Thursday, 1 December 2016

|| మోదీకుట్రపూరిత వ్యూహంలో పార్లమెంటు ||



                   ప్రజా సమస్యలపై చర్చకు వేదిక పార్లమెంటు. ఉభయ సభల్లో అందుకు అనుగుణంగా కార్యనిర్వహణ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో ప్రతిపక్షాల ఆమోదం కార్యనిర్వహణాంశాలు అజెండాలో చేరుతాయి. ఆయా అంశాలను పార్లమెంటు ఉభయ సభల్లో అన్ని పక్షాల సభ్యులు చర్చించి, ఒక నిర్దేశం చేస్తారు. కానీ ఇటీవలి కాలంలో అధికార పార్టీ కుట్రపూరిత వ్యూహంతో పార్లమెంటు ఉభయ సభలూ అందుకు భిన్నంగా సాగుతున్నాయి.
తమ పంతాలను నెగ్గించుకునేందుకు అధికార పార్టీ(బిజెపి) మంకు పట్టుతో పార్లమెంటు సంప్రదాయనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రధాన మంత్రి తన మౌలిక బాధ్యతను విస్మరిస్తున్నారు. ప్రతిపక్షాలు వేసే ప్రశ్నలేంటీ? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వారి అభిప్రాయాలేంటీ? అభ్యంతరాలేంటీ? అనేది వింటేనే కదా సమాధానం ఇవ్వగలిగేది. ప్రతిపక్షాల అభిప్రాయాలను, అభ్యంతరాలను, సభ్యులువేసే ప్రశ్నలను వినకుండా సమాధానం చెప్పలేరు. ప్రతిపక్షాలకు సమాధానమివ్వాలంటే పార్లమెంటు సభలకు ప్రధాని హాజరు కావాలి. మన ప్రధాని అన్ని అంశాలపై చర్చకు సిద్ధమంటారు. కానీ ఆయా అంశాలపై చర్చ జరిగే సందర్భంల్లో పార్లమెంటు ఉభయ సభల్లో ఉండరు. అదేమని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే... జాతి వ్యతిరేకులనే ముద్ర వేస్తారు. ఇలాంటి బురదజల్లే కార్యక్రమం మోడీ పరివారానికి వెన్నతో పెట్టిన విద్య. అలా సమస్యను పక్కదారి పట్టిస్తారు.
భారతదేశ ప్రజాస్వామ్యం గురించి గొప్పగా చెప్పుకుంటున్న వాళ్లంతా ఇప్పుడు గగుర్పాటుకు గురికావాల్సి వస్తోంది. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన పార్లమెంటు ఇప్పుడు ప్రమాదంలో పడింది. పార్లమెంటు వ్యవస్థ, దాని అమలు, ప్రజా సమస్యలపై చర్చ తీరుతెన్నుల గురించి అనేక కథనాలు వచ్చాయి. పార్లమెంటు ప్రజల కోసం లేదని, అక్కడ ప్రజా సమస్యలపై చర్చ తూతూమంత్రంగా జరుగుతోందని సంపాదకీయాలు కూడా చాలానే వచ్చాయి. అధికార స్వప్రయోజనమే అందుకు కారణమని బలంగా వినబడుతోంది. అధికార పార్టీ తననుకున్నది సాధించేందుకు ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రజల ప్రయోజనాలను, హక్కులను తాకట్టు కూడా పెట్టేందుకు సిద్ధమవుతోంది. అందుకు భిన్నంగా ఏమీ ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు జరగటం లేదు. నవంబర్‌ 16 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికి రెండు వారాలు ముగించుకొని మూడో వారంలోకి అడుగు పెట్టాయి. ఈ రెండు వారాల పాటు పార్లమెంటులో ఒకేఒక్క అంశంపై ఆందోళన జరుగుతోంది. అది కూడా న్యాయమైన డిమాండుపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. పార్లమెంటు బయటా, లోపలా ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ప్రధాని నవంబర్‌ 8న తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఈ నిర్ణయంతో దేశ ఆర్థికవ్యవస్థ నష్టాల బారిన పడుతోందని, దేశ ప్రజలు సమస్యల వలయంలో చిక్కుకుంటారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ప్రధాని పార్లమెంటుకొచ్చి ఉభయసభల్లో నోట్ల రద్దుపై ప్రకటన ఇవ్వాలని డిమాండు చేస్తున్నాయి. ప్రతిపక్షాల డిమాండ్‌లో న్యాయముంది. పెద్ద నోట్ల రద్దుతో జరిగే భవిష్యత్‌ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని, ఇప్పటికే వెలుగులోకొచ్చిన తిరోగమన పరిస్థితులను ప్రతిపక్షాలు వెల్లడిస్తూ, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్షాలే కాదు, అనేక మంది ఆర్థికవేత్తలు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. దేశ ప్రజలు ఇబ్బందులు పడటం చూస్తున్నాం. ఇప్పటికి 70 మంది డబ్బుల కోసం క్యూలో నిల్చోని మరణించారు. పనిపాటలు మానీ బ్యాంకుల చుట్టూ, ఎటిఎంల చుట్టూ తిరుగుతున్నారు. ఇది రోజూ పత్రికల్లో, మీడియాలో కనబడుతోంది. ఇన్ని ఇబ్బందులెదుర్కొంటున్న ప్రజలను చూసి ప్రభుత్వానికి కనికరం లేదు. కనీసం చలనం కూడా రాలేదు. తీరా తాను తీసుకున్న ఈ నిర్ణయం దేశ హితం కోసమని ప్రధాని ప్రవచనాలిస్తున్నారు. కానీ పార్లమెంటు ఉభయసభల్లో మాట్లాడేందుకు మాత్రం సాహసించటం లేదు.
ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలే ఎన్నుకునే సభకు బాధ్యత వహించాల్సిన ప్రధానమంత్రి దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దేశాన్ని అతలాకుతలం చేస్తున్న ఏకపక్ష నిర్ణయం గురించి పార్లమెంటుకు సమాధానం చెప్పడానికి సాహసించటం లేదు. పాలకులు ప్రజలకు బాధ్యత వహించడం ఎప్పుడో మానేశారు. ఇక ఇప్పుడు అంగబలం చూసుకుని పార్లమెంటుకు కూడా సమాధానం చెప్పడం లేదు. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజలకు పాలకుల జావాబుదారీతనం కీలకమైనది. అలాంటి ప్రజలు ఓటేసి గెలిపించిన తోటి పార్లమెంటు సభ్యులకు కూడా సమాధానం చెప్పేందుకు ప్రధాని మోడీకి తీరుబాటు లేదని చెప్పడం ఎంత వరకు సమంజసం.
పార్లమెంటులో పైచేయి సాధించేందుకు అధికార, ప్రతిపక్షాలు ప్రణాళికాబద్ధమైన వ్యూహాలు పన్నుతాయి. ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలకు నిర్మాణాత్మక వ్యూహముంటుంది. ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రతిపక్షాలకు సమాధానం చెప్పడమంటే, ప్రజలకు సమాధానం చెప్పడమే. ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేకపోవడం పార్లమెంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేయడంలో భాగమనే చెప్పొచ్చు. ఏం చేసినా చెల్లుతుందని, ఎలా చేసినా సాగుతుందని ఆశిస్తున్న నేతలు ఇలాంటి నియంతత్వపు ధోరణులకు దిగడం విస్మయం కలిగిస్తోంది. ఫాసిస్టు మూలాలున్న సంస్థ ప్రతినిధిగా మోడీ దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నప్పటికీ దేశ హితం కోరేవారంతా ఈ దుస్థితిని అర్థం చేసుకోవాల్సి ఉంది. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగంలో ఉన్న విశిష్టతను నీరుగార్చేలా ఏకస్వామ్యం ఏలుబడిలోకి తీసుకురావడానికి ప్రయత్నించడాన్ని అడ్డుకోవాల్సి ఉంది.

|| ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన ప్రభుత్వ తీరు ||

పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంది. ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వ ప్రతినిధి ప్రధాని అందుకు సాహసించకపోగా, ప్రతిపక్షాలపై ఎదురు దాడికి దిగుతున్నారు. ఈ పార్లమెంటు సమావేశాల మొత్తంలో ఆయన రెండుసార్లు మాత్రమే ఉభయసభలకు హాజరయ్యారు. అది కూడా పది నిమిషాల కంటే ఎక్కువ సభలో లేరు. పార్లమెంటుకొస్తారు. కానీ సభలోకి రారు. పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. వాటిని నిలువరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రతిపక్షాలు కోరుతున్న అంశాలకు సమాధానాలు చెబితే ఆందోళనలకు ముగింపు వస్తుంది. అలా కాకుండా వారికి సమాధానం చెప్పేదేంటని మొండిగా వ్యవహరిస్తే సమస్య మరింత జటిలమవుతుంది. ప్రస్తుత ప్రభుత్వం తీరు, ప్రధాని తీరు మొండితనానికి అద్దం పడుతోంది. ప్రధాని లోక్‌సభకు వచ్చినరోజు ఆయనతో ఆయన పరివారం(కేంద్ర మంత్రులు) కూడా వచ్చారు. ప్రతిపక్షాలు నిలదీతలకు సమాధానాలు చెప్పని మంత్రులు ఆ రోజున మాత్రం విర్రవీగారు. ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై మంత్రులతో మరోమారు దాడి చేసేందుకు యత్నించి భంగపడ్డారు. మంత్రుల దాడికి ప్రతిస్పందనగా ప్రతిపక్షాలు మంత్రులను నిలదీశారు. దీంతో గందరగోళం నెలకొనడంతో సభ వాయిదా పడింది. అంతే సభ తిరిగి ప్రారంభమైనా ప్రధాని సభకు రాలేదు. ప్రతిపక్షాలు తమ ఆందోళనను కొనసాగించాయి. ఇదే పరిస్థితి రాజ్యసభలో కూడా నెలకొంది. 
ప్రధాని మోడీ సభకు హాజరైన రోజు ఆయనున్నంత వరకు సభ సజావుగా జరిగింది. ప్రతిపక్ష సభ్యులు పెద్ద నోట్ల రద్దుపై మోడీని నిలదీశారు. నలుగురు సభ్యులు మాట్లాడారు. అంతే మోడీ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. ఆందోళనలతో అట్టుడికాయి. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం తరపున ప్రధానమంత్రి పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాలి. పార్లమెంటు సభ్యులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రతిపక్షాలు కూడా కోరేది అదే. పార్లమెంటులో ప్రకటన చేయండి. ప్రకటితాంశాలను ప్రజలకు తెలియజేస్తామంటున్నారు. కానీ ప్రధాని పార్లమెంటులో ప్రకటన చేయడానికి ముందుకు రావడం లేదు. పార్లమెంటు వెలుపల ప్రతిపక్షాలపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. దీన్ని ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి. ఆ చెప్పేదేదో పార్లమెంటులో చెప్పండని కోరుతున్నాయి. కానీ అందుకు ప్రధాని సిద్ధంగా లేరు. ఇలా ప్రభుత్వం తప్పించుకొని తిరుగుతోంది. పార్లమెంటును అపహాస్యం చేస్తోంది.

|| నియంతృత్వంతో మోడీ ||

ప్రధాని మోడీలో నియంతృత్వ పోకడలతో రోజురోజుకు విజృంభిస్తున్నాయి. పార్లమెంటుకు వచ్చి సమాధానం చెప్పకపోగా ఎంపీలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడానికి నిరాకరించిన మోడీ నియంతృత్వం స్పష్టమవుతోంది. ప్రధాని కావటానికి ముందు మోడీ ఒక పార్లమెంటు సభ్యుడు. ఆయనతో పాటు దేశంలో 545 మంది ఎంపీలుగా గెలిచారు. వీరంతా ఆయనకు సహచరులు. తనతో పాటే గెలిచిన తోటి పార్లమెంటు సభ్యులకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వటం లేదు. ఇటీవలి పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా కేరళకు చెందిన సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌, ఇద్దరు స్వతంత్ర ఎంపీలు ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోసం ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్తే లోపలున్న ప్రధాని 20 మంది ఎంపీలను బయట వేచి ఉంచి చివరికి కుదరదు పొమ్మన్నారు. ఎంపీలు ఇలా అపాయింట్‌మెంట్‌ కోసం వేచి ఉండడం బహుశా ఇదే ప్రథమమేమో. దీనిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నియంతృత్వ వైఖరిపై కేరళలో నిరసనలకు కూడా పిలుపునిచ్చారు. ప్రధాని ప్రజలకు, తోటి పార్లమెంటు సభ్యులకు అందుబాటులో లేకపోతే ఆయన ప్రధానెందుకనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

|| ఉమ్మడి పోరు ఉధృతం ||

ఇటీవలి కాలంలో ఒక ప్రజా సమస్యపై ప్రతిపక్షాలన్నీ ఒకే వేదికపైకి రావడం ఇదే ప్రథమం. పార్లమెంటు వేదికగా ఉమ్మడిపోరు సాగిస్తున్న 16 ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు బయటా ఐక్య పోరును సాగిస్తున్నాయి. ఒకే అంశంపై అన్ని పక్షాలూ వివిధ రూపాల్లో ఆందోళన సాగించాయి. దేశవ్యాప్తంగా బంద్‌, హర్తాళ్‌ వంటి అనేక రూపాల్లో ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఉద్యమించాయి. కేంద్ర ప్రభుత్వం దుష్ప్రచారానికి ఒడిగట్టినా ఆందోళన విజయవంతమైంది. పార్లమెంలు వద్ద దాదాపు 200 మంది ఎంపీలు మానహారం నిర్మించడం చారిత్రాత్మకం. పార్లమెంటు సమావేశాల తొలి నుంచీ ఆందోళన చేస్తున్న అన్ని పార్టీలూ ముక్తకంఠంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. బిజెపికి చెందిన అనేక మంది ఎంపీలు కూడా ప్రతిపక్షాల ఆందోళనకు పరోక్షంగా మద్దతిస్తున్నారు. - జె జగదీశ్‌

No comments:

Post a Comment