సంక్రాంతి వేళ ఆంధ్రప్రదేశ్లోని కోడిపందేలు, తమిళనాడులో జల్లికట్టుపై సాక్షాత్తు దేశ సర్వోన్నత న్యాయస్థానం విధించిన నిషేధా జ్ఞలు అభాసుపాలు కావడం ఆందోళనకరం. ఆయా రాష్ట్ర ప్రభుత్వా లు, పోలీస్ వ్యవస్థలు కలిసికట్టుగా సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కాయి. కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా రాష్ట్ర వ్యాపితంగా జరి గిన కోడి పందేల్లో పందెం రాయుళ్లు కోట్ల రూపాయలు పందే లు కాశారు.
మూడు రోజులుగా పల్లెల్లో వెలుస్తున్న బరులను పాల కులు, వారి చెప్పుచేతల్లోని పోలీస్ వ్యవస్థ చూస్తూ ఊరుకోవడం ఆందోళన కలిగించే అంశం. పోలీసులు తామూ ఉన్నామని చెప్పడా నికి అక్కడక్కడా కొద్దిమంది చిన్నచిన్న పందెం రాయుళ్లను అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఏపీలో కోడిపందేలు, తమిళ నాడులో జల్లికట్టు తెరమీదికొస్తాయి. సంస్కృతీ, సంప్రదాయాల మాటున జూదం రాయు ళ్లు పెట్రేగిపోవడం ఆనవాయితీ. సంప్రదాయ క్రీడలను సంప్రదాయ బద్ధంగా ఆడుకుంటే ఎవ్వరికీ అభ్యంతరం ఉండబోదు. సంస్కృతి పేరుచెప్పి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడటం నేరం. చట్టాలు ఘోషిస్తున్నా, కోర్టులు ఆదేశిస్తున్నా లక్ష్యపెట్టకుండా ఉద్దేశపూర్వకంగా పదే పదే నేరాలు చేయడం అవాంఛనీయం. ప్రభుత్వాలు, పోలీస్ వ్యవస్థ కుమ్మక్కై కోడిపందేల మాటున మితిమీరిన జూదాన్ని ప్రోత్సహించడం అధికారిక అఘాయిత్యమే. కోడి పందేలు, తమిళ నాడులో జల్లికట్టు కూడదని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా ఏపి, తమిళనాడు ప్రభు త్వాలు పట్టించుకోలేదు. కోళ్లకు కనీసం కత్తులు కట్టవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాన్ని కూడా తుంగలో తొక్కారు.
కోడి పందేలంటే కేవలం కోళ్లకే పరిమితం కాదు. వాటి చుట్టూ కోట్ల రూపాయల జూదం పెనవేసుకుని ఉంటుందన్నది బహిరంగ రహస్యం. ఈ సంవత్సరం సంక్రాంతి మూడు రోజులూ ఏపీలోని గ్రామ సీమల్లో జూదం ఎంత విచ్చలవిడిగా సాగిందో మీడియాలో మచ్చుకు చూపిస్తున్న, కనిపిస్తున్న దృశ్యాలే సాక్ష్యం. ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాష్ట్ర రాజధాని అమరావతి విస్తరించి ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందేలు నిర్వహించేందుకు వందలాది బరులు యధేచ్ఛగా ఏర్పాటయ్యాయి. రూ.వందల కోట్లల్లో చేతులు మారాయి. ప్రైవేట్ సెక్యూర్టీ, బౌన్సర్లు, స్వైపింగ్ మిషన్ల వంటి అధునాతన పద్ధతులొ చ్చాయి. స్థానికులే కాదు పొరుగు జిల్లాలు, వివిధ రాష్ట్రాల నుంచి పందెం రాయుళ్లు తండోపతండాలుగా కోడి పందేలకు విచ్చేశారంటే పోలీస్ వ్యవస్థ ఎంతగా నిద్ర నటిస్తున్నదో వేరే చెప్పనవసరం లేదు. చట్టం మీద ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు కోడి పందేలను ప్రోత్సహిస్తూ ఫొటోలకు ఫోజులిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నట్లు? అందినకాడికి లంచాలు మేసి అస్త్ర సన్యాసం చేశారా? పేదలు కడుపుకాలి రేషన్కార్డులడిగితే, గూడు లేదని జానెడు ఇంటి జాగా కోరితే, తమకు జీతాలు పెంచమని స్కీం వర్కర్లు రోడ్డెక్కితే, కార్పొరేట్లకు తమ భూములివ్వబోమని రైతులు గొంతెత్తితే లాఠీఛార్జీలు, అక్రమ కేసులు, గృహనిర్భంధాల వంటి అణచివేత చర్యలకు పాల్పడే పోలీసు యంత్రాంగం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారి పట్ల ఎక్కడలేని ఔదార్యం చూపడం ఏం నీతి? ప్రజల నిరసనలకు సెక్షన్ 144, సెక్షన్ 30 అడ్డొస్తాయి. జూదరుల స్వైర విహారానికైతే నిబంధనలు, చట్టాలు అస్సలు గుర్తుకురావు. వాస్తవానికి ఇది పోలీసుల వైఖరి మాత్రమే కాదు ప్రభుత్వ వైఖరి.
సంక్రాంతి తెలుగువారి పండుగ. శ్రమ జీవుల పర్వదినం. రైతులు తాము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిన సంతోషంలో రైతులు, కూలీలు కలిసి చేసుకునే పండుగ. తెలుగు లోగిళ్లల్లో సంక్రాంతి శోభ సంతరించుకోవాల్సిన సమయంలో సంస్కృతి, సంప్రదాయాల ముసుగులో జూదాన్ని నిర్వహించడం, వళ్లు, ఇళ్లు గుల్ల చేసుకొనేందుకు ప్రేరేపించడం దారుణం. జూదం ఆడితేనే సంస్కృతి, సంప్రదా యాలు వెల్లివిరుస్తాయనుకోవడం అవివేకం. ప్రజలకు నష్టం కలిగించే చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదాయాలు కాబోవు. ఒకానొక సమయంలో సతీ సహగమనం అనేది అప్పటి సమాజంలో సంప్రదాయంగా ఉంది. అలాగని అలాంటి సాంఘిక రుగ్మతను సంప్రదాయం పేరుతో ఇప్పుడు కొనసాగిస్తా మంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందో కోడిపందేలు, వాటి చుట్టూ అల్లుకున్న వికృత జూద క్రీడలూ అంతే. కోడిపందేలు, జల్లికట్టులో కేవలం జంతు హింస ఒక్కటే లేదు. ప్రజల కష్టార్జితానికీ చివరికి ప్రాణాలకు ముప్పు వాటిల్లే క్రీడలవి. వినోదం కంటే వికృతం పాళ్లే ఎక్కువ. దసరా రోజు కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రలతో కొట్టుకునే ఆచారం ముందుకొస్తుంది. ఆ సమయంలో పలువురు గాయపడ తారు. ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. జల్లికట్టులో కోడెల వెంట పడే యువకుల విషయంలో కూడా అదే పరిస్థితి. తన ఆదేశాలను అమలు పర్చని ప్రభుత్వాలు, కార్యనిర్వాహక వ్యవస్థలపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో?

No comments:
Post a Comment