Wednesday, 4 May 2016

|| కక్ష సాధింపు ||

         జెఎన్‌యు విద్యార్థి నేత కన్నయ్యకుమార్‌తో పాటు పలువురు విద్యార్థులపై విశ్వవిద్యాలయ యాజమాన్యం తీసుకున్న కక్ష సాధింపు చర్యలు దుర్మార్గం కాగా, న్యాయస్థానంలో విచారణ సాగుతుండగానే చర్యలకు ఉపక్రమించిన తీరు మరింత దుర్మార్గం. సంఘటన జరిగిందన్న ఆరోపణలు వచ్చిన తరువాత నెలల తరబడి వేచి చూసి సరిగ్గా పరీక్షల సమయంలోకఠిన చర్యలు తీసుకోవడం కక్ష సాధింపులో భాగమే. విద్యార్థులు చదువుల్లో మునిగిపోయి ఉంటారు కాబట్టి ఈ సమయంలో తాము ఏం చేసినా చెల్లుతుందని, ఆందోళనలు ప్రారంభం కావని విశ్వ విద్యాలయ అధికారులు భావించినట్టున్నారు. అయితే, ఈ అంచనాను జెఎన్‌యు విద్యార్థులు తిప్పికొట్టారు. యాజమాన్యం విధించిన పెనాల్టీలు, బహిష్కరణల వంటి శిక్షలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. నేరం చేయలేదు శిక్షల్ని ఒప్పుకునేది లేదంటూ విశ్వవిద్యాలయ విద్యార్థులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. శిక్షలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్ష ఏడు రోజులు దాటింది. నిరవధిక దీక్షలో ఉన్న వారిలో కొందరి ఆరోగ్యం క్షీణిస్తోందంటూ వార్తలు వస్తున్నా యాజమాన్యానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం దారుణం. విశ్వవిద్యాలయ అధికారులు కాషాయశక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నారని, వారు ఆడమన్నట్టల్లా ఆడుతున్నారన్న ఆరోపణలు రావడానికి ఈ తరహా వైఖరే కారణం. మోడీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత దేశ వ్యాప్తంగా ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలను తమ చెప్పుచేతుల్లోకి తెచ్చుకోవడానికి ఒక వ్యూహం ప్రకారం వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ ఆరోపణలను పూర్తిగా కొట్టివేయడానికి వీలులేని పరిస్థితి నెలకొంది. తాము తప్పు చేయలేదంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనల్లో న్యాయం ఉందనడానికి వారికి లభిస్తున్న విశాల మద్దతే నిదర్శనం.
అఫ్జల్‌ గురు వర్ధంతి సందర్భంగా చోటు చేసుకున్నట్టు చెబుతున్న సంఘటనలకు సంబంధించి ఉన్నతస్థాయి విచారణ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా విశ్వవిద్యాలయ అధికారులు ఈచర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. జెఎన్‌యు విద్యార్థి సంఘ అధ్యక్షుడు కన్నయ కుమార్‌కు పది వేల రూపాయల పెనాల్టీని విధించగా, ఉమర్‌ ఖలీద్‌, అనిర్బన్‌ భట్టాచార్యలను బహిష్కరించారు. మరికొందరు విద్యార్థులపైనా ఈ తరహా శిక్షలు విధించారు. ఏప్రిల్‌ 25న ఈ నిర్ణయం వెలువడిన వెంటనే విశ్వవిద్యాలయంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శిక్షల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ప్రకటించిన విద్యార్థులు వెంటనే ఆందోళనలను ప్రారంభించారు. విశ్వవిద్యాలయ అధికారులు విధించిన ఈ శిక్షలు ఎన్నో ప్రశ్నలను లేవనెత్తాయి. వాస్తవానికి ఈ ప్రశ్నలకు వారి వద్ద కూడా సమాధానాలు లేవు. ఈ పరిస్థితే జెఎన్‌యు యాజమాన్య చిత్తశుద్ధిని, నిష్పక్షపాత వైఖరిని సందేహాస్పదం చేసింది. దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్నది కన్నయ్యతో పాటు మిగిలిన విద్యార్థులపై ఉన్న ప్రధాన ఆరోపణ పూర్తిగా కుట్ర పూరితమైనదని ఇప్పటికే స్పష్టంగా తేలింది. మార్ఫింగ్‌ చేసిన వీడియోలతో కాషాయ దళాలు కక్కిన విషాన్ని దేశ ప్రజలందరూ వీక్షించారు. వీటితో పాటు కేంద్ర మంత్రులతో పాటు, పలువురు ఎబివిపి, బిజెపి నాయకులు ఉద్దేశ్య పూర్వకంగానే తిమ్మిని బమ్మిని చేయడానికి ప్రయత్నించారన్న విషయమూ స్పష్టమైంది. ఈ విషయాలన్నీ విశ్వవిద్యాలయ అధికారులకు తెలియదని భావించలేము. ఒకవేళ తెలియదను కున్నా ఆ నినాదాలు ఇచ్చిందెవ్వరో ఇప్పటి వరకు స్పష్టంగా తేలని స్థితి. ఈ వ్యవహారంపై ఢిల్లీ ప్రభుత్వం విచారణ జరుపుతోంది.
ఇక దేశద్రోహ ఆరోపణలపై న్యాయస్థానాల్లో విచారణ ప్రక్రియ సాగుతోంది. కన్నయ్యతోపాటు ఉమర్‌ కూడా ఈ కేసులోనే కొంత కాలం జైలులో గడిపివచ్చారు. కోర్టు తీర్పు ఇంకా వెలువడలేదు. న్యాయ వ్యవస్థ తన నిర్ణయాన్ని చెప్పకముందే దోషులెవ్వరో విశ్వవిద్యాలయ అధికారులు ఎలా నిర్ణయించారో అర్థం కాదు. కోర్టు తీర్పు కోసం ఆగాల్సిన అవసరం లేదని విశ్వవిద్యాలయ వైఎస్‌ ఛాన్సలర్‌తో పాటు ఆయన సహచరులు భావించారా? అదే నిజమైతే భవిష్యత్‌లో కన్నయ్య కుమార్‌తో పాటు ఇతరులు నిర్దోషులని కోర్టు తీర్పు ఇస్తే ఏం చేస్తారు? తప్పుడు శిక్షల కారణంగా ప్రభావితమై, నష్టపోయే విద్యార్థుల జీవితాలకు బాధ్యత ఎవరిది? చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాదు. జెఎన్‌యు యాజమాన్యం ఇప్పటికైనా పునరాలోచించాలి. పాలకుల కరుణా కటాక్షాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడటం సరికాదు. భేషరతుగా విద్యార్థులపై విధించిన శిక్షలను ఉపసంహరించుకోవాలి. (ప్రజాశక్తి సంపాదకీయం)

No comments:

Post a Comment