ఇప్పటి వరకు బిజెపికి చెందిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులకే అవినీతి మకిలి అంటగా తాజాగా సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ ముడుపుల రొంపిలో చిక్కుకొని విధానాల్లోనే కాదు అవినీతిలోనూ కాంగ్రెస్ అడుగుజాడల్లో నడుస్తున్నామని పక్కాగా నిరూపించారు.
గుజరాత్ సిఎంగా మోడీ ఉన్న సమయంలో పారిశ్రామిక దిగ్గజాలైన సహారా, బిర్లా గ్రూపుల నుంచి పలు తడవల్లో సుమారు యాభై ఐదు కోట్ల రూపాయలు వ్యక్తిగతంగా ముడుపులు ముట్టాయని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించి రాజకీయంగా పెను సంచలనం సృష్టించారు. మోడీ వ్యక్తిగత అవినీతికి పాల్పడ్డట్లు తన వద్ద ఆధారాలున్నాయని, బహిర్గతం చేస్తే భూకంపమేనని, అందుకే పార్లమెంట్‌లో తనను మాట్లాడనీయట్లేదని రాహుల్ గత గురువారం పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలను అప్పుడు బిజెపి కొట్టిపారేసింది. భూ కంపం సృష్టించమనండి అని సవాలు విసిరింది. అగ్నిపునీతులమని, గంగాజలమంత పవిత్రులమని స్వీయ భుజకీర్తులు తగిలించుకునే ప్రధాని మోడీ, ఎందుకు ఈ రెండున్నరేళ్ల తన ఏలుబడిలో సహారా, బిర్లా కేసుల్లో విచారణ జరగలేదో చెప్పగలుగుతారా? రాహుల్‌ను పార్ట్‌టైం నాన్ సీరియస్ రాజకీయ నేత అని, అగస్టా కుంభకోణంలో తమ కుటుంబం పాత్ర నుంచి దృష్టి మళ్లిస్తున్నారని, అంత్యప్రాసలతో బిజెపి నేతలు హేళన చేస్తే తప్పు ఒప్పు అవుతుందా? తాము ఆవుల కంటే సాధు జీవులమని వక్కాణించుకుంటే సాధు జీవులైపోతారా? ఆరోపణలను రాహుల్ చేసినా, మరొకరు చేసినా వాటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రధానిపై ఉంది. నిష్పాక్షిక దర్యాప్తునకు ముందుకొస్తేనే తాను చెప్పుకనే సచ్ఛీలతకు కొంతలో కొంతైనా విశ్వసనీయత ఉంటుంది. అలా కాకుండా ఆరోపణలు, ప్రత్యారోపణలు, మాటల గారడీతో ఎదురుదాడి చేస్తే ఉపయోగం ఏమీ ఉండదు. పైగా ప్రజల్లో అపనమ్మకం వేళ్లూనుకుంటుంది. గతంలో హవాలా, జైన్ డైరీలు బయల్పడినప్పుడు వాటిపై దర్యాప్తులు జరిగాయి. విచారణలకు నాటి బిజెపి పెద్దలు డిమాండ్ చేశారు కూడా. అలాగే సహారా, బిర్లా కార్యాలయాల్లో ఐటి తనిఖీల్లో లభ్యమైన డైరీలు, ఇతర డాక్యుమెంట్లలో నిక్షిప్తమైన సమాచారంపై సమగ్ర విచారణ జరిపించాల్సిన బాధ్యత ప్రధానిపై తప్పకుండా ఉంది.
అవినీతి ఆరోపణలు బిజెపికి కొత్తేమీ కాదు. మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్ పీకల్లోతు కూరుకున్నారు. ఆర్థిక నేరగాడు లలిత్‌మోడీ వ్యవహారంలో కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ సిఎం వసుంధరరాజే పాత్ర వెలుగు చూసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్రలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఇటీవలే అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రి, నెల్లూరు జిల్లాలో ట్రస్టు కార్యకలాపాల్లో వెంకయ్యనాయుడు, అంతకుముందు బంగారు లక్ష్మణ్ తదితరులు అడ్డంగా అవినీతిలో దొరికినవారే. తమ వారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై మోడీది ఎప్పుడూ మౌనమే. యుపిఎ సర్కారు ఎంతగా అవినీతి పంకిలం అంటించుకుందో దేశం యావత్తు చూసింది. స్వయంగా అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై బొగ్గు స్కాం ఆరోపణలొచ్చాయి. వివిధ స్థాయిల్లో దర్యాప్తులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అవినీతిని తూలనాడే బిజెపి పెద్దలకు తమ వారి అవినీతిపై నోరెందుకు పెగలదు? ఎన్నికల్లో బిజెపి మంచినీళ్ల ప్రాయంగా ధనం ఖర్చు చేసింది. కార్పొరేట్ల నుంచి ఆ పార్టీకి భారీగా నిధులందుతున్నాయి. కార్పొరేట్ల నిధుల కోసం మోడీ సర్కారు ఎఫ్‌సిఆర్‌ఎ చట్టానికి సవరణలు ప్రతిపాదించింది. కార్పొరేట్లకు ఇంతగా రెడ్ కార్పెట్ వేసే బిజెపి పెద్దలు, అవినీతికి తాము దూరమంటే ఎవ్వరూ నమ్మరు. కేవలం ఆరోపణలని తప్పించుకోకుండా ఇప్పటికైనా ప్రధాని మోడీ తనపై స్వతంత్ర విచారణకు ఆదేశించుకొని తన సచ్ఛీలతను నిరూపించుకోవాలి. (ప్రజాశక్తి)

No comments:
Post a Comment