పాలకవర్గాలకు ఎప్పుడూ రెండు పార్శ్వాలుంటాయి. చెప్పేదొకటి, చేసేదొకటి. ఇప్పుడు ప్రధాని మోడీ అదే చేస్తున్నారు. కానీ, ఆయన వెనకున్న వ్యవస్థకు ఒకే లక్ష్యం ఉంటుంది. ఆ వర్గం తన లక్ష్యం నెరవేరేవరకూ నిద్రపోదు, తమ చెప్పుచేతల్లో ఉన్న పాలక వర్గాలను నిద్రపోనివ్వదు. అదే జరిగింది. ప్రధాని మోడీ ఇప్పుడు నిద్రలో కూడా తాను తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని మహోన్నతమైనదిగా కలవరిస్తున్నారు. నగదు రహిత విధానమే ఉత్కృష్టమైనదిగా పలువరిస్తున్నారు. ఈ క్రమంలో దేశం ఏమైనా ఆయనకు బాధలేదు. ప్రజలు ఎన్ని అవస్థలకు గురైనా పరవాలేదు. ఆయన ప్రకటించిన యుద్ధంలో అజేయునిగా ప్రధాని భావిస్తున్నారు. శత్రు దేశంపై వీరోచితంగా పోరాడి శత్రు సైన్యాన్ని తుత్తునియలు చేసి విజయ పతాక ఎగురవేసినట్లు ఊగిపోతున్నారు. ఈ ఉద్వేగంలో ఆయన ఎవరిపై యుద్ధం చేశారో విస్మరించారు. వీరావేశంలో తన దేశ ప్రజలపైనే యుద్ధం చేసిన సంగతి తన మదిలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎవరు విజేతలయ్యారో, ఎవరు పరాజితులయ్యారో, ఎవరు క్షతగాత్రులయ్యారో విస్మరించారు. ఆయన పులిపై స్వారీ చేస్తున్నారు. అవును, ఆయన పరాజితులయ్యారు. ప్రజలు క్షతగాత్రులయ్యారు. ఆయన బాణం గురితప్పింది. మోడీ సంధించిన అస్త్రం లక్ష్యం రహిత కక్ష్యలో వీర విహారం చేస్తున్నది. అది తిరిగి సంధించిన దిశలోనే వెనుదిరిగి పయనించవచ్చు. అయితే, ఆయన వెనుక ఉన్న వ్యవస్థ లక్ష్యం నెరవేరింది. ఆ వర్గాల ప్రయోజనాలు నెరవేరతాయి లేదా నెరవేరే క్రమంలో ఉన్నాయి. అయితే అందుకు ప్రజలు చెల్లించాల్సిన మూల్యం మాత్రం తక్కువేం కాదు. ఇంతకీ, మోడీ సాధించాననుకుంట్ను విజయాలేమిటి? అర్ధరాత్రి జనం మెడపై కత్తి ఉంచి నిరంకుశంగా ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు వెనుక ఉన్న కారణాలేమిటి?
|| రద్దు వెనకున్న కారణాలేమిటి? ||
నోట్ల రద్దు ఆయన సొంత నిర్ణయం కాదు. నోట్ల రద్దు, నగదు రహితం, డిజిటల్ ఎకానమీ పేరిట ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థల ఆదేశాలు ఇక్కడ కీలక పాత్ర వహించాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ) నెపంతో దేశంలో ప్రవేశించిన బహుళజాతి సంస్థల లక్ష్యాలను ఆయన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఆ విషయం మరుగుపరచి దేశ ప్రజల కోసం శిలువను మోస్తున్న క్రీస్తులా ఆయన ప్రకటనలిస్తున్నారు. విజయం సాధించిందెవరంటే బహుళజాతిసంస్థలు, వాటికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్లాంటి కార్పొరేట్ దిగ్గజాలు. వారి లక్ష్యాలు నెరవేరుతున్నాయి. మూడు దశాబ్దాలుగా ప్రపంచీకరణ పేరుతో భారత్ లాంటి అభివృద్ధి దిశలో ఉన్న దేశాలను ఎలా వశపర్చుకోవాలో ఆ తంత్రాలు సఫలీకృతమౌతున్నాయి. ఇంతకూ ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు తెరవెనుక చేసిన ఆదేశాలేమిటి? భారత్‌లోని నల్లధనం ఎంతుందో బయటకు తీయాలి. అవినీతిని నిర్మూలించాలి. ప్రపంచీకరణ క్రమంలో తమ కార్పొరేట్ దాయాదులు భారత్‌లో చేస్తున్న మీడియేటరీ వ్యాపారాలకు లాభాలు చేకూర్చాలి. నల్లధనమంటే నిజంగా నల్లధనం కాదు. కార్పొరేట్ కుబేరులపై పాలకులను దాడులు చేయమని చెప్పదు. ప్రజల దగ్గర ఉన్న లెక్కకు రాని ధనం లెక్కలు ఆ సంస్థలకు కావాలి. అంటే, మధ్యతరగతి ప్రజలు నిత్యావసరాలకు, అత్యవసరాలకు దాచుకున్న నగదు లెక్కలు వారికి కావాలి. ఇంకా చెప్పాలంటే, వంట గదుల్లో పోపుల డబ్బాలపై దాడులు జరగాలి. భారత ప్రజల ఆర్థిక పటుత్వం వారి నియంత్రణలోకి రావాలి. ఇక అవినీతిని నిర్మూలించాలి. అవినీతి అంటే, వారు ఎప్పుడూ అవినీతికి వ్యతిరేకులు కారు. సింగిల్ విండోలో లంచాలు ఇవ్వడానికి తమ అనుకూల వర్గాలకు 'క్విట్ ప్రో కో' రూపంలో లాభాలు చేకూర్చడానికి అంతర్జాతీయ సంస్థలు వ్యతిరేకం కాదు. 2013లో భారత్‌లో విదేశీ రిటైల్ కంపెనీలు నేరుగా పెట్టుబడులు పెట్టే చట్టం ఎఫ్డిఐకి పార్లమెంటు ఆమోదం పొందేందుకు, కాంగ్రెస్ పాలనలో మన్మోహన్ సింగ్ హయాంలో అమెరికా ప్రతినిధులు పంపిన నిధులు పార్లమెంటు సభ్యులకు పంచినట్లు, ఆ దేశ సెనెట్‌కు లాబీయింగ్ ఖర్చుల కింద లెక్కలుచెప్పిన వార్తలు అటు అమెరికాలోను, ఇటు భారత్‌లోనూ వచ్చాయి. కానీ, వాటిపై విచారణ లేదు. చర్యలేమీ లేవు. అంటే అవినీతికి వారు వ్యతిరేకం కాదని తేలిపోయింది. మరింకేమిటీ? ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ఇతరుల అవినీతి ఆపాలి. విదేశీ సంస్థలు, వారి ప్రతినిధులు మినహా అందరూ నిజాయితీగా ఉండాలి. ఇంకా ఆర్థిక మధ్యవర్తిత్వం వహించే విదేశీ సంస్థలకు లాభాలు కల్పించాలి. ఇవన్నీ జరగాలంటే ఒక్కటే ఆయుధం! దేశంలో అత్యధికంగా 86 శాతం చెలామణిలో ఉన్న నోట్లు రద్దు చేస్తే జనం జేబులో ఉన్న లెక్కలు కలుగులోంచి ఎలుకల్లా బయటకు వస్తాయి. పోపుల డబ్బాలు తెరుచుకుంటాయి. ప్రజల ఆర్థిక సత్తా ఏమిటో బహిర్గతమవుతుంది. పరోక్షంగా భారతదేశ ఆర్థిక శక్తి ఏమిటో అంతర్జాతీయ సంస్థలకు తెలిసిపోతుంది. అప్పుడు దేశం వారి గుప్పెట్లో ఉంటుంది. అలాగే, నోట్లు రద్దు చేస్తే, నగదు కొరత ఏర్పడితే, ప్లాస్టిక్ మనీ వినియోగం మొదలవుతుంది. అంటే డిజిటల్ ఎకానమీ ఆచరణలోకి వస్తుంది. దీంతో, ఆర్థిక మధ్యవర్తుల లాభాలు పెరుగుతాయి. ఇంకా చెప్పాలంటే, విశ్వసనీయమైన, భద్రతతో కూడిన ఆర్థిక లావాదేవీల సేవలను ప్రయివేట్ రంగం నుంచి మాత్రమే అందేట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రయివేట్ సంస్థల పట్ల విశ్వాసం పెంచాలి. ప్రజలకు గత్యంతరం లేని స్థితి కల్పించి నగదు రహిత లావాదేవీల వైపు వెళ్లేందుకు కృషిచేయాలి. అవసరమైతే ప్రభుత్వ వ్యయంతో వారికి తాత్కాలిక రాయితీలివ్వాలి. మొబైల్ లావాదేవీలు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారాలు విస్తృతంగా వేదికగా లావాదేవీలు జరగాలి. ఇందుకే నోట్ల రద్దు, నగదు రహిత లావాదేవీలంటూ వీరోచిత గౌరవ ప్రధాని, పాలక వర్గాలు గగ్గోలు పెట్టేది. ఇవే మోడీ విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలు. వీటి ద్వారా భవిష్యత్‌లో జనం జీవితాలు బాగుపడతాయట. అయితే, ఏ జీవితాలు బాగుపడతాయో, ఎవరి వ్యాపారాలు బాగుపడతాయో ఆయన చెప్పరు.
అయితే పాలక వర్గ పార్టీ ప్రయోజనాలు కూడా కొన్ని నెరవేరతాయి. ఎన్నికల ముందు నల్లధనం బయటకు తెస్తానని చేసిన గర్జనలు ఇదేనని ప్రజలు నమ్మేస్తారు. నగదు రద్దు వల్ల ప్రభుత్వం ప్రకటించిన 50 రోజుల్లో దాదాపు రూ.15 లక్షల కోట్ల నగదు బ్యాంకులకు చేరాయి. అందులో కనీసం సగానికి కూడా ప్రజలు లెక్కలు చెప్పలేరు. లెక్కచెప్పని ధనానికి సగం ఖజానాకు ఇవ్వాలంటోంది. 35 శాతం పన్ను రూపంలో వసూలు చేసినా, కనీసం ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు ఖజానాకు చేరుతుంది. ఇప్పటికే ప్రభుత్వ దుబారా, విలాసాలు, నాయకుల అవినీతి, కార్పొరేట్ల నిరర్ధక రుణాల రద్దు వంటి వాటితో ఆరు లక్షల 50 వేల కోట్లకు పైగా సర్కారు ఖజానాకు ద్రవ్యలోటు ఉంది. ఇదికాక, ఇప్పుడు నోట్ల రద్దు నిర్ణయంపై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేక స్వరాలను చల్లబరచడానికి, నగదు రహిత లావాదేవీలు ప్రచారం చేయడానికి ఇప్పటికే లక్షా 46 వేల కోట్ల రూపాయలు ప్రచార సాధనాలకు ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా ఖజానాకు అదనంగా లోటు. వెరసి ఏడున్నర లక్షల కోట్లు బ్యాంకుల్లో చేరుకున్న ప్రజల ధనంతో సర్కారు ద్రవ్య లోటును భర్తీ చేసుకోబోతున్నది. అంటే, ఒక దెబ్బకు రెండు పిట్టలు. ఒక వైపు తమ వెనుక ఉన్న కార్పొరేట్ ప్రయోజనాలు నెరవేరతాయి. మరో వైపు ఖజానా నిండుతుంది. ఈ క్రమంలో ప్రధాని విజయం సాధించాననుకుంటే పొరబాటే. దేశవ్యాప్తంగా ఏడున్నర కోట్ల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక వృద్ధి రానున్న రెండేళ్లలో సగానికి సగం పడిపోతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. నగదు రహిత లావాదేవీలను బలవంతంగా రుద్దడం వల్ల అంతర్గత ఆర్థిక సంక్షుభిత పరిస్థితులు ఏర్పడతాయి. ఈ పరిస్థితికి బిజెపి చేతులెత్తేయడం తప్ప ఏమీ చేయలేదు. అప్పుడు కూడా ''నాకు ఏమీ అవసరం లేదు, సర్వ 'సంఫ్‌ు' పరిత్యాగిని, తట్టా బుట్టా సర్దుకుని వెళ్లిపోతా''నంటారు.
అమెరికా వంటి అగ్ర రాజ్యంలో, అభివృద్ధి చెందిన దేశంలో 40 శాతానికి పైగా కరెన్సీ అందుబాటులో ఉంది. మరి 64 శాతం ప్రజలు బ్యాంకుల ముఖం చూడని దేశంలో, 55 శాతం మంది వ్యవసాయ రంగంలో, 65 శాతానికి పైగా నిరక్షరాస్యులుగా ఉన్న దేశంలో వంద శాతం డిజిటల్ ఎకానమీ ఎలా అమలు చేస్తారు? ప్రజలను ఆర్థిక దళారీ సంస్థలు దోచుకోకుండా ఎలా అదుపు చేయగలరు? ఒక అంచనా ప్రకారం సర్కారు చెబుతున్న డిజిటల్ మాయలో వంద రూపాయలను 20 మంది మధ్య నగదు మార్పిడి చేస్తే, దాని విలువ సున్నా అవుతుంది. అందుకే, కార్పొరేట్ వ్యూహం ఫలించింది. ప్రజలు క్షతగాత్రులయ్యారు. మోడీ పరాజితులయ్యారు. యుద్ధం గురి తప్పింది.
- కొల్లూరు వెంకట్

No comments:
Post a Comment