|| వర్ణాలు - వర్ణబేధాలు? ||
మనుషులందర్నీ విజ్ఞానశాస్త్రం హోమోసెపియన్స్ అనే ఒకే జంతుజాతిగా పరిగణిస్తున్నా వివిధ దేశాల్లో ప్రజల చర్మపు రంగు, శరీర నిర్మాణంలో తేడా ఎందుకుంటుంది?
మానవ జాతి మొత్తం జంతుశాస్త్ర ప్రకారం ఒకే జాతి (Species)కి చెందిందే. దాన్నే ద్వినామకరణ పద్ధతి (Binomial nomenclature) ప్రకారం హామోశాపియన్స్ (homo sapians) అంటారు.
డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకారం ఏక కణ జీవుల నుండి పరిణామ క్రమంలో బహుకణ జీవులు, వాటి నుండి ఉన్నతమైన జీవులు ఆవిర్భవించాయి. ఈ ఉన్నత జీవుల్లో అత్యున్నత జీవి మానవుడు. జీవ పరిణామానికి సుమారు 400 కోట్ల సంవత్సరాల చరిత్ర వున్నా, మానవ పరిణామానిది 20 లక్షల సంవత్సరాల చరిత్ర మాత్రమే.
మన భూమ్మీద శీతోష్ట పరిస్థితులు, నీటి తీరువా, ఆహార లభ్యత, వెలుతురు, ఎత్తు పల్లాలు ఒకేవిధంగా లేవు. ఇందుకు కారణం భూమి సమతలముగా చాపలాగా కాకుండా గోళాకారం(spherical shape) లో ఉండడమే. తన చుట్టూ తాను తిరుగుతూ (ఆత్మ భ్రమణం లేదా spin) సూర్యుడి చుట్టూ పరిభ్రమణం (Revolution) చేస్తున్న గ్రహం భూమి. అంతేకాదు సూర్యుడి చుట్టూ తిరిగే పరిభ్రమణ కక్ష్య (orbit) అన్ని కాలాల్లో ఒకే విధంగా వుండదు. కొన్ని రోజులలో సూర్యుడికి దగ్గరగా మరికొన్ని రోజులలో సూర్యుడికి దూరంగా ఉండేవిధంగా కక్ష్య ఉంటుంది. పైగా కక్ష్యోపరితలా (ecliptic) నికి భూమి భ్రమణాక్షం (spinning axis) లంబకోణం (vertical) లో కాకుండా సుమారు 23 డిగ్రీల కోణంలో ఏటవాలుగా వుంది. తత్ఫలితంగా భూమధ్యరేఖ మీద మార్చి మొదలుకొని జూన్ వరకు భూమధ్యరేఖా ప్రాంతం మీద అధిక మోతాదులో సూర్యకాంతి పడుతుంది. భూమధ్య రేఖకు కింద పైన తక్కువ కాంతి పడుతుంది. ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర ఆర్నెల్ల పాటు ఒక ధృవంలో కొంచెం కాంతి ఉండగా, మరో ధృవం దగ్గర కొంచెం చీకటి ఉంటుంది. వెరసి ఎప్పుడూ రెండు ధృవాల దగ్గర అత్యంత తక్కువ కాంతి మాత్రమే ఉంటుంది. అందువల్లే అక్కడ నీరు గడ్డకట్టి మంచు కొండలుగా మంచు బండలుగా నేల వుంటుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ కాలంలో భూమధ్యరేఖ దానికి పైన ఉన్న ప్రాంతాల్లో బాగా వెలుతురు తగ్గిపోతుంది. అదేకాలంలో దక్షిణ భాగంలో సూర్యరశ్మి బాగా పడుతుండడంతో భూమధ్య రేఖ మీద ఉన్న ఆఫ్రికా, ఆసియా, దక్షిణ భారతదేశం, మలేషియా వంటి దేశాల్లో ఏప్రిల్- జూన్ కాలాల్లో విపరీతమైన వేసవి ఉండగా, దక్షిణ భూభాగంలో ఉన్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఉత్తర కెనడా ప్రాంతాల్లో చలికాలం తాండవిస్తుంది. మనకు సెప్టెంబర్ - డిసెంబర్ కాలాల్లో శీతాకాలం ఉండగా, దక్షిణ భూభాగంలో ఉన్న ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాల్లో మండు వేసవి వుంటుంది. ఇలా ప్రతి సంవత్సరం ఋతువులు మారుతూ ఉన్న పరిస్థితి భూమ్మీద ఉంది. సూర్యరశ్మి వల్ల చర్మం, దాని క్రిందున్న అవయవ నిర్మాణం క్షీణతకు, అసౌకర్యానికి గురికాకుండా ఉండేలా చర్మంలో సూర్యకాంతిని బాగా శోషించుకొనేలా మెలినిన్ రేణువులు ఉన్నాయి. ఇవి ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువగా అవి సూర్యరశ్మిని అడ్డుకొంటాయి. మెలనిన్ రేణువుల రంగు నలువు. కాబట్టి ఎండ బాగాపడే భూమధ్య రేఖ ప్రాంతంలో ఉన్న ఆఫ్రికన్లు, భారతీయులు, సింహళీయుల చర్మం నల్లగా వుంటుంది. సంవత్సర పర్యంతం తక్కువ సూర్యకాంతి మాత్రమే పడే అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల ప్రజల చర్మంలో మెలనిన్ తక్కువ ఉండడం వల్ల వారి చర్మం తెల్లగా వుంటుంది. నల్ల చర్మం వాళ్లని తెల్ల జాతీయులు తక్కువ చేసి చూడ్డాన్నే మనం వర్ణ వివక్షత అంటున్నాము. శ్వేతచర్మం వాళ్లు గొప్ప, చామనఛాయ, నల్ల చర్మం వాళ్లు తక్కువ అని చూడ్డం అవివేకం. అలా పరిగణించే తెల్ల చర్మపు వాళ్ల చర్మంలో మెలనిన్ రేణువులు తక్కువ ఉండడంతోపాటు వారి చర్మాల క్రింద వున్న బుర్రల్లో కూడా బుద్ధికుశలత రేణువులు కూడా తక్కువ అని పరిగణించ వలసి వుంటుంది. రంగు ఏదైనా మనుషులందరూ ఒక్కటే. తెలివితేటలకు చర్మపు రంగుతో సంబంధంలేదు. ప్రకృతితో పోరాడే శక్తి నల్లని చర్మాలకే ఎక్కువ.
ఒక జాతిని ఒకే స్పీసిస్గా విజ్ఞాన శాస్త్రం ఎపుడు పరిగణిస్తుందంటే.. ఆ జాతిలో స్త్రీ పురుష లైంగికత ఉన్నట్లయితే శరీర నిర్మాణంతో సంబంధం లేకుండా ఆడ మగ కలిస్తే, అదే జాతికి చెందిన సంతతి కలిగి నట్లయితే ఆ ఇద్దర్నీ ఒక జాతి వారుగా పరిగణిం చాలి. చైనా అమ్మాయిని అమెరికా అబ్బాయి పెళ్లి చేసుకున్నా, శ్వేత జాతీయుడయిన వ్యక్తి, నల్లచర్మం ఉన్న స్త్రీని పెళ్లి చేసుకొన్నా... వారికి పిల్లలు పుట్టడం సహజమే. తెల్లగా, పొట్టిగా వున్న జపాన్ అబ్బాయి శ్రీలంకలో పొడవుగా వున్న నల్లని అమ్మాయిని పెళ్లి చేసుకున్నా పిల్లలు పుడతారు. కాబట్టి దేశాలు వేరయినా, ఖండాలు వేరయినా మానవులందరూ ఒకే జన్యు నిర్మాణంలో ఉన్నారు.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య (సంపాదకులు, చెకుముకి, జనవిజ్ఞాన వేదిక.)




No comments:
Post a Comment