Friday, 6 January 2017

# అమెరికా చెప్పిందే... మోదీ చేశారా..? #




* నోట్ల రద్దు వెనక పెద్దన్న హస్తం
* ఏడాది కాలంగా తెరవెనుక కసరత్తు
* అంతర్జాతీయ ఆర్థిక రంగంపై పట్టుకోసం భారీ ప్లాన్‌
* యుఎస్‌ఎఐడి సారథ్యంలో భారతపై ప్రయోగం
* వీసా, మాస్టర్‌ కార్డుల కీలకపాత్ర

* సహకరించిన రఘురామ్‌ రాజన్‌, ఆర్థిక మంత్రిత్వ శాఖ


పెద్ద నోట్ల రద్దు వెనక అమెరికా పాత్ర ఉందా? అమెరికా పురమాయింపుపైనే మోదీ ప్రభుత్వం ఈ దుస్సాహసానికి ఒడిగట్టిందా? ఒక్క దెబ్బతో వ్యవస్థ నుంచి 86 శాతం నగదును ఉపసంహరించి, కోట్లాది మంది సామాన్య ప్రజలను, పేదలను నరకయాతనలకు గురిచేసిన, చేస్తున్న ఈ నిర్ణయం, అమెరికా బహుళజాతి ఆర్థిక సంస్థల లాభాలకోసమా? నల్లధనం, అవినీతి కేవలం సాకులు మాత్రమేనా? అసలు లక్ష్యం క్యాష్‌లెస్‌ ఎకనామీయేనా? వాస్తవాలను కప్పిపెట్టి, కాకమ్మ కబుర్లతో ఎన్‌డిఎ ప్రభుత్వం 125 కోట్ల మంది ప్రజలను ‘‘ బకరా’’లను చేసిందా ? ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఆయుధ వ్యాపారాన్ని స్వలాభం కోసం విస్తరించిన అమెరికా, ఇప్పుడు అంతర్జాతీయ ఆర్థిక రంగాన్ని తన చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు డిజిటల్‌ ఎకనామీని తెరపైకి తెస్తోందా? 

             ఈ ప్రశ్నలన్నింటికీ ఔననే సమాధానం ఇస్తోంది ఆసియా పసిఫిక్‌ రీసెర్చ్‌ డాట్‌ కామ్‌. ‘‘దాచిపెట్టిన బహిరంగ రహస్యం: భారత చేపట్టిన క్రూరమైన నోట్ల రద్దు ప్రాజెక్టు వెనక వాషింగ్టన్‌’’ పేరుతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భారత తీసుకోవడానికి ముందు, తెరవెనుకా, తెరపైనా ఏడాది కాలంగా జరుగుతున్న ‘ఏర్పాట్లు’, ఈ మొత్తం ప్రక్రియలో కీలక పాత్రధారులు, ఈ నిర్ణయం వెనక అసలు ప్రయోజనాలు, లబ్దిదారుల వివరాలను ఈ కథనం వెల్లడించింది. ఈ కథనంలోని వివరాలు ఇలా ఉన్నాయి.

|| ఏడాది క్రితమే... ||

క్యాష్‌లెస్‌ సొసైటీ దిశగా భారతను ముగ్గులోకి దించే ప్రయత్నాలు ఏడాదికాలంగా సాగుతున్నాయి. అమెరికా ప్రభుత్వం యునైటెడ్‌ స్టేట్స్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్‌నేషనల్‌ డెవల్‌పమెంట్‌ (యుఎ్‌సఎయిడ్‌) ఇందులో ప్రధాన పాత్రధారి. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ సహకారంతో ఈ సంస్థ భారతను పెద్ద నోట్ల రద్దుకు సిద్ధం చేసింది. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మధ్య పెనవేసుకున్న స్నేహబంధంలో భాగంగా తమ విదేశాంగ విధానంలో భారతతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెద్దపీట వేయనున్నట్టుగా బరాక్‌ ఒబామా గతంలో ప్రకటించారు. ఒబామా ప్రకటన నేపథ్యంలో భారతతో వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం అమెరికా ప్రభుత్వ సంస్థ యుఎ్‌సఎయిడ్‌ రంగంలోకి దిగింది. ఆర్థిక మంత్రిత్వ శాఖతో పలు ఒప్పందాలు చేసుకుంది. నగదు చెల్లింపులకు స్వస్తిచెప్పి డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రోత్సహించాలన్నది అందులో అత్యంత ప్రధానమైన ఒప్పందం. భారతలోనే కాదు అంతర్జాతీయంగా క్యాష్‌లెస్‌ వ్యవస్థలను ప్రోత్సహించాలన్నది యుఎ్‌సఎయిడ్‌ లక్ష్యం. ఇందులో భాగంగా ‘‘ నగదుకు ఆవల’’ పేరుతో ఒక నివేదిక కూడా తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది. నగదు వ్యవస్థను ధ్వంసం చేసి, ప్రస్తుతం అరకొరగా ఉన్న డిజిటల్‌ పేమెంట్స్‌ను ఒక్కసారిగా ఉధృతస్థాయికి తీసుకెళ్లాలంటే భారీ స్థాయిలో చర్యలు అవసరమని ఈ నివేదిక సూచించింది. ఈ పూర్వరంగంలో భాగంగా నవంబర్‌ 8కి నాలుగు వారాల ముందు, యుఎ్‌సఎయిడ్‌ కొత్తగా కేటలిస్ట్‌ అనే సంస్థ ఏర్పాటును ప్రకటించింది. నగదును పక్కకు తోసి పెద్ద ఎత్తున డిజిటల్‌ పేమెంట్స్‌ను వ్యాప్తిచేయడం, అందుకు అవసరమైన సమగ్ర వ్యవస్థ ఏర్పాటు ఈ కేటలిస్ట్‌ లక్ష్యం. యుఎ్‌సఎయిడ్‌ ఆర్థిక సహకారంతో నడిచే కేటలిస్ట్‌లో కీలక వ్యక్తి అలోక్‌ గుప్తా. ఈ అలోక్‌ గుప్తా, యుఎ్‌సఎయిడ్‌ ప్రమోట్‌ చేసిన వాషింగ్టన్‌ సంస్థ వరల్డ్‌ రీసోర్సెస్‌ ఇనిస్టిట్యూట్‌లో సిఒఒగా పనిచేశారు. భారతలో ఆధార్‌ కార్డును డెవలప్‌ చేసిన టీమ్‌లోనూ గుప్తా ఉన్నారు. ఈ కేటలిస్ట్‌ ఏర్పాటైన సమయంలోనే కీలకస్థానంలో ఉన్న అమెరికా ప్రతినిధి ఒకరు, ‘‘ఆర్థిక వ్యవస్థలను డిజిటలైజ్‌ చేసేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రయత్నాల్లో భారత ముందు వరుసలో ఉంది’’ అంటూ ప్రశంసలు గుప్పించారు కూడా.

|| తెరపైకి అవినీతి... ||

అసంఖ్యాకులపై సామాన్య ప్రజలతో వారికి తెలియకుండానే చెలగాటమాడాలి. క్షతగాత్రులైన ప్రజలు ప్రభుత్వాన్ని మాత్రం నిందించ కూడదు. అందుకే డిజిటల్‌ పేమెంట్స్‌ లక్ష్యాన్ని తెరవెనక్కి నెట్టి, నల్లధనం, అవినీతి లక్ష్యాలను తెరముందుకు తెచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలకపాత్రధారులందరికీ ఏం జరుగుతుందో తెలుసు, వారి లక్ష్యమేమిటో తెలుసు, వ్యూహమేమిటో తెలుసు.. కాగితాలపై మాత్రం ఎక్కడా ఏమీ కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. రహస్యాలేవీ బయటకుపొక్కకుండా చర్యలు తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో 35 సంస్థలు కీలకపాత్ర పోషించాయి. ఇందులో అమెరికా, ఇండియా కంపెనీలతో పాటు అంతర్జాతీయ సంస్థలు కూడా ఉన్నాయి. ముందుగా ఏదైనా నగరాన్ని ఎంపికచేసి ప్రయోగాత్మకంగా క్యాష్‌లెస్‌ వ్యవస్థ ప్రయోగం చేయాలని భావించారు. భారత ప్రజల అమాయకత్వాన్ని, దేశభక్తిమాటున, అవినీతిపై యుద్ధం చాటున వారిని తేలిగ్గా బుట్టలో వేసుకునే వెసులుబాటును గుర్తించిన తర్వాత, ఏకంగా మొత్తం దేశాన్ని ప్రయోగశాలగా మార్చారు. కీలకపాత్రధారుల్లో బెటర్‌దాన్‌ క్యాష్‌ అలయెన్స్‌, గేట్స్‌ ఫౌండేషన్‌, ఇబేకు చెందిన ఒమిడ్యార్‌ నెట్‌వర్క్‌, డెల్‌ ఫౌండేషన్‌, మాస్టర్‌ కార్డ్‌, వీసా, మెట్‌లైఫ్‌ ఫౌండేషన్‌ ఉన్నాయి. ద్రవ్యానికి సంబంధించిన ఏ విషయంలోనైనా ఆర్‌బిఐదే కీలక పాత్ర. అందువల్ల ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉన్న రఘురామ్‌రాజన్‌ సహకారం కూడా తీసుకున్నారు. ఐఎంఎఫ్‌ ప్రొడక్ట్‌గా పేరున్న రాజన్‌, భవిష్యతలో ఐఎంఎఫ్‌ ప్రెసిడెంట్‌ అవకాశాలున్న వ్యక్తుల్లో ఒకరు. ఉర్జిత పటేల్‌ ఆర్‌బిఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ప్రభుత్వం నగదుపై యుద్ధాన్ని ఎక్కుపెట్టినప్పటికీ, పూర్వరంగం మొత్తం రాజన్‌ పర్యవేక్షణలోనే జరిగింది. నోట్ల రద్దుకు ముందు భారతలో నగదులావాదేవీల వాటా 97 శాతం ఉంది. నోట్ల రద్దు తర్వాత పరిణామాలు చిన్న బ్రతుకులను ఛిద్రం చేసినప్పటకీ, డిజిటల్‌ పేమెంట్‌ సర్వీసుల్లో ఉన్న వీసా, మాస్టర్‌కార్డ్‌ ఇతర సంస్థలకు మాత్రం వ్యాపార విస్తరణ, లాభార్జన అవకాశాలను తెరిచాయి.

|| అమెరికాకు ఏం ప్రయోజనం.. ||

తమ దేశ కంపెనీల ప్రయోజనమే అమెరికా ప్రయోజనం. ఆయుధాల వ్యాపారంతో ప్రపంచాన్ని తన కనుసన్నల్లో నడిపించిన అమెరికా ఇప్పుడు ఐటి, ఐటి ఆధారిత పేమెంట్‌ సర్వీసుల్లోని తమ కంపెనీల వ్యాపారాలను విస్తరిస్తూ, అదేసమయంలో అంతర్జాతీయ ఆర్థిక రంగంపై పూర్తి పట్టు సాధించాలని యోచిస్తోంది. అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థలను పూర్తిగా డిజిటల్‌ చెల్లింపుల పరిధిలోకి తేగలిగితే అమెరికా కంపెనీల బిజినెస్‌ పెరుగుతుంది. అదే సమయంలో వాషింగ్టన్‌లో కూర్చొని, ప్రపంచవ్యాప్త ఆర్థిక లావాదేవీలపై నిఘావేయడం అమెరికా గూఢచార వ్యవస్థకు సులభమవుతుంది. అమెరికా బహుళజాతి సంస్థల అర్థబలం, అంతర్జాతీయ మారకంగా డాలర్‌కున్న శక్తి వల్ల, ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ లావాదేవీలపై అమెరికా పెత్తనం అలవోకగా స్థిరపడుతుంది. ఎవరైనా సరే అంతర్జాతీయ చట్టాలు, తమ దేశాలకు చెందిన చట్టాలను పక్కనబెట్టి విధిగా అమెరికా చట్టాలకు తలవొగ్గి వ్యాపారాలు చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా ఉన్న అన్ని ఆర్థిక సంస్థలను, బ్యాంకులను తన కనుసన్నల్లో ఆడిస్తుంది. ఎవరైనా తోకాడిస్తే, నిషేధాలు, ఆంక్షలతో వేధిస్తుంది. (ఆంధ్రజ్యోతి బిజినెస్‌)

No comments:

Post a Comment