Friday, 24 June 2016

|| యఫ్‌.డి.ఐ లకు స్వేచ్ఛ దేశానికి చేటు ||

             కేంద్ర ప్రభుత్వం రక్షణ, మీడియా, ఔషధాలు, విమానయానం, ఆహార శుద్ధి, చిల్లర వర్తకం, తదితర రంగాల లో వంద శాతం యఫ్‌డిఐల ప్రవేశానికి అవకాశం కల్పిం చింది. ఈ రంగాలలోకి నూరు శాతం యఫ్‌డిఐలకు ప్రవేశం కల్పించి సంస్కరణలను వేగవంతం చేయటం వల్ల విదేశీ పెట్టుబడులు పెద్దమొత్తంలో దేశంలోకి వస్తాయని, పారిశ్రామికాభివృద్ధి జరుగుతుం దని, ఉద్యోగ కల్పన పెరుగుతుం దని, భారత్‌ ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా మారుతుందని, మేక్‌ ఇన్‌ ఇండియా జయప్రదం అవు తుందని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. రాజన్‌ రెండవసారి రిజర్వుబ్యాంక్‌ ఛైర్మన్‌గా ఉండటానికి తిరస్కరించటం, బ్రెగ్జిట్‌ భయాలతో పెట్టుబడులు బయటకు పోతాయని ఆందోళన చెందిన ప్రభుత్వం ఈ సంస్కరణలను ప్రకటించిందని ఆర్థిక నిపుణులు, పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గతంలో బీహార్‌ ఎన్నికలలో ఓటమి తర్వాత పెట్టుబడిదారులలో తగ్గుతున్న విశ్వాసాన్ని నిలబెట్టేందుకు 2015 నవంబరులో కొన్ని రంగాలలో యఫ్‌డిఐ పరిమితులను ప్రభుత్వం పెంచింది. ఇప్పుడు మరోసారి మరికొన్ని రంగాలలో సంస్కరణలను వేగవంతం చేస్తూ నిర్ణయం తీసుకున్నది. వంద శాతం యఫ్‌డిఐల ప్రవేశానికి అవకాశం కల్పించటం వల్ల ప్రభుత్వం చెబుతున్నట్లుగా దేశం తయారీ హబ్‌గా మారటానికి, ఉద్యోగ కల్పన పెరగటానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందుకు బదులుగా దేశంలో ఆయు ధాల లభ్యత, యుద్ధోన్మాదం పెరగటానికి, సామ్రాజ్య వాద ప్రయోజనాలకు దోహదం చేసే విధానాలను ముందుకు తీసుకెళ్ళడానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వంద శాతం యఫ్‌డిఐకి అనుమతించటం వల్ల దేశంలోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతాయనేది భ్రమ మాత్రమే. విదేశీ పెట్టుబడులు ఏ దేశంలోకి ప్రవేశించటానికైనా లాభాలే కారణం. లాభాలు వస్తాయనుకొంటే పెట్టుబడులు ఆ దేశంలోకి వస్తాయి. లాభాలకు అవకాశం లేదనుకుంటే ఏ దేశం నుంచైనా నిష్క్రమిస్తాయి. ఈరోజు మనదేశంలో ఉన్న పరిస్థితులు లాభాలకు గ్యారంటీ కల్పించేలా లేవు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తున్నాయి. కార్మికులు, కర్షకులు, మధ్యతరగతి ప్రజలపై ప్రభుత్వం కొత్త భారాలను మోపుతుండటంతో దేశీయ మార్కెట్‌ కుంచించుకుపోతున్నది. దేశంలో సగానికి పైగా కరువుతో అల్లాడుతుండగా ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చటానికి ప్రభుత్వం పూనుకున్నది. కరువు నుంచి తేరుకోవటానికి రైతాంగానికి ఏ మాత్రం సహాయం అందించలేదు. ధాన్యం సేకరణ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవటంతో రైతాంగం కనీస మద్దతు ధరలు పొందటానికి అవకాశం లేకుండాపోయింది. ఇతర పంటల రైతాంగానికి కూడా గిట్టుబాటు ధరలు లభించటం లేదు. కార్మికులకున్న కనీస హక్కులను కూడా హరించే విధంగా ప్రభుత్వం చట్టాలకు సవరణలు చేస్తుండటంతో కార్మికులకు లభించే కనీస వేతనాలు తగ్గిపోతున్నాయి. కోట్లాదిమంది విద్యావంతులు నిరుద్యోగం బారినపడి బతకటానికి ఇబ్బందుల నెదుర్కొంటున్నారు. ఈ విధంగా ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిపోతుండటం వల్ల దేశంలో ఇప్పటికే మాంద్యం పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు ప్రపంచంలో నెలకొన్న మాంద్యం పరిస్థితుల వల్ల మన ఎగుమతులు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఒకవైపు దేశీయ మార్కెట్‌, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌ క్షీణిస్తుండగా ఏ ఆశతో ఉత్పత్తిరంగంలోకి యఫ్‌డిఐలు వస్తాయనేది ప్రశ్న.
రక్షణరంగంలోకి నూరు శాతం యఫ్‌డిఐని అనుమతించటం వల్ల దీర్ఘకాలంలో తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. ఇప్పటి వరకు మన రక్షణ పరిశ్రమలు ప్రభుత్వరంగంలోనే ఉండి దేశరక్షణ అవసరాలకు, మిత్ర దేశాలకు పరిమితంగా మాత్రమే ఎగుమతులు చేస్తున్నది. రక్షణరంగంలోకి విదేశీ పెట్టుబడులు, దేశంలోని కార్పొరేట్‌ రంగం ప్రవేశించటం వల్ల దాని స్వభావంలోనే పూర్తి మార్పు సంభవిస్తుంది. విదేశీ, ప్రయివేటు పెట్టుబడులకు లాభాలే ప్రధానం. లాభాలు ఎక్కువ కావాలంటే ఎక్కువ ఉత్పత్తి చేయాలి. ఉత్పత్తి చేస్తుండాలంటే వినియోగం కూడా ఉండాలి. ఆయుధాలను ఎక్కువ ఉత్పత్తి చేయాలంటే కొనే వారు ఎక్కువ సంఖ్యలో ఉండాలి. ఎక్కువ స్థాయి వినియోగం అవటం అంటే తుపాకులు, బాంబులు విస్తారంగా ఉనికిలోకి వస్తాయి. తీవ్రవాదులు, అరాచక వాదుల చేతుల్లోకి ఆయుధాలు చేరటంతో శాంతిభద్రతల సమస్య తీవ్ర మౌతుంది. ఆత్మరక్షణ కోసం పౌరులు కూడా తుపాకులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది అమెరికాలో వలె తుపాకి సంస్కృతికి దారితీసి ప్రజల జీవితాలకు ఏమాత్రం భద్రతలేని పరిస్థితిని కల్పిస్తుంది. ఆయుధ వ్యాపారులకు ఇటువంటి పరిస్థితే కావాలి. అప్పుడే ఆయుధాలు పెద్దమొత్తంలో ఖర్చయి లాభాలొస్తాయి. అందువల్ల విదేశీ, ప్రయివేటు ఆయుధ ఉత్పత్తి కంపెనీలు దేశంలోకొస్తే ఇటువంటి అభద్రతా వాతావరణాన్ని సృష్టిస్తాయి. రెండవ అంశం ఆయుధాలు పెద్దమొత్తంలో అమ్ముడుపోయి లాభాలు రావాలంటే మన ప్రభుత్వం, ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా పెద్దమొతంలో ఆయుధాలను కొనుగోలు చేయాలి. పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలుంటే ప్రభుత్వం పెద్దమొత్తంలో ఆయుధాలు కొనుగోలు చేయటానికి ప్రాతిపదిక ఉండదు. సైనిక వ్యయం పెంపుదల కోసం ప్రజలను ఒప్పించలేదు. అందువల్ల మన దేశానికి పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు లేకుండా నిరంతరం ఉద్రిక్త వాతావరణం, యుద్ధజ్వాలలు రగులుతూ ఉండాలి. అప్పుడు ప్రభుత్వం సైనిక వ్యయం పెంచటానికి, పెద్దమొతంలో ఆయుధాలు కొనుగోలు చేయటానికి వీలైన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రస్తుత ప్రభుత్వం ఇరుగుపొరుగు దేశాలతో మనకున్న సత్సంబంధాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నది. చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేస్తున్న కూటమిలో మనదేశం భాగస్వామి అవుతున్నది. పాకిస్తాన్‌తో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నది. నేపాల్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆయుధాల ఉత్పత్తి సంస్థలు పొరుగు దేశాలతో మన సంబంధాలు మెరుగుపడకుండా, మరింత క్షీణించేలా చేస్తాయి. ప్రస్తుతం అమెరికా, ఇతర యూరోపి యన్‌ దేశాలు చేస్తున్న విధంగా మనదేశంతో పాటు మనకు వ్యతిరేకంగా ఉన్న దేశాలకు కూడా ఆయుధాలు విక్రయి స్తాయి. ఫలితంగా దేశంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణి స్తుంది. ప్రజలు నిరంతరం అభద్రత, అశాంతితో జీవించా ల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
మీడియా రంగంలో కూడా వంద శాతం యఫ్‌డిఐకి అవకాశం కల్పించారు. దీని పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి. రాజకీయంగా ప్రజల అభిప్రాయాలను మలచగల శక్తి మీడియాకు ఉంటుంది. నేడు యువకుల అభిప్రాయాలను మలచటంలో, హింసను ప్రేరేపించటంలో సినిమాలు, టీవీలు నిర్వహిస్తున్న పాత్రను చూస్తున్నాం. దేశంలోనూ, విదేశాలలోనూ బడా కార్పొరేట్‌ సంస్థలు తమ ప్రయోజనాల పరిరక్షణ కోసం వేల కోట్ల రూపాయలతో మీడియా సంస్థలను నడుపుతున్నాయి. ప్రజలకు వినోదం కల్పించటానికో, ప్రజల కష్టాలను ఎలుగెత్తి చాటటానికో కాక తమ సంస్థల ప్రయోజనాల పరిరక్షణ కోసమే కార్పొరేట్‌ సంస్థల చేతుల్లోని, వారి పలుకుబడిలోని మీడియా నిరంతరం పని చేస్తుంటుంది. తమ ప్రయోజనాల సాధన కోసం మనదేశానికి వ్యతిరేకమైన అంశాలను మనకు ప్రయోజనం కలిగించే అంశాలని ప్రచారం చేస్తారు. ఈరోజు దేశంలో ఉన్న కార్పొరేట్‌ మీడియా అంతా అమెరికాతో మనదేశం చేసుకున్న అణు సహకార ఒప్పందాన్ని గొప్పగా ప్రచారం చేస్తున్నది. ఆ ఒప్పందం మనదేశ సార్వభౌమత్వాన్ని హరించి, అమెరికాకు జూనియర్‌ భాగస్వామిగా మారుస్తుంది. మరి అటువంటప్పుడు మనదేశ మీడియా ఈ ఒప్పందాన్ని గురించి ఎందుకని గొప్పగా ప్రచారం చేస్తున్నది? అమెరికాతో అణు సహకార ఒప్పందం చేసుకోవటం వల్ల విదేశీ అణు శక్తి సంస్థలతో ఒప్పందాలు చేసుకొనే దేశీయ బడా కంపెనీలు లాభపడతాయి. అమెరికాతో సంబంధాలు బలపడటం వల్ల సరళీకరణ విధానాల అమలు వేగం పుంజుకొని కార్పొరేట్‌ సంస్థలకు ప్రయోజనం కలుగుతుంది. దేశానికి నష్టమైనా తమకు ప్రయోజనం కలుగుతుంది కాబట్టి మనదేశ మీడియానే అణు సహకార ఒప్పందం వల్ల దేశానికి ప్రయోజనం కలుగు తుందని ప్రచారం చేస్తున్నది. ఇదే విదేశీ మీడియా సంస్థలైతే మరెంతగా ప్రచారం చేస్తాయి! బహుళజాతి సంస్థల దోపిడీ వల్ల దుర్భరమౌతున్న ప్రజల జీవితాలు, దారిద్య్రం, నిరుద్యోగం పెరుగుదల నుంచి ప్రజల దృష్టి మళ్ళించటానికి కుల, మత, జాతి, ప్రాంతీయ వైరుధ్యాలను రెచ్చగొడతారు. దేశ సమస్యలపై శ్రద్ధపెట్టకుండా ప్రజలను తప్పుడు మార్గాల వైపు మళ్ళిస్తారు. మూఢ విశ్వాసాలు, మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలను చేసే ప్రయత్నాలు చేస్తారు.
ప్రభుత్వం వంద శాతం యఫ్‌డిఐకి ద్వారాలు తెరిచిన రంగాలన్నింటిలోనూ దోపిడీ తీవ్రం అవుతుంది. వైమానిక రంగంలోకి విదేశీ సంస్థల ప్రవేశం దేశ భద్రతకు ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఫార్మారంగంలోకి విదేశీ సంస్థల ప్రవేశం వల్ల దేశీయంగా తక్కువ ధరలకు మందులను ఉత్పత్తి చేసే సంస్థలు అదృశ్యమౌతాయి. సాధారణ ప్రజలు కొనుగోలు చేయలేని విధంగా అత్యవసర మందుల ధరలు పెరుగు తాయి. ఈ విధంగా బహుళజాతి సంస్థలు దేశ సంపదను కొల్లగొడతాయి. వంద శాతం యఫ్‌డిఐ ప్రవేశానికి అవకాశం కల్పించటం వల్ల ఉద్యోగాల కల్పన జరుగుతుందని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. బహుళజాతి సంస్థలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, తక్కువ ఖర్చుతో సరుకులను ఉత్పత్తి చేయటం వల్ల దేశీయ చిన్న పరిశ్రమలు పోటీకి తట్టుకోలేక దివాళా తీస్తాయి. బహుళజాతి సంస్థలు కల్పించే ఉద్యోగాల కన్నా దేశీయ పరిశ్రమల మూత వల్ల కోల్పోయే ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వాస్తవంగా అదనంగా ఉద్యోగాలు రాకపోగా ఇప్పటికే ఉద్యోగాలలో ఉన్నవారే నిరుద్యోగులుగా మారటంతో నిరుద్యోగం పెరుగుతుంది. ప్రజల ఆదాయాలు తగ్గుతాయి. విదేశీ పెట్టుబడులకు పెద్ద మొత్తంలో రాయితీలు కల్పించటంతో ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. వీటన్నింటి ఫలితంగా పెరుగుతున్న ప్రజల అసంతృప్తిని అణచటానికి ప్రభుత్వం మరింతగా నిరంకుశ విధానాలను అమలు చేస్తుంది. అందువల్ల సరళీకరణ విధా నాలను వేగంగా అమలు చేయటం కోసం ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలు దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తాయి.
- ఎ కోటిరెడ్డి

No comments:

Post a Comment