ఈ నెల 8వ తేదీ రాత్రి 8 గంటలకు ఈ అర్ధరాత్రి నుంచి 500, 1000 రూపా యల నోట్లు చట్ట సమ్మతాన్ని కోల్పో తాయి. ఇది ప్రపంచంలో ఇప్పటి వరకూ ఎవ్వరూ చేయని సాహసోపేత చర్య (ఇది మరొక పెద్ద అబద్ధం) అని ప్రధాని టీవీలలో వాగ్బాణాలను వదిలారు. ఆ నోట్ల మీద భార తీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నరు చేసిన వాగ్దానాన్ని వంకలో కలిపారు. నోట్ల చట్ట సమ్మతాన్ని చట్టవిరుద్ధం చేయడం చట్ట సమ్మతమేనా? ఒక డెనామినేషన్ (విలువ) నోట్లను మొత్తంగా రద్దు చేసే అధికారం ప్రభుత్వానికుందా?
|| ఆర్థిక శాఖ ఆదేశం ||
ఆర్థిక మంత్రిత్వ శాఖ 2016 నవంబర్ 8 తేదీన ఎస్‌ఒ 3408(ఇ) ప్రకటన ద్వారా అమలులోనున్న రూ.500, రూ.1,000 డెనామినేషన్ సిరీస్ (ఇది తప్పుడు పదబంధం) బ్యాంకు నోట్లు చట్టసమ్మతాన్ని కోల్పోతాయని ప్రకటించింది. 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934'లోని 26(2) అధికరణ ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి ఈ ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నది. డెనామినేషన్ సిరీస్ అన్న పదప్రయోగంలో పప్పులో కాలేసింది. ఈ ప్రకటనలోని క్రమ సంఖ్య లేని మొదటి పేరా అసమగ్రంగా ఉంది. అంతేగాక ఇందులోని అంశాలను కాలక్రమేణా పలుమార్లు పత్రికా ముఖంగా సవరించారు. ప్రభుత్వ ప్రజా ప్రయోజనావ గాహన, చట్ట నిబద్ధత, అమలు అనుమానాస్పదమయ్యాయి.
|| రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 ||
ఈ చట్టంలోని కొన్ని సంబంధిత అధికరణలను పరిశీలిద్దాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ద్రవ్య నిర్వహణను స్వాధీనపరుచుకోవడానికి, ఈ చట్ట నిబంధనల ప్రకారం బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ అన్న పేరుతో ఒక బ్యాంకు ఏర్పాటుచేయబడు తుం ద ని అధికరణ 3(1) తెలుపుతోంది. రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డ్‌లో గవర్నర్, నలుగురికి మించని డిప్యూటీ గవర్నర్లు, ప్రభుత్వం నియమించే 14 మంది డైరెక్టర్లు (4+10), ఒక ప్రభుత్వాధికారి ఉంటారని అధికరణ 8(1) ప్రస్తావిస్తుంది. అధికరణ 24(1) ప్రకారం 2, 5, 10, 20, 50, 100, 500, 1000, 5000, 10000 రూపాయల విలువల గల నోట్లు మాత్రమే చలామణిలో ఉండాలి. సెంట్రల్ బోర్డ్ సిఫారసుతో 10000 రూపాయల లోపు విలువ గల నోట్లను కేంద్ర ప్రభుత్వం ముద్రించవచ్చు. రూపాయి నోటు ముద్రణ చట్టసవరణతోనే జరిగింది. ఈ అధికరణలో అనుమతించిన నోట్లలో రూ.2000 నోటు లేదు. సెంట్రల్ బోర్డ్ సలహా మేరకు అది సూచించిన డెనామినేషన్ బ్యాంక్ నోట్లను జారీ చేయవద్దని కాని, కొనసాగించవద్దని కాని (రద్దు చేయమని కాదు) కేంద్ర ప్రభుత్వం నిర్దేశించవచ్చని అధికరణ 24(2) చెపుతుంది. 500, 1000 నోట్ల రద్దుకు గాని, 2000 నోటు ముద్రణకు గాని సెంట్రల్ బోర్డ్ సిఫారసు చేసినట్లు లేదా అనుమతించినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తన 2016 నవంబర్ 8 నాటి ఎస్‌ఒ 3408(ఇ) ప్రకటనలో ఎక్కడా ప్రస్తా వించలేదు. అసలు ఈ సందర్భంలో సెంట్రల్ బోర్డ్ సమా వేశమే జరగలేదని ఆర్‌బిఐ కార్యాచరణ తెలుపుతున్నది. ఏ డెనామినేషన్ బ్యాంక్ నోట్లలోనైనా, ఏ సీరీస్‌నైనా సెంట్రల్ బోర్డ్ సిఫార్స్ మేరకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధ అమలును నిలుపుచేయవచ్చని అధికరణ 26(2) వివరిస్తున్నది. 1946 జనవరి 13కు ముందు జారీ చేసిన 500, 1000, 10000 డెనామినేషన్ల నోట్లు చట్టబద్ధ విలువ (లీగల్ టెండర్)ను కోల్పోతాయని, 1946లో సవరించిన అధికరణ 26(ఎ) ప్రకటించింది.
|| నోట్ల రద్దులో చట్ట నిర్లక్ష్యం ||
ప్రతి డెనామినేషన్‌లో అనేక సిరీస్ నోట్లు జారీ చేయబడతాయి. ఆ సిరీస్ నంబర్లు 5డిఆర్, 9బిక్యు, 6విఎస్, 9పిహెచ్ అని పలు సంఖ్యల్లో ఉంటాయి. సిరీస్ నంబర్ ప్రతి నోటు మీదా క్రింది భాగంలో ముద్రించబడి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డుకు ఒకటి లేదా కొన్ని సిరీస్ నోట్లను మాత్రమే రద్దు పరచమని సలహా ఇచ్చే హక్కుంది. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డు, కేంద్ర ప్రభుత్వ అధికారాలు పరిమితమే. అలా కాక మొత్తం డెనామినేషన్ నోట్లను రద్దు చేయాలంటే పార్లమెంటు నిర్ణయం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934లోని 26వ అధికరణానికి సవరణ చేయాలి. ప్రభుత్వం 1946లో ఆ అధికరణాన్ని సవరించి 26(ఎ)ను చేర్చింది. 500, 1000, 10000 నోట్లను రద్దుపరిచింది. 1978లో కొన్ని డెనామినేషన్ నోట్లను మొత్తంగా రద్దు చేయవలసి వచ్చినప్పుడు అప్పటి ప్రధాని మొరార్జీ దేశారు అధికరణ 26ను సవరించడానికి బదులుగా ఏకంగా హై డెనామినేషన్ బ్యాంక్ నోట్ (డిమానెటైజేషన్) యాక్ట్, 1978 అన్న చట్టాన్నే చేశారు. ఇప్పటి 500, 1000 నోట్ల రద్దుకు కూడా పార్లమెంటు ఆమోదం, ఆర్‌బిఐ చట్టం అధికరణ 26 సవరణ అవసరం. కానీ ఇవి జరగలేదు. పైపెచ్చు సెంట్రల్ బోర్డ్ ఇవ్వవలసిన చట్టబద్ధ సలహాను ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రస్తుత ప్రహసనంలో అనేక విధాన లోపాలతో పాటు చట్టరాహిత్యం కూడా చోటుచేసుకుంది. జాతికి క్షమాపణ చెప్పి, నష్ట నివారణ చర్యలను చేపట్టడం తప్ప వీటిని సరిజేసే అవకాశం లేదు. పట్టణాల కంటే పల్లెల్లో నోట్ల రద్దు గోడు ఎక్కువగా ఉంది. అవినీతి ఆద్యులను, నల్ల సంపాదనా ఘనులను, ఉగ్రవాద సృష్టికర్తలను వదిలేసి, అనాదిగా కష్ట నష్టాలకు గురవుతున్న వాళ్ళను మరింత ఇబ్బందులపాలు చేయడం దేశభక్తి కాదు. నోట్ల రద్దుతో అమాయకులు అష్ట కష్టాలు పడుతున్నారన్నవారిని, నల్ల నగదు అంతరించ దన్నవారిని పాకిస్తాన్ మద్దతుదారులని నిందించడం న్యాయం కాదు. భారత రాజ్యాంగ అధికరణ 343(1) ప్రకారం అధికారిక కార్యక్రమాలలో భారతీయ అంకెల అంతర్జాతీయ రూపాలను వినియోగించాలి. 2000 నోటు మీద దేవనాగరి అంకెలను వాడి రాజ్యాంగాన్ని ధిక్కరించారు. అంతే కాదు హిందీ భాష స్థానంలో కూడా మరాఠీని వాడేంత నిర్లక్ష్యం వహించారు.
|| ప్రభుత్వ చట్ట వ్యతిరేక చర్యలు ||
నల్ల కుబేరులను భుజాలపై మోసేవారు నల్ల నగదు తెల్ల నగదులో ఉందని ఊహించడం ఆశ్చర్యం కాదు. నల్ల సంపాదనను అరికట్టే పద్దతి ఇది కాదని, ఆ పని చేయడానికి చిత్తశుద్ధి, రాజకీయ సంకల్పం అవసరమని, అవి తమకున్నాయో, లేదో పాలకులు పరీక్షించుకోవాలని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులంటున్నారు. చట్టాలలోని నిబంధనలను సమ్మతించటం, అనుగుణ్యంగా అనుసరించి అమలుచేయటంలోనే ప్రభుత్వ చర్యల, కార్యక్రమాల చట్టబద్ధత ఆధారపడి ఉంటుంది. చట్ట పాలన ప్రజాస్వామ్యానికి పునాది. ఈ నేపథ్యంలోనే ఏ ప్రభుత్వాన్నైనా అర్థం చేసుకోవాలి. ఇష్టంలేని రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను ఆచరించవలసి వచ్చినప్పుడు పాలకులు పైకి వీటికి కట్టుబడి ఉంటామని చెబుతారు. నోటితో పొగుడుతూ నొసటితో వెక్కిరించినట్లు ఆచరణలో ధిక్కరిస్తారు. ఈ ప్రక్రియలను ప్రశ్నించిన వారిని దేశద్రోహులని ముద్ర వేస్తారు. సంఘీయం చట్టాన్ని ధిక్కరించడం ఇది తొలిసారి కాదు. చివరిది కాబోదు కూడా.
|| నల్ల వెలుగు ||
ఏకరూప రంగు బట్టల భక్తులు ఎక్కువయ్యారు. ఒకరోజు మహిళా కళాశాల ముందర కాలేజీ వదిలే సమయంలో ఒక నల్ల బట్టల భక్తుడు అమ్మాయిలను చూస్తూ నిలుచున్నాడు. నయనానందం తర్వాత తన రెండు బుగ్గలను ఒకదాని తర్వాత ఒకదాన్ని వేళ్ళతో నొక్కుకొని (పశ్చాత్తాప సూచకంగా) వెళ్ళిపోయాడు. ఇదే ఆధ్యాత్మిక చింతన కలిగిన పాలకులకు తప్పు తెలిసింది. పశ్చాత్తాపం కలుగలేదు. మోడీయ నిఘంటువులో ఈ పదం లేదు. కోట్ల ప్రజల అనేక కోట్ల గంటల విలువైన ఉత్పత్తి సమయం క్యూలలో వృథా అవుతున్నది. వంద ప్రాణాలు బొందిని వదిలాయి. సగటు భారతీయుల బాధలు వర్ణనాతీతం. ప్రజల సమయం, ధనప్రాణాలు పాలకుల దృష్టిలో విలువలేనివి. తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేరితే చాలు. - సంగిరెడ్డి హనుమంతరెడ్డి

No comments:
Post a Comment