Sunday, 1 May 2016

|| ఈ పోరాటం ఆగేది కాదు ||

               అరుణపతాకం ఎగిరింది/ కార్మికలోకం గెలిచింది/ మానవులంతా ఒకటని చాటే మరో ప్రపంచం పిలిచింది.... శ్రీశ్రీ రాసిన ఈ పాట మేడే నాడు వాడవాడలా ప్రతిధ్వనిస్తుంది. కాని సందేహాలు లేవనెత్తేవారూ వుంటారు. ఇంకెక్కడ కార్మిక వర్గం? ఇంకా ఎక్కడ పోరాటాలు? అసలు కార్మికులెక్కడున్నారు, అంతా మధ్యతరగతి ఉద్యోగులే కదా.. ఉనికి కోసం ఉద్యమాలు తప్ప నిజంగా ఉత్తేజం ఎక్కడుంది? కుగ్రామంగా మారిపోయిన ప్రపంచంలో పెట్టుబడులే ప్రవహిస్తున్నాయి గాని ఇంకా కార్మికవర్గ అంతర్జాతీయత వంటి మాటలకు విలువెక్కడుంది?
చరిత్ర గొప్పతనం ఏమంటే తనే సవాళ్లను తీసుకొస్తుంది.. తనే సమాధానాలూ సమకూరుస్తుంది. సమాజ గర్భంలో ఒక సమస్య ఉత్పన్నమైందంటే దానికి పరిష్కారం కూడా అక్కడే వుంటుందన్నది ప్రసిద్ధమైన మార్క్స్‌ మాట. నిజంగానే కార్మికుల గురించి కార్మిక పోరాటాల గురించి సందేహాలు లేవనెత్తేవారికి బెంగుళూరు వస్త్ర శ్రామికలు అందులోనూ మహిళలు సృష్టించిన కొత్తచరిత్రే సమాధానాలిచ్చింది. అరకొర వేతనాలతో అహొరాత్రాలు శ్రమించి దాచుకున్న పిఎఫ్‌ మొత్తాలను దిగ్గోసి తద్వారా వారి జీవితాలను కూడా దెబ్బతీయాలనుకున్న కేంద్ర సర్కారు దిగివచ్చి తన నిర్ణయం ఉపసంహరించుకున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. అయినా తర్వాత మరోసారి పిఎఫ్‌ వడ్డీరేటను కోతకోయాలని ప్రయత్నించి మళ్లీ చేతులు కాల్చుకున్నారు. యాభై రోజులలో మూడోసారి ప్రభుత్వం కార్మికవర్గ ఆందోళనల కారణంగా వారి రిటైర్‌మెంట్‌ సదుపాయాలపై దాడిని విరమించుకోవలసి వచ్చిందని మీడియా మొత్తం నివేదించింది.
ఇదంతా ఏదో సమాచార లోపం(కమ్యూనికేషన్‌ గ్యాప్‌) అని కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ సమర్థించుకోవడానికి తంటాలు పడ్డారు. కాని ఇది ప్రభుత్వ దృష్టికోణాన్ని వెల్లడించే సందర్భం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏదో విధంగా కార్మికుల హక్కులపై దాడి చేయడం, సదుపాయలను జీత భత్యాలను కోత కోయడం అన్నిటికన్నా వారి ఉద్యోగ భద్రతను భగం చేసి లోబర్చుకోవడం ప్రభుత్వ వ్యూహంగా వుంది.కార్మిక ఉద్యోగ సంఘాలు దేశ వ్యాపితసమ్మెలు పోరాటాలు చేసినా జ్ఞానోదయం కాకపోగా వక్రమార్గాల్లో దాడికి పాల్పడుతున్నది. తన విధానాలను ఖచ్చితంగా నికరంగా ఎదిరించగలిగిన శక్తి సమరశీలత కార్మిక ఉద్యోగ వర్గాలకే వుందని తెలుసుగనకే దానికా ప్రత్యేకమైన కక్ష. కార్పొరేట్లను సంతృప్తిపర్చడం కోసం కార్మికులపై వేటు వేయడానికది సిద్ధమవుతుంది. సిఐఐ,ఎప్‌ఐసిసిఐ,అసోచెమ్‌ వంటి యాజమాన్య పెట్టుబడిదారీ వేదికల ఒత్తిళ్లకు తలవొగ్గి వాటినుంచి ి వచ్చిన సూచనలను మక్కీకి మక్కీగా అమలు చేస్తున్నది. కాని పైకి మాత్రం శ్రమయేవజయతే,శ్రమ యోగి, దేశ నిర్మాత లాటి కితాబులతో మురిపిస్తున్నది.
స్వభావ సిద్దంగానే కార్మిక హక్కులు రుచించని బిజెపి కేంద్రంలో మళ్లీ రాకముందు రాజస్థాన్‌లో వాటిపై దాడి ప్రారంభించి తర్వాత దేశమంతటికీ విస్తరింపచేసింది.1948 ఫ్యాక్టరీల చట్టం సెక్షన్‌ 59 ప్రకారం కార్మికులతో రోజుకు ఎనిమిది గంటలు, వారానికి 48 గంటలు మాత్రమే పనిచేయించాలి.ఆ సమయం దాటితే ఓవర్‌ టైమ్‌ చెల్లించాలి. సెక్షన్‌ 52 ప్రకారం వీక్లీ ఆఫ్‌ ఆదివారం లేదా మరేదైనా ఒకరోజు సెలవు ఇవ్వాలి. ఆ రోజు పనిచేయించేట్టయితే కాంపెన్సేటరీ ఆప్‌ కింద మరోరోజు సర్దుబాటు చేయాలి. సెక్షన్‌ 66 ప్రకారం మహిళలతో ఉదయం ఆరుగంటల నుంచి సాయింత్రం ఏడుగంటల మధ్య మాత్రమే పనిచేయించాలి తప్ప రాత్రి వేళ డ్యూటీలు వుండకూడదు. పిల్లలతోనైతే చట్టం పరిధిలో రోజుకు నాలుగున్నర గంటలే పనిచేయించాలి.
కాని పెట్టుబడులను ఆకర్షించాలంటే కఠినమైన ఈ కార్మికచట్టాలు ఆటంకంగా వున్నాయంటూ మోడీ ప్రభుత్వం వాటికి ఎసరు పెట్టింది.. 50 మందికి లోపు పనిచేసే సంస్థలు ఫ్యాక్టరీ చట్టాల కిందకు రావనీ, అక్కడ సాధారణ నిబంధనలతో నిమిత్తం లేకుండా కాంట్రాక్టు పద్ధతులలో పనిచేయించుకోవచ్చని అనుమతినిచ్చారు. 100మందికి పైన వున్న సంస్థలకు వర్తించే నిబంధనల పరిమితిని 300 మందికి పెంచి వారు కావాలనుకుంటే ఎప్పుడైనా ముందుగా తెలియజేయకుండానే కార్మికులను తొలగించవచ్చునని అవకాశమిస్తూ పారిశ్రామిక వివాదాల చట్టాన్ని సవరించారు. ఇది ఐఎల్‌వో 144కు విరుద్ధం.. శ్రమ సువిధ అంటూ ఒక వెబ్‌ పోర్టల్‌ తెరిచి 14 కార్మిక చట్టాల అమలుపై యాజమాన్యాలు దాంట్లో స్వచ్చందంగా ప్రకటన చేస్తే చాలునని వారికే పెత్తనమిచ్చింది. ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్ల తనిఖీలు జరిగిన రోజునే పరిస్థితి అధ్వాన్నంగా వుంటే ఇప్పుడు వెళ్లనవసరం లేకుండా మొక్కుబడి తనిఖీలు చాలునని కుదించివేసింది.ఇలా 90 శాతం మంది కార్మికులకు ఎలాటి భద్రతా నిబంధనలు లేకుండా చేసింది.అధికారిక లేబర్‌ కాన్ఫరెన్సులు కనీస వేతనం 20 వేలు వుండాలని సిఫార్సు చేయగా కార్మిక సంఘాలు కనీసం 15,000 వరకూ ఇవ్వాలని కోరాయి. కాని ప్రభుత్వం కనీస వేతనం 7,100 మాత్రమే నిర్ణయించి అది కూడా యాజమాన్యాల శక్తిపై ఆధారపడిచేయాలని గండిపెట్టింది.
అసలు మొత్తంగానే సంఘటిత రంగాన్ని దెబ్బతీసి ఏ నిబంధనలు వర్తించని రీతిలో కాంట్రాక్టులు ఔట్‌సోర్సులు పెంచుతున్న స్థితి.ఎపి లో వివిధ రకాల కేంద్ర రాష్ట్ర సంస్థల్లో మొత్తం 60 వేలమంది కాంట్రాక్టు, 2,50,000 మంది ఔట్‌సోర్సింగు పద్దతులలో పనిచేస్తున్నారు. కాని శాసనసభలో మాత్రం కాంట్రాక్టు ఉద్యోగులు పదివేలలోపు, ఔట్‌సోర్సింగ్‌ వారు యాభై వేలు వున్నట్టు తప్పు లెక్కలు ఇచ్చారు. నిబంధనలతో పోలిస్తే వీరికి నాలుగో వంతు జీతం కూడా దక్కదు. అది కూడా నెలల తరబడి బకాయిపెడుతుంటారు.వలంటీర్లు అనీ, కార్యకర్తలు సహాయకులు అని రకరకాల పేర్లు తగిలించి పని మాత్రం రెట్టింపు చేయించుకుంటారు. ఎపిలోనైతే మునిసిపల్‌ కార్మికుల ఉపాదికి ఎసరుపెట్టే జీవో 279 తెచ్చారు. ఆయుష్‌లోనూ ఔట్‌సోర్సింగుల ఉద్వాసనకు రంగం సిద్దం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్‌ చేస్తానని చెప్పినా చాలా విభాగాల్లో అమల్లోకి రాలేదు. ఔట్‌ సోర్సింగులు, ఆశాల వంటి వారి విషయంలో అసలే బాధ్యత తీసుకోవడం లేదు. అక్కడా ఇక్కడా కూడా మూత పడిన సంస్థలను తెరిపించే పరిస్తితే లేదు. ఇవన్నీ కలసి విపరీతమైన ఒత్తిడికి దోపిడీకి దారితీస్తున్నాయి. కార్మికులు ఉద్యోగులు పోరాటాలు చేస్తే తీవ్రంగా లాఠీలతో విరుచుకుపడుతున్నారు. అరెస్టులు చేస్తున్నారు.
బెంగుళూరునే తీసుకుంటే దాన్ని ప్రపంచ జౌళి రాజధాని అంటున్నారు. కర్ణాటక,పొరుగున వున్న అనంతపురం జిల్లాల నుంచి భారీ ఎత్తున మహిళలు యువతులు వచ్చి అక్కడ పనిచేస్తారు. వారి పని భారం ఎక్కువగానూ ప్రతిఫలం తక్కువగానూ వుంటాయి.అలాటివారికి ఈ పిఎప్‌ కోత వార్త అశనిపాతమై పోరాటంలోకి దిగారే తప్ప ముందుగా అనుకున్నదో ప్రణాళిక ప్రకారం జరిగిందో కాదు. ఈ సమయంలో విశాఖలోని బ్రాండిక్స్‌లోనూ , అనంతపురం జిల్లా పరిగిలోని రామావతార్‌ మసాలా ఫ్యాక్టరీలోనూ తీవ్ర పోరాటాలు సాగుతున్నాయి. దేశ రాజధాని సమీపంలోని గురగావ్‌లో మారుతి సుజుకి నుంచి పాండిచ్చేరిలో స్పార్టెక్‌ వరకూ ఎంత తీవ్ర ఘర్షణలు ఘటనలు జరిగాయో చూశాం. కనుక కార్మికుల పరిస్థితులు మారాయని పోరాటాలు తగ్గాయని ఎవరైనా అనుకుంటే పొరబాటే.
సాంకేతికాభివృద్ధి వల్ల, ప్రపంచీకరణ యుగంలో ఉత్పత్తి వికేంద్రీకరించి ఒకో దేశంలో ఒక ముక్క తయారు చేయడం వల్ల పోరాటాల స్వభావంలోనూ ప్రభావంలోనూ మార్పు వచ్చి వుండొచ్చు. కాని కంప్యూటర్‌ మేధాశ్రామికులతో పడగ్గదుల్లో కూడా ఆన్‌లైన్‌లో పనిచేయించడం తెలిసిందే. కనకనే దీనివల్ల మరోవిధంగా చూస్తే ఆ కారణంగానే అంతర్జాతీయత కూడా పెరుగుతుంది. ఆసియా యూరప్‌ లాటిన్‌ అమెరికాలలో ఈ సత్యం నిరూపితమవుతున్నది. అటు పోరాటాలలోనూ ఇటు ఎన్నికలలోనూ కూడా ప్రత్యామ్నాయ శక్తులు నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాయి. 'కారల్‌ మార్క్స్‌ ప్రతీకారం' పేరిట టైమ్స్‌ ఇచ్చిన కథనమే దీనికి ఉదాహరణ. కారల్‌ మార్క్స్‌ భూస్థాపితమై పోయాడని, మార్క్స్‌ నిర్వచించిన వర్గపోరాటం స్వేచ్చా వాణిజ్యం స్వేచ్చా సంస్థల సౌభాగ్య యుగంలో మటుమాయమైపోయిందని అనుకోవడం పొరబాటని అది ముఖపత్ర కథనం (2013 మార్చి25) ఇచ్చింది. ప్రపంచీకరణ విస్తార శక్తి, సరిహద్దులు లేని ఉత్పత్తి ప్రక్రియలతో బంధించేసి అందరికీ సంపదలు సంక్షేమం పంచిపెడుతున్నట్టే భావిస్తుంటే అంతా తలకిందులై పోయిందని వ్యాఖ్యానించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుదీర్ఘ సంక్షోభం,కార్మికులు ఉద్యోగాలు వూడిపోయి అప్పుల్లో అరకొర ఆదాయాల్లో చిక్కుకుపోవడం చూస్తుంటే పెట్టుబడిదారీ విధానాన్ని చీల్చిచెండాడిన మార్క్స్‌ నిశిత విమర్శను ఈ వ్యవస్థ అన్యాయమైందనీ, స్వీయ వినాశకమనీ ఆయన చెప్పిన మాటను కొట్టేయడానికి లేదని పేర్కొన్నది.
అయితే వెనిజులా అద్యక్షుడు హ్యూగో చావేజ్‌ మరణానంతరం ఈ పరిణామ క్రమాన్ని తిరగదోడే కుట్రలు కూడా తీవ్ర స్థాయిలోనే జరుగుతున్నాయి. వాటితోపాటే ఈ పరిధిలోనే రష్యా చైనా వంటి దేశాలు నిలదొక్కుకోవడం కూడా కనిపిస్తుంది. వలసల కారణంగా దోపిడీ పీడనలు అధికమై వైరుధ్యాలు కూడా పెరుగుతున్నాయి గనక ఘర్షణ తీవ్రమవుతుందేగాని చల్లబడేది కాదు. ఆరు దశాబ్దాల తర్వాత అమెరికా అద్యక్షుడు ఒబామా క్యూబాను సందర్శించడం ఇందుకో నిదర్శనం. అంతమాత్రానే మన పాలకులలా పరవశించిపోకుండా లొంగుబాటుకు సిద్ధపడకుండా నీ నీతులు మాకక్కర్లేదని చెప్పగలిగిన ఆ దేశ స్థయిర్యం కూడా గర్వకారణమే. తొంభై పదుల కాస్ట్రో ఆఖరిసారి క్యూబా కమ్యూనిస్టుపార్టీ మహాసభలో పాల్గొని సందేశమివ్వడం సామ్యవాద ఆశయాలకో అరుణాంజలి వంటిదే. ఇన్ని దశాబ్దాలుగా ఆయనను అంతమొందించడానికి శారీరక పరిష్కారం సాధించడానికి అమెరికా ఎన్ని పాచికలు వేసినా ప్రయత్నాలు చేసినా అన్ని విఫలమై ఆయన అజేయంగా నిలవడాన్ని గార్డియన్‌ పత్రిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. మహాసభకు స్వయంగా హాజరైన కాస్ట్రో ఆఖరి సందేశంలో (క్యూబా)కమ్యూనిస్టులు మానవ గౌరవం కోసం విముక్తికోసం జరిపిన పోరాటం సాధించిన విజయాలు చరిత్రలో నిలిచి వుంటాయని దృఢవిశ్వాసంతో చెప్పడం గొప్ప ఉత్తేజం. చికాగోలే మేడే అమరవీరుల సమరం నుంచి మన కాలపు మహామేరువుగా నిలిచిన కాస్ట్రో సందేశం వరకూ ఇచ్చే సందేశం ఒక్కటే- పోరాడితే పోయేదేమీ లేదు సంకెళ్లు తప్ప. ఆ పోరాటం ఆగేది కాదు! - తెలకపల్లి రవి

No comments:

Post a Comment