Monday, 2 May 2016

తాత్త్విక ఆయుధాలతోనే హిందూత్వపై పోరాటం

Posted On Sun 01 May 22:55:50.096917 2016
భారత ఉపఖండం ఐదు వేల సంతవ్సరాల చారిత్ర క ఆధారాలున్న దేశం. గుప్తుల కాలం వరకూ 'హిందు' అనే శబ్దమే భారతదేశంలో లేదు. వేదాలు, ఉపనిషత్తులు, దర్శ నాలు, అరణ్యకలు, బ్రాహ్మణా లు, కావ్యాల్లో ఎక్కడా హిందూ శబ్దం లేదు. సింధూ శబ్దాన్ని పారశీకులు పలకటం రాక 'హిందూ'గా పలికారని అంబేద్కర్‌ చెప్పారు. భారతదేశానికి ఆర్యులు వలస వచ్చిన తర్వాత దేశం మీద భౌతిక దాడే కాక సాంస్కృతిక, సాంఘిక, ఆర్థిక, రాజకీయ దాడులు అనేక పార్శాల నుంచి చేశారు. ఈనాటికీ దేశంలో బౌద్ధులు, జైనులు, సిక్కులు, జొరాష్ట్రి యన్లు, మార్క్సిస్టులు, అంబేద్కర్‌ వాదులు, అనేక తాత్త్విక, సామాజిక సమూహాలు హిందువులు కాదు. హిందూ మతం భారతదేశ ఆధిపత్యంలో ఉందనుకోవడం ఒక భ్రమ. నిజానికి భారతదేశంలో వచ్చిన తత్వశాస్త్రాలన్నీ నిరీశ్వరమైనవే. చార్వాక, జైన, బౌద్ధ, సాంఖ్య, యోగ, వైశేషిక, న్యాయ దర్శనాలన్నీ మొదట నిరీశ్వరమైనవే. తర్వాత ఈశ్వరమయం చేశారు. చార్వాకులు భారతదేశంలో మొదటి తాత్వికోద్యమ నిర్మాతలు. సామాజిక దోపిడీకి ఎదురు తిరిగి గుండెలిచ్చిన వారు. బానిస తిరుగుబాటు ఉద్యమ నిర్వాహకులు. భారత దేశంలో నిజాయితీగా ప్రశ్నించడాన్ని, అన్యాయాన్ని ఎదిరించ డాన్ని, సామాజిక దోపిడీని ఎదుర్కొనడాన్ని మొట్టమొదటగా నేర్పిన విజ్ఞానులు. అందుకే భారతదేశంలో ఏ తాత్త్విక పునాదుల మీద దోపిడీ వ్యవస్థకు నిర్మాణం జరిగిందో, దాన్ని మొదటగా ఎదిరించిన తాత్వికోద్యమాలేవో తెలుసుకొని ఆ మార్గంలో ఆ పునాదులను కదిలించాలి. అందుకే ఏ వ్యవస్థనైనా నిర్మూలించాలన్నా, అభివృద్ధి చేయాలన్నా, దాని మూలాలలోకి పోవడం ఎంతైనా అవసరం. ఈ దేశంలో సామాజిక విప్లవం ఆవశ్యకతను గుర్తించనివారు ఎందరో ఉన్నారు. ఏ సాంస్కృతిక విప్లవాల ద్వారా చార్వాకాన్ని చంపడానికి ప్రయత్నించారో ఆ సాంస్కృతిక విప్లవం ద్వారానే దానికి జీవం పోయాలి. కృష్ణ మిశ్రుడు 'ప్రబోధ చంద్రోదయం' నాటకంలో నాస్తికవాదానికి చావు దెబ్బ కొట్టడానికి ప్రయత్నించాడు. క్రోధ, లోభ, మోహ, దంభములే నాస్తికత్వంగా వివేక, విద్యా విజ్ఞానాలే ఆస్తికత్వంగా తేల్చివేశాడు. దీనికి ప్రత్యామ్నాయంగా బౌద్ధం హిందూ మతంలో ఉండే కామ మోహితమైన అంశాలను బయటకు తెచ్చింది. జ్ఞాన బోధని ప్రచురింపచేసింది. ఈనాటి మార్క్సిస్టులకు, అంబేద్కర్‌వాదులకు చార్వాక, బౌద్ధ దర్శనాల అధ్యయనం తప్పక చారిత్రక అవసరం. లేకుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్ళను ఎదుర్కొని నిలబడలేం. నిజానికి ఆంధ్ర దేశంలో నేడున్న శైౖవారామాలన్నీ ఒకనాటి బౌద్ధారామాలే. బౌద్ధుల తలలు తెంచి వీరు ఈ ఆరామాలను సృష్టించారు. అందుకే డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ బౌద్ధ సంస్కృతీ పునరుజ్జీవ నోద్యమాన్ని ప్రారంభించటమే కాక జీవన విధానంలో సమతా మార్గాన్ని రూపొందించారు. ఈనాడు విశ్వవిద్యా లయాల్లో దళితుల చదువు గురించి జరుగుతున్న ఈర్ష్యకు వెనుక మనుస్మృతి భావజాలం ఉంది. ''అధ్యాపనం చాధ్యయనం యజనం యజనం తథా దాన ప్రతి గ్రహంచైవ బ్రాహ్మణ నామ కల్పయత్‌'' (వేదములను, శాస్త్రములను చెప్పుట, తాము చదువుట, యజ్ఞములు చేయుట, దానము గ్రహించుట ఈ ఆరు కర్మలను బ్రాహ్మణు నికి ఏర్పరిచారు). బ్రాహ్మణులు ఈ అభిప్రాయంతో 'చదువుకు మేమే అర్హులం. వేరే వాళ్ళు చదవటానికి వీల్లేదు' అనే ద్వేషాన్ని ఆనాటికీ, ఈనాటికీ పేర్చుకున్నారు. నిజానికి వీరు రూపొందించిన దేవుడు వల్లే ఈ వర్ణవాదం వచ్చింది. అందుకే జైనులు దేవుడు లేడని నిరూపించారు. నాటి ఈశ్వరవాదంతో పోరాడి గెలిచారు. జైనులు తమ తర్కం ద్వారా దేవుడు లేడని నిరూపించి భారతీయ తత్త్త్వశాస్త్ర ప్రమాణాలను పెంచారు. ''తర్కరహస్య దీపిక'' రాసిన గుణరత్నుడు ''షడ్దర్శన సముచ్ఛయం'' రాసిన హరిభద్రుడు ఈ విషయాన్ని స్పష్టంగా నిరూపించారు. హరిభద్రుడు క్రీస్తుశకం 8వ శతాబ్దానికి, గుణరత్నుడు క్రీస్తుశకం 15వ శతాబ్దానికి చెందినవారు. గుణరత్నుడు దైవ భావాన్ని ఖండిస్తూ, వాదిస్తూ దైవభావాన్ని సమర్థించిన న్యాయ వైశేషిక దర్శనాలను తీవ్రంగా ఖండించాడు. జైనులు భారత నాస్తికవాదానికి పట్టుగొమ్మలుగా నిలిచాయి. జైనుల ''వీతరాగస్తుతి''లో వారి సిద్ధాంతానికి సంబంధించిన ఒక వాదాన్ని మాధవాచార్యుడు సర్వదర్శన సంగ్రహంలో ఇలా వ్యాఖ్యానించారు. 'ఈశ్వరుడు త్రిలోక నిర్మాత' అనే వాదాన్ని, అభూత కల్పనను జైనులు తమ తర్కంతో ఎద్దేవా చేశారు. నిజానికి న్యాయ వైశేషిక దర్శనాలు కూడా మొదట నిరీశ్వరమైనవి. న్యాయదర్శన కర్త గౌతముడు క్రీస్తుపూర్వం 300 సంవత్సరాల నాడు ఈ దర్శనం రాసినట్టు చెప్పు కుంటారు. న్యాయదర్శనానికి క్రీస్తుశకం 400 సంవత్సరంలో వాత్స్యాయనుడు గొప్ప వ్యాఖ్యానం రాశాడు. తత్వం పునాదిగా ఉన్న వైశేషిక దర్శనాన్ని కణాదుడు అత్యంత ప్రతిభావంతంగా తీర్చిదిద్దారు. ఈ దర్శనాలేవీ మొదట దేవుణ్ణి అంగీకరించ లేదు. దేవుడున్నాడు అనే భావన మనిషిని భావ బానిసత్వం లోకి నెడుతుంది. మార్క్సు, లెనిన్‌, స్టాలిన్‌, మావో, మహాత్మా ఫూలే, అంబేద్కర్‌, పెరియార్‌ వీరెవరూ దేవుణ్ణి అంగీకరించ లేదు. భారతదేశంలో క్రీస్తుపూర్వం నుంచి భౌతికవాదాన్ని చెప్పిన మక్కలి గోశాలుడు, పూర్ణ కాస్యపుడు, ప్రకృత కాత్యాయనుడు, సంజరు వేలట్టిపుత్త వీరందరూ కూడా దేవుని ఉనికిని అనుమానించి భౌతికవాదాన్ని భిన్న దృక్పథాలతో ప్రవచించినవారు. కణాదుడు భారతదేశంలో ప్రసిద్ధి చెందిన దార్శనికుల్లో ఒకరు. ప్రపంచ దార్శనికుల్లో కణాదునికి సముచిత స్థానం ఉంది. కారణం ఆయన స్థాపించిన అణు సిద్ధాంతంలో ఉన్న ప్రసిద్ధి. కణాదుడు ఉలూకుని కుమారుడు. కణాదుడు నేటి అలహాబాద్‌ మండలంలోని ''పభోసా'' అనే (ప్రభాస) గ్రామానికి సంబంధించినవాడు. నేల మీద పడివున్న గింజలను ఏరు కొని తిని బతికేవాడట. అందుచే కణాదుడనే పేరు వచ్చిందని న్యాయకందరీకారుడు వివరించాడు. ''కణాద ఇతితస్య కాపోతం వృత్తి మనుతిష్టతో రధ్యానిపతితాంస్తణాల కణా వాదాయ ప్రత్యహం కృతాహార నిమిత్తా'' అని వివరణ ఇచ్చారు. అణు సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. కావున కణాదునికి ఈ పేరు వచ్చిందని కొందరు వ్యాఖ్యానం చేశారు. కణాదుడు ప్రత్యక్షం, అనుమానము అనే రెండు ప్రమాణాలు మాత్రమే అంగీకరించాడు. శబ్దం, ఉపమానమూ కూడా అనుమానం లోనే అంతర్గతమౌతాయి అన్నాడు. కణాదుడు పదార్థాన్ని ద్రవ, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయం అని ఆరు భాగాలుగా విభజించాడు. తరువాత ద్రవ్యం, పృధివీ, జలం, అగ్ని, తేజస్సు, వాయువు, ఆకాశం, కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు అను తొమ్మిది రకాలుగా విభజించాడు. కర్మపణం, అవక్షేపణం, అంకుచనం, ప్రసారణం, గమనం అని ఐదు రకాలు ఉంటుందన్నాడు. నిరీశ్వరమైన వైశేషిక దర్శనాన్ని హిందూ మతవాదులు తొక్కివేయడం వల్ల భారతదేశానికి ఎంతో నష్టం జరిగింది. పాశ్చాత్య దేశాల్లో పెక్కురు తత్వ వేత్తలు కూడా దేవుడు లేడనే స్పష్టంగా చెప్పారు. రాబర్ట్‌ ఇంగర్సాల్‌ 'ది గాడ్స్‌' అనే పుస్తకంలో దేవుళ్ళ ఉత్పత్తి గురించి శాస్త్రీయంగా, చారిత్రకంగా విశ్లేషించారు. ''దేవుళ్ళ ఉత్పత్తి అసంఖ్యాక నమూనాలలో, వివిధ పద్ధతులలో జరిగింది. కొందరికి వెయ్యి చేతులు, కొందరికి వంద తలలు, కొందరికి సజీవ సర్ప కంఠాభరణాలు, కొందరు గదాధరులు, కొందరు కత్తిడాలు ధరించారు. కొందరికి రెక్కలుండేవి. కొందరు అదృశ్యులు, కొందరు పూర్తిగా గోచరిస్తారు. కొందరు వీపులు మాత్రం కనిపింపజేస్తారు. కొందరు అసూయాగ్రస్తులు, కొందరు మూర్ఖులు, కొందరు మానవాకారులు, కొందరు హంసరూపులు, కొందరు వృషభ రూపులు, కొందరు పక్షిరూపులు, కొందరు సుందరాంగులైన మానవ పుత్రికల వెంటబడ్డారు. చాలామంది వివాహితులు, కొందరు నిత్య బ్రహ్మచారులు, కొందరికి పిల్లలున్నారు. ఆ పిల్లలు మళ్ళీ తండ్రులులాగా దేవుళ్ళయి పూజలందుకున్నారు. ఈ దేవుళ్ళలో చాలామంది ప్రతీకార పరాయణులు, ఆటవికులు, కామాంధులు, అమాయకులు. వాళ్ళ సమాచారం కోసం పూజారులే గతి. కాగా వాళ్ళ అజ్ఞానం మనలో ఆశ్చర్యాన్ని రేకెత్తింపదు'' అని విశ్లేషించారు. దేవుడు లేడనే భావనే భౌతికవాదానికి, గతితార్కిక భౌతికవాదానికీ పునాది. దేవుడున్నాడు అని కొలిచేవాళ్ళు మార్క్సిస్టులు కాలేరు. అంబేద్కర్‌వాదులు కాలేరు. 'మతం మనిషికి మత్తు మందు' అని మార్క్స్‌ అనే వరకే ప్రచారం చేస్తున్నారు. మార్క్స్‌, ఎంగెల్స్‌ దేవుడు లేడని ప్రకటించారు. అందుకే వారు గతితార్కిక భౌతికవాదంలో ప్రపంచ పరిణామం దేవుడి వల్ల కాదు. అది సామాజిక చలన సూత్రాల నుండే అని నిరూపించారు. మార్క్స్‌ రూపొందించిన గతి తార్కిక చారిత్ర క భౌతిక వాద దృక్పథం మానవ సమాజంలోని ప్రధాన వైరుధ్యాన్ని బయటకు తెచ్చింది. తత్త్వశాస్త్రం ఇప్పటి వరకు సమాజాన్ని వ్యాఖ్యానించింది. కానీ మార్క్స్‌ తాత్త్విక సిద్ధాంతం సమాజాన్ని మార్చే శక్తిగా రూపొందింది. ''మానవుని జ్ఞానం అతని మీద ఆధారపడకుండా ఉన్న ప్రకృతి ని ఎలా ప్రతిబింబిస్తుందో, అలాగే మానవుని సామాజిక జ్ఞానం సమాజ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తుందని మార్క్స్‌ సిద్ధాంతీకరించాడు. అందువల్లనే మార్క్స్‌ తత్త్వశాస్త్రం ఆర్థికంగా అణగదొక్కబడుతున్న కార్మిక వర్గానికి శక్తివంత మైన సాధనాలు సమకూర్చింది. నేడు హిందూత్వను ఎదుర్కో వాలంటే భౌతికవాద దృక్పథాన్ని, తత్వశాస్త్ర అవగాహనను, ప్రాచీన భారతీయ తాత్వికుల సిద్ధాంతాలను మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. హిందూ మతం కేవలం మతమే. దానిలో జ్ఞానం లేదు. కర్మకాండ ఉంది. వర్ణ తత్వం ఉంది. కులతత్వం ఉంది. అస్పృశ్యత ఉంది. ప్రతి మార్క్స్‌వాది, అంబేద్కర్‌వాది అంబేద్కర్‌ చెప్పినట్లు నేను 'హిందూ మతంలో పుట్టాను కాని హిందువుగా మరణించను' అని శపథం చేయాలి. మార్క్స్‌ కూడా క్రైస్తవ మతం నుంచి బయటకు వచ్చాకే భౌతికవాది, గతితార్కిక భౌతికవాది కాగలిగాడు. మనం ఇళ్ళల్లో పూజలు చేస్తూ, పెళ్ళిళ్ళకు బ్రాహ్మణుని పిలుస్తూ, కులం పెళ్ళిళ్లు చేసుకుంటూ మార్క్సి జాన్ని, అంబేద్కర్‌ వాదాన్ని ఆచరణలో ప్రతిఫలింపజేయలేం. అంబేద్కర్‌ కూడా బౌద్ధాన్ని మతంగా తీసుకోలేదు. ధర్మంగా స్వీకరించాడు. బౌద్ధంలో గతితర్కం ఉందని చెప్పాడు. మార్క్స్‌ చెప్పిన దోపిడీ నిర్మూలన బౌద్ధంలోని దుఖః నిర్మూలన ఒకటే అని చెప్పాడు. అందుకే హిందూత్వను భౌతిక తాత్విక ఆయుధాలతో ఎదుర్కొందాం. విజయం సాధిద్దాం.
- డాక్టర్‌ కత్తి పద్మారావు

No comments:

Post a Comment