Sunday, 1 May 2016

|| బిపిన్‌చంద్ర పుస్తకంపై అనవసర రాద్ధాంతం ||

జాతీయవాదం గురించి మాట్లాడే ముందు...
జాతీయోద్యమ అధ్యయనం అవసరమన్న 'సహమత్‌'
---------------------------------------

              ఇటీవల కొత్తగా పుట్టుకొచ్చిన 'జాతీయవాదులు' తమ 'దేశభక్తి'ని ప్రదర్శించుకునేందుకు పసలేని, విచ్ఛిన్నకర అంశాలను ముందుకు తెస్తున్నారని 'సహమత్‌' విమర్శించింది. ప్రఖ్యాత చరిత్రకారుడు ప్రొఫెసర్‌ బిపిన్‌చంద్ర జాతీయోద్యమంపై రాసిన పుస్తకంపై వారు చేస్తున్న రాద్దాంతం అందులో భాగమేనని 'సహమత్‌' అభిప్రాయపడింది. ఈ మేరకు అది సవివరమైన ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనపై వంద మందికి పైగా ప్రఖ్యాత మేధావులు, చరిత్రకారులు సంతకాలు చేశారు. 28 ఏండ్ల క్రితం, 1988లో ప్రొఫెసర్‌ బిపిన్‌చంద్ర, ఆయన సహచరులు 'భారత స్వాతంత్య్ర పోరాటం' (ఇండియాస్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఇండిపెండెన్స్‌) అనే పుస్తకం రాశారు. ఇందులో షహీద్‌ భగత్‌సింగ్‌, అతని సహచరులను 'విప్లవ టెర్రిరిస్టులు'గా పేర్కొనడం పట్ల ఇప్పుడు అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. అయితే ఆనాటి అమరులు స్వయంగానే తమను తాము ఇలా చెప్పుకున్నారనే విషయాన్ని ఈ విమర్శకులు విస్మరిస్తున్నారని 'సహమత్‌' ఎత్తి చూపింది. 'భగత్‌సింగ్‌, ఆయన సహచరులు ప్రాతినిధ్యం వహించిన హిందూస్తాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఎస్‌ఆర్‌ఏ) తన 1929 నాటి ప్రణాళికలో మేం టెర్రిరిస్టు విధానాన్ని చేపట్టామని పేర్కొంది. టెర్రరిజానికి పూనుకోవడం ద్వారానే పరాయి పాలకులపై ప్రతీకారం తీర్చుకోగలుగుతామని వారు నమ్మారు.. టెర్రరిజానికి అంతర్జాతీయ కోణం కూడా ఉంది. ఇంగ్లాండ్‌ శత్రువులంతా తమ బలాన్ని ఈ పద్ధతుల్లోనే ప్రదర్శించుకున్నారని ఆ ప్రణాళికలో ఉంది. గాంధీ రాసిన విమర్శనాత్మక వ్యాసం 'బాంబు పూజ'ను ఖండిస్తూ హెచ్‌ఎస్‌ఆర్‌ఏ 'బాంబు తత్వం' పేరిట ఓ ప్రకటనను విడుదల చేసింది. బ్రిటిష్‌ వారి అణచివేతను ఎదుర్కోవడానికే దేశంలో టెర్రరిజం పుట్టిందని వారందులో ప్రకటించారు. ఇది విప్లవంలో ఒక అనివార్య దశ... టెర్రరిజమే మొత్తం విప్లవం కాదు. టెర్రిజం లేకుండా విప్లవం పరిపూర్తి కాదని హెచ్‌ఎస్‌ఆర్‌ఏ అవగాహన' అని ఆ ప్రకటనలో ఉంది. అయితే తర్వాతి దశలో భగత్‌సింగ్‌ 'నేను టెర్రిరిస్టులా వ్యవహరించింది నిజమే కానీ నేను టెర్రరిస్టును కాను' అని అన్నాడు. ఆనాటికి వ్యక్తిగత టెర్రరిజాన్ని వ్యతిరేకించే లెనిన్‌ బోధనల ప్రభావం ఆయనపై ఉంది. అయితే గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఆనాటి ఉద్యమ కాలమంతటా టెర్రర్‌ అనేది విప్లవ పంథాలో భాగమేనని నమ్మారని 'సహమత్‌' తన ప్రకటనలో తెలిపింది. 'టెర్రర్‌'ను విప్లవ కార్యకలాపంలో ఓ పద్ధతిగా భావించిన వారి అవగాహనకు మూలాలు జారిస్టు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రష్యన్‌ విప్లవకారులు చేసిన పోరాటంలో ఉన్నాయి. అయితే, ఇప్పుడు, ముఖ్యంగా గత రెండు, మూడు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా 'టెర్రర్‌' అనే పదానికి అర్థం అమాయకులను, మహిళలను, పిల్లలను చంపడంగా స్థిరపడిపోయింది. ఈనాడు దీనిని అర్థం చేసుకుంటున్న తీవ్రత, దృష్టి వేరు. 1920లలో, 30లలో ఈ పదాన్ని అర్థం చేసుకున్న దృష్టి వేరు అని 'సహమత్‌' తన ప్రకటనలో వివరించింది.
'భగత్‌సింగ్‌ లేదా సూర్యసేన్‌ లేదా చంద్రశేఖర్‌ ఆజాద్‌ వంటి జాతీయ హీరోలను టెర్రరిస్టులుగా పేర్కొనడాన్ని మనలో చాలా మంది ఇష్టపడరనేది స్పష్టమే. కానీ మనల్ని మనం జాతీయవాదులమని చెప్పుకున్నట్టయితే మన జాతీయోద్యమం గురించి కొంతైనా అధ్యయనం చేయడం అవసరం. టెర్రర్‌ అనే ట్యాగ్‌ను ఒకనాడు స్వాతంత్య్రోద్యమకారులు గర్వంగా తగిలించుకున్నారని, అలాంటి వారు దేశం కోసం ప్రాణత్యాగం చేశారన్న విషయాన్ని మర్చిపోవద్దు.
కాబట్టి మనం ఆ పుస్తకాలలో మార్పులు చేయాలని లేదా నిషేధించాలని డిమాండ్‌ చేయడం సమంజసం కాదు. అది మన అమాయకత్వాన్ని ప్రదర్శించుకోవడమే అవుతుంది. ఢిల్లీ వర్సిటీ నుంచి ఈ పుస్తకాన్ని ఉపసంహరించడం, టీవీ షోలలో రచయితలను దునుమాడడం వంటి హేయమైన చర్యలన్నీ ఆర్‌ఎస్‌ఎస్‌, దాని వేర్వేరు అనుబంధ సంఘాల చేష్టలే' అని 'సహమత్‌' తన ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రకటనపై సంతకం చేసిన వారిలో ఇర్ఫాన్‌ హబీబ్‌, అర్జున్‌ దేవ్‌, రొమిల్లా థాపర్‌, వి. రామకృష్ణ, ప్రభాత్‌ పట్నాయక్‌, సి.పి. చంద్రశేఖర్‌, జయతీ ఘోష్‌, మాలినీ భట్టాచార్య, జి. అరుణిమ, అయేషా కిద్వరు తదితరులున్నారు.

No comments:

Post a Comment