అభివృద్ధి పేరిట మరో విధ్వంసానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. పచ్చని పొలాలతో కళకళలాడే ఉభయగోదావరి జిల్లాలను కాలుష్య కాసారంగా మార్చనున్నాయి. కృష్ణా-గోదావరి బేసిన్‌లో షేల్ గ్యాస్ వెలికితీతకు బావులు తవ్వాలని ఒఎన్‌జిసి నిర్ణయించింది. తొలుత ఒఎన్‌జిసిని ప్రవేశం చేయించి ఆ తర్వాత కార్పొరేట్ సంస్థలకు అధికారాన్ని కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహరచన చేశాయి.
లక్షలాది సంవత్సరాల క్రితం అడవులు తగలబడిన ఫలితంగా ఏర్పడిన శిలాజాలు భూమి లోతుల్లో నిక్షిప్తమై ఉంటాయి. వీటి నుంచి గ్యాస్, చమురును వెలికితీసే ప్రక్రియనే ఫ్రాక్చరింగ్ అంటారు. ఈ శిలాజాలను విచ్ఛిన్నం చేయటానికి సమాంతరంగా బావులు డ్రిల్లింగ్ చేస్తారు. వీటిల్లోకి ఇసుక-రసాయనాల మిశ్రమాన్ని అత్యధికమైన ఒత్తిడితో ఇంజక్ట్ చేస్తారు. అప్పుడు శిలాజాలు విచ్ఛిన్నమై గ్యాస్, చమురు ఉత్పత్తి అవుతాయి. క్లుప్తంగా ఈ ప్రక్రియనే ఫ్రాకింగ్ అంటారు. ఉత్పత్తిని షేల్‌గ్యాస్‌గా పిలుస్తారు. బొగ్గు ఆధారిత ఇంధనం కన్నా ఇది తక్కువ కాలుష్యకారిణి అని కార్పొరేట్ సంస్థలు చెబుతున్నాయి. అయితే ఇదంతా అవాస్తవమని పరిశోధనలు రుజువు చేశాయి. దీర్ఘకాలంతో ధర్మల్ కేంద్రాల కన్నా షేల్ గ్యాస్ వల్లనే అత్యధిక కాలుష్యం ఏర్పడుతున్నదని కార్నెల్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో వెల్లడైంది.
|| విధ్వంసం సృష్టిస్తున్న ఫ్రాకింగ్ ||
షేల్ గ్యాస్ ఉత్పత్తి కోసం చేస్తున్న ఫ్రాకింగ్ అమెరికాలో విధ్వంసాన్ని, తీవ్ర కాలుష్యాన్ని, అనారోగ్య సమస్యలను, భారీ వలసలను సృష్టించింది. ప్రపంచంలో అత్యధికంగా షేల్ గ్యాస్ తయారీ అమెరికాలోనే జరుగుతున్నది. 30 రాష్ట్రాలలోని లక్షలాది బావుల ద్వారా ఇక్కడ షేల్ గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఫ్రాకింగ్ కోసం భూమిలో వేల అడుగుల లోతు వరకు సమాంతరంగా డ్రిల్లింగ్ చేస్తారు. ఇందులోకి పంపింగ్ చేసే మిశ్రమంలో 1,150 రకాల రసాయనాలు వాడుతున్నారని అమెరికాలో జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. ఫ్రాకింగ్ బావికి సగటున 4,400 కోట్ల గ్యాలన్ల నీరు వాడుతున్నారు. షేల్ గ్యాస్ ఉత్పత్తి క్రమంలో వాడుతున్న రసాయనాలు ఏమిటన్న వివరాలను కంపెనీలు పూర్తిగా వెల్లడించకుండా గోప్యత పాటిస్తున్నాయి. బావులు వెలువరిస్తున్న వ్యర్థాల వల్ల ప్రజలకు అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. చుట్టు పక్కల ప్రాంతాల్లో వాయు, నీటి కాలుష్యం ఏర్పడుతున్నది. ఈ కాలుష్యం తీవ్రతపై అమెరికన్ పార్లమెంటు, పలు విశ్వవిద్యాలయాలు అధ్యయనం చేశాయి. గత ఏడాది అమెరికన్ షేల్ గ్యాస్ పరిశ్రమ 28,000 కోట్ల గ్యాలన్ల రసాయనాల వ్యర్థాన్ని ఉత్పత్తి చేసింది. ఈ వ్యర్థాల వల్ల నదులు, మంచినీటి వనరులు, పొలాలు కలుషితమయ్యాయి. వెలువడుతున్న కాలుష్య వాయువులు ఉబ్బసం, సైనస్, పార్శ్వనొప్పి వంటి వ్యాధులను తెచ్చిపెడుతున్నాయి. రసాయన వ్యర్థాల వల్ల జలాలు, పండించిన ఆహార పదార్థాలు, చేపలు విషపూరితమై పోతున్నాయి. దీంతో ప్రాణులన్నీ ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నాయి. అణు వ్యర్థాల వల్ల కేన్సర్ దగ్గర్నుంచి పుట్టబోయే పిల్లలకు హృద్రోగ సమస్యల వరకు అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నట్లు అమెరికాలో జరిగిన పలు పరిశోధనలు నిర్థారించాయి.
|| భూ ప్రకంపనలు ||
రసాయనాలను, ఇసుక-నీటి మిశ్రమాన్ని భారీ ఒత్తిడితో ఇంజక్ట్ చేయడమనేది భూమిపై ప్రభావం చూపుతుంది. షేల్ గ్యాస్ డ్రిల్లింగ్ వల్లే ఎనిమిది రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ఏర్పడుతున్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే నిర్థారించింది. 2015లో ఓక్లహామా ప్రాంతంలోనే 800 భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఆవాస ప్రాంతాల్లోనే షేల్ గ్యాస్ బావుల డ్రిల్లింగ్ జరుగుతున్నందు వల్ల అనేక ప్రాంతాల్లో ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. పేలుడు ఘటనలకు సంబంధించి సమాచారం ఇవ్వని కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వాలు జరిమానాలు విధించాయి.
|| అరకొర నియంత్రణ ||
అగ్రరాజ్యం అమెరికాలో చట్టాలు ఎక్కువే. అయితే ఫ్రాకింగ్ నియంత్రణ మాత్రం తక్కువ. భూ సేకరణ దగ్గర్నుంచి హానికారక రసాయనాల వాడకం వరకు కార్పొరేట్ సంస్థలు చేస్తున్న దుర్మార్గాలకు ఇక్కడ అడ్డూఅదుపూ లేకుండా పోయింది. చివరికి ఎన్జీవోలు, రాజకీయ నాయకులు, అధికారులను ప్రభావితం చేసేందుకు ఇవి ఏటా భారీ మొత్తాలను తాయిలాలుగా ఖర్చు చేస్తున్నాయి. సియార్రా క్లబ్ అనే ఎన్జీవో కొత్త డైరెక్టర్ గత డైరెక్టర్ హయాంలో జరిగిన ఇలాంటి అవినీతిని తానే స్వయంగా బయటపెట్టారు. ఫ్రాకింగ్ వల్ల జరుగుతున్న హానిని బయటపెట్టనీయకుండా పరిశోధనా సంస్థలను సైతం లోబరుచు కుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. మధ్యలో నిలిచిపోతున్న కొన్ని అధ్యయనాలు ఇది నిజమేనని రుజువు చేస్తున్నాయి. పశ్చిమ పెన్సిల్వేనియా కేసు కార్పొరేట్ సంస్థల దమననీతిని నగంగా బయటపెడుతున్నది. ఫ్రాకింగ్ రసాయన వ్యర్థాల వల్ల అనారోగ్యం పాలైన ఓ నలుగురు సభ్యుల కుటుంబం డ్రిల్లర్ రేంజ్ రిసోర్సెస్‌పై కేసు వేసింది. బాధితులపై కార్పొరేట్ కంపెనీ ఒత్తిడి తెచ్చి 7,50,000 డాలర్ల పరిహారం చెల్లించి వారి నోరు మూయించింది. షేల్ గ్యాస్ వ్యర్థాల నిల్వల తరలింపు, ఫ్రాకింగ్ ప్రక్రియలో నిబంధనల పాటింపు తదితర అంశాలు చట్టబద్ధంగా జరుగుతున్నాయో, లేదో పరిశీలించేందుకు అమెరికాలోనే తగినంత మంది సిబ్బంది లేరు. దీంతో మొత్తంగా అసలు ఫ్రాకింగ్ పరిశ్రమదే ఇష్టారాజ్యంగా మారి పోయింది. భారత్‌లో రెగ్యులేటరీ వ్యవస్థలు అతి దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. అమెరికా చమురు కార్పొరేట్ సంస్థలు డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల నేతలను లాబీయింగ్ ద్వారా ప్రసన్నం చేసుకుంటుంటాయి. ఇందుకు విరాళాల రూపంలో భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నాయి. ప్రస్తుతం షేల్ గ్యాస్ పరిశ్రమను భారత్, ఐరోపా, తదితర దేశాలకు విస్తరించాలని లాబీయింగ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా భారత ప్రభుత్వ రంగ సంస్థ ఒఎన్‌జిసి తొలుత పలు రాష్ట్రాల్లో 17 బావులు తవ్వాలని సంకల్పించింది. వీటిలో కృష్ణా-గోదావరి బేసిన్ ఒకటి. తొలుత తూర్పుగోదావరి జిల్ల్లాలో రెండు, పశ్చిమ గోదావరిలో రెండు, కృష్ణాజిల్లాలో ఒక బావిని డ్రిల్లింగ్ చేస్తారు. ఇందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
తొలుత ఒఎన్‌జిసి రంగ ప్రవేశం చేసి తర్వాత షేల్ గ్యాస్ డ్రిల్లింగ్‌ను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలని ప్రభుత్వం చూస్తున్నది. ఇప్పటికే అమెరికన్ షేల్ గ్యాస్ కంపెనీల్లో రిలయన్స్ భాగస్వామిగా ఉన్నది. జనసాంద్రత అత్యధికంగా ఉండే మన దేశంలో షేల్ గ్యాస్ బావుల వల్ల భారీ ఎత్తున భూ నిర్వాసితులు తయారుకానున్నారు. ఒక్కో బావికి 80 నుంచి 160 ఎకరాలు అవసరం ఉంటుంది. అమెరికాలో డ్రిల్లింగ్‌లో వైఫల్యాలు అధికంగా ఉంటాయి. దీంతో సమీపంలోనే అనేక బావుల డ్రిల్లింగ్‌లు జరపాల్సి ఉంటుంది. ఈ విధంగా చూస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో ఫ్రాకింగ్ కోసం లక్షల ఎకరాలు కావాల్సి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల నష్టపోయేది అత్యధికంగా బడుగువర్గాలే. అమెరికాలో నల్లజాతివారు, పేదలు నివసించే ప్రాంతాల్లో ఎక్కువ బావుల డ్రిల్లింగ్‌లు జరుగుతున్నాయి. మన దేశంలో దళితులు, ఎస్టీలు, బిసిలు, మత్స్యకా రులు, పేదలు లక్షలాది మంది బాధితులు కాబోతున్నారు. షేల్ గ్యాస్ బావుల వల్ల పచ్చని గోదావరి ప్రాంతం వల్లకాడు కాకుండా ముందే మేలుకొని ప్రభుత్వాల్ని నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ప్రజా ఉద్యమాల ఫలితంగా ఇప్పటికే అమెరికా లోని ఒక రాష్ట్రం, జర్మన్ ప్రభుత్వం ఫ్రాకింగ్‌ను నిషేధించాయి. తంజావూరులో రైతుల వ్యతిరేకత వల్ల కేంద్రం ఈ ప్రక్రియను నిలిపేసింది. భారతదేశం ఇప్పటికే తీవ్ర నీటి సమస్య ఎదుర్కొంటున్నది. ఫ్రాకింగ్‌కు భారీ ఎత్తున జలాలు అవసరం. షేల్ గ్యాస్ డ్రిల్లింగ్ మొదలైన ప్రాంతాలన్నింటా నీటి కొరత, కాలుష్యం, అనారోగ్య సమస్యలు అధికమయ్యాయి. కాలిఫోర్నియా కనీవినీ ఎరుగని కరువును చవి చూసింది. భారత్‌లోని కరువు ప్రాంతాల్లో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి.
|| పారదర్శక చర్చ అవసరం ||
షేల్ గ్యాస్ డ్రిల్లింగ్ వల్ల అమెరికా అనుభవాల నేపథ్యంలో ఈ అంశంపై అన్ని కోణాలలో పారదర్శక, బహిరంగ చర్చను నిర్వహించాలని సిపియం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ రచయితకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్య్వూలో డిమాండ్ చేశారు. షేల్ గ్యాస్ ఉత్పత్తి తాలూకు లాభనష్టాలపై సవివరమైన పరిశీలన, విశ్లేషణ జరపాలని ఆయన కోరారు. నీటి అవసరాలు, రసాయన వ్యర్థాలు, వాటి నిర్వహణ, వాయుకాలుష్యం, ప్రజారోగ్యం, నిర్వాసితులు, నియంత్రణ విధానాలు... ఇలా అన్ని కోణాలపై ప్రభుత్వం ఆయా రంగాల నిపుణులు, మేధావులు, పార్టీలు, ప్రజాసంఘాలతో చర్చించాలని, ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరపాలని సీతారాం ఏచూరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. - సీతారాం ఏచూరి
- బి భాస్కర్

No comments:
Post a Comment