Sunday, 23 October 2016

|| అగ్రరాజ్యం - వక్రప్రచారం ||




అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి దశకొచ్చింది. అభ్యర్ధుల మధ్య కీలకమైన ముఖాముఖి చర్చల ఘట్టం ముగిసింది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజల సాధకబాధ కాలను, ప్రపంచ సమస్యలను మథించి పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన అగ్రరాజ్య ఎన్నికల ప్రచారం వ్యక్తిగత దూషణలకు, బరితెగింపు ఆరోపణలకే పరిమితమైపోవడం విస్మయకరం. డోనాల్డ్‌ ట్రంప్‌ నోటి దురుసుతనం వెగటు పుట్టించడం, హిల్లరీ క్లింటన్‌ వ్యంగ్యాస్త్రాలు విసుగు తెప్పించడం అమెరికా ప్రజానీకాన్ని ముక్కున వేలేసేకునేలా చేస్తున్నాయి.
ప్రపంచ పెద్దన్న తానేనని స్వీయ బాకాలూదుకునే అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అధ్యక్ష ఎన్నికల ప్రచార తంతు ఎన్నడూ లేనంత వికృత రీతిలో వ్యక్తిగత విద్వేషాలతో సాగుతున్నాయి. పెద్ద వికృతానికి 'ఏనుగు'ను, సోమరితనానికి, మొండితనానికి 'గాడిద'ను ప్రతీకగా అమెరికన్లు భావిస్తారు. ఈ రెండు జంతువులను ఎన్నికల చిహ్నాలుగా కలిగి ఉన్న రిపబ్లికన్‌ పార్టీ (ఏనుగు), డెమోక్రాటిక్‌ పార్టీ (గాడిద) అభ్యర్థుల తీరూ ఆ లక్షణాలనే తలపింప జేస్తుండటం యాదృశ్చికమే అయినా నిజం. చర్చల ప్రకరణలో చివరిదైన మూడో డిబేట్‌లో కనీస మర్యాద సూచకమైన కరచాలనానికీ ఇరువురు నాయకులకూ విముఖత చూపారంటే విద్వేషం ఎంత కరుడు గట్టిందో అర్థం చేసుకోవచ్చు. జాత్యాంహకార జాఢ్యంతో ముస్లింలు, వలస వచ్చినవారిపై ఒంటికాలిపై లేస్తున్న ట్రంప్‌ వాదనల్లో కానీ, అమెరికా గుట్టును రట్టు చేసి వేగుచుక్కగా నిలిచిన వికీలీక్స్‌కు రష్యా అండదండలున్నాయంటూ హిల్లరీ చేస్తున్న ఆరోపణలు కానీ అమెరికా ప్రజానీకానికి ఏమాత్రం పనికొచ్చేవి కావు. పెట్టుబడి మానస పుత్రికైన ఆర్థిక మాంద్యం మూలాన సొంత దేశంలో తిష్ట వేసిన పేదరికం, వేతన కోతలు, సంక్షేమ నిధుల తగ్గింపు, పేదరికం వంటి సమస్యలకు, పెట్రేగిపోతున్న తుపాకీ సంస్కృతికి కారణాలు అన్వేషించకుండా, ఆ సమస్యలన్నిటినీ వలసదారులపైకి, ముస్లింల పైకి, ఇతర దేశాలపైకి నెట్టివేయడం అవాంఛనీయం. ట్రంప్‌ వ్యాఖ్యలతోనే తాజాగా వెలుగులోకి వస్తున్న రిగ్గింగ్‌ బాగోతాలు కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల నిజాయితీని ప్రశ్నించేవే. పరోక్ష పద్ధతిలో సాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తరతరాలుగా రెండు పార్టీల వ్యవస్థే నడుస్తూ వస్తోంది. ప్రస్తుతం బరిలో నిలిచిన ఇరువురు నేతల నిజాయితీ, విశ్వసనీయత నేతి బీరలో నెయ్యి చందమేనని ప్రజలు భావిస్తున్నారు. ఇద్దరు నాయకులు కుంభకోణాలతో అప్రతిష్ట మూటగట్టుకున్న వారే. సొంతపార్టీల్లోనే వీరికి విశ్వసనీయత లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అశ్లీల సంభాషణా బాగోతం, పన్నుల ఎగవేత, ఇతర కుంభకోణాల బురదలో ట్రంప్‌ మునిగి తేలుతుండగా.. ఇ-మెయిల్స్‌ బండారం, క్లింటన్‌ ఫౌండేషన్‌ నిధుల గోల్‌మాల్‌ వంటివి హిల్లరీని చిక్కుల్లో పడేశాయి. 
ప్రస్తుతం అమెరికన్ల కలలకు, వాస్తవిక సామాజిక, ఆర్థిక పరిస్థితులకు మధ్య చాలా పెద్ద అగాథమేర్పడింది. ఆర్థిక మాంద్యం వెంటాడుతుండడం, ఉపాధి పడిపోవడం, పెరుగుతున్న వలసలు ఆ దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో వాటి ఊసే లేదు. అమెరికాను పట్టి పీడిస్తున్న మరో సమస్య ధన రాజకీయాలు. అభ్యర్థి గుణగణాల కన్నా డబ్బే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తోందనేది జగమెరిగిన సత్యం. ఓటర్ల కొనుగోలుకు ట్రంప్‌ కోట్ల డాలర్లు కుమ్మరించగా.. హిల్లరీ ప్రచారానికి వాల్‌స్ట్రీట్‌ లాబీ నిధులు కుమ్మరిస్తుండటం కార్పొరేట్‌ కనుసన్నల్లోనే అమెరికా ఎన్నికలు సాగుతున్నాయన డానికి నిలువెత్తు నిదర్శనం. ఫైనాన్స్‌ పెట్టుబడి ప్రయోజనం చేకూర్చే సంస్కరణ లు తీసుకొస్తానని హిల్లరీ ఇచ్చిన హామీలు వికీలీక్స్‌ బహిర్గతం చేయడం అక్కడ ఫైనాన్స్‌ పెట్టుబడికీ, రాజకీయాలకూ పడిన పీఠముడిని విదితం చేస్తోంది. విద్వేష జాఢ్యంతో ఊగిపోతున్న ట్రంప్‌ లాంటి వ్యక్తి ఇంత దూరం ఎలా వచ్చారం టేనే అమెరికా ఎన్నికల విశ్వసనీయత ఏపాటిదో ఇట్టే బోధపడుతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఆర్థిక అసమానతలు మారవు. యుద్ధాలు, ఆయుధాలు, చమురు రాజకీయాల్లో మార్పు ఉండదు. ఎన్నికల్లో ధన ప్రభావం పెరుగుదలను అరికట్టకుండా, కాలం తీరిన రెండు పార్టీల వ్యవస్థకు స్వస్తి చెప్పకుండా అమెరికా రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయనుకుంటే అది అత్యాశే అవుతుంది. 
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అభ్యర్థుల చర్చలను గతంలో ఎన్నడూ లేని విధంగా భారత టివి ఛానెళ్లు లైవ్‌ కవరేజీలతో హల్‌చల్‌ చేస్తున్నాయి. హిల్లరీ, ట్రంప్‌ చర్చలపైనా, చర్చల ఫలితాలపైనా ప్రత్యేక కార్యక్రమాలు నడిపాయి. అమెరికాలో స్ధిరపడుతున్న భారతీయుల సంఖ్య పెరగడం, ఎన్నికల్లో పోటీ చేస్తున్న భారతీయ అభ్యర్థులు కూడా పెరగడం ఇందుకు కారణాలుగా చెబుతున్నప్పటికీ, ఈ పరిస్ధితి గతంలో కూడా ఉన్నదే. అప్పుడు లేని ఆసక్తిని ఛానెళ్లు ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నట్లు అంటే భారత పాలకులు రానురాను మరింతగా అమెరికాను కౌగలించుకోవడం, అమెరికా ప్రపంచాధిపత్య వ్యూహంలో దానికి జూనియర్‌ భాగస్వామిగా మారడానికి ఇచ్చగించడం ఒక కారణం కావచ్చు. 

No comments:

Post a Comment