ప్రపంచాన్ని మార్చే సూత్రాలు కనిపెట్టిన కార్ల్‌మార్క్స్ ఆర్థిక సిద్ధాంతాల మీద జరిగినంత చర్చ ఆయన తాత్విక భావాల మీద జరగలేదు. కార్ల్‌మార్క్స్ ప్రధానంగా తాత్వికుడు, హేతువాది, నాస్తికుడు, ఆచరణశీలి, అధ్యయన కర్త, ధైర్యశాలి, పోరాటయోధుడు, విశ్లేషణకర్త, బహుముఖ ప్రజ్ఞావంతుడు. ఆయనలోని కొన్ని కోణాలే ఇప్పటి వరకు చర్చలో ఉన్నాయి. నిజానికి ప్రధానంగా ఆచరించవలసింది ఆయన తాత్వికవాదం. అసలు తాత్వికుడంటే ప్రపంచాన్ని భౌతిక మూలాల నుంచి అధ్యయనం చేసినవాడు. మనిషికి-ప్రపంచానికి, మనిషికి-ప్రకృతికి, మనిషికి-కాలానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని అధ్యయనం చేసినవాడే తత్వవేత్త. మార్క్స్ 1818 మే 5న ట్రీర్ నగరంలో పుట్టాడు. తండ్రి న్యాయవాది. మార్క్స్ కుటుంబం యూదులకు సంబంధించింది. సహజంగా యూదులు రోమన్ కేథలిక్లుగా ఉంటారు. అయితే మార్క్స్ తండ్రి 1824లోనే ప్రొటెస్టెంట్ మతాన్ని స్వీకరించాడు. ఆ రోజుల్లో మార్క్స్‌ది సంపన్నమైన కుటుంబం. మార్క్స్ ట్రీర్ నగరంలో ఉన్నత విద్యను పూర్తిచేసిన తర్వాత బోన్ విశ్వవిద్యాలయంలో, తర్వాత బెర్లిన్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని, చరిత్రను, తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. అయితే ఆయన తత్వశాస్త్ర విభాగంలో 1841లో ఎపిక్యూరస్ తత్వశాస్త్రంపై పరిశోధన చేసి ఆ లోతైన పరిశోధనా పత్రాన్ని బెర్లిన్ విశ్వవిద్యాలయానికి సమర్పించాడు. ఆ పరిశోధనకుగాను ఆయన డాక్టరేట్ పట్టం పొందాడు. అప్పటికి ప్రపంచం మొత్తంలో హెగెల్ గతితర్క తత్వశాస్త్రం మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. హెగెల్ బెర్లిన్‌లో 1818 నుంచి నివాసమున్నాడు. 1831లో అక్కడే చనిపోయాడు. హెగెల్ చనిపోయిన పదేళ్ళకు కార్ల్‌మార్క్స్ డాక్టర్ పట్టా పొందాడు. ఎపిక్యూరస్ ప్రపంచ నాస్తికుల్లో ప్రసిద్ధి చెందినవాడు. భారతదేశంలో చార్వాకులు తెచ్చిన సిద్ధాంతాన్నే ఎపిక్యూరస్ గ్రీస్‌కు తెచ్చాడు. ప్లేటో స్థాపించిన అకాడమీ, అరిస్టాటిల్ లైసియమ్, ఇంకా ఏంటిస్తేనీస్ మొదలైన గ్రీకు తత్వవేత్తల విద్యాలయాలు ఏథెన్సులో ఒక ప్రక్కన నడుస్తుండగా, మరోవైపు అదే నగరంలో వేరొక విద్యాలయాన్ని స్థాపించి, ఎందరో శిష్యులకు తన తాత్విక ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ నిరాడంబర జీవితం గడిపిన మహాతత్వవేత్త ఎపిక్యూరస్. ఎపిక్యూరస్ క్రీస్తుపూర్వం 341లో సేమాస్ అనే గ్రీకు ద్వీపంలో జన్మించాడు. ఏథెన్సులో తన 35వ ఏట తన ఇంటి వెలుపల ఎపిక్యూరస్ జ్ఞాన వనం (ది గార్డెన్ ఆఫ్ ఎపిక్యూరస్) అనే పేర విద్యాలయం స్థాపించాడు. అక్కడ 36 ఏళ్లపాటు నివసించి 270లో మరణించాడు. ఎపిక్యూరస్ భారతదేశంలో చార్వాకుల వలెనే ఇలా బోధించాడు: మరణానంతరం ఏ నరకలోకానికి వెళతామో, అక్కడ ఏ బాధలు అనుభవిస్తామో అనే భయం తగదు. ఎందుకంటే మరణం తర్వాత ఆత్మ అనేది ఉండదు. దేహంతో పాటే ఆత్మ నశిస్తుంది. మనిషి చనిపోయాక ఏమీ మిగలదు. మరణం శాశ్వత నిద్రతో సమానం. ఏమీ తెలియదు. ఏ అనుభూతీ తగలదు. అయినప్పుడు మరణానికి ఎందుకు భయపడాలి? జీవితం ఎంత సహజమో, మరణం అంతే సహజం. ఎపిక్యూరస్ సిద్ధాంతాలకు, భారతీయ భౌతికవాదులైన చార్వాకుల సిద్ధాంతాలకు సామ్యం చిక్కగా ఉంది. ఆ సామ్యాన్ని చూద్దాం. 'లోకాయతా పదేంత్వేవం నాస్తి దేవో ననిర్వృతిః ధర్మధర్మౌన విద్వేతే న ఫలం పుణ్య పాపయోః' (సర్వజ్ఞుడు అనుకుంటున్న దేవుడు లేడు. మోక్షము లేదు. ధర్మా ధర్మములగాని, పుణ్యపాపములు గాని లేవు. కావున వీటి వలన వచ్చు స్వర్గ నరకాది రూప ఫలములు లేవని లోకాయతులైన నాస్తికులు చెబుతున్నారు.) 'ఏతావానేవ లోకోయం యావానింద్రియగోచరః భద్రే వృకపదం పశ్చయద్వదంతి బహుశ్రుతాః||' (ఈ లోకము పంచేద్రియములకు ఎంత గోచరమగుచున్నదో అంత మాత్రమే ఉన్నది. పంచేంద్రియములు వ్యక్తీకరించు వస్తు జాతమునకు భిన్నమైనది లేదు). 'త తశ్చజీవనోపాయో బ్రాహ్మణైర్విహిత స్త్విహ మృకానాం ప్రేత కార్యాణి నత్యన్య ద్విద్యతేక్యచిత్' (మనుషులు మరణించిన తర్వాత శ్రాద్ధము మొదలైన కర్మలను బ్రాహ్మణులు తమ జీవనోపాధి కోసం సృష్టించారు అని చార్వాకులు వక్కాణించారు). ఎపిక్యూరస్ సిద్ధాంతాలు, చార్వాకుల సిద్ధాంతాలు ఒకే రకంగా ఉంటాయి. కార్ల్‌మార్క్స్ ఎపిక్యూరస్ సిద్ధాంతాలతో మొదట ప్రభావితమయ్యారు కాబట్టే ఎంగ్ హెగిలియన్ గ్రూప్‌లో ఆయన చేరినప్పటికీ కూడా హెగెల్ భావవాద గతితర్కంతో మార్క్సు తృప్తిపడలేకపోయాడు. అందుకే వాళ్ళు హెగిలియన్ భావవాదాన్ని అంగీకరించ టానికి మదనపడ్డారు. ఈ సందర్భంగా ఎపిక్యూరస్కు దగ్గరగా ఉండే ఫ్యూయర్ బాఖ్ భౌతికవాదానికి దగ్గరయ్యాడు. ముందు మార్క్స్‌తో పాటు ఆయనతో కలిసివచ్చే ఎంగ్ హెగెలియన్లు ఎంతో తాత్విక ఘర్షణకు గురయ్యారు. ఈ ఘర్షణలో ఉన్న యువ హెగెలియన్ వాదులకు ఫ్యూయర్‌బాక్ 1804-72లో రచించిన 'క్రైస్తవ మతసారం' అనే గ్రంథం భౌతిక వాద దృక్పథాన్ని రూపొందించింది. ఈ గ్రంథం యంగ్ హెగెలియన్లలో కలిగించిన చైతన్యం చరిత్ర గతిని మార్చింది. 'క్రైస్తవ మతసారం' అనే గ్రంథం ఒక్క దెబ్బతో ఈ వైరుధ్యాన్ని బద్దలు చేసింది. ఎలాంటి డొంకతిరుగుడూ లేకుండా ఈ గ్రంథం భౌతికవాదాన్ని తిరిగి సింహాసనంపై ప్రతిష్టించింది. తత్త్వశాస్త్రంతో ప్రమేయం లేకుండా ప్రకృతి స్వతంత్రంగానే అస్తిత్వంతో ఉంటుంది. అది పునాది. ఆ పునాదిపైననే ప్రకృతిలో ఉద్భవించిన మనం మానవులం పెరిగాం. ప్రకృతికీ, మానవునికీ బాహ్యంగా ఏదీలేదు. మన ఊహాలోకంలో మతపరమైన అద్భుతాల ద్వారా సృష్టించుకున్న ఉన్నతస్థాయి జీవులు మన సారాంశపు ఆశ్చర్యకరమైన ప్రతిబింబాలు మాత్రమే. దీంతో భ్రమ కాస్తా బద్దలైంది. 'వ్యవస్థ' ముక్కచెక్కలై పక్కకు విసిరేయబడింది. మనం ఊహాలోకంలో మాత్రమే ఉన్నదని భావించిన వైరుధ్యం కాస్తా కరిగిపోయింది. ఫ్యూయర్బాఖ్ భౌతికవాదం తత్త్వశాస్త్రంలో పెద్ద సంచలనాన్ని కలిగించింది. ఫ్యూయర్బాఖ్ భౌతికవాద ఉద్యమం హెగెలియన్ వ్యవస్థను దగ్గర దగ్గర భేదించింది. ఆలోచనకు, అస్తిత్వానికి గల సంబంధాన్ని, ప్రకృతికి, భావానికి గల సంబంధాన్ని స్పష్టం చేయగలిగింది. హ్యౌమ్, కాంట్లు ప్రతిపాదించిన భావవాద ధోరణులను, హెగెల్ వ్యక్తీకరించిన భావవాద దృక్కోణాలను ఫ్యూయర్బాఖ్ తన భౌతికవాదం ద్వారా చిత్తుగా ఖండించి స్పష్టమైన భౌతిక దృక్పథాన్ని రూపొందించగలిగాడు. పదార్థం మనస్సు నుంచి జనించలేదు. దానికి వ్యతిరేకంగా మనస్సే పదార్థం యొక్క అత్యున్నత సృష్టి అని వ్యాఖ్యానించారు. భావవాదం ఏ విధంగా అనేక దశలలో పరిణామం చెందుతూ వచ్చిందో భౌతికవాదం కూడా అనేక దశలలో అనేక రూపాలలో పరిణామం చెందుతూ వచ్చింది. అది ప్రకృతి శాస్త్ర రంగాలలో యుగ ప్రాధాన్యత కలిగి ఆవిష్కరణ జరిగినప్పుడల్లా దాని రూపాన్ని అది మార్చుకోవలసి వచ్చింది. మార్క్స్, ఎంగేల్స్ 1848లో కలిసిన తర్వాత వాళ్ళు హెగెల్ గతితార్కిక వాదాన్ని, ఫ్యూయర్బాఖ్ భౌతికవాదాన్ని సమన్వయించి గతితార్కిక భౌతికవాద సిద్ధాంతాలను ప్రపంచానికి చాటారు. అయితే వారు ఎప్పుడూ కూడా గతాన్ని, దేవుణ్ణి అంగీకరించలేదు. మానవుడు మతం నుంచి బయట పడకుండా తాత్వికుడు కాలేడని వారు ప్రగాఢంగా నమ్మారు. ఈనాటి పెట్టుబడిదారీ విధానాన్నీ, ఆ ఉత్పత్తి విధానాన్నీ, ఆ ఉత్పత్తి విధానం సృష్టించిన బూర్జువా సమాజాన్నీ పాలించే నియమాన్ని కూడా మార్క్స్ ఆవిష్కరించాడు. దీన్ని పరిష్కరించడానికి బూర్జువా ఆర్థికవేత్తలూ, సోషలిస్టు విమర్శకులూ ఇంతకుముందు చేసిన పరిశోధనలన్నీ చీకటిలో తడుములాటగా ఉన్నాయో ఆ సమస్య మీద అదనపు విలువ ఆవిష్కరణ హఠాత్తుగా కాంతిని ప్రసరించింది. అలాంటి ఆవిష్కరణలు రెండు ఒక జీవితకాలానికి సరిపడతాయి. మార్క్సు పరిశోధనలను పైపైన చేయలేదు. ప్రతి రంగంలోనూ, గణితశాస్త్ర రంగంలో కూడా ఆయన స్వతంత్ర ఆవిష్కరణలు చేశాడు. శాస్త్రజ్ఞుడుగా ఆయన అలాంటివాడు. కానీ ఇది ఆయన వ్యక్తిత్వంలో సగం కూడా కాదు. మార్క్సు అభిప్రాయంలో శాస్త్ర విజ్ఞానం చారిత్రకంగా క్రియాశీలమైన విప్లవ శక్తి. విద్యుచ్ఛక్తి రంగంలో జరిగిన ఆవిష్కరణల అభివృద్ధినీ, మార్సేల్ డెప్రే చేసిన ఆవిష్కరణలనూ ఆయన శ్రద్ధగా గమనించాడు. మార్క్సు తన నాస్తికవాద సిద్ధాంతం మీద తన తాత్విక సౌధాన్ని నిర్మించాడు. మనిషికి దుఃఖం పోవాలని బుద్ధుడంటే, దోపిడీ పోవాలని మార్క్స్ అన్నాడు. మార్క్సిస్టులకు, అంబేద్కరైట్లకు మార్క్స్ జీవితం, సిద్ధాంతాల అవగాహన, ఆచరణ చాలా అవసరం. ఎందుకంటే ఈనాడు హిందూ మతోన్మాదం విస్తరించింది. హిందూమతం పునాదులను కూల్చాలంటే కేవలం మార్క్స్ చెప్పిన ఆర్థికవాద సిద్ధాంతాలను అవగాహన చేసుకుంటే చాలదు. మతం విశ్వాసంతో కూడుకున్నది. విశ్వాసం బుద్ధిని వికసించనివ్వదు. హిందూ మతతత్వం 'కర్మ'ను బోధిస్తుంది. భౌతికవాద, నాస్తికవాద, హేతువాద సిద్ధాంతాల జోలికి పోనివ్వదు. ఒకడు మార్క్సిస్టుగా జీవిస్తూ దేవుణ్ణి నమ్మడం, గుళ్ళకు, గోపురాలకు వెళ్ళటం మా ఆవిడ కోసం వెళ్ళాననడం వల్ల సిద్ధాంత ఆచరణలో తేడా వస్తుంది. కార్మికలోకం ఆర్థిక పోరాటాల ద్వారా సాధించిన ధనాన్ని మతానికి ఖర్చుపెట్టడం అశాస్త్రీయం. కార్మికులు నాస్తికవాదులుగా మారితే దేవుడు లేడు. మన శ్రమను దేవుని పేరు మీద దోచుకుంటున్నారని తెలుసుకోగలుగుతారు. హేతువాద దృక్పథం ద్వారానే మార్క్సు ఎప్పటికప్పుడు శాస్త్రీయ జ్ఞానాన్ని స్వీకరిస్తూ వచ్చాడు. మార్క్సిజంలాగే మార్క్సిస్టులకు, అంబేద్కరైట్లకు నిరంతర అధ్యయనం అవసరం. మార్క్స్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సామ్రాజ్యవాద భావజాలాలపై యుద్ధం చేశాడు. మన పిల్లలను సామ్రాజ్యవాద బంటులుగా పెంచుతూ మనం మార్క్సు సిద్ధాంతాలు వల్లిస్తే పరిణామం త్వరితం కాదు. మార్క్సు జీవితంలో ప్రధాన అంశం సిద్ధాంతాల బోధనే కాదు ఆచరణ. ఆచరించని ఏ సిద్ధాంతమైనా ఓడిపోతుంది. ఈనాడు నరేంద్రమోడీ ప్రభుత్వం మతఛాందసవాదాన్ని, వర్ణ, కుల ఆధిపత్య వాదాన్ని, హిందూ మతవాద శక్తులన్నింటినీ ఏకం చేసి నడిపిస్తోంది. మామూలుగా హిందూ మతవాద శక్తులు చీలికలు పేలికలుగా ఉంటాయి. తమకు రాజ్యం వచ్చినప్పుడే ఒక గొడుగు కిందకు వస్తాయి. అద్వైతులు, ద్వైతులు, విశిష్టాద్వైతులు, శైవులు, అన్ని తరగతులవారు ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్‌ల ఆధ్వర్యంలో ఒకటవుతున్న దశలో మార్క్సువాదులు, అంబేద్కర్, హేతువాద, నాస్తిక, లౌకికవాదులు ఏకం కాకతప్పదు. ఐక్యత ఒక శక్తి అనే వాదాలుంటాయి. ప్రధాన సూత్రం ఈ సృష్టికి మూలం దేవుడు కాదు, సృష్టి పరిణామ క్రమంలో ఉంది అని అంగీకరించటమే. నాస్తికత్వం కూడా ఆచరణలో మతవాద కుటుంబవాద ధోరణుల్లోకి వెళ్ళడం. అంబేద్కర్‌వాదం కూడా ఆచరణలో కులవాద ధోరణుల్లోకి వెళ్ళడం, మార్క్సువాదం నాస్తికత్వాన్ని అంగీకరిస్తే ప్రజాశ్రేణులు సమీకరణ కావు అనుకోవడం నుంచి బయటపడి మార్క్సు - అంబేద్కర్ మార్గంలో సిద్ధాంతం, ఆచరణలను సమన్వయించుకొని ఒక మహోజ్వల సాంస్కృతిక, తాత్విక ఉద్యమ ప్రభంజనాన్ని సృజిద్దాం. ఎపిక్యూరస్ మీద పరిశోధన చేసిన పరిశోధకుడు, నాస్తికుడు, హేతువాది, సిద్ధాంతకర్త, ఆచరణశీలి మార్క్స్. ఆయనను ఆరాధించడమే కాక ఆయనను అనుసరించడం మన కర్తవ్యం. మన వాదం అనేది నాస్తికవాద పునాదుల మీదే ప్రతిఫలిస్తుంది, ప్రజ్వలిస్తుంది. ప్రపంచాన్ని మార్చే సూత్రాలదే విజయం. నియంతలు అన్ని చారిత్రక సందర్భాల్లోనూ ఓటమి పొందారు. ప్రజల ఆచరణ ఒక సముజ్వల శక్తి. ఆ దిశగా పయనిద్దాం.. - డాక్టర్ కత్తి పద్మారావు

No comments:
Post a Comment