Sunday, 11 December 2016

|| అసమర్థుడు మోడీనామధేయుడు ||



           'లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె బ్రాణంబులున్‌/ఠావుల్‌ దప్పె మూర్ఛవచ్చె తనువున్‌ డస్సెన్‌ శ్రమం బయ్యెడిన్‌' అంటూ మొసలి పట్టుకు గురైన గజరాజులా విలవిల్లాడుతున్నాడు సగటు భారతీయుడు. 'అందమైన వస్తు సముదాయం అంతా/ఎక్కడో ఒక్కడే వచ్చి/ఎత్తుకు పోతూ ఉంటే చూచి, 'అన్యాయం, అన్యాయం?' అని మేమంటే-'అనుభవించాలి మీ కర్మం' అంటాడు/పొద్దు పొడిచి పొద్దు గడిచేదాకా/ఎద్దుల్లాగు పనిచేసే మమ్మల్ని/మొద్దుల్నీ, మొరటుల్నీ చేసి/ముద్దకి కూడా దూరం చేశాడు'' అని మహాకవి శ్రీశ్రీ 'వాడు' కవితలో చెప్పినట్టుగా...
పొద్దు పొడిచి పొద్దు గడిచేదాకా ఎటిఎంలు, బ్యాంకుల చుట్టూ తిరగక తప్పడంలేదు సగటు మనిషికి. కూడుకు, కూలికి దూరం కాక తప్పడంలేదు. 'ఆ అవ్వే మరణిస్తే/ఆ పాపం ఎవరిదని/వెర్రిగాలి ప్రశ్నిస్తూ/వెళ్లిపోయింది...' అన్నట్టుగా క్యూల్లో నిలబడి మరణిస్తే... అదేమని ప్రశ్నిస్తే... ఆ తప్పు నాదికాదని సెల్యూట్‌ చేసి, వెర్రిమొగం వేసి... తన అసమర్థతను కప్పిపుచ్చుకొని... తన ఆధిక్యతను నిలబెట్టుకోవడానికి వీరావేశంతో ఊగిపోతున్నాడు. 'ఎవరో మాటలు నమ్మిన... సీతారామారావు కూడా అలాగే కోపంతో ఊగిపోతాడు. తన కుమార్తెను ఇష్టంవచ్చినట్టు కొడతాడు చిన్నపాప అని కూడా చూడకుండా. పరాయి వ్యక్తి ముందు తన అసమర్థతను కప్పిపుచ్చుకొని, ఆధిక్యతను ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తాడు. తన అహాన్ని సంతప్తి పరచుకుంటాడు. ఇలా ప్రతి సందర్భంలోనూ తనను తాను సమర్థించుకుంటూ... తన తప్పేమీ లేదని, ఎదుటివారే తనను అర్థం చేసుకోడంలేదని వాపోతుంటాడు. ఇది గోపీచంద్‌ 'అసమర్థుని జీవయాత్ర' నవలలో 'అసమర్థుడి' పాత్ర స్వభావం. మన కథలోని హీరో... సదరు సీతారామారావుకు నకలు. తాను చేసిన పని అవివేకమని, అత్యంత అసంబద్ధ నిర్ణయమని తెలిసినా తన అసమర్థతను, అవివేకాన్ని కప్పిపెట్టుకోవడానికి, తన ఆధిక్యతను ప్రదర్శించడానికి పరిమితమౌతున్నాడు. 'తను చెప్పదలచుకున్న సంగతి తనకే స్పష్టంగా తెలీనప్పుడు... తన చేతగాని తనాన్నీ, అర్థ అస్పష్టతనీ- ఛందస్సు చీరల వెనకా, అలంకారాల మధ్యా, కఠిన పదాల బురఖాలలోనూ దాచి మోసగించాలని చూస్తాడు కవి...' అంటూ శ్రీశ్రీ మహాప్రస్థానం యోగ్యతాపత్రంలో చలం చమత్కరిస్తాడు. ఇదేమాదిరిగా తన అసమర్థతను, అస్పష్టతను తన మాటల చాతుర్యం మాటున, కార్పొరేట్‌ ఇనుప కంచెల చాటున, విదేశీయాత్రల పేరున తప్పించుకు తిరుగుతూ... మోసగిస్తున్నాడు.
దేశంలోని ఎటిఎంలు, బ్యాంకుల ముందు నిల్చొని నిల్చొని దాదాపు వంద మంది వరకు చనిపోగా, ఇప్పటికీ లైన్లలో నిలుచుండక తప్పని పరిస్థితి. గజేంద్రుడి విన్నపానికి చలించిన విష్ణువు 'సిరికిం జెప్పడు.. శంఖచక్రాదులను ధరింపక'నే పరుగు పరుగున గజేంద్రుని కడకు వెళ్లాడని పోతన చెబుతాడు. ఎటిఎంల ముందు ప్రాణాలు పోగొట్టుకుంటున్న... నీరసించిపోతున్నవారిని కాపాడ్డానికి మాత్రం ఎవ్వరూ రావడంలేదు. పాత కరెన్సీ సంగతి పక్కనపెట్టి... కొత్త కరెన్సీ కట్టలే గుట్టలు గుట్టలుగా దొరుకుతున్నా... నాకు కనిపించేదే అవినీతి... నా మాటే శాసనం అంటూ- అటు పార్లమెంటుకు, ఇటు ప్రజలకు మొహం చూపించలేని ప్రధాని మోడీ... తనకు తానే అసమర్థ జీవనంలోకి నెట్టబడ్డాడు. 'అవినీతి... నల్లధనం... టెర్రరిజం మీద పోరాటం చేసేందుకు క్యూల్లో నిలబడుతున్న భారతీయులందరికీ సెల్యూట్‌ చేస్తున్నా' అంటూ ట్వీట్‌ చేసి సరిపెట్టుకున్నాడు. మానవ జాతిని ఉద్ధరించడానికి కొత్త మతాన్ని కనిపెట్టిన ప్రవక్త వలె ఒక చిరునవ్వు నవ్వితే... ఓ ట్వీట్‌ చేస్తే... సమస్య సమసిపోతుందా? కష్టాలు తీరిపోతాయా? తన వైఫల్యాన్ని... అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఈ ఎమోషనల్‌ డ్రామా పనికొస్తుందేమో తప్ప... గత 50 రోజులుగా కష్టనష్టాలు అనుభవిస్తూ, త్యాగాలు చేస్తున్న ప్రజకు ఒరిగిందేమిటి? తన అసమర్థతను ఒప్పుకోలేని వ్యక్తి మాటలు ఊరటనిస్తాయా? 'తనలో లోపాలే లేవనుకునే లోపానికి మించిన లోపం' మరొకటి ఉంటుందా? 'కష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ' అన్నట్టుగా... మోడీ 'బాధ' దేశానికి బాధగా పరిణమించింది. విజయ యాత్రగా కొనసాగాలనుకున్న మోడీ నిర్ణయం... 'అసమర్థుడి జీవయాత్ర'గా మారింది.
కష్టించి పని చేసేవారు, విజ్ఞానవంతులు, తెలివి, నైపుణ్యం గలవారు అన్ని చోట్లా గౌరవింపబడతారనేది జగమెరిగిన సత్యం. అజ్ఞానులు, అసమర్థులు, మందబుద్ధులు ఎల్లప్పుడూ అవమానాల పాలవుతారు. తమ నిర్ణయాలతో అభాసుపాలవుతారు. అటువంటి వాళ్ళు ఏదో ఒకటి చేసి తప్పించుకు తిరగాలనుకుంటారు తప్ప తమ ప్రవర్తనను మార్చుకోరు. ఇలాంటివారిని దష్టిలో పెట్టుకొనే 'అసమర్థుడు అప్పులు, అవకాశవాది తప్పులు' చేస్తారనే నానుడి చెబుతుంటారు. నిస్సహాయ ప్రజల జీవితాలను ఛిద్రం చేయడంలో శక్తిమంతంగా, సమర్థవంతంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం... వారి కష్టాలను తీర్చే విషయంలో నిర్లక్ష్యంగా, నిస్సహాయంగా, నిర్లజ్జగా వ్యవహరిస్తోంది. తన చాతకానితనాన్ని అసంబద్ధ తర్కంతో సమర్థించుకుంటూ... ప్రశ్నించేవారిని దోషులుగా చూస్తోంది. ప్రశ్నించడం మానవ లక్షణం... ప్రశ్నించిన వారి గొంతు నొక్కడం నియంతల లక్షణం. 'అసమర్థుని ఆఖరి అస్త్రమే హింస' అన్న నానుడిని నిజం చేస్తూ హింసకు సైతం వెనుదీయడంలేదు. ఠాగూర్‌ స్వప్నించిన భయాందోళనలు, సంకుచిత దక్కులు లేని స్వర్గ సీమను నిర్మించుకోవాలంటే... కష్ణశాస్త్రి చెప్పినట్టుగా 'క్రౌర్య కౌటిల్య కల్పిత కఠిన దాస్య/శంఖలములు తనంతనే చెదిరిపోవ/గగనతలము మార్మోగ కంఠమెత్తి/ జగమునిండ స్వేచ్ఛాగాన ఝరుల నిండు' అంటూ ఆకాశం బద్దలయ్యేలా గొంతెత్తాల్సిందే.

No comments:

Post a Comment