లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటూ బిజెపి జాతీయ కార్యవర్గం ఇచ్చిన 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' నినాదం పూర్తి అప్రజస్వామికం. ఒకేసారి ఎన్నికల నిర్వహణ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన బిజెపి ఈ అంశాన్ని ప్రకటించటంలో ఆశ్చర్యం లేదు . ఎన్నికల సంస్కరణల ప్యాకేజిలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ గత సెప్టెంబరులో ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూడా దీనిని సమర్థించారు.
దీనికి వారు చెప్పిన కారణాలు ప్రభుత్వాలకు ఖర్చు తగ్గుతుందని, నిరంతర ఎన్నికల ప్రక్రియతో పాలన కుంటుపడుతుందని, ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అన్ని స్థాయిల్లో మెరుగైన పాలనకు అవకాశం వుంటుందని, రాజకీయ వ్యవస్థలో స్థిరత్వం ఏర్పడుతుందని. మరికొంతమంది పంచాయతీ ఎన్నికలను కూడా కేంద్ర, రాష్ట్ర ఎన్నికలతో పాటే నిర్వహించాలని సూచించారు. అయితే, దీనిపై కొన్ని అభ్యంతరాలు కూడా వచ్చాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే భారీ సంఖ్యలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అవసరమని, ఆ మేరకు ఆ యంత్రాలను తయారు చేసుకోవటంతో పాటు ఇంతటి విస్తృత ప్రక్రియలో శాంతి, భద్రతల నిర్వహణకు తగినన్ని భద్రతా బలగాలు అందుబాటులో వుండవని వారు చెప్పారు. ఇవన్నీ సాంకేతికపరమైనవి మాత్రమే. అసలు అభ్యంతరం ఇది ప్రజాస్వామ్యానికే చేటు. పార్టీ ఆధారిత పార్లమెంటరీ వ్యవస్థను ఇది భ్రష్టుపట్టిస్తుంది. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల పదవీ కాలం ఐదేళ్లవ్యవధి స్థిరంగా వున్నప్పుడు మాత్రమే సమాంతర ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుంది. అంటే చట్టసభలను మధ్యలో రద్దుచేసే చర్యలకు ఈ విధానంలో తావు వుండదు. ఒక ప్రభుత్వం సభలో మెజార్టీ కోల్పోతే సభను రద్దు చేయాలి. దాని స్థానే మరో ప్రభుత్వ ఏర్పాటుకు ఇది అనుమతించదు. అంటే మిగతా గడువు పూర్తయ్యేంతవరకు అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగించాలి. ప్రజాస్వామ్యంలో దీనిని ఎంతమాత్రమూ అనుమతించరాని విషయం. ఇటువంటి ప్రయత్నాలు లోక్‌సభ, ప్రభుత్వ పదవీ కాలాన్ని పొడిగించటానికి మాత్రమే ఉపయోగపడతాయని, పార్టీ ఆధారిత పార్లమెంటరీ ప్రజాస్వామ్యవ్యవస్థలో కార్యనిర్వాహక వర్గం శాసన వ్యవస్థకు జవాబుదారీగా వుండాలన్న రాజ్యాంగ సూత్రానికి ఇది విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వాలు, చట్ట వ్యవస్థల విషయంలో కేంద్రం తన ఏకపక్ష అధికారాలను వినియోగించేందుకే ఇది దోహదపడుతుంది. ఏకకాల ఎన్నికల ప్రతిపాదన అన్నది ప్రజాతీర్పులో అనుచిత జోక్యం చేసుకోవటమే. అది ఫెడరల్ నిర్మాణాన్ని సమూలంగా దెబ్బతీయటంతో పాటు పార్లమెంట్‌కు, ప్రజలకు ప్రభుత్వ జవాబుదారీతనానికి ఇది గండి కొడుతుంది. నిర్ణీత వ్యవధిలో పదవీ కాలం అమలులోకి వచ్చిన సందర్భంలో ఒక వేళ ప్రధాన మంత్రి సభా విశ్వాసాన్ని కోల్పోతే మెజార్టీనేత ఎవరన్న ప్రశ్నకు జవాబు లభించదు. నిర్ణీత పదవీ కాలం నిబంధన మేరకు ప్రజల తీర్పుతో సంబంధం లేని మరో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సివుంటుంది. సభలో మెజార్టీని శాసించే అధికారపార్టీ నేత ఎవరూ మరోసారి ప్రజల తీర్పు కోరేందుకు ముందుకు రారు. కేరళలో 1959లో అప్పటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు కేంద్రం రాజ్యాంగంలోని 356వ అధికరణను వినియోగించిన నాటి నుండి పార్లమెంట్, అసెంబ్లీ ఏకకాల ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిందని గుర్తు చేసింది. ఆ తరువాత 1962 ఎన్నికలు లేదా తరువాతి ఎన్నికల్లో ఎప్పుడూ కేరళలో సమాంతర ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవు. అప్పటి నుండి 356వ అధికరణాన్ని దుర్వినియోగంచేస్తూ కేంద్రం వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేస్తూ పోతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పదవీ కాలంలో వైరుధ్యం అనివార్యంగా మారింది. రాజ్యాంగంలో ఈ నిబంధన కొనసాగినంత కాలం, నిర్ణీత పదవీ కాలం పేరిట మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం దానిని రాజకీయ ఆయుధంగా ఉపయోగించేందుకు అవకాశం వుంటుందని స్పష్టం చేసింది. దీనితో పాటు సమాంతర ఎన్నికల నిర్వహణ అంటే ప్రస్తుతం కొనసాగుతున్న కొన్ని రాష్ట్రాల చట్టసభలను అర్ధాయుష్షుతో ముగించటమేనని ఇది పూర్తి అప్రజాస్వామికం . మన దేశంలో వున్న 29 రాష్ట్రాల్లో కొనసాగుతున్న రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో భిన్న పార్శ్వాలున్నాయి. ఈ అప్రజాస్వామిక సారూప్యతను అమలు చేసే ప్రయత్నం బిజెపి-ఆరెస్సెస్ కూటమి ఆలోచనేనని, " ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే భాష, ఒకే సంస్కృతి" అన్న నినాదం ఇది భాగం. ప్రజాతంత్ర శక్తులు ఇటువంటి ప్రయత్నాలను వ్యతిరేకిస్తేనే ప్రజాస్వామిక, ఫెడరల్ విలువలు భద్రంగా ఉంటాయి.

No comments:
Post a Comment