Monday, 9 January 2017

|| కులం కుట్రలో రోహిత్‌ కేసు ||




*బిసిగా ముద్ర వేసేందుకు స‌న్నా‌హాలు    
                                                   
           రోహిత్‌ వేముల ఆత్మహత్య చేసుకుని ఏడాది సమీపిస్తున్నప్పటికీ ఆయన కేసును తేల్చకపోగా, ఆత్యహత్యకు కారకులైన వారిని రక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. బతికినంత కాలం దళితుడిగా జీవించి, ఆ భావజా లన్నే నమ్మిన రోహిత్‌పై బిసి ముద్ర వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మృత్యువులోనూ వేధింపులను ప్రశ్నించి, వివక్షను నిలదీసిన రోహిత్‌ మరణించిన రోజును దళిత హక్కుల పోరాట దినంగా ప్రకటించాలని వివిధ ప్రజా, దళిత సంఘాలు ఒక వైపు డిమాండ్‌ చేస్తుండగా, మరోవైపు గుంటూరు కలెక్టర్‌ కార్యాలయం వేదికగా గుట్టుచప్పుడు కాకుండా రోహిత్‌ కులాన్ని బిసిగా మార్చివేయడానికి కుట్ర సాగుతోంది.
దళిత వ్యతిరేకిగా విద్యార్థులు, మేధావుల నుండి ఛీత్కారాలు ఎదుర్కొన్న హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్గరుండి మరీ ప్రధాన మంత్రి చేతుల మీదుగా సన్మానం చేయించిన కొద్ది రోజులకే ఈ కసరత్తు జోరందుకోవడం గమనార్హం. వివాదానికి కేంద్ర బిందువుగా మారిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం నుండి కాపాడటానికే రోహిత్‌ వేములను మరోసారి చంపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
కులాంతర వివాహాల కారణంగా పుట్టిన పిల్లలకు వారి కులాన్ని ఎంపిక చేసుకునే హక్కు ఉంది. తండ్రి కులాన్ని గానీ, తల్లి కులాన్ని గాని వారు ఎంచుకోవచ్చు. ఇది ఆ పిల్లల హక్కు! దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన నిర్ధారణ కూడా! వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రోహిత్‌ వేముల విషయంలో దానికి భిన్నంగా అధికారానికి నచ్చిన కులం రుద్దడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయన్ను బిసిగా ప్రకటించడానికి రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఆయన తొలి వర్ధంతి జనవరి 17 లోగానే ఈ మేరకు రాష్ట్ర సర్కారు ప్రకటన జారీ చేసినా ఆశ్చర్యం లేదు. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు రోహిత్‌ వేములను బిసిగా నిర్ధారిస్తూ గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం ఒక నిర్ధారణకు వచ్చింది. ఈ మేరకు ఆ జిల్లా కలెక్టర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమైనంత త్వరలో నివేదిక పంపనున్నారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటిస్తుందా, గుట్టుచప్పుడు కాకుండా తెలంగాణ సర్కారుకు, కేంద్ర ప్రభుత్వానికి పంపి చేతులు దులుపుకొంటుందా అన్నది వేచి చూడాల్సిఉంది. రోహిత్‌ తండ్రి ఇచ్చిన నివేదిక ఆధారంగా గుంటూరు జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఇది రోహిత్‌ వేముల జీవి తాంతం నమ్మి అనుసరించిన భావజాలానికి, సుప్రీంకోర్టు చేసిన దిశా నిర్దేేశానికి వ్యతిరేకం. రోహిత్‌ కులాన్ని ఎస్‌సిగా నిర్ధారిస్తే ఈ వ్యవహారంలో పీకల్లోతులో చిక్కుకున్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు చిక్కులు తప్పని స్థితి నెలకొంటుంది. దానిని దృష్టిలో ఉంచుకునే రోహిత్‌కు బిసి ముద్ర వేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో ఆత్మహత్య ఎంత నేరమో, ఆత్మహత్యకు ప్రేరిపించడమూ అంతే నేరమన్న సంగతి అధికార యంత్రాంగం విస్మరిస్తోంది. 

# సుప్రీం కోర్టు ఏం చెప్పింది? #

2012 జనవరిలో సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన ఆఫ్తాబ్‌ అలామ్‌ వర్సస్‌ రంజనా ప్రకాశ్‌ దేశారు కేసులో ఈ విషయమై సుప్రీంకోర్టు స్పష్టమైన దిశా నిర్దేశం చేసింది. ' తండ్రి కుటుంబాన్ని విస్మరించి, పిల్లల బాగోగులను ఏమాత్రం పట్టించుకోకపోతే, కేవలం ఆయనకు పుట్టిన ఒక్క కారణంతోనే ఆతని కులం వస్తుందని చెప్పలేం. తల్లి ఎస్‌సి, ఎస్టీ కులాలకు చెంది, పిల్లల బాగోగులను ఆమే చూసినప్పుడు ఆ కులాలకే ప్రత్యేకమైన అణచివేతను, వేధింపులను వారు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సమాజం కూడా అదే విధంగా గుర్తిస్తుంది. అటువంటి సమయంలో తల్లి కులమే పిల్లలకూ వస్తుంది' అని ఈ కేసులో తీర్పు ఇస్తూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

# రోహిత్‌ విషయంలో ఏం జరిగింది? #

రోహిత్‌ తండ్రి వడ్డెర కులం (బిసి)కి చెందినవాడైనప్పటికీ భార్య, పిల్లలను వదిలివేసిన సంగతి తెలిసిందే. దీంతో చిన్నప్పటి నుండి రోహిత్‌ను ఎస్‌సి కులానికి చెందిన అతని తల్లే పెంచింది. స్కూల్‌ రికార్డు ల్లోనూ అదే విధంగా రాయించింది. రోహిత్‌ జీవన శైలి కూడా అదే విధంగా సాగింది. సమాజమూ అతనిని అదే విధంగా గుర్తించింది. ఈ క్రమంలోనే ఎన్నో అడ్డంకులను, వేధింపులను రోహిత్‌ అడుగడుగునా ఎదుర్కొన్నాడు. విశ్వ విద్యాలయంలోనూ వేధింపులు తప్పనిసరిగా మారాయి. ఆత్మహత్యకు ముందు రోహిత్‌ రాసిన లేఖే ఆయన ఎదుర్కొన్న వేధింపులకు, నమ్మిన భావజాలానికి నిలువెత్తు సాక్ష్యం! 

# మాటమార్చిన కలెక్టర్‌? #

రోహిత్‌ వేముల కులం విషయంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌ మాట మారుస్తున్నారా? తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. 2016 జూన్‌లో జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌కు సమర్పించిన నివేదికలో రోహిత్‌ వేముల మాల కులానికి చెందిన వ్యకి అని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ విషయమై అప్పట్లో పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఆ తరువాత జరిగిన పరిణామాల్లో పూర్తి స్థాయి విచారణ జరపాలని నిర్ణయించారు. పాఠశాల రికార్డు ఆధారంగా గుంటూరు తహసిల్దార్‌ ఎస్‌సి అని నిర్ధారించగా, తండ్రి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా రోహిత్‌ బిసి అని గురజాల తహసిల్దార్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రోహిత్‌ కులాన్ని నిర్ధారించే బాధ్యతను జాయింట్‌ కలెక్టర్‌కు అప్పగించారు. అప్పట్లో జెసిగా ఉన్న శ్రీధర్‌ బదిలీ కావడంతో ఆ తరువాత మంగా వెంకటేశ్వరరావు జెసిగా బాధ్యతలు స్వీకరించారు. పలు దఫాలు సమావేశాలు నిర్వహించిన అనంతరం తండ్రి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగానే రోహిత్‌ కులం నిర్ధారించినట్లు సమాచారం. ఏడాది కాలం పాటు రోహిత్‌ కులం తేల్చకుండా మీనమేషాలు లెక్కించిన అధికారులు కేంద్ర రాష్ట్ర పెద్దల తీవ్ర ఒత్తిడితోనే తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

No comments:

Post a Comment