Monday, 2 May 2016

|| లాల్ సలాం - నీల్ సలాం ||

             ఊహించినట్లుగానే గత ఫిబ్రవరి 9 కార్యక్రమానికి సంబంధించి ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) పాలకవర్గం విద్యార్థులకు 'శిక్షలు' ఖరారు చేసింది. ప్రొక్టోరియల్‌ కమిటీని పక్కన పెడుతూ 'ఉన్నతస్థాయి కమిటీ' పేరుతో త్రిసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేసినప్పుడే దీని స్క్రిప్టు తయారయింది. రిజర్వేషన్లను ద్వేషించే రాకేశ్‌ భట్నాగర్‌ ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కాబట్టి దీన్ని ఒప్పుకోబోమని విద్యార్థులు స్పష్టం చేశారు. ఈ మేరకు విద్యార్థుల జరనల్‌ బాడీ సమావేశం ఓ తీర్మానం చేసింది. కమిటీని సరైన ప్రాతినిధ్యంతో విస్తరించాలని వారు డిమాండ్‌ చేశారు. కానీ 'నాగపూర్‌' రిమోట్‌తో నడిచే విసి జగదీశ్‌కుమార్‌ దీన్ని పెడచెవినబెట్టారు. అలా ఈ కమిటీ విద్యార్థుల వాదనలేమిటో తెలుసుకోకుండానే కన్నయ్యకుమార్‌ సహా పలువురు విద్యార్థులకు జరిమానాల నుంచి రస్టికేషన్‌, హాస్టల్‌ నుంచి వెలి, క్యాంపస్‌ బహిష్కరణల దాకా వేర్వేరు శిక్షలు ప్రకటించింది. ఇదే కార్యక్రమానికి సంబంధించి విద్యార్థులపై నమోదైన దేశద్రోహం కేసు కోర్టు విచారణలో ఉండగానే ఈ 'ఉన్నతస్థాయి' శిక్షలు విధించడం గమనార్హం. నిజానికి వీడియోలను మార్పింగ్‌ చేశారని మెజిస్టీరియల్‌ విచారణలో నిగ్గుతేలినప్పుడే 'దేశభక్తి' ముసుగులో దాగున్న శక్తులు విద్యార్థులపై వెలేత్తి చూపే నైతిక అర్హతను కోల్పోయాయి.
'ఉన్నత స్థాయి' కమిటీ తన నివేదికను మార్చిలోనే సమర్పించగా పాలకవర్గం పరీక్షలు, సెలవుల సమయాన్ని చూసి మరీ శిక్షలు ప్రకటించింది. ఇలా చేస్తే విద్యార్థులు పోరాడకుండా ఇళ్ళకు వెళ్ళిపోతారని పాలకవర్గం ఆశించింది. కానీ 'పోరాటాలకు సెలవులుండవు' అని తెగేసి చెబుతూ విద్యార్థులు పోరుశంఖం ఊదారు. విద్యార్థులపై ఈ కక్ష సాధింపు చర్యల వెనుక కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ హస్తం, దాని వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తం ఉందనేది తెటతెల్లం. ఫిబ్రవరి 9 నాటి కార్యక్రమమే దీనంతటికీ కారణం అనే భ్రమలు ఎవరికీ ఉండనక్కరలేదు. ఈ దాడిలో మరెన్నో అంశాలు అంతర్భాగంగా ఉన్నాయి. ఉదాహరణకు తొమ్మిది నెలల క్రితం క్యాంపస్‌లో ప్రదర్శించిన 'ముజఫర్‌నగర్‌ బాకీ హై' అనే డాక్యుమెంటరీ విషయంలో ఉమర్‌, అనిర్బాన్‌లకు ఇప్పుడు నోటీసులందాయి. సరిగ్గా ఇదే డాక్యుమెంటరీ ప్రదర్శన సాకుతో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సియు) లో రోహిత్‌, అతని అనుచరులను వేధింపులకు గురిచేసి చివరకు రోహిత్‌ను ఆత్మహత్య వైపు నెట్టేశారన్న వాస్తవాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరముంది. గత మార్చి 8న 'మనుస్మృతి' ప్రతులను దగ్ధం చేసిన సంఘటనపైనా కొందరు విద్యార్థులపై విచారణ జరుగుతోంది. ఆఖరుకు అడ్మిన్‌ బ్లాక్‌ గోడపై 'జై భీం' అని రాసిన విద్యార్థిని సైతం వేధింపులకు గురి చేశారంటే అంబేద్కర్‌ జయంతి పేరిట వీరు చేసే ఆర్భాటం ఎంత బూటకమో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈమధ్యే జెఎన్‌యులో ప్రవేశానికి సంబంధించి ఓ ముఖ్యమైన మార్పు చేశారు. వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులకు ఇచ్చే 'డిప్రైవేషన్‌ పాయింట్ల'లో కోత విధించారు. ఒబిసి కోటాను సైతం కుదించే కుట్ర చేశారు. ఈ పరిణామాలు జెఎన్‌యుకు మాత్రమే పరిమితం కాదు.
దేశంలోని ఉన్నత విద్యాసంస్థలన్నింటి స్వయంప్రతిపత్తిని కాలరాసి, వాటిపై హిందూత్వ శక్తులు పట్టు బిగిస్తున్నాయి. శాస్త్రీయతకు, విజ్ఞానానికి నెలవులుగా ఉండే ఐఐటిలలో సంస్కృతాన్ని రుద్దుతున్నారు. దళిత, అణగారిన విద్యార్థులను వేధింపులకు, వివక్షకు గురిచేస్తున్నారు. ఈ పరిణామాలను మోడీ ప్రభుత్వం ప్రారంభించిన విద్య కాషాయీకరణ-కార్పొరేటీకరణ అజెండాలో భాగంగా చూడాలి. ఒకవైపు మతతత్వాన్ని ఎగదోస్తూ, మరోవైపు దేశ సార్వభౌమత్వాన్ని సహితం సామ్రాజ్యవాదులకు తాకట్టు పెడుతోంది. దేశ వనరులన్నింటినీ కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెడుతూ, దాన్ని ఎదిరించే వారిని ఫాసిస్టు పద్ధతుల్లో అణచివేసే రాజకీయ, ఆర్థిక విధానాల్లో భాగమే ఈ అజెండా.
దేశ వర్తమాన చరిత్రలో విద్యార్థులు ఓ మహత్తర పాత్ర పోషిస్తున్నారు. వారిలో జెఎన్‌యు విద్యార్థులు అగ్రగాములుగా నిలిచారు. తొలి నుంచీ జెఎన్‌యు ప్రజాస్వామ్య, ప్రగతిశీల, విప్లవ భావజాలానికి బలమైన గొంతుకగా నిలిచింది. దేశంలోని వివిధ వర్గాల పీడిత ప్రజలందరికీ అదొక సంఘీభావ వేదికగా ఉంది. మతతత్వ, తిరోగామి శక్తులకు అది ఎల్లప్పుడూ కొరకరాని కొయ్యగానే ఉంది. దాన్ని దెబ్బతీయాలని మతతత్వ శక్తులు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే 'దేశద్రోహకర' నినాదాల పేరిట తప్పుడు ఆరోపణలు ముందుకు తెచ్చారు. ఆ సాకుతో విద్యార్థులను వెంటాడుతూ వేధిస్తున్నారు. అయితే విద్యార్థులు దీనికి ఎదురు నిలిచారు. తమ సమస్యలపై పోరాడుతూనే దేశంలోని కార్మికులు, రైతులు, దళితులు, ఆదివాసులు చేస్తున్న పోరాటాలన్నింటికీ సంఘీభావం ప్రకటిస్తున్నారు. తమపై జరుగుతున్న దాడికి మూలాలు 'నాగపూర్‌' భావజాలంలో ఉందంటూ సమైక్య పోరాటాలకు పిలుపునిస్తున్నారు. వారి 'జై భీం', 'లాల్‌సలాం' నినాదం ఇప్పుడు జెఎన్‌యు గోడలను దాటి దేశం మూలమూలలా ప్రతిధ్వనిస్తోంది. దానితో గొంతు కలపడం ప్రజాస్వామ్యాన్ని, లౌకితత్వాన్ని కోరుకునే వారందరి బాధ్యత. (ప్రజాశక్తి సంపాదకీయం)

No comments:

Post a Comment