'షా-ట్రంప్' మతోన్మాద రాగం
*తూర్పు పడమరలనుకలిపిన ముస్లిం వ్యతిరేకత
*ఎన్నికల వేళ ఓట్ల చీలికే ఇరువురి లక్ష్యం
*ఎన్నికల వేళ ఓట్ల చీలికే ఇరువురి లక్ష్యం
'
తూర్పు తూర్పే. పశ్చిమం పశ్చిమమే. రెండూ ఎప్పుడూ కలవవు' అనుకుంటాం. పెద్దలు కూడా అదే చెప్తుంటారు. అయితే తాజా రాజకీయ పరిణామాలు అందుకు భిన్నంగా వున్నాయి. పశ్చిమ దేశమైన అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హోరు జోరు మీదుంది. తూర్పు దేశమైన భారత్‌లోని ప్రధాన భూభాగం రానున్న ఒకటి రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమౌతోంది. ఈ సందర్భంగా రెండు చోట్లా ముదిరి పాకాన పడుతున్న ముస్లిం వ్యతిరేక రాగాలు... లౌకిక ప్రజాస్వామిక వాదులను కలవర పెడుతున్నాయి. అమెరికన్ అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్, మన దేశంలో బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా బృందం ఒకే రాగం ఆలపించడమే 'తూర్పు-పడమర' సిద్ధాంతులను విస్తుగొల్పుతోంది. తొలి నుంచీ ముస్లిం వ్యతిరేక రాగాలు ఆలపించడంలోను, ఉద్రిక్తపూరిత ప్రసంగాలు ఇవ్వడంలోనూ ట్రంప్‌ది అందెవేసిన చెయ్యి. మామూలుగానే ఆయన ఉపన్యాసాలలో సందర్భం వచ్చిన ప్రతిసారీ ఆ ధోరణి వ్యక్తమౌతుంటుంది. ఓర్లాండో కాల్పుల ఘటన అందుకు తాజా ఉదాహరణ. ముస్లింలను దేశంలోకి రానివ్వకుండా నిషేధం విధించాలని ఈ సందర్భంగా మరోసారి గొంతు చించుకున్నారు ట్రంప్. మనదేశంలో బి.జె.పి, దాని అనుబంధ సంస్థల నేతలు ట్రంప్కేమీ తీసిపోలేదు. అస్సాం నుంచి ఉత్తరప్రదేశ్ కైరానా వరకు ఇదే రాగం ఆలపిస్తున్నారు. అస్సాం భూభాగంలోకి వస్తున్న బంగ్లా ముస్లింలను బూచిగా చూపించారు అక్కడి బి.జె.పి నేతలు. 2001 సంవత్సరం వరకు కైరానాలో 68 శాతం హిందువులు నివసించేవారని, ప్రస్తుతం వారు 8 శాతానికి తగ్గిపోయారని, ఈ విషయమై ఆలోచించాల్సిందేనంటూ బి.జె.పి ఎం.పి యోగి ఆదిత్యనాథ్ రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు. ముస్లింల కుట్ర కారణంగానే కైరానా హిందువులు వలస వెళ్లారని షా అబద్దపు బృందగానం ఆలపించారు. వాస్తవ మేమిటనేది నిజనిర్ధారణ బృందాలు, పత్రికలు, పోలీసు అధికారులు ప్రపంచానికి చాటినా... కరడు గట్టిన కాషాయ నేతలు, కార్యకర్తలు మాత్రం తమదైన మతోన్మాద మార్గంలోనే ప్రయాణిస్తున్నారు. ట్రంప్ పుట్టిన రోజును ఢిల్లీ, జంతర్‌మంతర్‌లో బూరలు కట్టి, కేకు కోసి మరీ ఘనంగా జరిపారు 'హిందూ సేన' కార్యకర్తలు. ఇస్లాం వ్యతిరేకతే వారిని ట్రంప్ జన్మదిన ఉత్సవాలు జరుపుకునేంతగా, 'ఆయనే మా హీరో' అనేంతగా దగ్గరకు చేసింది. అంతటితో ఆగక ఈ విధమైన ఉత్సవాలను యు.ఎస్ రాయబార కార్యాలయం వెలుపల, జెఎన్‌యు ప్రాంగణంలో సైతం చేసే ఆలోచనలున్నట్టు సేన ప్రకటించింది. తక్షణం కాకపోయినా... సమీప భవిష్యత్తులోనైనా ...మత ఉద్రిక్తతలతో ఓట్లు చీల్చాలన్నది ఇక్కడ కమలనాథులు, అక్కడ రిపబ్లికన్ల విశ్వప్రయత్నంగా కనిపిస్తోంది మరి!
No comments:
Post a Comment