Friday, 2 December 2016

|| జాతీయోద్యమంలో ఆర్‌యస్‌యస్‌ ||




            బ్రిటీష్‌వారు భారతదేశం వదిలి వెళ్ళాలని, దేశానికి స్వాతంత్య్రం కావాలని జరుగు తున్న పోరాటాలు తీవ్రం కావటంతో 1920వ దశాబ్దంలో జాతీయోద్యమం ఉధృతరూపం దాల్చింది. భారత జాతీయ కాంగ్రెస్‌తో పాటు కమ్యూనిస్టుపార్టీ, వివిధ తీవ్రవాద సంస్థలు, ఇతర శక్తులన్నీ జాతీయ స్వాతంత్య్రం కోసం పనిచేస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో 1925లో ఆర్‌యస్‌యస్‌ ఏర్పడింది. వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు స్వాతంత్య్రం కోసం సాగుతున్న పోరాటంలో భాగ స్వాములవుతుండగా, ఆర్‌యస్‌యస్‌ మాత్రమే జాతీయోద్య మం లో భాగస్వామి కాలేదు. నేడు భారత జాతీయత, దేశభక్తిని గురించి ఇల్లెక్కి అరుస్తున్న ఆర్‌యస్‌యస్‌ నాడు మిగతా రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు జాతీయోద్యమంలో భాగస్వాములైతే తాను ఎందుకని జాతీయోద్యమంలో పాల్గొనలేదు? జాతీయతను గురిం చి ఆర్‌యస్‌యస్‌కున్న భిన్నాభిప్రాయాలే అందుకు కారణం.

|| ఆర్‌యస్‌యస్‌ జాతీయత ||

ఒకే భూభాగంలో కలిసి జీవించటం, ఒకే ఆర్థికవ్యవస్థ, ఒకే భాష మాట్లాడటం, ఒకే సంస్కృతి, తదితరాలున్న ప్రజలను ఒకే జాతిగా ఆధునిక సమాజం గుర్తించింది. ఇందులో మతాలు, కులాలు, ఇతర వైవిధ్యాలున్న ప్రజలు కూడా ఉంటారు. భారత దేశం వివిధ జాతుల సమూహంగా ఉన్నది. దేశంలో తెలుగు, తమిళ, ఒరియా, కన్నడ, పంజాబీ, మరాఠీ, తదితర జాతుల ప్రజలున్నారు. ప్రతి జాతి లోనూ వివిధ మతాలకు చెందినవారున్నారు. ఆర్‌యస్‌యస్‌ ఇందుకు భిన్నంగా మతం ప్రాతిపదికగా జాతిని గుర్తిస్తుంది. ఒక మతానికి చెందినవారు మాత్రమే ఒక జాతిగా ఉంటారని, ఇతర మతాలకు చెందినవారు ఆ జాతిలో భాగం కారని ఆర్‌యస్‌యస్‌ చెబుతుంది. ఆర్‌యస్‌యస్‌ నిర్వచనం ప్రకారం హిందూ మతాన్ని అనుసరించే ప్రజలంతా ఒక జాతిగా ఉంటారు. భారతదేశంలో వివిధ జాతులకు చెందిన ప్రజలున్నారని ఆర్‌యస్‌యస్‌ గుర్తించదు. భారతీయులను హిందువులు, హిందూయేతరులుగా మాత్రమే గుర్తిస్తుంది. మన పక్కన, మన దేశంలో, మన రాష్ట్రంలో నివసిస్తున్న ముస్లిములు, క్రైస్తవులు వేరే జాతికి చెందిన వారని చెబుతుంది. హిందువులకు, వారికీ ఎటువంటి జాతీయ సంబంధం లేదని ఆర్‌యస్‌యస్‌ భావిస్తుంది. భారతీయులంటే హిందువులే. ముస్లిములు, క్రిస్టియన్లు ఈ దేశానికి చెందినవారు కాదు. వారు దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, హిందూ రాజులను ఓడించి, మన దేశంపై ఆధిపత్యం చెలాయించారు. హిందువులను అనేక బాధలకు గురిచేశారు. మన దేశాన్ని దోచుకున్నారు. కాబట్టి ముస్లిములు, క్రైస్తవులు హిందువులకు శత్రువులు. మన శత్రువులు మన జాతిలో భాగం కారు. మన శత్రువులను మన జాతి నుంచి వేరుచేయాలి. మన జాతికి చెందిన ప్రజలను కాపాడుకొంటూ, మన శత్రువులను నాశనం చేయటం మన జాతి కర్తవ్యం. కాబట్టి దేశాన్ని ఉద్ధరించటం అంటే హిందువులను ఉద్ధరించటమే. ఈ అవగాహనతో ఆర్‌యస్‌యస్‌ ముస్లిములు, క్రైస్తవులను శత్రువులుగా చూస్తున్నది. కాబట్టి హిందువులు, హిందూ దేశం అభివృద్ధి కావాలంటే ముస్లిములను, క్రైస్తవులను అణచివేయాలని, హిందువులను ఐక్యం చేయాలని ఆర్‌యస్‌యస్‌ చెబుతున్నది.

|| జాతీయైక్యత-హిందూ ఐక్యత ||

ఈ అవగాహనతో పనిచేస్తున్న ఆర్‌యస్‌యస్‌కు భారతదేశ స్వాతంత్య్రం కోసం జరుగుతున్న పోరాటం పెనుశాపంగా పరిణమించింది. భారత జాతీయోద్యమంలో మతాలు, కులాలతో నిమిత్తం లేకుండా ప్రజలందరూ పాల్గొన్నారు. బ్రిటిష్‌వారిని దేశం నుంచి తరిమివేయాలని, దేశానికి స్వాతంత్య్రం సాధించాలన్న జాతీయోద్యమం బ్రిటీష్‌ పాలనతోనే ప్రారంభమైంది. బ్రిటీష్‌వారు దేశాన్ని ఆక్రమించుకొని, పరిపాలించటం ప్రారంభించినప్పటి నుంచి వారిని దేశం నుంచి తరిమివేయటం కోసం వివిధ రూపాలలో పోరాటాలు ప్రారంభమయ్యాయి. 1857లో ప్రథమ స్వాతంత్య్ర పోరాటం, తర్వాత భారత జాతీయ కాంగ్రెస్‌ ఏర్పాటు, జాతీయ విప్లవకారుల పోరాటాలు, కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన తర్వాత స్వాతంత్య్రం కోసం శ్రామిక ప్రజలను సమీకరించటం, తదితర పోరాటాలు క్రమంగా సంఘటిత రూపం ధరించాయి. భారత జాతీయ కాంగ్రెస్‌కు మహాత్మాగాంధీ నాయకత్వం వహించటం, అంబేద్కర్‌ రాజకీయరంగంలోకి వచ్చి దళితుల హక్కుల కోసం పోరాటాన్ని ప్రారంభించటం, అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రచారం, తది తరాల వలన సమాజంలో కుల, మతభావాలు బలహీనపడ్డాయి. వంద సంవత్స రాలకు పైగా జరిగిన జాతీయోద్యమం వలన దేశంలో అభివృద్ధి నిరోధక భావాలు బలహీనపడి, అభ్యుదయ భావాలు వేళ్ళూనుకున్నాయి. దీన్ని దేశానికి ఎదురవుతున్న ప్రమాదంగా ఆర్‌యస్‌యస్‌ భావించింది. కుల, మత భావాలు బలహీనపడటానికి, వివిధ మతాల ప్రజల మధ్య పెరుగుతున్న ఐక్యతకు వ్యతిరేకంగా హిందువులను ఐక్యం చేయటం లక్ష్యంగా ఆర్‌యస్‌యస్‌ తన కార్యకలాపాలను ప్రారంభించింది.

|| సామ్రాజ్యవాదానికి సహజమిత్రుడు ఆర్‌యస్‌యస్‌ ||

హిందువులను ఐక్యం చేసేందుకు పూనుకున్న ఆర్‌యస్‌యస్‌కు దేశంలోని వివిధ మతాలు, కులాల ప్రజల మధ్య పెరుగుతున్న ఐక్యత, అందుకు దోహదం చేస్తున్న జాతీయోద్యమం ఆటంకంగా పరిణమించింది. దేశాన్ని దోపిడీచేస్తూ, ప్రజలపై నిర్బంధాన్ని అమలు చేస్తున్న బ్రిటీష్‌ ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం పెరుగుతున్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం బలపడిన మేరకు ప్రజల మధ్య ఐక్యత కూడా బలపడుతున్నది. ప్రజల మధ్య పెరుగుతున్న సామ్రాజ్యవాద వ్యతిరేకత, వివిధ మతాల ప్రజల మధ్య ఐక్యత విచ్ఛిన్నమైతేనే హిందువులను ఐక్యం చేయటం సాధ్యమవుతుందని ఆర్‌యస్‌యస్‌ భావించింది. ఆనాడు జాతీయోద్యమంలో పాల్గొంటున్నవారి ఆలోచనలకు భిన్నమైన ఆలోచన ఇది. ప్రజల మధ్య ఐక్యతను పెంచి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం మరింతగా బలపరచి, సామ్రాజ్యవాదులను దేశం నుంచి తరిమేలని, అంతిమంగా దేశానికి స్వాతంత్య్రం సాధించాలని స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నవారు భావించారు. ముస్లిములను శత్రువులుగా చూపిస్తూ, విద్వేషాన్ని రెచ్చగొట్టి, ప్రజల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేస్తే హిందువులను ఏకంచేసే అవకాశాలు పెరుగుతాయని ఆర్‌యస్‌యస్‌ భావించింది. ఇది జరిగితే భారత జాతీయోద్యమం బలహీనపడి, బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు శక్తివంతులవు తారు. మొదటి మార్గం దేశానికి స్వాతంత్య్రం సాధించటానికి దోహదం చేస్తుంది. రెండవ మార్గం భారతీయుల దాస్యాన్ని పొడిగించటానికి దోహదం చేస్తుంది. నిజమైన దేశభక్తులెవరైనా ఏ మార్గంలో సాగాలని కోరుకుంటారు? దేశ స్వాతంత్య్ర సాధనకు ప్రథమ ప్రాధాన్యతనిస్తారు. కానీ దేశభక్తికి చిరునామా తామేనని చెబుతున్న ఆర్‌యస్‌యస్‌ రెండవ మార్గాన్ని ఎంచుకున్నది. ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టటం ద్వారా హిందువులు, ముస్లిముల మధ్య విభేదాలను పెంచుతూ, దేశ ప్రజల మధ్య పెరుగుతున్న ఐక్యతను విచ్ఛిన్నం చేయటం ద్వారా స్వాతంత్య్ర సాధన లక్ష్యానికి విఘాతం కలిగించటానికి పూనుకున్నది. జాతీయోద్యమ కాలంలో బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు వ్యవహరించిన తీరుకు, ఆర్‌యస్‌యస్‌ వ్యవహరించిన తీరుకు వైరుధ్యం లేదు. దేశంలో తీవ్రమౌతున్న జాతీయోద్యమం బ్రిటీష్‌ పాలనకు ప్రమాద ఘంటికలు మోగించింది. భారతదేశంలో తమ పరిపాలనను కొనసాగించాలంటే దేశంలోని వివిధ మతాలు, కులాలకు చెందిన ప్రజల మధ్య పెరుగుతున్న ఐక్యతను విచ్ఛిన్నం చేయటం బ్రిటీష్‌ పాలకులకు అవసరం అయింది. అందువల్ల ఆంగ్లేయులు భారతీయులను మతాలు, కులాల పేరుతో చీల్చి ఉంచటం ద్వారా తమ పరిపాలనకు ఎదురౌతున్న ప్రమాదాన్నుంచి బయటపడటానికి ప్రయత్నిం చారు. తన లక్ష్య సాధనకు ఆర్‌యస్‌యస్‌ కూడా అవే విధానాలను అనుసరించింది. హిందువులు, ముస్లిముల మధ్య ఘర్షణలను పెంచటానికి పూనుకోవటంతో దేశంలో మతోద్రిక్తతలు తీవ్రమయ్యాయి. హిందువులు, ముస్లిముల మధ్య వైరుధ్యాలు పెరిగిన ప్రాంతాలలో జాతీయోద్యమం బలహీనపడింది.

|| చాతుర్వర్ణ వ్యవస్థను పునరుద్ధరణే సంఘ్ నేటి లక్ష్యం ||

ముస్లిములు, క్రిస్టియన్లను శత్రువులుగా చూపుతూ హిందువులను ఐక్యం చేయటానికి ఆర్‌యస్‌యస్‌ ప్రయత్నిస్తోంది. నిచ్చెనమెట్ల లాంటి కులవ్యవస్థలో ఉన్న హిందువులను ఐక్యం చేయటానికి ఆర్‌యస్‌యస్‌ ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నది? ఆర్‌యస్‌యస్‌ దృష్టిలో హిందువులను ఐక్యం చేయడమంటే హిందువులందరినీ సమానమైన పౌరులుగా చూడటం కాదు. మనుస్మృతికి అనుగుణంగా చాతుర్వర్ణ వ్యవస్థను మరింత బలపరచటం, పటిష్టంగా అమలు జరపటమే హిందువులను ఐక్యం చేయటంగా ఆర్‌యస్‌యస్‌ భావిస్తున్నది. ఆర్‌యస్‌యస్‌ చెబుతున్న హిందువుల ఐక్యతకు అర్థం అదే. కాలం చెల్లిన అసమా నతలను పునరుద్ధరించి, మరింత పటిష్టంగా అమలు జరపటమే వారి లక్ష్యం. అయితే అభివృద్ధి క్రమంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. 
ఈ మార్పులను ప్రతిఘటించటం, చాతుర్వర్ణ వ్యవస్థ పునరుద్ధరణ లక్ష్యంగా ఆర్‌యస్‌యస్‌ పనిచేస్తున్నది. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఆర్‌యస్‌యస్‌ రాజకీయ విభాగం బిజెపి ఆ లక్ష్యాలను అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నది. ఆవు మాంసం తింటున్నారనే పేరుతో ముస్లిములు, దళితులపై దాడులు చేస్తున్నారు. ఆవు మాంసం ఇంట్లో ఉంచుకున్నాడనే పేరుతో యుపిలో వారు హత్య చేసిన మహమ్మద్‌ అఖ్లాక్‌ ఇంటిలో ఆవు మాంసం లేదు. హిందూత్వ శక్తుల దాడిలో గాయా లపాలైన ఉనా దళితులు ఆవులను చంపలేదు. ముస్లిముల దాడులకు తట్టుకోలేక యుపిలోని ఖైరానా నుంచి హిందువులు వలసలు పోతున్నారన్నది కూడా పూర్తిగా అవాస్తవం. వాస్తవాలతో నిమిత్తం లేకుండా తమ లక్ష్య సాధన కోసం అసత్యాలను ప్రచారం చేయటం, కార్పొరేట్‌ మీడియా సహకారంతో వాటిని నిజమని ప్రజల చేత నమ్మింపజేయటం, తాము శత్రువులుగా భావిస్తున్నవారిపై దాడులు, హత్యలు చేయటాన్ని నేడు ఆర్‌యస్‌యస్‌ కొనసాగిస్తున్నది. అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తున్నది.జాతీయోద్యమ కాలంలో మాదిరిగానే నేడు కూడా ప్రజల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేయటమే ఆర్‌యస్‌యస్‌ లక్ష్యం. ఆనాడు సామ్రాజ్యవాదుల ప్రయోజనాలను నెరవేర్చిన ఆర్‌యస్‌యస్‌ నేడు కూడా సామ్రా జ్యవాదుల, కార్పొరేట్ల సేవలో తరిస్తున్నది. ఆర్‌యస్‌యస్‌ భావజాలం ముందుకుపోవటం అంటే అమెరికన్‌ సామ్రాజ్యవాదులకు మన దేశ ప్రయోజనాలను మరింతగా తాకట్టు పెట్టటానికి, కార్పొరేట్లు, బహుళజాతి సంస్థలకు మన దేశ సంపదను కట్టబెట్టటానికి, కార్మికవర్గం, శ్రామిక ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేయటానికి దారితీస్తుంది. అభ్యుదయశక్తులు ప్రత్యామ్నాయ భావజాలాన్ని ప్రచారం చేస్తూ, ప్రజలను చైతన్యవంతం చేయటం ద్వారానే ఆర్‌యస్‌యస్‌ విధానాలను తిప్పికొట్టటం సాధ్యమవుతుంది.    - ఎ కోటిరెడ్డి

No comments:

Post a Comment