు తగ్గిపోయేవి. అందుకే మాతృభాషకాక ఇతర భాషల్లో బోధించే పద్ధతికి నేను వ్యతిరేకిని అయ్యాను' అంటూ ఆత్మకథలో రాసుకున్నారు. ఒక్క సుందరయ్యే కాదు ఎంతో మంది ప్రముఖులు, భాషా నిపుణులు విద్యాబోధనలో మాతృభాష మాధ్యమ ప్రాముఖ్యతను, ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, కమిషన్లు, అధ్యయనాలు అమ్మభాషకే ఓటేశా యి. ప్రాథమిక స్థాయిలో మాతృభాషా మాధ్యమం అనివార్యమైన అవసరమని భార త రాజ్యాంగంలోని అధికరణం 350ఎ విస్పష్టంగా తేల్చిచెప్పింది. కొఠారి కమిషన్‌, యునెస్కో వంటి ప్రఖ్యాత సంస్థలూ ప్రాథమిక విద్యాబోధన మాతృభాషాలోనే ఉండాలని స్పష్టీకరించాయి. ఈ నేపథ్యాలన్నిటిని ప్రభుత్వం విస్మరించడం విడ్డూరం. 
ఉమ్మడి రాష్ట్రంలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని ప్రయత్నించినా క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉందన్న సమాచారంతో వెనక్కి తగ్గాల్సివచ్చింది. ఆంగ్ల భాషకు ఆయువుపట్టయిన ఆక్స్‌ఫర్డ్‌్‌ విశ్వవిద్యాలయానికి చెందిన యంగ్‌లైన్స్‌ బృందం 2002 నుంచి 2011 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన అధ్యయనం సైతం ప్రాథమిక విద్య మాతృభాష తెలుగులోనే సాగాలని తేల్చిచెప్పింది. ప్రాథమిక స్థాయిలో మాతృభాష మాధ్యమాన్ని కాదని, ఆంగ్ల మాధ్యమంలో బోధన సాగితే పిల్లల సామర్థ్యాల్లో అసమానతలు భారీగా పెరిగే ప్రమాదముందని హెచ్చరించింది. ప్రాథమిక తరగతుల్లో మాతృ భాషలో విషయాలు నేర్చుకున్నవారే ఆంగ్ల మాధ్యమంలో చదివిన వారికన్నా మెరుగ్గా రాణిస్తున్నారని యంగ్‌బెల్స్‌ స్పష్టం చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే అంశంపై 2015లో నవ్యాంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో విద్యాశాఖ ప్రజాభిప్రాయసేకరణ చేపట్టగా 83 శాతం ప్రజానీకం ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలోనే ఉండితీరాలని స్పష్టం చేశారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ఒక ఐశ్చికంగా ఉండాలే మినహా కచ్చితంగా అమల్జేయ రాదని తేల్చిచెప్పారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో గోండు తెగకు చెందిన గిరిజన విద్యార్థులు తెలుగు మాధ్యమంలో కంటే గోండు భాషా మాధ్యమంలో బోధన సాగినతర్వాత మంచి మార్కులు సాధించిన వాస్తవాలూ కళ్లముందే కదలాడు తున్నాయి. ఈ వాస్తవాలను, నివేదికలను విస్మరించి ఏకపక్షంగా ఆంగ్ల మాధ్యమం వైపు ప్రభుత్వం పరుగులెత్తడం సరికాదు. ఈ నిరంకుశ ధోరణిని వ్యతిరేకిస్తూ మాతృ భాషా మాధ్యమ వేదికగా ఏర్పడి వివిధ ప్రజాసంఘాలు మాతృభాషోద్యమానికి నడుబిగించడం అభినందనీయం. ప్రాథమికస్థాయిలో మాతృభాషా మాధ్యామాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజలంతా ఈ ఆందోళనల్లో భాగస్వామ్యం కావాల్సిన అవసరముంది. (ప్రజాశక్తి)

No comments:

Post a Comment