ఒక దేశ పౌరులుగా ప్రజలకు తమ దేశం పట్ల భక్తీ, గౌరవ భావాలు సామాజికంగా అలవడతాయి. వీటిని ప్రత్యేకంగా భౌతిక రూపాల్లో ప్రదర్శించుకునే ఆసక్తి లేకపోయినా గుండెల నిండా దేశభక్తి గూడుకట్టుకొనివుంటుంది. శ్రీరాముడి పట్ల తనకున్న ప్రభుభక్తిని పొట్ట చీల్చి శ్రీరామహృదయాన్ని చూపిన ఆంజనేయుడిలా ప్రజలు కూడా తమ దేశభక్తిని 'గీతాలాపన'తో చాటుకోండని కొలమానాలు నిర్దేశించడానికి ఇదేమీ ఇతిహాసం కాదు. రాజ్యభక్తిని బహిరంగంగా ప్రదర్శించుకునేందుకు మూఢత్వ శకం అంతకంటే కాదు.
'జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు, అంటే జన్మనిచ్చిన భూమి స్వర్గంతో సమానంగా ఉంటుందని, జన్మభూమి స్వర్గంలా వుండకపోయినా అలా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ సొంతదేశంలో దేశభక్తిని చాటుకోండని కొలమానాలు నిర్దేశించే నిర్భందాలకు తావులేదు. దురదృష్టవశాత్తూ ఇటీవల కాలంలో ప్రత్యేకించి బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి 'దేశభక్తి'ని బహిరంగంగా ప్రదర్శించాలనే దుష్ట సంప్రదాయం తెరపైకి తరుచూ వస్తోంది. విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు, సాంప్రదాయాలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని, సమైక్యతా రాగాన్ని ఆలపిస్తున్న భారతావని ఫలాన రీతిలోనే దేశభక్తిని బహిరంగంగా ప్రదర్శించాలనే భావం సరైంది కాదు. ఆ ప్రత్యేక రీతుల్లో బహిరంగంగా దేశభక్తిని చాటుకోలేని వాళ్లపై దాడులకు తెగబడటాన్ని చూశాం. భరతమాతకు జై కొట్టలేదనీ, యోగాను వ్యతిరేకించిన వాళ్లను, పొట్టకూటి కోసం గోమాంసం విక్రయిస్తున్నవారిపైనా సొంత దేశీయులే దేశభక్తి పేరుతో దాడులకు పాల్పడటం, ప్రాణాలు తీయడం చూశాం. ఇప్పుడు జాతీయగీతాలాపన అంటూ జన్మనిచ్చిన భూమి పట్ల భక్తికి కొలమానాలు నిర్దేశించడమంటే వివాదస్పద చర్చకు తావివ్వడమే. జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల, విద్య నేర్పిన గురువుల పట్ల, పుట్టిన గడ్డ పట్ల గౌరవం, భక్తి అనేవి కొలవజాలనవి. అవి పూర్తిగా వ్యక్తిగతమైనవి. అంతేకాని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక దోరణలు పట్ల, విధానాల పట్ల వెల్లువెత్తుతున్న అసమ్మతిని అణిచేసేందుకు దేశభక్తిని కూడా ఒక ఆయుధంగా ఉపయోగించుకోవచ్చు అని భావిస్తే అది కచ్చితంగా నియతృత్వమే అవుతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ వినియోగిస్తున్నది కచ్చితంగా ఈ ఆయుధమే. ఈ నేపథ్యంలోనే సినిమా థియేటర్లలో ప్రదర్శనకు ముందు తలుపులన్నీ మూసేసి జాతీయ గీతాలాపన చేయాలని భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇటీవల జారీ చేసిన ఆదేశాలు సహేతుకమని భావించడం చాలా కష్టమే.
భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ముందడుగేస్తున్న భారతావని తన విశిష్టతను సులభంగా గుర్తించేందకు తనకు తానుగా ఒక జాతీయగీతాన్ని తనలో ఇముడ్చుకుంది. దీనిని చట్టం చట్రంలో బిగించడం సులువు కాదు. సాధారణ ప్రజానీకంలో జాతీయ గీతమంటే విశిష్టమైన వేడుకల్లో ప్రత్యేకించి పాఠశాలలు, కళాశాలల్లో ఆలపించే గేయంగానే గుర్తింపు ఉంది. జాతీయ గీతాలాపన తమ రోజువారీ కార్యక్రమాలకంటే అత్యంత ఉన్నతమైనదనే భావన నిండుగా ఉంది. జాతీయ గీతాలాపన నిడివి, ఆలపించాల్సిన విధానం తదితర విషయాలకు సంబంధించి నిబంధనలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా జాతీయగీతాన్ని అవమానించడం, దుర్వినియోగం చేయడం చట్టబద్ధంగా నిషేదితం. అలాంటి చర్యలకు పాల్పడినవారికి శిక్షలూ ఉన్నాయి. వీటిన్నిటినీ వదిలేసి భారతదేశం వంటి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ ఒక న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు సినిమా హాళ్లనే ప్రత్యేకంగా చూస్తూ జాతీయ గీతాలాపనను తప్పనిసరి ఎందుకు చేసిందో స్పష్టత కానరావడంలేదు. కొన్ని దశాబ్దాల కిందట సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని ఆలాపించాల్సివుండేదని, అయితే అది చాలా వరకు ఉల్లఘించారనేదొక్కటే న్యాయ స్థానం ఇప్పుడు తన ఉత్తర్వులకు చెబుతున్న వివరణ. అయితే ప్రజలు గుమికూడే ఇటువంటి ప్రదేశాల్లో ఉదాహరణకు సంగీతోత్సవాల్లోనూ, నృత్య ప్రదర్శనల్లోనూ, ఇతర వేడుకల్లోనూ జాతీయ గీతాలాపన చేయాలా అనే విషయంలో స్పష్టత కొరవడింది. దీనిని పరిగణలోకి తీసుకుంటే న్యాయస్థానాలు కూడా ధర్మాసనం సమావేశమైన ప్రతిసారీ గీతాలాపన చేయాలి కదా. మరి న్యాయస్థానాల్లో ఆ రకమైన పరిస్థితి ఉంటుందా అంటే కుదరదు. ఇదే సందేహాన్ని వ్యక్తం చేస్తూ తన ముందుకు వచ్చిన ఒక పిటిషన్ విచారణలో కోర్టుల్లో జాతీయ గీతాలాపన వీలుపడదని సుప్రీకోర్టే శుక్రవారం సెలవిచ్చింది. సినిమా ప్రదర్శన చివరలో జాతీయ గీతాలాపన చేయాలనే నిబంధనను దేశంలోని చాలా ప్రాంతాల్లో మూడు దశాబ్దాల కిందటే విడిచిపెట్టేశారు. దీనికి ప్రధానకారణంగా జాతీయ గీతాలాపన జరుగుతుండగానే చాలా మంది ప్రేక్షకులు థియేటర్ నుంచి వెళ్లిపోవడమే. ఇలా అగౌరవపర్చడం ఇష్టంలేక ఆ నిబంధనను పాటించడం మానేశారు. ఇప్పుడు ఆ నిబంధనను పునరుద్ధరిస్తున్న ప్రస్తుత తరుణంలో సినిమా థియేటర్లు దేశభక్తి ప్రదర్శించుకునేందుకు శాశ్వత వేదికలనే ముద్ర పడిపోనుంది. రాజ్యంగబద్ధమైన దేశభక్తి అంటే రాజ్యాంగ విలువలతో కూడినదై నిష్పక్షపాతంగా ఉండాలి. ఒక వైపు గోమాత, భరతమాత రక్షకుల పేరుతో దౌర్జన్యాలకు, దమనకాండలకు పాల్పడుతున్న కాషాయ గూండాలు ఇప్పుడు గీత రక్షకుల పేరుతో మరో రూపంలో దాడులకు తెగించరన్న గ్యారెంటీ ఏమీ లేదు.

No comments:
Post a Comment