Saturday, 21 May 2016

|| ఇంతకూ.. మాలెగావ్‌ దోషులెవరో? ||

   జాతీయ అన్వేషణ సంస్థ (ఎన్‌ఐఎ) 2008 సెప్టెంబర్‌ మాలేగావ్‌ పేలుళ్ళ కేసు నుంచి సాధ్వి ప్రజ్ఞా సింఫ్‌ు ఠాకూర్‌తో సహా శ్యామ్‌ సాహు, శివ నారాయణ్‌ కల్సాంగ్రా, లోకేశ్‌ శర్మ, ధన్‌ సింఫ్‌ు చౌదరి, ప్రవీణ్‌ ముతాలిక్‌ మొత్తం ఆరుగురిని నిర్దోషులుగా నిర్ణయిస్తూ 2016 మే 13న వారి పేర్లను నిందితుల జాబితా నుంచి తొలగిం చింది. మరో పది మంది నిందితులపై 'మహారాష్ట్ర వ్యవస్థీకృత నేర నియంత్రణ చట్టం' కింద పెట్టిన నేరారోపణలను కూడా ఉపసంహరించుకుంది. 49 మంది సాక్షు లు పూర్తి వ్యతిరేక స్థితికి మారారు. దీనికి రూ.4 కోట్ల రహస్య నిధిని ఖర్చుపెట్టారని అనుమానం. నీతి, నిజాయితీ, నిబద్ధతలకు మారు పేరైన పోలీసు ఉన్నతాధికారి హేమంత్‌ కర్కరే ఆధ్వర్యంలో 'తీవ్రవాద వ్యతిరేక దళం(ఎటిఎస్‌)' కఠోర శ్రమతో, చిత్తశుద్ధితో నిర్వహించిన పరిశోధనను కొత్త ఛార్జిషీటు భూస్థాపితం చేసింది. హేమంత్‌ కర్కరేను ఎన్‌ఐఎ డైరెక్టర్‌ జనరల్‌ శరద్‌ కుమార్‌ అవమానించారు. శరద్‌ కుమార్‌ను పదవీ విరమణ తర్వాత ఐపిఎస్‌ నియమనిబంధనలకు విరుద్ధంగా పదవిలో కొనసాగించారు. అందుకు ఆయన రుణం తీర్చుకున్నారు. సంఝౌతా రైలు పేలుళ్ళ కేసులో స్వామి అసీమానంద్‌ జామీను అభ్యర్థనలో ఆయన ఎన్‌ఐఎ స్పందనను నీరుగార్చారు.

# పురోహిత్‌ పేరును ఎందుకు తొలగించ లేదు? #
           లెఫ్టినెంట్‌ కల్నల్‌ ప్రసాద్‌ శ్రీకాంత్‌ పురోహిత్‌ 2006లో ఉద్యోగంలో ఉంటూనే హిందూత్వ సంస్థ 'అభినవ భారత్‌'ను స్థాపించారు. హిందూ దేశ స్థాపన దీని లక్ష్యం. మాలేగావ్‌ పేలుళ్ళు ఈ సంస్థ కుట్రలే. ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూ దేశాన్ని నిర్మించడం లేదని పురోహిత్‌ భావించారు. ఈయన ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆర్‌ఎస్‌ ఎస్‌ సీనియర్‌ నాయకులు ఇంద్రేశ్‌ కుమార్‌, మోహన్‌ భగవత్‌ హత్యకు పథకం రచించారని నివేదికలందాయి. వీరు పాకిస్తాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ నుంచి నిధులు సేకరించారట!? ఆర్‌ఎస్‌ఎస్‌ ధిక్కరణను సహించదు. అందుకే పురోహిత్‌ పేరును కొత్త ఛార్జిషీట్‌లో ఉంచారు.

# అధికార దుర్వినియోగం #
        ప్రజ్ఞ, పురోహిత్‌ బృందం అరెస్టులను విమర్శించిన బిజెపి అధికారంలో ఉంది. వీరిని సమర్థించిన ఆనాటి బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ నేటి కేంద్ర హోం మంత్రి. వీరి అధికారం ఎవరికి ఉపయోగమో ఊహించవచ్చు. బిజెపి అధికారం చేపట్టిన తర్వాత ''(అ)న్యాయాలు'' చాలా జరిగాయి. కేంద్ర నిఘా విభాగాలు, దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి పెంచి వాటి నిర్ణయాలను తారుమారు చేయించారు. 2014 ఏప్రిల్‌ 4న అమిత్‌ షా ఉత్తరప్రదేశ్‌, బార్వార్‌ గ్రామంలో, ''మోదీ ప్రభుత్వం వస్తే ముల్లా ములాయం ప్రభుత్వాలు కూలిపోతాయి'' అన్నారు. దీని మీద కేసునమోదయింది. షాకు వ్యతిరేకంగా ఆధారాలు లేవని 2016 జనవరి 20న పోలీసులు కోర్టుకు నివేదించారు. బహిరంగ సభ ఉపన్యాసాలు దొరక్క పోవడం పచ్చి అబద్ధం. ప్రాథమిక దర్యాప్తు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత చేపట్టడం, అధికార పార్టీ అధ్యక్షునిపై కేసు కొట్టివేయడం దేనిని సూచిస్తాయి? 2016, ఫిబ్రవరిలో కోర్టు మొత్తం పది మందినీ వదిలేసింది. సొహ్రాబుద్దీన్‌ షేక్‌, ఆయన భార్య కౌసర్‌ బీ, గుజరాత్‌ పూర్వ మంత్రి హరేన్‌ పాండ్యా హత్య కేసులో ప్రధాన సాక్షి తులసీరామ్‌ ప్రజాపతిని అమిత్‌ షా, మోడీ ఆదేశాల మేరకు పోలీసుల సహాయంతో ఎన్‌కౌంటర్‌ చేశారని కేసు. గుజరాత్‌ గృహ మంత్రి అమిత్‌, ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈ కేసుల నుంచి తప్పించుకోలేకపోయారు. బిజెపి కేంద్రంలో అధికారం చేపట్టగానే 2014, డిసెంబర్‌లో సిబిఐ స్పెషల్‌ కోర్టు ఈ కేసులను కొట్టేసింది. అమిత్‌, నరేంద్రలను వదిలేశారు. ప్రధానమైన ఎహ్సాన్‌ జాఫ్రి హత్య కేసులో మోడీ హస్తం లేదని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఇవి క్రిమినల్‌ కేసులు. మిగతా వ్యవహారాలు బోలెడు.

# హైందవ పక్షపాతాలు #
        2016 ఏప్రిల్‌ 26న ప్రత్యేక కోర్టు 2006 మాలేగావ్‌ పేలుళ్ళ కేసులో నిందితులైన తొమ్మిది మంది (వీరిలో ఒకరు చనిపోయారు) ముస్లింలపై ఉగ్రవాద నేరారోపణలను తోసిపుచ్చింది. వెంటనే బాంబే హై కోర్టు ఈ విడుదలను 'పక్షపాత అంశం' కింద విచారణకు చేపట్టింది. ఈ న్యాయస్థానానికి ఇప్పటి సాధ్వి విడుదల పక్షపాతంగా కనిపించలేదు. ప్రజ్ఞా సింఫ్‌ు మొదలగు వారిపై అభియో గాలను తొలగించి ఛార్జిషీట్‌ను మార్చుతున్న విషయాన్ని స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అరవింద్‌ రసాల్‌కు చెప్పలేదు. ''ఈ కేసులో మెత్తగా వ్యవహరించమని ఎన్‌ఐఎ ఆదేశిం చిందని'' పూర్వ స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రోహిణి సాలియన్‌ బాంబే హైకోర్టుకు ధృవీకరణ పత్రం సమర్పిం చారు. యుపిఎ ప్రభుత్వ కాలంలో ఎన్‌ఐఎ ఈ కేసు విచారణను చేపట్టింది. చిత్తశుద్ధితో పరిశోధనలు జరిపింది. ఈ దాడి 'హిందూత్వ అనుబంధ బృందాల' చేతివాటమని నిర్థారించింది. 2007 హైదరాబాదు మక్కా మసీదు పేలుళ్ళ కేసులో నిందితుడైన స్వామి అసీమానంద్‌, పేలుళ్ళలో హిందూత్వ సంస్థల కుట్రను అంగీకరించారు. ఎన్‌ఐఎ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. గట్టి ప్రయత్నాల తర్వాత, రుజువులతో యుపిఎ పాలనలో నేరారోపణ చేసిన ఎన్‌ఐఎ ప్రస్తుత ఎన్‌డిఎ పాలనలో తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకుంది? ఒత్తిళ్ళే కారణాలా లేక న్యాయమే మారిందా?

# ఒకే కేసులో మూడు ఛార్జిషీట్లు!? #
           ఐదు సంవత్సరాల కాలంలో మూడు సంస్థలు మూడు విభిన్నమైన ఛార్జ్జిషీట్లు దాఖలు చేసిన అరుదైన కేసు ఇది. ఈ కేసులో ఎటిఎస్‌, సిబిఐ, ఎన్‌ఐఎ విడివిడిగా మూడు ఛార్జిషీట్లను దాఖలు చేశాయి. మూడింటిలో నిందితుల పేర్లు వేరు వేరు. ఒకసారి వదిలేయబడిన నిందితునిపై తర్వాతి కాలంలో నేరాలు నిరూపించబడితే మొత్తం ప్రక్రియ ప్రయోజనరహితమవుతుంది.
ద్వంద్వ ప్రమాణాలు
మహారాష్ట్రలోని నాసిక్‌ దగ్గరి మాలేగావ్‌ వద్ద హమీదియా మసీదు ఆవరణలోని శ్మశానంలో 2006 సెప్టెంబర్‌ 8న వరుస బాంబు పేలుళ్ళు జరిగాయి. ఈ పేలుళ్ళకు సైకిళ్ళను ఉపయోగించారు. 37 మంది చనిపోయారు. వంద మందికి పైగా గాయపడ్డారు. ఇదే ప్రదేశంలో భిక్కుచౌక్‌ ప్రాంతంలో 2008 సెప్టెంబర్‌ 29న మరోసారి వరుస పేలుళ్ళు జరిగాయి. ఇందులో ఆరుగురు చనిపోయారు. 101 మంది గాయపడ్డారు. ఇక్కడ ప్రజ్ఞా సింఫ్‌ు పేరు మీద నమోదైన మోటర్‌ సైకిల్‌ను వాడారు. దీనిపై హేమంత్‌ కర్కరే ఆధ్వర్యంలో ఎటిఎస్‌ దర్యాప్తును చేపట్టింది. హిందూత్వ శక్తుల ప్రమేయాన్ని నిర్థారించింది. ప్రజ్ఞా సింఫ్‌ు ఈ మోటర్‌ సైకిల్‌ను వాడలేదంటూ ఎన్‌ఐఎ ఆమెను నేరవిముక్తురాలిని చేసింది. 1993 ముంబయి పేలుళ్ళలో రూబిన్‌ మెమన్‌ పేరు మీద నమోదైన వాహనాన్ని ఆయుధాలు, మందుగుండు సామాగ్రి రవాణాకు వాడారని అభియోగం. ఈ వాహనాన్ని ఆమె వాడలేదు. అయినా రూబిన్‌ మెమన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఎందుకీ ద్వంద్వ ప్రమాణాలు?

# నేరస్తులు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలే... #
                పరారీలో ఉన్న రామచంద్ర కల్సాంగ్రా, సందీప్‌ డాంగే 2008 మాలేగావ్‌ పేలుళ్ళ కేసులో నిందితులు. 2016 మే 13న దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో వీరిద్దరూ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలని ఎన్‌ఐఎ వివరించింది. 68 మందిని పొట్టన పెట్టుకున్న 2007, ఫిబ్రవరి సంఝౌతా పేలుళ్ళ కేసులో కూడా వీరు నిందితులు. మాలేగావ్‌ పేలుళ్ళ స్థలంలో కొన్ని మొబైల్‌ ఫోన్లు దొరికాయి. వీటిని పేలుళ్ళ సమయంలో నిందితులు ఉపయోగించారని రుజువయింది. ప్రజ్ఞా సింఫ్‌ు మోటర్‌ సైకిల్‌ను కల్సాంగ్రా రెండేళ్ళ నుంచి వాడుతున్నారు. ప్రజ్ఞ, కల్సాంగ్రా టెలిఫోన్‌ సంభాషణ నిఘా సంస్థలకు దొరికింది. అందులో ప్రజ్ఞ, ''అంత తక్కువ మంది ఎందుకు చనిపోయారు? రద్దీ ప్రాంతంలో మోటర్‌ సైకిల్‌ను ఎందుకు నిలుప లేదు?'' అని కల్సాంగ్రాను ప్రశ్నించారు. పేలుళ్ళ కోసం నిందితులు అనేక రహస్య సమావేశాలు జరిపారు. మరొక ప్రధాన నిందితుడు దయానంద్‌ పాండే (సుధాకర్‌ ద్వివేది) ల్యాప్‌టాప్‌లో ఈ సమావేశాల సమాచారం దొరికింది. నేరస్తులెవరో తేల్చడానికి ఇంతకంటే రుజువేం కావాలి?

# కొస మెరుపు#
      సంఘ పరివార్‌ సభ్యులను ఛార్జిషీట్‌ నుండి తొలగించ డానికి వ్యతిరేకంగా, ఈ సాక్ష్యాలతో కోర్టుకు వెళ్తానని విశ్రాంత న్యాయమూర్తి కోల్సే పాటిల్‌ ప్రకటించారు. దేశంలో అనేక మంది కోల్సే పాటిల్‌లు ఉన్నారు. ఒక్కొక్క ఛార్జిషీట్‌లో ఒక్కొక్క బృందం నిందితులను తొలగించారు. ఇంతకూ అసలు నేరస్తులెవరు? మతోగ్రవాదాలన్నీ మానవత్వ వ్యతిరేకాలే. మెజారిటీ ముస్లిం మతోగ్రవాదాన్ని సమర్థించిన పాకిస్తాన్‌ పతనమయింది. మెజారిటీ హిందూ మతఛాందస వాదాన్ని ప్రోత్సహిస్తే భారత్‌ పరిస్థితి భిన్నంగా ఉండబోదని పరివార్‌ పాలకులు గుర్తించాలి.
- సంగిరెడ్డి హనుమంత రెడ్డి 

No comments:

Post a Comment