Saturday, 21 May 2016

|| బిజెపి బలం పెరగ లేదు ||

       దేశంలో ఇటీవలి నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో మూడు చోట్ల ప్రభుత్వాలు మారాయి. రెండు చోట్ల గత ప్రభుత్వాలకే ప్రజలు పట్టం కట్టారు. కేరళ, అస్సాం, పుదిచ్చేరిల్లో గత ప్రభుత్వా లను మట్టికరింపించి, కొత్త ప్రభుత్వాలకు అవకాశం ఇచ్చారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో పాత ప్రభుత్వాలనే తిరిగి ఎన్నుకున్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, మరో జాతీయ నేత రామ్‌ మాదవ్‌లు మీడియాతో మాట్లాడుతూ మోడీ రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా అభివర్ణియించారు. అమిత్‌ షా, రామ్‌ మాదవ్‌లు అయితే ఒక అడుగు ముందుకేసి ఏకంగా అస్సాం, కేరళ, బెంగాల్‌ తమ ఓటింగ్‌ శాతం పెరిగిందని తప్పుడు వ్యాఖ్యలు చేశారు. వీటిని కార్పోరేట్‌ మీడియా ప్రచారం చేసింది. అస్సాంలో 59 శాతం ఓట్లు వచ్చాయని రామ్‌ మాదవ్‌ ప్రకటించారు. కానీ వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓట్లు శాతానికి పూర్తిగా విరుద్దంగా ఉంది. అస్సాంలో కాంగ్రెస్‌ కంటే బిజెపి ఓట్లు శాతం తక్కువ ఉంది. ఇట్లాంటి తప్పుడు ప్రచారాలతో పబ్బం గడుపు కుంటున్నారు. బిజెపి నేతల మాటలనే, మన మీడియా తెలుగు పత్రికలు కొన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఫలితాలను విశ్లేషించకుండానే, వారి మాటలనే ప్రచారం చేశాయి. కమ్యూనిస్టులపై మరోమారు తమ అక్కుసన వెల్లగక్కాయి. కమ్యూనిస్టుల కోటల్లో బిజెపి పాగ వేసిందని మరోమారు తెలుగు నాట బడా మీడియా పెద్ద పెద్ద కథనాలను పేర్కొంది. కేరళ, బెంగాల్‌లో బిజెపికి నాలుగు స్థానాలు వచ్చాయి. కేరళలో మొదటిసారి ఒక స్థానాన్ని గెలిచింది. బెంగాల్‌ గతంలోనే ఒక స్థానం ఉండేది, దానికి రెండు స్థానాలు కలిశాయి. ఈ రెండు రాష్ట్రాల్లోి అన్ని స్థానాల్లో పోటీ చేసినా బిజెపి, తన ఓట్లు శాతం నిలబెట్టుకోలేపోయింది. రెండేళ్లలోనే బారిగా ఓట్లను పోగొట్టుకుంది. ఇక్కడ అధికార పార్టీలతో బిజెపి కుమ్మక్కైయింది. తమిళనాడు, పుదిచ్చేరిల్లో ఖాతానే తెరలేకపోయింది. ఓట్ల శాతం తగ్గింది. ఈ ఎన్నికల్లో మొత్తం మీద బిజెపీ ఓటింగ్‌ శాతం తగ్గిందని స్పష్టమైయింది. మోడీ కరిష్మాతో గెలిచిన బిజెపి అనతి కాలంలోనే వెనుకబాట పడుతోంది. మోడీ కరిష్మాకు కాలం చెల్లింది. ఎన్నికల ఫలితాలను లోతుల్లో విశ్లేషిస్తే బిజెపి గెలించిందా...ఓడిందా అనే అంశం వెల్లడవుతుంది.
''మలయాళీ'' లెప్ట్‌ చారిత్రకం...నెంబర్‌ వన్‌లో బిజెపి
కేరళలో ఒకపక్క బిజెపి వెనక నుంచి నెంబర్‌ వన్‌గా నిలవగా, అత్యదిక మెజార్టీతో లెప్ట్‌ అండ్‌ డ్రమోక్రటిక్‌ ఫ్రంట్‌(ఎల్‌డిఎఫ్‌) ఘన విజయం సాధించింది. అంతే కాక చారిత్రక గెలుపును సొంతం చేసుకుంది. కేరళ చరిత్రలో కన్నూర్‌, తనూర్‌ నియోజక వర్గాల్లో తొలిసారిగా సిపిఎం గెలిచింది. ఇది కన్నూర్‌ జిల్లాలోనే అత్యంత చర్చనీయాంశంగా మారింది. తొలి నుంచి కేరళలో ఎల్‌డిఎఫ్‌ గెలుస్తుందని పలు విశ్లేషణలు తెలిపినప్పటికీ, ఇంత భారీ స్థాయిల్లో గెలుస్తుందని ఏవ్వరూ ఊహించ లేదు. స్వయానా కాంగ్రెస్‌ నేతలే ఈ ఫలితాల పట్ల అవాక్కైయ్యారు. కాంగ్రెస్‌ ఎంపి, సీనియర్‌ నేత శశిథరూర్‌ కూడా ఇప్పటికైన కాంగ్రెస్‌ వాస్తవాలను తెలుసుకోవాలని వ్యాఖ్యచేశారు. బిజెపి విషయానికి వస్తే...ఒకే ఒక్క స్థానం గెలిచింది. కానీ గతం కంటే బిజెపి ఓట్లు శాతం తగ్గాయి. కేరళలో 140 స్థానాలు ఉంటే, బిజెపి దాదాపు 130 స్థానాల్లో పోటీ చేసింది.దాని ఓట్లు గత లోక్‌సభ ఎన్నికల కంటే తగ్గాయి. గెలిచిన ఒక్క స్థానం కూడా కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడిఎఫ్‌ సహకారంతోనే గెలిచిందని ఆధారాలు స్పష్టంచేస్తు నెమామ్‌ నియోజక వర్గంలో బిజెపి అభ్యర్థి ఓ.రాజగోపాల్‌ గెలిశారు. అయితే ఇక్కడ ఎల్‌డిఎఫ్‌ ఓట్లు మాత్రం చెక్కు చెదర లేదు. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ప్రస్తుత ఎన్నికల్లో కూడా వచ్చాయి. కానీ కాంగ్రెస్‌ ఓట్లు పూర్తిగా బిజెపికి మళ్లాయి. 2006లో ఎల్‌డిఎఫ్‌కి 50,235 ఓట్లు, యుడిఎఫ్‌కి 60,884 ఓట్లు, బిజెపికి కేవలం 6,705 ఓట్లు వచ్చాయి. 2011లో ఎల్‌డిఎఫ్‌కి 50,076 ఓట్లు, యుడిఎఫ్‌కి 20,248 ఓట్లు, బిజెపికి 43,661 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లోనే బిజెపి పుంజుకుందని చెబుతున్నారు. బిజెపికి కాంగ్రెస్‌ సహకారం అనేది ఇక్కడ ప్రారంభమైయింది. అప్పటి నుంచి కొనసాగించింది. ప్రస్తుత ఎన్నికల్లో మరీ దిగజారింది. ఎల్‌డిఎఫ్‌కి 59,142 ఓట్లు, యుడిఎఫ్‌కి 13,860 ఓట్లు, బిజెపికి 67,813 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ దిజారుడు రాజకీయంలో, చివరికి కాంగ్రెస్‌ మునిగిపోయింది. లేకపోతే ఒక్క సీటు కూడా బిజెపికి రాకపోయేది. బిజెపి ఈ ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కంటే తగ్గాయి. 2014లో 10.33 శాతం ఓట్లు వస్తే, 2016లో 10.05 శాతం వచ్చాయి. కాంగ్రెస్‌కు గతంలో 31.10 వస్తే, ప్రస్తుతం 23.7 శాతం ఓట్లు వచ్చాయి. అంటే గతం కంటే కాంగ్రెస్‌, బిజెపిలకు ఓట్లు తగ్గాయి. సిపిఎంకి గతంలో 21.60శాతం వస్తే, ప్రస్తుతం 26.5శాతం వచ్చాయి. సిపిఐకి గతంలో 7.60 శాతం వస్తే, ఇప్పుడు 8.1శాతం వచ్చాయి. అంటే సిపిఎం, సిపిఐ ఓట్లు శాతం పెరిగింది. కానీ బిజెపి, కాంగ్రెస్‌ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తే, సిపిఎం గతం కంటే తక్కువ స్థానాల్లో పోటీ చేసింది.
బెంగాల్‌ల్లో పోగొట్టుకున్న కమలం
బెంగాల్‌ మమత బెనార్జీ రెండో సారి అధికారాన్ని చేపట్టింది. లెప్ట్‌-కాంగ్రెస్‌ కూటమికి గతం కంటే స్థానాలు పెరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో బిజెపి తన ఓట్లును పోగొట్టుకున్నది. బెంగాల్‌ లోని 294 నియోజకవర్గాల్లో బిజెపి, టిఎంసి దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేశాయి. సిపిఎం గతం కంటే చాలా తక్కువ స్థానాల్లో అంటే, దాదాపు 180స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్‌ గతం కంటే ఎక్కువ స్థానాల్లో అంటే, దాదాపు 92 స్థానాల్లో పోటీ చేసింది. ఈ నేపథ్యంలో సిపిఎం ఓటింగ్‌ తగ్గింది. కాంగ్రెస్‌, టిఎంసి, బిజెపి ఓట్లు పెరిగాయి. కాంగ్రెస్‌, టిఎంసి ఓట్లు కాస్తా పెరిగినా, బిజెపి ఓట్లు మాత్రం గతం కంటే తగ్గాయి. బెంగాల్‌లో తృణమూల్‌కి 2014లో 39.80శాతం ఓట్లు రాగా, ప్రస్తుతం 44.09శాతం వచ్చాయి. అంటే దాదాపు 4శాతం పెరిగాయి. కాంగ్రెస్‌కు గతంలో 9.70శాతం వస్తే, ప్రస్తుతం 12.3శాతం వాచ్చాయి. అంటే దాదాపుగా మూడు శాతం ఓట్లు పెరిగాయి. కానీ బిజెపికి గతంలో 18శాతం ఓట్లు వస్తే, ప్రస్తుతం 10.02శాతానికి పడిపోయింది. దాదాపుగా 8శాతం ఓట్లు తగ్గాయి. సిపిఎంకు గతంలో 23 శాతం వస్తే, ప్రస్తుతం19.70శాతం వచ్చాయి. గతం కంటే దాదాపుగా మూడు శాతం కోల్పొయింది. 2014 ఎన్నికల్లో బిజెపికి రెండు సీట్లు వచ్చాయి.
అస్సాంలో గెలిచింది...తగ్గింది
అస్సాంలో బిజెపి తొలిసారిగా గెలిచింది. ఈ గెలుపుతో ఈశాన్య రాష్ట్రాల్లోకి కూడా బిజెపి ప్రవేశింది. 126 నియోజకవర్గాలు ఉన్న అస్సాలో బిజెపికి 60స్థానాలు వచ్చాయి. పూర్తి మెజార్టీ లేకపోయినా, తన కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కానీ బిజెపి గత 2014 ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఓట్లను కోల్పొయింది. కాంగ్రెస్‌ ఓటమిని చవిచూసినా, తన ఓట్లును మాత్రం పెంచుకుంది. 2014లో బిజెపికి 36.50 శాతం ఓట్లు వస్తే, ప్రస్తుతం 29.05శాతానికి పడిపోయింది. దాదాపు 7శాతం ఓట్లును కోల్పొయింది. కాంగ్రెస్‌కు 29.60శాతం గతంలో వస్తే, ప్రస్తుతం 31శాతం ఓట్లు వచ్చాయి. రెండు శాతం ఓట్లు పెరిగాయి.
తమిళినాట ఓట్లు గల్లంతు
తమిళనాడులో జయలలిత గెలిచింది. గతం కంటే సీట్లు తగ్గినా అధికారం కాపాడుకుంది. గతంలో 150 సీట్లు వచ్చిన అన్నాడిఎంకెకి, ఈ సారి 134కి తగ్గాయి. డిఎంకె సీట్లు 23 నుంచి, 89కి పెరిగాయి. బిజెపి మాత్రం ఖాతా తెరవ లేకపోయింది. 2014 ఎన్నికల్లో కన్యకూమారి ఎంపి స్థానాన్ని గెలిచిన బిజెపి, ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది. అలాగే తన ఓట్లును కూడా కాపాడులేకపోయింది. 2014 ఎన్నికల్లో బిజెపికి 5.50శాతం ఓట్లు రాగా, ప్రస్తుతం 2.08శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బిజెపి దాదాపుగా 3శాతం ఓట్లను కోల్పొయింది. అన్నాడిఎంకెకి గతంలో 44.30శాతం వస్తే, ప్రస్తుతం 40.08శాతం వచ్చాయి. దాదాపుగా 4శాతం ఓట్లు తగ్గాయి. డిఎంకెకి గతంలో 23.60శాతం వస్తే, ప్రస్తుతం 31.06శాతానికి పెరిగాయి.
ఖాతా లేని పుదిచ్చేరి
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదిచ్చేరిలో 30 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ 15 స్థానాలను గెలుచుకొని, ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకుంది. అంతే కాకుండా తన ఓట్లు శాతాన్ని కూడా పెంచుకుంది. 2014లో కాంగ్రెస్‌కు 26.03శాతం ఓట్లు రాగా, ప్రస్తుతం 30.06శాతానికి పెంచుకుంది. బిజెపికి కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఒక్క సీటు కూడా గెలవ లేకపోయింది. కానీ సిపిఎం మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి గెలిపొందారు. తొలిసారిగా సిపిఎం పుదిచ్చేరిలో అడుగుపెట్టింది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌-బిజెపి
ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌, బిజెపి చెరో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నాయి. కానీ సీట్లు, ఓట్లు విషయంలో కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. మొత్తం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్‌ 125 స్థానాలు గెలుచుకోగా, బిజెపి కేవలం 64 స్థానాల్లో గెలిచింది. కాగ్రెస్‌ అన్ని రాష్ట్రాల్లో కూడా తమ ఖాతాలను ఏర్పాటు చేసుకుంది. బిజెపి రెండు రాష్ట్రాల్లో అసలు ఖాతాలే తెరవలేకపోయింది.
వాస్తవం ఇది కదా కాషాయ ప్రచార యంత్రాంగం బిజెపి ఓట్లు,సీట్లు పెరిగినట్లు ప్రచారం చేయడం కార్పోరేట్‌ మీడియా దీన్ని తలకెత్తుకోవడం ప్రజలను వంచించే చర్య మాత్రమే.
- జె.జగదీశ్‌

No comments:

Post a Comment