Tuesday, 3 January 2017

|| పెద్దనోట్లు రద్దు - పర్యవసానాలు ||




                ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2016 నవంబరు 8న పెద్ద కరెన్సీ నోట్లు (రూ.500, రూ.1000) రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ప్రకటించిన తొలి దశలో కొంత సానుకూల వాతావరణం కనిపించింది. ఈ చర్య ప్రధాని చెప్పిన నల్లధనం, అవినీతి, దొంగనోట్ల నిర్మూలనకు తోడ్పడుతుందని సామాన్య ప్రజల్లో అనేకులు భావించారు. అందువల్ల కొంత తాత్కాలిక ఇబ్బంది ఉన్నప్పటికీ అవకాశం ఇచ్చి చూడాలని భావించారు. కానీ, రెండు, మూడు రోజుల్లో నగదు (కొత్త నోట్లు) అందుబాటులోకి తెస్తామని చెప్పిన ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేక పోయింది. అందువల్ల నగదు ఉపసంహరణపై పరిమితులు విధించింది. ఈ పరిమితులకు లోబడి కూడా నగదు సరఫరా సవ్యంగా సాగలేదు. తీవ్రమైన నగదు కొరత చోటుచేసుకుంది. సామాన్య ప్రజలు బ్యాంకుల్లో ఉన్న తమ డబ్బును కనీస అవసరాల కోసం కూడా వినియోగించుకోలేక తీవ్రమైన ఇబ్బందులకు లోనయ్యారు. 86 శాతం నగదును రద్దుచేసిన ప్రభుత్వం తొలి దశలో 10 శాతం మేరకు మాత్రమే కొత్త కరెన్సీని విడుదల చేసింది. రూ.2000 నోటును కొత్తగా ప్రవేశపెట్టింది. కొత్త నోట్ల సైజు మార్చింది. ఇందువల్ల ఎటియంలను సరిచేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కారణాల వల్ల బ్యాంకులు, ఎటియంల వద్ద ప్రజలు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వచ్చింది. ఇప్పటికీ ఈ పరిస్థితి కొనసాగుతోంది. ప్రజలు ఈ సమస్య పట్ల చూపిన సంయమనాన్ని మోడీ నిర్ణయానికి సమర్థనగా బిజెపి ప్రచారం చేసుకుంటోంది. కానీ అది సరికాదు. మన సమాజంలో ప్రశ్నించే తత్వం సన్నగిల్లిందని, మధ్యతరగతి ప్రజల్లో యథాతథవాదం ప్రబలిందని చెప్పడానికి ఇది ఒక తార్కాణం. సంప్రదాయక కర్మవాదం ప్రభావాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయలేము.
డబ్బు మన జీవితాన్ని ఎలా శాసిస్తోందో ఈ అనుభవం మరోసారి తెలియజెప్పింది. తమ శ్రమ ఫలితాన్ని అనుభవించడానికి డబ్బు అనే మారకం అవసరం కావడం మానవులు ఎదుర్కొంటున్న పరాయీకరణలలో ఒకటి అన్న మార్క్స్‌ భావనను ఇక్కడ మనం గుర్తుచేసుకోవాలి. నల్లధనమెవరివద్ద ఉందో ప్రభుత్వానికి సమాచారం తప్పనిసరిగా ఉంటుంది. వారిలో నుంచి స్వచ్ఛంద ప్రకటన అవకాశాన్ని ఉపయోగించుకోని వారిపై దాడుల చేస్తే నల్లధనాన్ని చాలా భాగం వెలికితీయడం సాధ్యమై ఉండేది. 2017 మార్చి 30 వరకు మరలా కొత్త స్వచ్ఛంద ప్రకటన అవకాశాన్ని ఇచ్చిన ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయకుండా అట్టి అవకాశం ఇచ్చి ఉంటే ప్రజలకు ఇన్ని ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థ అస్థిరతకు గురికావడం తప్పి ఉండేవి. కానీ అలా చేయలేదు. జనాభాలో 3 శాతంగా ఉండే నల్లధనికుల గురించి 97 శాతం ప్రజానీకాన్ని వారాల తరబడి క్యూలలో నిలబెట్టింది. పైగా అలా నిలబడడం వారి దేశభక్తికి నిదర్శనం అంటోంది. ఇదంతా ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ ధోరణిని వెల్లడిస్తుంది. ప్రజల సమస్యల పట్ల ఆశ్చర్యకరమైన నిర్లక్ష్యాన్ని, స్పందనారాహిత్యాన్ని ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తోంది. కళ్ళకు కట్టినట్లు వాస్తవం ఎదురుగా ఉంటే, ప్రధానమంత్రి మాత్రం తమది ప్రజా సమస్యలకు స్పందించే ప్రభుత్వమని వితండవాదన చేస్తున్నారు.
ప్రధానమంత్రి ప్రకటించిన లక్ష్యాల వెనుక బహిర్గతం చేయని ఎజెండా ఉంటుంది. అదేమిటనే అంశంపై సహజంగానే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేట్‌, పెట్టుబడిదారీ శక్తులకు ప్రాతినిథ్యం వహిస్తోంది. భారతదేశంలో పెట్టుబడిదారీ విధానాన్ని అప్రతిహతంగా అభివృద్ధి చేయడం దాని ప్రధాన కార్యక్రమం. నయా ఉదారవాద విధానాలను (అంటే ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వ పాత్రను కనీస స్థాయికి పరిమితం చేయాలని, దేశ ఆర్థిక వ్యవస్థకు మార్కెట్‌ మాత్రమే చోదకశక్తిగా ఉండాలని చెప్పే విధానాలు) అది అనుసరిస్తున్నది. ఈ విధానాలను దూకుడుగా అమలుచేయడం కోసం కార్పొరేట్‌ శక్తులు పెద్ద ఎత్తున నిధులు అందించడం ద్వారా, మీడియా ప్రచారం ద్వారా మోడీ గెలుపుకు తోడ్పడ్డాయి. అయితే భారతదేశంలో పెట్టుబడిదారీ విధానానికి కొన్ని అంతర్గత బలహీనతలు ఉన్నాయి. నల్లధనం, అవినీతి, సంపదను భూమి, బంగారాల రూపంలో మదుపుచేయడం, ఇప్పటికీ 68 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాలలో నివసించడం, 55 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవించడం లాంటి అంశాలు పెట్టుబడి సమీకరణకు అవరోధాలుగా తయారయ్యాయి. ఉత్పత్తి సేవల రంగాలలోకి పెద్దఎత్తున దేశీయ పెట్టుబడి రావడానికి ఇవి అడ్డంకి అవుతున్నాయి. మరోపక్క విదేశీ పెట్టుబడి కూడా అనుకున్న స్థాయిలో రావడం లేదు. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమానికి అవసరమైన శ్రామికశక్తి సిద్ధంగా లేదు. శ్రామిక నైపుణ్యాల లోపం మరో సమస్య. పెట్టుబడి సమీకరణకున్న ఈ అడ్డంకుల్ని తొలగించడం పెద్ద నోట్ల రద్దు వెనుక ఉన్న అసలు లక్ష్యమేమో పరిశీలించాలి.
తృతీయ ప్రపంచ దేశాల్లోని పెట్టుబడిదారీ విధానం ఇప్పటికీ ఆదిమ పెట్టుబడి సంచయం ద్వారా పెట్టుబడిని సమీకరించాల్సిన దశలోనే ఉందనే అభిప్రాయం కొన్ని మార్క్సిస్టు శ్రేణులలో ఉంది. పెట్టుబడి సమీకరణకు, దాని స్వేచ్ఛా చలనానికి, పారిశ్రామిక శ్రామికశక్తి రూపొందడానికి ఉన్న అడ్డంకుల్ని బలవంతంగా తొలగించడం ఆదిమ పెట్టుబడి సంచయం లక్ష్యం. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల చిన్న రైతాంగం, చిన్న వ్యాపారస్తులు, చిన్న పరిశ్రమదారుల ఆర్థిక పునాదులు దెబ్బతినే అవకాశం ఉంది. విస్తృతమైన అసంఘటిత రంగం, దానిపై ఆధారపడి జీవించే వీధి అమ్మకందార్లు, కార్మికులు, కూలీలు మరింత అస్థిరతకు లోనవుతారు. వీరిలో అత్యధికుల్ని ఈ రంగాల నుంచి తొలగించి విదేశీ పెట్టుబడికి, మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమానికి, దేశీయ పరిశ్రమలకు అవసరమైన చౌక శ్రామికశక్తిలో భాగం చేసే వ్యూహం కూడా ఈ నిర్ణయం వెనుక ఉండొచ్చు. ఈ క్రమానికి తోడ్పడే అంశంగానే 'తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థ' (నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా కొందరు చెబుతున్నది ఒక అభూతకల్పన మాత్రమే) కోసం చేస్తున్న ప్రచారాన్ని, ప్రయత్నాలను చూడాలి. దీనిని, రాబోయే వస్తుసేవల పన్ను వ్యవస్థతో కలిపి చూస్తే, పన్నుల ఎగవేతను అరికట్టడం తమ లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది. ఇది తప్పనిసరిగా సాధించాల్సిన విషయమే. అయితే దీని వల్ల ఆర్థిక వ్యవస్థ అట్టడుగున ఉన్న చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు, చేతివృత్తులు దెబ్బతినే అవకాశం ఉంది. వీరిపై కొరడా ఝుళిపిస్తామంటున్న ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు ఏటేటా ధారాదత్తం చేస్తున్న వందల, వేల కోట్ల రూపాయల పన్ను రాయితీలను ఆపగలదా అని మనం ప్రశ్నించాలి. పెట్టుబడి లాభాలపై పన్ను విధించడానికి ఎందుకు వెనుకాడుతోంది అని మనం ప్రభుత్వాన్ని అడగాలి. అంటే, పైకి సానుకూల లక్ష్యాలుగా కనిపించేవాటిలో ఉండే అంతరార్థాన్ని విడమర్చి చూడాల్సిన అవసరాన్ని మనం గుర్తించాలి.
ఆధునిక ఆర్థిక వ్యవస్థలో భాగంగా నగదు రహిత చెల్లింపుల వైపు క్రమేపీ అందరూ మారాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం అవగాహన పెంపొందించడానికి ప్రయత్నాలు కూడా అవసరమే. అయితే, భారతదేశ వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా దీన్ని అత్యంత ప్రాధాన్యతగల అంశంగా పరిగణిస్తూ, వెనువెంటనే అమలులోకి తీసుకురావడానికి ప్రభుత్వాలు చూపిస్తున్న అత్యుత్సాహం అనవసరం అనిపిస్తోంది. విచక్షణారహితమైన తొందరపాటును, అసహనాన్ని అవి ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు చెల్లింపు సేవల సంస్థల వ్యాపారం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. ఇదంతా చూస్తే, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి, అంతర్జాతీయ వ్యాపార సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా మన ప్రజల్ని తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వాలు ఆరాటపడుతున్నాయనిపిస్తోంది. పెట్టుబడిదారీ విధాన అభివృద్ధికి ఇది ఒక అత్యవసర చర్యగా అవి భావిస్తున్నాయి.
పెద్ద నోట్ల రద్దు వల్ల బ్యాంకుల్లో నిల్వలు పెరిగాయి. దీనికి తక్కువ నగదు వ్యవస్థను జోడిస్తే బ్యాంకుల్లో భారీ నగదు నిల్వలు దీర్ఘకాలం పాటు స్థిరంగా ఉంటాయనేది ప్రభుత్వ అంచనా కావచ్చు. దీనివల్ల ప్రభుత్వానికి మరో ప్రయోజనం కూడా ఉంది. నిరర్థక ఆస్తుల వల్ల బలహీనపడిన బ్యాంకుల ఆర్థిక పునాదుల్ని ఈ నిల్వలతో బలోపేతం చేయవచ్చు. అయితే ఇక్కడ రెండు అంశాలు గమనించాలి. 1. బ్యాంకుల ప్రస్తుత రుణ విధానాన్ని మార్చకపోతే కొత్త రుణాలలో అధిక భాగం కార్పొరేట్‌, ధనిక వర్గాలకే వెళ్తాయి. చిన్న ఉత్పత్తిదారులకు, రైతాంగానికి ఒనగూడే అదనపు ప్రయోజనం ఉండకపోవచ్చు. 2. నగదు మొత్తం మీద బ్యాంకింగ్‌ వ్యవస్థలోనే కొనసాగడం వలన బ్యాంకులు ఇచ్చే రుణాల సంఖ్య, విలువ గణనీయంగా పెరుగుతాయి. నిరర్థక ఆస్తులు మరింతగా పెరగడాన్ని నిరోధించలేకపోతే బ్యాంకుల ఆర్థికశక్తి దెబ్బతిని క్రమేపీ ఆర్థిక మాంద్యానికి దారి తీయవచ్చు.
పెట్టుబడిదారీ విధాన ప్రస్తుత దశలో ఈ నోట్ల రద్దు పాలక వర్గాలకు, వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోడీ ప్రభుత్వానికి ఇప్పుడు ఎందుకు అవసరం అయిందనేది ఇక్కడ ప్రధానాంశం. పేదల కోసం ఉద్దేశించబడిందిగా ప్రధానమంత్రి పదేపదే చెబుతున్న ఈ నిర్ణయం అమలు తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? దాదాపు మొత్తం నల్లధనం బ్యాంకుల్లోకి వచ్చేస్తుందని అంచనా వేస్తున్నారు. రూ.3 లక్షల కోట్ల నల్లధనం బ్యాకుల్లో రాకుండా ఉండిపోతుందని, ఆ మిగులును ప్రజాపయోగ కార్యక్రమాలకు వినియోగిస్తామని చెప్పిన విషయం నీటిమూటగా మిగిలిపోతుంది. ఈ ప్రతికూల ఫలితాన్ని ఎదుర్కోవడానికే ఆదాయ పన్ను విధానం చేసే దాడుల ద్వారా కొంత ధనాన్ని ఖజానాకు తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లున్నది. తగుమొత్తంలో నగదు సిద్ధం చేసుకోకుండా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని అడిగితే, గోప్యత కోసమని ప్రభుత్వం సమాధానం చెబుతోంది. కానీ ఈ గోప్యత వల్ల సాధించింది అతి స్వల్పమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, బ్యాంకుల్లోకి వచ్చిన నల్లధనం పెట్టుబడి సంచయానికి తోడ్పడవచ్చు. ప్రభుత్వం నల్లధనాన్ని గుర్తించి పన్నులు వసూలు చేయగలిగితే ప్రభుత్వాదాయం పెరుగుతుంది. అలా చేయలేకపోతే నల్లధనాన్ని చట్టపరమైనదిగా చేసుకోవడానికి ప్రభుత్వం సహకరించినట్లవుతుంది. అయితే నల్లధనం మరలా పోగుపడదనే భరోసా మాత్రం ఏమీ ఉండదు. ఇదంతా కూడా నల్లధనంలో నగదు రూపంలో ఉన్న 10 శాతం కంటే తక్కువ మొత్తం గురించే. నల్లధనంలో కనీసం 90 శాతం భూమి, బంగారం, విదేశీ డిపాజిట్ల రూపంలో ఉందనేది నిపుణుల అభిప్రాయం. వీటిపై చర్యలు లేకుండా నగదు రూపంలోని నల్లధనం గురించి మాత్రమే మాట్లాడటం కొండను తవ్వి ఎలుకను పట్టడమే. భూమి, బంగారం విషయాలలో ప్రభుత్వం తీసుకుంటానని చెబుతున్న చర్యలు తీసుకోగలదో, లేదో వేచిచూడాలి. విదేశాలలోని నల్లధనం విషయంలో మాత్రం ఇంకా మౌనమే రాజ్యమేలుతోంది. ఇక నకిలీ కరెన్సీ విషయానికొస్తే (దేశంలో మొత్తం నకిలీ కరెన్సీ రూ.400 కోట్లు మాత్రమే అని అధికారిక అంచనాలు న్నాయి.) రూ.2000లకు ఇప్పటికే నకిలీ నోట్లు వచ్చాయి. కనుక ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైనట్లుగా భావించాలి. ఉగ్రవాదానికి ఈ నోట్లు ఉపయోగపడకుండా చేయడంలో విజయం సాధించడం కూడా ప్రశ్నార్థకమే. అవినీతిని అరికట్టడం కూడా అనుమానాస్పదమే. ఎందుకంటే అవినీతి వ్యవస్థ మూలాలలో ఉంది. పెద్ద నోట్లు ఉండటం వల్ల వచ్చింది కాదు. చిన్న నోట్ల ద్వారా లేదా వస్తు రూపంలో, ఇతర ప్రయోజనాల రూపంలో అది కొనసాగుతుంది. మౌలిక వ్యవస్థాగత సంస్కరణలు, ప్రజా చైతన్యం ద్వారా మాత్రమే అవినీతిని అరికట్టడం సాధ్యమౌతుంది.
ఇవన్నీ అలా ఉంచితే, ఈ చర్య ఒక తీవ్రమైన ఆర్థిక విపరిమాణానికి దారితీస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనానికి గురవుతుందని, స్థూల జాతీయోత్పత్తి(జిడిపి) 2016-17లో సగానికి సగం పడిపోతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఇబ్బందులు తాత్కాలికమేనని, దీర్ఘకాలంలో సానుకూల ఫలితాలు వస్తాయని, ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందని ప్రభుత్వం చెబుతోంది. నమ్మడం, నమ్మకపోవడం ఇక ప్రజల వంతు. ఇవన్నీ పరిశీలించిన పిమ్మట, ఈ చర్య తీసుకోవడంలో ప్రభుత్వ ప్రధాన లక్ష్యం పెట్టుబడి సంచయాన్ని పెంపొందించడం, విదేశీ పెట్టుబడికి మరింత సానుకూల వాతావరణాన్ని ఏర్పర్చడం, చిన్న ఉత్పత్తి రంగం స్థానే బడా పెట్టుబడిని ప్రోత్సహించడం, మిగులు (చౌక) శ్రామికశక్తిని అందుబాటులోకి తీసుకురావడంగా అనిపిస్తున్నది. నల్లధనం, అవినీతి వల్ల మాత్రమే ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుందనే ప్రచారం సాగుతోంది. పెట్టుబడిదారీ విధానపు సారాంశమైన లాభార్జనకు ఆధారభూతమైన శ్రమ దోపిడీని మార్మీకరించే ప్రయత్నం ఇందులో ఇమిడి ఉంది. ఈ మొత్తం అంశాన్ని మార్క్సిస్టు దృష్టి కోణం నుంచి మరింత లోతుగా పరిశీలించడానికి ప్రయత్నం జరగాలి.  - ఎన్‌ అంజయ్య

No comments:

Post a Comment