''స్వాతంత్య్రోద్యమంలో ఆరెస్సెస్ పాత్ర అద్భుతంగా వివరించ బడింది'' అనే వ్యాసాన్ని ఇటీవల చదవటం తటస్థించింది. అది చదివిన తర్వాత స్వతంత్ర పోరాటంలో ఆరెస్సెస్ పాత్ర ఏమీ లేదనే విషయాన్ని పాఠకులకు వివరించాలనే ఉద్దేశంతో ఈ వ్యాసం రాస్తున్నాను. ముందు గా సంఘపరివారం ప్రచురణల్లోని పరస్పర విరుద్ధ అంశాలను పరిశీలిద్దాం. పైన పేర్కొన్న వ్యాసంలో ఆరెస్సెస్ స్థాపన తర్వాత డాక్టర్ హెగ్డేవార్, సంఘ స్వయం సేవకులతో ''మీరు సంఘ శాఖకు ఒక గంట కాలాన్ని కేటాయించిన తర్వాత మిగిలిన కాలాన్ని ఏ రాజకీయ పార్టీ పనికైనా కేటాయించితే ప్రమాద మేమీ లేదు'' అన్నాడని పేర్కొనబడింది.
హెగ్డేవార్ ఆదేశాన్ని కొనసాగిస్తూ గోల్వాల్కర్ గురూజీ కూడా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనమన్నాడని చెప్పబడింది. అంతేకాదు, నాడున్న స్వయం సేవకుల్లో సగం కంటే ఎక్కువ మంది స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారని తెలియజేయడం జరిగింది. అయితే గోల్వాల్కర్ జీవిత చరిత్రను పూజ్య గురుజీ అన్న పేరు మీద సంఘపరివారం ప్రచురించింది. ఆ పుస్తకంలో గోల్వాల్కర్ స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్న ఒక్క సన్నివేశమైనా వర్ణించబడలేదు. పైగా 9వ పేజీలో ''గురుజీ 24 గంటలూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు కార్యమందు నిరతులై ఉన్నప్పటికిన్నీ'' అని ప్రస్తావించబడింది. అంటే గురుజీ 24 గంటలూ స్వయం సేవక్ సంఫ్‌ు కార్యక్రమాల్లో నిమగమై ఉన్నట్లే కదా? మరి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నదెప్పుడు? ఇక స్వయం సేవకులు స్వాతంత్య్ర పోరా టంలో పాల్గొనలేదనీ, కాంగ్రెస్ వారితో తాము అలా పాల్గొనలేమని చెప్పినట్లు అదే పుస్తకం పేజీ 81లో వివరించ బడింది. ఆ సంభాషణ వారి మాటల్లోనే విందాం.
జైనపుర జిల్లాలో ఒక బైఠక్ జరుగుతోంది. స్థానిక కాంగ్రెస్ కార్యకర్త లేచి 'మీరు చేసే పని గొప్పదనే నా అభిప్రాయం. కానీ కాంగ్రెస్ కార్యం కంటే చాలా గొప్పదని, దేశాన్ని మొత్తాన్ని స్వాధీనం చేసుకుని రక్షించాలనేతంట పని చేస్తుంది. కానీ మీరు కేవలం హిందూ సంఘటనమే కర్తవ్యంగా చెప్పుకుంటున్నారు'' అన్నారు. దానికి సమాధానం గా గురూజీ చిరునవ్వు నవ్వుతూ 'మీరు చెప్పింది నిజం. కాంగ్రెస్ చేసే పని చాలా పెద్దది. మా పని చిన్నది. కాబట్టి కాంగ్రెస్‌లో పని చేసే మీరు పెద్దవారు, మేము చిన్నవారము. మేము చిన్నవారిమి అవడం వల్ల అంత పెద్ద కార్యం చేయటం మాకు కష్టం. కానీ మీరు పెద్దవారు అయినందున ఈ చిన్న పని చేయటం పెద్దగా లెక్కలోని విషయం కాదు. కాబట్టి మీరు రెండు పనులూ చేయదగినవారు' అనడంతో ఆ కాంగ్రెస్ కార్యకర్త మారు మాట దొరకక మెదలక కూర్చు న్నారు. గురుజీ ఎంత స్పష్టంగా తాము కాంగ్రెస్ వారి కార్య క్రమంలో పాల్గొనం అని చెప్పారు! దీన్ని బట్టి సంఘ స్వయం సేవకుల్లో సగం కంటే ఎక్కువ మంది స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారని చెప్పటం అబద్ధం కాదా? పోనీ ఆరెస్సెస్ నాయకత్వమే స్వతంత్రంగా పోరాట కార్యక్రమాలను రూపొందించిందా అంటే అదీ లేదు. దీనికి రుజువు వారి నాయకుడు నానాజీ దేశ్‌ముఖ్ రచించిన మేము స్వాతంత్య్ర పోరాటంలో ఎందుకు పాల్గొనలేదంటే.... అన్న పుస్తకమే నిదర్శనం. ఒకవైపు తాము స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన లేదని వారి వృద్ధ నేతలే పుస్తకాలు రాశారు. మరోవంక తాము పోరాటంలో పాల్గొన్నామని వ్యాసాలు వ్రాస్తారు. పాల్గొన్నారు అని విశ్వసించటానికి రుజువులు ఏమీ ఉండవు. ఇదీ వారి రెండు నాల్కల వైఖరి.
ఆరెస్సెస్ వారు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదు అని చెప్పేందుకు అవసరమైన మరో రెండు రుజువులు పై వ్యాసంలోనే ఉన్నాయి. అవి కూడా పరిశీలిద్దాం. 'తన 18వ ఏట, అంటే 1907లో హెగ్డేవార్ ఒక బాంబును తయారు చేసి పోలీసు స్టేషనుపై విసిరారు' అని పై వ్యాసంలో చెప్పారు. అయినా ఆయనపై పోలీసులు కేసు పెట్టలేదు. ఇది ఎట్లా సాధ్యం ? హెగ్డేవార్ బాంబు విసరటమన్నా అబద్ధమై ఉండాలి లేదా పోలీసులు అకస్మాత్తుగా అతి మంచివాళ్లయి పోయి ఉండాలి ! 1942 ఉద్యమాన్ని గురించి రాస్తూ పై వ్యాస రచయిత, కొంత మంది స్వయం సేవకులు వింధ్య ప్రాంతంలోని చిమూర్-అస్థిలో సమాంతర ప్రభుత్వాన్ని నెలకొల్పారని, అందువల్ల వారిలో కొందరు ఉరికంబం ఎక్కవల్సి వచ్చిందని రాశారు. వారిలో కనీసం ఒక్కరి పేరును కూడా రాయలేదు. ఎందువలన? బ్రిటీష్ వ్యతిరేక పోరాటంలో ఉరికంబం ఎక్కిన స్వయం సేవకులు సంఘపరి వార్ దృష్టిలో అంత అనామకులా లేక స్వయం సేవకులు ఉరికంబం ఎక్కారన్న ప్రచారమే అబద్ధమా?
సంఘీయులు స్వతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదు అనేందుకు మరో రుజువును పరిశీలిద్దాం. గాంధీజీ శాస నోల్లంఘన పిలుపు సందర్భంగా ఒక వ్యక్తి ఆ ఉద్యమంలో పాల్గొనదలచి హెగ్డేవార్ సలహా కోసం వచ్చాడు. హెగ్డేవార్ ఆయనతో ''నీవు శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొంటే జైలుకు వెళ్లవల్సి ఉంటుంది. కనీసం రెండేళ్లు జైలులో ఉండవల్సి వస్తుంది. నీ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. కాబట్టి శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన వద్దని కోరాడు. కానీ పాపం ఆ వ్యక్తి తాను రెండేళ్లపాటు కుటుంబ అవసరాలకు సరిపడా డబ్బును బ్యాంకులో నిల్వ చేసినట్లు చెప్పాడు. ''అయితే రెండేళ్ళు ఆరెస్సెస్‌లో పూర్తి కాలం కార్యకర్తగా పని చేయి. అంతేకానీ స్వాతంత్య్రోద్యమం లో పాల్గొనకు' అని హెగ్దేవార్ కోరారు. (పది ముసుగులు -వంద గొంతులు అనే పుస్తకం పేజీ 7) అలాగే మరో రుజువు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఒక పాఠ్యపుస్తకంలో టిప్పు సుల్తాన్ పాఠం ఉంది. దానిలోని ఆఖరు వాక్యం ఇది. 'ఆంగ్లేయులతో జరిగిన యుద్ధంలో భగవంతుని దయ వల్ల టిప్పు సుల్తాన్ ఓడిపోయి ఆంగ్లేయులు విజయం సాధించిరి. (ఆంధ్రజ్యోతి దినపత్రిక, 21-2-93 నాటి ప్రొఫెసర్ రామకృష్ణ వ్యాసం నుంచి) యుద్ధంలో ఆంగ్లేయులు గెలవడం భగవంతుని దయ వలన అనే సంఘపరివారం నాయకులు స్వాతంత్య్ర పోరాటంలో ఆంగ్లేయుడు ఓడిపోవటాన్ని ఇష్ట పడతారా? వారిని తరిమి వేయటానికి ప్రయత్నిస్తారా? అంతేకాదు, ఉత్తరప్రదేశ్‌లో బిజెపి పాలకులు సవరించి ప్రచు రించిన పాఠ్యపుస్తకాల్లో ''భారతదేశానికి ఆంగ్లేయుల రాక, వారి పరిపాలన భారతదేశాన్ని విదేశీ పరిపాలన నుండి విముక్తి చేయటంగా స్వాగతించబడింది'' (ది ఎస్సాల్ట్ ఆన్ హిస్టరీ, రచన ప్రొఫెసర్ ఆర్‌ఎస్ శర్మ. పేజి 24) అంటే ఆంగ్లే యులు వారి దృష్టిలో విదేశీయులు కాదన్నమాట. పని లో పనిగా అదే వ్యాసంలో కమ్యూనిస్టులు బ్రిటీష్‌వారి పరి పాలన ను బలపరిచినట్లు పేర్కొన్నారు. దీనిలోని నిజానిజాలు పరిశీలిద్దాం.
భారత కమ్యూనిస్టు పార్టీ 1920లో స్థాపించబడింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏమి చేసింది? కమ్యూనిస్టుల ఆలోచనా విధానం ప్రజలకు అందక ముందే వారిని అణచివేయటానికి బ్రిటీష్ ప్రభుత్వం పూనుకున్నది. ఈ లక్ష్యంతోనే 1923లో పెషావర్ కుట్ర కేసును, 1924లో కాన్పూర్ కుట్ర కేసును కమ్యూనిస్టులపై బనాయించింది. ఈ కేసుల్లో ముజఫర్ అహ్మద్, షౌకత్ ఉస్మానీ, ఎస్ ఎ డాంగే, దాస్ గుప్త వంటి కమ్యూనిస్టు నాయకులు ముద్దాయిలుగా ఉన్నారు. సోషలిస్టు భావాలు వ్యాప్తి చెందకుండా ఉండేందు కు బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న తొలి చర్యలు ఇవి (భారత స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర, పేజీ 14). అంతే కాదు, 1929లో ప్రముఖ కమ్యూనిస్టు నాయకులతో సహా ట్రేడ్ యూనియన్, రైతు, యువజన సంఘాలకు చెందిన 31 మందిని అరెస్టు చేసి మీరట్ కుట్ర కేసును బనాయించింది. కమ్యూనిస్టులపై ఎందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఇన్ని కుట్ర కేసులు బనాయించింది? బ్రిటీష్ వైస్రారు మాటల్లోనే విందాం. 1929లో బ్రిటీష్ వైశ్రారు లార్డ్ ఇర్విన్ కేంద్ర శాసనసభలో ప్రసంగిస్తూ ''కమ్యూనిస్టు సిద్ధాంతాల వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నది'' అన్నారు. (పై పుస్తకంలో పేజి 20) అదీ అసలు విషయం. అంతేకాదు, 1942లో కమ్యూనిస్టులు బ్రిటీష్ వారికి అనుకూలంగా మారారని చేసే నిందలకు బ్రిటీష్ పాలకుల వ్యాఖ్యలే సమా ధానంగా నిలుస్తాయి. 1943లో బొంబాయిలో కమ్యూనిస్టు మహాసభ జరిగింది. దానిపై వ్యాఖ్యానిస్తూ నాటి బ్రిటీష్ ప్రభుత్వం ఇలా తెలియజేసింది. 'భారతదేశంలో బ్రిటీష్ ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా దౌర్జన్య సహితంగా తొలగిం చ టమే కమ్యూనిస్టు ఉద్యమ లక్ష్యం'' (భారత స్వాతంత్య్రానికి పోరాడిందెవరు? పేజి 48) అప్పటి హోం శాఖ కార్యదర్శి టాడెన్ హోం ఇలా హెచ్చరిక చేశారు:''వీరు ప్రథమంగా విప్లవకారులు. తర్వాతనే కమ్యూనిస్టులు. తమ దీర్ఘకాల విప్లవ లక్ష్యాలను వీరు ఎన్నడూ విసర్జించలేదు'' (పై పుస్తకం పేజీ 48) కమ్యూనిస్టుల దీర్ఘకాల విప్లవ లక్ష్యం ఏమిటి? మీరట్ కుట్ర కేసు సందర్భంగా వారు 'తాము జాతీయ వాదానికి, దేశ స్వాతంత్య్ర సాధనకు అంకితమై ఉన్నా' అని స్పష్టంగా ప్రకటించుకున్నారు. అదే వారి దీర్ఘకాల లక్ష్యం. ఆ దీర్ఘకాల లక్ష్యాన్ని వారు ఎన్నడూ విడవలేదు కనుకనే బ్రిటీష్ వారి భక్తులు వారిపై ఎన్ని నిందలు వేసినా ఆశ్చర్యం కొల్పేరీతిలో 1942-43 సంవత్సరాల్లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం గణనీయంగా పెరిగింది. అంతేకాదు, 1946 ఫిబ్రవరి 12న కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన కలకత్తా బంద్ పిలుపుకు ప్రజానీకం బ్రహ్మాండంగా స్పందించి బంద్‌ను పూర్తిగా విజయవంతం చేశారు. ఆ స్పందన చూసిన కాంగ్రెస్ నాయకురాలు అరుణ ఆసఫ్ ఆలి కలకత్తా మాదిరే దేశమంతటా ఇలాంటి ఉద్యమం రావాలని కోరారు. ఆసక్తి కరమైన విషయమేమిటంటే ఆనాడు కలకత్తా నగర పోలీసు కమిషనర్ ప్రభుత్వానికి సమర్పించిన రహస్య నివేదికలో ''కమ్యూనిస్టులు బ్రిటిష్ పాలనకు అత్యంత ప్రమాదకారులని'' స్పష్టంగా పేర్కొన్నారు. (భారత స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర, పేజి 51, రచన జ్యోతిబసు)
స్వాతంత్య్ర సమరంలో కమ్యూనిస్టులు, ఆరెస్సెస్ వారి పాత్ర గురించి మాజీ రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ చెప్పిన విషయాన్ని ఉటంకించి ఈ వ్యాసాన్ని ముగిస్తాను. స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సందర్భంగా పార్లమెంటులో నాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ మాట్లాడుతూ, 'బ్రిటీష్ వారు 1942లో అధికార పత్రాల్లో కమ్యూనిస్టులను రాజ ద్రోహులు గానూ, బ్రిటీష్ సామ్రాజ్య వ్యతిరేకులుగానూ పేర్కొన్నారు. బ్రిటీష్ వారి అధికార పత్రాల్లో ఆరెస్సెస్‌వారు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనకుండా నిగ్రహంగా వ్యవహరించారని పేర్కొన్నారు' అని ఉటంకించారు. పై వివరణలన్నీ స్వాతంత్య్ర పోరాటంలో ఆరెస్సెస్ వారు పాల్గొనలేదని, కమ్యూనిస్టులు బ్రిటీష్ వారి అణచివేత చర్యలకు భయపడకుండా స్వాతంత్య్ర పోరాటం సాగించారని తెలియజేయటం లేదా?
- కెఎల్ కాంతారావు.

No comments:
Post a Comment