Wednesday, 12 October 2016

|| నిరుద్యోగుల ఉత్పత్తి యంత్రం ... రోబో ||




                   మరో యాభయ్యేళ్లలో ఈ ప్రపంచం ఎంతగానో మారనుంది. ఇళ్లు వాకిళ్లు, కార్యాలయాలు కార్ఖానాలు, హోటళ్లు హాస్పిటళ్లు, విద్యాలయాలు వినోదశాలలు అన్న బేధం లేకుండా ఎక్కడ చూసినా రోబోలదే హవా. ఒక్క మాటలో చెప్పాలంటే సగానికి సగం ఉద్యోగాలను రో బోలు, యంత్రాలే కానిచ్చేస్తాయన్నది నిపుణుల మాట. ఇంతకీ యంత్రుల ప్రభావం ఏ దేశంపై ఎంత వుంటుంది? ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు ఊడతాయి? అంతమంది ఉద్యోగాలకు ఎసరొస్తే దిక్కేమిటి?


సాంకేతిక పరిజ్ఞానం ప్రతి అరగంటకూ వృద్ధి చెందుతోంది. దీనికి తగ్గట్టుగానే మనుషులకు బదులు ఉత్పత్తిలో రోబోలు (మరమ్మతుల) రోబోల ప్రభావం ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదు. అన్ని దేశాల మీద వుంది. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఇటీవల ఇదే హెచ్చరించారు. గంటకు 20 డాలర్ల కంటే తక్కువ చెల్లించే ఉద్యోగుల స్థానంలో రోబోలను అధికంగా ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. 62 శాతం ఉద్యోగాలకు ప్రమాదం వుందని కూడా ఆయన ఆవేదన చెందారు. అయితే రోబోల వల్ల అధికంగా నష్టపోయేది అభివృద్ధి చెందుతున్న దేశాలేనన్నది ప్రపంచ బ్యాంకు మాట. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పటికే రోబోలు, కంప్యూటర్ల వాడకం భారీగా వుంది. ప్రస్తుతానికి వర్థమాన దేశాలు పని ప్రదేశాల్లో ప్రవేశపెట్టబోయే రోబోల శాతం ఎక్కువ. అందుకే వీటివల్ల కోల్పోబోయే ఉద్యోగాలు కూడా ఇక్కడే ఎక్కువగా వుంటాయని ప్రంపంచ బ్యాంకు అంచనా. ఈ విషయమై 15వ ర్యాంకు పొందిన మార్సిడోనియాలో సైతం 68 శాతం ఉద్యోగాలకు కోత పడనుంది. అయితే ఈ ప్రభావం పూర్తిగా ఆచరణకు వచ్చేందుకు కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. 

|| కలవర పెట్టే అధ్యయనాలు ||

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్‌.ఒ) అంచనా ప్రకారం రోబోలు, యంత్రాల ఉపయోగం వల్ల ఆగేయ ఆసియాలోని (ఆసియాన్‌ దేశాలు) ఉత్పాదక రంగంలో పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఊడతాయి. కంబోడియా, వియత్నాం, థారులాండ్‌, ఫిలిప్పైన్స్‌ దేశాల్లో రోబోల వల్ల 56 శాతం (13.7 కోట్లు) ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. ఈ దేశాల్లో అత్యంత ప్రభావితమయ్యేవి చెప్పులు, వస్త్రోత్పత్తి రంగాలు. అంతగా నైపుణ్యం అవసరం లేని ఉత్పత్తులుగా ఇప్పటి వరకు వీటిని పరిగణిస్తున్నారు. ఇవికాక ఆటోమొబైల్‌, ఆటోమోటివ్‌ భాగాల తయారీ రంగాల మీద కూడా యంత్రుల ప్రభావం పడుతుంది. ప్రస్తుతానికి ఆసియాన్‌ ప్రాంతంలో 800,000 మందికి ఈ రంగంలో ఉపాధి లభిస్తోంది. ఐ.ఎల్‌.ఒ నివేదిక ప్రకారం రానున్న ఇరవయ్యేళ్లలో ఇండొనేషియాలో 69 శాతం, థారులాండ్‌లో 73 శాతం ఉద్యోగాలకు ప్రమాదం వాటిల్లుతుంది. అంతేకాక ప్రపంచంలోకెల్లా 15 అత్యంత ధనికదేశాల్లో 7.1 కోట్ల ఉద్యోగాలకు ఎసరు ఏర్పడుతుందని హెచ్చరించింది. రానున్న ఐదేళ్లలో 15 ప్రధాన దేశాలలో 5.1 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారని ప్రపంచ ఆర్థిక ఫారమ్‌ చెప్తోంది. రోబోలు, ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ వల్ల 7.1 కోట్ల ఉద్యోగాలు పోతాయన్నది ఆ సంస్థ అంచనా. బ్రిటన్‌లోని చిల్లర వర్తకం మరియు రవాణా రంగాల్లో 2036 నాటికి 11 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారని 'డెలాయిట్‌' సంస్థ చెప్తోంది. 
ఇలా వుండగా ప్రపంచ కార్మిక శక్తిలో 65 శాతం కలిగి వున్న 15 దేశాలపై ప్రపంచ ఆర్థిక ఫారమ్‌ (డబ్ల్యు.ఇ.ఎఫ్‌) చేసిన అధ్యయనంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. వీటిలో ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇండియా, ఇటలీ, జపాన్‌, మెక్సికో, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్‌ అమెరికా దేశాలు, ఆసియాన్‌ దేశాలు వున్నాయి. నివేదిక ప్రకారం టెలిమెడిసిన్‌ పెరగడంతో అత్యధిక ఉద్యోగాల కోత ఆరోగ్యం రంగంలోనే పడుతుంది. ఆ తర్వాతి స్థానం విద్యుత్‌, ఆర్థిక సేవా పరిశ్రమలదే. సమాచార విశ్లేషకులు, ప్రత్యేక అమ్మకాల ప్రతినిధులకు ఈ మారుతున్న పరిస్థితుల్లో మంచి డిమాండ్‌ ఏర్పడుతుందని కూడా ఆర్థిక ఫారమ్‌ అంచనా.

|| నష్టాలేంటి ||

ఇప్పటికే వున్న ఆర్థిక అసమానతలను రోబోలు, ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ మరింతగా పెంచుతాయి. ప్రతిభావంతుల కొరత ఏర్పడుతుంది. నిరుద్యోగం పెరుగుతుంది. ఈ ప్రభావం మహిళా ఉద్యోగులపై ఎక్కువగా పడుతుంది. మహిళలు ఎక్కువగా కార్యాలయ, పరిపాలనా సంబంధ విధుల్లోనే వుంటారు. వీరికోసం ఒక్క కొత్త ఉద్యోగం వస్తే 5 ఉద్యోగాలు పోతాయి. అదే పురుషుల్లో అయితే పోయేవి ఒకటైతే వచ్చేవి మూడు. పేద-ధనిక దేశాల మధ్య కూడా అసమానతాపూరిత అగాథాలు ఊహించనిరీతిలో విపరీతంగా పెరుగుతాయి. రోబోల కారణంగా పేద దేశాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పోవడంతో నిరుద్యోగ సైన్యం పెద్ద ఎత్తున తయారౌతుంది. మధ్య ప్రాచ్య, ఆఫ్రికా దేశాలలో నిరుద్యోగ యువత చాలా పెద్ద సంఖ్యలో వుంది. వారికి కావాల్సిన నైపుణ్యాలను నేర్పడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. కాల్‌ సెంటర్లు, ఉత్పత్తి పరిశ్రమలపై రోబోల ప్రభావం వుంటుంది. నైపుణ్యం కలిగిన ఉద్యోగాలపై వేటు పడుతుంది. ఆ తర్వాత ఫైనాన్షియల్‌ టెక్నాలజీ రంగంపై పడుతుంది.

|| మానవ ప్రయత్నం ||

ఉద్యోగాలను కోల్పోకుండా కాపాడుకోవాలంటే ఆయా దేశాలు విద్యారంగంపై, కార్మిక నైపుణ్యాలను పెంచేందుకు పెట్టుబడులను పెంచాల్సిన అవసరముందని ఐ.ఎల్‌.ఒ సూచిస్తోంది. వీటి ప్రభావం తమ కార్మికవర్గంపై వుండకూడదంటే ఆయా దేశాలు విద్య, వయోజన శిక్షణా కార్యమ్రాలపై పెట్టుబడులు పెంచాలి. మరీ ముఖ్యంగా మహిళలు సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణిత రంగాల్లో డిగ్రీలు పొందాలని చెప్తోంది. ఈ సమస్య నుంచి బైట పడేందుకు సాంకేతిక పరిజ్ఞానం జొరబడలేని ఉద్యోగాలపై పట్టు బిగించాలని ప్రపంచ బ్యాంకు చెప్తోంది. పున: శిక్షణా తరగతులు, జీవితాంతం మరిన్ని నైపుణ్యాలను నేర్చుకుంటుండడం వల్ల ఉద్యోగాలకు భరోసా వుంటుందని చెప్తోంది. తొలి దశలోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు మద్దతుగా నిలవడం నిరుద్యోగ సమస్యను నివారించడంలో ఒక కీలకాంశంమన్నది ప్రపంచ బ్యాంకు ఉవాచ. 

|| ప్రాధాన్యతకు కారణం ఏమిటి ||

ఉద్యోగాల్లో కోత పడుతుందని, అసమానతలు వంటి అనేకానేక సమస్యలు తలెత్తుతాయని తెలిసీ రోబోలు, యంత్రాలకు ఎందుకు ప్రాధాన్యతనిస్తున్నారు? అన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. కారణం ఒక్కటే. పెట్టుడిదారీ పోటీ. ప్రపంచీకరణ యుగంలో కార్మికుల మీద పెట్టుబడి తగ్గించి, యంత్రాల మీద పెంచడం అనేది అనివార్య పరిణామం. దీనివల్ల క్రమంగా ఉపాధి నశించి చివరికి సంక్షోభానికి దాపురిస్తుంది.

|| మనుషులేం చేయాలి ||

పనులన్నీ రోబోలు చేసేస్తే మనుషులేం చేయాలనేది ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రశ్న. పైగా భవిష్యత్తులో ఏయే రంగాల్లో ఉద్యోగాలు దొరుకుతాయనేది కూడా అంతుబట్టడం లేదు. ముందు ముందు కొత్త రంగాలు ఉద్భవించేది వాస్తవమే అయినా అందులో లభించే కొత్త ఉద్యోగాలు ఎన్ననేది ప్రశ్నార్థకమే. (ప్రజాశక్తి)



No comments:

Post a Comment