Wednesday, 4 January 2017

# సైన్సు కాంగ్రెస్సా, తీర్థయాత్రా? #



తిరుపతిలో జరుగుతున్న 104వ సైన్సు కాంగ్రెస్‌ను మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతగా భ్రష్టు పట్టించాలో అంతగానూ పట్టిస్తున్నారు.ముఖ్యమైన విషయం, సైన్సు కాంగ్రెస్సుకూ, తీర్థ యాత్రల కార్యక్రమానికీ తేడా లేకుండా మార్చేస్తున్నారు. సైన్సు కాంగ్రెస్‌లో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని మోడీ శాస్త్ర మహాసభను ప్రారంభించిన తరువాత నేరుగా తిరుమల వెళ్లి దేవుని పూజలు చేశారు. ప్రధాని యొక్క భక్తి అనేది ఆయన వ్యక్తిగత విషయం. ఆయన దేవుని పూజలు చేయడాన్ని కూడా ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఆ పనిని వేరే సందర్భంలో చేయవచ్చు లేక ప్రత్యేకంగా పూజాదికాలు నిర్వహించడానికి వేరే సందర్భంలో రావచ్చు. కానీ దేవుని ఉనికినే ప్రశ్నిస్తున్న సైన్సుకు సంబంధించిన మహాసభలు జరుగుతూ ఉంటే దానికి ప్రధాని హోదాలో వచ్చిన వ్యక్తి ముందుగా దైవ పూజలు చేస్తే ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఎలాంటి సందేశం వెళుతుంది. దైవ భావానికీ, సైన్సుకూ ఏమాత్రం వైరుధ్యం లేదని, ఇంకా చెప్పాలంటే సైన్సు దేవుని ముందు మోకరిల్లాలనే సందేశం వెళ్లదా?
దైవ భావానికీ, సైన్సుకూ వైరుధ్యం లేదని ప్రధాని నమ్మవచ్చు. ఆ మహాసభకు వచ్చిన శాస్త్రవేత్తల్లో కూడా చాలా మందికి ఆ నమ్మిక ఉండవచ్చు. కానీ దైవ భావం సైన్సుకు విరుద్ధమనీ, సైన్సు దైవ భావాన్ని అంగీకరించదనీ నమ్మేవారు కూడా చాలా మంది ఉంటారు కదా! మరి వారి మాటేమిటి? వారి నమ్మికకు ప్రధాని విలువనివ్వనక్కరలేదా? ప్రధాని కొంతమందికీ, కొన్ని భావాలు నమ్మేవారికీ మాత్రమే ప్రధానా లేక ప్రజలందరికీ ప్రధానా?
సైన్సు కాంగ్రెస్‌లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి ప్రసంగం మరీ వికృతంగా ఉంది. సైన్సుకు భగవంతుని సహకారం కావాలట. ''ఎక్కువ మంది శాస్త్రవేత్తలు దైవదర్శనం చేసుకోవచ్చనే కుటుంబ సభ్యులతో సహా తరలివచ్చారు. ప్రతి హిందువూ జీవితంలో ఒక్కసారైనా తిరుపతికి రావాలనుకుంటారు. తిరుపతి ఆధ్యాత్మిక, మత నగరం. వేదాలు, యోగా కూడా ముఖ్యమైనవి. వేదాల్లో పుట్టిన యోగాకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది'' అని చంద్రబాబు నాయుడు సైన్సు కాంగ్రెస్‌లో ప్రసంగించి ఆ మహాసభ స్ఫూర్తినే దెబ్బతీశారు. ఆయన ఆదేశాలో ఏమో సైన్సు కాంగ్రెస్‌కు వచ్చిన శాస్త్రవేత్తలందరినీ దైవదర్శనం కోసం తిరుమల తీసుకువెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాసభలు జరుగుతున్న ఎస్‌వి యూనివర్శిలో దీనికోసం ఒక ప్రత్యేక కౌంటరే ఏర్పాటు చేశారు.
ప్రధాని, ముఖ్యమంత్రి ఇద్దరూ రాజ్యాంగ పదవులు నిర్వహిస్తున్న వ్యక్తులే. నిన్ననే మన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు గురించి వారికి తెలియదనుకోడానికి లేదు. ''లౌకిక వాదం మన రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగం. మతమనేది వ్యక్తిగత విషయం. రాజ్య వ్యవహారాలను మతంలో కలపడానికి వీల్లేదు. లౌకిక రాజ్యం ఏ మతంతోనూ గుర్తింపు పొందకూడదు'' అని ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఠాకూర్‌తో సహా ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొన్నది. ప్రధాని, ముఖ్యమంత్రి సైన్సు కాంగ్రెస్‌లో చెప్పిన మాటలుగానీ, వ్యవహరించిన తీరుగానీ మన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయన్న విషయం ఉన్నత న్యాయస్థానం తీర్పును బట్టే అర్థమవుతోంది.
శాస్త్రీయ దృక్పథం ఉన్న వారు ఎవరూ సైన్సుకు దేవుని అవసరం ఉందని చెప్పరు. ఎందుకంటే ''ఇప్పటి వరకూ జరిగిన సైన్సు పరిశోధనల్లో ఎక్కడా దేవుని అవసరం రాలేదు'' అని ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకిన్స్‌ చెప్పారు. దేవుడు-సైన్సు గురించిన విషయమై ఆయన రెండేళ్ల క్రితం స్పెయిన్‌కు చెందిన ఎల్‌ ముండో పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు : ''మనం సైన్సును అర్థం చేసుకోక ముందు ఈ విశ్వాన్ని దేవుడు సృష్టించాడని నమ్మడం సహజం. కానీ ఇప్పుడు విశ్వ సృష్టికి సంబంధించి సైన్సు మరింత సమర్థవంతమైన వివరణ ఇస్తోంది. మతం అతీతశక్తులను నమ్ముతుంది. కానీ సైన్సుతో అవి పొసగవు. నా ఉద్దేశంలో వాస్తవిక ప్రపంచంలో మానవ మేధస్సుకు అందనిదేదీ లేదు...''
వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు సైన్సుకు దేవుని సహకారం అవసరం లేదు. సైన్సు-సాంకేతిక సహకారం లేకుండా ప్రపంచంలో దైవ భావనే నిలవదు. మన టెలివిజన్‌, సినిమాలు, పుస్తకాలు... ఇంకా సైన్సు-టెక్నాలజీ సృష్టించిన అనేక ఆవిష్కరణలను నేడు ప్రజల్లో దైవ భావం ప్రచారం చేయడానికే ఉపయోగించుకుంటున్నారు గానీ ప్రజల్లో శాస్త్రం గురించీ, శాస్త్రీయ ఆలోచనల గురించీ ప్రచారం చేయడానికి ఉపయోగించడం లేదు. మనం పొద్దున్నే లేచి టీవీ ఆన్‌ చేస్తే చాలు డజన్ల కొద్దీ ఛానళ్లలో దైవ ప్రచారం జరిగిపోతూనే ఉంటుంది. కానీ శాస్త్రీయ ప్రచారం చేయడానికి ఒక్క ఛానల్‌ కూడా లేదు. అభివృద్ధి చెందుతున్న ప్రతి టెక్నాలజీనీ మత ప్రచారం కోసం పాలక వర్గాలు ఉపయోగించు కుంటున్నాయి. 
సైన్సుకు మతం సహకారం కావాలని ఈ రోజు చెబుతున్న వాళ్లు, సైన్సు కాంగ్రెస్‌ను మత నమ్మకాలతో భ్రష్టుపట్టిస్తున్న వాళ్లు చరిత్రలో సైన్సుకూ, మతానికీ జరిగిన యుద్ధం గురించి తెలుసుకుంటే మంచిది. చరిత్రలో సైన్సు వేసే ప్రతి ముందడుగూ మత నమ్మకాలతో జరిగిన యుద్ధంలో గెలవడం ద్వారానే జరిగింది. సైన్సు ప్రశ్న నుంచి ఉద్భవించింది. మతం ప్రశ్నను అణచేయడానికి చేయని ప్రయత్నం లేదు. పాల్పడని దుష్కృత్యం లేదు. సైన్సును అణచివేయడానికి శాస్త్రవేత్తల పరిశోధనలపై మతం ఎన్నెన్ని ఆంక్షలు పెట్టింది. ఎన్నెన్ని నిర్భంధాలు విధించింది. ఎన్నెన్ని అకృత్యాలకు పాల్పడింది. బ్రూనోను నిలువునా కాల్చి చంపింది. చార్వాకులను చెండాడింది. గెలీలియో అంతటి మహానుబావుణ్ణి గృహనిర్బధంలో పెట్టి చావుకు కారణమైంది. అయినా శాస్త్రీయ దృక్పథాన్ని ఆధారంగా చేసుకుని సైన్సు అభివృద్ధి చెందింది. మతం చెప్పిన నమ్మకాలను పటాపంచలు చూస్తూ ముందుకు నడిచింది.
సైన్సుకూ, మతానికీ మధ్య పోరాటం నేటికీ నడుస్తూనే ఉంది. దురదృష్టమేమంటే ఈ రోజు సైన్సును పాతరేసి, మతాన్ని ముందుకు తెచ్చే పచ్చి ఛాందస శక్తులు అటు కేంద్రంలోనూ, ఇటు మన రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చాయి. మూఢనమ్మకాలను సైన్సు పేరుతో ప్రచారం చేసే మోసకారులు మేధావులుగా చెలామణి అవుతూ అన్నీ వేదాల్లోనే ఉన్నాయష అని నిత్యం అఘోరిస్తూ ఉంటే శాస్త్రీయ దృక్పథం కలిగిన వారి గొంతుక వినిపించకుండా పోతోంది. మహామహా శాస్త్రవేత్తలమని చెప్పుకుంటున్నవారు కూడా మతం కాళ్ల మీద పడి పొర్లు దండాలు పెడుతుంటే దేశంలోని యువతకు విజ్ఞాన శాస్త్ర స్ఫూర్తి ఎక్కడి నుంచి వస్తుంది. స్వాతంత్య్రానంతరం మన దేశం విజ్ఞాన శాస్త్రంలో ఒక్క నోబెల్‌ బహుమతి కూడా సాధించలేకపోవడానికి కారణం, శాస్త్ర పరిశోధనల్లో మనం వెనుకబడి పోవడానికి కారణం శాస్త్ర విజ్ఞానం పట్ల పెరుగుతున్న ఈ అశాస్త్రీయ దృక్పథమే కాదా!
గతంలో ఢిల్లీలో జరిగిన ఒక సభలో ప్రధాన మంత్రి వినాయకుని గురించి 'కథ' చెప్పారు. 'ఆ కాలంలోనే' మన వాళ్లు మనిషి శరీరానికి ఏనుగు తల తెచ్చి ప్లాస్టిక్‌ సర్జరీ చేశారని పేర్కొన్నారు. ప్రధాని అంతటివాడు ఇటువంటి ఫార్సులను మాట్లాడుతుంటే ఆ సభలో ఏ ఒక్క శాస్త్రవేత్తా ఖండించలేకపోయాడు. పోనీ కనీసం తరువాతనైనా దాన్ని ఖండిస్తూ ఏ శాస్త్రవేత్తా మాట్లాడలేకపోయాడు. ముంబయిలో జరిగిన 102వ సైన్సు కాంగ్రెస్‌లో 'పురాణ సైన్సు' గురించి పత్రం ప్రవేశపెడుతూ పురాణ కాలంలోనే మనవాళ్లు నేటికి మించిన టెక్నాలజీ కలిగిన విమానాలు తయారు చేశారంటే ఒక్క శాస్త్రవేత్త కూడా ఖండించలేకపోయారు. ఇప్పుడు 104వ కాంగ్రెస్‌లో సైన్సు కన్నా మత ప్రచారం ఎక్కువగా చేస్తుంటే అక్కడున్న మన శాస్త్రవేత్తలు ఒక్కరూ మాట్లాడలేకపోయారు. మన శాస్త్రవేత్తలు మనల్ని ఎటు తీసుకుపోతున్నారు? మన సైన్సు ఎటు పోతోంది?
ఇదంతా సైన్సుపై ఛాందసవాదం జరుపుతున్న దాడి. దీన్ని ఖండించాలి! ఎదిరించాలి! ఓడించాలి!
- ఎస్‌ వెంకట్రావు

No comments:

Post a Comment