Friday, 24 June 2016

|| బ్రెగ్జిట్‌ - బ్రిటిష్‌ ప్రజలు ||

         బ్రిటిష్‌ ప్రజలు చారిత్రాత్మక తీర్పు చెప్పారు. 28 దేశాల ఐరోపా యూనియన్‌ నుండి బ్రిటన్‌ వైదొలగాలని నిర్ద్వంద్వంగా ప్రకటించారు. నిన్నటి వరకు బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ప్రజాతీర్పు వస్తుందని జోస్యం చెప్పిన కార్పొరేట్‌ మీడియాను బ్రిటిషర్లు కంగు తినిపించారు. రెండు శాతం తేడాతో ప్రజలిచ్చే తీర్పుతో బ్రిటన్‌ ఇయులో కొనసాగుతుందని వచ్చిన అంచనాలు సరిగ్గా తలకిందులై రెండు శాతం ఓట్ల తేడాతో బ్రిటన్‌ వైదొలగుతోంది. బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా తన ప్రతిష్టనంతటినీ ఒగ్గి ప్రచారం చేసిన బ్రిటన్‌ ప్రధాని కెమరాన్‌ పదవినుండి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. 59 ఏళ్ల క్రితం లిస్బన్‌ ఒప్పందం ప్రకారం ఏర్పడిన ఐరోపా యూనియన్‌లోకి ఇప్పటివరకు కొత్త సభ్యులు వచ్చి చేరడమే గాని వైదొలగింది లేదు. లిస్బన్‌ ఒప్పందంలోని 50వ అధికరణాన్ని అమలులోకి తీసుకురావడం ద్వారా ఇయు నుండి బ్రిటన్‌ వైదొలగే ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. అన్ని వ్యవస్థలూ తెగతెంపులు చేసుకోడానికి కొన్ని మాసాలు పట్టవచ్చు. తన వారసుడు ఆ పని చేస్తాడని రాజీనామా ప్రకటించిన కెమరాన్‌ చెబుతున్నారు. అయితే వెనువెంటనే ఈ ప్రక్రియ ప్రారంభించాలని ఇయు పాలక వర్గం కోరుతోంది.
బ్రెగ్జిట్‌ వార్తతో ఇయూలో బయలుదేరిన ప్రకంపనలు ప్రపంచమంతటా వ్యాపించాయి. ఈ వార్త ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో రక్తం ప్రవహింపచేసింది. అమెరికా నుండి జపాన్‌ వరకు స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. డౌజోన్స్‌ 450 పాయింట్లు పతనమైంది, నిక్కీ ఇండెక్స్‌ 8 శాతం పడిపోయింది. అనేక కరెన్సీలు నేల చూపులు చూశాయి. బ్రిటిష్‌ పౌండ్‌ 39 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇప్పటికే అటుఇటు ఊగిసలాడుతున్న ఆర్థిక వ్యవస్థలు కుదుపుకు లోనైనాయి. పెట్టుబడిదారులకు ఆర్థిక వ్యవస్థలపైనా, కరెన్సీల పైనా భయం పట్టుకున్నందున బంగారంవైపుకు మళ్లారు. అందువల్లనే ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు ఆకాశం వైపు చూశాయి. బ్రెగ్జిట్‌ ప్రభావం భారత్‌ను కూడా తాకింది. సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా ఒక్కసారే పతనం కాగా అంతర్జాతీయ ధోరణిని అనుసరించి బంగారం ధరలు ఇక్కడా పెరిగాయి. రూపాయి నేలచూపులు చూసింది.
ఇయు నుండి వైదొలగితే ప్రపంచ తల్లకిందులైపోతుందని కార్పొరేట్‌ మీడియా తీవ్రంగా ప్రచారం చేసినా బ్రిటిష్‌ ప్రజలు పట్టించుకోకుండా బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేయడానికి కారణం వారి అనుభం నేర్పిన పాఠాలే. బ్రెగ్జిట్‌ వల్ల బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ మాంద్యానికి గురవుతుందనీ, వాణిజ్యం తగ్గిపోతుందనీ, వీటి వల్ల తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని బ్రిటిష్‌ మీడియా, పాలక వర్గాలు, కార్పొట్‌ సంస్థలు, బడా బ్యాంకులు ప్రచారం చేశాయి. కానీ ప్రజలు వీటిని పట్టించుకోలేదు. ఇయు నిర్ణయాల పేరుతో కెమరాన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నయా-ఉదారవాద ఆర్థిక విధానాలు కార్మికుల జీతాలకు కోత పెట్టింది, సంక్షేమ కార్యక్రమాలను నీరుగార్చింది. పని భారం పెంచింది. నిరుద్యోగం, పేదరికం కట్టలు తెంచుకున్నాయి. జర్మనీ నేతృత్వంలోని యూరోపియన్‌ యూనియన్‌ సూపర్‌ పార్లమెంటులా వ్యవహరించి దేశ ప్రజల అభిప్రాయాలకు విలువ లేకుండా చేసింది. సూపర్‌ పార్లమెంటు, సూపర్‌ కార్పొరేట్లకు సూపర్‌ లాభాలు వచ్చే విధానాలు అనుసరిస్తుంటే మరో వైపు సామాన్య ప్రజలు భారాలు మోయాల్సి వచ్చింది. అందుకే పాలక వర్గాల ప్రచారాన్ని పట్టించుకోకుండా 'ఐరోపా యూనియన్‌' అనే పెనుభారాన్ని బ్రిటిష్‌ ప్రజలు వదిలించుకున్నారు.
బ్రెగ్జిట్‌ ఆర్థిక ప్రభావమే కాదు రాజకీయ ప్రభావం కూడా రానున్న కాలంలో యూరప్‌ మీద, మొత్తం ప్రపంచం మీద పడుతుంది. ఇప్పటికే ఫ్రాన్స్‌, ఇటలీ, స్వీడన్‌, బెల్జియం వంటి ఇయు దేశాలో మెజారిటీ ప్రజలు తమ దేశాల్లో కూడా ఇటువంటి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. తమ దేశాల్లో రిఫరెండం జరిపితే విడిపోడానికే ఓటు వేస్తామని వారు అంటున్నారు. ఇయు, ఐఎంఎఫ్‌ కలిసి గ్రీసుపై రుద్దిన ఆర్థిక సంస్కరణలు ఆ దేశ కార్మికుల రక్తమాంసాలను ఎలా పిండి పిప్పిచేస్తున్నాయో, దానికి వ్యతిరేకంగా అక్కడి కార్మికులు ప్రతినిత్యం ఎంతటి వీరోచిత పోరాటాలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. బ్రిటిష్‌ ప్రజలు ఇప్పుడు ఇచ్చిన తీర్పు కూడా ఇయు పేరుతో తమ మీద నిత్యం కార్పొరేట్‌ పాలక వర్గాలు వేస్తున్న భారాలకు ప్రతిఘటనగానే చెప్పుకోవచ్చు. ఆ దేశంలో ఇటీవల కాలంలో కార్మిక వర్గం జరుపుతున్న పోరాటాలకు ఇది ప్రతిబింబం. ఫ్రాన్స్‌లో కూడా ప్రజాభిప్రాయం ఇదే విధంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఫ్రెంచి కార్మకవర్గం తీవ్రమైన పోరాటాలు చేస్తున్నది. బ్రెగ్జిట్‌ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థమీద పెద్దగా ఉండదనీ, మన ఆర్థిక వ్యవస్థ నియంత్రణలోనే ఉందని మన ఆర్థిక నిర్వాహకులు చెబుతున్నారు. కానీ ఒకవైపు ఆర్థిక వ్యవస్థపై నియంత్రణలు వదిలేస్తూ మరోవైపు ప్రభావం ఉండదని చెప్పడం ఆత్మవంచనే. నిజానికి ఆర్థిక సంస్కరణలను మరింత లోతుగా, విస్తృతం గా అమలు జరుపుతున్న కొద్దీ మన ఆర్థిక వ్యవస్థ మరింతగా రక్షణ కోల్పోయి ప్రపంచంలో ఏ చిన్న పరిణామం జరిగినా కుదుపులకు గురవుతుంది. బ్రెగ్జిట్‌ పరిణామాన్ని మన దేశం ఎంతవరకు తట్టుకుని నిలవగలుగుతుందో వేచి చూడాలి.

No comments:

Post a Comment