# నేడు ఎస్ ఆర్ శంకరన్ వర్ధంతి #
ఐఏఎస్ అధికారి అంటేనే అధికారానికీ, ఆర్భాటానికీ, అజమాయిషీకీ పర్యాయపదంలా అనిపిస్తుంటారు. ఆ పదవిని, దాని హోదాను సమాజ హితం కోసం కాక, తమ గౌరవ ప్రతిష్టల కోసమే ప్రధానంగా వాడుకునే పరిస్థితి మనది. ఒకరకంగా చెప్పాలంటే ఐఏఎస్‌ను పరి పాలనా విభాగంపై ఆధిపత్యానికి ఒక వాహకంగా భావి స్తుంటారు. అంతే తప్ప ఆ పదవి ప్రాధాన్యతను అర్థం చేసుకొని దానికి గౌరవం దక్కేలా వ్యవహరించేవారు అతి స్వల్పమనే చెప్పాలి.
ఐఏఎస్ పదవి అంటేనే ఓ గురుతర బాధ్యతగా, దాని ద్వారా సమకూరే అధికా రాన్ని ప్రజాసేవకు ఉన్నతావకాశంగా భావిస్తారు. అలాంటి వారు. ఆ పదవి ద్వారా సంక్రమించే అధికా రాన్నీ, అజమాయిషీని సమాజహితానికే వారు ఉపయో గిస్తారు. ఐఏఎస్ పదవికే గౌరవం తెచ్చిన అటువంటి ఉన్నతాధికారుల్లో ఎస్ఆర్ శంకరన్ తరతరాలూ గుర్తుం చుకోదగిన అరుదైన మనీషి. ఆయన అసాధారణ జీవితమే అందుకు నిదర్శనం.
|| కార్మిక పక్షపాతి ||
తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు సంపాదించుకున్న శంకరన్ పూర్తిపేరు సరికత్తుల్ రామనాథన్ శంకరన్. 1934, అక్టోబర్ 22న తమిళనాడులోని తంజావూరులో ఆయన జన్మించారు. మదురైలోని అమెరికన్ కళాశా లలో కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు. ఇండియన్ అడ్మిని స్ట్రేటివ్ సర్వీస్(ఐఏఎస్)లో చేరక ముందు ఆయన కొంత కాలం లెక్చరర్‌గా పనిచేశారు.
1956లో ఐఏఎస్‌లో చేరిన శంకరన్ శిక్షణ అనంతరం 1959లో కర్నూలు జిల్లా నంద్యాల సబ్ కలెక్టర్‌గా, ఆ తర్వాత నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమితుల య్యారు. తదుపరి ఆయన కేంద్ర ప్రభుత్వ సర్వీసులోకి వెళ్లారు. 1971-73 మధ్య నాటి కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి కుమార మంగళంకు స్పెషల్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే దేశంలోని బొగ్గు గనులను జాతీయం చేశారు. అందులో శంకరన్ పాత్ర కీలక మైనది. అప్పటి వరకు బొగ్గు గనులు ప్రైవేట్ కాంట్రాక్టర్ల చేతుల్లోనే ఉండేవి. ఆ సమయంలో బొగ్గుగని కార్మికులు తీవ్ర దోపిడీకి గురౌతూ రక్షణలు లేక బానిసలకన్నా హీనంగా ఉండేవారు. ఇటువంటి పరిస్థితుల నుంచి దేశంలోని బొగ్గుగని కార్మికులందరికీ రాజ్యాంగపరమైన హక్కులు కల్పించిన గొప్ప కార్మిక పక్షపాతి శంకరన్.
ఆ తర్వాత శంకరన్ ఏపీకి తిరిగి వచ్చి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిం చారు. ఆ బాధ్యతల నిర్వహణలో శంకరన్ చూపిన చొరవ రాష్ట్రంలోని దళితులకు మేలు చేసింది. 1976లో హైదరాబా ద్లో జరిగిన హరిజన కాన్ఫరెన్స్... హరిజన అన్న పదం అవమానకరమైనదని, దాన్ని వాడకూడదని తీర్మానిం చింది. ఆ తర్వాత అదే ప్రభుత్వ ఉత్తర్వుగా రూపుదిద్దు కుంది. అప్పటి నుంచి ప్రభుత్వ రికార్డుల్లో హరిజన అన్న పదం స్థానంలో షెడ్యూల్డ్ కులాలు అన్న పదం చేరింది.
|| ఎస్సీ, ఎస్టీల కోసమే అనుక్షణం... ||
ఈ సదస్సు దాదాపు 322 సిఫారసులను, 224 తీర్మానాలను సదస్సు ఆమోదించింది. వాటి వెలుగులో ఒక్క ఏడాదిలో 120 ప్రభుత్వ ఉత్తర్వులు (జీఓలు) వెలు వడ్డాయి. వాటిలో 100కి పైగా ఒక్క శంకరన్ సంతకంతో ఉన్నవే. అంటే ప్రజల డిమాండ్లు, నిపుణుల ఆలోచనలూ వెనువెంటనే ప్రభుత్వ విధానాలుగా మారి, అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి! దీన్ని సాధ్యం చేయడం ఒక్క శంకరన్కే చెల్లింది. నాటి సీనియర్ ఐఏఎస్ అధికారులు, పీఎస్ కృష్ణన్, మునివెంకటప్ప, నాటి యంగ్ డైనమిక్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు ఈ కృషిలో ఆయ నకు అండగా నిలిచారు. హరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ పేరును సాంఘిక సంక్షేమ శాఖగా మార్చారు. దాన్ని నేటి తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖగా మార్చి మరింత శక్తివంతం చేసింది.
గ్రామం వెలుపల కాక, మధ్యలోనే స్థలాలను సేకరించి దళితులకు ఇళ్లు కట్టించాలి, దళితవాడల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి, రేషన్ షాపు లను దళితులకే కేటాయించాలనే నిర్దేశకాలు శంకరన్ జారీ చేసిన జీఓలలోనివే, దళితుల పిల్లలకు పౌష్టికా హారం, పాలు అందించడం, ప్రభుత్వ భూమికి మహిళల పేరుతో పట్టాలు ఇవ్వడం, గ్రామ పంచాయతీలో దళిత మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం, దళితుల్లో ఒంట రిగా ఉన్న మహిళలకు ఇండ్ల స్థలాలు కేటాయించడం, కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, వ్యాపార, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో శిక్షణ, ఇనాం భూములకు పట్టాలు ఇవ్వడం, ప్రభుత్వ హౌసింగ్ కాల నీల్లోని ఇండ్ల కేటాయింపుల్లో దళితులకు ప్రాధాన్యం, స్థానిక సంస్థల బడ్జెట్లో 15 శాతం నిధులను దళితుల అభివృద్ధికి ప్రత్యేకించి కేటాయించడం, కుల నిర్మూలన అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చడం, పబ్లిక్ స్కూల్స్‌లో రిజర్వేషన్లు దళితవాడల్లో పాఠశాలల ఏర్పాటు లాంటివి ఆ వంద జీఓల్లో కొన్ని మాత్రమే. మరోవైపున ఆయన షెడ్యూల్డ్ తెగలైన ఆదివాసీల అభివృద్ధిపై కూడా దృష్టి సారించారు. ఆదివాసుల కోసం ప్రత్యేక సమీకృత ఆదివాసీ అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లను ఏర్పాటు చేయడంలో శంకరన్ కృషి మరువలేనిది.
దళితులు, ఆదివాసీ పిల్లల విద్యాసౌకర్యాల మెరు గుదల కోసం ఆయన ప్రత్యేక హాస్టల్స్‌ను ప్రారంభిం చారు. రెసిడెన్షియల్ పాఠశాలల ప్రారంభానికి పునా దులు వేశారు. గ్రామాల్లో పాలేర్లుగా, జీతగాళ్లుగా దళితు లపై అమలవుతున్న వెట్టి చాకిరీ వ్యవస్థకు చరమగీతం పాడేందుకు 1976లో వెట్టిచాకిరీ నిషేధ చట్టం తీసుకొ చ్చారు. ఎంతో మంది పాలేర్లను, జీతగాళ్లను భూస్వా ముల నుంచి విముక్తి చేసి పునరావాసం కల్పించారు. ఇదే విషయమై 1978లో అధికారంలోనికి వచ్చిన సీఎం మర్రి చెన్నారెడ్డితో విభేదాల వల్ల శంకరన్ త్రిపుర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వెళ్లి, అక్కడి ప్రజలపై పారా మిలిటరీ బలగాల అరాచకాలను సాధ్యమైనంత వరకు నియంత్రించారు.
1983లో తెలుగుదేశం అధికా రంలోకి వచ్చిన తర్వాత శంకరన్ మన రాష్ట్రానికి తిరిగి వచ్చి, మళ్లీ సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రట రీగా బాధ్యతల్లో చేరారు. ఈసారి ఆయన రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుపై ఎక్కువ దృష్టి పెట్టారు. స్కాలర్ షిప్పుల పెంపుదల, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల అమలును ప్రాధాన్యాంశాలుగా తీసుకున్నారు. 1985లో కారంచేడులో జరిగిన దారుణానికి చలించిపోయిన శంకరన్ ప్రభుత్వ పెద్దలను ధిక్కరించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కారంచేడు దళితుల పునరావాసం కోసం ఆయన చాలా శ్రద్ధ వహించారు.
|| పదవీ విరమణ తర్వాతా ప్రజాసేవలోనే... ||
పదవీ విరమణ తర్వాత మూడు ముఖ్యమైన విషయాలలో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. ఒకటి, ప్రభుత్వం, నక్సలైట్ల మధ్య సాగుతున్న పోరులో జరుగుతున్న హింస, హత్య, ప్రతిహత్యలపై కొంత మంది మేధావులను కూడగట్టి పౌరస్పందన వేదికను (కన్సర్న్డ్ సిటిజన్స్ కమిటీ) ఏర్పరిచారు. 1997లో ఏర్పాటైన ఈ కమిటీ చేసిన తీవ్ర కృషి వల్లనే 2004లో అధికారంలోకి వచ్చిన వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నక్సలైట్లను చర్చలకు ఆహ్వానించింది. ఆ సందర్భంగా అనేక విషయాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా చర్చలకు వచ్చాయి. ఇది దేశ చరిత్రలోనే అరుదైన సంఘటన. ఆ చర్చల ఫలితాలపై భిన్నాభిప్రాయాలున్నా ఒక పౌరుడిగా శంకరన్ నిర్వర్తించిన పాత్ర మరువలేనిది. ఆ తర్వాత పాకీపనివారి విముక్తిపైనే ఆయన దృష్టినంతా కేంద్రీకరించారు. అందుకోసం దళిత మానవ హక్కుల కార్యకర్త బెజవాడ విల్సన్‌తో కలిసి సఫాయి కర్మచారి ఆందోళన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయడం కోసం శంకరన్ చేసిన ప్రయత్నం అద్వితీయమైనది. ఆయన ఆ సమస్యపై దేశవ్యాప్త చర్చకు ప్రాతి పదికను ఏర్పరచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు దిగి వచ్చే విధంగా సుప్రీం కోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆ ఉద్యమం వల్ల లక్షలాది మంది చేతితో మలం ఎత్తే అమానవీయ వృత్తి నుంచి బయట పడ్డారు. శంకరన్ ప్రారంభించిన సఫాయి కర్మచారీ ఆందోళన్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావడం మాత్రమే కాదు, దాని కన్వీనర్ బెజవాడ విల్సన్‌కు రామన్ మెగసెసే అవార్డు సైతం లభించింది.
|| అధికారులందరికీ ఆయనే ఆదర్శం ||
సంక్షేమానికి, సంస్కరణకు, వినూత్న అభివృద్ధి పథకాలకు మారుపేరై నిలిచిన శంకరన్... ఆస్తిపా స్తులను, కుటుంబాన్నీ, వైవాహిక జీవితాన్నే కాదు మొత్తంగా వ్యక్తిగత జీవితాన్నే త్యజించి దళితులు, అణగారిన వర్గాల మేలుకోసమే తన సర్వస్వాన్నీ అర్పిం చిన మహాత్యాగి. 2008 అక్టోబర్ 7 ఆ విశిష్ట వ్యక్తి అశేష దళిత, ఆదివాసి ప్రజానీకానికి వీడ్కోలు పలుకుతూ తుదిశ్వాస విడిచారు. అత్యున్నత అధికార పదవులను అలంకరించిన ఆయన ఆస్తులు మిత్రులు కొనిచ్చిన ఓ చిన్న ఫ్లాటు, పుస్తకాలు మాత్రమే.
తనకంటూ ఏమీ కోరుకోని అత్యంత నిస్వార్ధపరుడు, నిరాడంబరుడు ఎస్ఆర్ శంక రన్. భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి సత్కరిస్తా మంటే సున్నితంగా తిరస్కరించిన వ్యక్తిత్వం ఆయన సొంతం. శంకరన్ గుణాలలో కొన్నింటినైనా ఈతరం అధికారులు పుణికి పుచ్చుకుంటే సమాజంలోని వివక్ష, అణచివేత, అసమానతలు కొంతైనా సమసిపోతాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార యంత్రాంగం శంకరన్ నడిచిన మార్గాన్ని ఒక్క నిముషమైనా మననం చేసుకుని, ఆయన నడిచిన దారిలో ఒక్క అడుగైనా వేయగలిగితే అదే ఆయనకి మనం అర్పించగల నిజమైన నివాళి. - మల్లెపల్లి లక్ష్మయ్య (సాక్షి)

No comments:
Post a Comment