స్వాతీ చతుర్వేది రాసిన 'అయామ్ ఎ ట్రోల్' అనే పుస్తకం కొద్ది రోజుల క్రితం మార్కెట్‌లోకి వచ్చింది, అంతర్జాలం (ఇంటర్నెట్)లోని తన ప్రత్యర్థులపై ఒక ప్రణాళిక ప్రకారం బిజెపి ఎలా దాడులు చేస్తుందో ఈ పుస్తకం కళ్ళకు కట్టినట్టు వివరించింది. బిజెపి నడుపుతున్న దుష్ట సేన నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది. అంతర్జాలంలో నిత్యం బిజెపి చేస్తున్న దాష్టీకం గురించి మనకు తెలుసు.
|| ప్రణాళికాబద్ధంగా సాగుతున్న దుష్ట ప్రచారం ||
అరవింద్ గుప్తా నియంత్రణలో 20 వాట్సాప్ గ్రూపులు ఈ దుష్ట ప్రచారాన్ని సాగిస్తున్నాయి. వీరు 200 సభ్యులుగల కోర్ గ్రూపుకు సందేశాలను పంపుతారు. ఈ 200 మంది తిరిగి ఇవే సందేశాలను ఆన్‌లైన్‌లో పనిచేస్తున్న బిజెపికి చెందిన వేలాదిమంది అంతర్జాల దుష్ట సైన్యానికి పంపుతారు. ఆన్‌లైన్‌లో ఎవరి వెంట బడాలి, దాడిలో వాడవలసిన విషయం ఏమిటి, ఏ సమయంలో ఉపయోగించాలి వంటి సమాచారంతో ఈ సందేశాలు సవివరంగా ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోడీతోనూ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాతోనూ, ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ప్రత్యేకంగా నియుక్తుడైన ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌తోనూ అరవింద్ గుప్తా ప్రత్యక్ష సంబంధంలో ఉంటాడు.
ట్విట్టర్‌లో బెయిన్‌జాల్ అనే పేరుతో హ్యాండిల్ గల స్వాతీ చతుర్వేది ఒక జర్నలిస్టు. ఆమె బిజెపి దుష్ట సైన్యం గురించి గత రెండు సంవత్సరాలుగా పరిశోధన చేశారు. మోడీ అధికారిక హ్యాండిల్ పేరుతో 26 ట్రోల్స్ ఉన్నట్టు ఆమె తన గ్రంథంలో ఎత్తిచూపారు. బిజెపినిగానీ, మోడీనిగానీ విమర్శించేవారిని ఈ ట్రోల్స్ అత్యంత నీచ, పరుష పదజాలంతో నిందిస్తుంటారు. అలాంటి బూతుల ట్వీట్స్‌కు చెందిన ఉదాహరణలను ఆమె అందించారు. ప్రధాని పేరున గల ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అలాంటి నీచమైన దాడులు జరుగుతున్నాయనేందుకు కావలసిన సాక్ష్యాలను ఆమె తన పుస్తకంలో సోదాహరణంగా వివరించారు. ప్రధాని హ్యాండిల్ పేరుతో ఇలాంటి కార్యకలాపాలు కొనసాగటం ఏదో పొరపాటున జరిగింది కాదు. వీరందరినీ ప్రధాని తన ఇంటికి ఒక కార్యక్రమానికి ఆహ్వానించి వీరిని 'అంతర్జాల యోధులు'గా కీర్తించారు.
సాధ్వీ ఖోస్లా వెల్లడించిన వివరాలు చతుర్వేది గ్రంథాన్ని ఒక విస్ఫోటనంగా మార్చాయి. అరవింద్ గుప్తా కోర్ టీంలో సాధ్వి ఉన్నారు. ఆన్‌లైన్‌లో ప్రతి రోజూ చేయవలసిన పనుల గురించి సవివరంగా టీం సభ్యులకు వాట్సాప్ ద్వారా ఆదేశాలు జారీ చేస్తారు. ఈ ఆదేశాలను తూచా తప్పకుండా టీం సభ్యులు పాటించవలసి ఉంటుంది. గుప్తా వాట్సాప్ నిర్దేశాల వాస్తవ రూపం గురించి తెలియజేయటానికి స్వాతీ చతుర్వేది పుస్తకంలో స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. అవి నిస్సిగ్గుగా నగంగా ఇలా ఉన్నాయి. అమీర్ ఖాన్, గాంధీ, రాజ్‌దీప్ సర్దేశారు, బర్ఖాదత్‌లపై దాడి చేయండి. ఇలా పట్టిక కొనసాగుతుంది. అమీర్ ఖాన్‌తో సంబంధాలు తెగ్గొట్టుకోమని స్నాప్ డీల్‌పై ఒత్తిడి తేండి. అసహనంపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయటానికి ధైర్యం చేసినందుకు షారుక్‌ఖాన్‌పై దాడి చేయండి. బిజెపి ఎవరినైతే శత్రువులుగా భావిస్తుందో వారిపై నిరంతర యుద్ధం కొనసాగుతుంటుంది. వాస్తవంలో బిజెపి శత్రువుల జాబితా చాలా పెద్దది. బిజెపిని విమర్శించేవారి పట్ల దాని ప్రతిస్పందనలు ఇలాగే ఉంటాయి. నోట్ల రద్దును విమర్శిస్తే నల్లధనానికి మద్దతు అనీ, పొరుగు దేశాలతో శాంతి, సామరస్యాలు నెలకొనాలంటే అది దేశద్రోహం అనీ, కాశ్మీర్ ప్రజలకు సహానుభూతిని వ్యక్తం చేస్తే అది జాతి వ్యతిరేకమైనదనీ విమర్శలు వెల్లువెత్తుతాయి.
మహిళల గురించి, ఆంగ్ల భాషా పరిజ్ఞానం తగినంతగా లేకపోవటం గురించి బిజెపికి తీవ్రమైన అభద్రతా భావం ఉందనీ, అందుకనే అసభ్యకరమైన భాషను ఉపయోగించటం ద్వారా అది తన 'మగతనాన్ని' ఇంటర్నెట్‌లో ప్రదర్శించదలచిందని ప్రముఖ నవలా రచయిత చేతన్ భగత్ పేర్కొన్నారు. మోడీ ఆకర్షణకు పునాది అభద్రతలోనే లేదు. అది హిందూత్వ అస్తిత్వంలోనూ, మితవాద ఆర్థిక విధానాలలోనూ ఉందని నమ్మే మధ్యతరగతిని ఆకర్షించటంపై అది ఆధారపడి ఉన్నది. బిజెపి దుష్ట సేన నిర్వహిస్తున్న స్త్రీ విద్వేష ప్రచారంతో సాధ్వి భ్రమలు తొలగిపోయాయి. అంతిమంగా భారతీయులందరూ ఇష్టపడే అమీర్ ఖాన్, షారుక్‌ఖాన్‌ను ముస్లింలని, శత్రువులని ప్రచారం చేయటంతో సాధ్వి భరించలేకపోయారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో లోతుగా చీలిన భారత దేశంలో తమ బిడ్డ భవిష్యత్తు గురించి తన భార్య కిరణ్ కలత చెందుతున్నదని అమీర్ చెప్పటం జరిగింది. కవులు, కళాకారులు తమ తమ ఆవార్డులను తిరిగి ప్రభుత్వానికి అప్పగించటానికి దారితీసిన మొహమ్మద్ అఖ్లాక్‌ను తొక్కి చంపిన ఉదంతం నేపథ్యంలో అమీర్ ఆ వ్యాఖ్యను చేశాడు. అమీర్‌ఖాన్ ఆ వ్యాఖ్య చేయగానే అరవింద్ గుప్తా టీం కార్యరంగంలోకి దూకిన తీరు గురించిన వివరాలను సాధ్వి అందించారు. అమీర్‌పై దాడిని ఎలా కొనసాగించాలో చెప్పే వాట్సాప్ సందేశాలకు చెందిన స్క్రీన్ షాట్స్‌ను స్వాతి తన గ్రంథంలో పొందుపరిచారు. అమీర్‌ను తన వ్యాపార ప్రకటనలలో వాడుకునే స్నాప్ డీల్ ఆయనతో వ్యాపార సంబంధం తెగ్గొట్టుకునేలా విద్వేష ప్రచారాన్ని నిర్వహించటం జరిగింది. ఈ ప్రచారాన్ని బిజెపి కేంద్ర కార్యాలయం నేతృత్వంలో ప్రత్యక్షంగా నిర్వహించటం జరిగింది. ఇప్పుడు ఈ గ్రంథంతోను, సాధ్వి బహిరంగపర్చిన వాస్తవాలతోను మనకు ఏమి జరుగుతున్నదో తెలుస్తున్నది.
సోషల్ మీడియాలోగానీ, వార్తలకు సంబంధించిన వెబ్‌సైట్స్‌లోగానీ బిజెపికి, మోడీకి వ్యతిరేకంగా ఏమైనా విమర్శలుంటే తక్షణమే వాటికి ప్రతిస్పందనగా బండబూతులతో సమాధానాలు, కామెంట్స్ ఉంటాయి. విమర్శలలో విషయాలను పట్టించుకొనకుండా 'సిక్యులర్' (నిజమైన లౌకికవాదాన్ని ఎద్దేవా చేయడానికి హిందూత్వ శక్తులు వాడే పదం), 'ప్రెస్టిట్యూట్' వంటి బూతులు వాడటానికి సిద్ధంగా ఉంటాయి. రచయిత ఏమి రాశాడు లేక రాసిందీ పట్టించుకోకుండా ఏకంగా ఆయన లేక ఆమె వ్యక్తిత్వం మీద దాడిచేయటంగా ఇది ఉంటుంది. ఇదంతా నిముషాలలో జరిగిపోతుంది. మనం ఊహించిన దాన్ని స్వాతీ చతుర్వేది పుస్తకం వాస్తవమని నిగ్గు తేల్చింది. మోడీని లేక బిజెపిని విమర్శించినవారిని క్షణాల్లో వేట కుక్కల్లా వేటాడటం యాదృచ్ఛికం కాదు.
బిజెపి ఐటి సెల్‌లోని ఒక బృందం మోడీ, రాహుల్ గాంధీ, ఇతర పేర్లతో ఇంటర్నెట్‌ను శోధిస్తారు. ఆ తరువాత సంబంధిత ట్వీట్స్‌ను, వ్యాసాలను నిర్ధారిస్తారు. అనుకూల వ్యాఖ్యల సంఖ్యను పెంచటం లేక ప్రతికూల ట్వీట్స్‌పై పరుష పదజాలంతో విరుచుకు పడటం ఆ బృందం చేయవలసిన పనిగా ఉంటుంది. దీనితో ఇంటర్నెట్‌లో మోడీకి, బిజెపికి విపరీతమైన మద్దతు ఉందని, అందుకేవారు అప్పటికప్పుడే విమర్శకులపై విరుచుకుపడుతున్నట్టు కనిపిస్తుంది. అలా ట్వీట్స్‌ను, వ్యాఖ్యలను చూచినవారికి బిజెపికి, ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రజలలో విపరీ తమైన ప్రజాభిమానం ఉందనే భావం కలుగుతుంది. కేవలం కొద్దిమంది సంఘటి తంగా వృత్తి నైపుణ్యంతో తయారుచేస్తున్న ఈ పని ప్రజలకు అర్థం కావటం కష్టం.
|| కృత్రిమంగా తయారుచేయబడిన మద్దతు ||
సోషల్ మీడియాలో తనకు మద్దతు ఉన్నట్టుగా బిజెపి చేస్తున్న కుయుక్తులపై ఉన్న ముసుగును ఈ గ్రంథం లాగిపారేసింది. బిజెపి కార్యకర్తలుగా చెప్పుకుంటున్న వీరందరూ వృత్తిపరంగా జీతం కోసం పనిచేస్తున్న వారనీ, వీరు వివిధ ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తుండటమో లేక ప్రభుత్వం నుంచి సోషల్ మీడియా కాంట్రాక్టులను పొందటమో జరుగుతున్నదని స్వాతీ చతుర్వేది వివరించారు. బిజెపి దుష్ట సేన చేసిన విద్వేషపూరిత ట్వీట్స్‌ను క్రమంతప్పకుండా స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి ప్రభుత్వ, పాక్షిక ప్రభుత్వ సంస్థలు తిరిగి ట్వీట్ చేస్తుంటాయి. ఇలా విమర్శనాత్మక దృక్పథంగలవారిని ఆన్‌లైన్‌లో ట్రోల్ చెయ్యటంవల్ల సోషల్ మీడియాలో చర్చంటూ లేకుండా పోతుంది. బిజెపి పట్ల విమర్శనాత్మక వైఖరి కలిగివున్నా లేక లౌకిక భారతదేశం కోసం వాదించినా ఆ వాణి వినబడకుండా చేయటం జరుగుతున్నది. వీరు ఎంత పలుకుబడిగలవారైతే అంత నీచంగా దాడులు ఉంటాయి. సోషల్ మీడియాలో ట్రోల్ చేయటాన్ని ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలోగల అనేక రకాల సేనలు చేస్తున్న మూక సెన్సార్‌షిప్‌గా మనం చూడాలి. ఇది చాలా పెద్ద ఎజెండాలో భాగం. భండార్కర్ ఇన్‌స్టిట్యూట్ వంటి సంస్థలపై భౌతికంగా దాడిచేయటం, ఎమ్‌ఎఫ్ హుస్సేన్ వంటి వ్యక్తులపై దాడిచేయటం, స్వల్ప కారణాలకే సినిమాలను ఆడకుండా చేయటం, సిఆర్‌పిసిలోని వివిధ సెక్షన్ల కింద దేశంలోని వివిధ ప్రాంతాలలో కేసులు నమోదు చేయటం వంటి దాడులు ఈ ఎజెండాలో భాగంగా ఉన్నాయి.
ఈ మధ్యకాలంలో పశ్చిమదేశాల మీడియా సత్యానంతర సమాజం(పోస్ట్ ట్రూత్ సొసైటీ) గురించి మాట్లాడుతున్నది. ఈ సమాజ సృష్టికర్తలు తప్పుడు వార్తలు రాయటంవల్ల అమెరికాలో ట్రంప్ గెలిచాడు. బ్రిటన్‌లో బ్రెక్సిట్ విజయవంతమయింది. అయితే వేలాది సంవత్సరాలకు పూర్వమే ప్లాస్టిక్ సర్జరీతో వినాయకుని తలను మార్చారని, విమాన ప్రయాణం ఉందనీ ట్రంప్, బ్రెక్సిట్‌లకు చెందిన సత్యానంతర సమాజం రూపుదాల్చక ముందే ప్రకటించి నరేంద్ర మోడీ విదేశీయులకు మనమేమీ తక్కువకాదని చెప్పారు. ఈ 'సత్యానంతర సమాజానికి' నిజమైన నాయకుడు అమెరికా, బ్రిటన్‌లు కాదు. మన ప్రధాని నరేంద్ర మోడీ సమర్థవంతమైన నాయకత్వంలో భారతదేశమే అసలు సిసలు నాయకుడని ప్రకటించటమే సమంజసమేమో! - ప్రబీర్ పుర్కాయస్థ

ఓ ఆరెసెస్ వాడు ఓ మహిళను బెదిరిస్తున్న విషయం మకు పోస్ట పెట్టాను.మీరు పట్టించుకున్నట్లు కనపడలేదు ఎందుకో మరి.
ReplyDelete