నల్లధనమో అక్రమధనమో స్వాధీనం చేసుకుని ప్రజల పరం చేయమని ఎప్పటినుంచో సమాజం నుంచి వినిపిస్తున్న న్యాయమైన డిమాండ్ ఇంతగా అపహాస్యం పాలవుతుందని ఊహించలేదు. నల్లధనం ఎక్కడిదక్కడే- తెల్లడబ్బే బ్యాంకుల్లో బందీ అయింది. గాలి జనార్దనరెడ్డి రాజును అపహసించే విదూషకుడు. కట్టలుకట్టలు దొరుకుతున్న రెండువేల నోట్లు క్యూలో కూలబడిపోయినవారికి నివాళి.
తమ దాకా డబ్బులు వస్తాయో రావో నమ్మకంలేదు, అయినా కొండవీటి చేంతాడంత క్యూలో ఎందుకు నిలబడుతున్నారు? నడిరేయి ఏ జామునో ఏటిఎమ్ కడుపు పండితే, పొద్దునే మొట్టమొదటి వితడ్రాయల్ చేసుకుందామని రాత్రి రోడ్డు మీదనే ఎందుకు నిద్రపోతున్నారు? అడిగినంత ఇవ్వలేము, ఇచ్చినంత పుచ్చుకోండి అని బ్యాంకు సిబ్బంది చెబితే, సరేలెమ్మని ఎందుకు సర్దుకుపోతున్నారు? చిల్లరలేక, చిన్న పనులు లేక రోజులెట్లా గడుపుతున్నారు? నాలుగురోజులే కదా కష్టపడితే పోలేదా అని నిర్లిప్తంగా ఉంటున్నారా? దేశం కోసం పడిగాపులు పడుతున్నాం లెమ్మని ధైర్యం చెప్పుకుంటున్నారా? రేప్పొద్దున ఒక బంగారు భవిష్యత్తు ఉంటుందని కలలు కంటున్నారా? నరేంద్రమోదీ చెప్పినట్టు అన్ని క్యూలనూ అంతం చేసే అంతిమ క్యూ ఇదేనని నమ్ముతున్నారా?
ఒక మధ్యస్థాయి ప్రభుత్వాధికారి ఒక సూత్రీకరణ చేశాడు. ‘అంబానీలూ అదానీలూ నోట్ల రద్దు సమర్థించేసరికి మామూలు మనిషి అయోమయంలో పడిపోయాడు. ఎంతకీ నల్లడబ్బు ఎవరి దగ్గర ఉన్నదన్నది అర్థం కాలేదు. ఆలోచించి ఆలోచించి, చివరకు నల్లసంపన్నుడిని తానేనని అందుకే ఇట్లా క్యూలో నిలబడి కష్టపడుతున్నానని నిర్ధారణకు వచ్చాడు. అట్లా అనుకున్నాక, అతనికి ఇక సంశయాలు ఏమీ మిగలలేదు. అంతా అర్థమైపోయింది..’’. విచిత్రవాస్తవికతను సామాన్యులు పరిష్కరించుకునే పద్ధతి అదే మరి.
ప్రజల సహనాన్ని కానీ, అసహనాన్ని కానీ అన్నివేళలా విడమరచి వివరించలేము. జీవితంలో కొంత అసంబద్ధత ఉంటుంది. దాన్ని వేదాంతంతోనో విశ్వాసంతోనో అధిగమిస్తారు. అస్తవ్యస్త పాలనలో, సంక్షోభ సమాజంలో అర్థరాహిత్యం మరింత పెరుగుతుంది. నిర్హేతుకత అధికారవిలువ అవుతుంది.నిశ్చలజలాలను చెదరగొట్టినప్పుడు ఏ ప్రతిబింబమూ కనిపించదు. పగిలిన అద్దంలో ప్రతిబింబంవిచ్ఛిన్నమవుతుంది. కళ్లకు కనిపించేది బుద్ధికి అందదు. ఆలోచన వక్రీభవనం చెంది అధివాస్తవికత కమ్ముకుంటుంది. వైరుధ్యాలను పక్కనబెట్టి, తలకిందులతనమే అలవాటు అవుతుంది. ఆ ఆభాసను తట్టుకోవడానికి అందులోనుంచే చమత్కారాన్ని, వినోదాన్ని పిండుకుంటారు. కరుణ బీభత్సాలకు హాస్యపు పూతపూసి దిగమింగుతారు. నోట్లరద్దు తరువాత సామాజిక మాధ్యమాలలో జనం సృజనాత్మకత వేయిపూవులై వికసించింది.
ప్రజలు తమ జ్ఞానేంద్రియాలను వినియోగించుకోలేని కల్లోల పరిస్థితులను సృష్టించే పాలకులు, వారి భక్తులు ఆ గందరగోళాన్ని ఆసరా చేసుకుని ఎంతటి తలకిందులు మాటలైనా మాట్లాడతారు. నోట్ల రద్దు ద్వారా నరేంద్రమోదీ మార్క్స్ మార్గాన్నే అనుసరించారని ఒకరు యోగ్యతాపత్రం ఇచ్చారు. ఆ నాయకురాలు తాను భారతీయ జనతాపార్టీలో ఉన్నా ఆలోచనలరీత్యా వామపక్షవాదిని అని కూడా చెప్పుకున్నారు. చరిత్రను మరపులోకి, వర్తమానాన్ని వెరపులోకి ఖననం చేశాక, అపశబ్ద భయమన్నది నాస్తి. ఇంకొక పెద్దాయన, నోట్ల రద్దును మావోజెడాంగ్ నడిపిన సాంస్కృతిక విప్లవంతో పోల్చారు. అకస్మాత్తుగా మోదీకి మార్క్సిస్టు సిద్ధాంతకర్తల ఆసరా అవసరం ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. సాంస్కృతిక సంబంధాల భారతీయ మండలి బాధ్యతలు కొత్తగా స్వీకరించిన లోకేశ్ చంద్ర, నరేంద్రమోదీ సాక్షాత్తూ భగవంతుని అవతారమని, మహాత్మాగాంధీ కంటె గొప్పవారని కీర్తించారు.
ఉపమాలంకారానికి సమానధర్మం ఒక నిర్బంధ లక్షణం. గుజరాతీలు కావడం తప్ప మోదీకి, గాంధీకి పోలిక ఏమిటి? వాక్స్వాతంత్య్రం అందరికీ ఉన్నది కానీ, ఇటువంటి ప్రవచనాలు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే చెలామణీ అవుతాయి. ఒక రకమైన ఉన్మాదంలో మాత్రమే నిర్విచక్షణతో మనుషులు మాట్లాడగలరు.
పోయిన శనివారం నాడు యుపిలోని మొరాదాబాద్‌లో ఒక బహిరంగసభలో మాట్లాడుతూ, ప్రధానమంత్రి తనను తానొక ఫకీరుగా చెప్పుకున్నారు. తనకు సంసార జంజాటాలు లేకపోవడాన్ని ఈ మధ్య తరచు మోదీ ప్రస్తావిస్తున్నారు. అటల్ బిహారీ వాజపేయి వంటి నేత ఏ నాడూ తన అవివాహితత్వాన్ని ప్రజాసేవకు ఆపాదించుకోలేదు.
పెళ్లి చేసుకోవడానికి సమయం లేకపోయింది- అని మాత్రం అన్నారు. కుటుంబం లేకపోవడం ఎవరినీ ఫకీరును, నిస్వార్థినీ చేయదు. మోదీ స్వయంగా అవినీతిపరుడూ, సంపాదనాలౌల్యుడూ కాకపోవచ్చును. నిస్వార్థి అయిన కార్యకర్త అయి ఉండవచ్చును. వీలునామా రాసేనాటికి చేతిలో పదిరూపాయలు కూడా లేని గాంధీజీని కూడా బిర్లాలకు అనుకూలంగా వ్యవహరించాడని ప్రత్యర్థులు విమర్శించారు. అవివాహితగా ఉండిపోయిన జయలలిత మీద అక్రమార్జన అభియోగాలు నడిచాయి. మమతాబెనర్జీ, మాయావతి-వీరందరూ ప్రజాజీవితమే ఏకైక జీవితంగా ఉన్నవారు. వారు కూడా ఆరోపణలకు అతీతులు కారు. మీ కోసమే ఇట్లా మోడులాగా ఉన్నాను, ఏ బాదరబందీలూ లేవు, ఎప్పుడంటే అప్పుడు నా సంచీ సర్దుకుని వెళ్లిపోతాను- అంటే ఉద్వేగపు భాషణ బాగానే ఉంటుంది కానీ, దాన్ని జనం కొంచెం వడబోసుకుని మరీ వింటారు.
తన బికారితనానికి తోడు, కొంచెం మార్క్సిజాన్ని కూడా జోడించి మోదీ, జనధన ఖాతాదారులు తమ ఖాతాల్లో వచ్చి పడిన డబ్బును తామే ఉంచుకోవచ్చని ఒక సంచలన ప్రకటన చేశారు. ధనికులందరినీ మీ ఇళ్లకు వచ్చి ప్రాధేయపడేట్టు చేశాను, వాళ్లు మళ్లీ వచ్చి అడిగితే ఇవ్వము పొమ్మనండి, కాదని గలభా చేస్తే నా పేరు చెప్పండి - అని మోదీ అరివీర ఉద్బోధ చేశారు. ఔరా, ఎంతటి తెంపరి తనము? అనిపించి ఉంటుంది విన్న వెంటనే. కానీ, కాస్త ఆలోచించగానే అదెంత పగటికలో జనానికి అర్థమై ఉంటుంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అనుభవించాలనుకుంటేనే, తమకు చెందవలసిన భూములను భుక్తం చేసుకుందామంటేనే, ప్రభుత్వాలు ఎంతగా సహకరిస్తాయో ప్రజలకు తెలియదా? గ్రామంలో భూస్వామి మీద గొంతెత్తితే చాలు ఢిల్లీ నుంచే బలగాలు దిగుతాయి. పలుకుబడి కలిగిన దొరవారు, తన దాసుని దగ్గర దాచిపెట్టుకున్న సొమ్మును తిరిగి పొందకుండా ఎవరు ఆపగలరు? భూసంస్కరణలు వచ్చినప్పుడు పాలేర్ల పేరుమీద, పనివాళ్ల పేరు మీద రాసిన భూములు ఏమయ్యాయి? ఎవరు అనుభవిస్తున్నారు? భారతదేశంలో నగదు ఆర్థికవ్యవస్థ ఏ ఏ పొరల్లో ఎంత ఆవశ్యకంగా, అనివార్యంగా ఉన్నదో మాత్రమే ఈ దేశ ప్రధానికి అవగాహన లేదనుకున్నాము కానీ, వివిధ సామాజిక ఆర్థిక వర్గాల మధ్య ఉండే అంతరాల సంబంధాలు, అంతస్థులతో కూడిన పరస్పరత గురించి కూడా ఏలినవారికి ఓనమాలు తెలియదు. లేదా తెలిసి కూడా, జనాన్ని మురిపించి మభ్యపెట్టవచ్చుననుకునే లౌల్యమయినా కావచ్చును.
నల్లధనమో అక్రమధనమో స్వాధీనం చేసుకుని ప్రజల పరం చేయమని ఎప్పటినుంచో సమాజం నుంచి వినిపిస్తున్న న్యాయమైన డిమాండ్ ఇంతగా అపహాస్యం పాలవుతుందని ఊహించలేదు. నల్లధనం ఎక్కడిదక్కడే, తెల్లడబ్బే బ్యాంకుల్లో బందీ అయింది. గాలిజనార్దనరెడ్డి రాజును అపహసించే విదూషకుడు. కట్టలుకట్టలు దొరుకుతున్న రెండువేల నోట్లు క్యూలో కూలబడిపోయినవారికి నివాళి. ప్రజలకు ఇవ్వటమంటే జనధన ఖాతాల్లో మనిషికి లక్ష ఇస్తానని ఊరించడం కాదు. క్రూరమైన, నేరమంటిన నోట్లను సమష్టిపరం చేయడం. జనంసొమ్ము అప్పు తీసుకుని బకాయిలు పడ్డ వారిని ముక్కుపిండడం. జనం చదువుల కోసం, వైద్యం కోసం ఖర్చు చేయడం. చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెదుకుతున్న, వెదుకుతున్నట్టు అభినయిస్తున్న నేతా, నీ నీడలో ఉన్న ధననాగుల సంగతేమిటి?
సొంతాస్తి లేని బికారి ఫకీరుకూ, సమానత్వం ఉండాలనుకునే సామ్యవాదులకూ ఈ దేశంలో ఇంకా గౌరవం ఉన్నది కాబట్టి, పాలకులు ఆయా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయాలని చూస్తారు. ఎవరు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాని స్థితిలో, ఆ సంక్లిష్టతను జనం నిర్వేదంతో స్వీకరిస్తారు. ఒక్కోసారి ప్రహేళికను విడదీయడానికి రాజకీయులలోనే కొందరు సహాయం అందిస్తారు. ఫకీరువైతే పదిలక్షల ఖరీదైన సూటెందుకు ? అని ఎవరో అడుగుతారు. రోజుకు పది కోట్లెందుకు మారుస్తావు అని మరొకరు అడుగుతారు. విజయమాల్యాను గట్టెక్కించి, మమ్మల్ని క్యూలో ఎందుకు నిలబెట్టావని ఇంకొకరు నిలదీస్తారు. దేశభక్తితో నిలువుజీతం చేస్తుంటే, పోలీసులతో ఎందుకు కొట్టిస్తున్నారని ఒక నిస్సహాయుడు రోదిస్తాడు. గందరగోళ అస్పష్టస్థితి మధ్యనే హేతుబద్ధ ప్రశ్నలు కూడా మొలుస్తాయి. ఆర్భాటపు రణగొణధ్వనిలో వివేకపు మాటలు అణగారిపోవచ్చు. వైరుధ్యాల బరువు మోయలేక, వాస్తవం తనను తాను పునస్సమీకరించుకుంటుంది. ఇరుసు తప్పి అతలాకుతలం అయిన భూమిని తిరిగి సత్యమే సక్రమంగా నిలబెడుతుంది. - కె. శ్రీనివాస్ ( ఆంధ్ర జ్యోతి)

No comments:
Post a Comment