సిఎన్బిసి, ఎన్డిటివి, 24×7, జీ న్యూస్ వంటి జాతీయ చానళ్ళు, ఇంకెన్నో స్థానిక చానళ్ళను చూస్తే ప్రభుత్వం ప్రకటించకుండానే భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలై పోయిందేమో అనిపిస్తుంది. తలా తోకా లేని చర్చలు, నమ్మశక్యం గాని విశ్లేషణలతో దేశభక్తి పేరుతో ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఈ తరు ణంలో నిష్పక్షపాతంగా కొన్ని నిజాలను చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీడియా ప్రచా రం చేస్తున్నట్లు యుద్ధమంటే గెలుపు, యుద్ధమంటే పరువు ప్రతిష్టలు మాత్రమే కాదు. యుద్ధమంటే రక్తం, యుద్ధమంటే కోట్లాది ప్రాణాలతో చెలగాటం.
|| ఉరి సంఘటన తర్వాత దేశంలో పరిస్థితి ||
ఉరి సైనిక శిబిరంలో జిహాదీ ఉగ్రవాదులు 18 మంది సైనికులను నిర్దాక్షిణ్యంగా చంపివేసిన తర్వాత ఎల్ఒసి వెంబడి పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారిపోయింది. దీనిపై ఎలా స్పందించాలి అని ఆలోచించే లోపు ప్రజల్లో అసహనం పెరిగిపోతూ వచ్చింది. దీనికి మీడియా ఆజ్యం పోసింది. నిపుణుల అభిప్రాయం కూడా సామాన్య ప్రజల అభిప్రాయాలకు అద్దం పడుతూ దీనికి భారత ప్రభుత్వం ధీటైన సమాధానం ఇవ్వాల్సిందేనని ఒత్తిడి పెరిగింది. ఉన్న కొద్దిపాటి ప్రత్యామ్నాయాలలో మెరుపు దాడులు చేయడమొక్కటే అత్యల్ప ప్రమాదకర తక్షణ చర్యగా కనిపించింది. పాకిస్తాన్, భారత్ పట్ల ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ ఉగ్రవాదంతో దానికి ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నప్పటికీ ప్రపంచానికంతా తెలుసు. అయినా సరే భారత్ చాలా సహనంగా వ్యవహరిస్తూ వచ్చింది. కానీ దేశ భద్రతకే సవాలు విసిరిన ఉరి సంఘటనకు జవాబు ఇవ్వక తప్పలేదు. ఫలితంగా ఎల్ఒసి వెంబడి మెరుపుదాడులు నిర్వహించి అనేక మంది ఉగ్రవాదులను హతమార్చడం జరిగింది. ''ద లైన్స్ దట్ వర్ క్రాస్డ్'' అనే పేరుతో 'ది హిందూ'లో విపిన్ నారంగ్ చెప్పిన దాని ప్రకారం ఈ సర్జికల్ దాడులకు చాలా పకడ్బందీగా వ్యూహరచన చేయడం జరిగింది. ఈ మెరుపు దాడులను సైనిక చర్యగా చిత్రీకరించి పూర్తిస్థాయి యుద్ధానికి దిగే అవకాశం పాకిస్తాన్కు ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవడం జరిగింది. ఈ మెరుపు దాడుల ముఖ్యమైన రెండు ఉద్దేశాలు ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం, ఎటువంటి ఉగ్రవాదాన్ని తిప్పికొట్టడానికైనా భారత్ సిద్ధమేనని తెలియజేయడం. రెండు ఉద్దేశాలూ విజయవంతంగా నెరవేరాయి. డిజిఎంఒ లెఫ్టినెంట్ జనరల్ రణ్బీర్సింగ్ కూడా ఈ మెరుపు దాడులను ప్రతీకార చర్యగా కాకుండా ఉగ్రవాదాన్ని ఆపడానికి చేపట్టిన ముందస్తు చర్యగా పేర్కొన్నారు.
|| మెరుపు దాడుల తద్వాత పరిస్థితి : మీడియా పాత్ర ||
మెరుపు దాడులను ప్రతీకార చర్యగా వర్ణించకూడదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మీడియా వీటిని ఒక చిన్నపాటి యుద్ధంగా చిత్రీకరిస్తున్నది. ప్రధాని మాటలు కూడా పెడచెవిన పెడుతూ చాలా మంది రాజకీయ నాయకులు, రిటైర్ట్ ఆర్మీ ఆఫీసర్లు బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తున్నారు. టిఆర్పి రేట్లను పెంచుకోవడానికి మీడియా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడం చాలా సులభం. మెరుపు దాడుల తర్వాత కూడా యుద్ధ పరిస్థితిని సద్దుమణగనీయడం లేదు మీడియా. మెరుపు దాడుల తర్వాత ఏంటి? అంటూ పూర్తిస్థాయి యుద్ధం వైపు ప్రజల మనోభావాలను రెచ్చగొడుతున్నాయి మీడియాలో వచ్చే వార్తా విశ్లేషణలు. టీవీ ముందు కూర్చుని మాకు యుద్ధం కావాల్సిందే అని ప్రగల్భాలు పలకడం చాలా దేశభక్తి పూరితంగా తోచవచ్చు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప యుద్ధం శ్రేయస్కరం కాదని ప్రభుత్వానికి, సైన్యానికి తెలుసు.
|| యుద్ధం జరిగితే ||
భారత్, పాకిస్తాన్ల మధ్య అణు యుద్ధం జరిగితే కనీసం 1.2 కోట్ల మంది ప్రజలు చనిపోతారు. పొరుగు దేశాలలో ఇంకో 1.3 కోట్ల మంది ప్రజలు చనిపోయే అవకాశం ఉంది. అంటే దాదాపు భారత ఉపఖండంలో మానవ సంస్కృతి అంతమయినట్టే. ప్రస్తుతం ఇరుదేశాల వద్దనున్న అణ్వాయుధాలలో ఒక శాతాన్ని ఉపయోగించినా అవి ప్రపంచ వాతావరణం మొత్తాన్నీ మార్చేయగలవు. రుతువుల నిడివి తగ్గిపోతుంది. విశ్వవ్యాప్తంగా వర్షాలు సగటున 10 శాతం తగ్గిపోతాయి. అణు విస్ఫోటనం తర్వాత జనించే అణు మబ్బులు 2,000 మైళ్ళ వరకూ విస్తరించగలవు. అవి అణు వర్షం రూపంలో భూమికి చేరితే కోట్లలో ప్రాణ నష్టం జరుగుతుంది. ఎంవి రామన్ అనే అణు భౌగోళిక శాస్త్రవేత్త అంచనాల ప్రకారం 15 కిలో టన్నుల బరువుగల అణ్వాయుధం ముంబయి లాంటి పెద్ద నగరాన్ని పూర్తిగా ధ్వంసంచేసి కనీసం 8.6 లక్షల మంది ప్రజలను చంపగలదు. అణు విస్ఫోటనం నుంచి వెలువడే కర్బన అణువులు వరి ఉత్పాదనను నాలుగేళ్ళపాటు 21 శాతం వరకు తగ్గించగలదు.
పాకిస్తాన్తో యుద్ధానికి రోజుకు రూ.5 వేల కోట్లు ఖర్చవుతాయి. సగటున పదిహేను రోజులు యుద్ధం కొనసాగినా రూ.2.5 లక్షల కోట్లు వ్యయం అవుతుంది. భారత దేశంలో ఇప్పటికే 36.3 కోట్ల మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువనే నివసిస్తున్నారు. ఈ వ్యయం వారందరిపై ఎంతటి భారాన్ని మోపగలదో మనం ఊహించగలం. వారి జీవన ప్రమాణాలను మెరుగు పరిచే ఎటువంటి సంక్షేమ చర్యలు చేపట్టడానికి మరో దశాబ్దం వరకు వీలు పడదు. ఉద్యోగాలు పుట్టవు. నూతన పరిశ్రమల కల్పన ఉండదు. యాభై ఏళ్ళ శ్రమతో నిర్మించుకున్న వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైపోతుంది. ప్రపంచంలోనే భారత్ రెండో అతి పెద్ద సైన్యాన్ని కలిగుంది. భారత్ వద్ద పాకిస్తాన్ ఆగడాలను కట్టడి చేయడానికి చాలా మార్గాలున్నాయి. కానీ అవి ఏవీ కూడా భారీ ప్రాణహాని లేకుండా జరగవు. ఒక రాజ్యసభ సభ్యుడు పేర్కొన్నట్టు పాకిస్తాన్ ఒక అణ్వాయుధంతో వంద కోట్ల మంది భారతీయులను హతమార్చగలిగితే భారత దేశం తలచుకుంటే పూర్తి పాకిస్తాన్నే లేపేయగలదు అనే మాటలలో నిజం లేకపోలేదు. కానీ ఆ వంద కోట్ల మంది భారతీయులను కోల్పోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? వంద కోట్ల మంది ప్రజలను కోల్పోయిన తర్వాత ఇక భారతదేశంలో మిగిలేదేమిటి?
|| యుద్ధ నివారణా చర్యలు ||
ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగు పడాలంటే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం వెతకాల్సిందే. కాశ్మీర్ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పాకిస్తాన్తో చర్చలకు ఉపక్రమిస్తే పరిష్కారం దొరక్కపోదు. విధ్వంసకరమైన యుద్దం తప్పాలంటే చర్చలు ఒక్కటే మార్గం. ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే ముందు మీడియా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఉభయ దేశాలూ అణుశక్తి దేశాలే. ఒకరినొకరు ధ్వంసం చేసుకునే పూర్తి సామర్థ్యం ఇరువురికీ ఉంది. యుద్ధమంటూ వస్తే టిఆర్పి రేట్లను పెంచడానికి మనుషులు కూడా మిగలరు. మీడియా ముందున్న తక్షణ కర్తవ్యం ప్రజల్లో యుద్ధం వల్ల కలిగే దుష్పరిణామాల పట్ల అవగాహన కల్పించడం, సైనిక చర్యలను సంచలనాత్మక వార్తలుగా సృష్టించకుండా ఉండటం. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు వచ్చిన అన్ని ప్రమా దాల కంటే అణ్వాయుధాల ముప్పు అత్యంత ప్రమాదకరమైనది. హిరోషియా, నాగసాకీ దీన్ని ఇప్పటికే నిరూపించాయి. కానీ ఉన్నత స్థాయిలో తప్ప దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎటువంటి చర్యలూ చేపట్టకపోవడం ఆలో చన కలిగిస్తుంది. వాతావరణ పరిరక్షణ చర్యలు ఎంత ముఖ్యమైనవో దానిలో నివసించే మనుషుల ప్రాణాల సంరక్షణ కూడా అంతే ముఖ్యమైనది కదా! ఏటా జరిగే వార్షిక శిఖరాగ్ర సభలు, సదస్సుల వల్ల అణ్వాయుధ నిషేధం జరగదు. మా ర్పు క్రింది స్థాయి నుంచి పైకి వెళ్ళాలి. అణ్వాయుధాలు మానవాళికి ఎంత హాని కరమో ప్రజలు గుర్తించి వాటిని నిషేధించాలని క్షేత్రస్థాయిలో ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చినప్పుడు ప్రపంచస్థాయిలో వాటిని నిషేధించక తప్పదు. ''యుద్ధాన్ని ప్రజలు నిరాకరిస్తే తప్ప యుద్ధాలు ఆగవు'' అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ పేర్కొన్నారు. - సంజీవనీ కుసుమ్.

No comments:
Post a Comment