తిరుపతిలో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 104వ సదస్సులో శాస్త్రజ్ఞానం గురించి ప్రధాని మోడీ చేసిన ప్రసంగాలకు, శాస్త్రజ్ఞాన అభివృద్ధికి ఆయన ఇస్తున్న ప్రోత్సాహానికి పూర్తి వైరుధ్యం ఉంది. సైన్సు కాంగ్రెస్ ప్రారంభపు రోజున ఆచార్యులు విలియం ఈ మోర్నియర్ (అమెరికా), మహమ్మద్ యూనస్ (బంగ్లాదేశ్), ఆచార్య సెర్గేహరోచే (ఫ్రాన్స్), అదా ఈ యోనత్ (ఇజ్రాయిల్), టకాకి కజితా (జపాన్), జీన్తిరోల్ (ఫ్రాన్స్) వారిని ఇస్కా అధ్యక్ష పతకాలతో మోడీ సత్కరించారు. అయితే ఈ సత్కరాలలో మన వారెవరూ లేరు.
సైన్స్‌లో నోబెల్ బహుమతి పొందిన సమకాలీనులు మన దేశంలో లేకపోవడానికి కారణం భారత ప్రభుత్వం సైన్స్‌ను ప్రోత్సహించాల్సిన రీతిలో ప్రోత్సహించకపోవడమే కారణమని గ్రహించాలి. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సైన్స్‌కు కేటాయింపులు బాగా తగ్గిపోయాయి. ఆయనది మతవాద దృష్టి. హేతువాద దృష్టితోనే సైన్స్ అభివృద్ధి ఉంటుంది. శాస్త్ర జ్ఞానంలో భారతదేశం వెనుకబడటానికి కారణం ఇక్కడున్న ప్రతిభను ఇనుమడింపజేసే నిధులు కేటాయించకపోవడమే. ఈ మధ్య 70 దేశాలకు చెందిన 980 ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో ఆసియాలో 289 తేలాయి. అందులో భారతదేశంలో 31 మాత్రమే ఉన్నాయి. అగ్రశ్రేణి 200 విశ్వవిద్యాలయాల్లో భారతదేశ విశ్వవిద్యాలయం ఒక్కటీ లేదు. దీనికి కారణం దేశంలో సైన్స్‌ను అభివృద్ధి చేయడాన్ని తగ్గించి మూఢాచారాలను పెంచే దేవాలయాల పునరుద్ధరణ, గంగ, యమునల శుద్ధి, పుష్కరాల నిర్వహణలు, కూచిపూడి నృత్యాలు వేయించి గిన్నీస్ రికార్డులకెక్కడం, శ్రీరాముడికి ముత్యాలు మోసుకెళ్ళడం, పద్మావతికి కంచి పట్టుచీరెలు పెట్టడం, దుర్గమ్మ గుడికి బంగారు తాపడాలు వేయించడం వంటి కార్యక్రమాలకు పెడుతున్న ఖర్చు హైస్కూళ్ళ స్థాయి నుంచే సైన్స్‌ను అభివృద్ధి చేయటం కోసం ల్యాబ్ రూపొందించటానికి పెట్టడం లేదు. ప్రాథమిక విద్యాస్థాయి నుంచే సైన్స్ దృక్పథాన్ని పెంచాలి. పురాణాలు, అభూత కల్పనలు, మూఢాచారాలు, చెట్లకు పూజలు చేయటాలు, తీర్ధయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శనలు పిల్లలకు నేర్పుతూ సైన్స్ నోబెల్ బహుమతి వచ్చినవాళ్ళకు వంద కోట్ల రూపాయలు ఇస్తామని చెబితే అది హాస్యాస్పదమైన ప్రకటన అవుతుంది కానీ మరొకటి కాదు. ప్రపంచవ్యాప్తంగా నోబెల్ బహుమతి పొందినవాళ్ళందరూ తమ జీవితచరిత్రలో ఆయా దేశాలు తమకు ఎలా సహకరించాయో చెబుతున్నారు. పైగా ఈ శాస్త్రవేత్తలు సుదీర్ఘకాలంగా జీవించినవారు ఎక్కువ. నిజానికి నరేంద్ర మోడీ ఆలోచనల్లో హేతువాద దృక్పథం లేదు.
మతవాద ఛాందసవాద భావాలను అన్ని విశ్వవిద్యాలయాల్లో విపరీతంగా పెంచుతున్నారు. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్‌లో మేధావులు పుష్పక విమానాలు వేదాల్లోనే ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. భారతదేశంలో శాస్త్రీయ జ్ఞానం ఎంతో ఉంది. సాంఖ్య, వైశేషిక, న్యాయ దర్శనాలు నిరీశ్వరమైనవే గాక ఎంతో భౌతిక వాదాన్ని ప్రపంచానికి అందించాయి. కపిలుడు, కణాదుడు, గౌతముడు గొప్ప భౌతికవాద తత్వవేత్తలుగా ప్రసిద్ధులు. వీరందరి అణు సిద్ధాంతాలను ప్రపంచంలోని తత్వ వేత్తలందరూ అందుకొని భౌతిక, పదార్థ వాదాలను విస్తృతం చేసుకొంటున్నారు. కానీ సాంఖ్యులు అందించిన తత్వశాస్త్రం మీద, భౌతిక భావజాలం మీద భారతదేశంలో ఇంతవరకు ఒక్క పరిశోధనా కేంద్రం ఇవ్వలేదు. మోడీలాంటి వారు మతంలోనే అన్నీ ఉన్నాయనుకుంటున్నారు. భారతీయ తత్వశాస్త్ర మూలాల గురించి అధ్యయనం చేయకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల భారతీయులకెంతో నష్టం జరిగింది. ముఖ్యంగా కణాదుని అణు సిద్ధాంతం ప్రపంచానికి అణువాదాన్ని అందించింది. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన దార్శనికుల్లో కణాదుడు ఒకరు. ప్రపంచ దార్శనికుల్లోనే ఆయనకు సముచిత స్థానం ఉంది. ప్రత్యక్షము, అనుమానమూ అనే రెండు ప్రమాణాలు మాత్రమే కణాదుడు అంగీకరించాడు. శబ్దం, ఉపమానమూ కూడా అనుమానంలోనే అంతర్గతమౌతాయి అన్నాడు. పదార్థాన్ని ద్రవం, గుణ, కర్మ, సామాన్యం, విశేషం, సమవాయం అని ఆరు భాగాలుగా విభజించాడు. తరువాత ద్రవ్యం, పృథ్వి, జలం, అగ్ని, తేజస్సు, వాయువు, ఆకాశం, కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు అని తొమ్మిది రకాలుగా విభజించారు. ఇలా భౌతిక వాస్తవాన్ని కార్యకారణ సంబంధ వివేచనతో శాస్త్రజ్ఞానాన్ని నిరూపించారు. అయితే మన కేంద్రీయ విద్యాలయాల్లో గౌతముడు, కపిలుడు, కణాదుల సిద్ధాంతాల పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయలేక పోయారు. శాస్త్రాన్ని చెప్పినవారిని గుర్తించలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు భారతీయ భౌతికవాద పునాదుల నుంచే స్ఫూర్తిని పొందారు. హాన్స్బెతే , పీరీ విలియమ్స్ బ్రిడ్జిమన్, లియోనిడ్ పెట్రోవిచ్ కపిట్సా, హెన్రీ బెకరెల్, ఆర్టూరీ ఇల్మారీ విర్టనెస్ ఫిజిక్స్‌లో ప్రసిద్ధమైన నోబెల్ బహుమతి పొందిన వారిలో కొందరు.
డాక్టర్ సివి రామన్ 1930లోనే భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు. 1928 ఫిబ్రవరి 28న సివి రామన్ ''రామన్ ఎఫెక్ట్'' కనుగొని ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచాడు. ఫిజిక్స్‌లో మొట్ట మొదటిసారిగా నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి శ్వేతేతర శాస్త్రజ్ఞుడు రామన్ కావడం గర్వకారణం. అంత వరకూ సైన్సులో నోబెల్ బహు మతులన్నీ తెల్లజాతీయులైన పాశ్చాత్యులకే లభించాయి. కానీ, రామన్ నూటికి నూరు పాళ్ళూ భారతీయునిగా ఈ గడ్డపై, ఇక్కడ చదువుకొని, తలమానికమైన పరిశోధన జరిపి సైన్సులో భారతీయుల శక్తిసామర్థ్యాలను చాటిచెప్పిన విశిష్ట వ్యక్తి. అంతకు ముందే 1913లో మనదేశం నుంచి సాహిత్యంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి పొందారు. ప్రస్తుత దేశ పాలకులకు శాస్త్రజ్ఞానం పెంపొందించడం పట్ల ఆసక్తి కొరవడింది. ముఖ్యంగా చంద్రబాబుకు అన్నీ డబ్బుతో కొనాలనే వ్యాపార ప్రవర్తన బాగా అలవడింది. సైన్సులో నోబెల్ బహుమతి పొందిన వారికి వంద కోట్ల రూపాయలు ఇస్తానని ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. ఆయన ప్రకటించిన వంద కోట్ల రూపాయలను వెయ్యి కోట్లు చేసి, ప్రతి హైస్కూల్లో లేదా స్కూలు లెవెల్లో సైన్సు ల్యాబ్‌లు రూపొందిస్తే పదేళ్ళలో శాస్త్రజ్ఞానం అభివృద్ధి చెందక తప్పదు. పాఠశాలల్లో మత నమ్మకాలను బోధించడం మాని సైన్సును అభివృద్ధి చేయాలి.
వ్యాపారం, రియల్ ఎస్టేట్, కార్పొరేట్ వ్యవస్థలను తన స్వార్థం కోసం పెంచుకుంటూ పోతే సైన్సు ఎలా అభివృద్ధి చెందుతుందో ఇకనైనా చంద్రబాబు ఆలోచించాలి. ప్రభుత్వరంగం ప్రయివేటు పరమౌతున్న నేటి కాలంలో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ళు మూసివేస్తున్నారు. దీనివల్ల చదువుకునే పిల్లల్లో ఎక్కువ శాతం మంది మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. ఇక శాస్త్రజ్ఞానం ఎలా అభివృద్ధి చెందుతుంది. నరేంద్ర మోడీ, చంద్రబాబు, కెసిఆర్ వంటి తదితర తాత్విక, శాస్త్రీయ దృక్పథంలేని పాలకుల వల్ల భారతదేశ ప్రతిష్ట నానాటికీ దిగజారుతోంది. వేముల రోహిత్ మరణానికి కారకుడైన పొదిలి అప్పారావుకు మిలీనియం ప్రైజ్ అవార్డు ఇవ్వడంతోనే వీరి దృక్పథం అర్థం అవుతుంది. అంటే కులతత్వం, మతతత్వం, కులాధిపత్య భావన, మత ప్రచారం, ఆర్‌యస్‌యస్ భావజాల మూలం ఉన్న వారికే భారతదేశంలో అవార్డులు ఇస్తున్నారు. మరి ఆ భావాలే విశ్వవిద్యాలయాల్లో అభివృద్ధి చెందుతున్నాయి. భౌతిక శాస్త్రాన్ని బోధించే ఆచార్యునికి భౌతిక మూలాల మీద నమ్మకం ఉండటం లేదు. ప్రజలే చైతన్యవంతులై ఆయా పట్టణాల్లో, గ్రామాల్లో, స్కూళ్ళలో, ఇళ్ళలో సైన్సు ల్యాబులు రూపొందించుకోవాలి. ప్రతి ఒక్కరూ శాస్త్ర, సాంకేతిక విప్లవంలో భాగస్వాములు కావాలి. మార్క్సిష్టులు, అంబేద్క రిస్టులు తమ సామాజిక, సాంస్కృతిక విప్లవంలో భాగంగా శాస్త్రీయ జ్ఞాన విప్లవానికి పతాకలు ఎత్తాలి. అప్పుడే భారత దేశంలో మళ్ళీ సాంఖ్య వైశేషిక, న్యాయ దర్శనాల, తాత్విక, భౌతిక, విప్లవ పునర్జీవనం జరుగుతుంది. మార్క్సిజం, అంబేద్కరిజం అంటే అది కేవలం రాజకీయ ఆర్థికవాదం కాదు. అది సామాజిక శాస్త్రీయజ్ఞాన విప్లవం. ఆ స్ఫూర్తిని అందుకొని ముందుకు నడుద్దాం... - కత్తి పద్మారావు

No comments:
Post a Comment