నగదు రహితం అనే నినాదంతో కోట్లాది మంది కడుపు కొట్టి, వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన కొద్దిమందికి కళ్లు చెదిరే లాభాల పంట ఎట్లా పంచి పెట్టబోతున్నారో అర్థం చేసుకొంటే ఎవరి గుండె అయినా చెరువు కాక తప్పదు. అయితే ఒక్కటే ఉపశమనం - నగదు రహితం అనేది ఒక నినాదంగా మాత్రమే పనికి వస్తుంది తప్ప మన దేశంలో ఆచరణ అసాధ్యం.
పెద్ద నోట్ల రద్దు లక్ష్యాలలో నగదు రహిత లావాదేవీ లేదు. ప్రధాన మంత్రి ఆ మాట చెప్పలేదు. నవంబర్ 8వ తేదీ రాత్రి ఉరుములేని పిడుగు వలె టెలివిజన్ తెరల మీద ప్రత్యక్షమైన నరేంద్ర మోదీ – నల్లధనం, లంచగొండితనం, నకిలీ నోట్లు, తీవ్రవాదం మీద పాశుపతాస్త్రం విసురుతున్నట్లు ప్రకటించారే తప్ప నగదురహితం ప్రస్తావన తేలేదు. ఆ ప్రసంగంలో ఆలోచన కంటే ఆవేశమే అధికం. దేశానికి ఎవరూ చేయని మేలు తాను చేయబోతున్న ఉద్విగ్నత తొణికిసలాడింది. ప్రజలు కూడా దాన్ని హర్షించారు. జనంలో స్వాభావికంగా ‘నెగటివ్ థ్రిల్’ వుంటుంది. నల్లధనం కూడేసుకొన్న వాడు కుడితిలో పడిన ఎలుక వలె గిలగిల కొట్టుకొంటాడన్న అంచనాతో అందరూ చప్పట్లు కొట్టారు.
వారం గడిచిన తర్వాత సామాన్య జనంలో మెలుకువ వచ్చింది. ఆరు వారాలు గడిచాక మత్తు పూర్తిగా వదిలింది. నల్లధనస్వాములు కడుపులో చల్ల కదలకుండా వున్నారు; తాము మాత్రం బ్యాంకుల ముందు కాళ్లు వాచేలా నిలబడి వున్నామనే స్పృహ కలగడానికి అంత సమయం పట్టింది. తమతోపాటు క్యూ లైన్లలో ఒక్క నల్లధనం ఆసామి కూడా నిలబడి లేడనే కఠిన వాస్తవాన్ని జనం జీర్ణించుకోలేక పోతున్నారు. మరొక పక్క కట్టలు కట్టలుగా కొత్త నోట్ల రూపంలో నల్లధనం బయటపడడం జనం గుండె మండిస్తున్నది.పెద్ద నోట్ల రద్దు నిర్ణయంలోని ఉచితానుచితాల మీద ఇప్పటికే ఎంతో చర్చ జరిగింది. జరుగుతూ ఉంది. దాన్ని దారి మళ్లించి, అందరూ నగదు రహిత లావాదేవీల గురించి మాత్రమే మాట్లాడేట్టు చేయడంలో నరేంద్ర మోదీ సఫలీకృతుడైనాడు. నోట్ల రద్దు నిర్ణయంలో తలెత్తుతున్న రాజ్యాంగపరమైన, చట్టపరమైన, ప్రజా ప్రయోజన పరమైన అంశాలను సుప్రీంకోర్టుకు వివరించి చెప్పడానికి రిజర్వు బ్యాంక్ చాలా కష్టపడుతున్నది. మోదీ ఆశించినట్లు ఒక్క రాత్రిలో దేశం మొత్తాన్ని ఎలక్ట్రానిక్ చెల్లింపుల నిలయంగా మార్చడం సాధ్యమా? పన్నుల ఎగవేతను ఎలక్ట్రానిక్ చెల్లింపులు పసికట్టే వీలుంటుంది. అందువల్ల పన్ను ఎగవేత కష్టం. సులువుగా దొరికిపోతారు. కాబట్టి పన్నుల రాబడి పెరిగి ఆర్థిక వ్యవస్థ సుభిక్షమౌతుంది. అయితే ఇది ఒక ప్రణాళిక ప్రకారం, దీర్ఘకాల లక్ష్యంతో అమలు జరగాలే తప్ప ఒక్క రాత్రిలో జరిపేది కాదు. ప్రభుత్వ నిర్బంధంతో అసలే వీలుకాదు. దాని అమలు ప్రయత్నం కంటే ముందు, దానికి తగిన ఆర్థిక, సామాజిక వాతావరణ సృష్టించవలసి వుంటుంది. మన దేశంలో ఆ వాతావరణం ఎంతమాత్రం లేదు.
ఒక రొట్టె ముక్క కొనాలి అనుకొందాము. జేబులో డబ్బుంటే నేరుగా దుకాణానికి వెళ్లి, కొని ఇంటికి తెచ్చుకొంటాము. అదే ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతయితే చాలా తతంగం కావాలి. ముందుగా బ్యాంక్ ఖాతా వుండాలి. అందులో డబ్బుండాలి. చేతిలో ఒక మొబైల్ ఫోన్ వుండాలి. అది స్మార్ట్ ఫోన్ అయి వుండాలి. దాని బ్యాటరీకి చార్జి వుండాలి. ఆ ఫోన్‌కు 3జీ లేదా 4జీ ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి. పేమెంట్‌కు కావలసిన యాప్ ఒకటి కావాలి. దాన్ని నిర్వహించడానికి ఇంగ్లీషు లేదా హిందీ భాషలలో కనీస పరిజ్ఞానం వుండాలి. మన రొట్టె కొనడానికి వెళ్లిన దుకాణంలో కూడా మన మొబైల్ ఫోన్లో వుండే సాంకేతిక పరిజ్ఞానం, యాప్ కలిగి వుండాలి. అప్పుడు మాత్రమే మనం ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతిలో ఆ రొట్టె కొని ఇంటికి తెచ్చుకోగలం.
మన దేశంలో నూటికి 26 మందికి చదవటం, రాయడం తెలియదు. నూటికి 60 మందికి ఇంగ్లీష్ రాదు. అంటే 130 కోట్ల జనాభాలో 52 కోట్ల మందికి ఎలక్ట్రానిక్ చెల్లింపుల పద్ధతి చేతకాదు. 30 కోట్ల మందికి మొబైల్ ఫోన్ తెలియదు. అది కలిగి వున్న వారిలో 26 శాతం మంది వద్ద ఎలక్ట్రానిక్ యాప్ నిర్వహించగల స్మార్ట్ ఫోన్లు లేవు. ఇవన్నీ వున్నా మన దేశంలో ఇంటర్నెట్ అందుబాటులో వున్న వారి సంఖ్య కేవలం 28 శాతం. అంటే దాదాపు 90 కోట్ల మందికి ఇంటర్నెట్తో అనుసంధానం లేదు. ఇంటర్నెట్ లేకుండా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, మొబైల్ వ్యాలెట్, యాప్ పేమెంట్ వంటివేవీ పని చేయవు. ఇంటర్నెట్ వున్నా విద్యుత్ సౌకర్యం లేకుండా సుఖం లేదు. మన దేశంలో 19 శాతం గ్రామాలకు ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదు. దాదాపుగా నూటికి నూరు శాతం గ్రామాలలో రోజులో సగం సమయం కరెంట్ వుండదు. విద్యుత్ లేకుంటే ఇంటర్నెట్ పనిచేయదు. ఇంటర్నెట్ లేకుండా స్వైపింగ్ మెషిన్ పని చేయదు. క్రెడిట్, డెబిట్ కార్డుల ఉపయోగం వుండదు. మొబైల్ ఫోన్ బ్యాటరీలకు చార్జి ఎక్కించలేము. బ్యాటరీ లేకుండా పేమెంట్ యాప్‌లు పని చేయవు. ప్రాథమిక వసతుల వ్యవస్థలో ఇంత అసమగ్రత వున్న దేశంలో నగదు రహిత లావాదేవీ రాత్రికి రాత్రి ఎట్లా సాద్యం అన్నది పెద్ద ప్రశ్న.
ప్రభుత్వ లెక్కల ప్రకారమే మన దేశంలో నూటికి 22 శాతం మంది పేదరికపు అంచుకు దిగువన వున్నారు. ఎగువన వున్న వారిలో కూడా సగం మందికి రెక్క ఆడితే కానీ డొక్క ఆడదు. దిన కూలీ మీద బతికే వారే ఎక్కువ. పట్టణాలలో చిరుద్యోగాలు చేసుకొనేవారు, చిన్న చిన్న వ్యాపారాలు నడుపుకొనే వారిలో కూడా మిగులు నగదు అంటూ వుండదు. అందువల్ల వారికి బ్యాంక్ ఖాతాలు వుండవు. ఉన్నా వాటిలో కనీస నిల్వ కూడా కన్పించదు. అందువల్లే 20 కోట్ల జన్‌ధన్ యోజన ఖాతాలలో ఒక్క రూపాయి కూడా లేకపోవడం. ప్రభుత్వం చెప్పింది కాబట్టి బ్యాంక్ ఖాతా తెరిచారే తప్ప వాటి ద్వారా లావాదేవీ జరిపే నగదు నిల్వ పేదల వద్ద వుండదు. బ్యాంక్ ఖాతాలో నిల్వ లేకుండా ఏ పద్ధతిలోనూ ఎలక్ట్రానిక్ చెల్లింపులు జరపలేరు. అంటే పేదరికపు అంచుకు దిగువన వున్నవారు, దిగువ మధ్యతరగతి కుటుంబీకులు, చదువురాని వారు, చదువు వచ్చినా ఇంగ్లీషు, హిందీ పరిజ్ఞానం లేనివారు, విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల వారు.. ఇలా ఎన్నో తరగతుల వారికి డిజిటల్ చెల్లింపుల పద్ధతి పాటించడం అసాధ్యం. అదే పాటించాలని నిర్బంధిస్తే వారి జీవితాలు చిన్నాభిన్నమై పోతాయి.
ప్రపంచంలో అత్యధికంగా ఎలక్ట్రానిక్ చెల్లింపు పాటించే పది దేశాలలో డెన్మార్క్ ఒకటి. నూరు శాతం అక్షరాస్యత, నూరు శాతం ఇంటర్నెట్ వినియోగం, 30 లక్షల రూపాయల తలసరి రాబడి వున్న ధనిక దేశమది. ఇప్పటికే అక్కడ 86 శాతం నగదు రహిత లావాదేవీలు నడుస్తున్నాయి. తతిమా 14 శాతం కూడా ఈ పరిధిలోకి తెచ్చేందుకు ఆ ప్రభుత్వం 2030 సంవత్సరాన్ని లక్ష్యంగా నిర్దేశించింది. మన దేశంలో నగదు రహిత లావాదేవీలు కేవలం 2 శాతం మాత్రమే. అంటే కేవలం 14 శాతం లోటు పూరించుకోవడానికి డెన్మార్క్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు 15 ఏళ్ల సుదీర్ఘ ప్రణాళిక వేసుకొంటే, 98 శాతం లక్ష్యాన్ని ఒకే ఒక్క రాత్రిలో సాధించాలని మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నం ఎంత హాస్యాస్పదమైందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఆచరణ సాధ్యం కాని లక్ష్యం కోసం ప్రజలను నిర్బంధిస్తున్నారు. బ్యాంకులలో జనం దాచుకొన్న డబ్బు ఇవ్వకుండా బిగించి పెడుతున్నారు. రోజుల తరబడి క్యూలలో నిలబడి జనం అల్లాడిపోతున్నా పట్టించుకోవడం లేదు. వృద్ధులు, పెన్షనర్లు, అనారోగ్యంతో బాధపడే వారు ఆ క్యూ వరసలలోనే కూలబడి పోయి ప్రాణాలు విడుస్తున్నా ఆయన కళ్లు చెమ్మగిల్లడం లేదు. వీరి చావులకు ఏ ప్రభుత్వమూ బాధ్యత తీసుకోకపోవడం మన దేశంలో మాత్రమే సాధ్యమైన మహావిషాదం.
ప్రధాని, ప్రభుత్వం కలసి చేస్తున్న ఈ నేలవిడిచి సాము వల్ల ఎవరికి ప్రయోజనం? దీని వల్ల కలిగే మేలు సామాన్య ప్రజలకు చేరాలంటే ఒక తరం పాటు ఎదురు చూడవలసి వుంటుంది. కానీ ప్రభుత్వానికి ఎంతో చేరువగా మెలిగే రిలయెన్స్ జియో, పేటీఎం వంటి కంపెనీలు మాత్రం ఈ రోజుకు ఈ రోజే దాని ప్రయోజనాన్ని అనుభవిస్తున్నాయి. దీనివల్ల కలిగే మేలు గోరంత అయితే, జరిగే నష్టం కొండంత.మన దేశంలో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా పేటీఎం వంటి మొబైల్ వ్యాలెట్ వాడితే, ప్రతి లావాదేవీ మీద 2.5 శాతం రుసుము వసూలు చేస్తున్నారు. మన వద్ద వున్న వంద రూపాయలను నగదు రూపంలో ఎన్నిసార్లు ఖర్చు చేసినా దాని విలువ వందగానే వుంటుంది తప్ప తగ్గదు. పెరగదు. కానీ ఎలక్ట్రానిక్ పద్ధతిలో దాన్ని ఖర్చు చేస్తే, ప్రతిసారీ 2.5 శాతం లెక్కన విలువ తగ్గిపోతూ వస్తుంది. అంటే 40వ సారి ఖర్చు చేసిన తర్వాత మన వంద రూపాయల విలువ సున్నా అయిపోతుందన్నమాట. 40 సార్లు ఖర్చు పెట్టిన ప్రతిసారీ వంద రూపాయలు నష్ట పోగల్గిన ఆర్థిక స్తోమత మన పేదలకు, మన రైతులకు వుందా? అది వారి మీద పెనుభారం కాదా? దేని కోసం, ఎవరి కోసం వారీ భారం మోయాలి? వారేమీ పన్ను ఎగవేతదారులు కారు. పన్ను చట్టాల పరిధిలోకి వచ్చే రాబడి వారికి లేదు.
ఎలక్ట్రానిక్ చెల్లింపులు జరిపే పేటీఎం వంటి కంపెనీలకు వచ్చే లాభం లక్షల కోట్లలో వుంటుంది. మన దేశంలో ఇన్‌కం ట్యాక్స్ వంటి ప్రత్యక్ష పన్నుల రాబడి ఏడాదికి 8 లక్షల కోట్లు మాత్రమే. దేశంలో మొత్తం బ్యాంకు లావాదేవీల అంచనా 880 లక్షల కోట్లు. అందులో ప్రభుత్వ బలవంతం వల్ల 20 నుంచి 30 శాతం డిజిటల్ చెల్లింపుల కిందకు వచ్చినా, దాదాపు 300 లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతాయి. వాటి మీద 2.5 శాతం రుసుము అంటే, ప్రభుత్వానికి వచ్చే ఇన్‌కంటాక్స్ కంటే పేమెంట్ వాలెట్; క్రెడిట్ కార్డుల కంపెనీలకు అధిక లాభం చేకూరుతుంది. లక్షల కోట్ల రూపాయలు వారి బొక్కసాలకు చేరుతాయి. నగదు రహితం అనేది ఒక నినాదంగా మాత్రమే పనికి వస్తుంది తప్ప మన దేశంలో ఆచరణ అసాధ్యం. ఇప్పుడున్న రెండుశాతం నుంచి చైనాతో సమానంగా 10 శాతానికి పెరిగినా ఎంతో గొప్ప విజయం అవుతుంది. ఎలక్ట్రానిక్ చెల్లింపుల వల్ల సూపర్ మార్కెట్ల వ్యాపారం ఈ నెల రోజులలో 500 నుంచి 1000 శాతం పెరిగింది. అంత మేరా వీధిలో చాప పరిచి కూరలు అమ్మేవాడు, నెత్తిన బుట్ట పెట్టుకొని ఇల్లిల్లు తిరిగేవాడు జీవనోపాధి కోల్పోతున్నాడు. సూపర్ మార్కెట్ల సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టగలిగే స్థాయిలో వుంటుంది. వీధి వ్యాపారుల సంఖ్య లక్షలలో వుంటుంది. కాకులను కొట్టి గద్దలకు వేయడం అంటే ఇదే.
-నెల్లూరు డోలేంద్ర ప్రసాద్

No comments:
Post a Comment