Sunday, 11 December 2016

|| మోడీ అవతారం - 'కర్మ' మంత్రం ||



             ప్రధాని నరేంద్రమోడీ విశ్వహిందూ పరిషత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, సామ్రాజ్యవాద ద్రవ్య సంస్థలు, బహుళ జాతి సంస్థలు రూపొందించిన ఒక వ్యక్తిత్వంగా మనకు కనిపిస్తున్నారు. ఇది మన కర్మ అని కరుడు గట్టిన హిందూత్వ మతభావాలు చెబుతున్నా యి. మనకు ప్రాప్తించిన కర్మను మనం పొందకతప్ప దంటున్నాయి. అందుకే భగవద్గీత 'కర్మణ్యేవాధికారస్తే మా పలేషు కదాచన| మా కర్మఫల హేతుర్భూ ర్మాతే సజ్గో స్త్వకర్మణి' (నీకు కర్మ జేయుటయందు అధికారము కలదు. దాని ఫలమునందు కాదు.
కర్మ ఫలమునం దా సక్తి పొందవలదు. కర్మ వదలుట యందు కూడా అభిలాష పొందకూడదు.) నరేంద్రమోడీ పెద్ద నోట్లను నవంబర్‌ 8 రాత్రి రద్దు చేసిన తర్వాత బ్యాంక్‌ల బారుల్లో నిలబడ్డ ప్రజలు ఇది మన కర్మ. 'ఏ కర్మ యోగో వచ్చి మనకు తీపి కష్టాలు తెచ్చాడు అనుకుంటు న్నారని, ఈ కర్మయోగికి ప్రచారకుడైన వెంకయ్య నాయుడు ఈ చర్యతో భారతదేశానికి కొత్త భవిష్యత్తు రాబోతోందని కొత్త వ్యాఖ్యానాలు చెప్తున్నారు. ఈ వాక్యాలకు బడా పెట్టుబడిదారులు, దేశీయ దళారులు, భూస్వామ్య పెత్తందార్లు ఎంతో ఆనందపడుతున్నారు. ఈ చర్య వల్ల లబ్ధి పొందుతున్న కార్పొరేట్‌ సంస్థలు ఆనందోత్సాహాల్లో మునిగి ఉన్నాయి. ఒక వృద్ధురాలు మూడు రోజులుగా బ్యాంక్‌ క్యూలో నిలబడి డబ్బు రాక టీ నీళ్ళ కోసం రోదిస్తుంటే మోడీ నిర్దయుడని అర్థం కాదా! దేశంలోని కోట్లాది మంది పేద ప్రజలను గుండెకోతకు గురిచేశారు మోడీ. అయితే ఈ మాటలన్నీ వినపడకుండా మోడీ తనకున్న ప్రచార సాధనాలతో పెద్దఎత్తున ఇది దేశ పునర్నిర్మాణానికి పెద్ద అడుగు అని, అరుణ్‌ జైట్లీ ద్వారా డిజిటల్‌ భారత్‌ సృష్టిస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి ఇప్పటికే బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి కొత్తగా పొదుపు సొమ్ము వస్తే తప్ప కార్పొరేట్‌ సంస్థల పాత బ్యాంక్‌ బకాయిలను మాఫీ చేయటం సాధ్యం కాదు. ఇప్పటికే రూ.1,14,000 కోట్ల మొండి బకాయిలను మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. మరో రూ.8 లక్షల కోట్ల మొండి బకాయిల జాబితా మోడీ ఎదుట ఉంది. వాళ్లు ఆయనతో మాఫీ చేయించు కోవా లంటే దేశ ప్రజల నుంచి అంతే మొత్తం పొదుపు సొమ్మును రాబట్టుకునే ప్రతిపాదన కూడా ఆయన ఎదుట ఉంచాలి. నోట్ల రద్దు చర్య అందుకు ఉపయోగపడుతుంది. ఈ చర్యతో ప్రజా జీవితం అతలాకుతలమైంది. ముఖ్యంగా ప్రజలలో అభద్రత, మనోవ్యథ పెరిగాయి. ఈ ఎత్తుపల్లాలను సృష్టించి పేదలకు అన్యాయం చేసి ధనవంతులను భుజాలకు ఎత్తుకునే చర్యలను సమర్థిస్తూ మోడీకి భజన చేస్తున్న స్వాములు, యోగులు భగవద్గీతను ఆయనకు అన్వయించి ఇలా బోధిస్తున్నారు. 'నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్‌' (ఆశ లేక ఆత్మ సంయమనం, చిత్త సంయమనం కలిగి, సమస్త మమతలను త్యజించి, కేవలం శరీరంతో మాత్రం కర్మచేయుచున్నాను. అతడు పాపమును పొందడు.) దేశవ్యాప్తంగా సాధువులు, స్వాములు మోడీ కారణజన్ముడని, యుగపురుషుడని ప్రచారం చేయడానికి కారణం నల్లధనం ఇబ్బడిముబ్బడిగా దేవాలయాలకు చేరటమే. దేశవ్యాప్తంగా ప్రభుత్వ బడ్జెట్‌ను కూడా ఛాలెంజ్‌ చేసే ధనం దేవాలయాలకు చేరుతోంది. కేరళలోని తిరువనంతపురం పద్మనాభస్వామి దేవాలయానికి ఇప్పటికి ఉన్న సంపద ఒక లక్షా 36 వేల 99 కోట్ల 90 లక్షలు. ఇంకా బంగారు నిల్వలు ఎవరూ చూడటానికి వీల్లేకుండా తాళాలు వేసిన గదిలో ఎంత ఉన్నాయో చెప్పలేమంటున్నారు. అలాగే తిరుపతి దేవాలయానికి సంవత్సరానికి రూ.650 కోట్లు విరాళం వస్తుంది. తిరుపతి లడ్లు అమ్మడం ద్వారానే ఏటా రూ.11 కోట్ల ఆదాయం వస్తుంది. దాని స్థిర, చరాస్తులు లెక్కలేనన్ని ఉన్నాయి. ముంబాయిలోని షిరిడీ సాయిబాబా గుడిలో రూ.32 కోట్ల విలువ చేసే బంగారం ఉంది. ఆరు లక్షలకు మించిన నాణేలున్నాయి. రూ.300 కోట్లు ఏటా విరాళాలు వస్తుంటాయి. జమ్మూలోని వైష్ణోదేవి గుడికి వార్షిక ఆదాయం రూ.500 కోట్లు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ స్వర్ణదేవాలయ పైకప్పు బంగారంతో చేయబడింది. అక్కడి గురుగ్రంథ్‌ సాహెబ్‌ అనే మతగ్రంథాన్ని ఉంచిన అరుగు మణులు, మాణిక్యాలతో చేయబడింది. మధుర మీనాక్షి దేవాలయానికి ఏటా రూ.6 కోట్ల ఆదాయం వస్తుంది. పూరీ జగన్నాథ దేవాలయంలో 130 కిలోల బంగారం, 200 కిలోల వెండి ఉంది. ఒక యూరోపియన్‌ భక్తురాలు రూ.1,72,00,000 విరాళం కూడా ఇచ్చింది. వారణాసిలోని కాశీవిశ్వనాథ ఆలయానికి బంగారపు తొడుగులున్నాయి. ఏటా రూ.5 కోట్ల ఆదాయం వస్తుంది. గుజరాత్‌లోని సోమనాథ ఆలయ వార్షిక ఆదాయం రూ.33 కోట్లు. మరి ఈ దేవాలయాలతో పాటు దేశంలోని క్రైస్తవ మందిరాలకు, ప్రసిద్ధమైన మసీదులకు కూడా కలిపితే వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మనిషికి పట్టెడన్నం దొరకట్లేదు. మరి మానవుడు చేసిన దేవుడికి, దేవతలకు లక్షల కోట్ల ఆదాయాలు ఎందుకు? వీటిని ప్రజల విద్య కోసం ఉపయోగించుకోవచ్చు కదా! అని హేతువాదులు ప్రశ్నిస్తే మోడీని సమర్థించే స్వాములు, యోగులు, పెట్టుబడిదారులు వారి ఛానల్స్‌లో, పత్రికల్లో భగవద్గీతలో ఉన్న కర్మవాదాన్ని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. 'నీకు కలిగిందే నువ్వు తిను, అసలు నీవు నీ కోసం పుట్టలేదు, నేను పుట్టిస్తే పుట్టావు. నేను ఏమి కలుగచేస్తే అదే తిను. ఒకవేళ నీకు మరణం కలుగచేసినా నువ్వు దానిని ప్రేమతో స్వీకరించు' అని ఈ స్వాములంతా ఆయనకు అనుకూలంగా బోధించటమేకాక భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను ఇలా బోధిస్తున్నారు. 'కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః ఆకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః 17' (సత్కర్మను గురించియు తెలిసికొనవలయును. నిషిద్ధ కర్మలను గురించి కూడా తెలిసికొనవలయును. అంతేకాక అకర్మను గురించి కూడా తెలిసికొనవలయును. ఏలన స కర్మ మార్గము దురవగాహమైనది). మత భావన, కర్మ భావనలు మనుషులకు వివేచన నుంచి తొలగిస్తాయి. స్వాములు, యోగులు ఏం చెప్తే అదే నిజమనుకుంటారు ప్రజలు. పెద్దగా అరిచి అబద్ధం చెప్తే అబద్ధమైతే పెద్దగా ఎందుకు అరుస్తారనుకుంటారు! అయితే మోడీ ప్రభుత్వం స్విస్‌ బ్యాంక్‌లో డబ్బు దాచుకున్నవారి పేర్లను ఎందుకు బయటపెట్టలేకపోతున్నది? బ్యాంక్‌ల నుంచి డబ్బు ఎగ్గొట్టిన బడాచోరుల రుణాలు ఎందుకు మాఫీ చేసింది? దేశం మొత్తం మీద కోట్లాది మంది ప్రజలు బ్యాంక్‌లు, ఎటిఎంల ఎదుట డబ్బు దొరక్క నిరుత్తరులవుతున్నారు. దేశ శ్రేయస్సు కోసం తాము ఈ కార్యం చేశామని అరుణ్‌ జైట్లీ, వెంకయ్యనాయుడు, నరేంద్రమోడీ గొంతెత్తి చాటుతున్నారు! ఈ విషయాన్ని పార్లమెంటులో మోడీ ఎందుకు చెప్పలేకపోతున్నారు. తాము డిజిటల్‌ భారతం సృష్టిస్తున్నామంటున్నారు. నేటి మన 130 కోట్ల జనాభాలో 2.5 నుంచి 3 శాతమే డెబిట్‌ కార్డులు లేదా క్రెడిట్‌ కార్డులను వాడుతున్నారు. మరి ఇంకొంత శాతం ఈ-వ్యాలెట్లను వాడుతుండొచ్చు. ఏదిఏమైనా సమాజంలోని ఆర్థికంగా ఉన్నతస్థాయి వర్గానికి చెందిన ఇలాంటి వారంతా కలసి నాలుగు నుంచి ఆరు కోట్ల వరకు ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వం రాయితీలిస్తున్నది వీరికే. మరోపక్క మత ఛాందసత్వాన్ని, పరమత అహసనాన్ని, వర్ణతత్వాన్ని, అవిద్యను పెంచుతున్నారు. 'మీరు యజ్ఞయాగాలు చేయండి, దానివల్ల వర్షాలు కురుస్తాయి. అందువల్ల పంటలు పండుతాయి. మీరు సుభిక్షంగా జీవిస్తారు' అని స్వాములు బోధిస్తున్నారు. దానికి కార్తీకమాసానికి లక్షల దీపాలు వెలిగించి ఉత్సవాలు చేస్తున్నారు. అందుకే వారు భగవద్గీతను ఇలా బోధిస్తున్నారు. 'అన్నాద్భవన్తి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్‌ తస్మాత్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్టితమ్‌' (అన్నం వల్ల జీవరాసులు పుట్టును. వర్షం వల్ల అన్నం కలుగుతుంది. యజ్ఞం వల్ల వర్షం కలుగుతుంది. ఆ యజ్ఞం కర్మ వల్ల కలుగుతుంది. కర్మ బ్రహ్మ వల్ల కలుగుతుంది. ఆ బ్రహ్మ అక్షర పరమాత్మ నుంచి ఉద్భవిస్తుంది. అందువల్ల సర్వగతమైన బ్రహ్మ నిత్యము యజ్ఞంలోనే ప్రతిష్టింపబడి ఉంది.) ఈ యజ్ఞాలకు ఎంత నూనె, ఎంత నెయ్యి, ఎన్ని కోట్ల ధనం ఖర్చవుతుంది. దేశ సంపదను ఉత్పత్తిరంగంలోకి రాకుండా మూఢాచారాల్లోకి, ప్రజల్ని మత్తులో ముంచడానికి నరేంద్రమోడీ అనుయాయులు దీపోత్సవాలు చేస్తున్నారంటే, ఇంకోపక్క 'ప్రజలు ఇబ్బందులు పడక తప్పదు. పది లక్షల కోట్ల కరెన్సీని ముద్రించటం అప్పుడే సాధ్యం కాదని' ప్రభుత్వం హుకుం జారీ చేస్తుందంటే దీని వెనక మతవాద భావం, కర్మవాద భావం ఒక నాయకుడిని తయారుచేయటం వల్ల అలాంటి నాయకుడిని సమర్థించడానికి కొందరు ముఖ్యమంత్రులు ముఖ్యంగా నారా చంద్రబాబునాయుడు, కెసిఆర్‌ వంటివారు డిజిటల్‌ జపం చేస్తూ పేద ప్రజలకు ఎంత ద్రోహం తలపెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆదివాసీ జాతులు నివసిస్తున్నాయి. ఉసిరి, తేనె, అడ్డాకు, చింతపండు, జిగురు, కొండ చీపుర్లు వంటి ఉత్పత్తులను అడవి నుంచి సేకరించి, సంతలో అమ్మి నిత్యావసర వస్తువులు కొనుక్కుని జీవనం సాగిస్తారు. కొన్నిసార్లు జొన్నలు, చిక్కుళ్లు, సామలు, ఆలుపలు, కొండ కందులు వంటివి పండించినా, అటవీ ఉత్పత్తులపైనే ప్రధానంగా వారు ఆధారపడతారు. వాళ్లది చాలా చిన్న ప్రపంచం. అడవే వాళ్ల జీవితం. అలాంటి అడవిని నమ్ముకున్న ప్రజలకు ప్రభుత్వాలు ఈ రోజు నిలువ నీడ లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశానికి మూలశక్తులైన గిరిజనులు, దళితులు, బహుజనులు నవంబర్‌ 8 నుంచి ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక సంఘర్షణలో చిక్కుకుపోయారు. చేయడానికి కూలీ లేదు. తినడానికి తిండి లేదు. చేతికి డబ్బు రాదు. కంటికి కునుకు లేదు. పిల్లోడికి పాలు లేవు. ఫీజుకు, బస్సు ఛార్జీలకు డబ్బుల్లేవు. గ్యాస్‌కు డబ్బులు లేక, వండుకునే వీలులేక ఎంతోమంది పేదలు పస్తులుంటున్నారు. వీరందరికీ ఇది మీ కర్మ, ఈ కర్మ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ కర్మ అవతార పురుషుడైన నరేంద్రమోడీ వల్ల జరిగింది. మరొకరి వల్ల సాధ్యం కాదు అని వెంకయ్యనాయుడు, అరుణ్‌ జైట్లీ, కార్పొరేట్‌ అధిపతులు ఘోషిస్తున్నారు. మరోపక్క మత ఛాందసవాదులు, స్వాములు, యోగులు, మఠాధిపతులు, బాబాలు మోడీని సమర్థిస్తూ కర్మవచనాలు పలుకున్నారు. ఇంకోపక్క చంద్రబాబు మిత్రుడు, తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు శేఖర్‌రెడ్డి ఇంట్లోనేమో వంద కిలోలకు పైగా బంగారం, వంద కోట్లకు పైగా కొత్త కరెన్సీ వెలికి వస్తూనే ఉంది. సామాన్యునికి రెండు వేలు దొరకడం గగనమైనప్పుడు ఈ పాలకవర్గ సభ్యుడికి ఇంత కొత్త కరెన్సీ ఎలా దొరికింది. అదీ కర్మ ఫలమేనా! అని ప్రజలు ఆలో చిస్తున్నారు. చంద్రబాబు శుక్రవారం ఢిల్లీలో ప్రధాన మంత్రితో సమావేశమై ఈ బృహత్తరమైన నగదురహిత కార్యక్రమానికి, డిజిటల్‌ ఇండియా రూపకల్పనకు తాను నాయకత్వం వహిస్తానంటున్నారు. మరోపక్క రైతుకు విత్తనాలు లేవు, ఎరువులు లేవు. కూలీలకు డబ్బు లేదు. రుణమాఫీ కాలేదు. 'విజరుమాల్యా డబ్బులు ఎలా రద్దయ్యాయి' అని ప్రశ్నిస్తున్నారు! ఇప్పుడిప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మోడీ, చంద్రబాబునాయుడు వంటి వారు ఏ మత, కుల, పెట్టుబడిదారీ శక్తుల అండతో రాజ్యం లోకి వచ్చారో? వీరి వెనుక ఎవరు 'కర్మ' మంత్రం జపిస్తు న్నారో? నిజమే ఆకలి అన్ని శాస్త్రాలనూ బోధిస్తుంది. ధనలేమి మూలకారణాలను వెతుకుతుంది. తప్పకుండా ప్రజలు వివేకవంతులవుతారు. ఈ అవతార పురుషుల గుట్టు రట్టవుతుంది. ఏ శక్తులు వీళ్లని సృష్టించాయో ప్రజలు తెలుసుకోగలుగుతారు. ప్రత్యామ్నాయ రాజ్యాధికార భావం విజయవంతం అవుతుంది.  - డాక్టర్‌ కత్తి పద్మారావు

No comments:

Post a Comment