Monday, 3 October 2016

|| యుద్ధం చచ్చిపోవాలి ||

 'రణస్థలం కానిచోటు భూ/ స్థలమంతా వెదకిన దొరకదు/ గతమంతా తడిసె రక్తమున,/ కాకుంటే కన్నీళ్లతో..' అని మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా.. ధరాతలం యావత్తూ ఉగ్రవాద రక్తపు మరకలు... ఆ మరకల వెనుక అగ్రరాజ్య అడుగుజాడలు... అసహాయుల ఆర్తానాదాలే కనిపిస్తాయి, వినిపిస్తాయి. సామ్రాజ్యవాద విషపుత్రిక ఉగ్రవాదం.. ప్రపంచ మానవాళిపై ఉరుముతున్న మత్యుమేఘమై మారణహోమానికి తెరతీస్తోంది. యుద్ధానికి కాలుదువ్వితే... సంభవించే వినాశనం... మానవ నాశనం. ఇప్పుడు కమ్ముకొన్న రాజకీయ యుద్ధ మేఘాలు ఆ వినాశనాన్ని తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. రెండు అణు దేశాలు తలపడితే... మిగిలేది మారణహోమం. గెలుపు ఓటములతోనే యుద్ధం ముగిసిపోదు. 'భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో/ ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో/ ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో/ మానవ కళ్యాణం కోసం పణమెత్తిన రక్తము ఎంతో/ రణరక్కసి కరాళ నత్యం రాచిన పసి ప్రాణాలెన్నో/ కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో...' అని దాశరథి రంగాచార్య చెప్పినట్టుగా యుద్ధం వల్ల జరిగే విషాదం రక్తపాత రహితంగా మరికొన్ని జీవితకాలాల పాటు కన్నీటిని మాత్రమే చిందింపజేస్తుంది. నిర్దయగా హృదయాలను మెలి పెడుతుంది. కానీ... రాజకీయ యుద్ధోన్మత్తులు అనంతర పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా.. తాత్కాలిక ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది.

ప్రస్తుతం మనమంతా యుద్ధోన్మత్తులమై ఉన్నాం. ఉగ్రవాద పీచమణచాలని ఉవ్విళ్లూరుతున్నాం. గత వారం రోజులుగా దౌత్యపరమైన యుద్ధం చేసిన భారత్‌... ఇప్పుడు నేరుగా ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. దీంతో సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సోషల్‌ మీడియాలో సైతం అక్షరాలను కరవాలాలుగా మార్చి... భారత సైన్యానికి సంఘీభావం తెలుపుతున్నారు. బాలగంగాధర్‌ తిలక్‌ ఓ కవితలో 'యుద్ధానికి కాలు దువ్వితే/ ఊరుకునే చవట ఈ కాలంలో ఎవడు?/ ఉరుకుతాడు సింహంలా ముందుకి నరుడు/ చివ్వకు ప్రతి భారతీయుడూ ఒక కవ్వడి/ గవ్వకు మారడు శత్రువు వాడెవడైనా' అంటూ ఘీంకరిస్తాడు. అదే రకమైన ఉద్రేకం ఇప్పుడు ప్రతి భారతీయుడిలోనూ కానవస్తోంది. 'కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల... కాదేదీ కవితకనర్హం..' అని శ్రీశ్రీ చెప్పినట్టుగా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో మన మిలిటరీ నిర్వహిస్తున్న ఆపరేషన్లు కూడా మోడీని భుజాలపై మోస్తున్న మీడియాకు కలిసొచ్చింది. మన సైన్యం తెగువ... పోరాట పటిమ అద్భుతం... వీరోచితం. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న దాయాదికి గుణపాఠం చెప్పాల్సిందే. కానీ జరుగుతున్న తీరు వేరుగా ఉంది. యుద్ధ రంగంలో మోడీయే పోరాటం చేస్తున్నట్టుగా ప్రచారం. పాక్‌కు ధీటైన జవాబివ్వడం ద్వారా మోడీ ఛాతీ 56 అంగుళాల నుంచి వంద అంగుళాలు పెరిగిందని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వ్యాఖ్యానించడం చూస్తే.. ఈ మేనియా ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సోషల్‌ మీడియా కూడా పూనకం వచ్చినట్లు ఊగిపోతోంది. వాస్తవానికి... పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాదుల గుడారాలను ధ్వంసం చేయడమన్నది ఇదే తొలిసారి కాదు... చివరిసారీ కాదు. పిఒకెలో ఉగ్రవాదుల కదలికలు పెరిగిన ప్రతిసారీ... ఈ తరహా ఆపరేషన్‌ నిర్వహించడం పరిపాటే. దానికి ఏ పేరు పెట్టినా... ఏ విధమైన వ్యూహరచన చేసినా... శత్రువును కట్టడి చేయడమన్నది సైన్యం వ్యూహం. అయితే.. ఈసారి మాత్రం ఏకంగా పాకిస్తాన్‌పై యుద్ధం చేస్తున్నంత హడావుడి జరుగుతోంది. దీనివెనుకున్న కారణమేంటనేది దేశ రాజకీయాలను పరిశీలిస్తున్నవారికి ఇట్టే అవగతమౌతుంది. రెండున్నరేళ్ల మోడీ పాలన తీరు పట్ల పెరుగుతున్న అసంతప్తిని మాయం చేయడానికి ఇదో అందివచ్చిన అవకాశం. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు మరింత ప్రయోజనకరం.

ప్రపంచ జీవన చిత్రంపై చెరగని ముద్ర వేసిందీ యుద్ధమే. ఎన్నో ఎన్నో గాయాలు విషాద గేయాలై చరిత్ర స్మతిపథంపై కదులుతూనే ఉంటాయి. యుద్ధం అంటే ప్రాణ నష్టం.. యుద్ధం అంటే వీరోచితం.. యుద్ధం అంటే ఆర్థిక నష్టం. కానీ రాజకీయ నాయకులకు యుద్ధం కూడా రాజకీయమే. అందుకే.. 'ఇవాళ నువ్వు తాగుతున్న నీళ్ళలో నెత్తురూ/ నువ్వు తినబోతున్న అన్నంలో నిషిద్ధ మానవ మాంసాల తునకలూ విసిరి/ వాళ్ళు ఆడుకుంటున్న ఆటలో/ నువ్వే ఒడిపోతావ్‌ ఎప్పుడూ!/ నేనూ దేశాన్ని ప్రేమిస్తాను గాని/ దాన్ని భక్తిగా తర్జుమా చేసుకోలేను ఎప్పటికీ,/ నువ్వు క్షమించకపోయినా సరే!' అంటాడు కవి అఫ్సర్‌. ఈ భూమ్మీద మనుషులు అంతరించేదాకా యుద్ధాలు జరుగుతుండవలసిందేనా? రుధిర ప్రవాహాలు పారుతుండవలసిందేనా? వేలల్లో... లక్షల్లో... జనాలను చంపుతున్న యుద్ధానికి.. మానవ వనరుల వినాశనానికి కారణమౌతోన్న యుద్ధానికి చావురాదా? యుద్ధానికి చావు వచ్చితీరాలి.

No comments:

Post a Comment