Monday, 5 December 2016

|| హేతువాదిగా అంబేద్కర్‌ ||




                       డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ గొప్ప హేతువాది. గొప్ప మానవతావాది. మహోన్నత సామాజిక విప్లవకారుడు. సాంస్కృతిక విప్లవ యోధుడు. భారతదేశ పునర్నిర్మాణకర్త. గొప్ప చదువరి. మహోజ్వల పోరాట యోధుడు. లోతైన ఆలోచనాపరుడు. ప్రపంచ మేధావుల్లో మొదటి వరుసలో నిలబడినవాడు. నీతి, నిజాయితీ, నిష్కపటత్వం, నిర్మలత్వం, నిక్కచ్చితనం, ముక్కుసూటితనం, సున్నితత్వం ఆయన వ్యక్తిత్వంలోని బహుపార్శ్వాలు. స్నేహం, ప్రేమ, కరుణ, ఆత్మీయత, అనునయం ఆయన సుగుణాలు.


దేశంలోని వ్యక్తిత్వాల్లో ఆయన హిమాలయమంత ఎత్తయినవాడు. అంబేద్కర్‌ దేశంలోని వాఙ్మయాన్ని మొత్తం అధ్యయనం చేశాడు. వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, భారత, భాగవత, రామాయణ పురాణాలు, అష్టాదశ పురాణాలు, కావ్యాలు, ప్రబంధాలు, నాటకాలు, శతకాలు, ధర్మశాస్త్రాలు అన్నింటినీ క్షుణ్ణంగా చదివాడు. వీటన్నింటినీ మానవతావాద దృష్టితో పరిశీలించి పునర్నిర్మించాడు. ఆయన ముఖ్యంగా వేదాలను అధ్యయనం చేశాడు. వేదాలను అధ్యయనం చేసినవారు అతితక్కువ మంది ఉన్నారు. అంబేద్కర్‌ వేదాలను అధ్యయనం చేయక ముందు వాటి పూర్వాపరాలు దేశానికి పూర్తిగా తెలియవు. ఆయన వేదాలను అధ్యయనం చేసి వాటి మూలాలను ప్రపంచానికి చాటాడు. వేదాలనే కాక వేదాంగాలను కూడా అధ్యయనం చేశాడు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ వేదాల గురించి ఇలా చెప్పారు. వేదాలను ప్రశ్నించడానికి వీలుకానివిగా చేసి వేద బ్రాహ్మణులు తృప్తి చెందలేదు. ఇంకొంచెం ముందుకు సాగి వేదాలు అపౌరుషేయాలు (మనుషుల చేత రాయబడనివి) అని నొక్కి వక్కాణించారు. వేదాలు మానవ కల్పితాలు కాదని ఇక్కడ వారి ఉద్దేశం. ఈ సిద్ధాంతం ప్రశ్నించడానికి వీలులేదనే సిద్ధాంతానికి దారి తీస్తుందనడంలో అనుమానం లేదు. ఎలాగంటే అవి మానవ కల్పితాలు కావు అనడం వల్ల సామాన్యంగా మానవుల వల్ల కలిగే తప్పిదాలు, పొరపాట్లు, దౌర్భల్యాలూ అందులో ఉండటానికి వీల్లేదని, అందుచేతనే అవి ప్రశ్నాతీతాలు అయ్యాయి. ఏది ఏమైనప్పటికీ ఇది స్వతంత్రమైన సిద్ధాంతం కనుక దీన్ని ప్రత్యేకంగా పరిశీలించవలసిన అవసరం ఉందని అంబేద్కర్‌ చెబుతూ 'వేదాలు మానవాతీతాలు కాదని, మానవులు రాసినవే' అని నిర్ధారించారు. ఎందుకంటే వేదాల్లో మంత్రాలు, అధిదేవతల పేర్లు, రకరకాల ఛందస్సులు ఉన్నాయి. ఇవన్నీ అనేకమంది రుషుల పేర్ల మీద రాయబడ్డాయి. వారందరూ మానవులే. అయితే ఈ రుషులు అనేక ప్రేరణలతో రాశారనచ్చుకాని, ఇవి మానవులు రాయలేదనటంతో ఈ రుషుల అస్తిత్వమే పోతుంది. ముఖ్యంగా వేదాల్లో యజ్ఞ, యాగాల గురించి చెప్పబడింది. అందులో పుత్రకామేష్టి యాగం. అంటే పుత్రుడు లేకపోతే యాగం చేయటం ద్వారా పుడతారని అర్థం. చాలా మంది తమకు పిల్లలు ఎలా కలుగుతారో తెలియక పుత్రకామేష్టి యాగాలు చేశారని అంబేద్కర్‌ చెప్పాడు. అలాగే అశ్వమేథ యాగం. అశ్వాన్ని ఎంత భూభాగంలో తిప్పగలిగితే ఆ భూమంతా నాదనే సామ్రాజ్యవాద భావన వేదాల నుంచే వచ్చింది. ఇది కూడా ఆర్యుల సామ్రాజ్య విస్తరణ కాంక్షకు సంబంధించిన విషయమే. అంబేద్కర్‌ తన 'హిందూమతంలో చిక్కుముడులు' అనే గ్రంథంలో వేదాలను మొదట ఎదిరించిన భారతీయులు చార్వాకులని పేర్కొన్నాడు. అప్పటి నుంచి వేదాల ప్రమాణత మీద భారతదేశంలో హేతువాదులు, తాత్వికులు, నాస్తికులు యుద్ధం చేస్తూనే ఉన్నారని ఆయన చార్వాకుల వాదాన్ని బలపరిచాడు. అసలు వేదాలు ఎలా పుట్టాయి అనే దానిలో పదకొండు వాదాలున్నాయని అంబేద్కర్‌ తేల్చాడు. పురుషుని నిగూఢ యజ్ఞం నుంచి ఉద్భవించాయని, స్కంభపై ఆధారపడినవని, బ్రహ్మ నుంచి వేరు చేయబడిన వెంట్రుకల నుంచీ, నోటి నుంచీ వచ్చాయని, ఇంద్రుని నుంచి ఉద్భవించాయని, కాలం నుంచి ఉద్భవించాయని, అగ్ని నుంచి ఉద్భవించాయని, ప్రజాపతి నుంచి, జలాల నుంచి ఉద్భవించాయని, బ్రహ్మ ఉచ్ఛ్వాసంగా వచ్చాయని, మనో సముద్రం నుంచి దేవతలు తవ్వి తీశారని, ప్రజాపతి గడ్డంలో నుంచి వచ్చాయని, వచస్సు యొక్క సంతతి అని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలన్నిం టి నీ అశాస్త్రీయమైనవిగా అంబేద్కర్‌ కొట్టివేశాడు. ఒక రకంగా అంబేద్కర్‌ పరిశోధన వల్ల భారతీయ తత్వశాస్త్రానికి మేలు జరిగింది. ఎందుకంటే మంచి రాసినా, చెడు రాసినా రుషులే రాశారు. మానవేతరమైన శక్తులేమీ రాయలేదని ప్రతిపాదించటం వల్ల రుషులకు అస్తిత్వం వచ్చింది. నిజానికి రుగ్వేదంలో ఎక్కువగా ఆదిభారతీయుల ను నిందించే సూత్రాలే రాయబడ్డాయి. రుగ్వేదంలో ఆర్య రుషులు తమ శత్రువులను నిందించడానికే (రుక్కులలో) ఎక్కువ ప్రయత్నించారు. వారెంత ప్రాధాన్యత నిచ్చారంటే, ఆ శత్రువర్గం ఎంతో శక్తిమంతమైందని మనకు అర్థమవుతుంది. ఆర్యరుషైన మధుఛన్దసుడు ఇంద్రుని స్తుతిస్తూ శత్రువర్గాన్ని జయించడానికి ఎలా అభ్యర్థిస్తున్నాడో చూడండి. 'ఇంద్రత్వోతాస ఆవయం వజ్రం ఘనాదదీమహి| జయేమ సంయుధిస్పృధః||' ఓ ఇంద్రా! నీచే రక్షితులమగు మేము ఘనమైన వజ్రమును దీసికొనుచున్నాము. యుద్ధములందు శత్రువులను జయింతుము. 'వయంశూరేభి రస్తృభి రింద్రత్వయాయు జావయమ్‌| సాసహ్యోమ పృతన్యతః||' శూరులై ఆయుధహస్తులైన భటులతోను, నీతోను గూడినవారమై ఓ ఇంద్రా! సేనలతో గూడిన శత్రువులను మేమోడింతుము. 'మహా ఇంద్రః పరశ్చను మహిత్వ మస్తువజ్రిణే| ద్యౌర్న ప్రథినాశవః' ఇంద్రుడు గొప్ప శరీరము, గొప్ప గుణములు కలవాడు. అయినను వజ్రము ధరించిన ఇంద్రునకు అవి (శరీరము, గుణము) అధికములగుగాక, ద్యులోకమెంత విస్తారమో అంతగా బలము విస్తరించుగాక. 'ఏవాహ్యస్య సూనృతా విరప్శీగోమతీమహి| సక్వాశాఖాన దాశుషే||' యుద్ధంలో హెచ్చరిస్తుంది. గోవులనిచ్చునదియు, గొప్పదియు, సత్యప్రియమైనదియునగు నా ఇంద్రుని వాక్కు యజమానునకు బండ్లతో నిండిన కొమ్మవంటి దగుగదా! అని మంత్రము ఇలా మూలవాసులైన శత్రువులను నిర్జించే శక్తినిమ్మని ఆర్య రుషులు ఇంద్రుని కోరారు. సింధూ నాగరికతను నాయకత్వం వహిస్తున్న జాతులు ఆర్యులకు ఎదురు నిలిచి పోరాడారనడంలో ఎలాంటి సందేహం లేదు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు వ్యవసాయ సంస్కృతి ప్రతినిధులు కాగా, వారికి వ్యతిరేకంగా నిలబడిన ఆర్యులు పశుగణాలకు నాయకులు. ఆర్యులది పితృస్వామిక వ్యవస్థ, భారతీయ గణాలది మాతృస్వామ్య వ్యవస్థ. వారికి, వీరికి జీవన విధానాల్లో వైరుధ్యం ఉంది. అందుకే ఆర్యగణాలు భారతీయ వారసులను జయించడానికి తహతహలాడారు. ఆనాడు భారతీయుల తరపున నిలబడిన, పోరాడిన వారిని ఆర్యులు రాను రాను శత్రువులుగా, అస్పృశ్యులుగా కూడా ప్రకటించి వారి మీద ద్వేషానలాన్ని కుమ్మరించారు. ఇక తత్వశాస్త్ర పరంగా అంబేద్కర్‌ వేదాలను ఎదిరించిన చార్వాకుల వాదాన్ని 'సర్వదర్శన సంగ్రహం' నుంచి ఇలా చెప్పారు. 'వైదిక పండితులమని చెప్పుకొనే వంచకులు పరస్పర విధ్వంసకారులవుతున్నారు. కర్మకాండను ప్రమాణంగా అంగీకరించేవారు జ్ఞానకాండ ప్రమాణాన్ని త్రోసిపుచ్చుతున్నారు. జ్ఞానకాండను ప్రమాణంగా అంగీకరించేవారు కర్మకాండ ప్రమాణాన్ని త్రోసిపుచ్చుతున్నారు. చివరకు ఈ మూడు వేదాలూ మోసగాళ్ల పరస్పర విరుద్ధమైన సందర్భశుద్ధి లేని మాటలుగా అయ్యాయి. ఈ మేరకు ఒక ప్రసిద్ధమైన లోకోక్తి ఇలా ఉంది. అగ్నిహోత్రం, వేదత్రయం, సన్యాసి, మూడు కట్టెలు, విబూది రాసుకోవటం ఇవన్నీ ఆలోచన, లోకజ్ఞానమూ లేని వారి జీవనధారాలని చార్వాకులు చెప్పారు. అంబేద్కర్‌ ఒక హేతువాదిగా చార్వాక దర్శనాన్ని ఇక్కడ మనకు ఉటంకించాడు. రుగ్వేద రుషులు భారతదేశ సంస్కృతీ విధ్వంసానికి పూనుకున్నారు. ఆ సంస్కృతీ విధ్వంసానికి వాళ్ళు ఇంద్రుణ్ణి సృష్టించారు. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదాలు మూడూ అనార్యులను జయించడానికి ప్రకృతి శక్తులను ప్రార్థించిన సూత్రాలేనని అంబేద్కర్‌ చెప్పాడు. సింధూ నాగరికతలోని వ్యవసాయ సంస్కృతి రుగ్వేద సంస్కృతి కంటే పూర్వపుది. చాలా ఉన్నతమైంది కూడా. అప్పటికే వారు భూమిని గుర్తించారు. వ్యవసాయాన్ని చేస్తున్నారు. సింధూ సంస్కృతి రుగ్వేద సంస్కృతి కంటే చాలా ఉన్నతమైంది కావడం వల్ల ఆర్యులు ద్వేషపడ్డారు. అక్కడ గొప్ప జనావాసాలు నెలకొన్నాయి. సింధూవారసులు నదులకు ఆనకట్టలు కట్టి నీటిని ప్రవహింపజేశారు. హరప్పా, మొహంజదారో నగరాలలో ఒక నిర్మాణాత్మకమైన పద్ధతి ఉంది. అప్పటికే చెక్క పని చేయగలిగిన పనివాళ్ళు, ఆనకట్టలు కట్టగలిగిన నిర్మాణకర్తలు ఉన్నారు. అయితే రుగ్వేదంలో ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన యంత్రాంగం మనకు ఎక్కడా కనిపించదు. అందుకే వాళ్ళు సింధూ సంస్కృతి కూడా మాదే అని చెప్పడానికి ఆధారాలు లేవు. ముఖ్యంగా నదుల ప్రక్కన జీవించే స్వభావం ఉన్నవారు. నదిని వ్యవసాయ సంస్కృతికి మలచినవారు మూలవాసులే. మనకు క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరాల నుంచి సింధూ నాగరికత కనిపిస్తుంటే క్రీస్తు పూర్వం 1750కి ఉగ్వేదం కూర్చబడింది. 1500 నుంచి 1400 వరకు కాబూల్‌ గంగానదుల మధ్య ప్రాంతంలో ఈ పని జరిగింది. సింధూ నాగరికతలో ఆర్యుల ఉనికి లేదు. రుగ్వేదంలో చెప్పిన గోత్రాలకు సంబంధించిన వారు కానీ, వైదిక ఆర్యులకు సంబంధించిన ఎవరి ఉనికి కానీ సింధూ నాగరికతలో కనిపించటం లేదు. భారతదేశ చరిత్రను పరిశీలిస్తే మూలజాతులే ఈ దేశ నిర్మాతలు. మూల జాతుల మీద మొదటి యుద్ధం ప్రకటించింది రుగ్వేదమే. అందుకే అంబేద్కర్‌ ఒకానొక దశలో రుగ్వేదంలోని కథనాలన్నీ మూలజాతులను వధించిన ఘట్టాల వర్ణనలే అన్నారు. అయితే వేదాలు జ్ఞానవంతమైనవని బ్రాహ్మణవాదులు ప్రచారం చేశారు. వేదాల్లోని చిన్నచిన్న కథలను తీసుకుని పురాణ సాహిత్యమంతా సృష్టించారు. అందులో ప్రతి నాయకుడూ మూలవాసుల నాయకులను చంపినవాడే. వేదాలకు నాయకులు ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు. నిజానికి ఇంద్రుడు తప్ప మిగిలినవన్నీ ప్రకృతి శక్తులే. వీటిని మూలవాసులు ఎప్పుడో అధ్యయనం చేసి వారి జీవన క్రమానికి వాడుకున్నారు. మూలవాసులు ఎవరూ అగ్నిని పూజించరు. అగ్నితో అన్నం వండుకుంటారు. కానీ యిగ్వేదం మొత్తం అగ్ని స్తోత్రాలే. మూలవాసులు ఎవరూ నవధాన్యాలను అగ్నిలో వేయరు, నెయ్యిని అగ్నిలో కాల్చరు, కానీ వేదాల్లో చెప్పబడిన యజ్ఞయాగాల్లో కొన్ని లక్షల టన్నుల నెయ్యిని అగ్నిలో కాల్చారు. అందుకే వేదాలను భారతీయ విధ్వంసక శాస్త్రాలన్నాడు అంబేద్కర్‌. ప్రసిద్ధ చరిత్రకారులైన రొమిల్లా థాపర్‌, డిడి కొశాంబి, ఆర్‌ఎస్‌ శర్మ, ఎఎల్‌ భాష్యం అందరూ వేదాలు భారతదేశ సాంస్కృతిక విధ్వంసక కథనాల సమాహారమనే చెప్పారు. రొమిల్లా థాపర్‌ రుగ్వేద సంస్కృతి గురించి చెబుతూ దేవతల్లో మిత్ర, వరుణులు ఇండోఇరానియన్‌ సంస్కృతులకు చెందినవారని, వీరికి బదులుగా ఇంద్రుడు, అగ్ని పేర్కొనబడ్డారు. ఇంద్రుడు యుద్ధంలో ముందుండి నడిపించటం చేత ఎల్లప్పుడు మూలవాసులను హతమార్చడానికి దాసుల నివాసాలను నాశనం చేయటం ద్వారా ఇంద్రుడు గొప్ప నాయకుడయ్యాడు. వేదాల లోతుల్ని అంబేద్కర్‌ చూసిన తర్వాత భారతదేశ చరిత్రకారుల్లో వేదాలకు ఎదురు మాట్లాడగలిగిన స్థైర్యం విస్తరించింది. బ్రాహ్మణవాదానికి వేదాలు పునాది అనే విషయం బలపడింది. వేద వాఙ్మయంలో జ్ఞానం లేదని, హింస, కర్మకాండ, ద్వేషం, అణచివేత ఉన్నాయనే విషయం అంబేద్కర్‌ ద్వారా బట్టబయలయ్యింది. వేదాల్లో రాయబడిన పూర్వసంస్కృతం భారతదేశంలో ఏ జాతులూ మాట్లాడవని అంబేద్కర్‌ నిగ్గు తేల్చాడు. భారతదేశంలోని ఏ తెగల సంస్కృతీ వేద సంస్కృతి కాదని తెలియజెప్పాడు. అంబేద్కర్‌ తన హేతువాద దృక్పథంతో చేసిన రచనలన్నీ ఆయన పుట్టి 125 ఏళ్ళు, చనిపోయి 60 ఏళ్ళు అవుతున్న ఈ సందర్భంగా వామపక్ష, లౌకికవాదులు, హేతువాదులందరికీ వైదిక హిందూత్వ బ్రాహ్మణవాద భావజాలానికి ప్రత్యామ్నాయ వాదాలను, సిద్ధాంతాలను ఆచరణలో ప్రతిఫలింపజేసుకుని దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి అందరూ నడుం కట్టాలని, అంబేద్కర్‌ ఆలోచనా మార్గంలో నడవాల్సిన చారిత్రక సందర్భం ఇదని ఆయన స్మృతిలో జ్ఞాపకం చేసుకుందాం..          - డాక్టర్‌ కత్తి పద్మారావు

No comments:

Post a Comment